Acharyavaani - Vedamulu Chapters Last Page
1. వైదిక మతమునకు ప్రామాణిక గ్రంథము
ఈ రోజులలో ఎన్నో విభిన్నమైన విషయాల గురించి ఎన్నో గ్రంథాలున్నాయి. ప్రతి మతం గురించీ ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి. ప్రతి మతానికీ ప్రధానమైన గ్రంథమంటూ ఒకటి ఉంటుంది. ప్రతి ధర్మానికీ ఒక స్థాపకుడున్నాడు - ఆయన రచనలకీ, ప్రవచనాలకీ ఆ మతంలో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ మతస్థులు తమ మతస్థాపకుని గ్రంథమే ప్రామాణికమైనదనీ, అనుసరణీయమైనదనీ విశ్వసిస్తారు. కొందరు అటువంటి గ్రంథాన్ని ఆరాధిస్తారు, దేవాలయాలలో పెట్టుకొని పూజిస్తారు. ఉదాహరణకి - సిక్కులు. ఈ విధంగా తమ పవిత్రగ్రంథాన్ని ఎంతో ఆదరంతో ''గ్రంథ్ సాహెబ్'' అని చెప్పుకుంటారు. అట్లాగే ప్రతి మతమూ ఒక గ్రంథాన్ని ఎంచుకొని ఆ గ్రంథమే ముక్తి మార్గాన్ని చూపిస్తుందనీ, ఆత్మోన్నతిని కలిగిస్తుందనీ నమ్ముతుంది. ఆ గ్రంథం ఆ మతస్థాపకుని పేర వెలసినా అందులోని మాటలు భగవద్వాణి అనీ, భగవదాదేశమనీ అవి ఆ మతస్థాపకుని ద్వారాగాని, ప్రవక్తద్వారాగాని, బహిర్గతమైనవనీ ఆ మతస్థులు నమ్ముతారు. అందువల్ల వాటిని ''బహిర్గతమైన వాక్కులు'' అంటారు. హిందువులమైన మనం మన పవిత్ర గ్రంథాలైన వేదాలను ''అపౌరుషేయము'' లంటాం. ఇవి మానవునిచే రచింపబడినవి కావనీ, భగవంతుని వాక్కును ప్రచారంలోకి తీసుకురావటానికి మానవుడు సాధనం మాత్రమే అయాడనీ దీని భావం.
ఏ మతానికైనా ప్రాతిపదిక అనదగ్గ సాధికారకమైన గ్రంథమేది అని ప్రశ్నిస్తే అన్యమతస్థులు నిస్సంకోచంగా సమాధానాలు చెప్తారు. క్రైస్తవులు ''బైబిల్'' అంటారు, మహమ్మదీయులు ''కొరాన్'' అంటారు, బౌద్ధులు ''ధమ్మపద'' మంటారు, పార్శీలు ''జెండ్ అవెస్టా'' అంటారు. కాని హైందవులమైన మనమిటువంటి సమాధానమీయలేం. మనకి అటువంటి గ్రంథమంటూ ఒకటి లేదు, అటువంటి గ్రంథ రచయిత అంటూ ఒకడు లేడు.
కొందరు రామాయణాన్ని మన పవిత్ర గ్రంథంగా చెప్పుకొంటే, మరికొందరు భగవద్గీతని చెప్పుకొంటారు. ఇంకా కొందరు వేదాలను మనకు శిరోధార్యాలైన గ్రంథాలుగా చెప్పుకొంటారు. అన్ని కాలాలలోనూ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఈ విభిన్నాభిప్రాయాలకీ, ఈ అస్తవ్యస్తతకీ కారణమొకటి ఉంది: అన్యమతస్థులకి తప్పనిసరిగా మతపరమైన విద్యాబోధన చేసే ప్రాథమికమైన గ్రంథమొకటి ఉంది. కాని హైందవులకు ప్రాథమికమైన ధార్మిక విద్యాబోధన అంటూ లేమీ లేదు. ఈ కారణం వల్లనే మనం మన మత గ్రంథాలని విమర్శిస్తూంటాం, కించపరుస్తూనూ ఉంటాం. ఇతర మతస్థులు తమ మతగ్రంథాలను కాపాడుకొంటారు, గౌరవంగా చూసుకొంటారు; అంతేకాక, తమకి భిన్నమైన మతాల సూత్రాలని ఆక్షేపిస్తూంటారు.
