Acharyavaani - Vedamulu     Chapters   Last Page

10. వేదమునకూ వేదాంతమునకూ సంఘర్షణ ఉన్నదా?

కర్మకాండ విభాగంలో క్రతువుల నిర్వహణ గురించి చెప్పబడింది. కాని జ్ఞానకాండ విభాగంలో, అంటే ఉపనిషత్తులలో, వీటన్నింటినీ విడిచి పెట్టమని ఉంది. కర్మకాండలో మనుష్యులు దేవతారాధన చెయ్యాలని ఉండటమేకాక ఆ ఆరాధనా విధానానికి కూడ వివరణ ఉంది. ఉపనిషత్తులలో యజ్ఞాలని నిర్వహించే వాడు అజ్ఞానపు పశువని కూడా ఉంది. రెండూ వేదాలలో భాగాలే!

వేదారంభంలో ఉన్న విషయాలే చివరి భాగంలో ఖండింపబడుతాయి. ఇది ఆశ్చర్యదాయకమైన విషయం.

ఒకవైపు కర్మాచరణముంటే రెండవ వైపు అంతా జ్ఞానమార్గము దానికి పూర్తిగా భిన్నం. అందువల్ల మామూలు వాడుక భాషలో వేదాలంటే కర్మకాండ అనీ, వేదాంతమంటే (ఉపనిషత్తులు) జ్ఞానకాండమనీ స్థిరపడి పోయాయి.

భగవద్గీతలో కృష్ణభగవానుడు పదేశించినది వేదాంతమే. గౌతమబుద్ధుడూ, మహావీరుడూ వేదాలలోని కర్మకాండను ప్రతిఘటించిన వారిలో ఆద్యులని సాధారణంగా అంటారు. కాని ఇది వాస్తవం కాదు. వీరిద్దరి కంటే ముందు శ్రీకృష్ణుడే ఆ పని చేశాడు. కృష్ణభగవానుడు అర్జునునితో - ''సత్వ-రజః-తమో గుణాలకి సంబంధించినది వేదం. ఈ మూడు గుణాలకు అతీతమైన స్థితిని నీవు చేరుకోవాలి'' అంటాడు. (త్రైగుణ్య విషయావేదా నిస్త్రెగుణ్యోభవార్జున'') అంతేకాక, ''వేదాలలో చెప్పిన దానిని పరిమితంగా, యథాతథంగా ఆచరించే వాళ్లని ప్రేరేపించేది స్వర్గసుఖాలని పొందాలన్న కోర్కే'' (2-44). వైదిక కర్మలు, సమాధి కల్పించే నిశ్చలమానసిక స్థితిని కల్గించలేవు.

''వేదవాదరతాః పార్థ! నాన్యదస్తీతి వాదిన'' 2-42

''కామాత్మనః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం'' 2-43

''వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే'' 2-44

ఇక్కడేదో వైరుధ్యముందనిపించవచ్చు. ధర్మానికి మూలం వేదమని ముందు చెప్పుకొన్నాం. నిజానికి ఇక్కడ వైరుద్ధ్యమేమీ లేదు. నిత్యవ్యవహారంలో ఉపనిషత్తులలోని తత్త్వం ప్రకారం జీవించటం కష్టం - అంటే ఆత్మయొక్క అభిన్నత్వాన్ని గ్రహించటానికి త్రిగుణాల వల్ల శృంఖలాలను ఛేదించి, ఏకాగ్రతతో, నిశ్చలంగా ఆత్మవిచారం చేయటమన్నమాట. వేదోక్తమైన కర్మల ఉద్దేశం మనలని ఆ స్థితికి క్రమేపీ చేర్చటమే. జగత్తు ''సత్య''మని మనం భావించినంత కాలమూ ఈ జగత్తులో సుఖంగా బ్రతకటానికి దేవతారాధన తప్పదు. తద్వారా సత్యమని మనం భావించే జగత్తుకి కూడ శ్రేయస్సుని చేకూరుస్తాం. దేవలోకం కూడ. ఈ లోకంవలెనే, సత్యమనుకొంటాం. దేవతలను సంతుష్టి పరచి మనమెంతో లబ్దిని పొందుతాం. ఈ లోకంలో వలెనే దేవలోకంలో కూడా సుఖాలను అనుభవించగలమని ఆశిస్తాం. కాని అంతటితో ఆగిపోతే, మనం లక్ష్యాన్ని మరచినట్లే. భగవంతునిలో శాశ్వతంగా లీనమైపోవటమే లక్ష్యం. దీనిని మరచి లౌకిక ప్రయోజనాలని సంక్రమింప జేసే వైదిక కర్మల మీదే మనస్సు నిల్పటం, అవివేకం.

