Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

28. భాగవతము - భక్తిరస పోషణము

భక్తి రసమా? భాగవతము భక్తి ప్రధానమైన గ్రంథము. నవ రసములనేగాక భక్తినికూడ రసముగా పరిగణింపవచ్చునా? ప్రాచీనాలంకారికులగు విశ్వనాథ కవిరాజు, మమ్మటుడు, జగన్నాథ పండితుడు, హేమచంద్రుడు మొదలగువారు భక్తిని ఒక భావముగా పరిగణించిరి. దానికి రసత్వసిద్ధి నాసాదింపరైరి. ''ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ'' ''రసో వైసః'' ఇత్యాది వేద ప్రమాణములచే భగవంతుడు రస స్వరూపుడని చెప్పబడినది. అందువలన రూపగోస్వామి. మధుసూదన సరస్వతి భక్తిని రసరాట్టుగా నిరూపించిరి.

క్లో|| కాంతాది విషయావా యే రసా ద్యా న్తత్ర నేద్రుశమ్‌

రసత్వం పుష్యతే పూర్ణ సుఖాన్‌ స్పర్శత్వ కారణాత్‌

పరిపూర్ణ రసా క్షుద రసేభ్యో భగవ దతిః

ఖద్యోతేభ్య ఇవాదిత్య ప్రభేవ బలవత్తరా.

''కాంతాది లౌకిక విషయములయందలి రసములయందు భగవద్రతియందువలె సంపూర్ణానందము కలుగదు. అవి క్షుద రసములు. భగవద్రతి పూర్ణరసము మిణుగురుపురుగు కాంతికంటె సూర్య కాంతి అనేక రెట్లు తేజోవంతుమగునట్లు క్షుద్రరసముకంటె భగవద్రతి తేజో వంతము'' అని మధుసూదన సరస్వతి భక్తిని రసరాట్టుగా శాఘించెను. భగవదవతార చిత్తవృత్తిగల భక్తిరసమునందు నిరవధిక ఆనందాను భవము కలుగుచున్నది. ఇతరరసముల యందలి ఆనందానుభూతి క్షణికము. అందువలన భక్తియే రసములకు రాజని చెప్పియుండును.

భాగవతమున నవరసములు చక్కగా పోషింపబడి కంసవధయందు వీరరసము, నృసింహావిర్భావమున రౌద్రాద్భుత రసములు శ్రీకృష్ణునినోటిలో విశ్వమును జూపుటయందు ఆద్భుతరస రుక్మిని పరాభవించుట యందు హాస్యరసము, అశ్వర్థామనుయందు భీభత్స భయానక రసములు, కుచేలో పాఖ్యానమున శ్రీకృష్ణ నిర్యాణమున కరుణరసము. ప్రహ్లాద చరిత్ర యందు శాంతరసము. రుక్మిణీకల్యాణము రాసక్రీడలయందు శృంగారరసము, నరకాసురవధయందు వీర శృంగార భయ రౌద్ర విస్మయములు పోషింపబడినవి. కాని భక్తిరస మీ కథలయం దంతర్వాహినియై యున్నది. నవ రసములు భగవత్కైంకర్యరూపములై భక్తి కి దాసోహ మనినవి.

పోతన తెలుగు శుకయోగి యని పేరు గాంచెను. వల్లభాచార్యుని, చైతన్యుని మధురభక్తికి జీవము పోసెను. భారతము ''నానా రసాభు దయోల్లాసి'' కాగా భాగవతము ''భక్తి రసాభ్యుదయోల్లాసి'' యనవచ్చును. సంస్కృత భాగవతమును విపులీకరించి పోతన భక్తి రసమును చక్కగా పోషించెను. కొందరు పోతన మధురభక్తి శ్రుతి మించి అసభ్యముగా నున్నదని భావింతురు. పోతన ''రసికుడు'' అని కొందరి భావన.

పరమాత్మయైన శ్రీకృష్ణుడు గోపికలతో రమించుట అధర్మము, అవినీతి యని వారి వాదన.

ఉదాహరణమునకు ''అని యిటు కుసుమ శరుని శర పరంపరా పరవశ##లై యోపికలు లేక పలికిన గోపికల దీనాలాపంబుల విని నవ్వి యోగేశ్వరేశ్వరుండైన శ్రీకృష్ణు డాత్మారాముండై వారలతో రమించెనప్పుడు.