ఇతర మతస్థుల వలె మనకి కూడ చిన్న వయస్సులో మన ముఖ్యమైన మత గ్రంథాల గురించి బోధన ఉండి ఉంటే మనం మన పవిత్రగ్రంథాలను శంకించం. వాటి గురించి ఇంత అజ్ఞానంతోనూ ఉండం.
మనకి మన మతమంటే ఏమిటో తెలియాలి. దీనికి మన పవిత్రగ్రంథాలే కదా సాధనం? కాని అంతకంటె ముఖ్యం, మతం యొక్క ఆవశ్యకతని తెలుసుకోవటం. మతమంటే కేవలం కర్మకాండకాదు. మతమంటే ధర్మం. ధర్మమంటే ఏమిటి? దేని ఆచరణ వల్ల మనకి సంతృప్తీ, సంతోషమూ కలుగుతాయో అదే ధర్మమంటే. ధర్మమంటే ఏమిటో తెలుసుకోవాలన్నా, ధార్మిక సూత్రాలని తెలుసుకోవాలన్నా మనం కొన్ని గ్రంథాలని అధ్యయనం చెయ్యాలి. అటువంటి గ్రంథాలని ''ధర్మ ప్రమాణాలు'' అంటారు. ''ప్రమాణ'' మంటే సత్యాన్ని నెలకొల్పేది అని అర్థం. అంటే, ''ధర్మప్రమాణ''మన్న పదానికి అర్థం, ధర్మం గురించి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించేది అన్నమాట. నిజమైన ధర్మం గురించి చెప్పే పవిత్ర గ్రంథాలేమిటి?
''అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః
పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతా శ్చతుర్దశ''
ఇవి పధ్నాలుగు - నాలుగు వేదాలు, (అంటే ఋక్, యజుః, సామ, అధర్వ) ఆరు వేదాంగాలు అంటే వేదాలకు అనుషంగాలు (ఇవి శిక్ష - శబ్ద శాస్త్రము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము. భాషా శాస్త్రము, జ్యోతిషము, కల్పము) నాలుగు ఉపాంగములు. మీమాంస అంటే వేదాలకి వ్యాఖ్య, న్యాయం అంటే తర్కం. పురాణం, ధర్మశాస్త్రం - అంటే వర్తనకి సంబంధించిన నియమాలు. వీటిలో విజ్ఞానం, వివేకం నిక్షిప్తమై యున్నాయి. అందువల్లనే ఈ పధ్నాల్గింటినీ విద్యాస్థానాలంటారు.
వీటికి ఉపాంగాలంటూ ఇంకో నాల్గింటిని చేర్చవచ్చు. ఇవి వేదాంగాలకి అనుబంధాలు. ఇవి (1) ఆయుర్వేదం - జీవితానికి సంబంధించిన శాస్త్రం, (2) అర్థశాస్త్రం - సంపదకీ, అర్థానికి సంబంధించిన శాస్త్రం, (3) ధనుర్వేదం - అస్త్రాలకీ, యుద్ధానికీ సంబంధించిన శాస్త్రం, (4) గాంధర్వవేదం - సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళలకి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు.
మన మతానికి గుండెకాయ అని చెప్పదగ్గవి చతుర్వేదాలు. అవే అతి ప్రమాణాలు. ఆరు వేదాంగాలు, నాల్గు ఉపాంగాలు కూడా వేదాలమీదే ఆధారపడ్డాయి. ఇవి వేదాలని అర్థం చేసుకోవటానికి వీలుగా ఉండే అనుబంధాలు. వేదాలను ఈ ఆరు అంగములతో, నాలుగు ఉపాంగములతో కలిపి అధ్యయనం చెయ్యాలి.
