Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

33. అశ్వత్థము-భాగవతము

శ్లో|| కరార విందేన పదారవిన్దం

ముఖారవిందే విని వేళయంతం

అశ్వత్థ పత్రస్య పుటే శయానం

బాలం ముకుందం మనసా స్మరామి

చేతిలో ఒక పాదమును పట్టుకొని ఆ పాదముయొక్క బొటన వ్రేలిని నోటిలో నుంచుకొని అశ్వత్థపత్రముపై శయనించి యున్న బాలకృష్ణుని స్మరించుచున్నాను.

భాగవతము, రామయణము కల్పవృక్షములతో పోల్చబడినవి. భారతము పారిజాత వృక్షముతో పోల్చబడినది. ఈవృక్షముల సంకే తార్థము తెలిసికొనుటకు అశ్వత్థవృక్షమునుగూర్చి తెలిసికొనవలయును. అనేక గ్రంధముల యందు అశ్వత్థప్రసక్తి కనిపించుచున్నది.

శ్రీ మహాభారతమున ఆదిపర్వమున శ్రీకృష్ణుడు అవతారము చాలించినప్పుడు ఆశ్వత్థ తరుమూలమున గూర్చొని తనకు తత్త్వోప దేశ మొనర్చెనని ఉద్ధవుడు విదురునితో తెలిపెను. జగద్గురువగు దక్షిణా మూర్తి వటతరు మూలమున నుండెను. విదురాశ్వత్థ క్షేత్రమున పూర్వము విదురుడు అశ్వత్థవృక్షమును నాటెనని తెలుపుదురు. హనుమంతుడు పారిజాత తరుమూలవాసి. నారదునకు రాగిమ్రాను క్రింద హృదయమున శ్రీహరి దర్శనమిచ్చెను. ఇట్లు వృక్షప్రసక్తి అనేక గ్రంధముల అగుపించును గాని ''బ్రహ్నవృక్షమని చెప్పినంత మాత్రమున ప్రయోజనము లేదు. దాని సంకేతమును గ్రహింప వలయు'' నని త్యాగరాజు తన పాటలో వ్రాసెను. కాని దాని సంకేతార్థమును గ్రహించుటకు ప్రయత్నింతము.

అశ్వత్థము త్రిమూర్త్యాత్మకమైన వృక్షరాజము

శ్లో|| మూలతో బ్రహ్మరూపాయ మధ్య తోవిష్ణు రూపిణ

అగ్రతి శ్శివరూపాయ వృక్షరాజాయతే నమ!

భవిష్యోత్తర పురాణమున అశ్వత్థ ప్రదక్షిణ విధియందు శ్రీమహా విష్ణువు తానే అశ్వత్థమని తెలిపెను.

శ్లో|| ఆహా మశ్వత్థరూపేణ సాలగ్రామ శిలాసుచ

తస్మాత్సర్వ ప్రయత్నేన కురుష్వ తరుసేవనమ్‌

భగవద్గీతలో శ్లో|| ''ఆశ్వత్థ సర్వ వృక్షాణాం'' అని శ్రీకృష్ణుడు వృక్షములలో తానశ్వత్ధమని తెలుపుకొనెను.

బ్రహ్మ నారద సంవాదమున ఇట్లు చెప్పబడినది.

శ్లో|| అశ్వత్థః పూజితో యత్ర పూజితా సర్వదేవతా

రమా బిల్వ శ్శివా నింబ స్తులసీత్యా సరస్వతీ

బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సాక్షా దశ్వత్థ రూపిణః

మూలం సనాతనం బ్రహ్మ గర్భో అగ్నిః సమిధో హవిః

ఛందాంసి తస్య వర్ణాని వృక్షోసౌ శైవ వైష్ణవః

పై ఉదాహరణములు అశ్వత్థమే త్రిగుణాత్మకమైన సృష్టిరూపమైన భగవద్రూపమని చెప్పుచున్నవి. వేదములు, ఉపనిషత్తులు, గీతలు తంత్రములు, పురాణములు ఈ అశ్వత్థము నెట్లు వర్ణించుచున్నవో గమనింతము.

1) అశ్వత్థ వృక్షములోక విరుద్ధముగా నున్నది:-

బ్రహ్మమ అశ్వత్థము:--

వేదమున అరణ్యకమునందు అశ్వత్థ వృక్షమును గూర్చి ఇట్లు చెప్పబడినది.

