Acharyavaani - Vedamulu Chapters Last Page
24. ఉపాంగములు : పురాణములు -
వేదమునకు భూతద్దములు :
వేదాలకు పురాణాలు భూతద్దాలనవచ్చు. చిన్న చిన్న వాటిని పెద్దవిగా చేస్తాయికనుక. వేదాలలోని సూక్తులు క్లుప్తంగా ఉంటాయి - వాటిని కథలుగా, ఆఖ్యాయానాలుగా పెంచి చూపుతాయి పురాణాలు.
ఒక భావాన్ని క్లుప్తంగా చెప్పితే అది మనస్సులో నాటుకోక పోవచ్చు, దాని ఫలితమూ కనబడకపోవచ్చు. దానినే ఒక కథగానో ఉపాఖ్యానంగానో చెప్పితే మనస్సులో నిలచిపోతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. వేదాలు ''సత్యం వద'' అంటాయి - అంటే, ''సత్యాన్ని సలుకు''అని. సత్యవ్రతాన్ని పాటించటం ఎంతటి మహనీయతకు దారితీస్తుందో హరిశ్చంద్రుని కథలోని వృత్తాంతాల వల్ల తెలియజేయబడింది. ''ధర్మం చర'' అంటే ధర్మాన్ని పాటించు. రెండు ముక్కలలో వేదాలు చెప్పిన దానిని మహాభారతంలోని పాండవుల కథ ద్వారా తెలియ వస్తుంది. 'మాతృదేవో భవ' 'పితృదేవో భవ' అంటే తల్లిని దైవముగా ఆరాధించు, తండ్రిని దైవముగా ఆరాధించు - ఇది వేద వాక్కు. ఈ వైదిక నిర్దేశాలను భూతద్దంలో చూపినట్లు రామాయణ గాధలో తెలుస్తుంది. వైదిక నియమాలైన నిగ్రహం, క్షమ, కరుణ, పవిత్రత వంటి ధర్మాలనన్నిటినీ తమ తమ జీవితాలలో ఎందరో స్త్రీలు పురుషులు పాటించి చూపుతారు. ఇవన్నీ పురాణాల ద్వారా తెలుస్తాయి. ఆ కథలని వినటం వల్లా, చదవటం వల్లా ఆ మహనీయులు పాటించిన ధర్మాలలో మనం కూడ నిమగ్నుల మవుతాం.
వాళ్లందరూ ఎన్నో పరీక్షలకూ, కష్టాలకూ గురి అయ్యారు. ఈ విశిష్ట వ్యక్తులు ఎన్నో విధాల ధర్మాన్ని అతిక్రమించిన సామాన్యులకంటె ఎక్కువ కష్టాలను అనుభవించారు. అయినా వారి గాధలు చదువుతూంటే ''ధర్మపాలన కష్టంకదా ధర్మాన్ని విడనాడితే ఏమి'' అన్ని ప్రశ్న మనలో ఉదయించదు. ధర్మపరాయణత్వము, ఎన్ని అవాంతరాలు వచ్చినా ధర్మాన్ని విడనాడకుండా ఉండటమూ, దాని వల్ల వారికి కలిగిన ఉపశాంతీ - ఇవే మన మనస్సులో మెదులుతాయి. ఆ మహనీయులకు సంభవించిన కష్టాలు, విపత్తులూ తెలిసినప్పుడు మన మనస్సు కరుణతో కరిగి పోతుంది. మన అంతరాంతరాలలోని సంశయాలు పోయినట్టూ, మన దోషాలు క్షాళనమయినట్లూ అనిపిస్తుంది. వారి అంతిమ విజయం, ఖ్యాతీ మన మనస్సులలో ధర్మాన్ని నిలుపుతాయి. పురాణగాధలు చేసేదిదే.
