Acharyavaani - Vedamulu Chapters Last Page
22. బౌద్ధమూ - ఇతర సిద్ధాంతాలూ
శంకరులు, బౌద్ధమూ :
ఆదిశంకరచార్యులు ఖండించటం వల్ల బౌద్ధమతం దేశంనుండి తరిమివేయ బడిందని అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇది నిజం కాదు. వైదిక సూత్రాలకు కట్టుబడే ఉన్నా, సాంఖ్య మీమాంసలు ఈశ్వరుని ఉనికిని నిరాకరించటాన్నే ముఖ్యంగా మార్కొన్నారు శంకరులు. ఆయన వాదమిది : వేదపదాల అర్థం ప్రకారమూ, బ్రహ్మసూత్రానుసారమూ గల ఈశ్వరుని నిర్వచనాన్ని గాని, ఈశ్వరుడు సృష్టికర్త అని గానీ, ఫలదాత అని గానీ నిరాకరించటం సమంజసం కాదు. సత్యమన్నది వేదాలలో చెప్పబడినదేననీ ఈశ్వరుడు లేకుండా జగత్సృష్టే లేదనీ ఆయన అన్నారు. అంతేకాక, కర్మాచరణమే వ్యక్తికి ఫలితాన్ని ఇస్తుందన లేమన్నారాయన. ఈశ్వరుడే ఫలదాత, ఫలనియంత కూడాను. ఈశ్వరుని చైతన్యమే, సంకల్పమే జగత్తుని సృష్టించింది, కార్యానుసారం ఫలితాలేర్పడటం, వాటివల్ల సుఖదుఃఖాలు కలగటం కూడ ఈశ్వరుడు కల్పించిన ''కర్మ'' వల్లనే. ఆయన సాంఖ్య, మీమాంస వాదులను నిర్దుష్టంగా ఖండించారు. బౌద్ధమతాన్ని విమర్శించేప్పుడు కూడ ఆయన వేదములు. బ్రహ్మసూత్రములలో చెప్పిన దానిని దాటలేదు, ఈశ్వరుని ఉనికినే సంశయించిన భాగాలనే వ్యతిరేకించారు.
ఆచార్యులవారి వాదపటిమ వల్లనే, వారి తర్కం వల్లనే బౌద్ధమతం దేశం నుండి బహిష్కరింపబడిన దనటానికి ఏ ఆధారాలు లేవు. అయితే, బౌద్ధం దేశం నుంచి పోవటానికి కారణమేమిటి? బౌద్ధమతానికి ప్రజలపై నున్న ప్రభావాన్ని తగ్గించటానికి ఎవరో కారకులుండాలి కదా. వీరు మీమాంసకులు, తార్కికులూ. తర్కశాస్త్ర ప్రవీణులను తార్కికులంటారు. పధ్నాలుగు విద్యలలోనూ, మీమాంస తరువాత పేర్కొనవలసినది న్యాయశాస్త్రం. ఈ శాస్త్రానికి సంబంధించినదే తర్కం. న్యాయశాస్త్ర ప్రవీణులని ''నైయాయికు''లంటారు. ఉదయనాచార్యుడనే తార్కికుడు, కుమారిలభట్టనే మీమాంసకుడు, వారి వారి కారణాల ఆధారంతో, బౌద్ధమతాన్ని తీవ్రంగా ఖండించారు. బౌద్ధమతం భగవంతుడు లేక ఈశ్వరుడు లేడంటూ చేసిన ప్రచారాన్ని ఉదయనాచార్యుడు ఖండించాడు. మీమాంసకులు కర్మలేగాని ఈశ్వరుడు ఫలదాత కాడని అంగీకరించినా, వేదోక్తమైన కర్మలను శ్రద్ధగా, సవ్యంగా చేయాలన్నారు. ఆ కర్మలను చేయనవసరం లేదన్న కారణం వల్ల బౌద్ధమతాన్ని మీమాంసకులు ఖండించారు. బౌద్ధమతంలోని ఈ వాదాన్ని తీవ్రంగా విమర్శించాడు కుమారిల భట్టు. బౌద్ధమతం యొక్క పురోగమనాన్ని అడ్డగించిన వారు - దాని నాస్తికత్వాన్ని విమర్శించిన ఉదయనుడూ, దాని కర్మాచరణ విముఖతని ఖండించిన కుమారిలభట్టూను. వీరి తరువాత వచ్చిన శంకరులు ఆ మతంలోని విపరీత ధోరణులను ఖండించవలసిన అవసరమేర్పడలేదు. బౌద్ధులు ప్రచారం చేస్తున్న వాటిలోని తప్పులను చూపటమే ఆయన పని అయింది.