ఊర్థ్వమూల మవాక్‌ శాఖం

వృక్షం యోవేద సంప్రతి

న అసజాతు జన శ్రద్ధధ్యాత్‌

మృత్యుర్మా మారయాదిత

దీనికి విద్యారణ్యు లిట్లు వ్యాఖ్యానము వ్రాసిరి.

లోకమున వృక్షమునకు వెర్లు క్రింది వైపునకును, కొమ్మలు పై వైపునకును ఉండును గదా, కాని సంసార వృక్షమునకు దీనికి విరుద్ధముగా నుండును.

ఊర్థ్వమూలం:-

సర్వోత్కృష్టమైన పరబ్రహ్మమే మూలము అగుటచేత పరబ్రహ్మము ఈ లోకఉత్పత్తికి ప్రధాన కారణభూతుడై మూలమువలె నున్నాడు. అతని నుండి బ్రహ్మాది స్తంభ పర్యంతమున్న ప్రపంచమేర్పడినది. బ్రహ్మమును మూలముగను ప్రపంచమును శాఖోపశాఖలుగను భావించినచో ఈ వృక్షము లౌకిక వృక్షములకు భిన్నముగ కనుపించును. ఈవృక్షమును గూర్చి ఆమూలాగ్రము తెలిసికొన దలచిన ఎడల గురుముఖమున శాస్త్రముఖమున ఎఱుంగదగియున్నది. అట్లు ఎఱిగిన మానవుడు మృత్యువునుండి తరించును. అనగా బ్రహ్మమే త్రిగుణాత్మకమై సగుణ సృష్టిరూపమున అశ్వత్థమై వెలసినది.

2) అశ్వత్థమే బ్రహ్మము:-

కఠోపనిషత్తునందు అశ్వత్థ వృక్షమును గూర్చి ఇట్లు చెప్పబడినది.

శ్లో|| ఊర్ధ్వమూలో హ్యవాక్‌ శాఖ

ఏషోశ్వత్థః సనాతనః

తదేవ శుక్రమ్‌ తద్ర్బహ్మా

తదేవామృత ముచ్యతే

ఎగువవేరును దిగువకొమ్మలు కలిగిన పురాతనమైన అశ్వత్థమే బ్రహ్మము. అనగా కారణరూపమైన పరమాక్మ కార్యరూపమైన అశ్వత్థము లేక బ్రహ్మాండముగ అగుపించుచున్నది. ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' అనుటచేత, కనుపించు ప్రపంచము వ్యావహారిక సత్యమైనను, విచారించిన పారమార్థిక సత్యమగు బ్రహ్మమే.

''తజ్జలానితి శాంత ఉపాసిత'' అని ఛాందోగ్యములో చెప్పినట్లు జలశబ్దము బ్రహ్మభావమును సూచించుచున్నది. జ=పుట్టిదై; అన్‌=స్థితిగలదై; ల=లయముచెందు చుండుటచేత సృష్టి పరమాత్మ కంటె వేరుగాదు. ''ఎవ్వనిచే జవించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వనియందు డిందు'' అని భాగవతమున దెల్పిన గజేంద్రుని పలుకులు జలశబ్దార్థమునే సూచించుచున్నవి. ''జాయతే లీయతే యత్రజగత్త జ్జలమీరితమ్‌'' అని సూక్తార్థ రహస్యమున జలశబ్ద నిర్వచనముండుట చేత ప్రపంచము దేనినుండి ఉద్భవించుచున్నదో, దేనియందు లయము చెందుచున్నదో అదియే జలము. లేక పరబ్రహ్మము. అందులకే కాళిదాసు జలమునుప్రథమ భూతముగా వర్ణించెను. ఇది పంచ భూతములలోని జలముకాదు. శ్రీదేవి అప్‌ స్వరూపిణి అని శ్రీసూక్తమున చెప్పినప్పుడు పై జలశబ్దార్థమునే అన్వయించుకొనవలయును.

''ఆపోవా ఇదగ్‌ సర్వం విశ్వా భూతాన్యాపః

..... ..... ....భూర్భు వస్సువ రాప ఓం''

అను మంత్రము సర్వము జలరూపమే లేక పరబ్రహ్మ రూపమే అని తెలుపుచున్నది.

