Jagadguru divyacharithra   Chapters   Last Page

 

విజయ భూమిక

విజయదశమీ మధ్యాహ్నా నంతరము ధర్మపీఠాధిష్టాత్రి యగు వరదేవతయొక్క పట్టాభిషేకోత్సవమును కన్నులార దర్శించితిని. ప్రబోధైకాదశీ ప్రదోషసమయా నంతరమున తత్పరదేవత మందహాసరోచిరుదంచిత సుందరవదనముతో సాక్షాత్కరించినది. ఇదియే నా యీ గ్రంథరచనకు ప్రధాన భూమిక.

ఆంధ్రప్రాంతమున కృష్ణామండలము (పోరంకి - ముస్తాబాద - నూజివీడు) మాకు పూర్వమునుండి నివాసస్థానము. శ్రీ నుదురుమాటి విశ్వనాథశాస్త్రి. శ్రీమతి శాంతమ్మ అను పుణ్యదంపతులకు సంతానముగ జన్మించుటయే నా పూర్వ పుణ్యఫలము. వారి తపఃఫలమే నా సంస్కారమునకు ప్రధాన కారణము. ఆరేడేండ్ల వయస్సునందే పితృవియోగమును బొందిన నన్ను ఆదరించిన మేనమామ డా||మేడూరి ఆంజనేయశాస్త్రికి (వసంతవాడ) ఎల్లప్పుడు కృతజ్ఞతను వెల్లడించుకొనుచుందును.

వెలనాటి వైదిక యజశ్శాఖయందు శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఇలవేల్పుగా కొల్చుకొనెడి కుటుంబము మాది. మేడూ కౌండిన్యునకు సగోత్రులము.

నా యజుర్వేదాధ్యయనమునందధ్యాపకులైన బ్రహ్మశ్రీ వేమూరి వెంకటరమణావ ధానులుగారికిని, నా నామకరణ సమయము - ఆదిగ నేటివరకును నాలోని వైదిక తేజోభివృద్ధికి నన్నాశీర్వదించుచున్న చతుర్వేద స్వరూపులు బ్రహ్మశ్రీ కప్పలవాయి యజ్ఞేశ్వరశర్మగారికిని, వారి సోదరులును ధర్మస్వరూపులునైన బ్రహ్మశ్రీ రామశాస్త్రిగారికిని నిత్యము వందనశతము నర్పించుచుండును. కర్మబ్రహ్మోపాసనానిరతులైన 'వైద్యవల్లభ' 'సర్వతంత్రస్వతంత్ర' బ్రహ్మశ్రీ రాణీవేంకటా చలపతిప్రసాద విద్వచ్చయనులవారి శిష్యుడనై యధాశక్తిగ వారిచరణ సన్నిధిని గ్రంథముల నధ్యయనము చేసితిని. వారి శ్రీ చరణముల నెల్లపుడు భావించుచుందును. (ప్రకృతం వారి ఆశ్రమనామం : శ్రీశ్రీశ్రీ పరిపూర్ణ ప్రకాశానంద భారతీ మహాస్వామివారు)

అద్వైత సంప్రదాయమునందలి వాడనగుటచే ఆదిశంకరు లధిష్టించిన కంచీపీఠము, దాని పరంపరనుగూర్చి కుతూహలముతో ఐదారు మాసముల నుండి బహుగ్రంథ పరిశీలనము చేసి ఈ గ్రంథమును రచించితిని.

ముఖ్యముగా నా కావ్యపాఠారంభము నొనర్చిన బ్రహ్మశ్రీ ఫణిభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి (నూజివీడు - సాహితీపరులు - వైణికులు) ఉపకృతిని విస్మరించలేను. అందును కుమార సంభవమున పంచమ సర్గతో ఆరంభము. అందలి 'తం వీక్ష్య' శ్లోకమే నన్నీ రచనకు పురికొల్పినది. హరనేత్రాగ్నిదగ్ధుడైన కామునికిని సంజీవనౌషధియైన కామకోటి నానాడే దర్శించితిని.

నా విజ్ఞానాభివృద్ధికై ఆశీస్సులనందించు చుండెడి బ్రహ్మశ్రీ 'సాంగస్వాధ్యాయ భాస్కర' మీమాంసావిద్యా ప్రవీణ, వేదార్థ విద్వత్ర్పవర-సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తిగారికిని, ఆర్ష్య విద్యాభూషణ శ్రీ జటావల్లభుల పురుషోత్తముగారికిని కృతజ్ఞతను వెల్లడించుకొను చుందును. నేను ఆంధ్రప్రదేశ విద్యా పరిషత్కార్య దర్శిగ నున్నపుడు తదధ్యక్షులైన కళాప్రపూర్ణ, కవిసమ్రాట్‌ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు మాపండీతగోష్టిలో ఒకనాడు 'మా ఎద్దుకు ఇంత తర్కంరాదు' అను కథను జెప్పిరి ఆదిశంకరులుద్బోధించిన శ్రుతిమత వ్యతిరిక్తమైన తర్కమునకు దాని నన్వయించుకొని, నాసహోపాధ్యాయులైన 'గాయకరత్న శ్రీ చిలకలపూడి వేంకటేశ్వరశర్మగారు తరచు చెప్పుచుండిన 'విద్వాన్‌-అడ్వాన్‌'అను కథలోని పరమార్థమును గ్రహించి ఎద్దుమొద్దు బండపాండిత్యతమునం దాస్థను వదలుకొంటిని.

'సర్వస్వామ'స్వాయత్తీ కృతమేకాక స్వోపజ్ఞకమైన నాస్వతంత్ర రచన యగు నీ గ్రంథ రాజమును గూర్చి యెవ్వరైన నెప్పుడైన ఏ యభిప్రాయములై నను నాకందజేయుటకై నా పోస్టు అడ్రసు కూడ ఇచటనే వ్రాయుచున్నాను.



సుషమానిలయం,

29-23-6 ఇట్లు

తాడేపల్లివారి వీధి, అంతర్వాణి విధేయుడు

సూర్యారావు పేట

విజయవాడ.2. నుదురుపాటి వేంకటరమణశర్మ.

Jagadguru divyacharithra   Chapters   Last Page