Jagadguru divyacharithra   Chapters   Last Page

 

6. ఆదిశంకరులు - అద్వైతదర్శనం

సదాశివ నారాయణ సమారంభ##మైన ఈ అద్వైత సిద్ధాంతాన్ని వేదవేదాంగలతోను సర్వశాస్త్రాలతోను సమన్వయించి శ్రీ ఆదిశంకరులు చక్కగా విపులీకరించారు. సర్వ పండిత శిరోధార్యంగా సిద్ధాంతీకరించారు. అది నేటికి హిమగిరి శిఖరోన్నతంగా ఉండి మధ్యందిన మార్తాండ సదృశంగా ప్రపంచంలో దేదీప్యమానమై విరాజిల్లుతోంది. ఆధునిక భౌతిక విజ్ఞాన పురోగమనం శరవేగంతో సాగుతూ ఆ సిద్ధాంతాన్నే తుదకు చేరుకొనే ఛాయలు గోచరిస్తున్నది. సుదూరాన్నుండే దానికవి మోకరిల్లుతున్నవి.

ఈ అద్వైత సిద్థాంతంపై 'ఆర్ష విద్యాభూషణ' బ్రహ్హశ్రీ జటావల్లభుల పురుషోత్తం, ఎం.ఏ., గారి రచన నుండి కొన్ని ముఖ్యాంశాలిచట పేర్కొనటం ఉచితంగా ఉంటుందని అందలి కొన్ని భాగాలు మాత్రం ఇక్కడ పేర్కొనబడుచున్నవి.

''శంకరుల అద్వైత సిద్ధాంతమనగా వారు వేదముల నుండి యుద్ధరించి మనకు ప్రసాదించిన మోక్షమార్గము. వారు నిర్మించిన దర్శనము కాదు. అందు వీరు ప్రయోగించిన యుక్తులు వాదసరణిలోకాతీతములై ప్రపంచములోని మేధావులకెల్ల దిగ్భ్రాంతిని గల్గించుచున్నవి.

కర్తవ్యమును మంత్ర బ్రాహ్మణములు, జ్ఞేయమును ఉపనిషత్తులు తెలుపుచున్నవి. జ్ఞేయవస్తువు కార్యము కాజాలదు. సిద్ధవస్తువునకే వేద్యత. బ్రహ్మజ్ఞానమును మోక్ష సాధనముగా తెలుపు ఉపనిషత్తుకర్మను వీడవలసినదిగా బోధించుట ఈ విధముగా పొసగుచున్నది.

జ్ఞాతకూడ బ్రహ్మమేయైయుండుటచే జ్ఞేయము జ్ఞాత కంటే భిన్నముకాదు. జ్ఞాతయైన జీవాత్మ తాను జ్ఞేయమైన పరమాత్మకంటే భిన్నుడనుకాదని తెలిసికొనుటయే ఈజ్ఞానము యొక్క స్వరూపము. దుఃఖము పోవలయునన్నచో జ్ఞానమే సాధనము. అవిద్యానాశ##మే ఆత్మానుభూతి సాధనమగుచున్నది. శంకరులు ప్రత్యక్షముగా కన్పట్టుచున్న జగత్తును లేదన్నారనునది సరియైన విమర్శనకాదు. జగత్తును గూర్చి మన మనుకొనునది జగత్తు కాదనియు అది వాస్తవముగ బ్రహ్మమే యనియు శంకరులు చెప్పుచున్నారు. జగత్తు వాస్తవముగ లేకపోయినను ఉన్నట్లు కన్నట్టుటచే అది మిథ్యయని వారి వాదము ఈ జగన్మిథ్యావాదము రఙ్జుసర్ప దృష్టాంతముచే నిరూపింపబడినది. ఇది జగదుత్పత్తిని గూర్చి శంకరుల వివర్త వాదము.

జగత్తునకు అధిష్ఠానము బ్రహ్మమని దీని యర్థము. జగద్ర్భాంతి కలుగుటకైనను ఆధారమొకటి యుండక తప్పదు. నిరధిష్ఠానమైన భ్రమ యుండదు. బ్రహ్మ మధిష్ఠాన మనగా, జగద్ర్భాంతి కల్గుచుండుటచే సమస్తమందును జగద్భావననువీడి బ్రహ్మభావము నలవరచుకొనుటయే మన మవలంబించవలసిన విధానము. వస్తువు మారనక్కరలేదు. అందలి దృష్టిమాత్రమే మారవలయును. వస్తువు ఈశ్వర సృష్టము . దృష్టి మానవకృతము బంధహేతువైనది మానవ కృత దృష్టియేగాని ఈశ్వర సృష్ట వస్తువుకాదు. బంధ మోక్షములకు మనస్సే కారణముగా చెప్పబడినది. వస్తువుకాదు.

