Acharyavaani - Vedamulu Chapters Last Page
12. వేదముల ప్రయోజనమూ ఉద్దేశమూ
ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఎన్నో విషయాలను వేదాలు విపులంగా ప్రస్తావిస్తాయి. అటువంటప్పుడు ఉపనిషత్తులలో అన్నట్టు వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మసాక్షాత్కారమని ఎట్లా అనగలం?
వేదాలు అగ్నిహోతాన్నీ, సోమయాగాన్నీ, సత్రయాగాన్నీ ఇష్టినీ మరి ఇతర కర్మలనూ పొగుడుతాయి. ఇవే వేదాల లక్ష్యమని ఎందుకనుకో కూడదు? ఇంకా వేరే విషయాలు కూడా వేదాలలో ఉన్నాయి - వివాహాలకి సంబంధించిన తంతు, మరణానంతరం సంస్కారాల పద్ధతులు, శ్రాద్ధకర్మ, ప్రభుత్వాన్ని నడపటం, విద్వత్ సభలలో నడుచుకోవటం ఇత్యాదివి. వీటిలో ఏది ప్రధానం?
యజ్ఞాలూ ఆరాధనా విధానాలనే కాక వేదాలు ధ్యానపద్ధతులనీ, ఉపాసనా విధాలనీ, కూడా వివరిస్తాయి. ఆత్మ దేహమునకు ఏ విధంగా చేతనను కలగిస్తుంది. దేహానికి చివరిలో ఏమి జరుగుతుంది, మరొక దేహాన్ని ఆత్మ ఎట్లా ప్రవేశిస్తుంది - వీటన్నిటి గురించీ వివరాలున్నాయి వేదాలలో.
ఇవేకాక, ఆరోగ్యం కాపాడుకోవటానికి వైద్య పద్ధతుల గురించీ, వైరులను శాంతపరచి, వారు తలపెట్టే అపాయాల బారి నుండి తప్పించుకోవటానికి శాంతులు కూడా వేదాలు చెప్తాయి. ఈ వివరాలనన్నిటినీ చూచిన తరువాత అసలు వేదాల ముఖ్య ఉద్దేశ##మేమిటని అనుమానం వస్తుంది.
ఉపనిషత్తులలో ''సామూహికంగా వేదాలు ఒకదాని గురించే ప్రస్తావిస్తాయి'' అని ఉన్నది (కఠోపనిషత్తు 2.15) ఈ ఒకటీ ఏమిటీ? వైదిక సాభిప్రాయ మనుసరించి 'ఓం' అన్న శబ్దం ఆ ఒక్కదానికీ ప్రతీక.
కొందరు పాశ్చాత్య పండితుల అభిప్రాయమిది :
సూర్యచంద్రులను, ప్రకృతి దృశ్యాలను చూచి శాస్త్రజ్ఞానం లేని ఆ రోజులలో ప్రాచీన భారతీయులు ఎవరికి వారే ఆ ప్రకృతి శోభను గూర్చి తమతమ అవగాహనను వెలిబుచ్చారు. వీరిలో కొందరే గీతాలుగా పాడగలిగారు. ఇటువంటి పాటలనూ వాక్కులనూ సంకలనం చేసి మంత్రాలని పేరు పెట్టారు. ఈ సంకలనాలకే వేదాలని పేరు పెట్టారు.
వేదాలన్నీ ఒక దాని గురించే మాట్లాడుతాయని ఉపనిషత్తులు పేర్కొన్నా ఒక దాని గురిచే కాక ఎన్నిటి గురించో అని ప్రస్తావిస్తాయి.
రామాయణంలో ఈ శ్లోకముంది
''వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసా దాసీత్సాక్షాత్ రామాయణాత్మనా''
''వేదవేద్యే'' అంటే వేదాల వల్ల తెలిసికొన గలిగేవాడు. అంటే ఎవరు? పరమపురుషుడు. వేదాలవల్లనే ఎరుగగలం. ఆయన లోకంలో జన్మించారు. ఆయన దశరథుని కుమారునిగా, రామునిగా వచ్చినప్పుడు వేదాలు రామాయణమన్న రూపాన్ని ధరించాయి -
ఈ శ్లోకమర్థమిది - వేదముల పరమ లక్ష్యం, గమ్యస్థానం పరమపురుషుడు - పరమసత్యం - ఓంకార మన్న పేరుతో ఉండేది. కృష్ణభగవానుడు భగవద్గీతలో ''వేదేశ్చ సర్వైః - అహమేవ వేద్యః'' (వేదాల ద్వారానే నన్నెరుగగలవు) అంటాడు.
వీటన్నిటినీ గణననలోకి తీసికొన్న తరువాత, వేదాలు అనేక విషయాల గురించి ప్రస్తావించినా, వాటికి ప్రథాన విషయమొక్కటే - పరమపురుషుడే - నని స్పష్టమవుతుంది.
అయితే, ఆ ఒక్కని గురించీ వర్ణించటానికి అన్ని విషయాలను వేదాలు ఏ కారణం వల్ల ప్రస్తావించవలసి వచ్చింది?
అనేక జీవుల ద్వారానే ఆ ఒక్కని గురించీ ఎరుగగలము. యోగం (మనస్సు దేహం యొక్క నిగ్రహం) ధ్యానం (చింతన) తపస్సు (దీక్షను పాటించటం) యజ్ఞం, కర్మానుష్ఠానం (వివాహాది కర్మలను పాటించటం) ప్రభుత్వ విధులు, సామాజిక జీవనం - ఇవన్నీ చిట్టచివరకి ఒకే కేంద్రం వైపు పయనిస్తాయి. అదే వేదాల సారం. మిగిలినవన్నీ మారుతాయి, కాలక్రమేణా కథలుగా మారిపోతాయి. జగత్తు ఎన్నో రూపాలతో మనకి గోచరిస్తుంది - ఒకటిగా మాత్రమే కాదు. వేదాలు ఎన్నో విషయాలగురించి ప్రసంగించటానికి కారణం వాటిలో ఏదైనా మనల్ని కేంద్రం వైపు తీసుకుపోగలదని.
