Sri Bhagavadgeetha Madanam-2
Chapters
13 దక్షయజ్ఞము - అభేదభక్తి భాగవతమున దక్షయజ్ఞ కథలో అభేదభక్తి చక్కగా నిరూపించబడినది. సర్వదేవతలు భగవన్మాయా విభూతులేనని భావించి అభేదభక్తిని పాటించవలయును. (శివకేశవ భేదము పాటించిన దక్షుడెట్లు శిక్షింపబడెనో చూడుడు) శివుడు దక్షప్రజాపతి కూతురగు సతీదేవిని పెండ్లాడి దక్షునకల్లుడయ్యెను. పూర్వము ప్రజాపతులు చేయు సత్రయాగమును జూచుటకై యోగులు మునీంద్రులు దేవతలు చతుర్ముఖ బ్రహ్మ మొదలగు వారు వచ్చిరి. ఆయాగశాల లోనికి దక్షప్రజాపతి ప్రవేశింపగా బ్రహ్మయు శివుడు తప్ప తక్కిన వారందరు ఆదరమునలేచి నిలిచి యుండిరి. దక్షుడు బ్రహ్మకు నమస్కరించి సభ్యులు చేసిన పూజల గైకొని తన అల్లుడైన శివుడు ఇతరులవలె సభలో లేచి నిలుచుకొని తాను ప్రవేశించునపుడు గౌరవించలేదని శివుని తూలనాడెను. సీ|| అనయంబు లుప్త క్రియా కలాపుడు, మాన హీనుడు, మర్యాద లేనివాడు మత్త ప్రాచారు, డున్మత్త ప్రియుడు, దిగం బరుడు, భూతప్రేత పరివృతుండు దామస ప్రమథ భూతములకు నాథుండు భూత లిప్తుం, డస్థి భూషణుండు నష్ట శౌచుండు, నున్మదనాథుడును, దుష్ట హృదయు, డుగ్రుడును, బరేతభూ ని తే|| కేతనుడు, వితతస్రస్తకేశు, డశుచి యయిన యితనికి శివనాము డను ప్రవాద మెటుల గలిగె, నశివుడగు నితని నెఱిగి యెఱిగి వేదంబు శూద్రున కిచ్చి నటుల -భాగవతము 4-43 ఇట్లు తూలనాడినను ఆ వాక్యంబులు శివుని యెడల స్తుతిగా నొప్పెను. పిమ్మట దక్షుడు రోషించి ''శివుడు యాగములలో దేవతలతో హవిర్భాగము బొందక యుండు'' నని శపించెను. నందీశ్వరుడదివిని దక్షుడాడిన అనర్హ వాక్యములకు, శాపమునకు కోపించి ''భగవంతుని యందు దక్షుడు భేదదర్శియై అపరాధము గావించుటచేత తత్త్వ విముఖుడై కర్మల నాచరించి స్త్రీ కాముడై మేష ముఖము కలవాడగు'' నని శపించెను. ఇదిగాక అక్కడజేరిన ద్విజులందరు హరద్వేషు లగుటచేత ''అర్ధవాద బహుళములైన వేద వాక్యములచే విమోహిత మనస్కులై కర్మాసక్తు లగుదురనియు, యాచకు లగుదు'' రనియు శపించెను. అంత భృగుమహాముని కోపించి శైవులందరు పాషండు లగుదురని శపించెను. కాని భగవ దనుగ్రహంబున అన్యోన్య శాపంబులు వర్తింప లేదు. శివునిపై విరోధము బూనిన దక్షుడు కొన్ని దినముల తరువాత అరుద్రకంబుగా వాజపేయ సవనం బొనర్చెను. అటుపై బృహస్పతి నామక సవనము చేయ బూనెను. దేవతలును మునులును ఆ యజ్ఞమును దర్శింప వచ్చిరి. సతీదేవియు తన తండ్రియగు దక్షుడు సేయు యజ్ఞము జూడగోరెను. ఆమె స్త్రీ స్వభావంబున కృపణురాలై జన్మ భూమిని గనుగొన దలచెను. ''పిలువని పేరంటమునకు పోరా'' దని శివుడు తెలిపెను. ''జనక గురు సుహృజ్జననాయక గేహములకు పిలువకున్నను సజ్జనులు జనుచుందురు, కావున నన్ను మన్నింపు ''మని సతీదేవి వేడుకొనెను. దానికి శివుడు వ్యతిరేకించి ''కుటిలులగు దుర్జనుల గృహములకు బంధువులు పోరా ''దనియు ''వారవమానించిన బరితాపముచే కృశింతు'' రనియు దెలిపెను. ఇంకను ఇట్లనెను. ''నేను దక్షునకు బ్రత్యుత్థానాభి వందనంబులు గావింప కుండుటంజేసి యతండు తిరస్కృతుండయ్యె నంటివేని లోకంబున జనులనో న్యంబును బ్రత్యుత్థానాభి వందనంబులు గావింతు రదియ ప్రాజ్ఞులైన