ఆది లేదు - కర్తలేడు iM
వేదాలు ''అనాది'' - అంటే కాలపరిమితిలో ప్రారంభమంటూ లేనివి. వాటికి పూర్వంగాని, వాటికంటె ముందు వచ్చినవి గాని ఏమీ లేవని అర్థం. అంటే, ఇవి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయన్నమాట. కాని దీనిని ఒప్పుకోవటమెట్లా? ఏ గ్రంథానికైనా కనీసం ఒక్కడైనా రచయిత అంటూ ఉండాలికదా? ఓల్డ్ టెస్ట్‌మెంట్ (Old Testament) ఎందరో ప్రవక్తల ప్రవచనాల సంకలనం. కొరాన్ - మహమ్మదు ప్రవక్త ప్రచారం చేసినది. ఈ వ్యక్తులు ఎప్పుడో ఒకప్పుడు ఉండేవారు. వారికి పూర్వం వారి ప్రవచనాలు లేవు. ఈ విధంగా చూస్తే వేదాలకి కూడా ఎప్పుడో ఒకప్పుడు సజీవులైన రచయితలుండి ఉండాలి కదా. వారికి పూర్వం ఈ బోధనలు అలభ్యములే కదా. ఇది ఎంత ప్రాచీనమైనదైనా అయి ఉండవచ్చు. కాబట్టి వేదాలను 'అనాది' అనటం సమంజసం కాదని కొందరి వాదం. వేదాలను మానవులే రచించారనుకుంటే, ఇటువంటి వాదనలు సహేతుకంగానే కనబడతాయి. ఎవ్వరూ వ్రాయక పోతే, గ్రంథమంటూ ఒకటి ఎట్లా వస్తుంది? రచయిత అన్నవాడు లేకపోతే, గ్రంథమంటూ ఉండదు. ఆ రచయిత ఎప్పుడో ఒకప్పుడు సజీవుడై యుండి ఉండాలి. మామూలుగా చూస్తే ''గ్రంథానికి రచయిత లేడు'' అన్న వాదానికి ఏమీ బలంలేనట్టు కన్పిస్తుంది.
అందువల్ల, ఎంతో ప్రగతిని సాధించిన ఋషులనబడే వ్యక్తులు వేదాలను రచించారన్న వాదాన్ని లేవనెత్తారు. వేదాలలో ఎన్నో సూక్తులున్నాయనీ, ఇవి కొందరి ఋషుల వాక్కులనీ అన్నారు. వేదాలలోని మంత్రాలని జపించేప్పుడు, ఆ వేద పాఠానికి సంబంధించిన ఋషిపేరుగాని, ఆ మంత్రం యొక్క ఛందస్సు పేరుగాని, ఆ మంత్రానికి గల అధిష్ఠాన దేవత పేరుగాని చెప్పటం పరిపాటి. వేదమంత్రాలు ఎందరో ఋషులను పేర్కొంటాయి. అందువల్ల వారందరూ కర్తలేనన్న భావం నెలకొన్నది. ఒకోసారి ఋషి యొక్క వంశానుక్రమం కూడా చెప్పటం కద్దు. దీని వల్ల ఒకే పేరుగల యిద్దరు ఋషులను విడివిడిగా గుర్తించటం తేలిక. ఉదాహరణకి ''అగస్త్యోమైత్రావరుణి'' అంటే, మిత్ర, వరుణుల కుమారుడైన అగస్త్యుడని తెలుస్తుంది. అయితే, మంత్రం ఒకరిపేరున ఉంటే ఆయనే కర్త అనుకోవాలి కదా? అంటే, ఆయనకి పూర్వం ఆ వేదమంత్రం లేదని ఋజువు కాదా? అటువంటప్పుడు, వేదం ''అనాది'' అని ఎట్లా అనగలం? అసలు రహస్యమేమిటంటే - ఈ ఋషిగాని, ఆ ఋషిగాని, ఏ ఋషీగాని వేదమంత్రాలని కూర్చలేదు. అందువల్లనే ఏ ఋషులూ వాటి కర్తలు కారు.
