Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

14. ధ్రువోపాఖ్యానము

మంత్రదీక్ష అష్టాంగ యోగములవలన

దైవ సాక్షాత్కారము

ఈ కథవలన విష్ణు సాక్షాత్కారము కేవల ఆత్మానాత్మ విచారము చేతనే అనగా జ్ఞానమార్గము చేతనే సాధ్యమగునను అపోహను తొలగించుచున్నది. బాలకుడైన ద్రువునకు శాస్త్రపరిజ్ఞానము లేదు. పంచవయస్కుడగు బాలుడగుటచే వైదిక కర్మల కధికారము లేదు. కేవల నారాయణ మంత్రానుష్ఠానము చేతను, యోగము చేతను విష్ణు సాక్షాత్కారము పొందగలిగెను. భగవంతుడే ఆ బాలునకు ఆత్మానాత్మ వివేకము కలిగించి ధ్రువపదమును గూర్చెను.

భగవద్గీతలో భక్తునకు ''దదామి బుద్ధి యోగం'' జ్ఞానమును కలుగ జేయుదునని శ్రీకృష్ణుడు తెలిపెను. దేవీ గీతలో మంత్రము, యోగము రెండింటిని అనుష్ఠించిన మోక్షము సిద్ధించునని తెలుపబడినది. రమణ గీతలో మహర్షి కూడా ధ్యాతకు స్వవిమర్శకునకు గతి యేకమని చెప్పియున్నారు. పై విషయములకు ఈ కథ నిదర్శనముగా నుండుట గమనింపుడు.

ఉత్తానపాదుడను రాజునకు ఇద్దరు భార్యలు కలరు. సునీతి - సురుచి. పెద్ద భార్యయైన సునీతి కుమారుడు ధ్రువుడు. చిన్న భార్యయైన సురుచి కొమారుడు ఉత్తముడు. ఒకనాడు ఉత్తముడు తండ్రి తొడపై కూర్చుండి యుండగా ధ్రువుడుకూడ తండ్రితొడ నెక్కబోయెను. సురుచి ధ్రువుని వారించి ''జనకు తొడనెక్కు భాగ్యము నా గర్భమున బుట్టినవానికి గాని అన్యునకు గలుగదు. అట్టి కోరిక గలదేని శ్రీహరిని సేవించి తన కడుపున బుట్టు వరమును బడయు'' మని అసహ్య వచనములు బలికెను. ఉత్తానపాదుడు కూడ సురుచి యందు బద్ధానురాగు డగుటచేత ధ్రువుని నుపేక్షించెను. బాలకుడైనను ధ్రువుడు క్షత్రియకుల సంజాతు డగుటచేత దండ తాడిత భుజగంబువలె రోషించి తన తల్లివద్ద కరిగి విలపించెను.

ఈ కథలోని పాత్రల నామములే అర్థవంతముగా నున్నవి. ఉత్తాన పాదునకు చిన్న భార్యయగు సురుచి ఎక్కువగా రుచించినది, నీతి మంతురాలైన పెద్ద భార్యయగు సునీతిపై అతనికి ప్రేమ తక్కువ. అతనిచే సునీతి ''బెండ్లామని కాదు. నికృష్ఠ దాసి యనియును బిలు వంగను జాలని దుర్భగురాలు'' దీనివలన నీతికి ఆదరణ లేదనియు ఇంద్రియ లోలత్వము వలన ఉత్తానపాదుడు పక్షపాతము చూపెననియు తెలియుచున్నది.

సునీతి చేయునది లేక ధ్రువుని అనునయ వాక్యముల సంతోష పరచి శ్రీహరియే నీకు శరణ్యమని వచించెను. పరమ పురుషుడైన శ్రీహరిని కొలుచుటకు ముందు లక్ష్మీదేవిని ప్రార్థింపవలెనని కూడ తెలిపెను.

క|| కర సరసీజ గృహీతాం

బురుహయు, నరవింద గర్భముఖ గీర్వాణుల్‌

పరికింపంగల లక్ష్మీ

తరుణీమణిచేత వెదుకదగు పరమేశున్‌

భాగవతము 4-235

త్రిగుణాత్మకమగు ప్రకృతి రూపిణియైన శ్రీదేవి నుపాసించి ఆమె యనుగ్రహమును బడసినగాని శ్రీహరిని దర్శింప వీలుకాదు. అనగా రజోతమోగుణంబులను - ఇంద్రియ మనంబులను - జయించిన తరువాత శుద్ధ సత్త్వమేర్పడి జ్ఞానము కలుగును.

ధ్రువుడు తపము జేయుటకై అరణ్యమునకు బయలుదేరెను. దారిలో నారదు డతనిని జూచి ''పాపనాశ కరంబైన తన కరంబున ధ్రువుని శిరం బంటెను.'' బాలుడై క్రీడల యందాసక్తిగల ధ్రువునకు దుష్కరంబైన తపము అసాధ్యమని నివారింప బూనెను. దాని నంగీకరింపక ధ్రువుడు పినతల్లియగు సురుచి కావించిన అవమానముచేత తన మనస్సు శాంతి పొందదనియు త్రిభువనోత్కృష్టంబు, అనన్యాధిష్ఠింబునైన పదంబు బొంరుటకు మార్గము నుపదేశింపుమని కోరెను. నారదు డిట్లుపదేశించెను.

''చతుర్విద పురుషార్థములు సిద్ధించుటకు హరిపద యుగళము నాశ్రయింపవలయును. నీవు బాలుడవగుట జేసి వేదాధ్యయనాది ఉచిత కర్మానర్హుండవు. అయినను యమ నియమముల బాటించి, ఆసనము కల్పించి, బ్రాణాయామమున. బ్రాణ ఇంద్రియ మనో మలంబుల చాంచల్య దోషముల హరించి, స్ఠిర చిత్తమున పురుషోత్తముని నేకాగ్ర చిత్తమున ధ్యానింపుము. శ్రీవాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమును జపియింపుము. మనోవాక్కాయ కర్మంబులచేత మనోగతం బగునట్లుగా భక్తి యుక్తంబులైన పూజలచేత పూజింపబడి సర్వేశ్వరుడు నభిమితార్థమునిచ్చును. విరక్తునకు మోక్షము సిద్ధించును, ''అని నారదుడు కర్తవ్యము నుపదేశించెను.

పై విధానము ఆత్మానాత్మ విచారముకాదు. యమ నియమప్రాణాయామముల చేతను, మంత్రజపము చేతను, ఇంద్రియ మనోబలంబుల దొలగించి పురుషోత్తముని ఏకాగ్ర చిత్తమున ధ్యానించుట సూచింపబడినది. ఈ మార్గమువలన ఇంద్రియము లీశ్వరవిషయములై మనస్సు నిశ్చలమై భక్తుడు ధ్యానసిద్ధుడగును. ఏకాగ్రతతో కూడిన ధ్యానములో త్రిపుటి నశించి ఆత్మ సాక్షాత్కారము కలుగును. పై మార్గమును ధ్రువుడనుసరించి ''హరి రూపమునకంటె నన్యంబు నెఱుగక చిత్త మవ్విభునందు '' జేర్చెను. అంతట ''సమధిక జ్ఞాన నయన గోచర సమగ్ర మూర్తిగా'' భగవంతుడైన శ్రీహరి యగుపించెను. బాలుడైన ధ్రువునకు శ్రీహరిని స్తుతించుటకు తగిన పాండిత్యము లేదు. శ్రీహరి వేదమయమైన తన శంఖముచేత ధ్రువుని కపోలతల మంటెను. అతడు జీవేశ్వర నిర్ణయజ్ఞుండై వేదాత్మకములైన వాక్యములచే శ్రీహరిని స్తుతించెను.

ఇంద్రియములను నియమించిన ధ్రువుడు రజోగుణము తమోగుణములను జయించి ధ్యాన సిద్ధుడయ్యెను. సత్వగుణముచే గలుగు ఆవరణము తొలగించుటకు శ్రీహరి అతనిని జీవేశ్వర నిర్ణయజ్ఞునిగా నొనర్చెను అనగా భగవంతుడే జ్ఞానమును ప్రసాదించును.

జ్ఞానవాన్‌ మాం ప్రపద్యతే-గీత

శ్రీహరి సుజ్ఞానియైన ధ్రువునకు ఐహిక వరంబులిచ్చి అంత్యమున ధ్రువపదము చెందగలవని దీవించెను. ధ్రువ డనేక వత్సరములు రాజ్యమును పాలించి తుదకు విష్ణు దివ్యపదము జేరెను.

ధ్రువో పాఖ్యానము వలన గ్రహింపదగినవి:-

(1) శ్లో|| తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం

దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాంతి తే

భగవద్గీత---

కోరికలు లేక భక్తిచే నెల్లప్పుడు నా సేవల జేయువారలకు నేనే తగిన పరికరముల నిచ్చి నా యొద్దకు జేర్చుకొందును. నేనే ఆత్మ జ్ఞానము కలుగజేసెదను.

భక్తునకు భగవంతుడే ఆత్మజ్ఞానము ప్రసాదించు ననుటకు ధ్రువోపాఖ్యానము నిదర్శనము.

(2) శ్లో|| న యోగేన వినా మంత్రో న మంత్రేణ వినా సః

ద్వయో రభ్యాస యోగోహి బ్రహ్మసంసిద్ధి కారణమ్‌

---దేవీగీత

మంత్రము యోగము రెండింటిని అభ్యసించిన బ్రహ్మసంసిద్ధిని బడయ వచ్చునని దేవీగీత వచించినట్లు ధ్రువుడు ద్వాదశాక్షరీ మంత్రమును యోగమును అభ్యసించి విష్ణు సాక్షాత్కారమును పొందును.

(3) శ్లో|| మాంహి పార్థ! వ్యపా శ్రిత్య యేపిస్యుః పాపయోనయః

స్త్రియో వైశ్యాస్తధా శూద్రాస్త్రేపి యాంతి పరాంగతిమ్‌

భగవద్గీత---

కులమత వయోవివక్షత లేక భక్తి మార్గము నవలంబింప వచ్చును. బాలుడైన ధ్రువుడు వేదాధ్యయన సంపన్నుడు కాడు. భక్తితో ప్రాణాయామ మంత్రజపముల వలన ముక్తుడయ్యెను.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters