Acharyavaani - Vedamulu Chapters Last Page
17. వేదాంగములు : ఛందస్సు
వేదపురుషుని పాదములు :
ఆరువేదాంగాలలో ఛందస్సు ఒకటి. వేదపురుషుని పాదాలుగా భావింపబడుతుంది. 'ఛందస్సు'కి మరొక అర్థం కూడా ఉంది. ఆ మాటకి అర్థం 'వేదాల'నే. కృష్ణభగవానుడు వేదాలని సృష్టి అనే వృక్షానికి పత్రాలంటాడు (ఛందాంసి యస్య పర్ణాని)
ఇక్కడ ఛందస్సనే పదాన్ని వేరొక అర్థంలో వాడుతాను. ఛందస్సంటే పద్యరూపమనే అర్థంలో.
ఋగ్వేదమూ, సామవేదమూ రెండూ పద్యాలమయం. యజుర్వేదంలోని మంత్రాలు వచనంలో ఉన్నా అవికూడ పద్యాలని కలిగియుంటాయి. పద్యరూపంలో (ఛందోమయంగా) ఉండటం వల్లనే వేదాలని ఛందస్సంటారు.
మనకి కోటు కుట్టాలంటే దర్జీ కొలతలని తీసుకుంటాడు. బట్టని ఆ కొలతల ప్రకారం కత్తిరించి, కుడతాడు. కొలతలు తీసికోకపోతే కోటు సరిపోకవచ్చు. ఆ విధంగానే మన భావాలను కవిత్వరూపంలో వ్యక్తం చేయాలంటే, అవి కవిత్వపు సొగసులు సంతరించుకోవాలంటే, సరియైన కొలతలు అవసరం. కోటుకి కొంత పొడవూ, కొంత వెడల్పూ ఉండాల్సినట్టుగానే పద్యానికి నిర్ణీతమైన నిడివీ, అక్షరాలూ ఉండాలి. అప్పుడే సరిగ్గా నప్పుతుంది. ఛందస్సు ఈ సూత్రాలను విధిస్తుంది. పద్యాలకు ఉండవలసిన పరిమితులను నిర్ణయిస్తుంది. ఈ విషయమై ఆధికారకమైన ముఖ్యగ్రంథం పింగళుడు రచించిన ''ఛందస్సూత్రాలు''.
వేదపురుషుని పాదాలు ఛందస్సన్నాం. మంత్రజపంలో ప్రవేశమున్నవారు ఋషి యొక్క పేరు చెప్పి శిరస్సుని తాకుతారు, ఆ మంత్రం యొక్క ఛందస్సు పేరు చెప్పుకొని ముక్కుని తాకుతారు, అధిష్ఠాన దేవత పేరు చెప్పుకొని హృదయాన్ని తాకుతారు.
కవిత్వరూపంలో ఉన్నవేద మంత్రాలన్నీ ''ఛందస్సు''. ఇతరములు, అంటే వేదంలో భాగం కాని వాటిని శ్లోకాలంటారు. వచనాన్ని గద్యమనీ, ఛందస్సుని పద్యమనీ అంటారు. సంస్కృతంలో, ఆంగ్లంలో కవిత్వమంటారు. అంటే, వైదిక కవిత్వాన్ని ఛందస్సంటారు. అంతేకాక, లయబద్ధమైన ఏ కవిత్వాన్నైనా ఛందస్సనే అంటారు. వీటన్నిటిలోనూ ''అనుష్టుప్'' విరివిగా వాడబడుతుంది. పురాణాలలోనివీ, వాల్మీకి రామాయణంలోనివి - శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులోనే ఉన్నాయి.
ఒక్కొక్క వృత్తంలో ఎన్ని పాదాలుండాలో, ఒక్కొక్క పాదంలో ఎన్ని అక్షరాలుండాలో తెలిపే నియమాలున్నాయి. ''ఆర్య'' అని ఒక ఛందస్సుంది - ఇది హ్రస్వ - దీర్ఘ స్వరాలని కూడ పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఛందస్సులో ''రామ'' అన్న పదానికి రెండు మాత్రలుండవు - మూడుంటాయి. దీనికి కారణం ''రా'' దీర్ఘమవటం. దీనిని రెండు మాత్రలుగా లెక్కిస్తారు, 'మ' హ్రస్వమవటం వల్ల ఒక మాత్ర.