వేదాలు అపౌరుషేయాలు - అంటే పురుషప్రమేయం లేనివని అర్థం. ''పౌరుషేయ'' మంటే మానవ కల్పితం. వేదాలు మానవకల్పితాలు కానందువల్ల ఏ ఋషీ వాటిని రచించియుండడు. వారే వ్రాసి ఉంటే ఋషులను మంత్ర కర్తలనవచ్చు. కానీ వారిని మంత్ర ద్రష్టలంటాము. అంటే, మంత్రాలను దర్శించిన వారన్నమాట. దీని అర్థమిది ః ఋషులు మంత్రాలను కనుగొన్నారు, లేక చూచారన్నమాట. వాటిని రచించలేదు, సృష్టించలేదు.
కొలంబస్ అమెరికాను కనుగొన్నాడన్న మాటకి అర్థం ఏమిటి? అతడు అమెరికాను సృష్టించాడనా? కానేకాదు. ఉన్న అమెరికాను మిగిలిన లోకం దృష్టికి తీసుకువచ్చాడు. న్యూటన్, ఐన్‌స్టైన్ వంటి శాస్త్రజ్ఞులు భౌతిక నియమాలను కొన్నిటిని ప్రతిపాదించి ప్రసిద్ధులైనారు. అంతేకాని వారే ఆ నియమాలను సృష్టించలేదు. భూమ్యాకర్షణ వల్లనే కదా న్యూటన్‌కి పూర్వం కూడ వస్తువులు క్రింద పడేవి; ఆయన దానిని కనుగొన్నాడు. అంతే. ఈ శాస్త్రవేత్తలు ఉన్న ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని లోకానికి మొట్టమొదటిసారిగా చెప్పారు. ఆ విధంగానే సంస్థితమైన మంత్రాలను ఋషులు గ్రహించి, లోకానికి చెప్పారు. మంత్రాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఋషులు వాటిని కనుగొనటం వల్ల, ఆ మంత్రాలకు వారి పేర్లను జోడించారు. అప్పటికే ఉండి, అజ్ఞాతంగా మిగిలిన వేదమంత్రాలని మానవలోకానికి ఎరుకపరచిన ఘనత ఋషులకు దక్కుతుంది. అందువల్లనే వారి పేర్లను చెప్పేప్పుడు మనం వారి స్మృతికి గౌరవసూచకంగా శిరస్సుతో నేలను తాకుతాం. వారు చేసిన మహత్కార్యానికి నివాళి యిది. మంత్రాన్ని ఉచ్చరించటానికి పూర్వంకూడ ఈ భావంతోనే వారి పేర్లను పేర్కొంటాం. ''ఋషులు మంత్రాలను కనుగొన్నార''న్నప్పుడు వారు కనుగొనక పూర్వమెక్కడ ఉండేవి? ''అనాది'' అంటే అవి ఎప్పుడూ ఉండేవని అర్థమా? ఉంటే, ఎక్కడ ఉండేవి? అంతరిక్షంలోనా?