నిత్యజీవితంలో జగత్తు ''మిథ్య'' అని అంగీకరించలేం. ''నువ్వు అట్లా అనుకోవటంలో తప్పులేద''ని వేదాలు విశ్వకల్యాణానికై చేయవలసిన కర్మలను విశదీకరించాయి. నిర్గుణుడైన పరమాత్మగాని జీవాత్మపరమాత్మల అభేదంగాని మనకి అవగాహన కల్గటం కష్టమవటం వల్ల మనం ఆరాధించటానికి వీలుగా అనేక రూపాలను ధరించిన దేవతలను మనకిచ్చాయి. కర్మలను చేస్తున్నప్పుడూ, దేవతారాధన చేస్తున్నప్పుడూ, ఇవన్నీ మనకి చిత్తశుద్ధినీ, ఏకాగ్రతనీ కలిగించటానికే ననీ, ఆ మానసిక స్థితిని చేరిన తరువాత ఈ జగత్తు మిథ్యగా తోస్తుందనీ, మనకీ పరమాత్మునికీ భేదంలేదనీ, పరమాత్మలో లీనమై అభిన్నమవుతామనీ - గుర్తుపెట్టుకోవాలి.

దేవతల అనుగ్రహం ద్వారా ప్రాపంచక, స్వర్గ సుఖాలకోసమే యజ్ఞాలను చేస్తే అది సాధారణలోక వ్యవహారం వంటిదే అవుతుంది. ఆత్మసాక్షాత్కారం వల్ల కలిగే ఆనందానికి సాటిరాగలది దేవలోకంలో కూడా ఏదీ లేదు.

అంతేకాదు, చేసిన పుణ్యఫలం పూర్తికాగానే దేవలోకాన్ని విడిచి మళ్లీ సంసారవలయంలో పడి పూర్వకర్మానుసారం జన్మలనెత్తాల్సిందే. ప్రస్తుత స్థితిని బట్టి క్రమేపీ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించటానికి వీలుగా వేదాలు కర్మలనూ, ఆరాధనలనూ నిర్దేశించినా అంతిమ లక్ష్యాన్ని గుర్తుంచుకొని మనం పురోగమించాలి.

వేదోక్తమైన కర్మానుష్ఠానాన్ని విడనాడటం అనుచితమే అయినా, దానిని ఏ పరిస్థితులలోనూ విడనాడ కూడదనటం కూడ అనుచితమే. సంప్రదాయ సిద్ధంగా యజ్ఞాలూ, వేదాధ్యయనమూ చేయకుండా నేరుగా ఉపనిషత్తులనే పఠించటం పట్ల మొగ్గుచూపుతున్నారు ఈ రోజులలో. అందువల్ల చాలామందికి ఉపనిషత్తులలోని విషయం తెలియటమే కాక, ఆ విషయం గురించి చర్చలు కూడ చేయగలుగుతున్నారు. అయినా చిత్తశాంతి కలిగిన వారు, అరిషడ్వర్గాలు లేనివారు, ఆత్మసాక్షాత్కారం పొందిన వారు, ఎక్కడా కాన రారెందుచేత? వైదిక నియమాలను పాటించి, యజ్ఞయాగాదులను నిర్వహించి, మనస్సునూ, దేహాన్నీ వారు అంతిమ దశకు సమాయత్త పరుపక పోవటమే దీనికి కారణం. అందువల్ల, వేదాధ్యయనం చేయక, కర్మానుష్ఠానాన్ని విడిచి నేరుగా ఉపనిషత్తులలోని రహస్యాలను కనుగొనటానికి ప్రయత్నింపకుండా ఉండటం కూడ అంత తప్పే.

