Atma Vidya Vilasamu Chapters Last Page
మండలిమాట
పరమశివేన్ద్ర కరామ్బుజ
సంభూతాయ - ప్రణమ్ర వరదాయ,
పదధూత పఙ్కజాయ
ప్రణతిం కుర్మః సదాశివేన్ద్రాయ.
దాదాపు రెండువందల సం||ల వెనుక నెరూరు అగ్రహారములో (తమిలదేశము - కరూరు నగర సమీపము) ఉదయించి, కావేరీ తీరదేశమునెల్ల తన దివ్యదీధితి ప్రసారముచే వెలయింపజేసిన జ్ఞానభాస్కరులు శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర సరస్వతులు.
ఆనాడు కుంభఘోణములోనున్న శ్రీ కంచి కామకోటి పీఠమునకు అధిపతులైన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ పరమ శివేన్ద్ర సరస్వతీ మహాస్వామివారు వీరి గురువులు.
మహాపండితులైన సదాశివులు అభ్యాస వైరాగ్యముచే శ్రీగురుకరుణాకటాక్షముచే శరీరేంద్రియతాదాత్మ్యము ఇంచుకయు లేనివారై - అవధూతలై - నడయాడు పరబ్రహ్మమై - కావేరీ పులినతలములయందు ఉన్మత్తునివలె సంచరించినారు.
ఉన్మత్త వత్సఞ్చ రతీహ శిష్యః
తవేతి లోకస్య వచాంసి శ్రుణ్వన్,
ఖిద్యన్ను పాచాస్య గురుః పురాహూ
హ్యున్మత్తతా మే నహి తాదృశీతి.
-శ్రీసచ్చిదానన్ద శివాభినవ నృసింహ భారతీస్వామి.
లోకమున పండితులుందురు. వారు యోగులు కారు. యోగులుందురు. వారు పండితులు కారు. మహాయోగులై - మహాపండితులైన వారు చాల అరుదు. శ్రీసదాశివ బ్రహ్మేంద్రులు అట్టి అరుదైన మహనీయులు.
సదా బ్రహ్మనిష్ఠులై - శరీరస్మృతి లేశమును లేనివారై - కావేరీతీరమునెల్ల తమ సంచారముచే పావన మొనరించిన యీ మహాత్ములు అప్రయత్నముగ బ్రకటించిన సిద్ధులు అనేకములు. అంతేకాదు, సిద్ధాంతకల్పవల్లి, బ్రహ్మసూత్రవృత్తి, పాతంజలయోగ సూత్రవృత్తి, మున్నగు ఉద్గ్రంథముల నెన్నిటినో రచించినారు.
ఆ మహనీయులు రచించిన వన్నియును ఉద్గ్రంథములే. వానియందు ఈ ఆత్మవిద్యా విలాస మొకటి.
ఆత్మవిద్యాసంపన్నుని యందు సాక్షాత్కరించు మహా వైభవ విలాసములు ఇందు చక్కగా వివరింపబడెను.
'పరిణతపరాత్మ విద్యః
ప్రపద్యతే సపది పరమార్థం'.
అని సదాశివులే - ఈ గ్రంథమును నిత్యమును బఠించువాడు ఆత్మ విద్యాసంపన్నుడై బ్రహ్మానుభవముచే బ్రకాశించును - అని చెప్పియున్నారు.
కూలంకషముగా అనుభవసిద్ధమైన విషయమును జెప్పుట వేరు. అనుభవసిద్ధముకాని విషయము నాయా గ్రంథముల సాయముతో వివరింప బూనుకొనుట వేరు.
శ్రీ సదాశివులు తమకు నిత్యానుభవ సిద్ధమైన విషయమునే ఇందు వివరించియున్నారు. అందుచే ఇందలి ప్రతి శ్లోకము, ప్రతిపదము అద్భుత దివ్యకాంతులను వెదజల్లుచుండు ననుటలో సందేహము లేదు.
ఇతర వేదాంత గ్రంథము లెవ్వియును దీనికి సాటికావు. ఇది ఆదిశంకరుల గ్రంథరత్నములతో సరితూగగల అద్భుత గ్రంథము. ఇది సర్వోపనిషత్సారము.
సాధకజనోపయోగి గ్రంథ శ్రేష్ఠములను వెలువరించి, పాఠకుల కరకమలముల యందుంచు పనిలో నిమగ్నమై యున్న మా మండలి- జ్ఞాననిథానము లయిన శ్రీసదాశివుల గ్రంథము లను తగిన అనువాదవివరములతో బ్రకటించుటకు సంకల్పించి -
ఇదివరకే శ్రీవారి రచనలను మూడింటిని ఒక గ్రంథముగా అచ్చువేయుట జరిగినది. ఆత్మవిద్యావిలాసము నిపుడు ప్రకటించుచున్నాము. ఈ గ్రంథమును జదువుకొని శ్రేయమొందుటలో ఏవిధమైన క్లేశము పాఠకులకు గలుగరాదని - తాత్పర్యమే కాక విస్తృత వివరమునుగూడ 'శంకరకింకరుడు' అనెడి పేరుతో వ్రాసి పొందుపరచిన - నా సోదరుని ఆశీర్వదించు చున్నాను.
సదాశివుల రచనలే కాక - వారియొక్క విస్తృతమైన జీవితచరిత్రనుగూడ ఒక ప్రత్యేక గ్రంథముగా అచ్చువేయవలయునని మండలియొక్క సంకల్పము
శ్రీ స్వామి యొక్క ఈ ''ఆత్మవిద్యావిలాసము''ను తాత్పర్య వివరములతో సాధక భక్తలోక సమ్ముఖమం దుంచవలయునని సహృదయులైన ఒక శివభక్తాగ్రణులయొక్క ఆర్థిక సహాయ ప్రేరణముచే ఈ గ్రంథమును అచ్చువేశినాము. వారు సదాశివుల అనుగ్రహమును పొందుదురుగాక!
శ్రీచరణుల మిగిలిన గ్రంథముల నన్నిటిని యథా శీఘ్రము వెలువరించుటకు దగిన శక్తియుక్తులను అనుగ్రహింపుడనుచు -
బ్రహ్మీభూతులగుటచే సర్వదేశ సర్వకాలములయందును అందరకును నిత్యసన్నిహితులై యున్న శ్రీ సదాశివబ్రహ్మేంద్ర సరస్వతులను బ్రార్థించుచున్నాము.
భావ-శంకర జయంతి బులుసు సూర్యప్రకాశశాస్త్రి
తెనాలి. వ్యవస్థాపకుడు : సాధన గ్రంథ మండలి.