Acharyavaani - Vedamulu Chapters Last Page
14. వేదశాఖలు
వేదాలు అనంతములు (అనంతా వై వేదాః). వేదాంతమంటే వేదాలయొక్క అంతం. ''అనంతమైన వేదాలకి అంతమేమిటి''?
వేదాల ముఖ్యోద్దేశం ఆత్మసాక్షాత్కారం. ఇదే ఆధ్యాత్మిక సత్యాలకు చివరిమెట్టు. దీని గురించి చెప్పటం వల్ల వేదాంతమయింది. మరో విధంగా చెప్పాలంటే, వేదాల అన్వేషణకు అంతమన్నమాట. వేదాల చివరిలో ఉంటుంది వేదాంతం.
బ్రాహ్మణుడుగా పుట్టిన ప్రతివాడూ ఏ కారణాలనీ అడుగకుండా, విధిగా తమ వేదశాఖని అధ్యయనం చెయ్యాలి. అభ్యసించాలి. వేదశాఖకి సంహిత, బ్రాహ్మణము, ఆర్యణకము, చిట్టచివర ఉపనిషత్తు ఉంటాయి. వేదశాఖకి చివరిది ఉపనిషత్తు.
అనంతమైన వేదాలను శాఖలుగా విభజించటంలో అంతరార్థమేమిటి? ఆధ్యాత్మిక ప్రగతి సుసాధ్యం కావటానికి మనిషికి అన్ని విషయాలూ బోధించాలి. మొదటిది, వేదాధ్యయనం, వేదాలని వల్లె వేయటం. ఆ తరువాత యజ్ఞాలూ ఇతర కర్మలూ అభ్యసించాలి, ఆచరించాలి. వీటికి సంబంధించిన మంత్రాలను నేర్చుకోవాలి. ఆ తరువాత యజ్ఞాల ప్రయోజనం గురించి తెలుసుకోవాలి. చిట్టచివరికి పరమాత్మ తత్త్వాన్ని పఠించి, అనుభవసిద్ధం చేసుకోగలగాలి. వేదాన్ని పఠించే విద్యార్థికి ఇవన్నీ నేర్పాలి.
ఆత్మసాక్షాత్కారానికి సరిపడినంత నేర్పాలి. అన్ని వేదశాఖలనూ క్షుణ్ణంగా తెలుసుకోవటం అసాధ్యం. కొన్ని వేల సంవత్సరాలు పఠించిన తరువాత కూడ భరద్వాజ ముని వంటి వారికి వేదమనే పర్వతం నుండి గుప్పెడు మట్టి మాత్రమే లభించిందట. కాబట్టి, మనిషికి మనస్సు క్షాళనమై, పరమాత్మలో లీనమవటానికి సరిపడినంతమేరకు అనంతమైన వేదాలని కూర్చి వర్గీకరించారు. ఇవే వేదశాఖలు.
పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ బ్రాహ్మణుడు నిర్వహించ వలసిన విధులను వేదశాఖ వివరిస్తుంది. ఆరంభంలో శాఖను అధ్యయనం చెయ్యాలి. అంటే, సంహితలోని మంత్రాలను కంఠస్థం చెయ్యాలి. ఆ తరువాత బ్రాహ్మణాలలోని మంత్రాల సహాయంతో యజ్ఞాలను చెయ్యాలి. ఆ పిదప వెలుపలి కర్మకూ లోపలి అనుభవానికీ గల అంతరాన్ని కలిపే ఆరణ్యకాలను మననం చెయ్యాలి. ఆ తరువాత ఆంతరసత్యం గురించి తెలిపే ఉపనిషత్తులని జీర్ణం చేసుకోవాలి. అంతరము, బాహ్యము అన్న భేదభావం సమసిపోయే మోక్ష స్థితిని అందుకోవాలి.
ప్రతి శాఖకీ ఇదే ప్రణాళిక, ఇదే ఉద్దేశం. పరిణితాత్మునికి ఒక్క మంత్రమే చాలు సత్యాన్ని గ్రహించటానికి. కాని సామాన్యుడు ఎన్నో కర్మలను ఆచరించాలి, ప్రతి దశలోనూ అధ్యయనం, మననం చేస్తూనే ఉండాలి. అందువల్లనే ప్రతిశాఖలోనూ సామాన్యుడు ముక్తినొందటానికి కావలసిన మంత్రాలు, కర్మలు, ఆధ్యాత్మిక ఆదేశాలు ఉన్నాయి.
బ్రాహ్మణతరుల మాట ఏమిటి ?
బ్రాహ్మణతరులు మాత్రం పురోగమించవద్దా? వైదిక కర్మలు, అనుష్ఠానాలు వారికి కావు. కాని వారికి తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చటం, మానసికోన్నతికి, ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తాయి. ఏ వర్గానికి చెందినా, విధ్యుక్త ధర్మాన్ని నిజాయితీతో నెరవేర్చి, ఫలితాన్ని భగవంతునికి వదిలితే గమ్యం చేరవచ్చు. కృష్ణ భగవానుడు గీతలో ఇలా అన్నాడు.
''స్వ కర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దన్తి మానవాః'' (18 : 46)
యుద్ధాన్ని చేసి దేశాన్ని రక్షించటం కొందరి ధర్మం. మరొకడు వ్యాపారి. ఇంకొకడు పశులకాపరి, గోవులను పరిరక్షిస్తాడు. మరొకడు కాయకష్టం చేస్తాడు, కూలి వాళ్లని సమకూరుస్తాడు. తన రంగంలో పనిచేసుకొంటూ భగవత్సాక్షాత్కారాన్ని పొందవచ్చు.
లోకంలో అందరూ సుఖప్రదంగా ఉండటానికి అనువైన వృత్తులనూ ధర్మాలనూ కొందరు ఆచరిస్తూంటే బ్రాహ్మణుని విధి ఏమిటి?
జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సమాజశ్రేయస్సు కోసం దైవానుగ్రహం సంపాదించటం. అటువంటి అనుగ్రహాన్ని సంపాదించటం బ్రాహ్మణుని విధి. భగవంతునికి సామంతులనదగ్గ దేవతల అనుగ్రహాన్ని కూడ బ్రాహ్మణులు అందరికీ లభించేట్టు పాటుపడాలి. అతడు పఠించే వేదమంత్రాలూ, చేసే వైదిక కర్మలూ సమాజంలోని అందరి శ్రేయస్సుకీను - తన ఉన్నతికోసమే కాదు.
అలౌకిక శక్తులతో వ్యవహారం కాబట్టి అతను మంత్రాలను నేర్చుకోవాలి. ఆ మంత్రాలిచ్చే శక్తి సంపాదించాలి. దానికై మిగిలిన వారి కంటె ఎక్కువ నియమమూనిష్ఠా అనుసరించాలి. బ్రాహ్మణునికి వలె అంతటి దీక్ష యితరులకి అవసరం లేదు. బ్రాహ్మణుని విధ్యుక్త ధర్మం లోక శ్రేయస్సు కోసమే ప్రార్థన చేయటం, కృషి చేయటం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే కొన్ని విద్యలకు బ్రాహ్మణుల కొరకే నియుక్తమైనాయన్న తప్పుడు అభిప్రాయం పోతుంది.
అంతేకాక, ఇతర కళలను శాస్త్రాలను పనులను చేయటాన్నీ కూడ బ్రాహ్మణుడు అభ్యసించాలి. అట్లా చేస్తేనే ఇతరులకు తమ విధులను గురించి బోధించ గలుగుతాడు. బోధనే అతని వృత్తి. మిగిలిన వృత్తుల గురించి ఎరుక కలిగి యుండాలి వాటిని నేర్పటానికి మాత్రమే. తనకి విధింపబడని వృత్తులను చేపట్టరాదు. దేశ రక్షణ, వ్యాపారము, వ్యవసాయము ఇతర వృత్తులను అతడు చేపట్టక ఆయా వృత్తులను ఆశ్రయించిన వారికి తగిన శిక్షణ ఇవ్వకలిగి, తద్వారా వారి శీలాన్నీ, మనస్సునీ, బుద్ధినీ రూపొందించ గలగాలి. అందుచేత, బ్రాహ్మణునిది గురుతరమైన భాద్యత. ఈ భాద్యతని నిర్వహించే వానికి చిత్తశుద్ధీ, పరిణిత బుద్ధీ లేకపోతే సత్ఫలితముండదు. అతని మనస్సూ, బుద్దీ బాగా వికసించి యుండకపోతే ఇతరులకు ఉన్నతి నెట్లా కలిగించ గలుగుతాడు? కాని అతనికి ఒక పెద్ద ఆటంకముంది. తాను ఎప్పుడూ బుద్ధితోనే పనిచేస్తాను కదాని తాను ఇతరుల కంటే అధికుడనన్న భావం కలిగితే అది పెద్ద ఆటంకమవుతుంది. ఈ కారణాల వల్ల బ్రాహ్మణుడు ఎంతోపరిశుద్ధతతో ఉండాలి. అతని అహంకార మధికమవటానికి ఎన్ని కారణాలున్నా, అతను ఎంతో వినమ్రుడై, స్వార్థరహితుడై యుండాలి. అందువల్లనే అతని అహంకారమూ, ఇతర వికారాలు సమసిపోయి, సాధువవటానికి - అతనికి నలభై సంస్కారాలు విధించారు.
