Acharyavaani - Vedamulu Chapters Last Page
16. వేదాంగములు : వ్యాకరణము
వేదపురుషుని ముఖస్థానము (నోరు) వ్యాకరణము. వ్యాకరణ సంబంధమైన రచనలెన్నో ఉన్నాయి. ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది - పాణిని రచన. అది సూత్రాలతో నిండి యుంటుంది. ఆ సూత్రాలకు విపులమైన వ్యాఖ్య (వార్తికం) రచించినది వరరుచి. పతంజలి మహర్షికూడ ఒక వ్యాఖ్యానం రచించాడు. ఈ మూడు గ్రంథాలూ వ్యాకరణ శాస్త్రంలో ముఖ్యములు.
ఇతర శాస్త్రాలకీ వ్యాకరణానికీ భేదముంది. ఇతర శాస్త్రాలలో సూత్రాలు భాష్యాల కంటె ప్రధానాలు. వ్యాకరణం విషయంలో అట్లాకాదు. సూత్రాల కంటె భాష్యమే ప్రధానం.
సూత్రాలు వివరణ ఇవ్వక సూచికల వలె ఉంటాయి. ప్రతి శాస్త్రానికీ భాష్యముంటుంది. ప్రతిభాష్యానికీ, విషయం బట్టి ఒక పేరుంటుంది. వ్యాకరణభాష్య మొక్కదానినే మహాభాష్య మంటారు, దాని ప్రాధాన్యతను బట్టి. ఈ మహాభాష్యాన్ని రచించినది పతంజలి మహర్షి.
వ్యాకరణమూ, శివుడూ :
శివాలయాలలో ''వ్యాకరణ దాన మండప'' మంటూ ఒక మండపముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి వివరిస్తాను. ఈ శ్లోకం చూడండి :
''నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతత్ విమర్శే శివసూత్ర జాలం''
''అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది'' ఈ శ్లోక తాత్పర్యమిది.
నర్తనమాడే శివుని పేరు నటరాజు. ఆయనను మించిన నర్తకుడు లేడు. తాండవాధినేత ఆయన. మహానటుడాయన. నటరాజు ప్రతిమని చూస్తే ఆ తలనుండి ఏదో బయటకు వస్తున్నట్టు కనబడుతుంది - అది గంగతో, నెలవంకతో - అలంకృతం, అవే శివుని జడలు. శివుడు నాట్యమాడుతూన్నంతసేపూ ఆ జడలు కూడ తిరుగుతూంటాయి. నర్తనమాగిపోగానే ఆ జడలు రెండువైపులా పరచుకుంటాయి. ఆ క్షణాన్నే శిల్పి ఊహించి రాతి ప్రతిమగా, లోహపు ప్రతిమగా చెక్కుతాడు.
నటరాజు చేతిలో డమరుకముంటుంది. మామూలుగా జోస్యం చెప్తూండేవాళ్ల చేతులలో ఉండేదాని కన్నా పెద్దదిగా ఉంటుంది. నర్తనం చేసేటప్పుడు శివుడు ఆ డమరుకాన్ని కూడ లయబద్ధంగా ఆడిస్తాడు. పై శ్లోకంలో ''ననాదఢక్కాం'' అన్న మాటకిదే అర్థం.
వాద్యాలనన్నిటినీ మూడు విధాలుగా విభజించ వచ్చు. అవి (1) చర్మవాద్యాలు - అంటే చర్మాన్ని ఉపయోగించేవి - ఢక్క, మృదంగం, మద్దెల, చెండ (కేరళలో) వంటివి (2) తంత్రీవాద్యాలు - వీణ, వయోలిన్ వంటివి - తంత్రులనుపయోగించేవి (3) వాయురంధ్ర వాద్యాలు - వీటిలో గాలిని కొన్ని రంధ్రాల ద్వారా బయటకు ఊదుతారు - వేణువు వంటివి.
చర్మవాద్యాలను పలికించటానికి చేతివేళ్లనిగాని, కఱ్ఱలనిగాని ఉపయోగిస్తారు. వాద్యం అంతం కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. ''చోపు'' అంటారు దీనిని. ఆ విధంగానే నృత్యం చివరికి వస్తున్నపుడు (''నృత్తావసానే'') చోపు ధ్వని వినబడింది.
నటరాజు నృత్యమాడుతున్నప్పుడు సనక, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, ఋషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థ్యాన్ని ''దివ్యదృష్టి'' అంటారు. దీనినే భగవద్గీతలో ''దివ్య చక్షు'' వన్నారు.
సనకాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ''చోపు'' వస్తుంది. పై శ్లోకంలోని ''నవపంచవారం''. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులనీ సూచిస్తుంది.
డమరుకపు దరువుల విద్యలుకూడ పధ్నాలుగే. హిందూ ధర్మానికి ప్రాతిపదిక పధ్నాలుగు విద్యలైతే, నటరాజుకూడ డమరుకంతో పధ్నాలుగు దరువులనే ఇచ్చాడు. ఆ పధ్నాలుగు దరువులూ సనకాది ఋషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. ఈ సనకాదులెవరు? ఆలయాలలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలుంటాయి. ఆ నలుగురూ సనక, సనందన, సనాతన, సనత్ కుమారులనే మహర్షులు. ఆ పధ్నాలుగు దరువులూ ఈ ఋషులకు శివరూప మెరగటానికి సోపానాలయాయి. ఆ శబ్దాలనే ''శివభక్తి సూత్రాలంటారు''. వీటిపై నందికేశ్వరుడొక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తిలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథా సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో (ఈనాటి పాట్నానగరం) వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని ఇద్దరుండే వారు. వారిలో రెండవవాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోశ్ల. పాణినీ, వరరుచీ వర్షోపాధ్యాయుని శిష్యులుగా విద్యనభ్యసిస్తూండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు. శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్లతోనే చూడగలిగే భాగ్యాన్ని పొందాడు.
నర్తనం చివరిలో డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసికొని ''అష్టాధ్యాయి'' అనే ప్రాథమిక గ్రంథాన్ని రచించాడు. దీనిలో ఎనిమిది అధ్యాయాలుండటం వల్ల దీనిని ''అష్టాధ్యాయి'' అంటారు.
అ పధ్నాలుగు సూత్రాలనీ ''మహేశ్వర సూత్రా''లంటారు. ఈ పధ్నాలుగు సూత్రాలను శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసేప్పుడు పఠిస్తారు. (ఈ ఉపాకర్మని తమిళంలో ఆవని అవట్టం అంటారు) నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధమిదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణమంటపాలుంటాయి.
వ్యాకరణ గ్రంథాలు :
శివునికి చంద్రవస్తముడనీ, చంద్రశేఖరుడనీ, ఇందుశేఖరుడనీ పేర్లుండటానికి కారణం ఆయన శిరస్సున చంద్రుణ్ణి ఆభరణంగా పెట్టుకోవటమే. రెండు వ్యాకరణ గ్రంథాలకి 'ఇందుశేఖర' సంబంధమైన పేర్లున్నాయి. అవి - శ##బ్దేందు శేఖరం, పరిభాషేందు శేఖరం. వ్యాకరణ శాస్త్రాన్ని పఠించిన వారు ఈ రెండు గ్రంథాల వరకూ నిష్ణాతులైతే వారిని ''శేఖరరత్నాల వరకూ చదవార''ని సగౌరవంగా అంటారు.
శిక్షా శాస్త్రానికి దాదాపు ముపై#్ఫ గ్రంథాలున్నట్లే వ్యాకరణ శాస్త్రానికి కూడ ఎన్నో గ్రంథాలున్నాయి. వీటిలో సుప్రసిద్ధము లైనవి - పాణిని సూత్రాలు, పతంజలి భాష్యం, వరరుచి వార్తికం.
విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానంలోని ''నవరత్నాల''లో వరరుచి ఒకడు. ఆయన వ్యాకరణం పై గ్రంథాలు రచించాడు. ఆయనే వార్తికాన్ని రచించాడో లేదో నన్నవిషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి.
భర్తృహరి రచించిన ''వాక్యపదేయం'' కూడ వ్యాకరణంపై ఒక ముఖ్యమైన రచనే. వ్యాకరణంపై ముఖ్యమైన గ్రంథాలని ''నవవ్యాకరణ''మంటారు. ఈ తొమ్మిదింటినీ శ్రీరామభక్తుడైన ఆంజనేయ స్వామి క్షుణ్ణంగా పఠించాడు - ఆయన ప్రత్యక్షగురువు సూర్యభగవానుడే. ఈ రచనలలో ఒకటి ''ఇంద్రం''. దీనిని ఇంద్రుడే వ్రాశాడంటారు. ఇదే తమిళ వ్యాకరణ గ్రంథమైన ''తొల్కాప్పియా''నికి మూలమంటారు.
భాషాశాస్త్ర పరిశోధనా, మతము :
శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం - ఈ నాలుగు వేదాంగాలు భాషకి సంబంధించినవి. మతగ్రంథములు. చెప్పవలసిన విషయాలు కేవలం ధర్మం. భగవంతుడు. ఆరాధనా విధానాలు. విజ్ఞానదాయకాలైన ప్రవచనాలు. నైతిక విలువలు - ఇటువంటివి. కాని భాష, వ్యాకరణం, స్వరశాస్త్రం వంటి విషయాల గురించి కాదనే వారుండవచ్చు.
''వేదం'' అన్న శీర్షిక క్రింద కేవలం ధర్మానికి సంబంధించిన విషయాలే చెప్పబడ్డాయి. ముందు ముందు కల్పం, మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం గురించి చెప్తాను. ఇవన్నీ మత సంబంధమైన విషయాలే కాని ఈ రెంటి నడుమా మతంతో సంబంధంలేని భాషాశాస్త్రం, స్వరశాస్త్రం వ్యాకరణమూ ఏమిటి? దీనికి కారణమిది - వేదాల ప్రకారం ప్రతిదానికీ పరమాత్మతో సంబంధముంది. అందువల్ల కేవలం ధార్మికమైన విషయాలకీ ఇతర విషయాలకీ భేదం లేదు. అందువల్లనే దేహారోగ్యానికి సంబంధించిన వైద్యవిద్య ఆయుర్వేదమూ, యుద్ధంలో ఉపయోగపడే ధనుర్విద్యా కూడ ఆత్మవికాసానికి సంబంధించిన వాటిగానే పరిగణింపబడ్డాయి. అవి కూడ పధ్నాలుగు విద్యలలో చేర్చబడ్డాయి. అర్థశాస్త్రం పేర్కొనే ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం కూడ ఆత్మ విద్యలో భాగాలే !
వాటికి ధార్మిక గ్రంథాల ప్రతిపత్తినివ్వటానికి కారణమిది: జీవితానికి సంబంధించిన అన్ని అంశాలూ నియమబద్ధమైతేనే ఆత్మసాక్షాత్కారం సంభవమనీ, అందుకు ఇవి మార్గ దర్శకాలనీను.
శిక్ష, వ్యాకరణాలలో పరమాత్మ యొక్క మహోన్నత రూపమైన ''శబ్దం'' గోచరిస్తుంది. ముక్తి నొందటానికి మనకి ఉపయోగపడే భాషలకు శబ్దంతో సంబంధం ఉంది - అందుచేతనే శిక్ష, వ్యాకరణం రూపొందింపబడ్డాయి.
''శబ్ద బ్రహ్మవాదం'' అంటే శబ్దమూ, పరమాత్మా సంబంధితాలు - అన్న వాదాన్ని వ్యాకరణం సూచిస్తుంది. దాని శాఖలలో ఒకటి ''నాదబ్రహ్మ ఉపాసన'' - నాదంలో బ్రహ్మని చేరే పద్ధతి.
ఇదే శుద్ధ సంగీతానికి ప్రాతిపాదిక, శబ్దాలను సరిగ్గా మేళవించి భాషగా వాడినప్పుడు మన భావాలను వ్యక్తీకరించటంతో బాటు చిత్తశుద్ధికి కూడ కృషి చేయవచ్చు. భాషాసంబంధమైన ఈ శాస్త్రాలు ఈ మేరకు ఉపయోగిస్తాయి.
స్వతంత్రభారతంలోని మధ్య ప్రదేశ్‌గా వ్యవహరింప బడుతున్న ప్రాంతంలో ''ధర్'' అనే రాజ్యముండేది. భోజరాజు రాజధానియైన 'ధారా' నగరమిదే. భోజరాజు దాతృత్వానికి ప్రసిద్ధుడు. ధారా నగరంలో ఒక మసీదుంది. ఆ మసీదు గోడలపై సంస్కృతపు వ్రాతలు చెక్కబడ్డాయని తెలిసింది. అది ముస్లింల కట్టడమవటం వల్ల ఆ వ్రాతలను అధికారుల అనుమతి లేకుండా చూడ వీలయేది కాదు. చాలాకాలానికి గాని ఎపిగ్రాఫికల్ డిపార్టుమెంటు వారికి ఆ అనుమతి లభించలేదు. ఆ తరువాత వారా వ్రాతల గురించి పరిశోధన జరిపారు.
గోడపై పెద్ద చక్రం చెక్కబడింది. దానిపై ఎన్నో శ్లోకాలు చెక్కబడ్డాయి. ఇవన్నీ వ్యాకరణమే. వ్యాకరణశాస్త్రాన్నంతా శ్లోకాలుగా ఆ చక్రం మీద చెక్కారు. భోజరాజు కాలంలోని ఈ సరస్వతీ దేవాలయం, మసీదయింది.
వాగ్దేవి, చదువుల వేల్పు అయిన, సరస్వతీ మందిరంలో భాషా శాస్త్రం వ్యాకరణంగా ఎల్లప్పుడూ ఉండాలని ఆ శిల్పుల ఉద్దేశం. వ్యాకరణం వేద పురుషుని నోరు కదా! ఆ చక్రాన్ని చూచినంత మాత్రాన వ్యాకరణ శాస్త్రమంతా తెలుస్తుందంటారు. వ్యాకరణం ఆరాధ్యం కావటం వ్ల ఆ ఆలయంలో వ్యాకరణ చక్రాన్ని నెలకొల్పారు. ఆ ఆలయం మసీదయిన చాలాకాలానికి ఆ వాగ్దేవి కటాక్షం వల్లే ఆ చక్రం మనకి లభించింది. ఎపిగ్రఫీ డిపార్టుమెంటు వారు ఆ చక్రాన్ని అచ్చులో ప్రచురించారు. ఆంగ్లంలోకి అనువదించారు.
వ్యాకరణాది శాస్త్రాలను పూర్వపు రాజులూ ప్రభుత్వాలూ కేవలం శాస్త్రాలుగా వెనుకకు పెట్టెయ్యక వాటిని ఆరాధ్యాలుగా పరిగణించే వారని దీని బట్టి తెలుస్తుంది. దీని బట్టి, భాషా స్వఛ్చతకీ, భాషా నాగరికతకీ పూర్వం మన దేశంలో ఎంత ప్రాముఖ్యముందో కూడ తెలుస్తుంది.
* * *