సృష్టితో బాటే వేదమంత్రాలు కూడా ఆవిర్భవించాయి అనుకొంటే, సృష్టికర్త వాటిని కూడా జగత్తుతో బాటే సృష్టించాడని అర్థం కాదా? అంటే, భగవంతుడు వేదాలను రచించి, ఋషులు క్రమంగా కనుగొనటానికి వీలుగా ఎక్కడైనా దాచిపెట్టాడా? అయినా, సృష్టితో బాటే వేదాలు కూడా ఉద్భవించాయంటే అవి ''అనాది'' ఎట్లా అవుతాయి? ఇప్పటి బ్రహ్మసృష్టిని కొలవటం సాధ్యమే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనబడే ఈ యుగాలకు నిర్ణీతమైన కాల పరిమితులున్నాయి. ఇటువంటి యుగక్రమాలు వెయ్యి జరిగితే బ్రహ్మకి ఒక పగలు క్రింద లెక్క. అట్లాగే ఇంకొక వెయ్యి జరిగితే బ్రహ్మకి ఒక రాత్రి. ఈ విధంగా చూస్తే బ్రహ్మవయస్సిప్పుడు ఏభై సంవత్సరాలే. బ్రహ్మ ఆయుర్దాయం నూరు సంవత్సరాలు. ఈ బ్రహ్మకి పూర్వము మరొక బ్రహ్మ ఉండేవాడు. అందువల్ల ఇప్పటి బ్రహ్మా, అతని సృష్టీ 'అనాది' కాదు. అయితే ఏది ''అనాది''? పరమాత్మ అందరి బ్రహ్మలకంటే ముందే ఉండి ఉండాలి. బ్రహ్మం - అంటే నిరాకారుడైన భగవంతుడు, ఎల్లప్పుడూ ఉంటూనే ఉండాలి. ఆయన నిత్యుడు. విశ్మమూ, పదార్థమూ సృష్టింపబడటమూ, లయ మొందటమూ ఆయన వల్లనే. పరమాత్మ తన సృష్టికార్యాన్ని బ్రహ్మతోనూ, సృష్టి సంస్థితిని విష్ణువుతోనూ, సృష్టిలయాన్ని శివునితోనూ చేయిస్తాడు. బ్రహ్మ, విష్ణు, శివులుకూడా లేకుండా పోతారు. అందువల్లనే బ్రహ్మ వయస్సుని లెక్కకట్టవచ్చు. తన నూరు బ్రహ్మవర్షాలూ ముగిసిన తరువాత బ్రహ్మ పరమాత్మలో లీనమవుతాడు. అప్పుడు మరొక బ్రహ్మ అందుకుంటాడు.
మళ్లీ వేదాల సంగతి చూద్దాం. పరమాత్మ వేదాలను, బ్రహ్మలకు పూర్వం, అంటే సృష్టికే పూర్వం, సృజించాడా?
సృష్టికి పూర్వమే వేదాలుండేవనీ, బ్రహ్మ తన సృష్టిని శబ్దరూపంలో సంస్థితమై యున్న వేదమంత్రాలతోనే కొనసాగించాడనీ - శాస్త్రాలవల్ల మనకి తెలుస్తుంది. శ్రీ మద్భాగవతంలోని బ్రహ్మ సృష్టి గురించిన వివరణను బట్టి ఈ విషయం తెలుసుకోవచ్చు.
అంటే పరమాత్మా, వేదాలూ అనాది అనుకోవచ్చా? కొంచెమాలోచిస్తే ఇదీ తప్పేనని తోస్తుంది. జగత్సృష్టికి పూర్వమే పరమాత్మ వేదాలను సృష్టించాడనుకొంటే, అవేవీ సృష్టింపబడక పూర్వం కొంత కాలం గడచినట్టే కదా - అంటే జగత్సృష్టికి పూర్వం భగవంతుడు కాలాన్ని సృష్టించాడన్నమాట, ఆ తరువాతే వేదాలను సృష్టించి నట్టు అర్థం వస్తుంది, అటువంటప్పుడు వేదాలు ''అనాది'' అని ఎట్లా అనగలం?
తానూ, వేదాలూ 'అనాది' అయితే భగవంతుడు వేదాలను సృష్టించి యుండలేడు. ఆయనే సృష్టించి ఉంటే వాటికి మొదలు అంటూ ఒకటి ఉంటుంది. అన్నీ ఈశ్వరసంభూతాలే. ఈశ్వరునికి వెలుపల ఏమీ లేనందువల్ల - ఈశ్వరుడూ, వేదమూ ఒకరితో బాటు ఒకరు ఆరంభమంటూ ఏమీ లేకుండా ఉండి ఉండాలి. కాని ఇది సరియైనదిగా తోచదు. ఈశ్వరసృష్టికాకుండా, ఈశ్వరుని పై ఆధారపడని ఉనికి లేకుండా, ''అనాది'' ఎట్లా సాధ్యం?