మంత్రాలు సత్ఫలితాలివ్వాలంటే ఎంతో నిగ్రహము, సంయమనము కలిగి యుండాలి. ఏ మంత్రాన్ని ఎప్పుడు, ఎట్లా పఠించాలో, అంటే అధ్యయనం ఎప్పుడు చెయ్యాలి, ఏ తిథినాడు పఠించాలి, దానితో బాటు సమర్పించాల్సిన ఉపహారమేమిటి - ఇటువంటి, నియమాలెన్నో యున్నాయి. వీటి ప్రకారం నడుచుకోక పోతే, ఆ వ్యక్తికి సంబంధించినంత వరకూ, ఆ మంత్రశక్తి క్షీణిస్తుంది. ఉదాహరణకి గ్రహణసమయంలో మంత్రాన్ని పఠిస్తే దాని పటిమ వృద్ధి అవుతుంది. ప్రతి ఒక వేదశాఖ ఈ మంత్రాల తత్త్వమూ, ఫలితమూ వేదవిదితునికి ఆత్మసాక్షాత్కారము కలిగే విధము గురించి సమగ్రంగా వివరిస్తుంది.
వాడుకలో ఉన్న శాఖల వర్గీకరణ :
పూర్వకాలంలో మనుష్యునికి ఎంతో బుద్ధికుశలతా శారీరక దార్డ్యమూ ఉండేవి. వారికి యోగశక్తీ, మేధాసంపదా ఉండేవి కనుక ప్రతివారూ ఎన్నో వేదశాఖలను వల్లించగల సమర్థులై ఉండేవారు. కొందరి ఋషులకు వేదాలు వారి మనస్సులలోసధ్యఃస్ఫూర్తితో విశదమైనాయి. అసాధారణమైన ప్రజ్ఞగల ఇతరులు గురువుల వద్ద మనం ఊహించలేనన్ని శాఖలను అభ్యసింప గలిగేవారు. ఆ తరువాత చాలా సందర్భాలలో వేదమంత్రాలు వారి మనస్సులలో ద్యోతకమయ్యేవి.
గురువు వద్ద నేర్పిన దానిని వారెంతో అభివృద్ధి చేసుకోగలిగేవారు. వేదాలని సాగరంతో పోలిస్తే ఎవ్వరికీ వాటి సంపూర్ణ అవగాహన ఉండేది కాదన్నది సత్యం. కాని ప్రాచీన కాలంలో చాలామంది అధికభాగాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు.
కాలక్రమేణా మనుష్యులు యోగశక్తులను కోల్పోయారు. కలియుగం రావటంతో ఆ శక్తి యించుమించు మాయమై పోయింది. పూర్వపు మహనీయులతో పోలిస్తే - ఆయుర్దాయం, ఆరోగ్యము, బుద్దిగరిమ - అన్నీ క్షీణించి పోయాయి.
ఇదంతా భగవంతుని లీల. దీనికి కారణం అనుహ్యం. శ్రద్ధగా వేదాలను అధ్యయనం చేసి, యజ్ఞాలను ఆచరించి, ధ్యానం చేసి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వారు వాటి సత్ఫలితాలను భావితరాల వారికి అందివ్వకుండా ఎందుకు వెళ్లిపోయారో చెప్పలేం. ఒక పద్ధతిని అవలంబించకుండా జగన్నాటక సూత్రధారి ఈ నాటకాన్ని ఆడిస్తున్నాడనుకోవటమే దీనికి సమాధానం.