వేదాలు ఒకే ఒక పరమావధి గురించి చెప్తాయి - ఆయనని చేరుకోవటానికి మనం కొన్ని నియమాలను పాటించాలి; వాటి వల్ల ఆ పరమపురుషుడెప్పుడూ మన మనస్సులో ఉంటాడు. యజ్ఞాలు చేయటం, తపస్సు చేయటం, దానం చేయటం, దేవలయాలను పునరుద్ధరించటం, నీటి బావులను త్రవ్వటం, సమాజసేవ, వివాహాది క్రతువులను చేయటం - ఇవన్నీ చిత్త శుద్ధి కోసం, చంచలమైన మనస్సుని అదుపులో పెట్టటం కోసమే.
ఆయా విధుల నిర్వహణకి గల ఒకే ఒక ఉద్దేశం - క్రమశిక్షణ ద్వారా భగవంతుని కనుగొనటం.
వేద అంటే ఎరుకకలిగి ఉండటం - ''దీని నెరిగినట్లైతే అన్నిటినీ ఎరిగినట్టే'' అని ఆత్మకు నిర్వచనం చెప్తాయి 'ఉపనిషత్తులు'. ఆరంభంలో కర్మ, అంతంలో జ్ఞానమూ వచ్చినా అసలు గమ్యం ఈశ్వరుడే, బ్రహ్మమే, ఆత్మే.
కర్మలు పలురకాలు, జ్ఞానం ఒక్కటే - కాని ఈ రెండింటిలోని విషయమూ ఒకటే. ఇంద్రియాలు బయటి వాటినే గుర్తించగలవు, అందుకోగలవు - ఆత్మని మాత్రం చూడలేవు.
చేతిలో ఉన్నదానిని విడిచి బయట వాటి వైపు మనస్సు మళ్ళితే అతడు ఎక్కడొ చూస్తున్నాడంటాము. నిజానికి చేతిలో ఉన్నది ఆత్మ ఒక్కటే. దానిని చూడకపోవటం. ఇతరమైన వాటిని చూడటమే అవుతుంది. బయటవాటిని చూడవద్దని చెప్పినా మనస్సు లెక్కపెట్టదు. బయటకు పోతూనే ఉంటుంది. అందుకే, బయటకు వెళ్లే పనులను చేస్తున్నా, అంతర్ముఖ మవటాన్ని అలవర్చు కోవాలి. మనస్సూ ఇంద్రియాలూ వాటికి ఇష్టం వచ్చిన వైపు లాగనీయకుండా వైదిక కర్మలను ఇతోధికంగా చేస్తూండాలి. అంతర్ముఖమయే శక్తిని ఇదొక్కటే కలిగిస్తుంది. అధ్యయనం వల్లా, విశ్లేషణ వల్లా, బాహిరజగత్తు గురించి సరిగ్గా అవగాహన కలగటం వల్లా, దేనికైనా గ్రహించగల శక్తి గల బుద్ధి ''దానిని'' చేరుకోగలుగుతుంది. అదే జరిగితే వేరే తెలిసికో వలసిందేదీ లేదు! ఈ ఉద్దేశంతోనే వేదాలు అన్ని కర్మల గురించీ, విధులను గురించీ చెప్తాయి. ఈ కర్మలను నిత్యం చేస్తూండటం వల్ల భౌతిక దేహంపై మమకారం సన్నగిల్లాలి. గ్రహింపువల్లా, సత్యాన్వేషణ వల్లా, సంయమనం వల్లా, మనస్సూ బుద్ధీ లయమొందాలి. అపవిత్రమైన పనుల వల్ల దేహంపై వ్యామోహం పెరుగుతుంది. వీటి వల్ల మనస్సు స్థిరత్వం కోల్పోతుంది. కాని వైదిక కర్మలు లోకకల్యాణాన్ని ఉద్దేశించి మంత్రాల ప్రాతిపదికగా ఏర్పడినవి. వీటిని ఆచరించటం వల్ల మనస్సూ దేహమూ లయబద్ధమై ప్రశాంతిని చెందుతాయి. చివరికి పరిణితి కలిగించి, అంతర్ముఖ మవటానికి దోహదమవుతాయి. అట్లా అంతర్దృష్టి కలగటం వల్ల మనిషికి మోక్షము - ఆనందము లభిస్తాయి. మోక్షమంటే - విముక్తి చెందిన స్థితి. అంటే - శరీరమూ, మనస్సూ విముక్తి చెందగలిగితే, సంసారం నుండి విముక్తి చెందినట్టే!
వేదాల ఉద్దేశం మనిషి జీవన్ముక్తుడవటమే - అంటే ఈ లోకంలో ఉండగానే మోక్షమొందటం. వాటి మహనీయతంతా యిదే. ఇతర మతాలలో వలె, మోక్షం మరణానంతరమే సంభవించే దయితే ఈ లోకంలో ఉన్నంత కాలం దాని నైజం మనకు తెలియదు. దానిని అనుభవసిద్ధం చేసుకొన్న వారు తిరిగి వచ్చి తమ అనుభవాన్ని మనకు చెప్పరు కదా! అప్పుడు అపనమ్మకానికీ, సందేహానికీ తావుంది. కాని ఈ లోకంలోనే ఉంటూ వాంఛలనూ, అవసరాలనూ త్యజించి ఆత్మవిచారంలో నిమగ్నమైతే ఇక్కడే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వేదాలు ఘోషించేది యిదే. అంటే అవి చెప్పేది తిరుగులేని సత్యం గురించే కదా!
మిగిలిన మార్గాలన్నీ తాత్కాలికమైన ఉపశమనాన్నే కలిగిస్తాయి - మలేరియా జ్వరం వస్తే క్వినైన్ మాత్రలు వేసుకొన్నట్టు. జ్వరం మళ్లీ రాకుండా ఉండాలంటే మూలకారణ మేమిటో తెలుసుకొని దానిని నిర్మూలించాలి. వేదాలు మూలవిషయానికి వెళ్ళి - జీవుడూ, పరమాత్మ నుండి జీవుడు ఉద్భవించటమూ, ఈ రెంటి భేదభావాన్నీ నిర్మూలనం చేసి తాత్కాలికమైన ఉపశమనాన్ని కాక శాశ్వతమైన విమోచనాన్ని కలిగిస్తాయి.