శ్రీ కృష్ణుడు బోధించిన కాలంలో అధికసంఖ్యాకులు వైదిక కర్మలను చేసే దశలోనే ఉండేవారు. వారినే ఆయన విమర్శించారు. వేదాలను ఆయన ఆక్షేపించినట్టు కనబడే మాటలన్నీ యదార్థానికి కర్మలను చేయటంతోనే ఆగిపోయిన వారి పట్ల ఆక్షేపణలే. అందువల్ల ఆయన కర్మాచరణను ఖండించాడనటం తప్పు. ఆయన అవతారాలన్నీ వేదాలనూ, అవి నిర్దేశించిన పథాన్ని నమ్ముకొని బ్రతికే వారి పరిరక్షణకు సంభవించినవే. కర్మకాండలోనే ఆగిపోయిన వారినే శ్రీ కృష్ణుడు ఖండించాడు. అప్పటి పరిస్థితులకు అది అనువైనది. ఆయనే ఇప్పుడు భగవద్గీతను బోధించవలసి వస్తే వైదిక కర్మలను, వేదాధ్యయనాన్ని పూర్తిగా విడనాడి నేరుగా ఉపనిషత్తులని ఆశ్రయింప బోయేవారిని విమర్శించేవాడు. ఇది వరకటి పద్ధతి కంటే ఈ కొత్త పద్ధతి ఇంకా గర్హనీయమవటం వల్ల ఆయన ఇంకా కఠినంగానే విమర్శించేవాడు.

ఈ మాటలన్నీ చెప్పటానికి కారణం, వేదానికీ వేదాంతానికీ వైరుధ్యం లేదని తెల్పటానికే. వేదాంతానికి సన్నద్ధం చేయటమే వేదం యొక్క (కర్మకాండ యొక్క) ముఖ్య ప్రయోజనం. త్రిగుణాలను అతిక్రమించి, సంసారాన్ని త్యజించి, ఆరాధనా - ఆరాధ్యమూ వేరువేరు కావన్న గ్రహింపు కలిగి తద్వారా జ్ఞాన మార్గాన్ని చేరుకోవటానికి సమాయత్త పరచటమే వేదోక్తంగా ప్రవర్తించటంలోని ముఖ్యోద్దేశం. జగత్తంతా మిథ్య అంటూ సంసారాన్ని విడిచి అందరూ జ్ఞానులైతే ప్రపంచ శ్రేయస్సుని చూచే దెవరు? జ్ఞానులకు ప్రపంచం మిథ్యగా తోచినా, మనబోటి సామాన్యులకు వాస్తవంగానే కనబడుతుంది. ప్రపంచశ్రేయస్సు ముఖ్యం - జ్ఞానులు యాగాలు చేయరు, వారు విశ్వశ్రేయస్సుకి ఎట్లా దోహదం కాలగరు? జ్ఞాని యొక్క మహోన్నతత దృష్ట్యా వారు లోక శ్రేయస్సు కొరకు యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. జ్ఞాని జగత్తు లేదన్నా, జగత్తంతా భగవంతుని లీలే అన్నా జ్ఞాని భగవంతుని అనుగ్రహమెప్పుడూ వెదజల్లుతూనే ఉంటాడు.

జ్ఞాని చుట్టూ జనమెందుకు మూగుతారు? ప్రజలకు దూరంగా ఆయన పారిపోయినా, ప్రజలు వారి ననుసరించి పాదాలకు మ్రొక్కుతారెందుచేత? ఆయన ఆశీర్వచనాన్నీ, అనుగ్రహాన్నీ పొందటానికి! ఆయన ద్వారా భగవంతుని కరుణ ప్రవహిస్తుంది - ప్రజలకు ఆయన సమక్షంలో మనశ్శాంతి లభిస్తుంది.