డార్విన్ వంటి శాస్త్రజ్ఞులు జీవన పరిణామపు అంతిమ దశ##యైన మానవుని చేరే వరకూ అభివృద్ధి చెందుతూనే వచ్చిందన్నారు. కాని ఆ పిదప, ఆధ్యాత్మికతా, మేధాసంపదా, నైతిక విలువలూ, యోగ బలమూ, మనోబలమూ ఆ అభివృద్ధి క్రమానికి విరుద్ధంగా క్షీణిస్తూనే వచ్చాయి. అన్నిటా తిరోగమనమే. కలియుగంలో ఇది ఘనీభవించింది.
కృష్ణభగవానుడు నిర్యాణం చెందినప్పటినుండే క్షీణదశ ప్రారంభించింది. లోకం అంధకారావృతమైంది అప్పుడే. ఆ అంధకారం ఆయనపై కూడా పడింది. ఆయన అర్థరాత్రి వేళ, కారాగారంలో జన్మించారు. కాని ఆయన లోకానికే దీపశిఖ, దయా కరుణల జ్యోతి స్వరూపుడు. ఆయన నిర్గమనంతో జ్ఞానం దెబ్బతిన్నది - దానిపై అంధకారం ఆచ్ఛాదనమయింది. దుష్ట శక్తులకు ప్రతీకయైన కలిపురుషుడు ఆధిక్యత వహించాడు. ఇది కూడా మనకి అవగాహనకాని పరమేశ్వరుని లీలే!
ఎంతో దివ్యత్వంతో, కాంతిమత్వంతో కృష్ణభగవానుడు ఉదయించాడు. కాని అంధకారమలుము కుంటుందేమో నని ప్రజలు భయపడే పరిస్థితిని కల్పించాడు. కలికాలంలో వేదాలు ప్రకాశించలేవు. కలిపురుషుని విధ్యుక్తధర్మాలతో పొత్తుకుదరదు వాటికి.
కాని కొంతవరకైనా వేదాలను, అంటే అవి పూర్తిగా మాయమైపోకుండా, పరిరక్షించటమే ఉద్దేశం. ఈ పనిని ఆయన తన అంశగల వ్యాసునితో చేయించాడు. ఆ రోజులలో ఆయన పేరు వేదవ్యాసుడు కాదు కృష్ణుడే. ఆయన ద్వీపంపై జన్మించటం వల్ల కృష్ణద్వైపాయనుడయ్యాడు. ఆయనకే బాదరాయణుడన్న పేరు కూడ ఉంది.
మహర్షుల వల్ల లోకంలోకి వచ్చిన 1180 వేదశాఖలూ ద్వాపరయుగాంతం వరకూ లభ్యములే. వీటినన్నిటినీ కృష్ణద్వైపాయనుడూ అధ్యయనం చేశాడు. నీటి వరదవలె అన్ని వేదాలూ కలిసిపోయి ఉండేవి ఆ రోజులలో. పూర్వపు ఋషులకే వాటినన్నిటినీ గ్రహించే శక్తి ఉండేది. గ్రాహ్య శక్తి సన్నగిలిన మనకోసం వ్యాసుడు వేదశాఖలను నాలుగు ముఖ్యభాగాలుగా వర్గీకరించాడు - ఒక్కొక్క దానిలో మళ్లీ ఎన్నో శాఖలున్నాయి. ఆ నాలుగు వర్గాలూ నాలుగు వేదాలుగా చెప్పబడుతున్నాయిప్పుడు. తపస్సు వల్ల ఆయనకి సంక్రమించిన మానవాతీతమైన యోగశక్తి వల్లనే యిది జరిగింది.
ఋగ్వేదశాఖలు పూజకీ ఆరాధనకీ అనుకూలము. యజుశ్శాఖలు కర్మలనూ యజ్ఞాలను నిర్వహించే విధానాన్ని చెప్తాయి, సామశాఖలు దేవతలను తృప్తి పరచడానికుద్దేశించిన సంగీతరూపమయిన మంత్రములు అధర్వశాఖలు యజ్ఞాల నిర్వహణనూ, శత్రువుల నుండి మనుష్యుల రక్షణను నేర్పే మంత్రాలనూ చెప్తాయి.