వారు సర్వ భూతాంతర్యామియైన పరమ పురుషుండు నిత్యపరిపూర్ణుండు గావున కాయిక వ్యాపారం బయుక్తంబని తదుద్దేశంబుగా మనంబునందు నమస్కారాదికములు గావింతురు, గాని దేహాభి మానంబులు గల పురుషులందు గావింపరు గాన ఏనును, వాసుదేవశబ్ద వాచ్యుండు శుద్ధ సత్త్వమయుండు, నంతః కరణంబునందు నావరణ విరహితుండునయి ప్రకాశించు వాసుదేవునకు నాహృదయంబున నెల్లప్పుడు నమస్కరించు చుండుదు. ఇట్ల నపరాధినైన నన్ను బూర్వంబున బ్రహ్మలుసేయు సత్రంబునందు దురుక్తులంజేసి పరాభవించి మద్వేషియైన దక్షుండు భవజ్జనకుండైన నతండును, దదను వర్తులైన వారలును చూడదగరు కావున మద్వచనాతి క్రమంబునన్ జేసి యరిగితివేని నచట నీకు పరాభవంబు సంప్రాప్తంబగు. లోకంబున బంధుజనంబుల వలన బూజవడయక తిరస్కారంబు పొందుట చచ్చుటయే కాదే'' యని పలికి మరియు సభవుండు ''పొమ్మని'' అనుజ్ఞ ఇచ్చెను. భాగవతము 4-76 ఈశ్వరుడు సతీదేవికి యజ్ఞశాలలో అవమానము కలిగి అశుభము కలుగుననియు ఇచ్చట బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు మనంబునన్ దలపోయుచు నూరకుండెను. సతీదేవి మూఢాత్మయై ఆత్మదేహము సగమిచ్చినట్టి శివుని విడిచి యజ్ఞమును చూడనేగెను. దక్షుడామెను పలుకరింప లేదు. అప్పుడామె తండ్రితో నిట్లనెను. ''లోకంబున శరీరధారులైన జీవులకు బ్రియాత్మకుండైన ఈశ్వరునకు బ్రియాప్రియులును, నధికులును లేరు. అట్టి సకల కారణుండును, నిర్మత్సరుండును, నైన రుద్రునందు నీవు దక్క నెవ్వండు ప్రతికూలం బాచరించు. ఈశ్వరుం ఘను నిందించిన నీ తనూభవ ననంగా నోర్వను.'' భాగవతము 4-86 అని సతీదేవి రోషభాస లాడెను. ఇంకను ''కర్మ తంత్రులగు సంసారులకు వైదిక కర్మలు, ఆత్మారాములకు కర్మలు లేకుండుటయు తగును. ఉభయకర్మ శూన్యుడు బ్రహ్మభూతుడైన శివుని నీవు గ్రియాశూన్యుడని నిందింపతగదు. నా వలన కలుగు అణిమా ద్యష్ట్యైశ్వర్యంబులు నీకు కలుగవు. చితాభస్మధారియైన రుద్రుడు దరిద్రుడు కాదని'' నతీదేవి వాదించెను. భాగవతము 4-93 అవమానింపబడిన సతీదేవి శివాంఘ్రిరాజీవచింతనముచే నాధుని డక్క నన్యంబు చూడక దేహమును యోగాగ్నిచే దహింప జేసెను. అది గాంచిన రుద్రగణములు దక్షుని శిక్షించుటకై లేచిరి. భృగు మహాముని అభిచార హోమముచేసి ఋభువులను దేవతలను ఉదయింప జేసి రుద్ర గణములను పారద్రోలెను. జరిగిన విషయములను నారదుడు శంకరునకు తెలిపెను. శివుడు రోషకషాయతాక్షుడై జటను బెరికివైచిన అందుండి రుద్రుని బోలిన రౌద్రముగల వీరభద్రు డుదయించెను. అంత రుద్రుడు వీరభద్రుని ఇట్లాజ్ఞాపించెను. ''నీవు నా భటులకు నాయకుడవై వెడలి దక్షయాగమును ధ్వంసముచేసి దక్షుని జంపుము. అక్కడ బ్రాహ్మణ తేజము జయించుటకు సాధ్యముకాదని భావింపకుము. నా అంశతో బుట్టిన నీకు అసాధ్యము లేదు'' అని ఆజ్ఞాపించెను. వీరభద్రుడు పరివారముతో వెడలెను. యజ్ఞశాల నంతయు స్మశానముగా మార్చెను. నందీశ్వరుడు భృగువు కన్నులు పెరికెను. పూషుని దంతములను చండీశ్వరుడు పగులగొట్టెను. వీరభద్రుడు దక్షుని తలను ద్రుంచి దక్షిణాగ్నిలో వ్రేల్చెను. ఇట్లు దక్షుని యాగము విధ్వంసనముజేసి వీరభద్రుడు కైలాసమున కరిగెను. ఇదంతయు ముందుగా నెఱిగిన