కర్మకాండ నిర్దేశించే విధులుకూడ తాత్కాలికోపశమనాల వంటివే. అయితే, అశాంతిలో కొట్టుకొనే వానిని ఒక్కసారిగా ఆత్మారామునిగా, అంటే తన అంతరంగంలోనే సౌఖ్యమున్నదని ఎరిగి, శాంతునిగా మార్చటం అంత తేలిక కాదు. అందువల్లనే తాత్కాలిక ప్రయోజనాలని కలిగించే కర్మలని నిర్దేశించారు. వాటినాచరించటం వల్ల మనస్సు పరిశుద్ధమవుతుంది. శాశ్వతమైన మనశ్శాంతి కలగటానికి అది మూలాధారం. యజ్ఞాలని చేయటం, వ్రతాలని ఆచరించటం, సమాజసేవ చేయటం - వీటి గురించి ఎంత విపులంగా చెప్పబడినా వాటినే గమ్యాలుగా ఎంచరాదు. దేహమంటే మమకారాన్ని తగ్గించటమే ఈ కర్మల ఉద్దేశం. వాటిపై మనస్సుని నిలపటం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, మనస్సు క్షాళనమవుతుంది. కాబట్టి వేదాలలో ఎన్నో విషయాల చర్చ ఉన్నా వాటి లక్ష్యం వేదాంతంలో చెప్పిన చింతనయే.
వార్తా పత్రికలలో ఎవరి వ్యాసాన్నైనా, ఉపన్యాసాన్నైనా చూచినప్పుడు అందులోని విషయమేమిటో తెలిసికోవాలనిపిస్తుంది. అంత పెద్ద వ్యాసాన్నిగాని, ఉపన్యాససారాన్ని గాని మొదట్నుంచీ చివర వరకూ చదవటానికి తీరిక లేనప్పుడు - మొదటి భాగాన్ని కొంత చదివి, ఆఖరి భాగానికి వెళ్తాం. అప్పుడు విషయమేమిటో తెలుస్తుంది. మొదలూ తుదీ చదివితే మొత్తం విషయమేమిటో గ్రహించవచ్చు. ఆ విధంగానే వేదారంభంలోనూ వేదాంతంలోనూ చర్చింపబడిన అంశం ఈశ్వరతత్త్వమే. నేనిదివరకూ చెప్పినట్టు వేదాలలోని ప్రధానమైన విషయమదే.
ప్రభుత్వం ఎన్నో శాసనాలను జారీ చేస్తుంది. ఆయా చట్టాల ఉద్దేశ##మేమిటన్న భేదాభిప్రాయాలూ, సంశయాలూ కలగుతూంటాయి. అప్పుడు కొన్ని వ్యాఖ్యాన సూత్రాల ననుసరించి ఆ సందేహాలను విశదీకరించి నివృత్తి చేస్తారు. ఆ విధంగానే సనాతన ధర్మమైన వేదాలని వివరించటానికి, వ్యాఖ్యానసూత్రం వంటిది మీమాంసా శాస్త్రం. మీమాంస పధ్నాలుగు విద్యలలో ఒకటి - దీనిగురించి తరువాత వివరంగా చెప్తాను. కాని వాటికి సంబంధించి ఒక్క విషయాన్ని చెప్తానిక్కడ.
ఏ వేదమంత్రం యొక్క ఉద్దేశ##మైనా గ్రహించటానికి ఆరు పద్ధతులున్నాయి. ఇవి - ఉపక్రమం, ఉపసంహారం, అభ్యాసం, అపూర్వత, ఫలం, అర్థవాదం, ఉపపత్తి. వేదాల విషయంలోనే కాక ఈ ఆరు సూత్రాలను ఏ వ్యాసానికైనా, ఏ ఉపన్యాస పాఠానికైనా వర్తింపజేసి విషయాన్ని గ్రహించవచ్చు. ఉపక్రమమంటే ప్రారంభం. ఉపసంహారమంటే అంతం. మొదటి పద్ధతి ఈ రెంటినీ గమనించటం - దీనినే ఉపక్రమ - ఉపసంహార పద్ధతి అంటారు. ఈ రెండూ ఒకే విషయం గురించి చెప్తే మొత్తం విషయమదేనని గ్రహించవచ్చు. అభ్యాసమంటే ఒక విషయాన్ని పదేపదే చెప్పటం. ఉదాహరణకి, వ్యాయామం చేసేప్పుడు ఒకేకరమైన వ్యాయామాన్ని తిరిగి తిరిగి చేస్తూంటారు, దానిని దేహాభ్యాసమంటారు.
ఏ వ్యాసంలోనైనా, ఉపన్యాసంలోనైనా ఒకే విషయం గురించి పదే పదే చెప్తూంటే విషయం యొక్క సారాంశమదేననీ, మనస్సుకి బాగా హత్తుకోవటానికే తిరిగి తిరిగి దాని ప్రస్తావనే జరుగుతోందని గ్రహించవచ్చు.
అపూర్వత అంటే అంతకు పూర్వం చెప్పబడనిది అని అర్థం. అంటే విషయసారాంశమదే నన్న మాట.
''ఫలం'' అంటే ప్రతిఫలం. ''ఈ విధంగా చేస్తే ఈ ఫలితం లభిస్తుంది'' అనో, ''ఈ పని చెయ్యి, ఇటువంటి ఫలితం వస్తుంది'' అనో అనటం. అంటే కోరిన ఫలితంవైపు మనలను నడిపించటం. ఈ పద్ధతిని ''ఫలం'' అంటారు.
అర్థవాద పద్ధతిలో ఎన్నో విషయాలను స్పృశిస్తారు. వీటి నాధారంగా ఒక కథ చెప్తారు. తద్వారా ఏదో ఒక విషయాన్ని వివరించవచ్చు. ఆ వెలువడిన విషయమే అసలు విషయసారాంశమని గ్రహించవచ్చు. ''ఉపపత్తి'' అన్న పద్ధతిలో ఒక విషయం గురించి ప్రస్తావించి - ఆ విషయం యొక్క మూలమూ, ఉద్దేశమూ, ఔచిత్యమూ గురించి చెప్తారు. వీటి వల్ల ఆ విషయం స్పష్టమవుతుంది.
''వేదాల ముఖ్యోద్దేశం అగ్ని ఉపాసన. ఉపక్రమంలో ''అగ్నిమీళే'' తో ప్రారంభిస్తుంది. ఉపసంహారం కూడ అగ్నితోనే అంతమొందుతుంది. ఆరంభంలోనూ, ఆఖరిలోనూ అగ్ని గురించే ప్రస్తావన ఉంది. కాబట్టి వేదాల ముఖ్యోద్దేశం అగ్ని'' అని వేదాల ఆరంభాన్ని, అంతాన్నీ చూచిన వారనవచ్చు.