సామవేదానికి అత్యధికమైన శాఖలుండేవి - వాటిలోని కీర్తనల గానం దేవతలకెంతో ప్రియం. మొత్తం 1180 శాఖలలో వెయ్యిశాఖలు సామవేదానికి చెందినవే. ఋగ్వేదానికి 21 యజుర్వేదానికి 109 (శుక్ల యజుర్వేదానికి 15, కృష్ణ యజుర్వేదానికి 94) అధర్వవేదానికి 50 శాఖలుండేవి.
కృష్ణద్వైపాయనుడే ఉత్తరోత్రా వేదవ్యాసుడుగా ప్రసిద్ధుడైనాడు. కలియుగంలో మానవులకు బుద్ధికుశలత తక్కువగా ఉంటుందనీ, పదకొండు వందల శాఖలలో ఒక్కొక్కరు ఒక శాఖని మాత్రం అధ్యయనం చేయగలిగితే చాలనీ భావించాడు. అట్టి భావన కూడా భగవంతుని లీలే. అంతకు పూర్వం ప్రతివారూ సాధ్యమైనన్ని వేదాలనీ, వేదశాఖలనీ అధ్యయనం చేయటం సంప్రదాయం. దానిని ఒక శాఖాధ్యయనానికి పరిమితం చేశాడు. ఒక్కొక్కరు చతుర్వేదాలలో ఒక శాఖని అధ్యయనం చేసి అందులో చెప్పబడిన కర్మలను చేయగలిగితే చాలునని అనుకున్నాడు. చతుర్వేదాలను, వాటి శాఖలను ప్రచారంలోకి తీసుకు వచ్చేపనిని తన శిష్యులకు అప్పగించాడు. ఋగ్వేద శాఖలు పైలునికీ, యజుశ్శాఖలు వైశంపాయనునకీ, సామశాఖలు జైమినికీ, అధర్వశాఖలు సుమంతునికీ ఇవ్వబడ్డాయి. ఈ నలుగురూ వేదవ్యాసుని శిష్యులు మాత్రమే కాదు, మహర్షులు కూడా.
''వ్యాస'' అన్న మాటకి అర్థం వ్యాసమనీ, కూర్పు అనీ, ప్రత్యేకంగా అధ్యయనం చేయటానికి ఏదో ఒక విషయాన్ని మాత్రమే తీసికోవటం వల్ల వ్యాసమయింది. ఒక విషయాన్ని వర్గీకరించి, విషయప్రధానంగా ఏర్పర్చటం కూడా వ్యాసమే. ఎన్నో వేదశాఖలను వర్గీకరించి, విషయానుక్రమంగా ఏర్పర్చిన కారణంగా కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడైనాడు. వేదాల ప్రాచుర్యానికై ఆయన చేసిన మహత్తరమైన కృషి వల్లనే ఆయన వేదవ్యాసుడన్న పేరుతోనే ప్రసిద్ధుడైనాడు.
ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖను అధ్యయనం చేయగలిగితే చాలునని ఆయన అనినంత మాత్రాన, పెక్కుశాఖలను చదవకూడదని ఆంక్ష విధించి నట్టు అర్థం కాదు. ఆయన ఉద్దేశం కనీసం ఒక శాఖనైనా అధ్యయనం చేయాలనే. వేదవ్యాసుని అనంతరం కొన్ని వేల సంవత్సరాల వరకూ ఒక్కొక్కరు మొదట ఒక వేదశాఖనీ, తరువాత మరొక వేదశాఖనీ, ఆ పిదప మరొక వేదశాఖనీ అధ్యయనం చేసేవారు. ద్వివేది, త్రివేది, చతుర్వేది అన్న పేర్లు ఆ విధంగానే వచ్చాయి. క్రమంగా వీరు రెండు శాఖలను, మూడు శాఖలను, నాలుగు శాఖలను అధ్యయనం చేసిన వారని అర్థం.
వ్యాసుడు వేదాలను వర్గీకరించిన తరువాత అయిదువేల సంవత్సరాలు గడిచాయి. ఈ అంచనా చారిత్రిక సాక్ష్యాలపై ఆధారపడింది కొంత వరకు. శాస్త్రాలు వ్యాసుని కాలం గురించి నిర్దుష్టంగా చెప్పే వివరాన్ని పాశ్చాత్యపండితుల ప్రభావం వల్ల ఆధునిక చరిత్రకారులు అంగీకరింపక పోవచ్చు. వారి లెక్క ప్రకారం మహాభారతం క్రీ.పూ.1500 నాటిది!
ఉత్తర భారతంలో కొందరికి చతుర్వేది అనీ త్రివేది అనీ ద్వివేది అనీ యింటి పేర్లుంటాయి. ''డూబె'' ''దావె'' అన్నవి 'ద్వివేది'కి అపభ్రంశహ్రస్వరూపాలు. నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారి వారసులు ''చతుర్వేది'' అన్న పేరు కలవారు. బెంగాలులో వీరినే చటోపాధ్యాయ అనీ, చటర్జీ అనీ అంటారు. కొన్ని ప్రదేశాలలో 'త్రివేది' అన్న పేరు ''తివారీ''గా కూడ వాడుకలో ఉన్నది. ఈ రోజులలో ఒక వేదాన్నైనా క్షుణ్ణంగా అభ్యసించిన వారిని కానరాము. అయినా, ఈ యింటి పేరు కలిగియుండటం ఆ వంశపూర్వీకు లెవరో, ఎప్పుడో, ఒకటికన్నా ఎక్కువ వేదాలను అధ్యయనం చేశారన్న దానికి నిదర్శనం. ఆ యింటి పేర్లు కలవారు ఆదర్శప్రాయులైన తమ పూర్వీకులను అనుసరించ గలిగితే బాగుంటుంది.
అశ్రద్ధ వల్ల గత అయిదు వేల సంవత్సరాలలోనూ ఎన్నో వేదశాఖలు వాడుకలో లేకుండా పోయాయి. 1180 శాఖలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు కేవలం ఏడో ఎనిమిదో శాఖలు మాత్రం మిగిలిన దురదృష్ట స్థితికి వచ్చాము. ఋగ్వేదానికి గల 21 శాఖలలో ఒక్కటే మిగిలియుంది. ఇది ''సాకల'' శాఖ. దీంట్లోనే ఐతరేయ ఉపనిషత్తుండటం వల్ల దీనిని ''ఐత్తరేయశాఖ'' అని కూడా అంటారు. శుక్ల యజుర్వేదంలోని 15 శాఖలలోను ఇప్పుడు రెండే ఉన్నాయి. అవి : మహారాష్ట్రలోని ''కాణ్వ'' శాఖ, విదర్భ ఉత్తరభారతాలలో ఉన్న ''మాధ్యన్దిన'' శాఖ, కృష్ణయజుర్వేదంలోని 94 శాఖలకీ తైత్తిరీయ శాఖ మాత్రమే ప్రచారంలో ఉంది. ఇది దక్షిణ భారతంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. కృష్ణయజుర్వేదంలో మరొక శాఖ, మైత్రాయనీ శాఖ - మహరాష్ట్రలో నామమాత్రంగాఉంది. సామవేదంలోని వెయ్యి శాఖలలోను 997 సామశాఖలు పోయాయి. తమిళనాడులో ఒక శాఖ ''తలవకార శాఖ'' జైమిని పరంపరలోనిది మాత్రముంది. రాణాయనీయ శాఖ కర్నాటకలో మాత్రమే ఉంది. ''కౌథుమ శాఖ'' గుజరాత్, కేరళలలో ఉంది. అధర్వవేదశాఖలు దొరకవనే భయపడ్డాం. కాని విద్వాంసుల నిర్విరామ కృషిఫలితంగా గుజరాత్లో సినోర్ అన్న ఊళ్లో అధర్వశాఖలోని శౌనక శాఖని బాగా అధ్యయనం చేసిన వ్యక్తి దొరికాడు. ఆ వేద శాఖకూడ పోకూడదన్న భావంలో దక్షిణాది నుండి విద్యార్థులను అక్కడికి పంపి ఆ శాఖను అధ్యయనం చేయించాము.
ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణాన్ని, కౌషీతకి బ్రాహ్మణాన్ని సంపాదించాము. దీనినే సంగాయన బ్రాహ్మణమని కూడ అంటారు. వీటికి సంబంధించిన ఆరణ్యకంలో ఐతరేయ ఉపనిషత్తు కౌశీతకి ఉపనిషత్తు ఉన్నాయి. ఇవన్నీ వాడుకలో ఉన్నాయి.