శ్లో|| ఆపో నార ఇతిప్రోక్తా ఆపోవై నర సూనవః

తాయ దస్యాయనం పూర్వం తేన నారాయణః స్మృతః

ఇంతవరకు వేదము ఉపనిషత్తులను పరిశీలించితిమి. వేదమున బ్రహ్మమే అశ్వత్థమనియు, కఠోపనిషత్తున అశ్వత్థమే బ్రహ్మమని చెప్పబడినది కదా. బంగారము ఆభరణముగా వివర్తము చెందినపుడు బంగారము వస్తుతః మార్పు చెందలేదు. ముద్ద బంగారము, ఆభరణము రెండును బంగారమే కదా అట్లే బ్రహ్మమే జగత్తు; జగత్తే బ్రహ్మము. ఆశ్వత్థము అనగా అ==కాదు; శ్వ=శ్వ=రేపు; త్థ=స్థ=స్థాతా ఉండునది; అనగా రేపు ఉండునది కాదని అర్థము. దృశ్యమగు ప్రపంచము మిధ్య. అథిస్థానమగు బ్రహ్మ సత్యమని భావము.

3) వైరాగ్యముతో అశ్వత్థమును ఖండిపవలయును:-

భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమున ఆశ్వత్థ మిట్లు వర్ణింపబడి యున్నది.

శ్లో|| ఊర్థమూల మధశ్శాభా

అశ్వత్థం ప్రాహు రవ్యయం

ఛందాంసి యస్య పర్ణాని

యస్తం వేద స వేదవిత్‌

నరూప మశ్యేహ తతో పలభ్యతే

నాం తో నచాది ర్నచ సంప్రతిష్ఠా

అశ్వత్థ మేనం స విరూఢ మూలం

అసంగ శ##స్త్రేణ దృఢేన ఛిత్వా.

ఈ శ్లోకములకు శంకర భగవత్పాదుల వ్యాఖ్యానమును గమనింతము. అశ్వత్థము ఊర్ధ్వ మూలము కలది. అనగా కాలము కంటె సూక్ష్మమై, అన్నిటికి కారణమై, నిత్యమై, మహత్తై, మాయాశక్తితో కూడిన బ్రహ్మము వేరుగా కలది అశ్వత్థము. దాని ఆకులు వేదములు. దీనిని తెలుసుకొన్నవాడు నకల వేదసారము నెఱిగినవాడు. సర్వజ్ఞుడు. ఈ అశ్వత్థము యొక్క ఆది, అంతము, స్థితి తెలిసికొనుట సులభసాధ్యముకాదు. సమూలముగా ఈ అశ్వత్థమును తెలిసికొని, వివేక అభ్యాస పాటవములచేత పదును పెట్టిన వైరాగ్యమను ఖడ్గముచే దానిని ఛేదింప వలయును. అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారము కలుగును.

4) ఈశ్వరోపాధియగు బ్రహ్మాండ మెట్లశ్వత్థమో జీవోపాధి

యగు పిండాండము (దేహము) కూడ అశ్వత్థమే.

(Man is the image of God)

ఇక పురాణమున చెప్పబడిన అశ్వత్థ స్వరూపమును గమనింతము.

శ్లో|| అవ్యక్త మూల ప్రభవ

స్తసై#్య వాను గ్రహోత్థితః

బుద్ధి స్కంధ మయశ్చైవ

ఇంద్రి యాంతర కోటరః

మహాభూత ప్రశాఖశ్చ

సుఖదుఃఖ ఫలోదయః

ఆజీవ్య స్సర్వ భూతానాం

బ్రహ్మ వృక్షః సనాతనః

ఏత ద్బ్రహ్మ వనంచైవ

బ్రహ్మాచరతి నిత్యశః

ఏతచ్ఛిత్వాచ భిత్వాచ

జ్ఞానేన పరమాసినా

తతశ్చాత్మ రతిం ప్రాప్య

యస్మా న్నావర్తతే పునః

అవ్యాకృతము, మూలప్రకృతి, మాయ, అనెడు వేరునుండి పుట్టి క్రమముగా విస్తరించి, బుద్ధియనెడి బోదికలదై, నేత్రేంద్రియ రంధ్రములే తొఱ్ఱలుగా కలిగి, వంచభూతములు కొమ్మలుగా కలిగి శద్దాది విషయములు ఆకులుగా కలిగి, ధర్మాధర్మములు పుష్పములుగా కలిగి, సుఖదుఃఖములు పండ్లుగా కలిగి, పక్షులకు వృక్షమువలె సర్వ ప్రాణులకు జీవనాధారమై బహుపురాతనమైన సంసార వృక్షము (జీవోపాధియగు దేహము) పరమాత్మకు విహారస్థానము. దీనిని జ్ఞానమను కత్తిచే ఛేదించిన కైవల్యము ప్రాప్తించును. ఆంధ్ర భాగవతమున సంసారవృక్ష మిట్లు వర్ణింపబడినది.