ఇందులో కొంత సత్యమున్నా, యధార్థం మాత్రం కాదు. అగ్ని ఆత్మ చైతన్యానికి ప్రతీక, జ్ఞానోదయ మన మాట. ఆత్మ చైతన్యమంటే ఎరిగినవాడు, ఎరుగబడింది, ఎరుక అన్నీ ఒకటే గ్రహింపు. వేదాల సారమిదే అసలు.
కాని, అగ్ని ఉపాసనే వేదాల లక్ష్యం కాదు. ఏ దేవతారాధనైనా మరొక దేవతారాధన కంటె గొప్పదని వేదాలు చెప్పవు - వేదాల ఘనత అంతా అదే.
''అనేక దేవతల రూపాలను ధరించే ఆత్మనే భక్తితో ఆరాధించు'' అంటుంది వేదం (బృహదారణ్యక - 14.8)
''ఆత్మనే దర్శించాలి, ఆత్మనే ఆలకించాలి, ఆత్మనే మననం చెయ్యాలి'' అంటాడు యాజ్ఞవల్క్యుడు, మైత్రేయికిచ్చిన ఉపదేశంలో.
వీటి బట్టి వేదాల ఉద్దేశ##మేమిటో మనం గ్రహించవచ్చు. ''గమ్యం'' అన్నప్పుడు మనకు స్ఫురించేది యిది : ''మనమొక ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ నుండి వేరొక ప్రదేశానికి వెళ్లాలి''. దూరంగా ఉన్నదానిని సూచించటమే గమ్యమంటే. ''ఇతః'' అంటే 'ఇది' మనమున్న స్థితి - ఇక్కడ నుండి ''దాని'' వద్దకు వెళ్లాలి - ''తతః''. నిజానికి గమ్యం ఇక్కడ లేదా? తప్పకుండాను. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత, ''అది'' ''ఇది'' అంతా బ్రహ్మమే. అసలు ''అది'', ''ఇది'' అనే భేదభావమే యుండదు. ఇప్పుడు మనం ''ఇది'' అనేది ''అది'' అవుతుంది - నిత్యమైన 'అది'!
''అది'' అన్న అర్థంలో 'తతః' అన్నట్లే పరమాత్ముడ్ని కూడ ''తతః'' - అది, అంటారు. ప్రతి కర్మ చివరిలోనూ ''ఓం తత్ సత్'' అంటాం. దాని అర్థమిది ''తత్ అనబడేదే సత్యము'' అని ''తత్'' అంటే సత్యము, నిజము.
కొన్ని పదాలకి ''త్వం'' చేరుస్తాం - పురుషత్వం, మహత్వంలో వలె. ఇక్కడ ''త్వం'' అంటే నైజము, ప్రకృతి అని అర్థం. 'మహత్ యొక్క లక్షణం మహత్వం, పురుషుని ప్రకృతి పురుషత్వం. సరే, కాని చివరి యాత్రాంతాన్ని ''తత్త్వం'' అంటాం ఎందుచేత? తత్త్వమంటే ''దాని యొక్క ప్రకృతి'' కదా. తత్త్వ విచారం, తత్త్వోపదేశం - ఈ పదాలన్నీ ''తత్'' యొక్క నైజం గురించి బోధనలనే సూచిస్తాయి.
వేదాలు దూరంగా ఉన్న పరమపురుషుడిని ''తత్'' అంటే మనకి ప్రయోజనమేమిటి? దూరంగా ఉన్నవాడు సమీపంలోనే ఉన్నాడు ''దూరాత్ దూరే అంతికే చ'' అంటుంది వేదం. అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది. పెళ్లీడుకొచ్చిన పిల్లకి తల్లిదండ్రులు అప్పటి సంప్రదాయాననుసరించి సన్నిహిత బంధువుల పిల్లవాడిని పెళ్ళికి ఎంపిక చేస్తారు. కాని ఆ పిల్ల ఒప్పుకోక అందరి కన్నా శ్రేష్ఠుడినే వరిస్తానంటుంది. తల్లిదండ్రులు ప్రక్కకి తప్పుకొంటారు.
అందరి కన్నా ఉన్నతుడు రాజే కాబట్టి తాను రాజుని తప్ప ఇంకెవరినీ పెళ్లాడనంది ఆ పిల్ల. అప్పట్నుంచి రాజుని వెంబడింపసాగింది. ఒకనాడు పల్లకిలో పోతున్న రాజుకి దారిలో సన్న్యాసి కనబడితే, దిగి ఆయనకి ప్రణామాలు చెప్పి తన ప్రయాణం కొనసాగించాడు. దీనినంతా గమనించిన ఆ పిల్ల ''అందరి కంటే రాజే గొప్పవాడను కొన్నాను, పొరబడ్డాను. ఆయన కంటే సన్న్యాసి ఎంతో గొప్పవాడు. కాబట్టి నేను సన్న్యాసినే పెళ్లాడుతాను'' అనుకొని సన్న్యాసి వెంటపడింది.
ఒకనాడు సన్న్యాసి ఒక అశ్వద్ధవృక్షం క్రింద ఉన్న వినాయకుని ప్రతిమకు నమస్కారం పెట్టటం చూచింది. ఆ పిల్ల, తన అభిప్రాయాన్ని మళ్లీ మార్చుకొంది. సన్న్యాసి కంటె ఉత్తముడు గణశుడని ఆయననే వివాహమాడటానికి నిశ్చయించుకొంది. సన్న్యాసిని విడిచి, వినాయకుని ఎదుట కూర్చొంది.