శుక్లయజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలలో శతపథ బ్రాహ్మణ మొక్కటే వాడుకలోఉన్నది. కొన్ని భేదాలున్నా ఇది మాధ్యన్దిన శాఖనీ, కాణ్వశాఖనీ పోలియుంటుంది. వేదాలన్నిటికీ మార్గదర్శిగా ఉండే బృహద్గ్రంథమిది. శుక్లయజుర్వేదానికి సంబంధించిన ఆరణ్యక మొక్కటే లభ్యం - అది బృహదారణక్యం. ఇది ఉపనిషత్తు కూడా. ముందే చెప్పినట్టు ఈశావాస్య ఉపనిషత్తు ఈ వేద సంహితలో ఉంటుంది.
కృష్ణయజుర్వేదపు 'తైత్తిరీయ' బ్రాహ్మణం వాడుకలో ఉంది. ఈ వేదపు ఆరణ్యకంలో తైత్తిరీయ ఉపనిషత్తు, మహానారాయణ ఉపనిషత్తు ఉన్నాయి. ఇప్పుడు వాడుకలోఉన్న పెక్కు సూత్రాలు, మంత్రాలు ఈ మహానారాయణ ఉపనిషత్తులోనివే.
మైత్రాయణి ఆరణ్యకం, అదే పేరుగల ఉపనిషత్తు. కృష్ణ యజుర్వేదంలోనివే. కఠశాఖ (సంహిత) దానికి సంబంధించిన బ్రాహ్మణం, ఆరణ్యకం ఏమీ ఇప్పుడు లేవు. కాని వాటి చివరలో ఉండే కఠోపనిషతు మాత్రం ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. పఠింపబడుతోంది.
ఇట్లాగే కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన శ్వేతాశ్వతర సంహిత చివర ఉండే శ్వేతాశ్వతర ఉపనిషత్తు మాత్రమే ఉంది - మిగిలిన భాగాలేమీ లేవు.
997 సామశాఖ సంహితలుపోయినా - 7, 8 బ్రాహ్మణాలు మాత్రం ఎలాగో మిగిలాయి. అవి - తాండ్యబ్రాహ్మణ, సంహితోపనిషత్ బ్రాహ్మణ, వంశ బ్రాహ్మణ, షడ్వింశ బ్రాహ్మణ, సామవిధాన బ్రాహ్మణ, చాందోగ్య బ్రాహ్మణ, జైమినీయ బ్రాహ్మణ. ఈ వేదానికి ఆరణ్యక మొకటి తలవకార ఆరణ్యకమే తలవకార బ్రాహ్మణమని కూడ ప్రసిద్ధి. జైమినీయ బ్రాహ్మణలో ఉంటుందిది. దీని చివరే కేనోపనిషత్తు ఉంటుంది. అందుచేతనే కేనోపనిషత్తుని తలవకార ఉపనిషత్తని కూడా అంటారు. సామవేదపు చాందోగ్య బ్రాహ్మణం నుండే చాందోగ్య ఉపనిషత్తు వచ్చింది.
అధర్వవేద సంహితలు చాలా మట్టుకు పోయాయి. కాని ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తులూ, ఇవికాక నృసింహతాపిని ఉపనిషత్తూ ఇప్పుడున్నాయి. పఠింపబడుతున్నాయి. ఈ వేదానికి సంబంధించిన బ్రాహ్మణం గోపధబ్రాహ్మణ మొక్కటే ఇప్పుడుంది.
ఈ పరిస్థితిలో మన ధర్మమేమిటి? 1180 వేదశాఖలకీ ఇప్పుడు మిగిలిన ఏడెనిమిది సంహితలైనా నశించి పోకుండా భావితరాల వారికి దక్కేట్టు చూచుకోవాలి. ఇప్పుడు మిగిలియున్న ఈ కొద్ది పాటి వేదశాఖలనూ, ఉపనిషత్తులనూ పరిరక్షించుకోవటానికి తగినన్ని సత్వరచర్యలు తీసికోవాలి. అట్లా చేయకపోవటం క్షంతవ్యం కాని అపరాధమవుతుంది.
* * *