Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

30. భగవ దవతార తత్త్వము

''భాగవతో వాజ్మయావతారః'' భాగవత పురాణమే వాజ్మయ రూపమైన భగవదవతారమని పెద్దలు అన్నారు. ఈ పురాణములో భగవంతుని దశావతారములేగాక కపిలాది ఇతరఅవతారములు కూడ చేర్చబడినవి.

శ్లో|| మత్ప్యః కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః

రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధః కల్కి రేవచ.

అనునవి దశావతారములు. అవతరణ మనగా దిగివచ్చుట.

భగవంతు డెప్పుడు అవతరించెను:-

శ్లో|| యధా యధాహి ధర్మస్య గ్లాని ర్భవతి భారత!

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం వృజా మ్యహమ్‌.

--గీత 4-7

ధర్మ మడుగంటినప్పుడు ధర్మ పునరుద్ధరణకై భగవంతు డవతరించును. దుష్టశిక్షణము శిష్టరక్షణము జరిపి ధర్మమును మరల స్థాపించి అవతారము చాలించును. భక్తులకు శ్రవణ చింతన వందనార్చనము లొసగుటకుకూడ భగవంతు డవతరించును,

గీ|| మరచి అజ్ఞాన కామ్యకర్మముల దిరుగు

వేద నాతురులకు తన్నివృత్తి సేయ

శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు

కొఱకు నుదయించి తండ్రు నిన్‌ కొంద రభవ!

భాగవతము 1-196

పై పద్యములో శ్రీ కృష్ణుని అభవ=పుట్టుక లేనివాడా! అని సంబోధించియు అవతరించెనని చెప్పుట గమనింపుడు.

మానవునివలె భగవంతుడు జన్మించునా?

భగవంతునకు ''జీవునకు జెప్పిన విధమున జన్మ కర్మములు లేవు'' భగవంతుడు నిజయోగ మాయా మహిమముచేత స్వేచ్ఛా పరికల్పిత లీలా నిగ్రహుడు.

ప్రకృతిం స్వా మధిష్ఠాయ సంభవా మాత్మ మాయయా''

---గీత 4-6

నా ప్రకృతిని వశపరచుకొని మాయచేత నేను పుట్టుచున్నాను. భగవంతుని జన్మకర్మములు దివ్యములు. పుట్టుకలేని భగవంతుని పుట్టుక ఒక క్రీడ. జీవుల పుట్టుక అవిద్యతో కూడియుండును.

ఉ|| పుట్టుకలేని నీకభవ! పుట్టుక క్రీడయెగాక, పుట్టుటే

యెట్టనుడున్‌, భవాది దశ##లెల్లను జీవులయం దవిద్య తా

జుట్టుచునుండు, గాని నిను జుట్టినదింబలె బింత నుండియున్‌

జుట్టగలేమి దత్క్రియల జొక్కని యెక్కటి వౌదు వీశ్వరా!

భాగవతము 10-99

అట్లే శక్తి కూడ అయోనిజగా పుట్టుచున్నది. సీత అయోనిజ,

జీవుడు''అవిద్యా మహిమం జేసి కర్మానుగతంబైన మిథ్యారూప దేహ సంబంధుండు'' మానవుడు కర్మవశమున జనన మరణ ప్రవాహ ముల కొట్టుకొని పోవుచుండును. అందులకే శంకరుడు మానవులను గూర్చి కరావలంబ స్త్రోత్రమునందు

శ్లో|| ''యన్మాయార్జిత వపుః ప్రచుర ప్రవాహ

మగ్నార్త మర్త్య నివహేషు''

అనగా మాయచేత సంభవించిన జన్మల ప్రవాహమున కొట్టుకొని పోవు ఆర్తులైన మానవులని తెలిపెను.

మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ వామనావతారములు స్వల్ప కాలములోనే చాలింపబడినవి. పరశురామావతారములో రాజులను శిక్షించిన తరువాత పరశురాముడు తన శక్తిని శ్రీరామునకు ధారపోసి మహేంద్రగిరి చేరెను. అనగా దుష్టశిక్షణ ముగియగనే అవతారము ముగిసినది. దీనికి కారణము కృత త్రేతాయుగములందు ధర్మ వృషభము వరుసగా 4,3 పాదములతో నడచినది. కాని ద్వాపర కలియుగములలో ధర్మము కుంటుపడి వరుసగా 2,3 పాదములతో నడచినది. అందువలన రామ, కృష్ణ అవతారములలో దుష్టశిక్షణమేగాక ధర్మరక్షణకూడ బోధన చేయవలసి వచ్చినది. శ్రీరాముడు భగవంతుడైనప్పటిని మానవునివలె కేవల దశరథ పుత్రునివలె మసలుకొని గృహస్థధర్మమును క్షత్రియధర్మమును పాటించెను. మహిమలనెక్కువగా జూపలేదు. మానవులలో నొకడుగా వర్తించి ధర్మనిగ్రహుడై ఆదర్శపురుషు డయ్యెను. రామకృష్ణ అవతారములను విభవావతారములని యందురు. శ్రీకృష్ణుడు మానవునివలె గాక మహిమలను జూపెను. ఆయన శ్రీవిష్ణువువలె చతుర్భుజుడు. అతడు తలచినంతనే శంఖచక్రాది ఆయుధములు గరుడవాహనము అరుదెంచు చుండెడివి. అతని లీలలన్నియు అద్భుతములే. తాను భగవంతుడని నిరూపించు కొనెను. భగవద్గీతలో ఇట్లు చెప్పెను.

శ్లో|| ''అవజానంతి మాం మూఢాం మానుషీం తను మాశ్రితం''

మూఢులైన మానవులు శ్రీకృష్ణుని పరమాత్మగను లీలా మానుషనిగ్రహునిగను గుర్తింపజాలరు.

శ్లో|| అవ్యక్తం వ్యక్త మాపన్నం మన్యంతే మా మబుద్ధయః

పరం భావ మజానంతో మా మవ్యయ మనుత్తమమ్‌''

----గీత 7-24

వ్యక్తముగాని నన్ను బుద్ధిహీనులు వ్యక్తునిగా నెంచుచున్నారు. నా సర్వోత్కర్షము నెఱుగనివారు నాకు నాశము గలదని భావించు చున్నారు.

శ్రీ కృష్ణు డవతరించినది మొదలు నిర్యాణమువరకు ప్రదర్శించి నవి అద్భుతలీలలే కదా? భగవంతునివలె శ్రీకృష్ణుడు పంచభూతములకు పరుడైనవాడని మనకు తెలుపుటకై క్రింది అద్భుతకథలు చెప్పబడినవి.

1) మద్దివృక్షముల బడవేయుట------పృథివీ జయము.

2) నందుని వరుణలోకమునుండి గొని తెచ్చుట-----అపజయము.

3) కార్చిచ్చు నార్పుట -----తేజోజయము.

4) తృణావర్తుని చంపుట-----వాయు జయము.

5) మృద్భక్షణ విశ్వరూప దర్శనములు-----ఆకాశజయము

పై కథలను భాగవతములో భగవంతుడు అను అధ్యయమున వివరించితిని.

బ్రహ్మ రజోగుణము కలవాడు. విష్ణువు సత్వగుణము కలవాడు. శివుడు తమోగుణము కలవాడు. పరమాత్మ త్రిగుణమయుడు త్రిగుణాతీతు డైనప్పటికిని శుద్ధ సత్వగుణము జ్ఞానము కలిగించునదగుటచేత త్రిమూర్తులలో విష్ణువునకు భాగవతమున కొన్ని చోట్ల ప్రాధాన్యత ఇవ్వబడినవి. భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్త్యమును శోధింపబోవుట పై ప్రయోజనము నుద్ధేశించిన కథయేకదా? మృత్యులైన విప్రకుమారులను గొనితెచ్చుటయు శ్రీకృష్ణుడు పరతత్త్వమని నిరూపించును. రజోగుణ ప్రధానుడైన బ్రహ్మ శ్రీకృష్ణుని పరీక్షింపగోరి, గోవులను, గోపకులను దాచియుంచగా శ్రీకృష్ణుడే వారి రూపముల ధరించెను. బ్రహ్మకు తానే సృషఫ్టికర్త యను అహంకారమునశించెను. అనగా బ్రహ్మకంటె బాలగోపాల బ్రహ్మమే మిన్నయని తాత్పర్యము. అట్లే తమోగుణ ప్రధానుడైన శివుడు మృత్యువును మన్మథుని జయించిన వాడైనప్పటికిని. విష్ణువు మోహినీరూపమును తిలకించి విమోహితుడై వెంటబడెను. ఇదిగాక దేవతలకు రాజైన ఇంద్రుడుకూడ రాళ్ళవాన గురిపించినప్పుడు శ్రీకృష్ణుడే గోవర్థన పర్వతమునెత్తి గో గోపకులను కాపాడెను. అనగా శ్రీకృష్ణడే దేవత లందరికంటె మిన్నయగు పరతత్త్వమని భావము. పై కథలన్నియు విష్ణుపారమ్యమును తెలుపుచున్నవి.

కేవల మాహాత్మ్యములు ప్రదర్శించుటయే గాక అక్రూరునకు భాగవత ధర్మములను అర్జునునకు గీతను బోధించెను. ఇతర అవతారము లిట్టి ఉపదేశములు చేయలేదు. అందులకే ''కృష్ణం వందే జగద్గురుమ్‌'' అన్నారు.

శ్రీకృష్ణు డస్ఖలిత బ్రహ్మచారి. యోగీశ్వరేశ్వరుడు. గోపికలతనిని కామోత్కంఠతతోను మధుర భక్తితోను వెంబడించి తరించిరి. గోపికా వస్త్రాపహరణము, రాసక్రీడలు, గోపికల మధురభక్తి మొదలగువాని అంతరార్థమును సంకేతమును ముందుగ వివరించితిని. కృష్ణోపనిషత్తునందు ''యోనందో పరమానందః'' ''యశోదాముక్తి గేహినీ'' ''వంశస్తు భగవాన్‌ రుద్రః'' ''దయాసా రోహిణీ మాత'' ఇత్యాది సంకేతములు భాగవతమున కలవని తెలుపుచున్నది.

శ్రీకృష్ణుడే సర్వాంతర్యామి అనుటకు నిదర్శనముగా నారదునకు శ్రీకృష్ణుడు 16వేల గోపికల ఇండ్లలో ఒకే సమయమున అగుపించెననుకథ. కంస శిశుపాలాదులు శ్రీకృష్ణుని వైరభక్తితో తలచి ఉద్ధామధ్యాన గరిష్ఠు లగుటచేత అతనియందే ఐక్యము చెందిరి.

క|| తిరుగుచు గుడుచుచు ద్రావుచు

నరుగుచు గూర్చుండి లేచు చనవరతంబున్‌

హరి దలచి దలచి జగమా

హరి మయమని జూచె కంసు డారని యలుకన్‌

భాగవతము 10-86

సీ|| శ్రవణ రంధ్రముల నే శబ్దంబు వినబడు

నది హరిరవమని యాలకించు

నక్షిమార్గమున నెయ్యది సూడబడు నది

హరిమూర్తిగా నోపునంచు జూచు

దిరుగుచో దేహంబు తృణమైన సోకిన

హరి కరాఘాతమో యనుచు నులుకు

గంధంబు లేమైన ఘ్రాణంబు సోకిన

హరి మాలికా గంధమనుచు నదురు

తే|| బలుకు లెవ్వియైన బలుకుచో హరిపేరు

పలుక బడియెననుచు బ్రమసి బలుకు

దలపు లెట్టివైన దలచి యా తలపులు

హరి తలంపులనుచు నలుగ దలచు.

భాగవతము 10-87

పై విధమయుగా కంసునకు ఇంద్రియంబు లీశ్వర విషయంబులై మదిసంచిత నిశ్చలతత్త్వమయ్యెను. ఇదియే భాగవత భక్తి రహస్యము కదా? కావున ఎవ్విధముననైన (అలుకనైన, చెలిమినైన, గామంబున నైన) భగవంతునియందు ఉద్దామధ్యాన గరిష్ఠుడైన తరింప వచ్చునవి తాత్పత్యము.

శ్రీకృష్ణ లీలలను తర్కచాతురితో విమర్శించిన వాని పరమార్థమును గ్రహింప వీలుకాదు. శ్రీ హరి మహాద్భుతకర్మలు భక్తిభావము తోనే గ్రహింపవలయును. భక్తిలేనిచో విష్ణుమాయా కల్పితమైన లీలలు బ్రహ్మ రుద్రాదులుకూడ తెలియజాలరు. అట్టి కృష్ణలీలలో అతని జన్మమొకటి.

శ్రీకృష్ణ జననము:-

జీవునకు ఎక్కడ ఎప్పుడు ఏ రూపముతో జన్మమందవలయునో తెలియదు. శ్రీకృష్ణుడు తాను పుట్టుక ముందుగనె తానవతరించుటకుతగిన ఏర్పాట్లు చేసికొనెను. యోగమాయను పిలిచి దేవకీ గర్భమున నున్న శేషాఖ్యమైన తన తేజమును రోహిణీ గర్భమున నుంచుమని తెలిపెను. తాను దేవకీ గర్భమున బుట్టి శంఖ చక్రాద్యాయుధములు గల చతుర్భుజునిగ దర్శన మిచ్చెను. దేవకీ వసుదేవులు పూర్వజన్మమున పృశ్ని సుతపులని వారి కోర్కెమేరకు వారికి తాను జన్మించెనని తెలిపెను. తర్వాత సాధారణ శిశువుగా మారెను. వసుదేవు డాబాలుని గొనిపోయి య శోద ప్రక్కన ఉంచి ఆమెకు శిశువుగా జన్మించిన యోగమాయను గొనితెచ్చి దేవకి కడ నుంచెను. చిత్ర మేమనగా యోగమాయ ప్రభావమున కారాగారము తలుపులు తమంతతామే తెరచుకొనెను. ద్వారపాలకులు నిదురనుండి లేవలేదు. యమునానది దారి చేసినది. వ్రేపల్లెలో ఎవరూ మేల్కొనలేదు.

ఇట్టి చిత్రములను జూపుట భగవంతునకే కదా సాధ్యము? ఇది అంతయు కల్పిత కథయని మనము భావించవచ్చును. కాని ఒక ఉదంతమును ఆప్రస్తుతము కాని ఎడల వ్రాయుదును.

రమణమహర్షికి ఒక మహమ్మదీయ శిష్యుడుండెను. అతని భార్య బ్రాహ్మణులకు తనఇంట భోజనము పెట్టవలెనని భర్తను కోరెనట ఆ విషయము భర్త మహర్షితో తెలిపెను. మహర్షి తనముందు కూర్చున్న ఇద్దరు నైష్ఠిక బ్రాహ్మణులను పిలిచి మహమ్మదీయుని ఇంటికి భోజనమునకు వెళ్ళమని ఆదేశించెను. వారును మారు పలుకక వెళ్ళి బోజనముచేసి మహర్షి ముందుకువచ్చి కూర్చొనిరి. మహర్షి వారి నేమియు అడుగలేదు. ఇతర బ్రాహ్మలు వారిని తప్పుపట్టి వెలివేయ లేదు, ఏమి జరుగనట్లే జరిగిపోయినది. ఇది జీవన్ముక్తుడైన భగవాన్‌ రమణమహర్షి మహిమగాక మరి ఏమి?

శ్రీకృష్ణుని అన్ని అద్భుత లీలలను వర్ణింప వీలులేదు. ఈ భగవల్లీలను పురస్కరించుకొని శ్రీకృష్ణావతారము పూర్ణావతారమని చెప్పబడినది. ఇట్టి అవతారతత్త్వమును గూర్చిన కథలను శ్రవణము చేసిన పరీక్షితునకువలె మానవులకు భక్తిజ్ఞాన వైరాగ్యములు సిద్ధించి ముక్తి లభించునని అవతారతత్త్వ నిగూఢ రహస్యము.

గీ|| అతి రహస్యమైన హరిజన్మ కథనంబు

మనుజు డెవ్వడేని మాపు రేపు

జాల భక్తి తోడ జదివిన సంసార

దుఃఖరాసి బాసి తొలగిపోవు.

గీ|| అరసి నిర్గుణ బ్రహ్మంబు నాశ్రయించి

విధి నిషేధనివృత్తి సద్విమల మతులు

చేయుచుందురు హరిగుణ చింతనమును

మానసంబున నేప్రోద్దు మానవేంద్ర!

Sri Bhagavadgeetha Madanam-2    Chapters