పురాణాలూ, చరిత్రా :
మన దేశ చరిత్ర లిఖిత పూర్వకంగా లేదంటూంటారు. పురాణాలు చరిత్రే. క్రీస్తు శకంలో జరిగిన వాటిని తప్పిస్తే ఇంక దేనినీ చరిత్రగా ఆధునిక విద్వాంసులు అంగీకరించరు. మొగమాటానికా అన్నట్టు పురాణాలలో ఈషణ్మాత్రం చారిత్రకాంశాలున్నాయని అంటారు. దీనినైనా తమ అభిమాన సిద్ధాంతాలను బలపరచే వాటి గురించే. మహాద్భుతాలూ అస్వభావికమైన విషయాలూ, వీరి దృష్టిలో అర్థరహితం. మానవునికి ఇంద్రియగోచరం కానిదంతా అసత్యమని ప్రక్కకు నెట్టేస్తారు. పురాణాలలో ఎన్నో మర్మాలున్నాయి. అదంతా చరిత్ర కానేరదంటారు.
పురాణాలలోని సంఘటనలు పిన్న వయస్కుల మనస్సుకి ఆకర్షణీయ మవటమే కాక, వారి శీలాన్ని కూడ సన్మార్గాలలో పెట్టుతాయి. చరిత్ర అటువంటిది కాదు. చరిత్రని పట్టించుకోనక్కర్లేదని నేననను. పురాణాలు కూడ చరిత్రే. మానవుణ్ణి ఉన్నతుణ్ణి చేయటం వాటి లక్ష్యం. అందువల్లే పురాణాలని కూడ చదవాలి. చరిత్రని చదువ వలసిన అవసరముండటానికి ఒక కారణం, చరిత్ర పునరావృతమవటం. పరిస్థితులూ, సంఘటనలూ తిరిగి తిరిగి రావటం సహజం. అందుచేత, గతం తెలిస్తే, భవిష్యత్తుని తెలుసుకోగలం. గతం నుండి గుణపాఠాలను కూడ నేర్వగలం. ఒక పరిస్థితిని ఉపేక్షచేస్తే యుద్ధానికో, సంఘవిచ్ఛిత్తికో, నాగరిక ధ్వంసానికో దారి తీయగలదని చరిత్ర చూపుతుంది. అటువంటి పరిస్థితే మళ్లీ పొడచూపితే మనం ముందు జాగ్రత్తలు తీసికొని ఆ దుర్ఘటనలను తప్పించు కోవచ్చు. చరిత్రకు గల ప్రయోజనాలలో ఇదొకటంటారు.
పురాణాలకి కూడ చారిత్రకత ఉంది. కాని ప్రజలను సన్మార్గవర్తనులను చేయటానికి ఉపకరించే సంఘటనల గురించే అవి చెప్పుతాయి. ధర్మవర్తనం వల్ల ఈ జన్మలోనే సత్ఫలితాలను పొందిన రాజుల గురించీ, అధర్మప్రవర్తన వల్ల కష్టాల పాలైన రాజుల గురించీ పురాణాలు చెప్పుతాయి. లేకపోతే, మరు జన్మలలోకి తీసికొని పోయి వారి పురాకృతాల ఫలితాలని చూపుతాయి. ఉత్తర జన్మలో పాపపుణ్యాల ఫలితాలని తెలుపని పురాణం లేనే లేదు. చరిత్ర అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనాలివి (1) పూర్వానుభవం ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనటానికి ఉపకరిస్తుంది (2) సద్వర్తన వల్ల సత్ఫలితాలను పొందిన సత్పురుషుల జీవితాల అధ్యయనం మనకి మార్గదర్శక మవుతుంది (3) దుష్టకార్యాలు చేసి ఎందరికో ఎన్ని విధాలో కీడు చేసి తత్ఫలితాలను తామే ఇంకా ఎక్కువగా అనుభవించిన వారి జీవితాలను తెలిసికోవటం మనం పెడదారుల పడకుండా ఆపుతుంది. ఈ ప్రయోజనాలు చరిత్ర పాఠాలను చదవటం వల్ల లభించవు. పురాణాలే ఆ ప్రయోజనాలను అందిస్తాయి.
కొందరు రాజవంశీయులు జయించిన యుద్ధాలను గురించిగాని, వారు చేసిన సంస్కారాలను గురించిగాని ఏకరువు పెట్టటంలో ప్రయోజనమేమీ లేదు. వారి పనుల మంచి చెడ్డలను కూడ వివరించాలి. మనమింకా ఉత్కృష్టమైన జీవితాన్ని గడపటానికి దోహదమివ్వని చరిత్ర నిరర్థకం. పురాణాల ప్రయోజనమిది. మనిషి మనస్సుని మలచి అతనికీ, సమాజానికీ ఉన్నతమైన జీవితాన్ని కలిగించటం.