ఈ గందరగోళానికి సమాధానము వేదములోనే యున్నది. బృహదారణ్యక ఉపనిషత్తులో (2.4.10) ఇట్లా ఉంది. వేదం - ఋక్, యజుః, సామరూపాలలో - ఈశ్వరుని ''నిశ్వాసితం'' మాత్రమే. ''నిశ్వాసిత'' మన్న మాటకి అర్థం ఊపిరి విడవటమని. ఊపిరి లేకుండా ఉండగలమా? ఆ విధంగానే వేదాలు పరమాత్ముని ఊపిరేనన్నమాట. ఆద్యంతాలు లేని పరమాత్మ నిత్యుడే అయితే, ఆయన యొక్క ఊపిరేఅయిన, వేదాలు కూడా అనాదే - ఆయనతో బాటే అవి సంస్థితమై ఉంటాయి.
ఇక్కడ గమనించవలసిన విషయమిది : భగవంతుడు కూడా వేదాలను సృష్టించలేదని. మన ఊపిరిని మనమే కల్పించుకొన్నామనలేం కదా. మనం పుట్టినప్పటి నుండీ ఊపిరి ఉంటూనే ఉంది. ఆ విధంగానే ఈశ్వరుడూ, వేదాలూను. ఆయన కూడా వేదాలను సృష్టించాడనలేము. రెండూ ఎప్పుడూ కలిసే ఉన్నాయి.
వేద భాష్యాన్ని వ్రాసిన విద్యారణ్యులు తన గురువు సాక్షాత్తూ ఈశ్వరుడే నంటూ, ఆయన యొక్క ''నిశ్వాసమే వేదాల''ని స్తుతించాడు. విద్యారణ్యులవారు భాష్యంలో తన గురువు వేదాలలో ఎట్లా లీనమై పోయారో వర్ణించటమే కాక వేదాలు ఈశ్వర సృష్టి కావని కూడ నొక్కి చెప్తారు.
గీతలో కృష్ణ భగవానుడు ''వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః'' అంటాడు - అంటే వేదాల వల్ల తెలియనగు వానిని నేనే అని అర్థం. అంతేకాదు, వేదాలను తాను సృష్టించిన వానిగా చెప్పుకొనక, వేదాంతానికి విషయమే తానంటాడు ''వేదాంతకృత్'' అంటాడు, ''వేదకృత్'' అనడు. వేదాలన్నీ తనకి తెలుసునంటాడు - వేదవిద్. వేదాంతంలో ఊహింపబడిన కేవలస్థితిలో సృష్టికి పూర్వమే ఈశ్వరుడూ, వేదాలూ కలిసి ఉండేవి.
గీతలో వలె భాగవత పురాణంలో కూడా వేదాలను భగవంతుడు కల్పించినట్లుగా ఎక్కడా లేదు. ఆయన హృదయంనుండి విస్ఫుట మయ్యాయని ఉంది. స్ఫుటమవటమంటే ఉన్నదేదో హఠాత్తుగా బయటపడటమని అర్థం. అంతకు పూర్వం లేనిది క్రొత్తగా వచ్చిందని అర్థం కాదు. మొట్టమొదటగా జనించిన బ్రహ్మే ఆది ఋషి. ఆయనకే అన్ని వేదమంత్రాలూ ఎరుక. ఈ ఎరుక కల్పించిందీ ఈశ్వరుడే. ఎట్లా? బ్రహ్మ నేర్చుకోవాలని ఉచ్ఛరించాడా? కాదు. తన హృదయం ద్వారా ఇచ్చాడు. భాగవత పురాణంలోని మొదటి శ్లోకంలో ''తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే.'' అంటే ఈశ్వరునిలో వేదాలు ఎప్పుడూ, ఆయన శ్వాసగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈశ్వరుని సంకల్పం వల్ల బ్రహ్మకి వాటి గురించి ఎరుక కలిగింది. ఈశ్వరుని హృదయకంపనల మార్గ దర్శకత్వంలో తన సృష్టిని కొనసాగించాడు బ్రహ్మ. ఇది సాధ్యమా? కంపనలు అంత పని చెయ్యగలవా?
* * *