Acharyavaani - Vedamulu Chapters Last Page
15. వేదాంగములు : శిక్ష
వేదపురుషుని నాసికా స్థానము
వేదాలకు గల ఆరుఅంగాలలో ప్రధానమైనది - శిక్ష. వేదపురుషునికి ముక్కువంటిది. వాసనని చూడట మొక్కటే ముక్కు కర్తవ్యం, నిజానికి అది చాలా స్వల్పమైనపని. అంతకంటే ముఖ్యమైన గాలిపీల్చటం ఈ అంగం ద్వారానే సాగుతుంది. ముక్కు ఊపిరి పీల్చటానికి ప్రాణాన్ని నిలుపుకోవటానికి ఉపయోగ పడ్డట్టే, శిక్ష కూడ వేదమంత్రాలకు ఊపిరి వంటిది.
వేదమంత్రాల ఆయువు పట్టేది? వేదమంత్రంలోని ప్రతి అక్షరాన్నీ శుద్ధంగా, కాలపరిమాణం ప్రకారం ఉచ్ఛరించాలి. దీనినే అక్షరశుద్ధి అంటారు. కాల పరిమాణమే కాక, ఏ స్థాయిలో పల్కాలో కూడా నిర్దేశింపబడి యుంది. హెచ్చు, తగ్గు, సమము - వీటిని ఉదాత్తం, అనుద్దాం, స్వరితమంటారు. ఇవన్నీ సరియైన ప్రమాణాలలో ఉన్నప్పుడే ధ్వని స్వరశుద్ధమై, స్వచ్ఛంగా ఉంటుంది. అందువల్ల, మంత్రాలు సత్ఫలితానివ్వాలంటే అక్షరశుద్ధీ, స్వరశుద్ధీ పరిపూర్ణంగా ఉండాలి. మంత్రాల ఉచ్ఛారణకి ఎంతో ప్రాముఖ్యముంది. ఈ ఉచ్ఛారణకి, స్వరానికి, స్థాయికీ సంబంధించిన నియమాలు వాటి అర్థాలకంటే ముఖ్యము.
అర్థము తెలియకపోయినా మంత్రాన్ని సరిగ్గా ఉచ్ఛరిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మంత్రాల సరాలైన వేదాల ఆయువు పట్టు శబ్దమే నన్నమాట.
తేలుకాటుని నయం చేసే మంత్రాన్ని తీసుకుందాం. దాని అర్థం వెల్లడి చేయరాదు. అందులోని పదాలకెంతో పటుత్వముంది. వేరువేరు శబ్దాలకు వేరువేరు ఫలితాలున్నాయి. శ్రాద్ధ మంత్రాలని సంస్కృతంలోనే ఎందుకుచ్ఛరించాలి? ఇంగ్లీషులోనో, మరే యితర భాషలోనో ఎందుకుచ్ఛరించకూడదు? అట్లా చేస్తే - అంటే ఇంగ్లీషులోనో, తమిళంలోనో ఉచ్ఛరిస్తే శబ్దమే మారిపోతుంది - దానితో వాటి పటుత్వమంతా మాయమవుతుంది. మంత్రాలని పఠించే వారి పళ్లుకొన్ని ఊడితే, వారు శబ్దాలని సరిగ్గా పలుకలేరు - మంత్రపఠనమూ, దానితో బాటు దాని ఫలితమూ పోతాయి లేదా తరిగిపోతాయి. ఉచ్ఛారణా, దాని స్వచ్ఛతా వేదాలకెంతో ముఖ్యం.
ఈ స్వచ్ఛతని నిలుపు కోవటానికేమి చెయ్యాలి? స్వరశాస్త్ర నియమాలను శిక్ష పేర్కొంటుంది. శిక్ష ప్రయోజనం వేదాక్షరాల పరిమితులని నిర్ణయించటం.
పదాల ఉచ్చారణని నియంత్రించేది స్వరశాస్త్రం. ఇతర భాషలన్నిటి కంటే వేదభాషకి ఈ స్వరశాస్త్రం ప్రధానం - దీనికి కారణం, స్వరభేదంతో వేదభాషలో ఫలితాలే మారిపోవటం!
అందువల్ల వేదాల స్వరశాస్త్రమైన ''శిక్ష'' వేదపురుషుని ఆరు అంగాలలోనూ అతిప్రధానమైనదిగా భావింపబడుతుంది.
వేదాలకి శిరోభూషణములైన ఉపనిషత్తులలో శిక్ష ప్రస్తావన ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తు ''శీక్షావల్లి'' అన్న అధ్యాయంతో ప్రారంభమవుతుంది. ఇక్కడా, ఇతర చోట్లా ''శిక్ష''ని ''శీక్ష''గా పేర్కొనటం కద్దు. తన భాష్యంలో ఆదిశంకరుడు ''ధైర్ఘ్యం ఛాందసం'' అంటారు. అంటే దీర్ఘమవటం. వేదభాషలో హ్రస్వ ''ఇ'' దీర్ఘ ''ఈ'' గా మారుతుంది. ఛందస్సుకి అనుగుణంగా. వేదాల భాషని సంస్కృతం అనికాక ఛందసమంటారు.
హార్మోనియం, వేణువు వంటి వాద్యాలలో కొన్ని లెక్కల ప్రకారం గాలిని రంధ్రాల ద్వారా బయటకు వదులుతారు. వాటి వల్ల వివిధ స్వరాలు పల్కుతాయి. మానవుని గొంతుకకు కూడ అటువంటి ఏర్పాటే ఒకటి ఉంది. కేవలం గొంతుక మాత్రమే కాదు. నాభికి దిగువ నున్న ''మూలాధారం'' నుండి గాలిని అనేక విధాల పైకి పంపటంలో వాక్కు, నాదము ఫలితాలవుతాయి. మానవునికి భగవంతుడు ఉద్దేశించిన వాద్యము, మానమ కల్పితములైన వాద్యాల కంటె అంటే వేణువు, హార్మోనియం వంటివి, ఎంతో గొప్పది. ఈ వాద్యాలు కొన్ని రకాల ధ్వనులనే పలుకగలవు. ''అ'' ''క'' ''చ'' ''గ'' వంటి అక్షరాల ధ్వనులను పలుకలేవు. మానవుని గొంతుకే ఈ ధ్వనులను పలుకగలదు. పక్షులూ, జంతువులూ కొన్ని పదాలను పలుకగలిగినా వేనవేల ధ్వనులను పలికించగల మనిషికి సాటిరావు.