సీ|| ప్రకృతి యొక్కటి పాదు ఫలములు సుఖదుఃఖ

ములు రెండు గుణములు మూడువేళ్ళు

తగు రసంబులు నాల్గు ధర్మార్థ ముఖరంబు

లెఱిగెడి విధము లై దింద్రియంబు

లాఱు స్వభావంబు లా శోకమోహాదు

లూర్ములు ధాతువు లొక్క యేడు

పై పొర లెనిమిది ప్రంగలు భూతంబు

లైదు బుద్ధియు మనోహం కృతులును

రంధ్రములు తొమ్మిదియు గోటరములు ప్రాణ

పత్ర దశకంబు జీవేశ పక్షియుగము

గలుగు సంసార వృక్షంబు

భాగవతము 10-91

5) దేహములోని నాడీమండలమే అశ్వత్థము:-

ఉత్తర గీతయందు అశ్వత్థమును గూర్చి ఎట్లు తెలుపబడినదో పరిశీలింతము.

''ఏవం బ్రహ్మాండ నిలయం

తస్మిన్‌ దేహే ప్రతిష్ఠి తమ్‌''

అనగా ''బ్రహ్మాండ మంతయు ఈ దేహమునందే కల్పింప బడినది.'' ఇందువలన సమష్టి వ్యష్టులకు, బ్రహ్మాండ పిండాండములకు (Macrocosm and Microcosm) సమానత్వము చూపబడినది. దేహమునందలి సుషుమ్నా నాడియే జగదుత్పత్తికి కారణమని చెప్పబడినది.

''సుఘమ్నాం తర్గతం విశ్వం

తస్మిన్‌ సర్వం ప్రతిష్ఠితమ్‌''

మన దేహమున వెన్నెముక యందు సుషుమ్నా నాడికలదు దీనియందు సర్వజగత్తు సర్వము ప్రతిష్ఠింపబడి యున్నది.

''నానా నాడీ ప్రసరగమ్‌

సర్వ భూతాంత రాత్మని

ఊర్ధ్వమూల మధశ్శాఖా

వాయు మార్గేణ సర్వగమ్‌

ఈ సుఘమ్నా నాడి సర్వప్రాణుల యొక్క అంతరాత్మ యందున్నది. సర్వ నాడులకు ఉత్పత్తి స్థానమై యున్నది. ఎగువవేరు దిగువ కొమ్మలు కలదై యున్నది. అనగా సమష్టిలో చెప్పబడిన సర్వసృష్టి రూపమైన అశ్వత్థ మనబడు సంసార వృక్షమే వ్యష్టిలో సుషుమ్నా నాడి యగుచున్నది. దాని యందలి కుండలినీ శక్తి జగత్తున కాధార భూతమగుటచేత సర్వ ప్రపంచము అందులో కలదని చెప్పబడినది.

శ్లో|| గుదస్య పృష్ఠ భాగేస్మిన్‌ (దేహేతు పశ్చమే భాగే)

వీణా దండస్య దేహభృత్‌

దీర్ఘాస్థి మూర్ధ్ని పర్యంతం

బ్రహ్మదం డీతి కథ్యతే

తస్యాంతే సుషిరం సూక్ష్మం

బ్రహ్మ నాడీతి సూరిభిః

ఇడా పింగళయో ర్మధ్యే

సుషుమ్నా సూక్ష్మ రూపిణీ

సర్వం ప్రతిష్ఠితం తస్మిన్‌

సర్వగం సర్వతో ముఖం

సుషుమ్నాం తర్గతం విశ్వం

తస్మిన్‌ సర్వం ప్రతిష్ఠితమ్‌

ఉత్తరగీత-2 ఆధ్యాయం

మేరువు లేక బ్రహ్మదండి యనబడు వెన్నెముక యందు 34 పూసలు కలవు (హల్లుల సంఖ్య34) పూసల దండలో దారమువలె వెన్నుపూసలలో సుషుమ్నా నాడి కలదు. దాని కిరుప్రక్కల ఇడా పింగళానాడులు కలవు. సుషుమ్నా నాడి బ్రహ్మాత్మైక ప్రతిపాదక మగుట బ్రహ్మనాడి అను పేరు గాంచినది. ఈ సుషుమ్నయే మనస్సును విషయముపైకి పోవునట్లు చేయును.