ఇతర వృత్తాలకు వేరే నియమాలున్నాయి. వాటిలో హ్రస్వ-దీర్ఘ స్వరాలకు భేదముండదు. ప్రతిపాదంలోని అక్షరాలూ నిర్ణీతమైన సంఖ్యలో ఉంటాయి.
పాదం :
ఛందస్సు వేదపురుషుని పాదమన్నాను. సంస్కృతంలో పాదాన్నీ పదమని కూడ అంటారు. ఇంగ్లీషులో కూడ పద్యాన్ని పాదాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదంలో ఎన్ని అక్షరాలుండాలో నియమిస్తారు. పాదం కాలి చివరి భాగం, పద్యంలో ఒక భాగం కూడ. ''పాద''మన్న మాటకి చాలా భాషలలో ఒకే అర్థముంది. మానవాళి కంతటికీ ఏ విషయంలోనైనా సాదృశ్యముండటం హర్షణీయం. మంత్రంలోగాని, శ్లోకంలోగాని నాల్గవభాగం పాదం. మానవదేహంలో 'కాలు' కూడ నాల్గవ వంతే. నడుం వరకూ సగం. మిగిలిన ఆ క్రింది భాగంలో చెరి ఒక కాలూ ఒక సగం - అంటే ఒక్కొక్క కాలు నాల్గవ వంతన్న మాట.
వేదమంత్రంగాని, వేదంలోలేని శ్లోకం గాని నాలుగు పాదాలు కలిగి యుంటుంది. ఒక్కొక్క పాదానికీ నిర్ణీతమైన అక్షరాలు లేక మాత్రలుంటాయి. ఒక పాదం వేరొక పాదంతో సమంకాకపోతే, ''విషమ'' అంటారు. నిజానికీ మాట ''వి-సమ'' అంటే అసమానమని అర్థం.
ఒక్కొక్కపాదం ఒక్కొక్క నిడవికలదైతే దానిని ''విషమవృత్త''మంటారు. ఒక పాదాన్ని విడిచి అసమానంగా ఉంటే దానిని ''అర్థసమవృత్త'' మంటారు. అంటే మొదటి పాదంలోని అక్షరాలూ, రెండవ పాదంలోని అక్షరాలూ ఒకే సంఖ్యలో ఉండవు. అట్లాగే మూడు, నాలుగు పాదాలు సమానమైన అక్షరాలు కలిగి యుండవు. కాని రెండు, నాలుగు పాదాలకు అక్షరాలు సమానంగా ఉంటాయి.
సాధారణంగా అన్ని పాదాలూ ఒకే నిడివి కలిగి యుంటాయి. ఉదాహరణకి అందరికీ తెలిసిన ఈ ప్రార్థనాశ్లోకం తీసుకుందాం -
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోప శాంతయే.
ప్రతిపాదంలోనూ ఎనిమిది అక్షరాలున్నాయి - ఇంగ్లీషు పద్ధతిలోని అక్షరాలు కావు, సంస్కృత పద్ధతిలోనివి. అక్షరంగా పరిగణింప వలసినవి అచ్చులు, అచ్చులు చేర్చబడ్డ హల్లులు మాత్రమే. కేవల హల్లులని విడిచి పెట్టాలి. అప్పుడే ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలని తెలుస్తుంది.
శ్లోకానికి నాలుగు పాదాలుండి, ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలుంటే దానిని అనుష్టుప్ ఛందస్సంటారు.
