Jagadguru divyacharithra   Chapters   Last Page

 

4. భ్రాంతికి కారణం

కొందరు పాశ్చత్య చరిత్రకారులు వారి ననుసరించిన తదితరులు శ్రీ ఆదిశంకరుల జననం తిథిని నిర్దేశించటంలో అనేక భిన్నమతాలను అనుసరించారు. క్రీస్తు శకానికి పూర్వం అని కొందరు, తరువాత అని కొందరు, ఎ.డి. 7 లేక 8వ శతాబ్దం అని అనేక విధముల తికమకలుపడిరి. వీరెవ్వరును ఆదిశంకరుల పీఠ పరంపరలోని మఠచరిత్రలను పరిశీలించి చేసిన నిర్ణయం కాదిది. అనేక విధములగు ఊహలను సృష్టించుటకు మాత్రము వీరి విమర్శలు ఉపయోగపడినవి.

కంచికామకోటి పీఠాధిపతులైన శ్రీఅభినవ శంకరులను (క్రీ.శ. 788-840) ఆదిశంకరులుగా చాలామంది చారిత్రకులు భ్రమపడినారు. అందుకు కారణ మేమన - వీరుకూడ ఆదిశంకరులవలెనే భారతదేశం అంతటా పర్యటించి, అద్వైత బ్రహ్మవిద్యా ప్రచారం చేశారు. దేశంలో అధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని కల్పించారు. అంతేకాక వీరు ఆదిశంకరుల వంటి ప్రజ్ఞా ప్రాభవసంపన్నులు. కాశ్మీర ప్రభువు ఆస్థానంలో ఉన్న వాక్పతిభట్టు అనేక కవిని శాస్త్రచర్చల్లో ఓడించారు. అచటి సర్వజ్ఞపీఠాధిరోహణం చేశారు. అపుడు వాక్పతిభట్టు తన శంకరేంద్ర విలాస గ్రంథంలో వీరి మహిమల్ని వర్ణించాడు. వీరి దిగ్విజయయాత్ర లోకాన్ని చకితం చేసింది. వీరు హిమాలయ పర్వతపంక్తిలోని ఆత్రేయ పర్వతమందలి దత్తాత్రేయ గుహలో ప్రవేశించి బ్రహ్మీభావం పొందారు. పై అంశాలన్నీ వీరే ఆదిశంకరులని చారిత్రకులు భ్రమపడటానికి కారణాలైనవి.

అంతేకాకుండా క్రీ.పూ 477 లో కంచిలో విదేహ ముక్తిని పొందిన శ్రీ ఆదిశంకరులను గూర్చి కూడ పొరపడి వారు హిమాలయాల్లో గుహ ప్రవేశం చేశారనటానికి కూడ ఇదొక కారణం. ఈ హిమాలయ ప్రాంతంనుండి శ్రీ ఆదిశంకరులు కైలాసగమనం చేసిన మాట సత్యమే. వారు ఐదు స్ఫటిక లింగములను తీసికొని రావటానికి మాత్రమే ఈ మార్గంగా వెళ్ళారు. విదేహముక్తి మాత్రం కంచిలో కామాక్షిదేవ్యాలయ రెండవ ప్రాకారంలోనే అనేది సిద్ధాంతం.

కంచికామకోటి పీఠాధిష్ఠితులైన జగద్గురువులలో వరుసగా కృపాశంకరులు (క్రీ.శ. 28-69) ఉజ్జ్వలశంకర (క్రీ.శ 329-367) మూకశంకర (398-437) అభినవశంకర (క్రీ.శ.788-840) నామములు గలవారలగుటచేత, వీరి పేర్లలోని 'శంకర' నామసామ్యముచే ఆదిశంకరుల కాలనిర్ణయము కఠినమై పెడత్రోవ పట్టినది. పై అంశములు స్పష్టముగా తెలిసినపుడు ఈ చిక్కు విడిపోయి సత్యమును సులభముగా గ్రహింపగలము.

ఇదే కాకుండా'శంకరాచార్య' అనే పేరు, ఆదిశంకరులకే కాక వారిపీఠపరంపరలోని గురువులనందరను పేర్కొనటానికి ఉపయోగపడుతోంది. ఈనాటివరకు ఈ విషయం మనం కళ్లారా చూస్తున్నాము.

''శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచాక్యరూపా''

Jagadguru divyacharithra   Chapters   Last Page