ఆచార్యుల వారు, ఈశ్వరుడే దృశ్యమానమైన జగత్తుకి సృష్టికర్త అనీ, కర్మఫలాలనిచ్చే ఫలదాత అనీ నిస్సంశయంగా ప్రతిష్టించారు.
శంకరాచార్యుల వారు బౌద్ధమతానికి విరోధులంటూ జరిగే తప్పుడు ప్రచారాన్ని సరిదిద్దటానికే ఈ ప్రస్తావన చేశాను.
బౌద్ధమతమూ - హైందవ సమాజమూ :
గౌతమ బుద్ధుని మహాత్మునిగా గౌరవించినా భారతదేశస్థులు బౌద్ధమతాన్ని యథాతథంగా ఎన్నడూ స్వీకరించలేదు. దివ్యజ్ఞాన సమాజమనే ఉద్యమంలో ఎందరో చేరారు. అయినా, వాళ్లు కూడ హిందూ ఆచారాలను పాటిస్తూంటారు. పండుగలనూ జరుపుకుంటూనే ఉన్నారు. వాళ్లల్లో వివాహాది కార్యాలన్నీ వేదోక్తంగానే జరుగుతూంటాయి. వాళ్లు హిందూ మతాన్ని విడనాడలేదు. కొందరు మహనీయులు జన్మించగానే వారి మానవతా, విజ్ఞతా, శీలమూ - జనాన్ని ఆకర్షిస్తాయి. అయినా మహనీయుల పేర నెలకొల్పబడిన సంస్థలలో స్వల్పమైన మార్పులతో వైదిక ఆచారాలను పాటిస్తారు. కాని ఆ సంస్థల అనుచరులు వీటిని యిళ్లల్లో పాటించరు. వారి సంప్రదాయానికే కట్టుబడి యుంటారు.
మహాత్మాగాంధీ, గాంధేయమతం గణనీయాలు. ఆదిలో ప్రజలు ఉత్సాహం కొద్దీ ఆయనని శ్రీరామ, కృష్ణ అవతారాల కంటె అధికుడనేవారు. కాని వీళ్లే తమ నిత్యజీవితంలో ఆయన చెప్పిన ముఖ్య బోధనలను, అంటే, వితంతు పునర్వివాహము, అస్పృశ్యతా నివారణము, వంటి వాటిని పాటించేవారు కారు. ఈ మేరకు వారు గాంధిమతాన్ని అవలంబించే వారు కారు - అయినా, మహాత్ముని అనుచరులుగా లోకంలో చెలామణి అయేవారు. కాని మహాత్ముడు - త్యాగశీలము, సత్యము, భగవద్భక్తి, లోకసేవవంటి విశిష్టగుణ సమన్వితుడు - ఆ కారణం వల్ల ఆయనని అందరూ గౌరవించే వారు. అంతమాత్రాన ఆయన బోధనలనీ పద్ధతులనీ అందరూ యథాతథంగా అంగీకరించారని అనుకోరాదు.
బుద్ధుని విషయంలోనూ యిదే జరిగింది. ఆయన వ్యక్తిగత జీవితం శ్లాఘనీయం. రాజకుమారుడై, మంచి పరువంలో భార్యాబిడ్డలను విడచి మానవాళి ఉద్ధరణకై జీవితాన్ని అంకితం చేశాడు. ఈ త్యాగబుద్ధీ, సచ్ఛీలమూ జనాన్ని ఆకర్షించాయి. అంత మాత్రాన బుద్ధుని బోధనలన్నిటినీ అందరూ అంగీకరించి పాటించారని చెప్పలేం. కర్మకాండను బుద్ధుడు ఖండించినంత మాత్రాన ప్రజలు వాటిని త్యజించలేదు. వారు క్రతువులను చేస్తూనే ఉండేవారు, కులధర్మాలను ఆచరిస్తూనే ఉండేవారు. అంతేకాదు, అధిక సంఖ్యలలో అందరూ భిక్షువులు కాలేదు. పెళ్లిళ్లు చేసుకొని సంప్రదాయ సిద్ధమైన ఆ ఆశ్రమ ధర్మాని పాటించేవారు. అశోక చక్రవర్తి బౌద్ధుడై, బౌద్ధమతానికి ఎంతో సేవ చేసినా ఆయన మారలేదు. ప్రజలవైదిక జీవితాన్ని మార్చలేక పోయాడు. అశోకస్థంభమూ, ఇతర శాసనాలూ ఆయన తన ప్రజల మతస్వేచ్ఛని ఎట్లా పరిరక్షించేవాడో చెప్తాయి. ప్రసిద్ధులైన బౌద్ధభిక్షువుల రచనలు కొన్ని, విద్యలవేల్పు సరస్వతీ స్తవంతో ప్రారంభమవుతాయి. వారు నీలాధార దేవతని ఆరాధించేవారు. తంత్ర విద్యలలో దేవతల నెట్లా ఆరాధించారో చెప్పబడి యుంది - ఈ తంత్ర గ్రంథాలు చాలా మట్టుకు టిబెట్ నుండి వచ్చాయి.
శ్రీహర్షుడు, బిల్హణుడు, సంస్కృతంలో గ్రంథరచన చేశారు. బౌద్ధమతం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు కూడా ప్రజలు వైదిక ఆచారాలు, జీవన విధానమూ అవలంబించేవారని ఆ రచనల నుండి తెలుస్తుంది.
నేను ఉపదేశించే జీవన విధానాన్ని అనుసరించని సంస్కర్తలెందరో నా వద్దకు వస్తూంటారు. నా విశ్వాసాలు వారికి లేకపోయినా, నాలో ఏదో మంచి వారికి తోచి ఆ వ్యక్తిగత గౌరవంతో నన్ను చూడటానికి వస్తూంటారు. మన దేశంలో ప్రాచీనకాలంలో కూడా ఇట్లాగే ఉండేది. సాంప్రదాయక జీవనంలో కొద్ది సంస్కారాలను ప్రోత్సహించే వారే కాక, తద్భిన్నమైన జీవన విధానాన్ని తీవ్రంగా, గాఢంగా ప్రతిపాదించేవారు కూడా గౌరవపాత్రులే అయేవారు. దీనికి కారణం వారి వ్యక్తిగత సుగుణాలు, జీవనసరళీను! ఇప్పటికీ సాంప్రదాయకమైన జీవితం మన నడుమనుండి పూర్తిగా మాయంకాలేదు. ఎంతైనా, కొన్ని శతాబ్దాలుగా పరీక్షకు గురియై నిలచి, మనలో జీర్ణించుకు పోయింది కదా యిది! తమ పూర్వీకుల అడుగు జాడల లోనే, ఒక తరం నుండి మరొక తరానికి, వారసత్వం వలె, సంక్రమించిన జీవన విధానాన్ని విడువలేరు ప్రజలు. బౌద్ధమతం తెచ్చిన సంస్కారానికి కూడ యిదే గతి అయింది. కాబట్టి బౌద్ధ సిద్ధాంతాలని ఉదయనుడు, కుమారిల భట్టూ ఖండించేప్పటికి ప్రజలు ఆ కొత్త మతాన్ని విడచి, సాంప్రదాయక జీవనం వైపు మొగ్గటానికి ఏమీ కష్టం కాలేదు.
శంకరులు, ఇతర సిద్ధాంతాలు :
ఆది శంకరుల సిద్ధాంతంలో అంతిమ దశ క్రతువులను విడనాడి, మనస్సుని పరమాత్మునిపై కేంద్రీకరించటం. కాని బుద్ధుని వలె ప్రారంభదశలోనే వైదిక కర్మలని విస్మరించాలని ఆయన అనలేదు. ఆ కర్మలనాచరించటం వల్ల కలిగే చిత్తశుద్ధి లభించిన తరువాతనే ఆత్మవిచారాన్ని ప్రారంభించాలన్నారు. ఆదిలో మీమాంసానుసారం కర్మల నాచరించాలి, వాటిని విడానాడమని బౌద్ధులు చెప్పే స్థితికి చివరకు చేరాలి.
ఆచార్యులవారు బౌద్ధం, మీమాంస, సాంఖ్యం, న్యాయం మొదలైన సిద్ధాంతాలను కొంత వరకే అంగీకరించారు, ఆ దశదాటిన తరువాత వాటి నన్నిటినీ ప్రతిఘటించారు. ఈ సిద్ధాంతాన్నీ మొత్తంలో ఒక భాగాన్నీ పట్టుకొని అదే పరమావధి అన్నాయి. ఆచార్యుల వారు అన్నిటినీ సమన్వయ పరచారు.
సాంఖ్యము :
సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఆత్మకి దేనితోనూ సంబంధంలేక పోయినా అన్నిటికీ కారణం ఆత్మే - అదే పురుషుడు. జగత్తుని సచేతనం చేసే శక్తి, మాయ - అదే ప్రకృతి. ఆ సిద్ధాంతం ప్రకారం జగత్తులో 24 తత్త్వాలున్నాయి. వాటిలో మొదటిది ప్రకృతి. దీనినుండి రెండవ తత్త్వమైన అహంకారముదయించింది - ''నేను'' అన్న భావాన్ని కలిగించేది యిదే. ఇది రెండుగా చీలుతుంది. ఒకవైపున అది చైతన్యమవుతుంది. దీనినే జీవుడంటాం - దీనికి మనస్సూ, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఉన్నాయి. రెండవ వైపు అది జడము - అయిదు తన్మాత్రలు, అయిదు మహాభూతాలూ దీంట్లోనివే. పంచేంద్రియాల వల్లనే జీవునికి బాహ్యప్రపంచ మెరుక కలుగుతుంది. చూచే కళ్లూ, వినే చెవులు, వాసన చూచే ముక్కూ, రుచితెలిపే నోరు, స్పర్శ తెలిపే చర్మం - ఇవీ పంచేంద్రియాలు. జీవుడు పనిచేయటానికి ప్రత్యక్షంగా ఉపకరించే వాటిని కర్మేంద్రియాలని అంటారు. వీటిలో కూడ నోటిని చేరుస్తారు - వాక్కుని పలికిస్తుంది కాబట్టి. అన్ని పనులనూ చేసే చెయ్యి మరొక కర్మేంద్రియం. ఆయా ఇంద్రియాలు నెరవేర్చే కార్యాలు - అతి సూక్ష్మం - తన్మాత్రలంటే అవే - ఇవి శబ్దం (చెవి) స్పర్శ (చర్మం) దృశ్యం లేక చూపు (కన్ను) రుచి (నోరు) వాసన (ముక్కు). అచేతన స్థితిలో వీటి రూపాలే పంచమహాభూతాలు. ఆకాశం (శబ్దం) వాయువు (స్పర్శ) అగ్ని (దృశ్యం) నీరు (రసం లేక రుచి) పృథ్వి (వాసన). మొత్తం 24 తత్త్వాలున్నాయి. ప్రకృతి, మహత్, అహంకారం, మనస్సు, పంచేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, అయిదు తన్మాత్రలు, అయిదు మహాభూతాలు.
ఈ ఇరవై నాల్గింటినీ వేదాంతంలోని అద్వైత సిద్ధాంతం కూడ అంగీకరిస్తుంది, కాని అద్వైత సిద్ధాంతం ప్రకారం నిర్గుణ బ్రహ్మకీ, ప్రకృతికీ (మాయకీ) సంయోగం ఈశ్వరుని వల్ల లేక సగుణబ్రహ్మ వల్ల కలుగుతుంది. సాంఖ్యము ఈశ్వరుని ప్రసక్తే తీసుకురాదు.
సాంఖ్యము చెప్పే త్రిగుణాలను అన్ని వేదాంత సిద్ధాంతాలూ అంగీకరించాయి. అవి : సత్వ, రజః, తమో గుణాలు. సత్వ గుణమంటే - స్వచ్ఛమూ, ప్రశాంతమూ, ఉన్నతమూ అయిన స్థితి. రజోగుణం - తొందరపాటు, కార్యచరణ పరాయణత్వం. తమోగుణం - సోమరితనం, బద్ధకం, నిద్రపోయే లక్షణం.