సృష్టిలో మానవునికొక్కనికే ఆ శబ్దాలను పలికించే సామర్థ్యం ఉండటం వల్ల మానవుని ప్రాముఖ్యం స్పష్టమవుతూనే ఉంది. అంతటి గొప్ప సంపదను అనవసర ప్రసంగాలతో వృథా చేయటం శోచనీయం. ఈ సామర్థ్యాన్ని దివ్యులని మనకనుకూలం చేసుకొనేందుకూ, లోక కల్యాణానికీ, మన ఉన్నతికీ ఉపయోగించుకోవాలి. ఈ మూడు పనులను చేయటానికి వేదమంత్ర ధ్వనులను గ్రహించి ఋషులు మనకి అనుగ్రహించారు. ఈ రహస్యాన్ని గుర్తుంచుకొంటే శిక్షాశాస్త్రం యొక్క ప్రాముఖ్యం పద ఉచ్ఛారణకి గల ప్రాముఖ్యమూ తెలుస్తాయి. గాలి నాభి క్రింద ప్రారంభించి, ఎన్నో స్థానాలను స్పృశించి, మెలికలు తిరిగి నోటి ద్వారా బయటకు ఎట్లావెళ్లాలో అతి సూక్ష్మంగా 'శిక్ష'లో వివరింపబడింది. ఈ వివరణకి భాషాశాస్త్రజ్ఞులు ఆశ్చర్యాన్ని, గౌరవాన్ని ప్రకటిస్తూంటారు. శబ్దం యొక్క స్వచ్ఛతని ఆ రీతిగా కాపాడారు.
గాలి మనలో అన్ని విధాల పయనిస్తూంటే, అదే ఒక యోగ శాస్త్ర మవుతుంది. నాడుల ద్వారా ప్రసరించేప్పుడు గాలి కొన్ని ప్రకంపనలను కలిగిస్తుంది - వాటి వల్ల కొన్ని భావాలేర్పడుతాయి కొన్ని శక్తులూ ఉద్భవిస్తాయి, వీటికి బయటి ప్రపంచంపై ప్రభావముంటుంది. ఈ విషయాలను ముందే చెప్పుకొన్నాం. అందువల్లనే ప్రాణాయామం చేసి యోగశక్తులను సంపాదించినవారు, మంత్ర జపాన్ని చేసి సాక్షాత్కారాన్ని పొందిన వారితో సమానులు.
శిక్షాశాస్త్రం ప్రతి అక్షరాన్ని ఎట్లా పలకాలి, ఏ స్థాయిలో పలకాలి, ఏ అక్షరమెంత సేపు ఉచ్చరించాలి ఎన్ని మాత్రలకాల ముండాలి అని నిర్ణయిస్తుంది. హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలను బట్టి ఏ అక్షరాన్ని ఎన్ని మాత్రల కాలముచ్చరించ వలెననేది నిర్ణయించబడుతుంది. సంధులను విడదీయకుండా పదాలను ఉచ్ఛరించటం, వేదమంత్రాల పఠనకు అవసరమైన సూచనలూ ''శిక్ష''లో ఉంటాయి. ''క'' అన్న శబ్దం మెడకి గొంతుకకి నడుమ స్థానంలో ఉత్పన్నమవాలి. నాసిక దగ్గర ''జ్ఞ'' వంటి శబ్దాలుత్పన్నమవాలి. ''త'' వంటివి నాలుక కొన్ని పళ్లని తాకటం వల్ల రావాలి. ''న'' వంటివి నాలుక అంగిలిని తాకటం వల్ల రావాలి. ''మ'' వంటివి పెదవుల కలయికతో రావాలి. ''వ'' వంటివి క్రింది పెదవి క్రింది పళ్లను కప్పటం వల్ల రావాలి. ఇట్లాంటివే ఎన్నో సూచనలున్నాయి. ఈ శాస్త్రం ఎంతో నిర్దిష్టమైన పద్ధతిలో ఉంటుంది. కొన్ని శబ్దాల ఉచ్ఛారణకు శరీరంలోని ఏయే భాగాలు, ఏయే కండరాలు కదలాలో నిర్దేశింప బడ్డాయి. వాటి ప్రకారం అభ్యాసం చేస్తే కేవలం స్వరశాస్త్రము నుండి దాటి, మంత్ర యోగాన్ని, శబ్దయోగాన్ని చేరుకుంటాం.
మూలభాష సంస్కృతమే :
నేను వేదముల విషయంలో ఒక పదం యొక్క అర్థంకంటె, శబ్దమే ముఖ్యం అని చెప్పాను. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పాలి. వైదిక భాష ''ఛందస్సు''. అందుండి ఉదయించినది సంస్కృతం. వీటిలో కొన్ని పదాలని ఉచ్ఛరించేప్పుడు వాటి అర్థం కూడా స్ఫురిస్తుంది.
''దంత'' అన్న పదం తీసుకొందాం. ఈ మాటకర్థం పన్ను (దంతం). ఈ పదాన్ని పలకటానికి పళ్లనే ఎక్కువగా ఉపయోగించాలి, నాలుక ఉపయోగం అప్పుడప్పుడే. పళ్లులేని వాళ్లు దీనిని పలుకటం ఎంత కష్టమో తేలికగా తెలుసుకోవచ్చు. ఆ మాటని శుద్ధంగా పలుకలేరు.
భాషా శాస్త్రజ్ఞులు ఆయా భాషలు ఎప్పుడు పుట్టాయో పరిశోధిస్తూ కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలను కూడ పట్టించు కొంటారు. వాళ్లు కూడ గమనించవలసిన విషయమొకటి యుంది. సంస్కృతం, గ్రీక్, లాటిన్, జర్మన్ - వీటిని ట్యుటానిక్ వర్గపు భాషలంటారు (ఇంగ్లీషు కూడ వీటిలో చేరినదే). ఆధునిక ఫ్రెంచి, మరికొన్ని భాషలు కెల్టిక్ వర్గానికి చెందినవి. భాషాశాస్త్రజ్ఞుల ప్రకారం ఇవన్నీ ఒకే మాతృభాషనుండి జనించాయనీ ఆ భాష ఇండో-యూరపియన్ వర్గానికి చెందినదే అని అంటారు. కాని ఆ మాతృభాష ఏమిటో నిశ్చయంగా పండితులు చెప్పలేక పోయారు. సంస్కృతం (ఇందులో వైదిక భాష అయిన ఛందస్సు కూడా కలుస్తుంది) ఆ మాతృభాష అని మాత్రం ఒప్పుకోరు. ''దంత'' వంటి మాటలు ఈ దృక్పథాన్ని సమర్థిస్తాయి. ఆంగ్లంలోని ''డెంటల్'' అన్న పదానికి కూడ ''దంతాలకు సంబంధించిన'' అని అర్థం. ''దంత్''కీ ''డెంట్''కీ పోలిక ఉంది. ఫ్రెంచి, లాటిన్ భాషలలోని పదాల శబ్దం కూడ ''దంత'' వలెనే ఉంటుంది. అంటే ''త'' అన్న శబ్దం ''ద'' అన్న శబ్దం కంటె ప్రముఖం సంస్కృతంలో వలెనే.
''సరే, శబ్దాలలో పోలిక ఉండవచ్చు. అంత మాత్రాన సంస్కృతమే మాతృభాష ఎట్లా అవుతుంది'' అనవచ్చు. పైన చెప్పినట్టు ''దంత'' అన్న సంస్కృత పదాన్ని సరిగ్గా ఉచ్ఛరించటానికి అన్ని పళ్లూ అవసరం. ''డెంటల్'' వంటి ఇతర భాషలలోని పదాలని ఉచ్ఛరించటానికి ప్రయత్నించు. అప్పుడు పళ్లతో పెద్ద పని లేదని తెలుస్తుంది. పదం యొక్క అర్థాన్ని శబ్దమే సూచించాలనుకొంటే ఇది సంస్కృతంలోని ''దంత''లోనే సంభవిస్తుంది. అందువల్లనే అది మూలం, ''డెంటల్'' అన్నది తజ్జనితం.
కొన్ని చోట్ల వర్ణక్రమాన్ని మారిస్తే సన్నిహిత పదం వస్తుంది. ''సింహం'' యొక్క ముఖ్యలక్షణమేమిటి? - ''హింస'' పెట్టటం. 'హింస' బదులు 'సింహ' వచ్చింది. దేవతలు, దానవులు, మానవులు - అందరకీ కాశ్యపుడనే ఆది ఋషి, పితరుడు. ఆయన కాపేరు ఎట్లా వచ్చింది? ఆయన సత్యాన్ని దర్శించాడు. అంటే ఆయన భగవంతుని నిజరూపాన్ని దర్శించాడు. జ్ఞానాన్ని సంస్కృతంలో దృశ్యం అని అంటారు. దర్శించేవాడిని సంస్కృతంలో ''పశ్యకా'' అంటారు. కొద్ది మార్పులతో ఇదే 'కాశ్యప' అయింది.
ఉచ్చారణా నియమాలు :
శిక్షాశాస్త్రం శబ్దాలని పలకటానికి సంబంధించిన వివిధ నియమాలను ఇస్తుంది. ఇవి ఉచ్చారణ, స్వరం, మాత్ర, బలం, సామం, సంతానం (పదాలను సంధి చేయటం) వీటిని పాటించటం వల్ల శబ్దం శుద్ధంగా ఉంటుంది. అంతేకాదు, శరీరంలో ఏయే భాగాలనుండి శబ్దోచ్చారణ ఉదయించాలి, ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి అని కూడ చెప్తుంది. ఇదంతా సశాస్త్రీయం, ఆచరణీయం కూడా. కొన్ని అక్షరాలను నెమ్మదిగా ఉచ్ఛరించాలంటే పెదవులను ఏ విధంగా కలపాలో ఈ శాస్త్రం చెప్తుంది. తదనుసారంగా చేస్తే శబ్దోచ్చారణ నిర్దుష్టంగా ఉంటుంది.
ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా జ్ఞాపకం వస్తుంది ''ప'' ''మ'' ''వ'' అన్న అక్షరాలను పలికేప్పుడే పెదవుల ప్రమేయం ఉంటుంది. 'క', 'జ్ఞ' 'చ' 'గ', 'ణ', 'థ', 'న' వంటి అక్షరాలను పలికేటప్పుడు పెదవుల ప్రమేయం లేనేలేదు. పెదవుల అవసరం లేకుండా పలుకగల అక్షరాలతోనే రామాయణాన్ని ఎవరో తయారు చేశారు. దాని పేరు ''నిరోష్ఠ రామాయణం''. ఓష్ఠ అంటే పెదవి. దీని నుండే ''ఔష్ట్రకం'', అంటే ఒంటె - అన్న మాట వచ్చింది. ఒంటెకి చాలా పెద్ద పెదవులుంటాయి. నిరోష్ఠమంటే పెదవులు లేకపోవటం. ఆ రచయిత తన ప్రజ్ఞనిచూపించుకోవటానికే ఈ కావ్యాన్ని వ్రాసి యుంటాడు. ఇంకొక కారణం కూడా ఉండవచ్చు. శారీరక పారిశుద్ధ్యమంటే ఆయనకి ఎంతో పట్టింపు ఉండేదేమో! భగవంతుని నామాలను ఉచ్ఛరించేప్పుడు ఆ శబ్దాలను అశుచి చేయటమిష్టం లేకపోయిందేమో!
పాణిని మహిర్షి (వైయ్యాకరణుడు) 'పాణనీయశిక్ష'లో వైదిక పదాలను ఎంత శ్రద్ధతో ఉచ్ఛరించాలో ఒక శ్లోకంలో ఇట్లా పేర్కొంటాడు.
వ్యాఘ్రీ యథా హరేత్ పుత్రాన్
దంష్ట్రాభ్యాం చ న పీడయేత్
భీత పతనభేదాభ్యాం
తావద్ వర్ణాన్ ప్రయోజయేత్!
వేదాక్షరాలను స్పష్టంగా పలకాలి. శబ్దాలకి మచ్చరాకూడదు. శబ్దం అణగిపోకూడదు. హీనమై పోకూడదు. పెరుగుతున్నట్టు ఉండకూడదు. శబ్దాలను అశ్రద్ధగా, పేలవంగా ఉచ్చరించకూడదు కటువుగానూ ఉచ్చరించకూడదు. పులి తన పిల్లలను ఎట్లా పట్టుకొంటుంది? పులులూ, పిల్లులూ తమ సంతానాన్ని పళ్లతో పట్టుకొంటాయి. పిల్ల జారిపోకుండా పళ్లు గట్టిగా పట్టుకొంటాయి అయినా పిల్లకి ఏ విధమైన బాధా, గాయమూ కాదు. ఆ విధంగానే మాటలను సున్నితంగా, ధృఢంగా పలకాలి అంటాడు పాణిని.
ఆ పాణినియే వ్యాకరణమనే వేదాంగానికి ఎంతో అమూల్యమైన సేవ చేశాడు. పాణినియే కాక ఇతర యోగులు ''శిక్ష'' గురించి వ్రాశారు. దాదాపు 30 గ్రంథాలున్నాయి ఈ విషయమై. వీటిలో పాణినిదీ, యాజ్ఞవల్క్యునిదీ అతి ముఖ్యమైనవి.
భాషలకు లిపి :
రేఖాచిత్రణ (అంటే గీతలు, చుక్కలూ, వృత్తాలు) ద్వారా అక్షరాల శబ్దాలకి రూపకల్పన జరుగుతుంది. ఏ భాషకైనా లిపి ఇట్లాగే ఉత్పన్నమవుతుది. ఇంగ్లీషు, తత్సంబంధమైన భాషలకు రోమన్ లిపిని ఉపయోగిస్తారు. 'బ్రాహ్మీ' అనే లిపి ఒకటుండేది ఒకప్పుడు. అశోకుని శాసనాలు ఆ లిపిలో ఉంటాయి. ఆ లిపినుండే ఈ నాటి సంస్కృత భాషకీ (నాగరి, గ్రంథ) దక్షిణ భారత భాషలకీ లిపి వచ్చింది. బ్రాహ్మీ లిపికి గల రెండు వర్గాలలో ''పల్లవ గ్రంథ'' అన్న పేరుగలది దక్షిణాదిన వాడుకలో ఉండేది - ద్రవిడభాషల లిపులన్నీ దాని నుండే పుట్టాయి.
ఆధునిక భారతీయ లిపులన్నీ బ్రాహ్మీలిపి నుండే పుట్టాయి. కాని ఆదిమ బ్రాహ్మీలిపిని చూస్తే ఏమీ గుర్తుపట్టలేం. ''తెలియని దాని''కి సంకేతంగా ''బ్రాహ్మీలిపి'' అనటానికి కారణమిదే.
''ఖరోష్ఠి'' అన్న పేరు గల లిపి ఒకటుంది. ''ఖర-ఓష్ఠం'' అంటే గాడిద పెదవులు. గాడిద పెదవులు ముందుకు తోసుకువచ్చినట్టే ఈ భాష అక్షరాల వలయాలు ముందుకు తోసుకు వస్తాయి. ఇది పర్షియన్ భాషాలిపి.
యూరప్‌లో ''రోమన్ లిపి'' చాలా భాషలలో వాడుతారు. ఆ విధంగానే భారతదేశంలో బ్రాహ్మీలిపి కూడాను. ఉత్తర భారతంలో వాడబడే దేవనాగరి లిపి దీనికి నిదర్శనం.
ఏ భాషకి సంబంధించిన స్వరశాస్త్రాన్నైనా అధ్యయనం చేస్తే ఇంకా ఎన్నో విషయాలు అర్థమవుతాయి మనకు. ''వ'' అన్న శబ్దాన్ని సూచించటానికి ఇంగ్లీషులో రెండు అక్షరాలున్నాయి - వి, డబుల్యూ (V, W). రెండెందుకున్నాయా అనిపిస్తుంది! ఒక ఇంగ్లీషు ప్రొఫెసర్ ఆ తేడాని వివరించాడొక సారి. ''వి''ని వాడేప్పుడు క్రింది పెదివిని మడచిపై పళ్లని దానికి తాకించి ఉచ్ఛారణ చేయాలి. డబుల్యూని పలికేప్పుడు మాత్రం పళ్లని ఉపయోగించ కూడదు. పెదవులని మాత్రం కొంచెం మూసి, గుండ్రంవలె చేసి, ఉచ్ఛరించాలి. అందువల్లనే మన భాషలలోని ''సరస్వతి'', ''ఈశ్వర'' వంటి మాటలని వ్రాసేప్పుడు ''వి'' (V)ని వాడాలి, డబుల్యూ (W)ని కాదు. మిగిలిన భారతీయభాషలన్నిటి కంటె సంస్కృతంలోనే పదాల ఉచ్ఛారణ వ్రాసినట్టే ఉంటుంది - ఇంగ్లీషులో అంతా గందరగోళంగా ఉంటుంది. ఈ మధ్య పేపర్లలో ''లెజిస్లేచర్ వౌండ్ అప్'' అని చదివాను. 'వైండ్' అన్న పదానికి భూతకాల రూపమైన పదాన్ని ''వూండ్'' (అంటే గాయం) గా చదివాను పరాకుగా, అదే వర్ణక్రమం వేరొక అర్థాన్ని కలిగించింది. ''వౌండ్ అప్'' అంటే మూసి వేయుట. ''వైండ్'' అన్న పదాన్ని కూడా ''విండ్'' అని పలికితే 'గాలి' సూచింపబడుతుంది. 'వైండ్'గా పలికితే ''చుట్టూ కట్టట''మని అర్థం వస్తుంది. ఇటువంటి తికమక చాలా ఉంది ఇంగ్లీషులో.
ఒక్క సంస్కృతంలోనే, ఉచ్చారణ వర్ణక్రమాన్ని అనుసరించి ఉంటుంది ఎప్పుడూ - దీనికి రెండే రెండు మినహాయింపులున్నాయి. ఆ మినహాయింపులివి : ఒక మార్పు విసర్గ ''ప'' ముందు వచ్చేప్పుడు కలిగేది. సాధారణంగా విసర్గ ''హ'' అన్న శబ్దం కలిగి ఉంటుంది. రామః అన్నప్పుడు ఇందులోని ''హ'' అన్న ధ్వని పూర్తిగా కాకూండా తేలికగా పలకాలి. ఆ విసర్గే ''ప'' ముందు వస్తే ''ఫ''గా పలకాలి. ఇక్కడ మాత్రం అక్షరాన్ననుసరించే పలకటం తప్పు. బ్రహ్మ, వహ్ని ब्रह्म वन्हि వంటి మాటలను వ్రాసినట్టుగానే పలుకకూడదు. వాటిని బ్రవ్హు, వన్హి వలె పలకాలి. సంస్కృతంలోవి ఈ మినహాయింపులే - మిగిలిన వేళల్లో ఎప్పుడూ పలకటం వ్రాయటాన్నే అనుసరిస్తుంది.
అన్ని ధ్వనులూ కల భాష :
పైన చెప్పిన దాని బట్టి ''ఫ'' అన్న శబ్దం సంస్కృతంలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఆ భాషలో లేని శబ్దం లేదు. ''ళ'' (zha) అన్న ధ్వని తమిళంలో తప్ప ఇంకెక్కడా లేదనుకుంటాం. మాతృభాష, వేదభాష అయిన సంస్కృతంలో ఈ శబ్దముంది. యజుర్వేదంలో పెక్కుచోట్లా, తలవకార సామవేదంలో వచ్చే ''త'' శబ్దాన్ని ''ళ''గ పలుకాలి. ఋగ్వేదంలో కూడ ఈ ధ్వనిని ఉచ్ఛరించాల్సి వస్తుంది. ఋగ్వేదంలో మొదటి సూక్తంలో వచ్చే మొదటి మాట. ''అగ్నిమీలె'' అన్న పదాన్ని ''అగ్నిమీళె'' అని పలుకాలి. తమిళంలోని ''ళ'' వలె గాక - దానికి సన్నిహితంగా.
ఫ్రెంచి భాషలో కూడ ''ళ్'' (zha)కి దగ్గరలో ఉన్న శబ్దముంది. కాని ఆ భాషలోనూ, సంస్కృతంలోనూ ఈ శబ్దాన్ని పలికే అక్షరం వేరే లేదు. ఫ్రెంచిలో 'జె' 'జి' అన్న అక్షరాలను ఉపయోగిస్తే ''ళ'' అన్న ధ్వని వస్తుంది. సంస్కృతంలో ''ల'' అన్న అక్షరమే ''ళ'' ధ్వనికి కూడ పనికి వస్తుంది. చైనీయుల భాషలో కూడ ''ళ'' ఉందంటారు.
''రామః''కి ''పండిత'' జోడిస్తే ''రామః పండితః'' అవుతుంది. సంస్కృతంలోని ఈ ''ఫ'' శబ్దాన్ని ''ఉపధ్మానీయ'' మంటారు. గొట్టంలోంచి నిప్పుని ఊదటమని అర్థం దీనికి. అప్పుడే ''ఫ'' అన్న శబ్దం వస్తుంది.
భారతీయ - విదేశీయ భాషలూ, లిపులూ :
భారతీయ భాషలలో ఒక సామ్యముంది. అక్షరాలను వ్రాసినట్టే ఉచ్ఛారణ కూడా ఉండాలి. ఇంగ్లీషులో ''World'' అన్న పదాన్ని తీసికొందాం. మొదటి అక్షరాన్ని ''వి''గా గాని ''వొ''గా గాన్ని పలుకరాదు - రెంటికీ మథ్యస్తంగా పలకాలి - ఇదేమిటో ఎక్కడా లేదు. ''often'' అన్న పదంలో ''t'' నీ, ''walk'' అన్న మాటలో ''l'' నీ పలుకరాదు. కాని దీనిని లిపిలో తెలుపటానికి వీలుకాదు. ఇతర భాషలలో కూడ అస్పష్టంగా ఉండే ఇటువంటి ధ్వనులే ఉన్నాయి. వీటిని ''అవ్యక్తము'' లంటారు. భారతీయ భాషలలో అన్ని ధ్వనులూ స్పష్టంగానే ఉంటాయి.
అక్షరానికీ తత్సంబంధమైన ధ్వనికీ పొంతనలేని నియమాలెన్నో ఉన్నాయి ఇతర భాషలలో. ''c'' అన్న అక్షరం, ''క'' ధ్వని సూచిక. అంతేకాదు c, k, q లకు సంబంధించిన ధ్వనులు కూడ అట్లాగే ఉండవచ్చు. భారతీయ భాషలలో ఇట్లా ఉండదు. ''ఫ'' అన్న శబ్దాన్ని సూచించటానికి ఇంగ్లీషులో మూడు విధానాలున్నాయి - fairy, philosophy, rough. 'c' అన్న అక్షరం సాధారణంగా ''స'' అని ధ్వనిస్తుంది. కాని ఆ అక్షరంతో మొదలయే చాలా పదాలలో ''క'' వలె ధ్వనిస్తుంది. cell, celluloid, cinema లలో ''స'' ధ్వని పల్కుతుంది. ''fat'' అన్నప్పుడొక విధంగానూ, ''fast'' అన్నప్పుడు వేరొక విధంగానూ పలుకుతుంది 'a' అన్న అక్షరం. కొన్ని వర్ణక్రమాలకు, వాటి ఉచ్చారణకు పొంతనే ఉండదు. ఇంగ్లీషులో ''nation'', ''station'' అని వ్రాసినప్పుడు ''tion'' అన్న అక్షరాలని ''షన్'' వలె పలకాలి. ఇంగ్లీషుకీ, రోమన్ లిపిని పాటించే ఇతర భాషలకీ 26 అక్షరాలే ఉండటం వల్ల వాటిని నేర్చుకోవటం తేలిక. ప్రాథమిక తరగతిలో ఒక ఏడాది పాటు శ్రమపడితే వాటిని నేర్చుకోవచ్చు కాని ఇంగ్లీషు విషయంలో M.A. డిగ్రీ వచ్చిన తర్వాత కూడ సరియైన ఉచ్ఛారణ తెలిసికోవటానికి డిక్షనరీ అవసరముంటూనే ఉంటుంది.
భారతీయ భాషలకి యున్న ఈ సౌలభ్యం సంస్కృతానికి మరీ అధికంగా ఉంటుంది. అంటే, విదేశీయ భాషలు సంస్కృతం కంటే తక్కువని నేనటం లేదు. ఆయా భాషల ప్రత్యేక లక్షణాలను మాత్రం వివరిస్తున్నాను. పరాత్పరుడు శబ్దబ్రహ్మాత్మకుడన్న భావం సంస్కృతంలో ప్రస్ఫుటమవుతుందని చెప్పటమే నా ఉద్దేశం. అన్ని భాషలూ అందరికీ ఉమ్మడి సొత్తేనని అందరూ భావించాలి. అప్పుడు ఒకరినొకరు కించపరచుకో వలసిన సందర్భం రాదు. ఏ భాషైనా భావవ్యక్తీకరణ సాధనమే నన్న ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకొంటే మాతృభాష పట్ల ప్రత్యేకమైన అభిమానమూ, ఇతరుల భాషల పట్ల ద్వేషమూ మాయమవుతాయి. విశాల హృదయమూ, అంతర్జాతీయ దృక్పథమూ ఉండాలంటూ ఒక వంక ఉద్బోధలూ, వేరొక వంక భాషా విషయంలో సంకుచితత్వాన్ని ప్రదర్శించే భావాలుండటం శోచనీయం.
అక్షమాల - జపమాల :
''రుద్రక్షమాల'' అంటే రుద్రాక్షలుకల జపమాల అని అర్థం - రుద్రుని కళ్లనుండి వచ్చినవి రుద్రాక్షలు అని జనశృతి. ఇక్కడ ''అక్ష'' అంటే 'కన్ను' అని అర్థం. 'అక్షమాల' అంటే ఏమిటి? ఇక్కడ ''అక్ష''ని కన్నుగా అన్వయించుకోవటం తప్పు. ''అ'' నుండి ''క్ష'' వరకూ గల అక్షరాలకి ప్రతీక. సంస్కృతంలో మొదటి అక్షరం ''అ'' చివరిది ''క్ష''. సంపూర్ణతని సూచించటానికి ఇంగ్లీషులో ''A to Z'' అంటారు, సంస్కృతంలో ''అకారాది క్ష కారాంతః'' అంటారు. అంటే ''అ''తో ఆరంభించి ''క్ష''తో అంతమవటం. అక్షరాలన్నీ కలిపి 50, అందువల్ల అక్షమాలలో 50 పూసలుంటాయి.
శబ్దోచ్చారణ యొక్క ప్రాముఖ్యత :
మంత్రపఠనంలో అప్రమత్తత అవసరమని ముందు చెప్పాను. శబ్దోచ్చారణలో పొరపాటు జరిగితే మంత్రం సరియైన ఫలమివ్వకపోగా హానిని గాని, వ్యతిరేక ఫలితాలని గాని ఇస్తుంది. తైత్తిరీయ సంహితలో ఈ విషయాన్ని తెల్పే కథ ఒకటుంది. (2.4.12)
త్వష్టుడుకి ఇంద్రునితో వైరం. ఇంద్రుని సంహరించగల కుమారుడు కావాలని కోరుకొంటాడు. అందుకని ''ఇంద్రశత్రుర్వర్ధస్వ'' అన్న మంత్రాన్ని జపిస్తూ ఒక హోమాన్ని చేశాడు. ఈ మంత్రాన్ని సరిగ్గా పఠించే పద్దతిలో పలికితే, ''త్వష్టుని కుమారుడు పెరిగి ఇంద్రుని వధించుగాక'' అనే అర్థం వస్తుంది. ఆ శబ్ద ప్రాబల్యం వల్లనే ఆ కుమారుడు పెరిగి ఇంద్రుని వధింపగలిగే వాడు. కాని శబ్దోచ్చారణలో త్వష్టుడు పొరపాటు చేశాడు. అందువల్ల అర్థం తారుమారైంది. అక్షరాలూ, పదాలూ మారకపోయినా స్వరోచ్చారణ దోషం వల్ల, త్వష్టుడు ఆశించిన దానికి సరిగ్గా వ్యతిరేకం జరిగింది. అతని కుమారుని ఇంద్రుడే చంపివేశాడు. అందువల్ల వృత్రుడన్న అతని కుమారుని వధకు త్వష్టుడే కారణమయినాడు.
వేదాలలోని ఈ ఉదంతాన్ని చెప్తూ, సరియైన పద్ధతిలో మంత్రాలని పలకాలంటుంది ఈ శ్లోకం :
''మంత్రో హీనస్వరతో వర్ణతో వా
మిథ్యాప్రయుక్తో న తమర్థమాహ
స వాగ్వజ్రో యజమానం హినస్తి
యతేంద్రశత్రుః స్వరతో`òపరాధాత్''
కొన్ని స్వల్ప భేదాలు :
ఇప్పటి వరకూ వేద శబ్దమెంత శుద్ధంగా ఉండాలో వివరించాను. దీనికి నిదర్శనమిదే; రామేశ్వరం నుండి హిమాలయాల వరకూ భారతదేశంలో ఏ విధమైన సామాజిక సంపర్కమూ లేని ప్రదేశాలలో కూడా వేదాలకి గల పాఠాలని నూటికి తొంభైతొమ్మిది పాళ్లు ఒకే విధంగా అక్షరంగాని పదంగాని వ్యత్యాసం లేకుండా ఉంటాయి. ఇక్కడ వేదాలు ఒక తరం నుంచి మరొక తరానికి లిఖిత పూర్వకంగా కాక, వాక్కు వల్లనే సంక్రమించిన విషయంకూడ గుర్తుంచుకోవాలి. అంటే, స్వల్ప వ్యత్యాస ముందని దీని అర్థమా? అవును, ఉన్నది. ఒక ప్రాంతంలో ఉన్న ప్రతిశాఖకీ మరొక ప్రాంతంలో కల పాఠంలో కొద్ది వ్యత్యాసముంటుంది. ఇది ఆమోదనీయమేనా? ఏ మార్పు ఉన్నా అది విపరీతాలకు దారితీస్తుందని చెప్పిన తర్వాత ఈ 1% వ్యత్యాసం మాత్రమెట్లా సహించటం? శుద్ధమైన రూపము ఒకటే ఉంటే 1% మార్పుకూడా అనుకొన్న ఫలితాన్నివ్వకపోవచ్చు, వేరొక ఫలితాన్నివ్వవచ్చు. ఈ ప్రశ్నకి సమాధానముంది.
మంత్రాలలోని పదాలను మారిస్తే ఫలితం విపరీతమవుతుంది. నిజమే - జబ్బుని కుదర్చటానికి మందుని మార్పుచేస్తే వైద్యం మారినట్టే ఇది కూడ. కాని ఇది రోగికే వర్తిస్తుంది, తనంతట తానే అతడు ఔషధాన్ని మార్చుకోకూడదు, వైద్యుడు మార్చవచ్చు. ఒక వ్యాధిని కుదర్చటానికి ఎన్నో మందులుంటాయి. అటువంటి సమయాల్లో వైద్యుడు ఒక మందుకి బదులు మరొక దానిని సూచించటంలో తప్పేమీ లేదు. ఒకే జబ్బైనా రోగి దేహస్థితిని బట్టి ఔషధంలోని పదార్థాల మిశ్రమాన్ని కూడ వైద్యుడు మార్చవచ్చు:
ఆ విధంగానే ఉద్దేశపూర్వకంగానే ఋషులు వివిధశాఖలలోని పదాలను మార్చారు. తమ తరువాత వచ్చేవారు వల్లించటానికి వీలుగా ఈ మార్పు చేయబడింది. ''ప్రాతిశాఖ్య'' పాఠాలలో ఈ మార్పులకు సంబంధించిన నియమాలు వివరింపబడ్డాయి. ''ప్రాతిశాఖ్య'' అన్న మాటకి అసలైన అర్థం ''ప్రాంతీయం'' అని. మాటలలోని తేడాలు స్వల్పము - ఆ తేడాలు గణనీయము కావు. సన్నిహిత పదాలు, ఇంచుమించు ఒకే విధంగా ఉచ్చరింపబడే పదాలనే వాడారు.
వైదిక శబ్దాలూ - ప్రాంతీయభాషలూ :
వేద పదాలలో ప్రాంతీయ భేదాలను దృష్టిలో పెట్టుకొని వివిధ భారతీయ భాషలలో గల తేడాలను గమనిస్తే సాంస్కృతిక భేదాలకు మూలకారణం వైదిక శబ్దాలన్న ఆశ్చర్యకరమైన విషయం బయట పడుతుంది. భాషా శాస్త్ర సంబంధమైన నా పరిశోధనలివి. ''ద'' ''ర'' ''ల'' ''ళ'' - ఇవన్నీ ఒక దానికొకటి దగ్గరి శబ్దాలు. చిన్న పిల్లవాడిని ''రైలు'' ''రామ'' అనమంటే ''దైలు'' ''దామ'' అంటాడు. ''ద'' ''ర''లకు శబ్దపరంగా సాన్నిహిత్య ముండటమే దీనికి కారణం. ''ద'' ''ర''గా మారగలదు. కనుక 'ల', 'ద'లకు శబ్దపరంగా మారగలదు కదా! ''ల'', ''ళ''లు దగ్గర శబ్దాలు. 'ల'కి, తమిళ శబ్దం ''ళ'' (zha)కి గల సాన్నిహిత్యాన్ని వేరే చెప్పనక్కర్లేదు.
ఒక్కొక్క వేదం బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలనూ, ఆయా భాషల లక్షణాలనూ గమనిద్దాం.
ఈ రోజులలో వేదాలు ఆర్యులవనీ, ద్రవిడసంస్కృతి దానికి భిన్నమనీ ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి సమిష్టిగా ద్రవిడ ప్రాంతమని చెప్పబడే మూడు ప్రాంతాలను తీసికొందాం. అంటే తమిళం, తెలుగు, కన్నడ భాషలను తీసికొందాం. సంస్కృతంలో ''ప్రవాల''మనే శబ్దముంది. ఇదే - తమిళంలో ''పవళం'', తెలుగులో ''పగడం'' కన్నడంలో ''హవళ''. ''ప్రవాల'', తమిళంలో 'పవళం' అయింది తెలుగులో 'పగడ'మయింది. 'వ', 'గ'గా మారింది. 'ప్రవాల' కన్నడంలో ''హవళ''గా మారినప్పుడు మొదటి అక్షరమే మారుతుంది. ''ప్ర'' అన్న అక్షరం తెలుగులో, తమిళంలో ''ప''గా మారటం పెద్ద మార్పుకాదు. కాని కన్నడంలో అది ''హ'' అవుతుంది. ఇది ఆ భాష ప్రత్యేక లక్షణం. ఇతర భాషలలోని ''ప'' కన్నడంలో - 'హ'గా మారుతుంది. ''పంప'' ''హంప''గా ఇంకా ''హంపి''గా మారుతుంది. ఆర్య, ద్రావిడ అంటూ రెండు జాతులుగా కాకపోయినా భాషలను సంస్కృతంలో సంబంధమున్న భాషలనీ, కేవలం ద్రావిడ భాషలనీ వర్గీకరిస్తారు. ఇప్పటి పరిశోధనలననుసరించే ఈ వర్గీకరణం. ఇంకా కొంత పరిశోధన జరిగితే ఈ వర్గీకరణ మనవసరమే మో ననీ, అన్ని భాషలకూ మాతృక ఒకటేనేమో ననీ కూడ నిరూపించవచ్చు. పశ్చిమ భారతంలో, కర్నాటకతో సహా, ప్రాచుర్యంలో ఉండేది ఋగ్వేదం. ఋగ్వేదంలో ''ళ'' శబ్దం ఎక్కువ వాడుకలో ఉంది. ద్రావిడభాష అని అందరూ అనుకునే కన్నడలోకి ''ళ'' అట్లా వచ్చింది.
తూర్పుతీరాన్నీ, దానిని ఆనికొని ఉన్న ఆంధ్ర ప్రాంతాన్నీ తీసికొంటే 98% యజుర్వేదాన్ని పాటిస్తారు. మిగిలిన 2% వారు ఋగ్వేదాన్ని. ఆంధ్రలో ''సామవేదం'' వారు లేరనే చెప్పవచ్చు. యజుర్వేదమే ఇక్కడ ప్రమాణమవటం వల్ల ఋగ్వేదంలోని ''ళ'' సహజంగానే ''ద''గా మారంది. తెలుగులో కూడ ఇతర భాషలలోని ''ళ'' 'ద'గా మారింది.
ఆంధ్రలో వలె కాకపోయినా తమిళనాడులో కూడ తర్వాతి కాలంలో యజుశ్శాఖాద్యయులు అధిక సంఖ్యాకులయినారు. తమిళనాడులో 80% యజుశ్శాఖేయులు, 15% సామవేదం వారు మిగిలిన 5% ఋగ్వేదులుగా అనుకోవచ్చు. ఇది ఇప్పటి పరిస్థితే అయినా పూర్వం సామవేదమనుసరించే వారే అత్యధికులు తమిళనాడులో సామవేదంలోని 1000 శాఖలను అనుసరించే వారు తమిళనాడులో ఉండే వారనటం తప్పుకాదు.
ప్రస్తుతపు కేరళలో వాడుకలో నున్న భాష మళయాళం, తెలుగు, కన్నడములతో బాటు ఈ భాషని నేను పేర్కొనక బోవటానికి కారణం, పల్లవుల వలె ఇది కూడ ఈ సమీప కాలానికే చెందటం. వెయ్యిసంవత్సరాల క్రితం వరకూ కూడ కేరళ తమిళనాడులోనే ఉండేది - అక్కడ తమిళాన్నే వాడేవారు. ఆ తరువాత మళయాళం తమిళం నుండి జనించింది. తమిళంలోని 'ళ' (zha) తెలుగులో 'ద'గాను, కన్నడంలో 'ళ'గాను మారినా, మళయాళంలో మాత్రం ఆ రూపంతోనే ఉంది. ఇంతకూ చెప్పవచ్చిందేమిటంటే ఆయా ప్రాంతాలలో వేదాల ఉచ్చారణలననుసరించి, ప్రాంతీయ భాషలు తమకి ప్రత్యేక లక్షణాలైన అక్షరాలను ఏర్పర్చుకున్నాయి.
ఇప్పటి వరకూ నేను చెప్పినదంతా ద్రావిడులనబడే వారి భూమికి సంబంధించింది. ఇక అఖిలభారత, అంతర్జాతీయ పరిస్థితి దృష్ట్యా పరిశీలించుదాము.
ఉత్తర భారతంలో ''య'' బదులు ''జ''ని, 'వ'కి బదులు ''బ''ని వాడటం పరిపాటి. వాడుక భాషలోనే కాక కావ్య భాషలో కూడ ఇట్లాగే జరుగుతుంది. 'వ', 'బ'గా మారటం బెంగాలులో బాగా కనబడుతుంది. ''య'' 'జ'గా మారటం ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇంకా ఉత్తర ప్రాంతాలలో కనబడుతుంది. పాణిని సూత్రమైన ''వ బయోరభేదం'' ('వ', 'బ'లను ఒక దాని స్థానంలో మరొకటి వాడవచ్చు) బాగా ఆచరణలో ఉన్నట్టు బెంగాలులో తెలుస్తుంది. బెంగాలులో 'వ' ప్రతిచోటా 'బ'గా మారుతుంది. అసలు 'వంగ' అన్నదే 'బెంగాలు'గా మారింది. ''వంగవాసి'', ''బంగవాసి''గా మారింది. ఈ తప్పుని వారే గుర్తించారు. ఈ తప్పుని దిద్దటానికి బెంగాలులో ఒక పరీక్షని కూడ పెట్టారు. దాని పేరు ''వంగ పరిషత్'' అన్ని ప్రచురణలలోనూ ''బ'' కి బదులు ''వ''ని వాడాలని వారి సంకల్పం. ఆ సంకల్పంలో అప్రయత్నంగా, అనవసరమైన చోట్ల కూడా ''బ''ని ''వ''గా మార్చారు. 'బంధు' (అంటే చుట్టం)ని 'వంధు'గా మార్చారు. 'వంగబంధు' సరియైన మాట. అది ''బంగబంధు''గా మారితే దానిని తప్పుగా ఇప్పుడు 'వంగు వంధు''గా మార్చారు.
ఉత్తరభారతంలోనూ, మరికొన్ని ప్రాంతాలలోనూ ''వ''కి బదులు 'బ'ని వాడుతారు. బిహార్, నిజానికి విహార్. ఈ ప్రాంతంలో బౌద్ధ విహారాలు పుష్కలంగా ఉండేవి. ''రాష్ బిహారి'' నిజానికి ''రసవిహారి'' ''వ''ని ''బ''గా పలుకటానికి కారణమేమిటి? ఒక శాఖకి చెందిన ఆ ప్రాంతీయులట్లా పలకాలని ప్రాతిశాఖ్య నిర్దేశిస్తుంది. ఈ నియమం వేద మంత్ర పఠనానికి సంబంధించినది - కాని అదే వాడుక భాషకీ, సాహిత్యభాషకీ విస్తరింపబడింది. అంటే, ఆ ప్రాంతంలో ఒకప్పుడు 'శిక్ష' నియమాలను ఎంతో నిష్ఠతో పాటించే వారనమాట.
దేశం మొత్తమ్మీద యజుశ్శాఖవారు అత్యధికులని అన్నాను. ఈ వేదానికి రెండు పాఠాలు - అంటే కృష్ణ యజుర్వేదం, శుక్లయజుర్వేదం ఉన్నాయని కూడ అన్నాను. దక్షిణ భారతంలో కృష్ణయజుర్వేదం బహుళ ప్రచారంలో ఉంటే, ఉత్తర భారతంలో శుక్ల యజుర్వేద ముంది.
శుక్లయజుర్వేదానికి గల అనేక శాఖలలో ఒకటి మాధ్యన్దిన శాఖ. దీనిని ఉత్తర భారతంలో నిష్ఠగా అనుసరిస్తారు. తత్సంబంధమైన ప్రాతిశాఖ్య ప్రకారం ''య'' స్థానంలో ''జ''ని వాడవచ్చు. అట్లాగే ''ష'' స్థానంలో ''క''ని వాడవచ్చు. అందువల్లే దాక్షిణాత్యులు ''యత్ పురుషేణ హనిషా'' అంటే ఉత్తర దేశీయులు ''జత్'' ''పురుషేణ హవికా'' అంటారు. కాలక్రమేణా ఉత్తరదేశంలో ఈ మార్పు చాలా మాటలకి వ్యాపించింది. ''యమున'', ''జమున''గాను, 'యోగి', 'జోగి'గాను 'యుగ', 'జుగ'గాను, 'యాత్ర', 'జాత్ర'గాను మారాయి. 'ష' 'క'గా మారినప్పుడు 'ఋషి' 'ఋకి'గా మారింది. 'క్ష', 'ష' సన్నిహిత బంధువులు కదా. అందువల్లనే ఉత్తరదేశంలో 'క్ష', 'క' అవుతుంది. 'క్షీరం' 'కీర్' అవుతుంది. ఇట్లాంటివే ఎన్నో ఉదాహరణలివ్వ వచ్చు.