దైవంతో తాదాత్మ్యం చెందిన జ్ఞాని లోకానికే మేలు, చిల్లర దేవుళ్లు చేసేదాని కన్నా ఎంతో ఎక్కువ. ఈ చిల్లర దేవుళ్ల అనుగ్రహానికై ఎన్నో పూజలు చేస్తూంటారు జనం. జ్ఞాని యజ్ఞాలు నిర్వహించనంత మాత్రాన లోకకల్యాణానికి సహాయపడడనరాదు.

కొందరికి, ముఖ్యంగా అన్యమతస్థులకి, వేదాంత చింతనకీ, వైదిక కర్మలకీ పరస్పర వైరుధ్యం కనబడుతుంది. అందువల్లనే వాళ్లు ''హైందవులకి సమాజశ్రేయస్సు కంటే వ్యక్తి మోక్షమే ఎక్కువ ప్రధానం - వాళ్ల యోగము, సమాధీ అన్నీ వ్యక్తి ముక్తిని దృష్టిలో పెట్టుకొన్నవే'' అంటారు. ఇంకా - క్రైస్తవము, ఇస్లాం, బౌద్ధమతముల వలె హిందూమతం ప్రేమ, సోదరభావం వంటి వాటిని ప్రచారం చేయదు, సంఘశ్రేయస్సుని దృష్టిలో పెట్టుకోదు అని కూడా అంటారు. ఏమైనా, హిందుమతాన్ని వేదాంతంగానూ, వైదికంగానూ విభజించరాదు. ఆదిలో వేదాధ్యయనం చేసి, యజ్ఞయాగాదులని నిర్వహించి సంఘశ్రేయస్సుకి దోహదమిచ్చిన వ్యక్తే ఉత్తరోత్తరా వేదాంత చింతన వల్ల సత్యాన్వేషి అయి ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. వైదికకర్మలనిఆచరించటం వల్ల పరిశుద్ధుడై వేదాంతం నిర్దేశించిన ముక్తి మార్గానుగామి కావటానికి అర్హత పొందుతాడు. జ్ఞాని అయిన తరువాత, ఏ కర్మలూ చేయక పోయినా, కేవలం మహనీయమైన తన యునికి వల్లనే లోకకల్యాణానికి సహాయపడతాడు. ఏ మతావలంబియైనా ఆ మతం చెప్పిన ఉపదేశానుసారం నడచుకొని జ్ఞాని కాలేకపోతే ఆ మతం వృథా. కర్మలు, ఆరాధనలూ ఆ స్థితిని చేరుకోవటానికి సాధనలు. వర్ణాశ్రమధర్మాలూ, ఎవరు ఏయే కర్మలు చేయాలో చెప్పే నియమాలూ ప్రతివారూ మానసిక ఉన్నతిని చేరుకోవటానికి ఏర్పర్చినవే - ఆ స్థితిని చేరుకొన్న తరువాత అంతా ఒక్కటే.

కాబట్టి, ''మొదటగా వచ్చేది కర్మ-వేదోక్తమైన విధులను నిర్వహించటం. కాని కర్మల అవసరమే లేని స్థితికీ, ఆత్మానుభూతికీ దారి తీస్తాయి ఈ కర్మలు'' అన్న భావంతోనే వీటిని చెయ్యాలి. ప్రాపంచిక సౌఖ్యాలను పొందటానికి దేవతారాధన అవసరమే ఆదిలో. కాని దీనిని కూడ ఒక ప్రారంభదశగా ఎంచాలి - ఆరాధింపబడే దైవము, ఆరాధించే తాను ఒకటేనన్న స్థితికి అది దారితీస్తుందన్న గ్రహింపుండాలి. మొదట్లో ఆ భేదభావాన్ని ఉంచుకోవాలి. సాధారణ వ్యవహారాలను సరిగ్గా నిర్వహించాలంటే పనిని వివిధ అంశాలుగా విభజించుకోవాలి కదా, అంతిమ లక్ష్యాన్ని సాధించటానికి. ప్రతి ఒక్కరూ తన విధులను సక్రమంగా నిర్వహించాలి. కర్మలు చేసేప్పుడు వేదాధ్యయనమూ కర్మాచరణమూ వేదాల అవసరమే లేని అనుభూతికి మార్గమేర్పడుతుందని గుర్తుంచుకోవాలి. పువ్వులు లేనిదే ఫలాలు లేవు. పువ్వు మాయమైతేనే గాని ఫలమురాదు. వైదిక కర్మలను ఆచరించక నేరుగా వేదాంతానికి వెళ్లే వారు సరియైన మార్గాన వెళ్లటం లేదు. ఆ విధంగానే, వేదాంతం వరకూ వెళ్లక కేవలం కర్మలతోనే ఆగిపోయే వారూ వికసింపలేరు. ఈ విషయమై సదవగాహన అవసరం.

