Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

విన్నపము

(ద్వితీయ భాగము)

రామాయణము మహాకావ్యము; భారతము మహేతిహాసము; భాగవతము మహా పురాణము. కావ్యేతిహాసము లైన రామాయణ భాగవతములు మానవునకు బాధ్యతాయుతమైన ప్రవృత్తి ధర్మము నెక్కువగా బోధించు చున్నవి. భాగవత పురాణము మోక్షధర్మమైన నివృత్తి ధర్మమును విధిగా ఆచరించవలెనని ఆదేశించు చున్నది. మానవునకు ప్రవృత్తి ధర్మము బాధ్యత, నివృత్తి ధర్మము విధి. ఈ గ్రంథము రెండవ భాగములో భాగవత కథలను వివరించి భాగవత భక్తులు కర్మ భక్తి ధ్యాన జ్ఞాన మార్గము లవలంబించి నివృత్తి ధర్మమును ఆచరించు విధానములను తెలుప బూనితిని.

భాగవతమున వ్యాసుడు మోక్షధర్మమును కర్తవ్యాకర్తవ్యము లైన విధి నిషేధరూపమున వివరించెను. వానిని సప్రమాణముగా భాగవతుల కథలచే నిరూపించెను. దానిచే శ్రోతలకు భాగవతధర్మము ననుసరించి తరించుటకు తగిన ప్రేరణ కలిగించెను. ''బాదరాయణుడు తా కల్పించె నేర్పొప్పగన్‌'' అను భాగవత వాక్యాధారముగ ఈ కథలను కల్పనా కథలని, ఆర్థవాదములని, కొందరు వాదించినప్పటికి శుకుడు వానిని క్రింది ప్రయోజనముల నుద్దేశించి చెప్పినట్లు భాగవతమున చివర తెలిపెను.

''విజ్ఞాన వైరాగ్య వివక్షయా''

అనగా పాథకులకు, శ్రోతలకు, విజ్ఞానము వైరాగ్యము కలిగించి, తద్వారా జీవన్ముక్తులను చేయుటకని అర్థము.

భాగవతము కేవలము భాగవతుల కథల సంపుటి మాత్రమే కాదు. ''ఉత్తమ శ్లోక చరితము'' ''ఉత్తమఃపురుషస్తస్య పరమాత్మే త్యుదాహృతమ్‌'' అను భగవద్గీతా వాక్యము సూచించినట్లు భాగవతము పురుషోత్తముడు. పరమ పురుషుడు నైన భగవంతుని చరిత్రముకూడ.

ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్రియః

జ్ఞాన వైరాగ్యయో శ్చైవ షణ్ణాం భగవతిరితః''

''భగ'' శబ్దము ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రియము, జ్ఞానమ, వైరాగ్యము అను వానిని సూచించును. పై లక్షణములు కలవాడే భగవంతుడు. అట్టి శ్రీకృష్ణ భగవానుడు అవతారమును చాలించగనే కలియుగము ప్రవేశించినది.

ధర్మ వృషభము యొక్క నాలుగు పాదములలో మూడు పాదములు నశించి ఒక పాదము మిగిలినది. ఈ సందర్భమున వ్యాసుడు నివృత్తి ధర్మ ప్రబోధకమైన భాగవత పురాణమును వ్రాసెను. దీనికి ముందు ప్రవృత్తి ధర్మము ప్రభోదించుటకై భారతమును వ్రాసెను. భారతములో వేదోపనిషత్తుల సారమైన భగవద్గీతలోని సిద్ధాంతములకు భాగవత కథల రూపమున దృష్టాంతముల సమకూర్చెను. పాఠకులీ కథలను కేవల కల్పనా కథలని భావింపరాదని ఈ కథల సంకేతార్థము లను ఈ భాగమున వివరింప బూనితిని.

ఇంకను ఈ భాగమునందు

1. భగవ దవతార తత్త్వము

2. షట్‌ దర్శనములకు భాగవత భగవద్గీతలకు గల సంబంధము

3. భాగవత కల్పవృక్ష సంకేతము

4. పోతన మహాకవి ప్రశంస-ప్రతిజ్ఞ

అను అంశములను అనుబంధముగా వివరించితిని.

భాగవతామ్నాయము భువన క్షేమంకరము. ఈ ఆమ్నాయమును విన్నచో ''భవములందప్పింపగా జాలుభక్తివిశేషంబు జనించు''ను. నిగమములు వేయి చదివినను ముక్తి మార్గము సులభముగా గోచరింపదు. త్రిజగన్మంగళ##మైన భాగవతము పఠించు వారికి ముక్తి కరతలామలక మగును.

క|| నిగమములు వేయి చదివిన

సుగమంబులు కావు భక్తి సుభగత్వమునన్‌

సుగమంబు భాగవత మను

నిగమంబు బఠింప ముక్తి నివసనము బుధా

భాగవతము 1-140

భాగవతశ్రవణము వలన ''విష్ణుసేనా బుద్ధి విస్తరిల్లు, మోక్షకాముకునకు మోక్షంబు సిద్ధించు. భవభయంబు లెల్లబాసిపోవు'' (భాగవతము 2-7) అని శుకుడు పరీక్షిత్తునకు తెలిపెను.

బోయినపల్లి వెంకటాచార్య ప్రణీతమైన ''శ్రీ మద్భాగవత మాహాత్మ్య'' మను పద్యకావ్యములో యోగజ్ఞానములు భక్తిచేతనే వికసించుననియు భాగవత శ్రవణము ప్రేతత్వ విముక్తి కలుగజేయు ననియు కధల మూలకముగా చెప్పబడినది.

బ్రహ్మ భాగవతము నిట్లు వర్ణించెను. ''నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్రరాజి గరిష్ఠంబగు నీ పురాణకథ

భాగవతము 2-212

భువన క్షేమంకరంబైన భాగవతామ్నాయమును బాదరాయణుడు నేర్పొప్ప కల్పించెను.

భాగవత ప్రతిపాదిత భగవ దవతార తత్త్వమును గ్రహించి కథలలోని కలి సంతారకమైన భాగవత ధర్మము ననుష్ఠించిన మానవుడు మోక్ష సామ్రాజ్యమునకు రాజశేఖరుడై సాయుజ్యముక్తిని గాంచ గలడు.

ఇట్లు

భాగవత విధేయుడు

మామిళ్ళపల్లి నరసింహం

గ్రంధకర్త.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters