Acharyavaani - Vedamulu Chapters Last Page
13. ఉపనిషత్తుల ఉపదేశసారం
అంతిమ దశను చేరుకోవటానికి ఉపనిషత్తులు చేసే ఉపదేశానికి సారాంశ##మేమిటి ?
ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం దృశ్యమానమైన జగత్తు దేశ-కాలాలనే భావాల సంయోగం వల్లనే సాధ్యం. ఈ భావాలనధిగమిస్తేనే సత్యం తెలిసికోవటం సాధ్యమంటాయి ఉపనిషత్తులు. ''దేశ'' మనే భావం పోవటానికి వెనుక క్షితిజం వద్ద నిలబడటం గురించి యిచ్చిన ఉదాహరణ చాలు. ఆ విధంగానే ''కాల''మన్న భావాన్ని కూడా అధిగమించాలి.
వీటి గురించి సిద్ధాంతీకరించటం చాలా? గ్రహింపు మన వల్లనౌతుందా? ఇది సాధ్యమేనని ఋజువు చేయటానికి నిత్యజీవితంలో ఒక ఉదాహరణ చాలు. కాలక్షేపానికి ఆఫ్రికాలోజరిగే యుద్ధాన్ని గురించి చదువుతాం. కాని ఏ కాశ్మీరులోనో, పాకిస్తాన్లోనో యుద్ధమవుతోందనుకోండి అప్పుడు ఆఫ్రికా (కాంగో)లో జరిగే యుద్ధం గురించి ఆసక్తి తగ్గి సమీపాన జరిగే యుద్ధం గురించి ఆసక్తి ఎక్కువ అవుతుంది. ఆ పత్రికా సంపాదకుడు కూడా ఆఫ్రికాలో జరిగే యుద్ధాన్ని ఏ మూలో అచ్చువేస్తాడు. పాకిస్తాన్లో జరిగేదాన్ని మొదటిపేజీలో పతాకశీర్షికలతో అచ్చువేస్తాడు. అప్పుడు ఈ వార్తమనకింకా ముఖ్యమనిపిస్తుంది. అంతకన్నా ఆసక్తిదాయకంగా సమీపంలోని రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు తగాదాకి మనమాకర్షితుల మవుతాం. పొరుగు వీధిలో అల్లరి జరిగితే, రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాని ప్రక్కకు పెట్టుతాం. వార్తా పత్రికను అవతల పారేసి ప్రక్కవీధికి పరుగెత్తుతాం. మనమక్కడ ఉండగా, మన యింట్లోనే, పిల్లల మధ్యో, అత్తా కోడళ్ల మధ్యో తగాదా జరుగుతోందని ఎవరైనా వచ్చి చెప్పితే ఆ వీధి అల్లరిని విడిచి, యింటికి పరుగెత్తుతాం.
అంతర్జాతీయ వ్యవహారాల సందర్భంలో ఆఫ్రికా యుద్ధం ముఖ్యమే అవవచ్చు, అక్కడ్నుంచి పాకిస్తాన్లో యుద్ధమూ, రాష్ట్రాల సరిహద్దు తగాదా, పొరుగు వీధిలో అల్లరీ, యింటిలోని గొడవా - చిన్నచిన్నవిగా చివరికి ఏ ప్రాధాన్యమూ లేనివిగా అయిపోతాయి. కాని మన ఆసక్తి ఈ క్రమానికి వ్యతిరేకంగా సంఘటన దగ్గరైన కొద్దీ ఎక్కువ అవుతూవచ్చింది. ఎందుచేత? దూరం తగ్గిన కొద్దీ మన ఆసక్తి అధికమవుతూండటమే దీనికి కారణం.
ఆ ఉపమానాన్ని విడిచి లోదృష్టి వైపు మళ్లుదాం. మన అంతరంగంలో జరిగే సంఘర్షణల గురించి తెలుసుకుంటే - మిగిలిన సంఘర్షణలన్నీ ఆఫ్రికాలోని యుద్ధంవలె అప్రధానమవుతాయి. ఈ అంతః కలహాలను సమాధాన పరచుకొని శాంతి సామరస్యాలని నెలకొల్పటానికి ప్రయత్నిద్దాం. ఆ ''శాంతం''లో దేశ - కాలాలు మాయమవుతాయి. నిద్రలో ఈ ''దేశ'' భావముంటుందా? ఉండదు. ఆ ఎరుకే, ఆ అనుభూతే ఉండదు. జ్ఞానోదయం కలిగితే - ఆ జ్ఞానమయస్థితిలోనే, అనుభూతిలోనే ఉండటం సాధ్యం. అప్పుడు అందులో స్థలానికి స్థానముండదు.
''కాల''మన్న భావం కూడా ఇటువంటిదే. తండ్రి పోయినప్పుడు ఎంతో దుఃఖిస్తాం. ఇప్పుడా కన్నీళ్ళేమై పోయాయి? దగ్గరవారు పోయినప్పుడు పొంగిపొర్లే దుఃఖం ఆ మర్నాటి వరకూ ఉండదు. ఎందుచేత? ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి నప్పుడు గాని, లాటరీ గెలిచినప్పుడు గాని కలిగే సంతోషాతిరేకం కూడ కాలక్రమేణా వాడిపోతుంది. ఎందుచేత?