నారాయణుడు బ్రహ్మయు యాగమునకు రాలేదు. బాధితులైన దేవతలు బ్రహ్మ పురస్సరముగా వచ్చి దక్షిణా మూర్తి రూపుడగు నీశ్వరుని స్తుతించిరి. ఈశ్వరుడు శాంతించి దక్షాదుల ననుగ్రహించెను. మేక తలతో దక్షుడు బ్రతికింపబడెను. దక్షుడు రుద్ర విద్వేష జనిత కల్మషంబులబాసి రుద్ర క్షమాపణము గోరెను. క్రతువును పూర్తిజేసెను. అంత నారాయణుడు ప్రత్యక్షమయ్యెను. దక్షుడు నారాయణుని పూజించి ఇట్లని వేడికొనెను. ''లోకంబులకు నీవ ఈశ్వరుండ వనియు నితరులైన బ్రహ్మరుద్రాదులు భవన్మాయా విభూతు లగుటంజేసి లోకంబులకు నీశ్వరులు గారనియు భేద దృష్టిగల నన్ను రక్షింపుము. ఈ విశ్వకారణులైన పాలలోచనుండును బ్రహ్మయు దిక్పాలురును సకల చరాచర జంతువులును నీవ. భవ ద్వ్యతిరిక్తంబు జగంబున లేదని'' విన్నవించెను. పై దక్షుని వాక్యముల వలన అభేదభక్తి ప్రతిపాదింప బడినది. భాగవతము 4-170 మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ! భగవద్గీత 7-7 దేవతలు ఋత్విక్కులు మొదలగువారు శ్రీహరిని స్తుతించిరి. శ్రీహరి సంతుష్టాంతరంగుడై దక్షునితో అభేదభక్తిని పాటింపుమని ఇట్లు పలికెను. ''అనఘా! ఏనును, బ్రహ్మయు, శివుండును నీ జగంబునకు కారణ భూతుల, మందు నీశ్వరుండను నుపద్రష్టను స్వయం ప్రకాశకుడను నై గుణమయంబైన యాత్మీయ మాయం బ్రవేశించి జనన నృద్ధి విలయంబులకు హేతు భూతంబులగు తత్తత్ర్కియోచితం బులైన బ్రహ్మ రుద్రాది నామధేయంబుల నొందుచుండుదు. అట్టి అద్వితీయ బ్రహ్మరూపకుండనైన నాయందు నజ భవాదులను, భూతగణంబులను, మూఢుండగువాడు వేరుగా జూచు. మనుజుండు శరీరంబునకు కరచరణాదులు వేరుగా దలంపని చందంబున మద్భక్తుండగువాడు నా యందు భూత జాలంబు భిన్నంబుగా దలంపుడు, గావున మా మువ్వుర యందు నెవ్వండు వేఱు సేయకుండువాడు కృతార్థుం''డని యానతిచ్చెను. ఈ వాక్యముల వలన అభేదభక్తియు ఏకేశ్వరో పాసనయు ప్రతిపాదింప బడినది. ఈ కథ వలన గ్రహింపదగిన విషయములు :- 1. వివాహితలైన స్త్రీలు తండ్రి ఇంటికైనను పిలువని పేరంటమునకు పోరాదు. 2. శివకేశవులయందు భేదబుద్ధి పాటింపరాదు. 3. శివశక్తి బ్రాహ్మణ శక్తిని మించినది. 4. వేద వాక్యమలు అర్ధవాద బహుళములు. వాని సరియగు అర్థమును గ్రహింపక విమోహిత మనస్కులై మానవులు కర్మాసక్తులగుదురు. కేవల కర్మ పరతంత్రులు కారాదు. ఈ విషయమునే గీతయందు శ్రీకృష్ణుడు తెలిపెను. శ్లో|| యా మిమాం పుష్పితాం వాచం ప్రవదం, త్యవిపశ్చితః వేదవాద రతాః పార్ధః నాన్యదస్తీతి వాదినః శ్లో|| కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి శ్లో|| భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధే నవిధీయతే గీత 2-42-, 43, 44. 5. అట్టి అభేదభక్తిని ప్రతిపాదించిన పోతన తన తప్పును గుర్తించి వీరభద్ర విజయము వ్రాసెనని కొందరు క్రింది పద్యమును ఉదాహరింతురు కాని ఇది కల్పితమనియు వీరభద్ర విజయములో చేర్చబడెననియు గ్రహింపవలయును. ఉ|| భాగవత ప్రబంధ మతి భాసురతన్ రచియించి దక్షకృ ద్యాగ కధా విదానమున నల్ప మనస్కుడ నైతి దన్నిమి త్తాగమ వక్త్రదోష పరిహారతకై యజనైక శైవ శా స్త్రాగమ వీరభద్ర విజయంబు రచించెద వేడ్క తోడుతన్