వేదాలను శృతులన్నప్పుడు సంహితనే కాక బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు కూడా సూచింపబడుతాయి. భగవద్గీత శృతికాదు - వేదాలలో భాగం కాదు. దానిని స్మృతి అంటారు. జ్ఞానానికీ, మోక్షానికీ దారి చూపక పోతే కర్మలూ, ఆరాధనలూ నిరర్థక మంటుంది గీత. శృతుల తర్వాత ప్రధానమైనవి పురాణాలు. ఇవి కూడా కొన్ని చోట్ల వైదిక కర్మలను యాగాలను చేయటమే పరమోత్కృష్టమని నమ్మినట్లు, వారి అహంకారాన్ని శివుడు ధ్వంసం చేసినట్టు శైవపురాణ గాధలు చెప్తాయి. శ్రీ మద్భాగవతంలో కూడ బ్రాహ్మణ పండితులకూ, వారి భార్యలకూ సంబంధించినకథ ఒకటి ఉంది. అంతగా చదువుకోక పోయినా ఆ బ్రాహ్మణ స్త్రీలు శ్రీ మహావిష్ణువే తమ ఎదుట బాలకృష్ణునిగా ప్రత్యక్షమైనాడని నమ్ముతారు. కర్మానుష్ఠానంలో నిమగ్నమైపోయిన వారి భర్తలకు మాత్రం ఆ అవగాహన కల్గ లేదు. ఆ అవగాహన కల్గలేదే అన్న విచారం మిగిలి పోయింది.

శృతులలో కర్మకాండా, జ్ఞానకాండా ఉన్నాయని అనవచ్చు. జ్ఞానమార్గాన్ని ఉపదేశించే ఉపనిషత్తులు జ్ఞానకాండ లోని భాగాలే కదా! ఉపనిషత్తులు కర్మకి అంతప్రాముఖ్యాన్ని యివ్వవు. కాని, కర్మకాండకూడ కర్మాచరణమే పరమావధిగా భావించనక్కరలేదని చెప్తుంది. త్రైత్తిరీయ కాఠక ప్రశ్నలో ఇట్లా ఉంది: ''యజ్ఞాలను చేస్తూ భగవత్సాన్నిధ్యాన్ని అనుభవించని వ్యక్తి ఊరికే మంటని రగిల్చి పొగను లేపుతున్నట్టే. వాడొట్టి మూఢుడు. అతనికి ఆత్మానుభూతి ఎప్పటికీ కాదు''. (త్రైత్తిరీయ కాఠకం - 1వ ప్రశ్న, ఆఖరి అనువాకం - 4వ మంత్రం) నిప్పుని రాజేస్తే ఆ మంటపై అన్నం వండటానికి పాత్రని ఆ నిప్పుపై పెట్టాలి. కేవలం యజ్ఞాలనే చేసేవాడు నిప్పునే రాజేస్తాడు గాని, పాత్రని దానిపై పెట్టడు (ఇక్కడ సంస్కృతంలో వాడబడిన పదం - పక్వం - అంటే బాగా వండటం. గట్టి బియ్యపు గింజ ఉడికి మెత్తని అన్నపు మెతుకుగా మారటమనమాట).

వైదిక కర్మలని ఈశ్వరార్పణం చేస్తే భవబంధవిమోచన మవుతుంది, ప్రాపంచిక బంధాన్ని వృద్ధి చేయదు. నిష్కామ్యంగా (అంటే ఫలితాల గురించి పట్టించు కోకుండా) కర్మలనాచరిస్తే చిత్తశుద్ధి కలిగి, త్రిగుణాతీతమైన స్థితికి కొనిపోతుంది.

యజ్ఞమంటే ఇదే. ఆంగ్లంలో 'సాక్రిఫైస్‌' (త్యాగం) అంటారు. యాగమంటే త్యాగం, విడిచిపెట్టటం. అగ్నికి ఉపహారం సమర్పించేప్పుడు ''నమమ'' (నాకు కాదు) అంటారు - యజ్ఞంలో స్వార్థరాహిత్యమెంత ముఖ్యమో తెలుస్తుంది దీని బట్టి. నిప్పులో పడవేసిన దానిని తిరిగి పొందటమసాధ్యం కదా. ఒక్క క్షణంలో దాని రూపమే మారిపోతుంది. ఆ విధంగానే ''నేను'' ''నాది'' అన్న భావం భస్మం కావాలి. యజ్ఞాల ఉద్దేశం అలాంటి ఉత్కృష్టమైన లక్ష్యము. దానిని విడిచి - తాత్కాలికమూ అల్పమూనైన ఫలితాల కోసం చేయటం శోచనీయం.

కర్మకాండకీ, జ్ఞానకాండకీ భేదం లేదని విశదమవుతుంది. కర్మకాండ తన పరిమితుల నెరిగి జ్ఞానకాండ యొక్క ఉత్కృష్టతను కొని యాడుతుంది. అవి ఒండొంటికి పూరకాలు. మహోన్నతమైన సత్యాలు, జ్ఞానప్రదాతలూ ఆయిన ''పురుషసూక్తం'' ''త్ర్యంబక మంత్రం'' సంహితలోనివే కాని ఉపనిషత్తలులలోనివి కావు. ఆ విధంగానే, ఉపనిషత్తులు కూడ ''నాచికేతాగ్ని'' వంటి కర్మలను వివరిస్తాయి. వైదికర్మలను చేసేప్పుడు పఠించే మంత్రాలు ఎన్నో తైత్తిరీయ ఉపనిషత్తులో ఉన్నాయి.

భగవద్గీత ఒక స్మృతి - అందులో జ్ఞానలబ్ధికి కర్మఫలాన్ని ఈశ్వరార్పితం చేయాలని ఉంది. ఇది శృతిలో భాగమైన ఉపనిషత్తులలో ఉంది. ఉపనిషత్తులలో ప్రధానమైన ''ఈశావాస్య'' ఉపనిషత్తులో ఆదిలోనే ఈ వాక్యముంది :

''కుర్వన్నేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగ్‌ం సమాః | ఏవంత్వయి నాన్యథేతో స్తి

నకర్మవిల్యితేనరీ (ఈశా - 2)

''వైదిక కర్మలని వందసంవత్సరాలైనా ఆచరించు, కాని అవన్నీ ఈశ్వరుని కొరకేనని, స్వలాభం కొరకు కాదని భావిస్తూ ఆచరించు. అప్పుడు కర్మఫలాలు నిన్ను బంధించవు''. అంటుంది ఉపనిషత్తు. కాబట్టి ఉపనిషత్తులు కార్యాచరణకి ప్రతికూలమనీ, కర్మ విరుద్ధమనీ భావించటం తప్పు.

కర్మనే లక్ష్యంగా భావించకూడదు. దేవతల నారాధించటం వల్ల పరిశుద్ధమైన చిత్తమూ, లోకకల్యాణమూ లభిస్తాయి. కాని అంతటితో ఆగిపోకూడదు. జ్ఞానోదయం కావాలి. అప్పుడు పరమాత్మను విడిచి జగత్తంటూ ఏదీ లేదనీ తెలియాలి. ఆ దశలో ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవికి వేదాలు కూడా అప్రధానములే అవుతాయి. వేదమంటే ఏమిటి? భగవంతుని శాసనం. దేశంలోని పౌరులు ప్రభుత్వ శాసనాన్ని ఎట్లా పాటిస్తారో అదే విధంగా ఆ శాసనాన్ని కూడా పాటించాలి. కాని జ్ఞానియై 'పరమసత్యం'లో నిమగ్నమైన వానికీ కర్మానుష్ఠానమనవసరం.

పరమాత్మునితో తాదాత్మ్యం చెందిన జ్ఞానికి, పరమాత్మనుండే జన్మించిన దేవతలు వేరువేరుగా తోచరు. పరతత్త్వంలో లీనమైనప్పుడు దేవతలలో కూడ లీనమైనట్టే. దేవతారాధన చేసే దశలో తాను ఆరాధ్య దైవతము కంటె భిన్నమనే భావముతో ఉన్నప్పటికినీ, ఆరాధ్యదైవతము పరమాత్మకు అభిన్నమనే భావనలో యుండాలి.

నిత్యవ్యవహారంలో భేదభావంతో ఎన్నో పనులు చేస్తూంటాం, అప్పుడు కూడా ఈ భేదాలన్నీ పోతాయనీ అన్నీ ప్రాథమిక సత్యంలో లీనమై పోతాయనీ భావించుకోవాలి. దేవతలు తన కంటే భిన్నమన్న భావంతోనే ఆరాధించేవాడు, సత్యాన్ని గ్రహించడు.

మానవుల కంటే దేవతలు ఉన్నతులే అయినా, పూర్ణానందాన్ని అనుభవించరు. మానవజన్మనెత్తి జ్ఞాని యైన వాని ఆనందంలో లవలేశ##మైనా వారికుండదు, తైత్తిరీయ ఉపనిషత్తు (2.5) బృహదారణ్యక ఉపనిషత్తు (2.3.33) మన ఆనందం, పితృలోకంలోని వారి ఆనందం, దేవలోక పుటానందం, దేవతలలో ఇంద్రుడూ, బృహస్పతీ, ప్రజాపతీ పొందే ఆనందం - ఒకరి ఆనందంకంటె వేరొకరి ఆనందం వందరెట్లు చొప్పున ఎక్కువౌతుందన్నట్లు - ఎక్కంవలె వర్ణిస్తాయి * 'జ్ఞానికి గల ఆనందం' చివరికి వస్తుంది. అది బ్రహ్మానందం - ముక్తుడు అనుభవించే ఆనందం.

_____________________

* ఆనందంలోని తారతమ్యాలిట్లా వివరింపబడింది. మనుష్యనామానందం - ఆరోగ్యవంతుడు, వివేకవంతుడు, సుఖమనుభవింప గలవాని ఆనందం. ఆ తరువాత గంధర్వునిది, దేవగంధర్వునిది, చిరలోకాలోక పితృలది, ఆజానజదేవునిది, కర్మదేవునిది, దేవునిది, ఇంద్రునిది, బృహస్పతిది, ప్రజాపతిది, బ్రహ్మది - వీటిలో ఒక్కొక్కటి ఆ వెనుకదాని కంటె వంద రెట్లు అధికం. దీని బట్టి మామూలు మనిషి పొందే ఆనందానికి బ్రహ్మానందమెన్ని రెట్లో అర్థం చేసుకోవచ్చు. ప్రతి దశలోనూ ఆ ఆనందాన్ని జ్ఞాని అనుభవించగలడంటుంది ఉపనిషత్తు. కోర్కెలు లేక, ఆత్మ సాక్షాత్కారాన్ని చెందిన జ్ఞాని బ్రహ్మనందాన్ని అందుకోగలడు.

కాబట్టి దేవతలకి కూడ కొన్ని పరిమితులున్నాయి. పైగా, అన్ని పరిమితులను దాటగల జ్ఞాన సముపార్జనకి వారు ఉత్సుకులు కారు. మానవులు యజ్ఞాల వల్లనూ, ఇతర పూజల వల్లనూ సమర్పించేవే వారికి చాలు. అందువల్లనే కొన్ని పురాణాలననుసరించి, జ్ఞానులు కావాలనుకొనే వారిని దేవతలు అనుగ్రహింపరు. బృహదారణ్యక ఉపనిషత్తు ''మనుష్యులు ఆత్మానుభూతిని పొందటం దేవతలకిష్టముండదు'' (1-4-10) అంటుంది. దీనికి కారణమేమిటి? దేవతలకు కావలసిన కర్మలను, యజ్ఞాలను జ్ఞాని చేయక పోవటమే!