చెట్టుక్రింద ఉన్న ప్రతిమ కావటం వల్ల అక్కడ గుడి లేదు. ఎవ్వరూ వచ్చేవారు కారు. ఒకనాడు అటుపోతున్న ఒక కుక్క ఆ ప్రతిమపై మాత్రం విడిచింది. ఆ ప్రతిమ కంటె గొప్పదనుకొని ఆ పిల్ల కుక్క వెంటబడింది. ఆదారిన పోతున్న ఒక పిల్లవాడు ఆ కుక్కపై రాయిని విసిరి గాయపరచాడు. ఆ బాధకి అది ఇంకా వేగంగా పరుగెత్తటం మొదలు పెట్టింది. దీనినంతా గమనిస్తున్న ఒక యువకుడు ఆ మూగజీవిని ఊరికే కొట్టిన పిల్లవాడిని చివాట్లువేశాడు. ఆ పిల్లవాడిని మందలించిన యువకుడే అందరికంటె గొప్పవాడనుకొంది ఆ పిల్ల. అతనినే వివాహమాడుతానంది. ఇంతకూ, ఆ యువకుడు ఎవరో కాదు - తల్లిదండ్రులు ఎంపిక చేసిన వాడే! ఎక్కడో ఉన్నాడనుకొన్నవాడు సమీపానే ఉన్నాడు. అదీ కథ.
''ఈశ్వరుడెక్కడో ఉన్నాడని దేశమంతా వెతుకుతున్నావు. ఎరుగనంత వరకు నీకు ఆయన దూరస్థుడే. ఎంత వెతికినా కనబడడు. నీకు దగ్గరే ఉంటాడు. అన్నిటి కంటే దూరంగా, అన్నిటి కంటే దగ్గరగా ఉంటాడు'' అంటుంది శృతి.
భూమ్యకాశాలు క్షితిజరేఖ వద్ద కలుసుకున్నట్లు కనబడుతాయి. అక్కడ ఒక తాటి చెట్టున్నట్టు కనబడుతోందనుకుందాం. మనమున్న స్థలం నుంచి ఆ తాటి చెట్టుకు చేరితే, భూమి ఆకాశాన్ని తాకటం చూడగలమనుకుంటాం. కాని ఆ ప్రదేశాన్ని చేరుకొన్న తరువాత క్షితిజం ఇంకా దూరమైనట్లని పిస్తుంది. మనం అటువైపు పయనించిన కొద్దీ ఇంకా దూరమవుతున్నట్లుంటుంది. ఏవో కొండగుర్తులను పెట్టుకొని దాని నెప్పుడైనా చేరుకోగలమా అసలు? కాబట్టి అది ఎక్కడ ఉన్నట్టు? నువ్వున్న చోటనే ఉంది. ఎక్కడో దూరంగా ఉన్నాడని ''తత్'' అంటూ మనం చెప్పుకునే భగవంతుడు నీకు దగ్గరగానే - నీలోనే ఉన్నాడు. ''నీవు అదే'' (తత్త్వమసి) అని అనిపించేట్టు చేస్తాయి వేదాలు. వేదాల యొక్క మహోపదేశం ''తత్త్వమసి'' ఇక్కడ 'తత్త్వం' అంటే ''తత్'' యొక్క లక్షణంకాదు. 'త్వం' అన్న పదాన్ని రెండు విధాల అర్థం చేసుకోవచ్చు. ఒకటి లక్షణంగా రెండవది ''నువ్వు'' అన్న నామవాచకంగా. తత్వమసి అన్నప్పుడు ''తత్'' అంటే ''అది'', ''త్వం'' అంటే ''నీవు'', ''అసి'' - ''అయి ఉన్నావు''. ''తత్'', ''త్వం'' రెండూ కలిసి ''తత్త్వమ్'' అయ్యాయి.
పరమాత్మ యొక్క నైజాన్ని సూచించే ''తత్త్వం'' అన్న పదం మామూలు భాషలో, అందరికీ ఆమోద యోగ్యమైన నిశ్చయాన్ని 'తత్త్వం' అంటారు. ఏ విషయానికైనా గల అంతరార్థాన్ని తత్త్వమంటారు.
''నేను'' అని నువ్వనుకునే దాని గురించిన జ్ఞానమే, భగవంతుని గురించిన జ్ఞానం. ఈ అవగాహనే లేక పోతే భగవంతుని గురించి భావించటం కూడా అసాధ్యమే. ''జ్ఞానం నానుండి ఉద్భవిస్తుంది ఆలోచన నాతో వస్తుంది'' ''ఆలోచన వల్ల కలిగే జ్ఞానమూ ఎక్కడో దూరంగా ఉందని నువ్వనుకొనే ''అది'' (తత్) ఒక్కటే'' అని వేదాలు చెప్పుతాయి.
'అది, 'తత్' 'ఇదం' అని మనమనే దానికి మూలమంటూ ఉంది. దేని గురించైనా 'అది' అని మనమన్నామంటే దానికి మూలమంటూ ఏదో ఉండి తీరాలి. విత్తు లేకుండా చెట్టులేదు. ప్రపంచంలోని పర్వతాలు, సముద్రాలు, ఆకాశం, భూమి, గొడ్లూ, మానవులు, కోపము, భయమూ, ప్రేమ, ఇంద్రియాలు, శక్తీ - వీటన్నిటికీ మూలముంది. కనబడటం, వినబడటం, వాసన తెలియటం, ఉష్ణమూ, శీతలమూ తెలియటం - ఇవన్నీ మనస్సుకి తెలుస్తాయి. ఇంద్రియాలకి అనుభవమవుతాయి. వీటన్నిటినీ ''అది'' అంటాం. ఇప్పటి వరకూ సంభవించిన శాస్త్ర ఆవిష్కరణలు, ఇక ముందు సంభవించేవీ అంటే ఎరిగి ఉన్నవన్నీ ''ఇదం'' - వీటన్నిటికీ ఏదో మూలముంది. మూలం లేకపోతే ''ఇదం'' లేదు. దేనికైనా మూలం, ఒకనీతి, ఉండాలి మూలం లేకుండా ఏదీ లేదు.
మానవ శరీరం ''విత్తు'' నుండే ఉద్భవిస్తుంది. చెట్టుకి కూడ మూలం విత్తే. కాబట్టి దృశ్యమానమైన జగత్తుకి మూలమేదో ఉండాలి. ఈ జగత్తులో అంతర్లీనమై యున్న శక్తి కూడ ఏదో ఒక మూలం నుండి ఉద్భవించినదే అయి ఉండాలి.
అప్పుడే మొలకెత్తిన చింత చెట్టు విత్తనాన్ని తీసి చీలిస్తే, చిన్న చింత మొక్కని పట్టుకొని ఆ విత్తులోని రెండు భాగాలూ ఉన్నట్టు కనబడుతుంది. దీనికే మహావృక్షంగా ఎదిగే శక్తి ఉంది. అన్ని విత్తులకీ ఈ శక్తి ఉంది - చింత విత్తులో దీనిని ప్రత్యక్షంగా చూడగలం.