'దేశం'లో వలెనే 'కాలం' విషయంలో కూడా సంఘటన దగ్గరైన కొద్దీ మన స్పందన బలీయమవుతుంది. సమీపకాలంలో జరిగిన సంఘటన వల్ల మనమెక్కువగా ప్రభావితులమవుతాం.
బయటి విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ దేశ-కాలాల ఎరుకని కలిగియుంటే, మన ప్రమేయం లేకుండానే ఆ ఆలోచనలు అప్రధానమయి పోతాయనీ, వాటికి మనపై ప్రభావమేమీ ఉండదనీ గ్రహిస్తాం. ఇది ఎంతో ఆశాజనకమైన విషయం. మన ఆలోచనలనే లోపలికి తిప్పి గట్టిగా ప్రయత్నిస్తే ఈ దేశకాలాల ప్రభావం నుండి బయటపడటం సాధ్యమే. నిద్రలో, దేశకాలాల గురించి ఎరుకలేక పోయినా, ఆ స్థితి గమనికే యుండదు. తాయుమానవర్ చెప్పినట్టు జ్ఞానం కలిగితే ''నిద్రపోకుండా నిద్రపోయే'' స్థితిని - అంటే దేశకాలాలని కావాలనే అధిగమించి, చిదానంద స్థితిని చేరవచ్చు.
అప్పుడు ఆఫ్రికాలో యుద్ధమే కాదు, మననే ఎవరైనా కత్తితో పొడిచినా ఏమీ పట్టించుకోకుండా, దూరంగా జరిగే యుద్ధం వలె, ఉండటం సాధ్యమవుతుంది. దగ్గర బంధువు - భర్తో, భార్యో, బిడ్డో, తన కళ్ల ఎదుటే పోయినా కూడా దాని ప్రభావమెంతో సన్నగా ఉంటుంది - ఏ పది సంవత్సరాల క్రితమో సంభవించిన తండ్రి మరణం వలె!
సరే, అద్వైతమూ, ద్వైతమూ, వీటి లక్షణాలనీ ప్రక్కకు పెడ్దాం కాస్సేపు. మనం గాఢంగా కోరుకొనేది ఏమిటి - శాంతి!
మంచీ, చెడూ రెండూ మనల్ని ప్రభావితం చేస్తాయి. ఏడుపూ, నవ్వూ రెండూ సంకటాన్నే కలిగిస్తాయి. రెండూ లేకుండా ఉంటేనే నయం. మరీ ఎక్కువగా నవ్వినా డొక్కలు నొప్పి పెట్టుతాయి, నీరసింప జేస్తాయి. కోపంగా, ''నన్నింక నవ్వించవద్దం''టాం. నాట్యమాడటం సంతోషదాయకమే కావచ్చు. కాని శరీరమలసి పోతుంది. ఒక దశలో ''చాలు'' ననిపిస్తుంది. ఒంటరిగా, ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. మనకి కావలసిందదే - అద్వైతమూ కాదు, ద్వైతమూకాదు.
మనకి అనుభూతుల బారి నుండి విముక్తి కలిగించే ఉత్తమ దేశికులు ఈ కాలమూ, దేశమూను. ఇప్పుడు జరిగే సంఘటనలు ఎప్పుడో, ఎక్కడో జరుగుతున్నట్టు భావించే శక్తిని ప్రసాదించమని మనం భగవంతుని వేడుకోవాలి.
ఈశావాస్య ఉపనిషత్తు ఇట్లా అంటుంది. ''అది (ఆత్మ) కదులుతుంది (కాని) కదలదు - అది దూరస్థం కాని మన దగ్గరే, లోపలే, ఉంటుంది.''
''తదేజతి తన్నైజతి తద్దూరే తద్వన్తికే|
తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః'' (ఈ. 5)
ఇక్కడ దేశమూ, కాలమూ కలిగించే మానసికావస్థల గురించే కాక వాటి ప్రభావం నుండి విముక్తులం కావాలన్న ఆసక్తినీ కలిగిస్తుంది. ఈ ఉపనిషత్తులోనే దీని తర్వాత వచ్చే మంత్రాలలో, దేశకాలాలు ఆత్మస్థితాలే అని గమనించమని యుంటుంది. ఇది గ్రాహ్యమైతే, ఇక కోపం లేదు. మోహం లేదు, దుఃఖం లేదు - ఒక్కమాటలో చెప్పాలంటే, మానసిక సంక్షోభం లేదు. ఆ తరువాత ఇంకొక మంత్రం - ఆత్మ విశ్వవ్యాప్తమవటం వల్ల దూరాన్ని అధిగమించిందనీ, ఆ పిదప ఆత్మ కాలాతీతమనీ కూడా చెప్తుంది.
మొత్తం మీద ఉపనిషత్తులు కూడ ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రతిపాదించే దృశ్యమాన జగత్తు దేశ కాల సంయోగ జన్యమనే సత్యాన్ని ఒప్పుకుంటుంది. అయితే ఆధునిక విజ్ఞాన శాస్త్రం విషయంలో ఇది ఒక సిద్ధాంతము మాత్రమే. ఉపనిషత్తులు ఇది స్వానుభవంలో అనుభవించ వలసిన అనుభూతి అంటాయి. వేదాలకు శిరోభూషణాలైన ఉపనిషత్తుల సందేశమిదే!
* * *