6) దేహమునందలి ఊర్ధ్వ అథః కుండలినులే ఆశ్వత్థము,

-------------------------------------------------------------------------

శంకరాచార్యులు రచించిన ప్రపంచసార తంత్రమునందు షట్చక్రములను వివరించునప్పుడు దేహము ఊర్ధ్వమూలము అధశ్శాఖము అని సూచింపబడినది. వెన్నెముక యందు షట్చక్రములు భ్రూమధ్యము వరకు కలవు ఇవి క్రింద పట్టికలో చూపబడినవి. ఇదియే అధః కుండలిని, భ్రూమధ్యము నుండి సహస్రారము వరకు ఊర్ధ్వకుండలిని కలదు. దానియందు 1) చంద్ర మండలము 2) అర్థచంద్రాకారము 3) రోధిని 4) నాదము 5) నాదాంతము 6) శక్తి 7) వ్యాపిక 8) సమనా 9) ఉన్మనా అను 9 చక్రములు కలవు.

బ్రహ్మ రంధ్రమునకు క్రిందుగానున్న సహస్ర కమలాం తర్గత చంద్రమండలము సర్వకారణ బిందువు. అదియే శివస్వరూపము; తేజోమయము పరమాత్మ; మూలము. ఈ విధముగ శరీరము ఊర్ధ్వ మూలమును అధః శాఖలను కలిగియున్నది. శరీరమువలె బ్రహ్మాండముకూడ నున్నది.

పైన వివరించిన మూలాధారాది షట్చక్రములు దేహమునందున్నవి. శ్రీ నృసింహ షట్చక్రోపనిషత్తునందు విశ్వకారుడైన శ్రీనృసింహస్వామి యొక్క షట్చక్రములు నారసింహ సుదర్శన చక్రమున అచక్ర సుచక్రాది షట్చక్రరూపమున చెప్పబడినవి. ఇవి బ్రహ్మాండము నందలి షట్చక్రములు (Cosmic Centres) అని Sir John Woodr off తెలిపియున్నారు.

7) బ్రహ్మాండమును వటవృక్షముతో కూడ పోల్చుచుందురు:-

బ్రహ్మాండమును అశ్వత్థముతోనే గాక వటవృక్షముతో పోల్చు సంప్రదాయము కలదు. శ్రీనృసింహ తాపిని ఉపనిషద్వ్యాభ్యాసమున శ్రీ విద్యారణ్యులు ఈ విధముగా తెలిపిరి.

ఒకే చైతన్యము నాశ్రయించిన మాయారూప అవిద్యయే కారణమగు ఈశ్వరోపాధిని కల్పించి ప్రపంచమును సృష్టించినది. కార్యమగు జీవోపాధిని కల్పించి పంచకోశాత్మక దేహోపాధులను సృష్టించినది. వటవృక్ష బీజరూప ఈశ్వరుని నుండి వటవృక్షరూప బ్రహ్మాండముత్పన్న మగుచున్నది. బ్రహ్మాండము ద్వారా హిరణ్యగర్భులు, త్రిమూర్తులు (త్రిగుణములు) కలుగుచున్నారు. ఈ త్రిమూర్తులద్వారా సమష్టి వ్యష్టిరూప జగత్తు, జీవులు, దేహోపాధులు కలుగుచున్నవి. వటవృక్షము విహంగాది ప్రాణులకు జీవనాధార మగునట్లే క్షేత్రము అనబడు జీవోపాధులు జీవుల కాధారము లగుచున్నవి. కారణ శక్తియగు మాయ ఒకే చై తన్యమును ఆ యా పంచభూతాత్మక దేహో పాధులయందు ప్రతిబింబింపజేసి నానావిధ జీవులను సృష్టింపజేయుచున్నది.