మంత్రాలలో ''బీజాక్షరాల''ని ఉంటాయి. ఒక మహావృక్షం ఒక చిన్న విత్తులోఉన్నట్టే. ఈ అక్షరాలలో అంతులేని శక్తి దట్టింపబడి యుంది. ఈ అక్షరాలని ఏకాగ్రతతో కొన్ని లక్షలసార్లు జపిస్తే వాటిలోని శక్తిని మనలో లీనం చేసుకోగలం.
ఈ జగత్తులో అంతర్లీనమై ఉన్న శక్తి, సమర్థత, వివేకమూ వాటి మూలమైన భగవంతునిలో కూడా ఉన్నాయి. ఆ విత్తు లేక పోతే అవి ఉద్భవించలేవు.
సృష్టిలో కలవాటినన్నిటినీ ''అది'' అంటాం - ఇది మూలం లేకుండా, విత్తులేకుండా, కారణం లేకుండా ఉదయించలేదంటాయి వేదాలు. ఈ మూలశక్తి జగత్తులో వ్యాపమై ఉంది. ఆ మూలమెక్కడ ఉంది? అది లోపలే ఉంది. ''అది'' బయటకు ''ఆత్మ''గా పైకి చూస్తుంది.
అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటాం. చుట్టూ నాలుగు అద్దాలను ఒక దానికొకటి సమకోణ స్థానంలో పెట్టితే లెక్కలేనన్ని ప్రతిబింబాలు కనబడుతాయి. అన్ని ప్రతిబింబాలనీ చూచేవాడూ, వాటికి కారకుడూ ఒక్క మనిషే. ఆ విధంగానే సృష్టిలోని కోటానుకోట్ల జీవరాశులలో ఉంటూ, సృష్టివైపు బయటకు చూచే ''అది'' భగవంతుడు తప్ప మరేదీ కాదు!
దృష్టే దృశ్యానికి మూలము, కారణమూను. జగత్తుకి కారణం ''జ్ఞానం''. ఈ జ్ఞాన మెక్కడుంది? మనలోనే ఉంది. అవిభాజ్యమై, పరిపూర్ణమైనదీ మనలో ఖండాలుగా కనబడుతుంది. రంగురంగుల విద్యుద్దీపాలున్నాయి - చిన్నవి, పెద్దవి, నీలంవి, ఆకుపచ్చనివి. అవి వివిధ ఆకారాలలో కూడా వస్తాయి. కాని వాటన్నిటిలోనూ కలది ఒకే విద్యుచ్ఛక్తి. అంతటా ఉన్న విద్యుచ్ఛక్తి బల్బులో కూడా ఉంది. అది వెలిగేట్టు చేస్తుంది, పంకాని తిరిగేట్టు చేస్తుంది. ఈ వ్యాపకాలన్నిటికీ కారణమొకే శక్తి. అది విశ్వవ్యాప్తమై, అవిభాజ్యమైన ఒకే విద్యుచ్ఛక్తి. కాని తీగె ద్వారా ప్రసరింప జేసినప్పుడు విడిపోయినట్లవుతుంది. ప్రకృతిలో మెరుపు మెరిసినప్పుడూ, జలపాతంగా నీరు క్రిందపడినప్పుడూ - ఆ శక్తి తనంతట తానే వ్యక్తమవుతుంది. కాబట్టి తత్త్వాన్ని, పరమతత్త్వాన్ని, పరమతత్త్వాన్ని, నీలో మెరుపుతీగె వలె మెరవనీ. కర్మానుష్ఠానంతో, అంటే యజ్ఞ యాగాదులతో దేవతారాధనతో, ఆరంభ##మై, మహావాక్య ఉద్దేశం గురించి గాఢమైన చింతనతో అంతమొందే అభ్యాసాలన్నిటికీ ఇదే లక్ష్యం. వేదాలు నిర్దేశించే సాంఘిక వ్యవస్థా, గృహస్థులూ, ప్రభుత్వము పాటించవలసిన విధులూ, కళలూ, వైద్యము, భూగర్భశాస్త్రమూ - ఇతర విద్యలూ - ఇవన్నీ ఆత్మసాక్షాత్కారానికి దారి చూపే సోపానాలు. ''తత్'' ''త్వం'' ల కలయిక మొదట్లో క్షణికంగా, ఒక మెరుపువలె తెలుస్తుంది. ఈ పరిస్థితినే కేనోపనిషత్తు (4.4) వర్ణిస్తుంది: ''బ్రహ్మజ్ఞానం మెరుపులో మెరుపువలె ఉంటుంది. లిప్తపాటు మాత్రమే తెలుస్తుంది. ''తసై#్యష ఆదేశః యదేతద్విద్యుతో వ్యద్యుతదా''. అభ్యాసాలను విడనాడకుండా ఆచరిస్తూంటే నిత్యం విద్యుత్తుని ఉత్పాదం చేసే జలపాతం వలె ఆ చైతన్యస్థితిలో ఎల్లప్పుడూ ఉండవచ్చు. అదే మోక్షం - జీవన్ముక్తి. మరణించిన తరువాత ఆ చైతన్యం పరమాత్మలో లీనమై పోతుంది. జీవించి యుండగా ముక్తి, మరణానంతరం మోక్షమంటూ భేద మేర్పరచుకున్నా - జ్ఞానికి రెండూ ఒకటే.
వేదాల పరమోద్దేశం ఒకటే. మనల్ని బ్రహ్మానుభూతిని అనుభవసిద్ధం చేసి కొమ్మని, చిదానందం పొందమని చెప్పటమే.
వార్తాపత్రికల ద్వారా ప్రపంచం నలుమూలలా జరిగే విషయాలని తెలుసుకుంటాం. వార్తలు విలేఖరుల ద్వారా సేకరింపబడుతాయి. ఏ ఆధునిక సాధనాలూ, ఆఖరికి మానవుని మేధ కూడ, గ్రహింపలేని విషయాలు కొన్ని యున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకొక రకమైన వార్తా పత్రికలు కావాలి.
ఆధునిక ప్రచార సాధనాల ద్వారా ప్రసరింప వీలు లేనిదీ టెలిగ్రాఫ్కీ, టెలీప్రింటర్కీ అందనిదీ వేదమంత్రాల ద్వారా ప్రసారమవుతుంది. అతిలోక శక్తులు గల ఋషులు వీటిద్వారా, మామూలు బుద్ధి గ్రహింపలేని విషయాలను ప్రసరింప జేశారు.