భగవద్గీతలోని గుణత్రయవిభాగ యోగంలో వీటి గురించి విపులీకరింపబడింది. భగవంతుడు అర్జునునికి నిసై#్త్రగుణ్య స్థితిలో ఉండమని ఉపదేశిస్తాడు. అంటే త్రిగుణాలకు అతీతమైన స్థితిలో - ఆత్మనిష్ఠలో ఉండమని. ఈ మూడు గుణాల సంఘర్షణ వల్లనే అసంతృప్తీ, స్పర్థా ఏర్పడుతాయని అంటుంది, సాంఖ్యము. వాటిని సంపూర్ణంగా అణచివేయాలి. భగవద్గీత, ఇతరశాస్త్రాలూ - ఈశ్వరారాధనా, శరణాగతీ, ఆత్మవిచారమూ, చిత్త సమత్వాన్నీ, ఔన్నత్త్యాన్నీ కలిగిస్తాయని చెప్తాయి. కాని సాంఖ్యము అట్లా చెప్పదు.
''జీవ చైతన్యం పురుషునకే ఉంది. ప్రకృతి జడం. అందువల్ల ప్రకృతి స్వయంచోదకం కాదు. కాని పురుషుని ప్రేరణ వల్లే ఇరవై నాలుగు తత్త్వాలుగా భాసిస్తుంది. అయినా పురుషునికి దీనితో ప్రమేయం లేదు. అది కేవలం ''ఎరుకే'', అంటుంది సాంఖ్యము. దీనిలోని విరోధాభాస పైకి తెలుస్తూనే ఉంది కదా.
''కేవల''మన్న పదానికి అర్థం దేనిలోనూ కలువకుండా, ఒకటిగా, స్వచ్ఛందంగా ఒంటరితనం కోరుకుని ఉండటం. దీని విశేషణం, కైవల్యం. సాంఖ్యలో మోక్షాన్ని కైవల్యమంటారు. జీవుడు ఇరవై నాలుగు తత్త్వాలనూ అధిగమించి, అచేతనమైన జడాన్ని ఛేదించి, తనంతట తానే పురుషునితో ఉంటాడు. ఇదే కైవల్యం.
అద్వైత సిద్ధాంతం ప్రకారం కూడా మాయను అధిగమించి ఆత్మలో లీనమవటమే లక్ష్యం. 'ఆత్మ' అన్నా 'పురుషుడ'న్నా ఒకటే. కాని ఈ లక్ష్యసాధనకి ఆచార్యులవారు చెప్పిన కర్మ, ఉపాసన, జ్ఞానవిచారమనే పద్ధతుల ప్రసక్తి సాంఖ్యములో లేదు. ఇరవైనాలుగు తత్త్వాల లక్షణాలను చెప్పటంతోనే సాంఖ్యము చాలా వరకు ఆగిపోతుంది. సాంఖ్యమునకి మరొక లోపముంది. ''పురుషుడు (ఆత్మ) ఏ వ్యాపకమూ లేని శుద్ధ జ్ఞానము. జ్ఞానముగాని జీవచైతన్యంగాని లేనిది ప్రకృతి.'' ఈ రెంటికీ ఈ భేదం ఉంది. కాని జడమైనది ఇతర తత్త్వాలుగా ఎట్లా మారుతుందో సాంఖ్యము చెప్పదు. సాంఖ్యము చెప్పేదల్లా ఇదే: పురుషుని (జీవచైతన్యం) ఉనికే జడపదార్థమట్లా మారటానికి కారణమని. పురుషునికి ఏ వ్యాపకమూ లేదంటూనే, ప్రకృతి పురుషుని వల్లనే వ్యాపకాలను నెరవేరుస్తుందంటుంది సాంఖ్యము. వీటికి పొత్తు కుదరటమెట్లా? దీనికి సాంఖ్యుల సమాధానమిది : అయస్కాంతపు ఉనికి ఇనుపరజనుకి చలనం కలిగిస్తుంది - ఏ ప్రయత్నమూ లేకుండానే. ఆ విధంగానే పురుషుని ఉనికి వల్లనే ప్రకృతి కార్యనిమగ్న మవుతుంది. గుడ్డివాడు కుంటివానిని బుజం మీద పెట్టుకుని తీసికొని వెళ్లున్నట్లే వున్నది యిదీను. గుడ్డివాడు నడువగలగుతాడు. అట్లాగే చేతనత్వం లేని ప్రకృతి, చైతన్య స్వరూపమైన పురుషుని మోస్తుంది. లోకవ్యాపారం సాగుతుంది. ఇది మంచి ఉపమానమే, కాని సప్రమాణమైనది కాదు. అద్వైతం ప్రకారం ఏ వ్యాపకమూ లేని నిర్గుణబ్రహ్మమే సగుణమైన ఈశ్వరునిగా ఉన్నట్లనిపించి, మాయద్వారా లోకవ్యవహారాన్ని నడుపుతుంది.
సాంఖ్యమునకీ అద్వైతానికీ మరొక ముఖ్యమైన భేదముంది. పురుషుడు శుద్ధ చైతన్యమన్నా, జీవాత్మలన్నీ ఒకే ఆత్మ అని ఒప్పుకోకుండా, జీవాత్మలన్నీ వేరువేరు అంటుంది సాంఖ్య సిద్ధాంతం.
ఇటువంటి అసంగత విషయాలెన్ని యున్నా వేదాంత సిద్ధాంతమైన తత్త్వాలను గుర్తించి చెప్పుతుంది. వాటి లక్షణాలను చెప్తుంది సాంఖ్యము. ''సాంఖ్యము'' అన్న మాట ''సంఖ్య'' అన్న మాట నుంచి వచ్చింది.
సాంఖ్య సిద్ధాంతంపై కపిలముని సూత్రములను వ్రాశాడు. ఈ విషయంపైన గొప్ప గ్రంథాలు - ఈశ్వరకృష్ణుని సాంఖ్య కారిక, విబిజ్ఞాన భిక్షు రచించిన సాంఖ్య సూత్రభాష్యము.
భగవద్గీతలో కృష్ణ భగవానుడే అనేక సాంఖ్య సూత్రాలను విశదీకరించాడు. కాని ఆత్మ సాక్షాత్కారానికి సాంఖ్యము యోగములు కూడ రెండు మార్గాలే అని ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పేది జ్ఞాన మార్గం గురించే.
పురుషుడు వేరు, ప్రకృతివేరు అని గ్రహించాలని చెప్పటంతో ఆగిపోతుంది సాంఖ్యము. రాజయోగం అక్కడనుండి అందుకొని ఏ విధంగా ఆ గ్రహింపు కలుగుతుందో, దానికి చేయవలసిన సాధనయేమిటో చెప్తుంది. కాని యోగంలో ఈశ్వరుని ఉనికిని అంగీకరించి, ఈశ్వరారాధన మనోవిగ్రహానికి ఒక పద్ధతిగా చెప్పబడుతుంది. పతంజలి ''రాజయోగం''లో యోగాన్ని మనస్సు యొక్క విచ్ఛిన్నకర శక్తిని అదుపులో పెట్టటానికి ఒక మార్గమని చెప్పబడింది.
సాంఖ్యమూ, యోగమూ మన శాస్త్రాలలో చెప్పబడిన 14 లేక 18 విద్యలలోనివి కావు. అయినా ఇవి కూడ రెండు ముఖ్యమైన విద్యలే. కనుక వాటి ప్రస్తావన తీసి కొని వచ్చాను.
ఈ విషయాన్ని ముందు కూడ ఒకసారి చెప్పాను. మీమాంస వేదాల ప్రమాణాన్ని అంగీకరించినా, భగవంతుని పట్ల భక్తి అవసరమనదు. సాంఖ్యము కూడ వేదాల ప్రమాణాన్ని అంగీకరిస్తుంది. కాని నిర్వీశ్వర వాదాన్ని బలపరుస్తుంది. ఆదిశంకరులవారు రెంటిలోనూ సరియైన అంశాలనే స్వీకరించి, మిగిలిన వాటిని నిరాకరించారు. ఈ వాదాలకి మూలభూతమైన వేదాంతసారాన్ని ప్రతిష్ఠించారు. నిర్గుణ బ్రహ్మస్థానంలో సాంఖ్య సిద్ధాంతాన్నీ, ఆ సిద్ధాంతం ప్రతాపాదించిన ప్రకృతే - మాయగానూ, ఆ సిద్ధాంతం నిర్వచించే ఇరవైనాలుగు తత్త్వాలనూ, మీమాంస సిద్ధాంతం యొక్క కార్మకాండనూ, న్యాయం చెప్పే ఈశ్వరుడ్నీ, దానికి గల ఆధారాలను - వీటన్నిటినీ శంకరులు ఆమోదించారు. కాని, ఆయా సిద్ధాంతాలు ఏదో ఒక అంశాన్నీ తీసుకొని ముఖ్య లక్ష్యంగా ప్రతిపాదించాయంటారు. హేతు వాదానికీ, బుద్ధికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమన్వయ పరచాలంటారు!
* * *