కవిత్వపు ఛందస్సు పుట్టుక :
వేదాలను పఠించేప్పుడు స్వరభేదానికై స్థాయిని హెచ్చించటం తగ్గించటం జరుగుతూంటుంది. కాని కావ్యాలలోగాని ఇతర కవనాల్లోగాని ఇది ఉండదు. వేదాలలోని అనుష్టుప్ ఛందస్సుని మొదటగా వాల్మీకి వాడాడు - కాని వేదాలలో వలె స్థాయి భేదం లేకుండా, అది ఆయన ప్రయత్నపూర్వకంగా చేయలేదు. రెండు పక్షులలో ఒక దానిని బోయవాడు చంపటం చూచాడు. తన సహవాసి మరణాన్ని చూస్తున్న పక్షిపట్ల కరుణ, బోయవాని పట్ల కోపంగా మారింది. అతనిని ఈ విధంగా శపించాడు;
మా నిషాద ప్రతిష్ఠాంత్వమగమ శ్శాశ్వతీసమాః
యత్ క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్||
''వేటకాడా- నీకెప్పుడూ ఏ శుభమూ కలుగకుండుగాక, ఆనందంలో ఉన్న క్రౌంపపక్షులలో ఒక దానిని హతమార్చావు''
ఆయన కోపం అప్రయత్నంగానే ఆ విధమైన అక్షర రూపం దాల్చింది.
వాల్మీకి మహర్షి తన ఆవేశానికి ఎంతో చింతించి దీని గురించి ఆలోచించాడు. హఠాత్తుగా ఆయన మనస్సులో ఒక ఆలోచన మెరిసింది. ఆయన జ్ఞాన దృష్టి గల ఋషి, తన శాపము అనుష్టుప్ ఛందస్సులో, నాలుగుపాదాలతో, పాదానికి ఎనిమిది అక్షరాలతో కూర్పబడిందని గ్రహించాడు. ఆయనకి ఆవేశం అప్రయత్నంగా పెల్లుబికినట్లే, ఆ అక్షరాల కూర్పు కూడ కవిత్వంవలె అప్రయత్నంగానే జరిగింది. ఆయన ఆశ్చర్య చకితుడయినాడు. బోయవానిని శపిస్తూ పలికిన శ్లోకానికే మరో అన్వయం కుదురుతుంది. ''లక్ష్మీవల్లభా! సుఖదంపతులలో కామమోహితుడైన పురుషుని వధించటం నీకు యశస్కరం'' ఈ పద్యం విష్ణు అవతారమైన శ్రీరామునికి సరిగ్గా నప్పుతుంది. కామాతురుడైన రావణుని వధించటానికి రాముడవతరించాడు. మండోదరిని పెళ్లి చేసుకొని సుఖిస్తున్న రావణుడు పరస్త్రీలను మోహించి, వరించాడు. తన నుండి అప్రయత్నంగా వెలువడిన ఆ శ్లోకం దైవప్రేరితమని వాల్మీకి గ్రహించాడు. సృష్టికర్త, బ్రహ్మ ధైర్యమివ్వటంతో ఆ అనుష్టుప్ ఛందస్సులోనే రామాయణ కావ్య నిర్మాణం ప్రారంభించాడు.
వైదిక స్వరాలు లేకుండా (అంటే ఉచ్ఛారణలోభేదం లేకుండా) శ్లోకం జన్మించటమిక్కడే. పరమసత్యాలని తాను ప్రచారం చేయటానికే ప్రజలు తేలికగా కంఠస్థం చేయటానికీ వీలుగా ఉండే మాధ్యమం తనకి అప్రయత్నంగా సంక్రమించిందని సంతోషించాడు ఆయన. ప్రపంచానికి ఆదికావ్యంగా, అనుపమాన సౌందర్యంతో ఆయన రాముని కథను అనుష్టుప్ ఛందస్సులో నిర్మించాడు.
వచనాన్ని కంఠస్తం చేయటం కష్టం - మరచిపోతాం. ఛందోబద్ధమవటం వల్ల కవిత్వాన్ని జ్ఞాపకముంచుకోవటం తేలిక. ఈ కారణం వల్లనే పూర్వపు రోజులలో చాలా విషయాలను కవిత్వంలోనే చెప్పేవారు. అచ్చువేయటం ప్రారంభించిన తరువాత అన్నిటినీ కంఠస్థం చేయవలసిన అవసరం తప్పింది, దేనిని కావాలంటే దానిని గ్రంథస్థం చేయగలగటం వల్ల. ఈ విధంగానే వచనం ప్రాచుర్యంలోకి వచ్చింది. కాని భావవ్యక్తీకరణలో కవిత్వానికి సొగసూ, సౌందర్యమూ, ఓజస్సూ ఎక్కువ.
రామాయణావిర్భావం కేవలం దైవకృపవల్లనే జరిగింది. ఆ ఛందస్సు అప్రయత్నంగా సృష్టింపబడింది. ఇతర స్త్రోత్రాలూ, పూరాణాలూ, కావ్యాలూ, రచింపబడటానికి దారి చూపింది.
కొన్ని ఛందస్సులు :
ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, స్రగ్ధర-ఇత్యాదివి స్త్రోత్రాలలో, కావ్యాలలో వాడబడే ఇతర ఛందస్సులు. వాటిలో కొన్ని బహుక్లిష్టమైనవి. పండితులేగాని ఇతరులు ఉపయోగించలేరు.
''అనుష్టుప్'' ఛందస్సులో పాదానికి ఎనిమిది అక్షరాలుంటాయన్నాను. తొమ్మిది ఉంటే ''బృహతీ'' అవుతుంది. పది ఉంటే ''పంక్తీ'' అవుతుంది. పదకొండు ఉంటే ''త్రిష్టుప్'' అవుతుంది. పన్నెండు ఉంటే ''జగతీ'' అవుతుంది. పాదానికి ఇరవై ఆరు అక్షరాలు గల ఛందస్సుని ''ఉద్కృతి'' అంటారు. ఇది ''భుజంగ విజృంభితం'' పద్ధతిలోనిది. పాదానికి ఇరవై ఆరు కంటే ఎక్కువ అక్షరాలుంటే ''దండక'' మవుతుంది. వీటిలో కూడ ఎన్నో రీతులున్నాయి.
కొన్ని ఛందోరీతుల పేర్లు సుందరంగా, సముచితంగా, రసాత్మకంగా ఉంటాయి. కొన్ని ఛందస్సులలో అక్షరాలు పులిపిల్ల ఆడుతూ గంతులు వేస్తున్నట్టుగా సాగుతాయి. దీనిని ''శార్దూల విక్రీడిత'' మంటారు. శార్దూలమంటే పులి, విక్రీడిత అంటే ఆట. పాదానికి పందొమ్మిది అక్షరాలుంటాయి. అతిధృతి - అంటే వేగంగల జాతి ఛందస్సు. ప్రతిపాదంలోనూ రెండు అక్షరసముదాయాలుంటాయి. ఒకదానిలో పన్నెండు, మరొక దానిలో ఏడు అక్షరాలుంటాయి. పాకుతున్న పామువలె ధ్వనించే ఛందస్సుని ''భుజంగ ప్రయాత'' మంటారు భుజంగమంటే పాము. 'జగతి' ఛందోరీతి యిది. పాదానికి పన్నెండు అక్షరాలుంటాయి. ప్రతిపాదాన్ని రెండు అక్షర సముదాయాలుగా విభజించాలి. ఒక్కొక్కదానిలో ఆరు అక్షరాలుండేట్టు. ఉదాహరణ : ''మయూరాధిరూఢం మహావాక్యగూఢం'' అన్నప్పుడు మ-యూ-రా-ధి-రూ-ఢం.మ-హా-వాక్య-గూ-ఢం. ఆదిశంకరుని ''సౌందర్యలహరి'' ''శిఖరిణి'' ఛందస్సులో ఉంది. ప్రతిపాదానికి పదిహేడు అక్షరాలుంటాయి (పాదానికి పదిహేడు అక్షరాలు కలవాటికి 'అద్యష్టి' సాధారణ నామం). ఈ పదిహేడు అక్షరాలనీ ఆరు, పదకొండు అక్షరసముదాయాలుగా, రెండుగా, విభజిస్తే ''శిఖరిణి'' అవుతుంది. ''స్రగ్ధర'' అన్న ఛందస్సులో శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నట్టు - వెల్లువవలె నోటినుండి బయల్వెడలు తున్నట్టు ఉంటాయి. ఇందులో ఇరవై ఒక అక్షరాలుంటాయి పాదానికి. వీటిని ఏడేసి అక్షరసముదాయాలుగా, మూడుగా, విభజిస్తారు.
శ్రీ శంకరాచార్యుల వారు ఈశ్వరునిపైన, విష్ణువుపైన వ్రాసిన స్తోత్రాలు ''కేశాదిపాద'' ''పాదాదికేశ'' అన్న ఛందస్సులో ఉంటాయి. అవి ఈ జాతికి చెందినవే.
ఇంద్రవజ్ర అన్నది ''తిష్టుప్'' జాతికి చెందిన ఛందస్సు. పాదానికి పదకొండు అక్షరాలుంటాయి దీనిలో. ఉపేంద్రవజ్రలో కూడ పదకొండే ఉంటాయి. కాని వేరే విధంగా విభజింపబడుతుంది. ఈ రెంటినీ కలిపితే ''ఉపజాతి'' ఛందస్సు వస్తుంది. కాళిదాసు తన కుమారసంభవాన్ని ఈ ఛందస్సులోనే ప్రారంభించాడు.
ఈ ఛందస్సులు వేదకాలం దాటిన తరువాతి కవిత్వానికీ, స్తోత్రాలకీ సంబంధించినవి. వేదాలలో కనబడే ఛందస్సులు - గాయత్రి, ఉష్నిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి వంటివి.
మంత్రరాజమైన గాయత్రి మహామంత్రం చెప్పబడిన ఛందస్సుకి ఆ పేరే ఉంది - ''గాయత్రి ఛందస్సు''
సాధారణంగా ఏ దేవతకి సంబంధించినదో, ఆ దేవతపేరే పెడ్తారు. ''శివపంచాక్షరి'' ''నారాయణ అష్టాక్షరి'' ''రామత్రయోదశి'' అన్న పేర్లలో దేవతపేరూ, అక్షరాల సంఖ్యా కలిసి యుంటాయి.
గాయత్రి మంత్రానికి దేవత సవిత, గాయత్రి అన్నది ఛందస్సు పేరు మాత్రమే. కాని మంత్రానికి ఛందస్సు పేరే పెట్టారు. శబ్దానికీ, స్వరానికీ దివ్వశక్తి ఉన్నట్టుగానే ఛందస్సుకీ, రచనకీ కూడా ఉన్నాయి. మంత్రానికైనా, శ్లోకానికైనా నాలుగు పాదాలుండాలి మామూలుగా. దీనికి విరుద్ధంగా గాయత్రికి మూడు పాదాలే ఉంటాయి. గాయత్రి అనే ఛందస్సుకి మూడుపాదాలూ, పాదానికి ఎనిమిది అక్షరాలూ - మొత్తం ఇరవైనాలుగు అక్షరాలుంటాయి. మూడు పాదాలు కలిగి యుండటం వల్ల ''త్రిపాద గాయత్రి'' అంటారు. ఇతర గాయత్రి రీతులు కూడా ఉన్నాయి. ఋగ్వేదపు మొదటి మంత్రం - ''అగ్నిమీలే'' - కూడ గాయత్రి ఛందస్సులోనిదే.
కొన్ని స్తోత్రాలలో 24 అక్షరాల గాయత్రిని నాలుగు పాదాలుగా, ఒక్కొక్క పాదానికి ఆరు అక్షరాలతో విభజిస్తారు.
ఒక్కొక్క పాదానికి ఏడు అక్షరాల చొప్పున మొత్తం 28 అక్షరాలుంటే అది ''ఉష్ణిక్'' ఛందస్సవుతుంది.
ఛందస్సు ప్రయోజనం :
ఏ మంత్రమైనా రూపొందితే, దానిని నిర్దుష్టంగా, సరియైన స్థాయిలో, స్వరంతో పలికే విధానాన్ని నిర్దేశిస్తుంది 'శిక్ష' శాస్త్రం. మంత్రం యొక్క రూపం సరిగ్గా ఉండాలంటే ఛందస్సు అవసరం. ధ్యానమగ్నుడైన ఋషికి భగవంతుని అనుగ్రహం వల్ల గోచరించపబడే ఏ మంత్రానికైనా సరియైన రూపమే ఉంటుంది. అది శ్రమతో కూర్పబడింది కాదు కదా!
ఒక వేదసూక్తాన్ని గాని, మంత్రాన్ని గాని పఠించేప్పుడు అది మూలం ప్రకారమే ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఛందస్సు ఉపయోగిస్తుంది. మంత్రంలోని అక్షరాలను లెక్కపెట్టినప్పుడు లెక్కకుదరకపోతే తెలిసిన వారినడిగి సరియైన రూపాన్ని తెలుసుకోగలుగుతాము.
వాటంతట అవే ఆవిర్భవించిన మంత్రాలను అట్లా ఉంచినా, కవులు శ్లోకాలరూపంలో తమ భావాలని వ్యక్తీకరించేందుకు ఛందస్సునే ఆశ్రయిస్తారు. సంగీతానికి తాళ##మెటువంటిదో శ్లోకాలకి ఛందస్సు అటువంటిది. ఒక క్రమంలో ఉండవలసి రావటం వల్ల దానికి స్వతస్సిద్ధంగానే రూపమేర్పడుతుంది, ఛందోబద్ధమైన దానిని కంఠస్థం చేయటం తేలిక.
వేదపాఠాలు ఆదిలో ఎట్లా ఉండేవో అట్లాగే ఒక్క అక్షరం ఎక్కువా, తక్కువా కాకుండా ఉండటానికి కారణం ఛందస్సొక్కేటే. వేదశబ్దాలతో ఆడుకోరాదు. ఏ మాత్రం హెచ్చుతగ్గు జరిగినా వాటి ఆధ్యాత్మికతకు భంగం వాటిల్లుతుంది.
వేదాలకి పాదం - మంత్రానికి నాసిక :
ప్రతిమంత్రమూ ఏదో దేవతకి అంకితమయి ఉంటుంది. అంటే, ప్రతిమంత్రానికీ ఒక అధిష్ఠాన దేవత ఉంటుందన్న మాట. దానికొక ఛందస్సూ, దానిని లోకానికి అనుగ్రహించిన ఋషి ఉంటారు. ఆయనే ఆ మంత్రానికి ఋషి. మంత్రాన్ని చెప్పే ముందు ఆ ఋషిపేరు తలచుకొని, శిరస్సును తాకటమంటే, ఆయన పాదాలను ఎంతో గౌరవంతో శిరస్సుపై పెట్టుకోవటమన మాట. మంత్రాలను మనకి యిచ్చిన వారు ఋషులే కదా!
మంత్రం యొక్క ఛందస్సు పేరుని చెప్పినప్పుడు ముక్కుని వేలితో తాకుతాం. మంత్రానికి ఒకే పరిరక్షకుడు ఛందస్సు. మంత్రానికి ఊపిరి వంటిదది. అందువల్లనే మన ఊపిరి నియమబద్ధం చేసే ముక్కుని పట్టుకోవటం. ఊపిరి లేక జీవితమే లేదు. ఆ విధంగానే మంత్రాలకి ఛందస్సే ఊపిరి కాని, వేదాలనన్నిటినీ ఒక మూర్తిగా భావిస్తే 'శిక్ష' నాసిక, ఛందస్సు పాదాలూ అవుతాయి.
మనం కాళ్లమీద నిలబడి నట్టే వేదపురుషుడు ఛందస్సనే కాళ్లపై నిలబడుతాడు. కాళ్లులేక పోతే లేచి నిలబడలేము. వేదం యొక్క దేహం నిలబడేది ఛందస్సనే పాదాలపైనే.
* * *