మ|| కరుణాలోకములన్‌, బటాంచల కచాకర్షంబులన్‌, మేఖలా

కర బహుస్తన మర్శనంబుల, నఖాంక వ్యాపులన్‌, నర్మ వా

కరిరంభంబుల, మంజులాధర సుధా పానంబులన్‌, గాంతలన్‌

గరగించెన్‌ రతికేళి కృష్ణుడు గృపం కందర్పు బాలార్చుచున్‌

భాగవతము 10-1002 పూర్వభాగము

తరువాత ''వెన్నుం డింద్రియ స్థలనంబు సేయక గోపికలతో రమించె'' నని శుకులు తెలిపెను. ఇంత అసభ్యముగా లేకుండ కృష్ణుడు గోపికలతో రమించుటను ఎంతో జాగరూకతతో ఎఱ్రాప్రగడ వర్ణించెనని హరివంశమునుండి క్రింది పద్యమును కొందరు ఉదాహరింతురు.

మ|| లలితా లోకములన్‌, మనోజ్ఞ మధురా లాపంబులన్‌, విస్ఫుర

త్కలహాసంబుల, బంధుర స్తనభరోత్తానంగ సంగంబులన్‌.

విలస ద్వక్త్ర సరోరు హార్పణములన్‌, స్నిగ్ధోరు సంవేష్టనం

బుల, బూజించిరి గోపభామలు జగత్పూజార్హు దాశార్హునిన్‌

శ్రీకృష్ణుడు ధర్మవర్తనము నతిక్రమించెనను సందేహము పరీక్షిత్తునకే కలిగి శుకుని ప్రశ్నించెను.

మత్త || ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియు నైవ స

త్కర్ము డీశు డధర్మశిక్షయు ధర్మరక్షయు జేయగా

నర్మిలిన్‌ ధరమీదబుట్టి పరాంగనాజన సంగ మే

ధర్మమంచు దలంచి జేసె నుదాత్తమానస చెప్పవే.

భాగవతము 10-1102 పూర్వభాగము

శుకు డిట్లు బదులు సెప్పెను.

ఆ|| సర్వభక్షు డగ్ని సర్వంబు భక్షించి

దోషిగాని పగిది దోషమైన

జేసి దోషపదము జెందరు తేసస్వు

లగుట చంద్ర వాస వాదు లధిప!

భాగవతము 10-1104 పూర్వభాగము

ఆ|| గోపజనము లందు గోపికలందును

సకల జంతు లందు సంచరి చు

నా మహాత్మునకు పరాంగన లెవ్వరు

సర్వమయుడు లీల సలిపెగాక.

భాగవతము 10-1108 పూర్వభాగము

ఇది కృష్ణలీల. అందులకే ''హరి సంతత లీలల నామరూపముల్‌ దవిలి చరించు మానవులు దార్కిక చాతురి ఎతం గల్గియున్‌ మిగిలి కుతర్కవాదములు మేరలు మీరి ఎఱుంగ నేర్తురే'' అని పోతన పాఠకులను తొలుతనే హెచ్చరించెను.

మ|| సిరి చాంచల్యముతోడి దయ్యు దనకుం జీవేశ్వరుండంచు నే

పురుష శ్రేష్ఠు వరించు, నట్టి పరమున్‌ బుద్ధిన్‌ విలోకంబులన్‌

గర యుగ్మంబుల గౌగిలించిరి సతుల్‌, గుల్యాణబాష్పంబు లా

భరణ శ్రేణులుగా ప్రతిక్షణ నవ ప్రాప్తానురాగంబులన్‌.

భాగవతము 1-270

ఇదిగాక గోపికల కామచేష్టలు శ్రీకృష్ణుని చలింపజేయలేదు.

మత్త|| పంచబాణుని నీరు సేసిన భర్గునిన్‌ దనవిల్లు న

ర్జించి మూర్ఛిల జేయజాలు విశేషహాస విలోక నో

దంచి తాకృతులయ్యు గాంతలు దంభ##చేష్టల మాధవుం

జంచలింపగ జేయ నేమియ జాలరైరి బుధోత్తమా!

భాగవతము 1-271

''ఇవ్విధంబున సంగ విరహితుండైన కంసారి సంసారి కై వడి విహరింప, ఆజ్ఞాన విలోకులైన లోకుల లోకసామాన్య మనుష్యుండని తలంతురు. ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మయుందున్న ఆనందాదులతో గూడియు, ఆ ప్రకృత గుణంబులైన సుఖ దుఃఖంబులన్‌ జెందకయుండు'' -----భాగవతము 1-272

ఇట్టి శ్రీకృష్ణ లీలలను భక్తి భావముతో గ్రహింపవచ్చును గాని తర్కముచే గ్రహింప వీలు కాదని ముందుగనే పోతన హెచ్చరించెను.

ఉ|| ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తి తోడ వ

ర్తింపుచు నెవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సే

వించు నతం డెఱుంగు నరవించ భవాదులకై న దుర్లభో

దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్‌

భాగవతము 1-71

''గుతర్కతమోహతిచేత నజ్ఞతం బొరసిన యప్పుడు అవ్విభుని మూర్తి గనుగొనలేరు''

-భాగవతము 2-111

క|| హరి సురుచిర లలితాకృతి

దరుణులుగని ముక్త విహతాప జ్వరులై

పరమోత్సవంబు సలిపిరి

పరమేశ్వరు గనిన ముక్త బంధుల భంగిన్‌

భక్తి భవబంధ విముక్తిని లక్షించినదికాని ఇంద్రియ తృప్తిని లక్షించలేదు.

''నై వస్త్రీ నపుమానేవ నై వచాయం నపుంసకః '' దేవీగీత. భగవంతుడు పురుషుడుకాడు, స్త్రీ కాదు. నపుంసకుడు కాదు. అట్టి నిర్గుణ పరమబ్రహ్మయగు శ్రీకృష్ణుని గోపికలు సగుణునిగా ప్రేమించిరి. ఎందుకనగా నిర్గుణము నిరుపాధికము అగు జ్ఞానము పొందుట మూఢులగు గోపికలకు సాధ్యము కాదు కదా? కామము ఇంద్రియార్ద మైనప్పటికిని ఈశ్వర పరమైనపుడు నిష్కామమే యగును.

"Devotion is sublimation of sex instinct"

-- FREUD

మీరాబాయి ''కల్యాణ మాడెనమ్మా శ్రీహరి'' శ్రీకృష్ణుడు తన్ను పెండ్లాడినట్లు భావించెను. శ్రీ రామకృష్ణ పరమాహంస తాను గోపికలను కాళీమాత శ్రీకృష్ణుడుగను భావించెను. జయదేవుని అష్టపదులలో భక్తిశృంగారము గానవచ్చుచున్నది.

గోపికలు ఇంద్రియార్థమైన ప్రేమను ఈశ్వరపరము జేసిరి. ''ఇంద్రియంబు లీశ్వర విషయంబులైన మదిసంచిత నిశ్చలతత్త్వమైనచో'' అను భాగవత భక్తి రహస్యము వారిలో వర్తించును. ''భగవద్గీతయందును ''తస్మాదింద్రియా ణ్యాదౌ నియమ్య భరతర్ష భ?'' అని శ్రీకృష్ణుడు కోరెను. ఇంద్రియము లీశ్వరపరము జేసి నియమించమని భాగవతము ఇంద్రియ జయమునకు సులభోపాయము సూచించినది. అందులకే గోపికలు భగవంతునియందు పతిపుత్రాదిక వాంఛలు నిలువుకొనుట న్యాయమని వాదించిరి.

మ|| పతులన్‌ బిడ్డల బంధులన్‌ సతులకున్‌ బాటించుటౌ ధర్మ ప

ద్ధతి ¸°నంటివి దేహధారిణులకున్‌, ధర్మజ్ఞ! చింతింపుమా

పతి పుత్రాదిక నామమూర్తి వగుచున్‌ భాసిల్లు నీయందు ద

త్పతి పుత్రాదిక వాంఛలన్‌ సలిపి సంభావించు టన్యాయమే?

భాగవతము 10-987

నీవే పతిపుత్రాదుల రూపముల నుంటివి. నీయందు పతి పుత్రాదికమైన కోర్కెలనుంచుట అన్యాయమా?'' అని గోపికలు ప్రశ్నించిరి.

శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు. అనేకవేల మందిని పెండ్లి యాడెను.

శ్లో|| చిత్రం బత్తెత దేకేన వపుషా యుగపత్‌ పృథక్‌

గృహేషు ద్వ్యష్ట సాహస్రం స్త్రియ ఏక ఉదావహత్‌

భాగవతము 10-69-2

ఒకే కాలములో 16 వేల గోపికల ఇండ్ల యందు శ్రీకృష్ణుడుండుటను నారదుడు తిలకించెను. అత డనేక రూపములగూడ దాల్చెను.

సీ|| సకలార్థ సంవేది యొక ఇంటిలోపల

జెలితోడ మచ్చటల్‌ సెప్పుచుండు

విపుల యశోనిధి వేరోక యింటిలో

సరసిజాసనిగూడి సరసమాడు

భాగవతము 10-621

రాసక్రీడలలో ప్రతి గోపికవద్ద యుండెను.

''అంగనా మంగనా మంతరే మాధవమ్‌

మాధవం మాధవం చాంతరే చాంగనా''

ఇట్టి శ్రీకృష్ణ పరమాత్మయందు బద్ధానురాగులై ''మూఢులైన స్త్రీలు గుణదేహముల నెట్లు విడవగలిగి''రని పరీక్షిత్తు శుకుని ప్రశ్నించెను. భగవద్గీతలో ''నిస్త్రె గుణ్యో భవార్జున'' అని శ్రీకృష్ణు డాదేశించెను. త్రిగుణములను తొలగించుకొనుటకు జ్ఞానమవసరము. గోపికలు మూఢులు అజ్ఞానులు. వారెట్లు త్రిగుణములను వర్జింపగలరు? మాయాదేవి నత్త్వరజస్తమో గుణములచేత కారణ సూక్ష్మ స్థూలదేహములను కలిగించెను. ఆమెయే త్రిపురసుందరి. స్థూల సూక్ష్మకారణ దేహముల త్రిపురములు. ఈశ్వరుడు త్రిపుర దహన మొనర్చెను. గోపికలు మూఢులైనను, త్రిగుణాత్మకమైన గుణ దేహమును వదలుటకు తమ కామతృష్ణను ఈశ్వరపరము చేసి బంధనిర్ముకలైరి.

ఎట్లనగా

మ|| తరుణుల్‌ గొందరు మూల గేహముల నుద్దండించి రారాక త

ద్విరమాగ్నిన్‌ పరితాప మందుచు, మనోవీధిన్‌ విభున్‌ మాధవున్‌

బరిరంభంబులు సేసి, జారుడనుచుం భావించుయున్‌, జొక్కి పొం

దిరి ముక్తిన్‌ గుణ దేహమున్‌ విడిచి ప్రీతిన్‌ బంధని ర్ముక్తులై

భాగవతము 10-967

బాంధవముననైన బగనైన వగనైన

బ్రీతినైన ప్రాణ భీతినైన

భక్తి నైన హరికి బరతంత్రలై యుండు

జనులు మోక్షమునకు జనుదు రధిప!

భాగవతము 10-972

వెయ్యేల. ''పరమ పురుషుండును, నజుండును, యోగీశ్వరేశ్వరుండును. నైన హరిని సోకిన స్థావరంబైన ముక్తంబగు''

భాగవతము 10-973

కాబట్టి గోపికలు ధన్యజీవులు కదా? భక్తి లేనివారు పై విషయములను గ్రహింపక భగవంతుడైన శ్రీకృష్ణుని నిందించి పాపము నొడి గట్టు కొందురు. అందులకే శుకుడు ఇట్లనెను.

క|| పాపాత్ముల పాపములను

పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై

పాపము గలదని నుడివిన

పాపాత్ముల పాపమునకు పారము గలదే!

భాగవతము

మ|| దరహాసాంకుర మోహనాకృతిః భవత్సాందర్య లీలా మనో

హర రూపంబున గాంచి గోపికలు మోహా విష్టలై ప్రేమతో

హరి మా భర్త యటంచు వేడ వ్రజ కన్యా బాహువల్లీ నిరం

తర బందీకృత దేహివైతివె ముకుందా! శ్రీ నృసింహేశ్వరా!

సువర్ణమాల

కావున భగవత్సరమేన మధుర భక్తియు మోక్షప్రదమే కదా!

Sri Bhagavadgeetha Madanam-2    Chapters