అంటే, దేవతలకు అజ్ఞానులంటే ప్రియమా? ''అజ్ఞాని'' అసలైన జ్ఞానము పొందని వాడని అర్థం, వ్యాకరణంలో ఒక పదముంది - దేవానాంప్రియః అని - అంటే దేవతలకు ప్రియమైన వాడని - అంటే మూర్ఖుడని! దీనికి ఉపనిషత్తే ఆధారం.

అన్నీ ఆత్మమయమై, కర్మలు, దేవతారాధనలూ అవసరంలేని పరిపూర్ణస్థితిని చేరుకొనే విధాన్ని వేదాంతం తెల్పుతుంది. అందువల్ల కనీసం ఈ ఉపనిషత్తులనైనా కాపాడుకొని, అధ్యయనం చేయటం మన విధి.

అనంతమైన వేదాలలో కొన్ని భాగాలని మాత్రమే గ్రహించి ఋషులు మనకీయగలిగారు. ముందు యుగాలలో వారికంటే కలియుగంలోని వారి బుద్ధి చాలా బలహీనం. అందువల్ల వీటిని 118 శాఖలుగా విభజించారు. ఒక్కొక్క శాఖలో కొందరు విద్వాంసులు నిష్ణాతులవటానికి వీలుంటుందని, కాలక్రమేణా, ఒక శాఖని పఠించటమే కష్టమై పోయింది. వేదాధ్యయనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఘనత మనతరం వారికి దక్కుతుంది. అంతటితో ఆపుదాం.

చెప్ప వచ్చిందేమిటంటే, ప్రతి శాఖలోనూ ఒక ఉపనిషత్తుంటుందని. సంహితలు, బ్రాహ్మణాలు అధ్యయనం చేయబడని వేదశాఖలకు సంబంధించిన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అసలు కొన్నిటి పాఠాలే దొరకటం లేదు ఇప్పుడు. అయినా వాటికి సంబంధించిన ఉపనిషత్తులు ఇంతకాలమూ ఏ మార్పూ లేకుండా లభ్యమయాయి. ఉదాహరణకి - ఋగ్వేదంలోని ''శాంఖాయన శాఖ''కి సంబంధించిన సంహిత భాగం దొరకలేదు. కాని ఆ శాఖ చివరగల ''కౌషీతకి'' ఉపనిషత్తు సజీవంగా ఉంది. ఋగ్వేదపు ''భాష్కల మంత్రోపనిషత్తు'' ఉన్నది కాని దానికి సంబంధించిన సంహితగాని బ్రాహ్మణంగాని బాష్కలశాఖగాని లభ్యంకావు. కఠోపనిషత్తు కృష్ణయజుర్వేదపు కఠ శాఖకు సంబంధించినది.

ఆరణ్యకానికి అంతిమ భాగం ఉపనిషత్తన్నాను. కఠోపనిషత్తు ప్రసిద్ధమైన, దశోపనిషత్తులలో ఒకటి, కాని దానికి సంబంధించిన ఆరణ్యకం లభ్యంకాదు. పశ్చిమ భారతంలో మాత్రమే అధర్వ వేదాధ్యయనం సాగుతోంది. కొద్దిగానో గొప్పగానో. దక్షిణాదిన అధర్వవేద శాఖలను పఠించరు. కాని దశోపనిషత్తులలో మూడు - అంటే, ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తులు - అధర్వవేదానికి సంబంధించినవి. అదృష్టవశాత్తూ ఇవి లభ్యాలు. ఇప్పుడూ పఠింపబడుతున్నాయి.

పిండితార్థమేమంటే, కర్మాచరణకి సంబంధించిన భాగం గాని, శాఖగాని పోయినప్పటికీ వేదశాఖకి సంబంధించిన తత్త్వం మాత్రం నిలచింది. ఆ విధంగా జ్ఞాన దాయకాలైన ఉపనిషత్తులని పఠించి, పరిరక్షించారు. ఇది సంతృప్తి దాయకం.

Acharyavaani - Vedamulu     Chapters   Last Page