అశ్వత్థవృక్షము

చక్రములు పత్రములు ఆక్షరములు #9; శక్తి #9; భూతము స్థానము

1) మూలాధారము 4 వ, శ, ష, స డాకిని పృథివీ మండలం వెన్నెముక

క్రిందిభాగము

2) స్వాధిష్టానము 6 బ, భ, మ, య, ర, ల రాకిణి జలమండలం ఆపైన

3) మణిపూరము 10 డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, లాకిని అగ్నిమండలం నాభిస్థానము

4) ఆనాహతము 12 క, ఖ, గ, ఘ, జ, చ, ఛ, కాకిని వాయుమండలం హృదయము

జ, ఝ, ఞ, ట, ఠ

5) విశుద్ధము 16 అ, ఆ... ..... ..... ....అం, ఆః సాకిని ఆకాశమండలం కంఠము

షోడశ స్వరములు

6) ఆజ్ఞ 2 హ, క్ష హాకిని మనస్సు భ్రూమధ్యము

బీజమునందే వటవృక్షమంతయు నుండి బీజముకంటె వేరుకాని విధమున పరమేశ్వరుని యందే మాయయు ప్రపంచము ఉన్నది. అనగా కారణ కార్యరూపములు రెండు ఆపరమేశ్వరుడే.

జీవేశ్వరులను గూర్చి తెలుపుటకై ఉపనిషత్ర్పతిపాదితమైన ఒక కథ కలదు. ఒక రావిచెట్టుపై రెండు పక్షులు కలవు. ఒక పక్షి వృక్షముయొక్క ఫలములనుభక్షించుచున్నది. రెండవపక్షిసాక్షిగా సర్వమును చూచుచున్నది. అనగా కార్యమైన జీవుడు అవిద్య అనబడు మాయకు లోబడి ఇంద్రియలోలుడై ప్రపంచమున సుఖదుఃఖముల ననుభవించుచున్నాడు. కారణమైన ఈశ్వరుడు మాయకు లోబడక కేవలము సాక్షీమాత్రముగా చూచుచున్నాడని భావము.

8) వేదములు, పురాణములు బ్రహ్మాండ పిండాండసృష్టిని గూర్చి తెలుపుచున్నవి.

సృష్టి అంతయు మాయవలన త్రిగుణాత్మకముగా చేయబడినది. మాయ సత్వగుణముచే చైతన్యబ్రహ్మము నభివ్యక్తము చేయుచు బ్రహ్మాజ్ఞానమునకు హేతువగుచున్నది. రజోగుణముచే స్పందశక్తి రూపమై చలనాత్మకమైన నానావిధ భేదములకు, సంకల్పములకు, సృష్టికి, భేదజ్ఞానమునకు కారణమగుచున్నది. తమోగుణముచే ఆత్మ చైతన్యమునే ఆచ్ఛాదించి ఆత్మజ్ఞానము కలుగనీయక అజ్ఞానమునకు మూలకారణ మగుచున్నది. సత్వగుణముచే ఈశ్వరుని, రజోగుణము చే జీవులను, తమోగుణముచే బహువిధ ప్రపంచమును సృష్టించినది. వేదములు పురాణములు పై సృష్టిక్రమమునే తెలుపుచున్నవి ఋగ్య జుస్సామవేదములు త్రిగుణాత్మకములు (త్రైగుణ్య విషయా వేదాః భగవద్గీత). వేదార్థము సుబోధ మొనరించుటకు వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములు కూడ త్రిగుణాత్మకములే. విష్ణు. భాగవత, నారదాది పురాణములు సాత్వికములు. బ్రహ్మాండ బ్రహ్మవైవర్థాది పురాణములు రాజసములు. శివ, లింగ, మత్స్య ఇత్యాది పురాణములు తామసములు. ఈ అష్టాదశ పురాణములు బ్రహ్మపురాణముతో మొదలై, వానిమధ్యలో బ్రహ్మవైవర్త పురాణము, అంత్యమున బ్రహ్మాండపురాణ ముండుటచేత వరుసగా సృష్టికి పరబ్రహ్మ మూలమై వివర్తము చెంది త్రిగుణాత్మకమైన బ్రహ్మాండము సృష్ఠింపబడినట్లు చెప్పవచ్చును కదా. ఆనగా వేదములు పురాణములు త్రిగుణాత్మకమైన సృష్టివిద్యను తెలుపుచున్నవి.

9) పురాణములు వృక్షములతో పోల్చబడినవి.

