Sri Bhagavadgeetha Madanam-2
Chapters
16. అశ్వత్థామ నవమానించుట స్వాత్వత సంహిత భీముని గదా ఘాతములచేత దుర్యోధనుడు తొడవిరిగి కూలగా దుర్యోధనునకు ప్రియము సేయనెంచి అశ్వత్థామ నిదురించు ద్రౌపది పుత్రుల (ఉపపాండవుల) శిరములు ఖండించెను. ఆ వార్తవిని ద్రౌపది నేలబడి ఏడ్చెను. ఆమె నర్జును డోదార్చి, శ్రీకృష్ణుడు రథసారథిగా రాగా, అశ్వత్థామను తరిమి వెంబడించెను. అశ్వత్థామ ఓపినంత దూరము పరుగిడి, ప్రాణరక్షణకై గత్యంతరము లేక, ప్రయోగంబు మాత్రము తెలిపి ఉపసంహారము తెలియక పోయినను పార్థుని మీదికి ''అపాండవ మగుగాక,'' యని బ్రహ్మశిరో నామకాస్త్రమును ప్రయోగించెను. ఆ అస్త్రముయొక్క తేజము భూనభోంత రాళముల నిండి ప్రాణి భయంకరమై తోచిన అర్జునుడు దానిని తెలిసికొనలేక ''ఇది ఏమని'' శ్రీకృష్ణుని ప్రశ్నించెను. శ్రీకృష్ణుడు ''ఉపసంహారము తెలియకయే ప్రాణరక్షణకై బ్రహ్మశిరోనామ కాస్త్రమును అశ్వత్థామ ప్రయోగించెను. దానిని నీ బ్రహ్మాస్త్రమున గాని మరలింపు వీలుకాదు. ప్రయోగింపుమని'' తెలిపెను. పార్థుడు జలంబుల వార్చి హరికి ప్రదక్షణముచేసి తాను బ్రహ్మస్త్రమును ప్రతిగా ప్రయోగించెను. ఆ రెండు బ్రహ్మాస్త్రములు పోరు సల్పగా శ్రీకృష్ణుని ఆజ్ఞమేరకు పార్థుడా రెండింటి నుపసంహరించెను. భారతమునందు ద్రోణుడు తన ప్రియశిష్యుడైన అర్జునునకు ''బ్రహ్మ శిరంబను దివ్యబాణంబు సప్రయోగవివర్తనంబుగా నిచ్చె'' ననియు ''దీనికి నీవనర్హుడ'' వనియు కూడ తెలిపెనని చెప్పబడి యున్నది. తరువాత అర్జునుడు అశ్వత్థామను బంధించి ద్రౌపది వద్దకు తీసికొని వెళ్ళెను. అశ్వత్థామ పాండవుల గురువగు ద్రోణాచార్యుని కుమారుడు. ద్రౌపది ''సుస్వభావ'' అగుటచేత గురుపుత్రుడగు అశ్వత్థామ తన పుత్రుల చంపినప్పటికి నమస్కరించినదట. ఇట్టి సాత్వికగుణము ఆమెలో ఎట్లు కలిగినది? ''సుస్వభావ'' యని భాగవతమున వర్ణింప బడుటచేత ఆమె శాంత రసాధిదేవతగా మారినది. భారతమున ఆమె వీరవనితగా చిత్రింపబడి, అశ్వత్థామ ధర్మవ్యతిరిక్త కార్యమును జేయుటచేత అతని చావును కోరినది. ఒకవేళ భాగవతము సాత్విక పురాణ మగుటచేత శ్రీకృష్ణ భక్తులందరు దానిలో సత్వగుణ ప్రధానులుగా చిత్రింపబడి యుండవచ్చును. ద్రౌపది అశ్వత్థామతో చెప్పిన మాటలు క్రోధో ద్రేకములతో పలుక బడలేదు. అవి కరుణారస ప్రపూర్ణములు. స్థితప్రజ్ఞునికి గీతలో దయాగుణ మవసరమని చెప్పబడినది. పరుష వాక్యము లాడకుండుట వాచిక తపస్సని చెప్పబడినది. అందువలన సత్త్వగుణముగల ద్రౌపది సాత్విక పురాణమైన భాగవతమున అశ్వత్థామతో ఇట్లు తెలిపెను. మ|| పరగన్ మా మగవార లందరును మున్ బాణప్రయోగోపసం హరణా ద్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం చిరి, పుత్రాకృతి నున్న ద్రోణుడవు, నీ చిత్తంబువన్ లేశమున్ గరుణా సంగములేక శిష్య సుతులన్ ఖండింపగా బాడియే? భాగవతము 1-160 గురుపుత్రుడవగు నీవు దయలేక శిష్య సుతులను ఖండింప వచ్చునా? క|| భూసురుడవు, బుద్ధిదయా భాసురుడవు, శుద్ధ వీరభట సందోహా గ్రేసరుడవు, శిశుమారణ మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ! భాగవతము-1-161 అగ్రవర్ణుడైన బ్రాహ్మణుడవు. బుద్ధిమంతుడవు, వీరాగ్రేసరుడవు. అసురులవలె శిశువులను జంపుట నీకు ధర్మమా? శా|| ఉద్రేకంబున రారు. శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం చిద్ద్రోహంబును నీకుజేయరు, బలోత్సేకంబుతో జీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢక్రియా హీనులన్ నిద్రా సక్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో? భాగవతము 1-162 నిద్రించు చిన్నపాపల జంప నీకు న్యాయమా? ఉ|| అక్కట పుత్ర శోక జనితాకులభార విషణ్ణ చిత్తనై పొక్కుచు నున్న భంగి నినుబోర గిరీటి నిబద్ధు జేసి నే డిక్కడ కీడ్చితెచ్చుట సహింపనిదై భవదీయ మాతనే డెక్కడ నిట్టి శోకమున నేక్రియ నే డ్చుచు బొక్కునున్నుదో! భాగవతము 1-163 పుత్రశోకముతో కుమిలిపోవు నావలెనే నీ తల్లి నీవు బద్ధుడవై నా ముందుంచ బడితివని తెలిసినంతటనే నీకై ఎంత దుఃఖించు చున్నదో కదా! ఇతరులను '' ఆత్మకుం సములుగా జింతించుట'' ద్రౌపదియందు వర్తించుచున్నది. కష్ట పరంపరల ననుభవించిన ద్రౌపదికి (భారత యుదానంతరము) సాత్విక దృష్టి యలవడెనేమో? యనిపించుచున్నది. ఉ|| ద్రోణునితో శిఖంబడక ద్రోణ కుటుంబివి యున్నదింట, న క్షీణ తనూజ శోక వివశీకృతనై విలపించు భంగి, నీ ద్రౌణి దెరల్చి తెచ్చుటకు దైన్యము నందుచు నెంత పొక్కునో ప్రాణ వియుక్తుడైన యతి పాపము బ్రాహ్మాణ హింస మానరే. భాగవతము 1-165 ద్రోణుని భార్య తన భర్త మరణించినను సహగమనము చేయక బ్రతికి యున్నది. ఇప్పుడు పుత్రశోకమునకు గూడ గురియైన నెంత విలపించునో గదా! ''బ్రాహ్మణ హింస ధర్మము కాదు. మాను''డని ద్రౌపది కృష్ణార్జునులతో చెప్పినది. ఇట్లు ''ధర్మ్యంబును, సకరుణంబును, నిర్వ్యళీకంబును, సమంజసమును, శ్లాఘ్యంబునుం''గా ద్రౌపది బలికినది. దానికి ధర్మరాజు సంతసించెను. గాని భీముడు చ|| కొడుకుల బట్టి చంపెనని కోపము నందదు, బాల ఘాతకున్ విడువు మటంచు జెప్పెడిని, వెఱ్ఱిది, వీడు విప్రుడే? విడువగనేల చంపు డిట్లు, వీనిని మరల చంపరేని నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము సేసెద జూడు డిందరున్ భాగవతము-1-168 అని పలికిన ద్రౌపది అశ్వత్థామకు అడ్డము వచ్చెను. ఆమె భీముని నివారింప జాలడని తెలిసి శ్రీకృష్ణుడు చతుర్భుజుడై రెండు చేతుల భీముని వారించి, రెండు చేతుల ద్రౌపదిని తొలగించెను. అంత అర్జునుడు అశ్వత్థామ శిరోజముల దరిగి బ్రాణావశిష్టుని జేసి విడిచి పెట్టెను. ఈ కథవలన గమనింపదగినవి:- (1) బ్రాహ్మణో నహంతవ్యమ్ (2) చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు. పొసగ మేలుజేసి పొమ్మనుటే చాలు. భారతమునందు అశ్వత్థామ నవమానించు కథ:- సౌప్తిక పర్వతములో భారతమున ద్రౌపది పుత్రశోకము నాపుకొనజాలక ''కోపంబు దీపింప'' ధర్మరాజుతో నిట్లనియెను. ''భూరమణ గాఢ నిద్రం గూరిన సమయమున ముట్టికొని నా సుతులం గ్రూరత దెగటార్చెను బా పారంభుడు గురు తనూజు డ క్రమ లీలన్ క|| అది యాఱని పెనుచిచ్చై మది గాల్ప దొడంగె; దీని మాన్ప నుపాయం బు దలంప నొండు లే ద య్యదయుని ముట్టుకొని నామ మడచుట దక్కన్ క|| వాయుసుతు బనిచి నేడటు సేయింపక తక్కితేని, జెప్పెద విను మే బ్రాయోప వేశమున నీ కాయ ముపేక్షింతు జుమ్మ కౌరవ నాథా! భారతములో శిశుహంత యగు అశ్వత్థామ దోషియై ధర్మము తప్పుటచే శిక్షార్హుడని ద్రౌపది వాదించెను. అతనిని తగినట్లు శిక్షింపని యెడల తాను ప్రాయోపవేశ మొనర్తుననని ప్రతిజ్ఞ చేసెను. కాని భాగవతమున ఆమె భాగవత సాత్త్విక తత్త్వమును జీర్ణించు కొన్నదాని వోలె ''సుస్వభావయై'' అశ్వత్థామతో బలికిన మాటలలో తన పుత్రశోకము, మాతృప్రేమ వ్యక్తపరచుటయే గాక అశ్వత్థామను సానుభూతితో తిలకించినది. అశ్వత్థామ ''బాలవధ జనిత పరాజ్ముఖు'' డట. ''పుత్రాకృతి నున్న ద్రోణు''డట. అతని తల్లి తనవలె శోకమున గుందుచున్నదట. భాగవత ప్రితిపాదిత సత్త్వగుణమును జీర్ణించుకొన్న పోతనయే ద్రౌపది పాత్రతో తాదాత్మ్యముచెంది ఇట్లు పలికించి యుండ నోపును.