Acharyavaani - Vedamulu Chapters Last Page
18. వేదాంగములు : నిరుక్తం
వేదపురుషుని చెవులు :
నిరుక్తం, వేదాలకు నిఘంటువు. నిఘంటువుని కోశమంటారు సంస్కృతంలో ''అమరకోశ''మనే సంస్కృత నిఘంటువు ఎంతో ప్రసిద్ధమైనది. ప్రతిమాట వ్యుత్పత్తీ, అర్థమూ వివరింప బడుతాయి. దీనినే నిరుక్త శాస్త్రమంటారు. ఆంగ్లంలో ''ఎటిమాలజీ'' (పదుత్పత్తి శాస్త్రం) అంటారు.
వేదపురుషుని చెవులు నిరుక్తం. వేదాలలో వాడబడిన అరుదైన, అసాధారణమైన మాటలకు అర్థాలు చెప్తుంది. అంతేకాక, ఆ పదమెందుకు ప్రయోగింపబడిందో కూడ చెప్తుంది. ఈ విషయమై ఎందరో, ఎన్నో గ్రంథాలు వ్రాశారు. కాని అన్నిటిలోనూ అమూల్యమైనది యాస్కరచన.
వేదపదాల వ్యుత్పత్తిని ఈ వేదనిఘంటువు వివరిస్తుంది. ''హృదయ''మన్న పదాన్ని తీసికొందాం. ఈ మాటని వాడటానికి కారణమేమిటి? వేదాలే దీనికి సమాధానం చెప్తాయి. ''హృది-అయం'' అంటే ''హృదయంలో నివసించేవాడని'' అర్థం. ''హృద్'' అంటే ''మనిషి గుండె'' కూడా. కాని ఈ పదం హృదయంలో ఉండే ఈశ్వరుణ్ణి కూడా సూచించటం వల్ల దాని ఆధ్యాత్మిక విలువ ఎక్కువౌతుంది. ఏ శాస్త్రమైనా ఈశ్వరుణ్ణి చేర్చాలి. పరమేశ్వరుడు వసించే స్థలం కాబట్టి, హృదయం. అట్లాగే ప్రతిపదానికీ ఒక కారణముంటుంది. నిరుక్తం ఈ విశ్లేషణని చేస్తుంది.
సంస్కృతంలో అన్ని పదాలూ ధాతువులనుండి జన్మిస్తాయి.
ప్రతి శబ్దానికీ మూలముంటుంది. ఆంగ్లంలో క్రియలకేగాని నామవాచకాలకి మూలముండదు. కాని సంస్కృతంలో అన్ని పదాలకూ ధాతువుంటుంది. సంస్కృత పదాలను కొలది మార్పులతో, ఇతర భాషలు తీసికొన్నాయి. అందువల్లే ఈ భాషలలో పదాలమూలం తెలియదు - అవి పరాయి భాషనుంచి వచ్చాయి కదా! ఆంగ్లంలో కాలాన్ని అవర్ (hour) అంటారు. శబ్దోచ్చారణని అనుసరించి గమనిస్తే ఇది ''hou'', ''or'' లుగా తెలుస్తుంది. ఎప్పుడో ఒక కాలంలో దీనిని ''హోరా'' (hora) గా పలికి ఉంటారు. సంస్కృతంలో హోరాశాస్త్ర మొకటి ఉంది. (ఇది 'అహోరాత్రం' అన్న మాటనుండి వచ్చింది.) అంటే, రేయింబవలు (అహ-పగలు, రాత్ర-రాత్రి) హోర అంటే ఒక గంట కాల ప్రమాణం. ఈ హోర ఇంగ్లీషులో అవర్ (hour) అయి యుండవచ్చు. దీని ఉచ్ఛారణలో ''h'' అన్న అక్షరాన్ని పలుకరు. ఆ విధంగానే ఇంగ్లీషు పదం heart సంస్కృతంలోని 'హృద్' నుండి వచ్చింది. ఇటువంటివే ఇంకా చాలా ఉన్నాయి. ఈ భాషలలో ఈ కొత్తరూపాలు రావటానికి ఎంతో కాలమయి యుంటుంది. ఈ కారణం చేతనే భాషా శాస్త్రజ్ఞులకు ఆ భాషలలోనే ఈ పదాల మూలం కనుగొనటం కష్టమవుతోంది.
ఏ భాషైనా అర్థం కానప్పుడు దానిని వినటంలో ప్రయోజనమేమిటి? వినకపోయినా హాని లేదు. అది బధిరుని ముందు పలికినట్టే కదా. అందువల్లనే ప్రతి పదాన్నీ విభజించి వ్యుత్పత్త్యర్థాన్ని తెలిపే నిరుక్తాన్ని వేదపురుషుని చెవులంటారు.
శృతికి (వేదానికి) శ్రోత (చెవి) కూడాను. వేదాలను వినికిడి వల్లనే కదా నేర్చుకొనేది! వ్యాకరణ, నిరుక్త శాస్త్రాలను ఆంగ్లేయులు కాశీ పండితుల వద్ద అభ్యసించారు. నిరుక్తం ప్రతిమాట యొక్క వ్యుత్పత్తిని ఇచ్చి, అర్థం చెప్తుందని తెలుసుకున్నాం. దాని నుంచే ఫైలాలజీ అనబడే భాషా శాస్త్రాన్ని నిర్మించారు. వేదాలకి సంబంధించిన వ్యాకరణ, నిరుక్తాలనుండే ఈ ఆధునిక ఫైలాలజీ - భాషాశాస్త్రం - జనించింది.
అన్ని భాషలూ ఏదో ఒకే ఆది భాషనుండే ఉద్భవించాయని పరిశోధనల వల్ల తేలింది. ఈ భాషను వాడే ప్రదేశాలలోనే ఆదిమమానవుడుండే వాడనీ ఆ కారణం చేతనే మానవులంతా ఒకే ప్రదేశంలో ఉండే వారనీ భావింపబడుతోంది. కాని ప్రపంచంలో ప్రదేశ##మెక్కడ ఉన్నదో నన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీని గురించి అంత పట్టించుకొనక్కర్లేదు మనమిక్కడ.
* * *