Sri Bhagavadgeetha Madanam-2
Chapters
21. గోపికా వస్త్రాపహరణము (దేహాత్మ భావము) శ్రీకృష్ణుని సేవించుటకై దేవతలు ఋషులు గోవులు గోపికలై పుట్టిరి. ఒకప్పుడు కా త్యా య నీ వ్రతనిష్ఠలై గోపికలు వివస్త్రలై స్నానము చేయుచుండిరి. ఇది వ్రతభంగ కారణ మగుటచేత కృష్ణుడు వారిని మందలింపదలచి వారి వస్త్రములను దొంగలించి నీపవృక్షముపై గూర్చుండెను. గోపికలు శ్రీకృష్ణుని చీర లిమ్మని వేడుకొనిరి. వారు శ్రీకృష్ణుడు మానవమాత్రుడు కాదనియు పరబ్రహ్మమనియు, లీలామానుష విగ్రహుడనియు ఎఱుగుదురు. శ్రీకృష్ణుడు బాల్యక్రీడలు వర్ణించుచు అత డొనర్చిన త్రిగుణాత్మకమైన సృష్టిని గోప్యముగా వర్ణించిరి. శ్రీ కృష్ణుడు వారిముందు కనులు దెరచిన పసికందుకదా. సీ|| ''రాజసంబున' నీవు రంజిల్లు టెఱుగమే చెలదేగి వింతలు సేయుచుండ ''సత్వ సంపద'' గల్గి జరగుట దలపమే సిరిగల్గి యన్యుల జెనకుచుండ గురుతర శక్తియుక్తుడ వౌట ఎఱుగమే ''తామసంబున'' నెగ్గు దలచుచుండ ఒక భంగితో నుండకుంట జింతింపమే ''మాయా'' వియై మాఱు మలయుచుండ ఆ|| ఏమి జాడవాడ? వేపాటి గలవాడ? వే గుణంబు నెఱుగ వెల్ల యెడల నొదిగి యుండనేర వోరంత ప్రొద్దును బటము లీగదయ్య! పద్మనయన! భాగవతము 10-822 భగవంతుడు సత్త్వరజస్తమో గుణములను త్రిగుణములచే గూడిన మాయచేత సృష్టియొనర్చెననియు, శ్రీకృష్ణుని బాల్యచేష్టలు గోపికలుకు కొత్తవి కావనియు రెండర్థములు స్ఫురించునట్లు పద్యము వ్రాయబడినది. సీ|| బహు జీవనముతోడ బాసిల్లి యుండుటో గోత్రంబు నిల్పుటో గూర్మితోడ మహి నుద్దరించుటో, మనుజ సింహంబవై ప్రజల గాచుటో, గాక బలిదెరల్చి పిన్నవై యుండియు బెంపు వహించుటో రాజుల గెల్చుటో రణములందు గురువాజ్ఞ సేయుటో, గుణనిధివై బల ప్రఖ్యాతి జూపుటో భద్రలీల. ఆ|| బుధులు మెచ్చ భువి ప్రబుద్ధత మెఱయుటో కల్కితనము సేయ ఘనత గలదే? వాని లేదు వారి వారు నావారను నెఱుక వలదె? వలువ లిమ్ము కృష్ణ! భాగవతము 10-820 పై పద్యములో శ్రీకృష్ణుని దశావతారములు ధ్వనించుచున్నవి. చీర లెత్తికొనిపోవుట తగదని గోపికలు సూచించిరి. శ్రీ కృష్ణుడు దేహాత్మభావముగల గోపికలకు అట్టి భావమును తొలగింపదలచెను. దిగంబరులైన గోపికలను నీటినుండి వెలువడి తనకు చేతులెత్తి నమస్కరించినగాని చీరల నివ్వనని తెలిపెను. సీ|| శృంగార వతులార! సివేల మిముగూడి పిన్న నాటనుగోలె బెరిగినాడ. నెఱుగనే మీలోన నెప్పుడు నున్నాడ నేను జూడని మర్మ మెద్దిగలదు. వ్రతనిష్ఠలై యుండి వలువలు గట్టక నీరు సొత్తురె మీరు నియతి దప్పి కాత్యాయనీదేవి కల్ల సేయుటగాక యీరీతి నోచువా రెందు గలరు? ఆ|| వ్రతఫలంబు మీరు వలచిన జక్కగ నింతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరల సిగ్గువో నాడనేల? ఎగ్గు లాడనేల? భాగవతము 10-840 ఆత్మరూపుడై శ్రీకృష్ణుడు గోపికలయం దుండెను. పిన్న నాటనుండి వారిలో కలిసియుండెను. అతనికి తెలియని మర్మము లేమి కలవు? సిగ్గుపడ నేల? అందువలన గోపికలను నీటినుండి బయటికి రమ్మనెను. పరమాత్మయగు శ్రీకృష్ణుడు గోపికల ఆత్మ కంటె భిన్నము కాదుకదా? ''ఏ దేవత నారాధించినను తుదకు ఫలము నిచ్చువాడు తానే'' నని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపెను. శ్లో|| యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధ యార్చితు మిచ్చతి తస్య తస్యాచలాం శ్రాద్ధాం తామేవ విదధా మ్యహమ్ || ఏ మూర్తియం దెవరికి శ్రద్ధ కలిగియుండునో ఆ మూర్తియందే ఆతనికి చలింపని శ్రద్ధ నేనే కలుగజేయుచున్నాను. శ్లో|| సతయా శ్రద్ధయా యుక్తస్త స్యారాధన మీహతే లభ##తేచ తతః కామాన్ మమైవ విహితాన్ హితాన్|| అట్టి దేవతాభక్తుడు నాచే నొసంగబడిన శ్రద్ధతో ఆ దేవతనే పూజింపగోరును. నేనా దేవతలమూలముగా వానికిష్టములైన కోర్కెల నిచ్చుచున్నాను. ఇతర దేవతల నారాధించినను ఫలమిచ్చువాడను నేనే కదా? కాత్యాయనీ వ్రతఫలము దక్కవలె నన్న గోపికలు సిగ్గువిడిచి చేతులెత్తి శ్రీకృష్ణునకు నమస్కరించవలెను. ''వ్రతముల్ సేయుచునొక్కమాటయిన నెవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానుప'' (భాగవతము 10-842) జాలునట్టి వరదుడైన శ్రీకృష్ణుడు చేలముల వీడి స్నానమాడుటచే వ్రతభంగ మగుటచేత దానిని మాన్పుటకై పర మాత్మయై గోపికలయం దాత్మరూపుడుగా నున్న తనకు మ్రొక్కుమని కోరెను. తరువాత గోపికలు శ్రీకృష్ణుని పరమాత్మగా గుర్తించి గోపికాగీతలలో నిట్లు స్తుతించిరి. ఉ|| నీవు యశోద బిడ్డడవె? నీరజనేత్ర సమస్త జంతుచే తోవిదితాత్మ వీశుడవు తొల్లి విరించి దలంచి లోక ర క్షావిధ మాచరింపుమని సన్నుతి సేయగ నత్కులంబునన్ భూవలయంబు గావ నిటు బుట్టితిగాదె మనోహరా కృతిన్. ----భాగవతము 10-1039