ఒకే బ్రహ్మవస్తువు నానాత్వవిలసితమై కన్పట్టుచున్నదను భావము సంతతముగ నుండువానికి బ్రహ్మమే గోచరించునుగాని జగత్తు గోచరించదు. కటక కేయూరహారాదుల యందు వాటియందలి ప్రధానమైన సువర్ణదృష్టి కలిగి యుండుట యథార్థదృష్టికదా ! కనుక జగత్తంతలోను బ్రహ్మమునే దర్శించుట సత్యదృష్టి యగుచున్న దేగాని ఉన్న వస్తువును కాదనుట కాజాలదు.

ఈ దృష్టిలో జగత్తు మిథ్యయనియు బ్రహ్మ సత్యమనియు చెప్పబడినది. వాస్తవికస్థితిలేని జగత్తును వాస్తవముగా కన్పింపచేయు శక్తికే మాయయని పేరు. అదియే అవిద్య. అజ్ఞానము. అది జ్ఞానమువలననే నివర్తింపబడును. ఈ జ్ఞానమును మరుగుపరచునవి ఆవరణ విక్షేపములు. ఆవరణము సత్కర్మానుష్ఠానముచే ఛేదింపబడును. విక్షేపము ఉపాసనముచే అరికట్టబడును. కావున శంకరుల మోక్షసాధన సామగ్రిలో కర్మోపాసనములు ముఖ్యములుగా నున్నవి.

జగన్మిథ్యావాదులైన శంకరుల మతములో సద సత్కర్మ విభాగమే లేదనియు స్వర్గ నరక భేదమే లేదనియు తలంపరాదు. అట్లే 'అహం బ్రహ్మాస్మి' యని బోధించిన యాచార్యుల మతములో ' నా కుపాస్యుడై సర్వేశ్వరు డున్నాడు' అనుట కుదరదనియు తలంపరాదు. ఆచార్యుల మతములో జీవన్ముక్తులైనవారికి మాత్రమే కర్మోపాసనా విషయములలో అట్టి అతీతావస్థ. మిగిలినవారి కందరకును ధర్మాధర్మ విభాగము. స్వర్గ నరక భేదము, ఈశ్వరోపాస నాదికము కలవని గుర్తింపవలయును. అట్లే సత్కర్మలకు సత్ఫలమును, దుష్కర్మలకు దుష్ఫలములును అనుభవింప వలసియే యుండునని శంకరుల మతము. అట్లే దేవతోపాసన వలన ఇష్టార్ధసిద్ధి కల్గుననియు ఆచార్యుల మతము. అయినను అంతఃకరణ మాలిన్యము తొలగవలయునను సంకల్పముతో సత్కర్మానుష్ఠానమును, మోక్షాపేక్షతో ఈశ్వరోపాసనను గావింప వలయునని ఆచార్యుల ఆదేశము. 'వేదోనిత్యమధీయతాం, తదుదితం కర్మస్వనుష్ఠీయతాం' - 'మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ' అనునవి శాంకర మతములో ప్రధానములై యున్నందున, శాంకర దర్శనము కర్మానుష్టానమునకుగాని భక్తికిగాని ప్రతీపముగాదని గ్రహింపవలయును.

(16-5-1964 నాటి 'ఆంధ్రప్రభ'లోని

'శాంకర దర్శనము-దానివిశిష్టత' నుండి)

ఆదిశంకరులు - కొన్ని ముఖ్య సంఘటనలు

ఆశ్రమస్వీకారానికై మాత్రాజ్ఞాస్వీకారం

(ప్లవ, కార్తీక, శుక్ల, ఏకాదశీ) బి. సి. 500

నర్మదాతీరంలో గోవిందభగవత్పాదులవద్ద

దీక్షాస్వీకారం '' 499

మాతృవియోగం బి. సి. 493

ప్రయాగవద్ద రుద్ధపూరులో

కుమారిలభట్టుతో సమాగమం కీలక సం|| '' 493

నేపాల్‌ విజయయాత్ర '' 488-87

కంచిలో కామకోటి పీఠస్థాపన (దీనికి

ఆదిశంకరులే ప్రథమాచార్యులు)

సిద్ధార్థి వైశాఖ శుక్ల పూర్ణిమ '' 482

క్రోనాలజీ ఆఫ్‌ నేపాల్‌ హిస్టరీ (కో. వేం. గారు)

111 - 116 పుటల నుండి

Jagadguru divyacharithra   Chapters   Last Page