వేదాలలో చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. అయినా కొన్నిటిని దాటేయవచ్చు. ఉపేక్షింప వచ్చు. కొన్నిటిని ''ఉపేక్షింపవచ్చు'' నన్నప్పుడు ఆ విషయాలు అప్రధానమని గాని, వేదాలలో తప్పులున్నాయని గాని నా భావం కాదు.
ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించేప్పుడు వేదాలు దానికి పూర్వం ఎన్నో ఇతర విషయాలని గురించి చెప్పి ఆ ముఖ్యమైన విషయానికి మనలను సమాయుత్త పరుస్తాయనో, దృష్టాంతంగా పేర్కొంటాయనో మన పెద్దలు చెప్పారు. ఆ ముఖ్యమైన విషయాన్నేదో గ్రహించాలి. మిగిలిన వివరాలన్నీ దాని గ్రహింపుకి ఉపయోగపడేవేనని గుర్తుంచు కోవాలి. కొన్ని విషయాలు ప్రాథమిక, మధ్యమిక స్థితులలో అవసరమైన పోను పోను, ఉత్తమస్థితికి వెళ్లిన కొద్దీ, ఆత్మజ్ఞానం వృద్ధి అవుతున్న కొద్దీ, దశలవారీగా వాటిని విడిచివేయాలి. ఈ మాటని వేదాలే అంటాయి. అందుచేత, ఒక దశలో ఆమోదయోగ్యమైనది మరొక దశలో కాకపోవచ్చు.
వేదాలలో కొన్ని సత్యాలున్నాయి. పరమతాత్పర్యాలు. వాటిని యథాతథంగా అంగీకరించాలి. మిగిలిన వాటిని ఆప్రధానాలుగా భావించవచ్చు, లేదా విడిచివేయవచ్చు - అర్థవాదమూ, అనువాదమూ అంటారు వీటిని.
ఒక ధర్మాన్ని గాని, ఒక సత్యాన్నిగాని మనం స్థూలంగా అర్థం చేసుకోవటానికి వీలుగా కథలనీ, ఉపాఖ్యానలనీ వేదాలు చెప్తాయి. అటువంటి సందర్భాలలో ధర్మాన్నిగాని, సత్యాన్నిగాని మనం గ్రహించి ఉపాఖ్యానాలను అర్థవాదమంటూ విడిచి పెట్టాలి. అంటే అర్థవాదం కేవలం ఉపమాన ప్రాయంగానే తీసుకోవాలి గాని యథాతథంగా కాదు.
అనువాద మంటే ఏమిటి? మనమెరుగని విషయం గురించి చెప్పేప్పుడు మనమెరిగిన విషయం చెప్పటం మొదలుపెట్టి కొనసాగిస్తాయి వేదాలు. మనకి తెలియని విషయాన్ని గమ్యంగా పెట్టుకొని తెలిసిన విషయాన్నీ పదే పదే చెప్తాయి. అంటే మనకి తెలిసినవీ, తెలియదగినవీ అయిన ఉదాహరణలిస్తాయి. వీటి గురించి తెలుసుకోవటానికి వేదాల సహాయమవసరం లేదు. ఇతర ప్రమాణాల వల్ల ఎరుగరానివీ, వేదాలు చెప్పేవీ - అదే ''విధి'' ఉపదేశము.
దీనినే మరొక విధంగా చెప్పవచ్చు. సామాన్యంగా తెలియటానికి అవకాశమున్న విషయాలనే, వేదాలలో తిరిగి తిరిగి చెప్పినా, వాటికి వేదాలు ప్రమాణం కానేరవు. తెలియని వాటిని తెలియచెప్పటమే వేదాల లక్ష్యం. మనకి తేలికగా అర్థమవటానికి మాత్రమే మనకి సుపరిచతమైన విషయాలతో వేదాలు ప్రారంభిస్తాయి. ఇదే అంతిమ లక్ష్యమైతే, అజ్ఞాతమైన దాని గురించి చెప్పటంలో అర్థం లేదు. అంతేకాదు, తెలియని వాటి గురించే వేదాలు ప్రస్తావిస్తూంటే ''నాకు తెలిసిన దానినే స్వీకరిస్తాను, తెలియని దానిని నిరాకరిస్తాను'' అని ఎట్లా అనగలం? అయితే, తెలిసిన దేమిటి, తెలియనిదేమిటి?
లోకంలోని వస్తుజాలం గురించి రెండు అభిప్రాయాలున్నాయి. మనకి తెలిసిన వన్నీ ఒకటేనా, లేక వేరువేరా అన్న సందేహం కలుగుతుంది. ఆ రీతిగా వస్తువులని రెండు వర్గాలుగా విభజిస్తాం. భౌతికజ్ఞాన సహాయంతో లోకంలోని వస్తువులన్నీ వేరువేరని నిర్ణయిస్తాం. అట్లా వేరు వేరని ఎరుక కలిగి యుండటం వల్లనే లోకవ్యవహారం సాగుతుంది. నీటినీ, నూనెనీ వేరువేరుగా భావించాలి. దీపం వెలిగించాలంటే నూనెని ఉపయోగించాలి నీరెందుకూ పనికి రాదు. దీపం పెద్దదిగా వెలిగి, ఇల్లు నిప్పంటుకుంటే ఆ మంటని ఆర్పటానికి నీరు అవసరమవుతుంది. నూనె పోస్తే మంట మరీ పెద్దదవుతుంది. కాబట్టి ఏ పనిని చేయాలన్నా వివిధ వస్తువులని మనస్సులో గుర్తుంచుకోకపోతే ఏ పనీ సవ్యంగా జరుగదు. ఈ విధమైన వ్యత్యాసభావాన్ని ద్వైతం లేక ద్వయీ భావమంటారు. ఈ ద్వైతభావమే వేదోక్తమైన కర్మలకూ, ఉపాసనలకూ మూలం. కాబట్టి, అటువంటి సందర్భాలలో వేదాల ప్రభావం ద్వయీ భావమే నన్నది స్పష్టం. దీనిని అద్వైతి వ్యతిరేకించ నవసరం లేదు. దృశ్యమానమైన జగత్తు విషయంలో ద్వయీ భావం వాస్తవమే. కాని మనమనుకొనే ఈ ద్వైతం తోనే ఆగిపోతాయా వేదాలు? అట్లా ఆగిపోతే, వేదాల లక్ష్యం ద్వైతమనే అనుకోవచ్చు. కాని సంహితంలో కొన్ని చోట్లా, వేదాంత మంతటా వేదాలు అద్వైతం గురించే చెప్తాయి.