ఇక అంతర్జాతీయ స్థాయికి వెళ్దాం. క్రైస్తవం, బైబిల్ జన్మించిన పాలస్తీనాకూ, ఇజ్రెయిల్, సెమిటిక్ దేశాలకూ వెళ్దాం. క్రైస్తవుల ఓల్డ్ టెస్ట్‌మెంట్ - ముస్లిం కొరాన్‌కి మూలం. మొదటి దాంట్లో ఉన్నవి రెండవ దాంట్లో ప్రత్యక్షమవుతూంటాయి. కాని అరేబియాలో ఉచ్ఛారణ మారుతూంటుంది. 'జోసెఫ్' 'యూసఫ్'గాను, 'జెహొవ' 'యహొవ'గాను మారుతాయి. క్రైస్తవం, ఇస్లాంలకు మాత్రమే పరిమితం కాదు. క్రైస్తవదేశాలలో కూడ కొన్ని భాషలలోనే 'య' శబ్దం ప్రముఖంగా ఉంటుంది. కొన్నిటిలో 'జ' శబ్దం ఎక్కువౌతుంది. గ్రీస్ వెళ్లితే 'జ' శబ్దం స్పష్టమవుతుంది.
దీనంతటికీ మూలం వేదాలలో కనిపిస్తుంది. వేదాలలోని ''యహ్వన్'' అన్న దేవత జహోవ (యహోవ), దేపిత - జూపిటర్, సంస్కృతంలో అసంపూర్ణమైన హల్లులు మొదట్లో వస్తే మరొక భాషలో చెప్పేప్పుడు దానిని వదిలివేస్తారు ''దౌపతిర్'', ''¸°పితర్''గాను జూపిటర్‌గాను మారుతుంది.
''యహ్వన్'', ''ద్యౌపితర్'' లలోని 'య' 'జ'గా మారటం వల్ల 'జెహోవ' జూపిటర్ ఏర్పడ్డాయి - దీని అర్థమేమిటి ? ప్రపంచమంతా వేదవిహితమైన విధులు వ్యాప్తమై యున్న రోజులలో, గ్రీస్ ప్రాంతంలో ''మాధ్యన్దిన శాఖ'' (యజుర్వేదం) బాగా ప్రాచుర్యంలో ఉండేదని తెలియటం లేదా?
వేదపద ఉచ్చారణ ప్రాంతీయ భాషను ప్రభావితం చేసిందా లేక ప్రాంతీయ భాష వేదపద ఉచ్చారణనా?
ఒక్కొక్క ప్రాంతంలో వేదాలలోని పదాలే ఆ ప్రాంతపు వాడుక భాషలో, కావ్యభాషలో వాడబడేవి. దీని బట్టి వేదాలన్ని దేశాలలోనూ వ్యాప్తి చెందాయని తెలుస్తుంది.
వేదాల శిక్షానియమాలు ప్రాంతీయభాషలకు ప్రధాన ఉచ్ఛారణలయాయి. దీనికి కారణం ప్రాతిశాఖ్య నియమాలు ఏ ఒక్క ప్రాంతానికీ చెందినవి కాకపోవటం. వేదశాఖ ప్రచారంలో ఉన్న ప్రాంతాలన్నిటి కొరకూ ఏర్పడింది. కాశ్మీరులోనైనా కామరూపం (అస్సాం)లోనైనా జైమిని సామని పఠించేవారు ''ష'' అని పలికితే ఇతరులు ''ద'' అనో ''ళ'' అనో పలుకుతారు.
గుజరాతీయైనా, మారాఠీ అయినా, మరేదైనా మాతృభాష కావచ్చు శుక్లయజుర్వేదాన్ని పఠించేవాడు ''ద''నే పలుకుతాడు. ప్రాతిశాఖ్య ఏ ప్రాంతానికీ పరిమితం కాదు, ఉచ్చారణ నియమాలను నిర్దేశిస్తుంది. కాలక్రమేణా ఏ శాఖ ఏ ప్రాంతంలో వాడుకలో ఉంటే, ఆ అక్షరానికి గల ప్రత్యేక లక్షణం ప్రాంతీయ భాషకి కూడ ప్రాకింది.
శిక్షా శాస్త్రం గురించి గమనింపదగ్గ మరికొన్ని అంశాలు :
వేద శబ్దాలను, ఉచ్చారణ పద్దతులను మార్చరాదన్నాను. శాఖా భేదాల వల్ల చిన్నచిన్న మార్పులను శిక్షాశాస్త్రం అనుమతిస్తుంది. ఆ విధంగానే స్వరస్థాయికి సంబంధించిన మార్పులూ ఆమోదయోగ్యాలే.
వేదాలను వల్లించటంలో సంహిత, పద, క్రమ పద్ధతులున్నాయని చెప్పాను. ఆయా భిన్న రీతులని ప్రాతిశాఖ్య అనుమతిస్తుంది. ఇవి శిక్షాశాస్త్ర భాగాలు.
ఇదేదో శబ్దాలకి సంబంధించిన చర్చ అని తేలికగా చూడకూడదు. సంస్థితమైనది శబ్దమే. అందువల్లనే వేదపురుషుడు ఉచ్ఛ్వాసనిశ్వాసాలు జరిపే నాసిక, శిక్షాశాస్త్రం.
సంస్కృతంలోని 50 అక్షరాలు (శబ్దాలు) వేదాలనుండి వచ్చినవే. ''జ్ఞ'' అన్న అక్షరాన్ని విడిగా తీసుకుంటే 51 అవుతాయి. వీటిని ''మాతృక'' అంటారు. ఈ మాటకి చాలా అర్థాలున్నాయి. మాతృ అంటేమాత - దీని అర్థం విశ్వమాత. ఆ పరాశక్తి ప్రతిబింబాలే ఈ 51 అక్షరాలూను. జగత్‌సృష్టి పరాశక్తి వల్లనే జరిగితే, సృష్టికి శబ్దమే మాధ్యమమైతే 51 అక్షరాలూ పరాశక్తి స్వరూపాలే అవుతాయి కదా! శిక్షాశాస్త్రం ప్రకారం ఈ 51 శబ్దాలూ పరాశక్తి శరీరభాగలే - అంతేకాదు, ఏ అక్షరం ఏ శరీరభాగానికి ప్రతీకో కూడ ఆ శాస్త్రం చెప్తుంది. మన దేశంలో కల శాక్తేయుల 51 స్థావరాలకూ, ఆ విశ్వ దేహపు 51 భాగాలకు సంబంధముంది.
శిక్షాశాస్త్రం వేదపురుషుని నాసికగా భావింపబడటమే కాక అక్షరాలన్నీ కలిసి పరాశక్తి - విశ్వమాత - రూపంగా భావింపబడటం ఆ శాస్త్ర ప్రాధాన్యతని మరీ ఎక్కువ చేస్తుంది!
* * *