Acharyavaani - Vedamulu Chapters Last Page
2. శబ్దమూ - సృష్టీQ
శబ్దమంటే ఏమిటి? ఆధునిక విజ్ఞానం ప్రకారం, ప్రకంపనం. అణువిజ్ఞాన శాస్త్రమూ, ఐన్‌స్టైన్ సిద్ధాంతమూ, అణురూపంలో పదార్థమంతా ఒక్కటేనని నిరూపించాయి (ఇది వేదాంతంలోని అద్వైతం!). కాని వస్తువులన్నీ కళ్లకి వేరువేరుగా కనబడుతాయి. దీనికి కారణం ప్రాథమిక శక్తి వివిధ ప్రదేశాలలో వేరువేరు వేగాలతో ప్రకంపించటం.
ప్రకంపనం శబ్దాన్ని కలిగిస్తుంది. దీనినే వేరే విధంగా చెప్పాలంటే - శబ్దం రావాలంటే ప్రకంపనాలని సృష్టించాలి. ప్రాథమిక శక్తి యొక్క ప్రకంపనలు వేరు వేరు వేగాలతో సంభవించటం వల్ల విశ్వ సృష్టి జరిగిందన్న శాస్త్ర వాదమూ, పరమాత్ముని శ్వాసమూలంగానే విశ్వసృష్టి జరిగిందన్న వేదవాక్యమూ పొంతన కలిగే ఉన్నాయి.
మానవునిలోనూ, మృగాలలోనూ ఆరోగ్యానికీ, అనుభూతులకీ మూలం ఏమిటి? ఉచ్ఛ్వాసనిశ్వాసాలు - ఊపిరి శరీరంలోని వివిధనాడులలో ప్రసరిస్తూ ప్రకంపనలను కలిగిస్తుంది - ఇదే ఆరోగ్యానికీ, అనారోగ్యానికీ కారణం. యోగాభ్యాసం వల్ల నాడుల ద్వారా ఊపిరి ప్రసారాన్ని నియమబద్ధం చేస్తే అద్భుతమైన ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి సందర్భాలలో రక్తనాళం తెగినా రక్తస్రావం జరుగదు. యోగులు, గుండెనీ నాడినీ స్తంభింపచేసి భూమిలో సమాధిస్థితిలో ఉండగలరు. పాము విషంగాని, తేలుకుట్టినాగాని వారిని ఏ మాత్రమూ బాధించవు. వాళ్లు మామూలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియమబద్ధం చేయగలగటం వల్లనే ఇవన్నీ సాధ్యం.
దేహం సజీవంగా ఉండటానికి మాత్రమే ఊపిరి యొక్క అవసరం పరిమితం కాదు. మనస్సూ, మానసిక ఆరోగ్యమూ కూడా దానిపై కొంతవరకు ఆధారపడి యున్నాయి. దీనికి కారణమిది: మన భావాలన్నిటికీ మూలమైన మనస్సూ, జీవశక్తికి మూలమైన ప్రాణమూ ఒకటే అవటం. నాడుల ప్రకంపనలే ఆరోగ్యకరమైన (మంచి) ఆలోచనలకి గాని అనారోగ్యకరమైన (చెడు) ఆలోచనలకి గాని మూలం. ఇది మీకూ అనుభవమయ్యే ఉంటుంది. భగవత్సాన్నిద్ధ్యాన్ని అనుభూతికి తెచ్చే ప్రదేశంలో గాని, మానసిక ప్రశాంతిని కలిగించే సత్పురుషుని సమక్షాన గాని ప్రాణం ఎట్లా ఉంటుంది? కోపంగాని, ఉద్వేగంగాని కలిగినప్పుడు ప్రాణం ఎట్లా ఉంటుంది? ఈ రెండు పరిస్థితులలోనూ శ్వాసతీరే వేరువేరుగా ఉంటుంది కదా. రకరకాల ఆనంద సమయాలలో, సంతోషవేళలలో కూడా శ్వాస వివిధరీతులలో ఉంటుంది.
ధార్మిక అభ్యాసాల వల్లగాని, భజనలవల్ల గాని కలిగే ఆనందానికీ, ఇంద్రియ సంతృప్తి వల్ల కలిగే ఆనందానికీ తేడా ఉంది. సాధారణంగా, ఉచ్ఛస్థితికి చెందిన ఆనందం కలిగినప్పుడు నిశ్వాసం కుడి నాసికాపుటం ద్వారా జరుగుతుంది. కేవల ఇంద్రియసుఖంలో ఎడమ నాసికాపుటం ద్వారా జరుగుతుంది. మనస్సులో ఉన్నతమైన భావాలు కలిగినప్పుడు ఇంద్రియాలన్నీ దానిపై కేంద్రీకృతమవుతాయి. అటువంటుప్పుడు ఊపిరి నెమ్మదిగా, లయబద్ధంగా రెండు నాసికాపుటాల ద్వారానూ సాగుతుంది. దేని గురించి చింతిస్తోందో, దానిలో భావం లీనమై పోయినప్పుడు ఊపిరి నిలిచిపోతుంది, మనస్సు ఆలోచించటం మానివేస్తుంది. అయినా ప్రాణి సజీవంగానే ఉంటుంది. అప్పుడే జ్ఞానం లేక శుద్ధ చైతన్య స్థితి జీవిని ఆవహిస్తుంది.
కాబట్టి, జీవుని భౌతిక దేహమూ, ఎరుక కలిగి ఉండటమూ (చైతన్యమూ) కూడా ఊపిరి యొక్క శక్తి వల్ల సృజింప బడినవే - దానిపైనే అవి ఆధారపడి యున్నాయి. ఊపిరి ఆడటం ఆగగానే అవీ ఆగిపోతాయి. ఊపిరి ఆడటమంటే మనస్సులోని ప్రకంపాలని నిబద్ధం చేయటమే.
అన్ని పదార్థాలూ - చేతనమైనవైనా, అచేతనమైనవైనా - పరమాత్ముని నుండే ఉత్పన్నమవుతాయి, అనేక రూపాలు ధరిస్తాయి, మార్పు చెందుతాయి, అదృశ్యం కూడా అవుతాయి. ఇన్ని రకాల మార్పులని కల్పించటానికి అవసరమైన ప్రకంపనలు ''పరమాత్మ'' అనబడే దాని నుండే రావాలి కదా!
బ్రహ్మం - నిర్గుణమూ, అచలమూ, అవ్యయమూ అనే అద్వైత సిద్ధాంతాన్ని కాస్సేపు ప్రక్కకి పెట్టుదాం.
అద్వైతమతానుసారం అనిర్వచనీయమైన మాయా శక్తితో కలిసే బ్రహ్మం దృశ్యమానమైన జగత్తులో అనేక రూపాలు ధరిస్తుంది. అట్లా కనబడటం మిధ్యే అయినా కాకపోయినా ఒకే మూల శక్తి సజీవంగానో, జడంగానో రూపం ధరిస్తుందని ఒప్పుకోవాలి. అది మాయే అయినా దేనిపైనో ఆధారపడాలి కదా. ఆ ఆధారమే ఈశ్వరుడు. అనేక రూపాలను ధరించే మాయ కూడ పరబ్రహ్మయొక్క ప్రకంపన ఫలితమే.
అనేక రూపాలను ధరించే ప్రకంపనలున్నా పరబ్రహ్మ అంతరంలో ఏ కదలికా లేక నిశ్చలంగా ఉంటుంది. మనకి మాత్రం రూపంధరించిన ప్రకంపనలు తెలుస్తాయి. ఇవి కూడా ఎంతో క్రమ బద్ధంగా ఉంటాయి. కక్ష్యలోపరిభ్రమించే అసంఖ్యాకమైన సౌరమండలాలు మొదలు ఒక గడ్డిపోచ, ఒక దోమ, సృష్టి వరకూ ఏదో ఒక నియమముంది.
విశ్వశ్రేయస్సు ఈ నియమంపైనే ఆధారపడి ఉంది. ప్రకృతి శక్తిని పరమాత్మ విశ్వసృష్టికీ, విశ్వపాలనకీ వినియోగించాడు. అయినా ఒక్కొక్కసారి ఈ నియమం తప్పుదారిని పట్టినా భగవంతుడు చూస్తూ ఊరుకొంటాడేమో ననిపిస్తుంది! ఈ కారణం వల్లనే ప్రకృతి శక్తులు హద్దులు మీరటం చూస్తూంటాం. ఒకోసారి వర్షాలు పడవు. ఒకోసారి వరదలు మరీ విపత్కరంగా సంభవిస్తూంటాయి. మానవుని మనస్సువలె ఏదీ తన నిజప్రకృతికి దూరం కాలేదు. విషయవాంఛలు చాలా బలీయం. ప్రకృతి సిద్ధమైన నియమాలూ, నిబంధనలూ సంయమనమూ ఏర్పడ్డా అన్ని హద్దులనూ, ఆంక్షలనూ ప్రక్కకు పెట్టి మనస్సు ఉన్మత్తతతో విశృంఖలమవుతూంటుంది.
మానవశ్రేయస్సుకు వ్యతిరేకంగా వర్తించే ప్రకృతి శక్తులను దారిలో పెట్టటం సాధ్యమేనా - అనే ప్రశ్న కూడ ఉత్పన్నమవుతూంటుంది. అట్లాగే వెఱ్ఱి తలలు వేసే మనస్సుని అదుపులో పెట్టటం సాధ్యమేనా?
దృశ్యమానమైన జగత్తుకి ప్రకంపనలు, శబ్దమూ కారణమని గ్రహిస్తే, ఆ ప్రకంపనలే - ఆ శబ్దమే - గతి తప్పిన ప్రకృతి శక్తులను సన్మార్గంలో పెట్టగలవనీ, అపవిత్రమైన ఆలోచనలు కల మనస్సుని క్షాళనం చేయగలవనీ అంగీకరించాలి. వేదాలు అట్టి ప్రకంపనలే, అట్టి శబ్దాలే!
యోగంలో ప్రాణాయామం సహాయంతో విశ్వనిశ్వాసంతో సంధానమేర్పర్చుకొని సమిష్టికీ, వ్యక్తికీ ప్రయోజనకరాలైన పనులు చేయవచ్చు. నాడులూ, నరాలూ చేసే ప్రకంపనలు మనిషి చెవులకు వినబడవు. ఈ సత్యాన్ని చాలా మంది ఒప్పుకొంటున్నారీ రోజులలో.
ఈ విధంగా చూచినప్పుడు విజ్ఞాన శాస్త్రం మతానికి వ్యతిరేకం కాదని గ్రహించవచ్చు. పైపెచ్చు, సమాజంపై మతప్రభావాన్ని పెంచటానికి కూడ దోహదమవుతుంది.
ఒక శతాబ్దం పూర్వం, అంటే రేడియో, టెలిఫోన్లను కనుగొనక పూర్వం, వేదోచ్ఛారణకూ, శ్వాసకూ గల ప్రభావంపై నమ్మకంలేని వారి శంకలను నివృత్తి చేయటం కష్టమయేది. కాని వీటిని కనుగొన్న తరువాత మనకి క్రొత్త మద్దతు దొరికింది.
నిర్జీవమైన రేడియోకి గల శక్తిని సజీవమైనవి కూడా పొందవచ్చు. నిజానికి, అంతకంటె ఎక్కువ శక్తినె సంపాదించ వచ్చు. దీనిని సాధ్యపరచేది, తపస్సు.
ఇల్లూ, సంసారమూ కల్పించే సౌకర్యాలనీ, ఆకలీ దప్పికా కలిగించే అవసరాలనీ, నిద్రా విశ్రాంతి కలిగించే సౌఖ్యాన్ని లెక్కపెట్టకుండా ఏదో ఒక లక్ష్యంపై మనస్సుని, మానసిక శక్తినీ కేంద్రీకరించటమే తపస్సంటే. ఈ పని చేసేప్పుడు ''దీనినంతా నేను చేస్తున్నాను. నేనింత కష్టపడు తున్నాను కాబట్టి నాకు సత్య స్వరూపం తెలుస్తుంది'' అనే భావానికి తావీయకూడదు. అంత శ్రమలోనూ, ఏ ప్రయత్నమైనా సఫలం కావటానికి భగవంతుని అనుగ్రహం ముఖ్యావసరమన్న గుర్తింపూ, నమ్రత ఉండాలి. ఋషులు అటువంటి తపస్సు చేశారు. యోగశక్తుల మహోన్నత శిఖరాల నందుకొన్నారు.
జగత్సృష్టికి కారణభూతములైన ప్రకంపనలను, అంటే విశ్వనిశ్వాసాన్ని, ఎరుక కలిగి ఉండేవారు ఋషులు. అంతేకాదు, విద్యుత్ తరంగాలు శబ్ద తరంగాలుగా మారినట్లుగానే వారికి కూడ అంతరిక్షంలోని తరంగాలు మారి చెవికి సోకేవి. వీటినే వారు లోకానికి వేదమంత్రాలుగా అనుగ్రహించారు.
ఇంకొక విషయం కూడా స్ఫురిస్తుంది నాకు, వేదాలను 'శృతి' అంటారు - అంటే వినబడినది అని అర్థం. సంస్కృతంలో చెవిని ''శ్రోత్రమ్'' అంటారు. పూర్వకాలం గురుశిష్య పరంపరానుసారం వేదాలు ఒక తరం నుండి వేరొక తరానికి లిఖిత పూర్వకంగా కాక, అనుశ్రుతంగా సంక్రమించాయి. అందువల్లనే వేదాలను 'శృతి' అంటారని కొందరి భావం. అయితే, వేదాలు చదువుకొని, నేర్చుకోవటానికి వీలుగా లిఖిత రూపంలో ఎందుకు లేవు? దానికొక కారణమిది; కొన్ని శబ్దాలు ఉచ్ఛారణ ప్రకారం సరిగ్గా వ్రాయలేక పోవటం. ఆ ఉచ్ఛారణ ఒకోసారి రెండు అక్షరాల నడుమ ఉన్నట్లుంటుంది - ఇటువంటి శబ్దాలు వేదాలలో కోకొల్లలు. ఇటువంటి వాటిని ఉచ్ఛారణ ద్వారానే ప్రచురించ వలసి వస్తుంది. అంతేకాక, వేదమంత్రాలను లయబద్ధంగా ఉచ్చరించాలి (అట్లా చేస్తేనే సరియైన ప్రకంపనలు ఉత్పన్నమవుతాయి) కొన్ని శబ్దాలను ఉచ్చస్థాయిలోను, మరికొన్నిటిని మధ్య స్థాయిలోను ఇంకాకొన్నిటి అధమ స్థాయిలోనూ పలుకాలి. ఇటువంటి వ్యత్యాసాలను సూచికల ద్వారా గాని, చుక్కల ద్వారా గాని తెల్పినా కొన్ని దోషాలు దొర్లుతాయి. అందువల్ల ఉచ్చారణ కూడ పొరబడుతుంది. తత్ఫలితంగా ఆ మంత్రాల ప్రభావం కూడ తగ్గుతుంది. మామూలుగా కూడా, హెచ్చుతగ్గులతో వినబడే శబ్దాలకీ, ఒకే మాదిరిగా ఉండే శబ్దాలకీ మనపై ఉండే ప్రభావాన్ని చూడండి. మన ప్రతిస్పందనే కాదు - ప్రకృతి చేతలని క్రమపరిచే దివ్య శక్తి కూడ స్వరభేదం వల్ల ప్రభావిత మవుతుంది.
వేదాలలోనే (తైత్తిరీయ సంహితలో) ఉచ్ఛారణలోని మార్పుల వల్ల ఫలితాలు ఎట్లు విపరీతంగా మారుతాయో తెలిపే కథ ఒకటుంది. త్వష్ట అనే దివ్యశిల్పి ఇంద్రుని సంహరించగల కుమారుని కోసం ''ఇంద్ర శత్రుర్వర్ధస్వ'' అనే ఒక మంత్ర జపం చేశాడు. ఈ జపం చేసేప్పుడు స్వరాలను తప్పుగా ఉచ్చరించాడు. దీని వల్ల అతని ప్రార్థనకు సరిగ్గా వ్యతిరేకమైన ఫలితాలు లభించాయి. ఇంద్రుణ్ణి పరిమార్చే కుమారుణ్ణి గాక, ఇంద్రునిచే పరిమార్పబడే కుమారుడు అతనికి కలిగాడు. స్వరభేదం వల్ల,
రేడియో ట్యూనింగ్ కొద్దిగా మారిస్తే మనకి వేరొక కేంద్రం నుంచి వచ్చే ప్రసారం వినబడుతుంది. మనకి కావలసిన ప్రసార కేంద్రం కోసం సరిగ్గా ట్యూనింగ్ చేసుకోవాలి. వేదాలను వల్లించేప్పుడూ అంతే. స్వరము, నిర్దుష్టంగా ఉండాలి. రేడియో ట్యూనింగ్‌లో జరిగే మార్పువలెనే - వేద మంత్రాల పఠనంలో మార్పు వల్ల కూడా ఫలితాలు మారుతాయి. ఈ కారణాల వల్లనే, గురు ముఖతః వేద మంత్రాలను అభ్యసించాలన్న నియమమేర్పడింది.
వేదాలను 'శృతి' అనటానికి అసలు కారణమిది, సామాన్య మానవులకు వినబడని శబ్దాలను ఋషులు ఆలకించి యథాతథంగా శిష్యులకు నేర్పారు. తపోనిష్ఠలో ఉండి అటువంటి శబ్దాలను గ్రహించే స్థితిలో ఋషులున్నప్పుడు ఆ వేద శబ్దాలు వారికి సాక్షాత్కరించాయి. అందువల్లనే వేదాలను 'శృతి' అంటారు - 'వినబడినది' అని అర్థం.
ఋషులను మంత్ర ద్రష్టలంటారని అన్నాను. అంటే మంత్రాలను దర్శించిన వారని అర్థం. మంత్రాలను నక్షత్రమండలాల వలె ఋషులు దర్శించారని అర్థం చెప్పుకోవచ్చు.
వీటన్నిటిలో ఏది సరియైన భావం? వాళ్లు వాటిని విన్నారా? చూచారా? వాటిని చూచి ఉంటే - ఏ భాషలో, ఏ లిపిలో వ్రాయబడ్డాయి - అప్పటికి దేవనాగరికీ గ్రంథలిపికీ పునాదియైని బ్రాహ్మీ లిపి కూడ లేదాయె! వ్రాయబడి యున్నా, వేదపాఠాలను ఉచ్చారణకనుగుణంగా సరిగ్గా వ్రాయటమసంభవం. ఈ గందరగోళానికి సమాధానమిదిః ఋషులు ''చూచా''రన్నా ''విన్నా''రన్నా యదార్థమేమంటే వారు ధ్యానమగ్నులై యున్నప్పుడు వాటిని తమలో గుర్తించారు. అంటే ఒక్కసారిగా వారికి స్ఫురణ కలిగి, అంతరంగంలో మంత్రాల అవగాహన కలిగింది. వారున్న ఉచ్ఛస్థితిలో భౌతికంగా కళ్లు చూచి ఉండకపోవచ్చు, చెవులు వినియుండక పోవచ్చు. అయినా వారి అంతరాంతరాలలో వేద శబ్దాలు వారికి అనుభవసిద్ధమైనాయి వారిపై వాటి ప్రభావాన్ని విడిచాయి.
''చూడ''టమంటే ఎల్లప్పుడూ కంటితో చూడటమనే అర్థంకాదు. బాహిరవస్తుజాలం మన ఇంద్రియాలపై కల్పించే ఏ ప్రభావానన్నా ఇట్లా వర్ణించవచ్చు. ఫలానా వ్యక్తి ''జీవితంలో ఒడుదుడుకులను చూచాడ''న్నప్పుడు అతనికి జీవితంలోని సుఖ దుఃఖాలు భౌతికంగా కనబడ్డాయని అర్థం కాదు. అతడు జీవితంలో సుఖదుఃఖాలను అనుభవించాడనే దాని అర్థం. కాబట్టి మంత్ర ద్రష్టలన్న మాటని ఋషుల ఆధ్యాత్మికానుభూతి గానే మనం అర్థం చేసుకోవాలి.
వేదాలను గ్రహించటానికి అనువైన, ప్రతిభా సమన్వితమైన చెవులుకల 'దివ్యశ్రోత్రులు' ఋషులని చెప్పుకోవచ్చు.
అర్జునుడు శ్రీ కృష్ణుని విశ్వరూప దర్శనం కోరినప్పుడు ఆయన ''నీవు నన్ను నీ చర్మచక్షువులతో చూడలేవు - నీకు దివ్యదృష్టినిస్తాన''న్నాడు గీతలో. (దివ్యందదామితే చక్షుః). అర్జునుడు దివ్యనేత్రాలు పొందినట్టే ఋషులు కూడ దివ్యకర్ణాలను పొంది అంతరిక్షంలో సదా సంస్థితమైన మంత్రాలను వినగలిగారు.
ఇదంతా చెప్పటానికి కారణం - వేదాలు ఎవరి వల్లా రచింపబడలేదనీ చూపటానికే ఋషులు వాటిని రచించలేదు. పరమాత్ముడూ కూర్చొని వేదాలను వ్రాయలేదు!
* * *
Acharyavaani - Vedamulu Chapters Last Page