మన ధర్మశాస్త్రాలలో రెండు పద్ధతులున్నాయి. ఒకటి పూర్వపక్షమూ, రెండు సిద్ధాంతమూ. భిన్నాభిప్రాయం కల వారి వాదనని పూర్వపక్షమంటారు, ఒకరికి గల అభిప్రాయానికి వ్యతిరేక భావం పూర్వపక్షాన్ని ముందు చెప్పి తరువాత దాని ఖండన మొదలవుతుంది. అంటే, కావాలనే ఎదిరి వాదాన్ని చెప్పి తరువాత దానిలోని లోపాలను ఎత్తిచూపటం.
''దర్శనాలు'' అనబడే మన తత్త్వగ్రంథాలను పాశ్చాత్యులు కూడ చాల మెచ్చుకొంటారు. దీనికి కారణమిది. అవి ప్రతిపక్షుల అభిప్రాయాలను ఏ మాత్రమూ దాచక పూర్తిగా వివరించి, ఆ తరువాత తమ అభిప్రాయాలను పేర్కొనటం.
వేదాలలోని జ్ఞానకాండ - అంటే ఉపనిషత్తులు - అద్వైతం గురించే చెప్తుంది. కాని ద్వైతం గురించి చెప్పే కర్మకాండ తరువాతనే ఉంటుంది.
మనందరికీ సుపరిచితమైన ద్వైత భావాన్ని మొదట చెప్పి ఆ తరువాతనే అద్వైత ప్రసక్తి వేదాలు చేయటం వల్ల వేదాలు అద్వైత సిద్ధాంతాన్నే బలపరుస్తాయని తేటతెల్ల మవుతుంది. ఇదే లక్ష్యమని కూడ తెలుస్తుంది.
పూర్వ పక్షంలో వలె ద్వైతానికి ఖండన లేదే అనవచ్చు. దానికి కారణమిది. ద్వైత భావానుసారం చేసే కర్మలు, ఆరాధనలూ అద్వైతం చెప్పే ''అనుభవాని''కి వ్యతిరేకం కావు. పైగా, అవి గమ్యాన్ని చేరటానికి ఉపకరించే సాధనలు. పూర్తిగా ధ్వంసం చేయటానికి శత్రువుని పెట్టినట్టు పూర్వ పక్షంలో ఇవి లేవు. ద్వైత సిద్ధాంతం వ్యతిరేక భావంగా ఎక్కడా చెప్పబడలేదు. ఖండింపబడలేదు.
మొదట పువ్వు వచ్చి అది రాలి పోయి ఫలం మిగిలిస్తుంది. మొదట ద్వైత భావాన్నుంచుకోవాలి. తరువాత అద్వైతానికి చేరి దానిని విడిచిపెట్టాలి. పువ్వూ, ఫలమూ ఒకరికొకరు శత్రువులు కారుకదా! చివరికి వచ్చేది ఫలమే కాబట్టి పువ్వునెవ్వరూ నిరసించరు.
ఇతర సిద్దాంతాలు కూడ అర్హస్థానాలలో ఉండి, ఉచిత రీతిలో తమవాదాలని బయటపెట్టి నట్లైతే అద్వైత సిద్ధాంతం వాటిని కూడ ఖండించవలసిన అవసరం వచ్చేది కాదు. అవి హద్దు మీరిన తరువాతనే వాటి ఖండన అవసరమయింది. ఆదిశంకరుడు. ఇతర అద్వైతులు ఈ భావంతోనే ఇతర సిద్ధాంతాలను చూచారు. అదృష్టవశాత్తూ విజ్ఞానశాస్త్రాభివృద్ధి తాత్త్విక సిద్ధాంతాలకు ఏ కీడూ చేయలేక పోయింది. నిజానికి ఆధునిక శాస్త్రం అద్వైత సిద్ధాంతాన్ని సమీపిస్తోంది. ఆ సిద్ధాంతాన్ని అంతకు పూర్వం వేద ప్రమాణం వల్ల తప్ప వేరే విధంగా అవగాహన చేసికోవటం సాధ్యమయేది కాదు. ఆరంభంలో, విజ్ఞాన శాస్త్రానుసారం భూమిమీది పదార్థాలన్నీ ఒకదాని నుండి వేరొకటి భిన్నం. ఆ తరువాత అన్ని పదార్థాలకీ మూలం 72 ధాతువులు మాత్రమే నన్నారు. ఆ ధాతువుల మిశ్రమాలే అసంఖ్యాకమైన పదార్థాలన్నారు. అణుశాస్త్రం అభివృద్ధి అయిన తరువాత ఈ 72 ధాతువుల మూలమూ ఒకటే నన్నారు. అదే ''శక్తి''. మన పరిభాషలో తత్త్వ చింతనలో బాగా పురోగమించి, సత్యాన్ని గ్రహించిన వారు శక్తి అనబడేది చైతన్యమేననీ దాని పరిధిలో అచేతన పదార్థాలే కాక ఎరుకకు ప్రతీకయైన జీవాత్మకూడ ఉందనీ గ్రహించారు.
ఈ విశ్వవ్యాప్తమైన చైతన్యం ఇంద్రియగ్రాహ్యం కాదు. శాస్త్రజ్ఞునికైనా, తత్త్వవేత్తకైనా! అది అనేక రూపాలలో మనకి కనబడటమే ద్వైతం. ద్వైతం పరమసత్యమైతే వేదాలని సంప్రదించ వలసిన అవసరం లేదు.
ఇంద్రియాలకూ, బుద్ధికీ కనబడే వాటి గురించి అవి ప్రస్తావించవలసిన అవసరం లేదు. వేదాల సార్థకత - మనమెరిగిన విషయాలను చెప్తూ, చివరికి మనమెరుగ వలసిన దానిని తెల్పటంలోనే ఉంది. జీవాత్మ పరమాత్మలో లీనపోయి అద్వైతమైన బ్రహ్మమవటమే అసలు సత్యం!
* * *