భాగవత, భారత, రామాయణాది పురాణములు పారిజాత కల్ప వృక్షములతో పోల్చబడినవి. ఈ వృక్షములే సృష్టి రహస్యమును తెలుపు ఆశ్వత్థములు. ''లలిత స్కంధము'' అను భాగవత నిర్వచన పద్యమును మూడు అర్థములతో చెప్పవచ్చును.

1) అశ్వత్థము, వటవృక్షము, కల్పవృక్షము, బ్రహ్మవృక్షము ఇత్యాది వృక్షములచే పోల్చబడిన ఊర్ధ్వమూలము ఆధశ్శాఖమైన బ్రహ్మాండ సృష్టిపరముగ పోల్చవచ్చును.

2) వ్యష్టిగా జీవోపాధులైన దేహములందుగల నాడీమండల పరముగ పోల్చవచ్చును.

3) భాగవతము నిగమంబునున్‌ బోలె గాయత్రి విరాజితం బగుట గాయత్రిపరముగ పోల్చి చెప్పవచ్చును.

పై విషయములను రెండవ అధ్యాయమున భాగవత నిర్వచనముల యందు నిరూపించితిని.

పర్యవసాన మేమనగా భగవంతుడే త్రిగుణాత్మకుడై సగుణ రూపమున వివర్తముచెంది అశ్వత్థమును బోలిన బ్రహ్మాండమును సృష్టించెను. బ్రహ్మాండ పిండాండములకు ఏకత్వమును ప్రతిపాదించుటచేత పిండాండమైన దేహమునందలి నాడీమండలమే అశ్వత్థము. దీనినే కల్పవృక్షమని, పారిజాతమని, బ్రహ్మవృక్షమని, సంసార వృక్షమని పురాణములు చెప్పుచున్నవి.

''దేహో దేవాలయః ప్రోక్తః'' దేహమే దేవాలయము, దేహములోని నాడీమండలము ననుసరించియే దేవాలయ నిర్మాణము జరిగినది. ఉదాహరణమునకు తిరుపతి దేవాలయ నిర్మాణమును గమనింతము. అలమేలు మంగతాయారును కుండలినీ శక్తి గను, మంగా పురమునుండి కొండపైనున్న వెంకటేశ్వరస్వామిని చేరు కాలిబాటను షుమ్నానాడిగను భావింపవలయును. మంగాపురమున సూర్యుని దేవాలయము సూర్యుని కొలను కలదు. అక్కడనుండి కపిలతిర్థము మీదుగ కొండపై కిగల మార్గము సూర్యనాడి లేక ఇడానాడి. చంద్రగిరి యందు చంద్రునిదేవాలయము చంద్రుని కొలను కలదు. అక్కడ నుండి కొండపైన స్వామిని చేరగల మార్గము చంద్రనాడి లేక పింగళనాడి. శ్రీ వెంకటేశ్వరుడు సహస్రారాంతర్గత పరమేశ్వరుడు, పై విధముగా తిరుపతి దేవాలయము నాడీమండల స్వరూపమును సంకేత రూపమున వ్యక్తము చేయుచున్నది.

మన కర్తవ్యము:-

శ్లో|| ఏత చ్ఛిత్వాచ భిత్వాచ జ్ఞానేన పరమాసినా

తత శ్చాత్మరతిం ప్రాప్య యస్మాన్నా వర్తతే పునః

ఇట్టి అశ్వత్థవృక్షమును, బ్రహ్మాండ పిండాండముల యందును, సమష్టివ్యష్టుల యందును (Macrocosm, Microcosm) ఈశ్వరో పాధి జీవోపాధులయందును చక్కగా తెలిసికొని వివేకము అభ్యాస పాటవముచే పదునుపట్టిన వైరాగ్యమను ఖడ్గముచేత ఖండించి ఆత్మా భిన్నముగ గుర్తించుట మన కర్తవ్యము. దృశ్యమగు ప్రపంచము మిథ్య. అధిష్టానమగు బ్రహ్మము సత్యమని గ్రహింపవలయును. ఈ పరమ సత్యమును తెలుపుటకే పురాణములు అశ్వత్థాదివృక్ష సంకేతములతో పోల్చబడినవి. ఈ అభిప్రాయమునే పోతన ''లలతస్కంథ'' మను భాగవత నిర్వచన పద్యమున సూచించెను.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters