Acharyavaani - Vedamulu Chapters Last Page
20. వేదాంగములు : కల్పము
వేదపురుషుని బాహువులు :
వేదపురుషుని ఆరవ అంగం - కల్పం - ఆయన బాహువుగా పరిగణింప బడుతుంది. వేదోక్తమైన కర్మని చేయటానికి ''కల్పం'' ప్రేరకం. శిక్ష - వ్యాకరణ - ఛందస్సు - నిరుక్త - జ్యోతిషం అధ్యయనం చేసిన తరువాత ఏమి చెయ్యాలి? ఫలితాలని పొందటానికి ఏదైనా చేయాలి. మన మనస్సుకి తోచినదాని నల్లా చేయటం వలన కలిగిన పాపాలను క్షాళనం చేసుకోవటానికి ఏవైనా మంచి పనులు చెయ్యాలి. ఇవి చేయటానికి ఒక మంత్రముండాలి. దానిని సరిగ్గా ఉచ్ఛరించటం నేర్చుకోవాలి. దాని అర్థం తెలిసికోవాలి. కర్మని చేయటానికి అవసరమైన సాధనసామగ్రియుండాలి. అంటే ఒక యిల్లో వేరే ఏదైనా అనువైన స్థలమో ఉండాలి, ఈ పనులు చేయటానికి. ఫలితాన్ని భగవంతునికి అర్పించాలి. ''కల్పం'' ఈ విషయాలకి సంబంధించినది. విధేయతతో వేదాలను వల్లించాలి. ''శిక్ష'' ద్వారా వాటిలోని పదాలను నిర్దుష్టంగా నేర్చుకోవాలి. తత్సంబంధమైన వ్యాకరణాన్ని నేర్చుకోవాలి. లయనూ, అర్థాన్నీ ఛందస్సుద్వారా, నిరుక్తం ద్వారా గ్రహించాలి. కర్మను చేయటానికి శుభముహూర్తాన్ని జ్యోతిషం వల్ల తెలుసుకోవాలి. కల్పంలో చెప్పబడిన కర్మల నిర్వహణ కొరకే ఇవన్నీను. 'ఏ కర్మను ఏవిధంగా చేయాలి? ఏయే కర్మలను ఏయే జాతుల వాళ్లు, ఏయే ఆశ్రమాలలో చేయాలి? (ఆశ్రమాలంటే బ్రహ్మచారి, గృహస్థు, సన్న్యాసి) ఏ కర్మకి ఏ మంత్రం, ఏ సామగ్రి, ఏ అధిష్ఠాన దేవత? ఎందరు ఋత్వికులను నియమించాలి? ఏయే ఆకారాలుగల ఏయే పాత్రలను వినియోగించాలి' - ఈ విషయాలనన్నిటిని కల్పం చెప్పుతుంది.
కల్పశాస్త్రాన్ని ఎందరో ఋషులు సంకలనం చేశారు. దక్షిణ భారతంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న కృష్ణయజుర్వేదానికి సంబంధించిన పది కల్పసూత్రాలను రచించిన ఋషులు ఆరుగురు - వాళ్లు ఆపస్తంబుడు, బోధాయనుడు, వైఖానసుడు, సత్యషాఢుడు, భరద్వాజుడు, అగ్ని వేషుడు. ఋగ్వేదానికి ఆశ్వలాయనుని కల్పమే ఎక్కువగా వాడుకలో ఉన్నది. సాంగాయనుడు రచించినది కూడ ఒకటుంది. శుక్లయజుర్వేదానికి కాత్యాయనుని సూత్రాలున్నాయి. సామవేదంలోని కౌథుమశాఖకి లాట్యాయనుడు, రాణాయనేయ శాఖకి ద్రాహ్యయణుడు, తలవకార శాఖకి జైమిని - కల్ప సూత్రాలు రచించారు. ప్రతిశాఖకి సంబంధించిన కల్పంలోనూ రెండు వర్గాల సూత్రాలున్నాయి. అవి - గృహ్యసూత్రాలు, శ్రౌతసూత్రాలు. ఈ రెండు సూత్రాలూ గర్భంలో శిశువు ఉదయించినది మొదలు, దేహానికి దహనం జరిగే వరకు చేయవలసిన కర్మలను వివరిస్తాయి. దహనసంస్కారం కూడ ఒక క్రతువే. దానిని అంత్యేష్టి - అంటే ఆఖరికర్మ - అని అంటారు. ఇందులో దేహాన్నంతా అగ్నికి అర్పిస్తారు.
అగ్నిహోత్రాన్ని ఆధారంగా చేసుకొని బ్రాహ్మణుడు ప్రతిదినమూ ఇరవైయొక్క యజ్ఞాలు చెయ్యాలి - అవి ఏడు హవిర్యజ్ఞాలు, ఏడు సోమయజ్ఞాలు, ఏడు భాగయజ్ఞాలు. వీటిలో హవిర్యజ్ఞాలూ, సోమయజ్ఞాలు గృహసూత్రాలలో ఉండవు. ఈ పధ్నాలుగు శ్రౌతసూత్రాలలో ఉంటాయి. ఇవి నలభై కర్మలలో, సంస్కారాలలో ఉంటాయి (సంస్కారమంటే పరిశుద్ధం చేసేది అని అర్థం).
అగ్నిహోత్రాన్ని గృహంలో చేయాలి. యజ్ఞాన్ని ఆరుబయట ఒక ఆచ్ఛాదన క్రింద చేయాలి. శ్రౌతసూత్రాలు ముఖ్యమైన యజ్ఞాలను వివరిస్తాయి. గృహ్య సూత్రాలు - ఇంటిలో చేయవలసిన కర్మలను వివరిస్తాయి. కల్పసూత్రాలు - నలభై సంస్కారాలను, ఎనిమిది ఆత్మ గుణాలను వర్ణిస్తాయి. హవిర్ - సోమయజ్ఞాలకి సంబంధించిన పధ్నాలుగు యజ్ఞాలనూ మినహాయించి, మిగిలిన ఇరవైఆరు కర్మలూ గృహ్యసూత్రాలలో ఉంటాయి. ఇవి గర్భాదానం, పుంసవనము, సీమంతం, జాతకర్మ (పుట్టిన తరవాత చేసే సంస్కారం), నామకరణం, అన్నప్రాసన, ముండనం, ఉపనయనం, వివాహం, అంత్యేష్టి - వంటివి. వీటి గురించి మళ్లీ చెప్పుకుందాం.
ఎనిమిది ఆత్మ గుణాలివి : (1) దయ, (2) క్షమ (ఓర్పు) (3) అనసూయ (అసూయ లేకపోవటం) (4) శౌచం (పరిశుభ్రత) (5) మొండితనం లేకపోవటం (6) మధురస్వభావం (7) అత్యాశ##లేకపోవటం (8) నిష్కామం - వీటిని సామాన్యధర్మాలంటారు - ఇవి అందరికీ, జాతి భేదం లేకుండా, వర్తించే ధర్మాలు.
పెద్దవాళ్లకి అభివాదాలని చేసేప్పుడు మనమే సూత్రాన్ని అవలంబిస్తామో చెప్పుకుంటాం. ఇది శ్రౌతసూత్రాలకి సంబంధించినదే. ఉదాహరణకి సామవేదం వారు ద్రాహ్యాయన సూత్రాన్ని అనుసరిస్తామంటారు. ద్రాహ్యాయణుడు శ్రౌతసూత్రాలనే రచించాడు. గోబిలుడనే ఋషి గృహ్యసూత్రాలను రచించాడు. కాని పూర్వకాలంలో వైదిక కర్మలను ఎంతో విధేయతతో, ఉత్సాహంతో చేస్తూ ఉండటం వల్ల శ్రౌతసూత్రాలే వారి వారి స్వంతసూత్రాలయాయి. ఆ ఆనవాయితీయే ఇప్పుడు కూడా సాగుతోంది. తరువాతి కాలం వారు ఏ పెద్ద శ్రౌతకర్మనీ చేయరు. కాని వివాహాది గృహకర్మలను మాత్రం చేస్తారు. శ్రౌత కర్మలకంటె గృహ్యకర్మలు తక్కువ ప్రాధాన్యం కలవి. కాని, ఇప్పుడవే ప్రధానమైనాయి.
పూర్వపు రోజులలో పేదవారు కూడ అవసరమైతే భిక్షాటనం చేసి, శ్రౌత కర్మలను నిర్వహించేవారు. ఆ రోజులలో కొందర్ని ''ప్రతివసంత సోమయాజుల'' నేవారు. అంటే ప్రతి వసంతకాలంలోనూ సోమయజ్ఞం చేసేవారని అర్థం. ఎవరి సాలుసరి ఆదాయమైనా మూడు సంవత్సరాల పాటు నిలిచేదయితే వారు ప్రతి వసంతంలోను సోమయజ్ఞం చేసేవారు. ఇదంతా ఇప్పుడు మారిపోయింది. ఈ రోజులలో సంపన్నులైనా, వారి మూడు సంవత్సరాల ఆదాయాన్నీ ఒక్క ఏడాదిలో ఖర్చుచేసే సామర్థ్యం వచ్చింది. నేటి సమాజపు ఆర్థిక వ్యవస్థ అందరినీ పేదవారిగా, దీనులుగా చేసేసింది. ఇది వ్యాపారస్థులకే వర్తిస్తుంది. అన్ని విషయాలలో మితముండాలి. ''అతి''ని వర్జించాలి. ఆధునిక యాజమాన్య చాతుర్యమంతా మనల్ని నిత్య అసంతృప్తులని చేసింది. సంపన్నుడుకూడా తట్టుకోలేని ఎన్నో ఖర్చులు చేయవలసి వస్తోంది. ఈ వ్యక్తిగత వ్యయాలను తగ్గించుకోవాలి. ఉన్న వనరులను మంచి కార్యాలను చేయటానికి మళ్లించి, వినియోగించు కోవాలి.
యజ్ఞాలను నిర్వహించేటప్పుడు ''చయన''మనే ప్రక్రియ ఒకటుంది. కల్పంలో దీనికి సంబంధించి శుల్బసూత్రమని ప్రత్యేక విభాగ మొకటుంది. శుల్బ సూత్రాలు రెండు రకాలు: సామాన్యసూత్రాలు, విశేషసూత్రాలు. కాత్యాయన, బోధాయన, హిరణ్యకేశులు - ఈ ముగ్గురూ శుల్బ సూత్రాలను రచించారు. శ్రౌతము అన్నది శృతిలో, వేదంలో, వస్తుంది. శ్రౌతకర్మలు పెద్ద పెద్ద క్రతువులు - వాటిని ప్రత్యేకంగా బయట నిర్మించిన శాలలో నిర్వహించాలి. ఇంటిలో చేయటం సాధ్యంకాదు. అందువల్లనే, ఇంటిలో చేయగల చిన్న చిన్న కర్మలను గృహ్యకర్మలంటారు. ఈ రోజులలో యజ్ఞాలని చేయటమే అరుదు. కాని కొన్ని గృహ్యకర్మలని జరుపుతున్నారు.
మన శాస్త్రాలన్నీ మనల్ని భగవంతునివైపే నడుపుతాయి. ఏది వ్రాసినా, దేనిని చదివినా దానిని భగవదంకితం చెయ్యాలి. అది ఆధ్యాత్మిక ప్రగతికి దోహదమవాలి. మన శాస్త్రాల పద్ధతి యిది. వైదిక మతమునకు అత్యంత ముఖ్యమయిన శ్రౌత కర్మలను (హవిర్, సోమ యజ్ఞములు) క్వచిత్తుగా జరుగుతున్నాయి.
ద్రాహ్యాయనునీ, కాత్యాయనునీ మినహాయిస్తే కల్పసూత్రాలను రచించిన మిగిలిన వారు అంటే, ఆపస్తంభ, బోధాయన, ఆశ్వలాయనులు, శ్రౌతసూత్రాలనూ, గృహ్యసూత్రాలను కూడ రచించారు. ఇవి కాక ధర్మ సూత్రాలు కొన్ని యున్నాయి. వ్యక్తిగా, గృహస్థుగా, సామాజకునిగా మనిషి ఎట్లా నడుచుకోవాలో చెప్తాయివి. వీటినుండే తరువాతి కాలంలో ధర్మశాస్త్రాలు ఉదయించాయి.
అధర్వశాస్త్రం అంత ప్రాచుర్యంలో లేదు ఈ రోజులలో. తత్సంబంధమైన కల్పసూత్రాలు కూడా అలభ్యములే.
ఎంత చిన్న పనినైనా నేర్పుతుంది, కల్పం. బ్రాహ్మణుడు ఎంత చిన్నపని చేసినా దానికి వేదాలతో సంబంధముంటుంది. అప్పుడే అతను ప్రతిశ్వాసలోనూ, ప్రతి అడుగులోనూ దివ్యశక్తుల సహాయాన్ని పొందగలగుతాడు. అందువల్లనే అతడు ఎట్లా కూర్చోవాలో, ఎట్లా భుజించాలో, ఎట్లా బట్టలను ధరించాలో కూడ చెప్పబడియున్నాయి. ఉదాహరణకి కల్పశాస్త్రం ఇళ్లనెట్లా కట్టుకోవాలో చెప్తుంది. గృహనిర్మాణం (ఇంటి నమూనా) వాస్తు లక్షణమూ (ఏయే సామాగ్రిని ఉపయోగించాలో) చెప్తుంది. ఇవన్నీ చెప్పటానికి కారణమిది; లోకకల్యాణానికై ప్రకృతిలోని శక్తులను ఉపయోగించుకునే వీలుని గృహనిర్మాణం కల్పించాలి. ''వైశ్వదేవబలి'' అన్నది యింటికి నిర్ణీతమైన గుమ్మము వద్దనే చేయాలి - ఎక్కడ పడితే అక్కడకాదు. ఇప్పటి ఫ్లాట్లలో (flats) ఇది సాధ్యం కాదు. వేదాల అనుష్టానాన్ని సానుకూలం చేయటం కోసమే గృహనిర్మాణం గురించి కల్పసూత్రాలలో చెప్పబడింది. ఉపాసన (హోమానికై అగ్నిని రగిల్చే ప్రదేశం) స్థలానికి ప్రత్యేకమైన ఆకారముంది - హోమం సక్రమంగా నిర్వహించటానికై శాస్త్రాలలో ఆ కొలతల వివరాలున్నాయి. వాటి ప్రకారం లేకపోతే, క్రతువు చెయ్యటం కష్టం. బడిలో తరగతి గదులలో బల్లలనూ, కుర్చీలనూ విద్యాబోధనకి తగినట్లు ఎట్లా అమరుస్తారో ఈ పథకాలుకూడ వైదిక కర్మల సక్రమ నిర్వహణకే ఏర్పడ్డాయి. మామూలు స్కూళ్లల్లో కూడ శాస్త్ర ప్రయోగాలు చేసే ప్రయోగశాలలలో ఉండే బల్లలకూ, కుర్చీలకూ - పాఠాలు చెప్పే గదులలో ఉండే వాటికీ తేడా చూస్తూనే ఉంటాం.
శిల్పశాస్త్రాన్ననుసరించి మనమిళ్లను కట్టుకోవాలి. సూత్రాలను రచించిన వారు గృహస్థు తన గృహాన్ని ప్రత్యేక విధంగానే కట్టుకోవాలని నిర్దేశించారు. వేదోక్తమైన జీవనాన్ని గడుపుదామనుకున్న వారికే ఇది వర్తిస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. కాని, ఇంకొకరెవరో, ఇంకో పథకం ప్రకారం కట్టుకున్న యింట్లో నివసింప వలసి వస్తే - వైదిక కర్మల నిర్వహణకు ఆ యిల్లు అనువుగా ఉండదు. కొన్ని కర్మలను చేయటానికి యిల్లు అనుకూలంగా లేదంటూ మొదలు పెట్టుతాం, కాలక్రమేణా మన సంకల్పం సడలుతుంది, విశ్వాసం క్షీణిస్తుంది. ఇంటిని మార్చుకోవటం కష్టం మన జీవన విధానాన్ని మార్చుకుంటాం.
శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - ఇవి ఆరు శాస్త్రాలు. ఇవికాక నాలుగువేదాలతో కలిపి ఇప్పటివరకు పధ్నాలుగులో పది విద్యలగురించి పరిచయం చేసుకున్నాం. మిగిలిన నాల్గింటినీ చూద్దాం.
* * *