పురాణాలలో సూర్య, చంద్ర వంశపు రాజులు గురించి వివరాలెన్నో ఉన్నాయి. వారి వంశపరంపరకి సంబంధించిన వివరణలెన్నో ఉన్నాయి. ఆదర్శప్రాయులు కాని రాజులు గురించి రెండు మూడు వాక్యాలకంటే ఎక్కువ ఉండవు. మనకి ఆదర్శప్రాయులైన వారి గురించి ఎన్నో వివరాలుంటాయి. ఉదాహరణకి - ధృవుని తండ్రియైన ఉత్తనపాదుని గురించీ ధృవుని తరువాత రాజ్యమేలిన అతని కుమారుని గురించీ మహాభాగవతంలో రెండు మూడు వాక్యాల కంటె ఎక్కువ లేవు. కాని భక్తి తత్పరతకి పెట్టింది పేరైన ధృవుని గురించి ఎన్నో వివరాలున్నాయి.
''పురాణాలు కేవలం కల్పిత గాధల''ని మన దేశ చరిత్ర వ్రాసిన ఆంగ్లేయులన్నారు. ''విభేదాలను కల్పించి, విడదీయి'' అన్న వారి రాజకీయ నీతి కనుగుణంగా వారు జాతివాదాన్ని అందులో జొప్పించి అదంతా నిష్పక్షపాతమైన పరిశోధనగా చెప్పుకున్నారు! వారి దృష్టిలో పురాణాలు కల్పనలే అయినట్టుగానే, స్వతంత్ర భారతంలో ఆధునికుల దృష్టిలో ఇంగ్లీషువారు రచించిన భారతదేశ చరిత్రకూడ అక్కడక్కడ కల్పనే! నిష్పక్షపాతంగా చరిత్రను వ్రాయటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా ఆయా రచయితలకు కొన్నికొన్ని అంశాలపట్ల వారి వారి భావాలూ, అభిమానాలూ ఉండవచ్చు. ఎంత ప్రయత్నించినా, అసలు నిజం వ్రాయబడుతుందని నమ్మకం లేదు. పాశ్చాత్యుల ప్రభావం వీరిలో కూడ ఉండవచ్చు.
చరిత్ర అంటే రాజ్యాలూ, రాజులూ, యుద్ధాలూ, రాజవంశాలూ మాత్రమే కాదు. ప్రతిదానికీ చరిత్ర యుంటుంది. దురదృష్టవశాన పాశ్చాత్య చరిత్రకారులు, రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. కాని, పురాణాలలో ప్రాముఖ్యం ధర్మానికి. దాని చుట్టూ కొన్ని సంఘటనలనూ, రాజుల చరిత్రలనూ, ఋషులనూ, సామాన్యులనూ కూడా అల్లుతారు. పురాణపఠనం వల్ల రాజ్యపాలన గురించే కాక అప్పటి ప్రజల సంస్కృతీ, నాగరికతల గురించీ కూడ తెలుస్తుంది. పురాణాలలోని ముఖ్య విషయం - ధర్మమూ, ఆధ్యాత్మికతాను!
పురుణాలు వాస్తవమా, అభూత కల్పనలా?
ఆధునికుల దృష్టిలో ''మన మెరిగిన సహజసత్యాలకి అతీతమైనవి ఎన్నో ఉన్నాయి. అందుచేత వాటిని నమ్మక్కర్లేదు''. దేవతలు భూమిమీద ఎక్కడ పడితే అక్కడికి వెళ్లి, వరాలనివ్వటం కేవలం అభూతకల్పనే. ఇట్లాంటివి అసంభవం. ఒక స్త్రీ శాపవశాన బండరాయి అవుతుంది. ఆ రాయే మళ్లీ స్త్రీగా మారుతుంది. సూర్యుడు తన గతిలో నిలపి వేయబడుతాడు.'' ఇటువంటి సంఘటనలు మనకెప్పుడూ అనుభవంలోకి రావు. కాబట్టి అవన్నీ అభూతకల్పనలేనని త్రోసి పారేయటానికి అవకాశముంది.
కొన్ని సంఘటనలు ఇప్పుడు అసంభవమైనంత మాత్రాన అవి పూర్వకాలంలో గాని, భవిష్యత్తులో ఎప్పుడైనా గాని అసంభవమని ఎట్లా అనగలం? వేదమంత్రాలకూ, తపస్సుకీ, యోగనిష్టకూ గల అమోఘమైన శక్తి, తరచూ కనబడేదేనని ప్రతి పురాణమూ చాటి చెప్తూనే ఉంటుంది. ఆ సామర్థ్యమున్నంత కాలమూ అలౌకిక శక్తులను ఉపయోగించుకోవటం సాధ్యమయేది. కాంతి ఉన్నచోటే చీకటి ఉన్నట్లే దుష్టశక్తులైన దానవులూ, రాక్షసులూ కూడ సత్పురుషులతో బాటు ఉండేవారు. ఇప్పటికీ, ఈ దుష్టశక్తులకీ, మంచి శక్తులకీ పోరాటం జరుగుతూనే ఉంది. ఇదే దేవదానవుల సమరం. ఎటొచ్చీ ఇది మన కంటికి కనబడదు. ఆ రోజులలో తపస్సంపద వల్ల ఆ దుష్టశక్తులనీ మంచి శక్తులనీ చూడగలిగే వారు. ఆధునిక శాస్త్రజ్ఞులు కూడ కాంతికీ, శబ్దానికీ సంబంధించిన అన్ని తరంగాలనూ మన యింద్రియాలతో గ్రహించలేమంటారు. మరి కొందరు శాస్త్రజ్ఞులు మానవాతీత శక్తుల గురించి పరిశోధనలు జరిపి దివ్యశక్తులున్నాయనీ వాటిలో కొన్ని మంచివీ, మరి కొన్ని చెడ్డవీ అని కనుగొన్నారు.
ఈనాడు కూడ కొందరు సిద్ధులూ, యోగులూ ఉన్నారు. తీవ్రమైన చల్లదనాన్ని గాని, వేడిమినిగాని వారి శరీరాలు తట్టుకోగలవు. వారు వర్షాన్ని కురిపించగలరు, ఆపివేయగలరు. అతిలోక శక్తులు గల మనుష్యులున్నారు. మన విశ్వాసమే దృఢం కాదు. మనమన్నిటినీ సందేహిస్తాం. పూర్వకాలంలో ఇటువంటి అలౌకిక శక్తులు కలవారెందరో ఉండటం వల్ల పురాణాలన్నీ ఈ అద్భుతాంశాల మయమన్నట్లు కనబడుతాయి. కథనంలో కొన్ని అద్భుతాలను చొప్పించినంత మాత్రాన దానిని చరిత్ర కాదంటూ కొట్టివేయరాదు.
శాస్త్రీయ పద్ధతులలో నిరూపించ దగని దంతా అభూతకల్పనే అని కొట్టివేయటం ఆధునిక విద్యకు శోభాయమనం కాదు. ఆ మాటకొస్తే, కొద్ది సంవత్సరాల క్రితం శాస్త్రపరిశోధన వల్ల ఋజువు కాని విషయాలెన్నో యిప్పుడు ఋజువవుతున్నాయి. ఇప్పుడు కూడా పురావస్తు పరిశోధకులు పది, పన్నెండు అడుగుల పొడవుగల మానవ అస్తిపంజరాలని చూస్తున్నారు. అట్లాగే ఎన్నడో భూమి పైన తిరిగిన పెద్దపెద్ద మృగాలని కూడ కనుగొంటున్నారు - వీటి గురించే పురాణాలలో ఉన్నాయి. దీని బట్టి తాటి చెట్టంత పొదవుండి, ఏ మృగాలవంటి శరీరాలో కలిగిన రాక్షసులుండే వారని తెలుస్తుంది. ఐస్‌లాండ్లో మనిషి అస్తిపంజరంలో భాగంగా పదహారడుగులు పొడవుగల కాలి ఎముక దొరికింది. అట్లాగే, ఏనుగు కంటె పదిరెట్లు పెద్దదైన జంతువు యొక్క వెన్నెముక కూడ దొరికింది. ఇవన్నీ పురావస్తు పరిశోధనలంటూ పెద్ద ఆర్భాటం కూడ చేశారు. భూగర్భ శాస్త్ర జ్ఞానానికి, పురావస్తు శాస్త్ర జ్ఞానాన్ని జోడించి, ఇవన్నీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నివసించే వన్నారు. దీనికే కొన్ని పురాణ లక్షణాలను చేరిస్తే, మన పురాణాలు నమ్మదగినివిగా కనబడుతాయి.
ఒకనాడు తాటి చెట్టంత, ఈనాడు అరడుగుల ఎత్తు, అంగుష్ఠ మాత్రం ఒకనాడు - జీవరాశులలోనూ, జీవజాతులలోనూ ఈ మార్పులు కాలప్రభావం వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఈ మార్పులు గురించి కూడ పురాణాలలో చెప్పబడింది.
మాట్లాడే వానరాలు, జంతువు వంటి దేహము, మనిషి వంటి ముఖమూకల ఆకారాలు, రెండు తలలో, పది తలలో కల మనుష్యులు - ఇవన్నీ పురాణాలలో వస్తాయి. ఇవన్నీ సత్యదూరమంటారు. ఈ విధమైన విమర్శచేయని వారు, ఆయా రూపాలు కొన్నింటికి ప్రతీకలు మాత్రమేననీ, కథలన్నీ రూపకాలంకార భూయిష్టాలనీ సరిపెట్టుతారు!
నైతిక విలువలను కథల ద్వారా తెల్పుతారు, నిజమే. అంతమాత్రాన పురాణాలన్నీ కట్టు కథలని తీసిపారవేయ కూడదు. ఈ రోజులలో కూడ రెండు తలలూ, నాలుగు చేతులూ కల శిశువుల జననం గురించి వింటూనే యుంటాం. అట్టి శిశువు మనిషే కాదు, జంతువు కాదు. అదొక వైపరీత్యం. నిర్దుష్టమైన ప్రకృతి గతి తప్పితే విపరీతం సంభవిస్తుంది. అటువంటి విపరీతాలని పూర్వం పెద్దఎత్తున బుద్ధి పూర్వకంగానే కల్పించారేమో! ఆ నాటి మానవులకు అతీంద్రియ శక్తులుండటం వల్ల అటువంటి విపరీతాలను కల్పించటం తేలిక వారికి. అందువల్లనే, ''తెలియ వలసిన దంతా మాకు తెలుసు, మాకు తెలిసిన దానికి భిన్నంగా ఏదీ ఉండజాలద''ని ప్రగల్భాలు పలుక కూడదు. మనకి తెలియని దానిని గాని, మన మెరుగ జాలని దానిని గాని అసత్యమనటం సహేతుకం కాదు. పురాణాలలో అవిశ్వసనీయాంశాలని త్రోసిపుచ్చేవి ఇప్పుడు కూడా అక్కడక్కడ సంభవిస్తూనే ఉన్నాయి. ఒక ఉదాహరణ : తమ పూర్వజన్మ వృత్తాంతాలను చెప్పగల వ్యక్తుల గురించి పేపర్లలో వస్తూనే యున్నాయి. ఈ నడుమ అటువంటి వార్లు ఎక్కువౌతున్నాయి కూడాను. ''కశ్యపుని భార్య కద్రు. ఆమె సర్పాలను కన్నది'' అని పురాణాలలో ఉంది. ఇది అసాధారణం, అసంభవమని అందుచేత అసత్యమని కొట్టి పారవేస్తాం. 1958లో వెలువడిన వార్త కొందరికి గుర్తుండే ఉంటుంది - ''ఒక మర్వాడీ స్త్రీ పాముని ప్రసవించింది'' అన్నదే ఈ వార్త. ఆ వార్త చూచిన తరువాత నాకు మరొక విషయం స్పష్టమైంది.
నేను సన్న్యాసం స్వీకరించక పూర్వం ఒక కుటుంబంలోని విషయం వింటూండే వాడిని. ఆ వంశంలో జన్మించిన ఆడపిల్లలు గాని ఆ వంశానికి వచ్చిన కోడళ్లు గాని మొగలి పూవుతో ఎప్పుడూ అలంకరించుకునే వారు కారు. దానికి కారణమేమిటని అడిగితే ఈ కథ చెప్పేవారు. ''పది, పదిహేను తరాల వెనుక మా వంశంలో ఒకామె ఒక సర్పాన్ని ప్రసవించింది. ఈ విషయాన్ని పైకి చెప్పటానికి సిగ్గుపడి రహస్యంగా ఆ పాము పిల్లని సాకారు. మామూలు శిశువుకిచ్చి నట్లే పాలు యిచ్చేవారు. అది హాయిగా పెరిగి యింట్లో ఎవ్వరికీ ఏ అపకారమూ చేయక మసలు కొనేది. కాని ఈ వింత బిడ్డను బయటకు తీసుకొని వెళ్లటం కుదిరేది కాదు. తప్పనిసరియైతే తప్ప ఆ తల్లి బయటకి వెళ్లేది కాదు. తమిళంలో ఒక నానుడి ఉంది : ''బండరాయి అయినా సరే, భర్త భ##ర్తే'' అని. అంటే రూపం వల్ల ఆ బంధం చెడదని. ఆ విధంగానే ఆ పాముపిల్ల పట్ల తల్లి ప్రేమ అట్లాగే ఉండి పోయింది. ఒకసారి, ఒక దగ్గర బంధువు వివాహానికి వెళ్లవలసిన అవసరమేర్పడింది. ఆ యింట్లో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఆ పాము పిల్లకి ముత్తవ తల్లేమో తెలియదు. ఆ రోజులలో నిరాధారమైన దూరపు బంధువులకి కూడ ఆశ్రయమిచ్చేవారు. ఈ రోజులలోనే పెళ్లి అయిన తరువాత తల్లిదండ్రులతో కలిసి ఉండటం ఇష్టంలేక కొడుకులు వేరు కాపరాలు పెట్టుకుంటున్నారు. పూర్వం అవిభక్త కుటుంబాలే సామాన్యంగా ఉండేవి. ఆ యింట్లో ఏ విధవ అత్తకో, ఆ తాతగారి వేలువిడిచిన సోదరునికో స్థానముండేది. ఏమయితేనేం, ఆ యింట్లో ఒక అవ్వ యుండేది. కాని ఆమెకి కనుచూపు లేదు. ఊరికి వెళ్తూ ఆ తల్లి తన పాముపిల్లని ఆ అవ్వకి అప్పగించి వెళ్లింది. పాముకి కావలసిందేమిటి? స్నానం చేయించి, జడ అల్లి, ముస్తాబు చేయటం కాదు. వేళకి పాలనివ్వాలి. ఊరికి వెళ్లేప్పుడు ఆ తల్లి, అవ్వకి చెప్పిందిట్లా ''గోరు వెచ్చని పాలని రోలు బెజ్జంలో పోయి. అవసరమైనప్పుడల్లా బిడ్డ పాలు తీసుకుంటుంది''. గుర్తుంచుకోవటానికి తిరగలిని తాకమనీ చెప్పింది. అంటే ఆ పాముకి ఆ రకమైన అలవాటు చేశారన్నమాట. ఆ అవ్వ ఆ ప్రకారమే చేసింది. పాముపిల్ల కూడ తల్లి చెప్పినట్లే పాలు త్రాగుతూండేది. కొన్నాళ్ల తరువాత ఒక నాడు క్రమం తప్పింది. పాము పిల్లకి రోకలిలోని బెజ్జం ఖాళీగా ఉండటం తెలిసింది. అవ్వకి మెళకువ రాలేదు. ఆ పాము పిల్ల బెజ్జంలో ముడుచుకు పడుక్కుంది కొంతసేపటికి ఆ అవ్వ బాగా వేడిగా ఉన్న పాలను తెచ్చి పాము పిల్ల ఉండటం గమనించక ఆ బెజ్జంలో పోసింది. ఆ వేడికి ఆ పాముపిల్ల చనిపోయింది. వేరొక గ్రామంలో ఉన్న తల్లికి కలలో ఆ బిడ్డ కనబడి ''నేను చనిపోయాను. ఇంటికి వెళ్ళి మొగలి పొదల మధ్య నాకు దహన సంస్కారం చెయ్యి. ఇక నుంచి మీ యింట్లో పుట్టే ఆడపిల్లలు గాని, ఈ యింటిని మెట్టే ఆడపిల్లలుగాని ఆ పూవులని ధరించరాదు'' అని చెప్పింది. ''అప్పటినుండి ఆ వంశంలో అదే ఆచారమైంది''. ఈ కథ విన్నప్పుడు నాకు ఇది సంభవమేనా అని ఆశ్చర్యం కలిగింది.
ఎన్నో సంవత్సరాల తరువాత ఆ వంశీయులు నా వద్దకు వచ్చారు. పాము కథని చెప్పటానికి కాదు. నాకెంతో ఆసక్తి దాయకమైన రాగి శాసనం చూపించటానికి. అది రాజు యిచ్చిన దానం - రాగి పలకపై చెక్కారు. అది అచ్యుత దేవరాయ చక్రవర్తి నాటిది. రాజు కొరకై ఒక బ్రాహ్మణుడు, 108 బ్రాహ్మలకు దానాలు చేసినట్టుంది ఆ రాగి పలకపై.
ఇది ఎందుకు జరిగిందో చెప్పాను. బ్రాహ్మణుడు ఎప్పుడూ వేదాధ్యయనమూ, వైదిక కర్మలనూ చేస్తూ కాలం గడపాలేగాని భుక్తికోసం ఏ వృత్తినీ చేపట్టకూడదు. కాని అతని సంసారం గడవాలి కదా? అందువల్లనే అతడు దానాలను, బహుమానాలను పుచ్చుకోవచ్చని శాస్త్రం సమ్మతిస్తుంది. రాజులూ, ప్రభువులూ బ్రహ్మణులకు దానాలు చేసేవారు. దానాలను స్వీకరింప వచ్చని అన్నారు. కాబట్టి వారు ఎన్నిటినైనా, ఎవరి వద్ద నుండైనా తీసుకోవచ్చని అర్థం కాదు. వారికెంతో ఆత్మాభిమాన ముండేది. అవసరమైనప్పుడు, అవసరమైన మేరకు మాత్రమే తీసుకునే వారు. రాజు ధర్మవర్తనుడూ, ప్రతిష్టకలవాడూ అయితేనే అతనిచ్చిన దానాన్ని తీసుకునే వారు.
మరికొందరింకా వెనక్కి వెళ్లేవారు. ఆ రాజు యొక్క వంశం నిష్కళంకంగా ఉందో లేదో చూచుకునే వారు. అటువంటి బ్రాహ్మణుల నిరంతర కోర్కెలను రాజులు ఎదుర్కొనవలసి వచ్చేది కాదు. వాళ్ల బాధల్లా బ్రాహ్మణులు తమ వద్ద దానాలు స్వీకరించి, తమకి లభ్యం కావలసిన పుణ్యాన్ని దక్కనీయటం లేదే అని. దీనిని ఎదుర్కోవటానికి రాజులూ, ప్రభువులూ వేరొక మార్గాన్ని కనిపెట్టారు. ఏ పేద బ్రాహ్మణునినో పిలిచి తమ దానాలను స్వీకరింపమని బుజ్ఞగించే వారు. ఒక్కొక్క సారి ఆ దానాలు గ్రామాలంత పెద్దవిగా ఉండేవి కూడాను. అటువంటి దానాలు ఏ ఒక్క వ్యక్తికి మాత్రమే పరిమితం కావు. దానం తీసుకున్న వ్యక్తి ద్వారా మిగిలిన బ్రాహ్మణులకు కూడ చెందుతాయని వారి యుద్దేశం. ఆ విధంగా దానాన్నంతా ఒక బ్రాహ్మణుడే తీసుకున్నా, తన కోసం కొంచెముంచుకొని మిగిలిన దానిని ఇతరులకు పంచి పెట్టేవాడు. ఒక బ్రాహ్మణుని వద్ద నుండి వేరొక బ్రాహ్మణుడు తీసుకోవటం వల్ల దానికి ప్రతిగ్రహ దోషమంటేది కాదు. ఆ విధంగా రాజు యొక్క ప్రయోజనం కూడా నెరవేరేది.
దాతకీ, చివరకి దానమందుకొనే వ్యక్తికీ నడుమ వచ్చే వ్యక్తి కళంకితుడు కాడా అనే ప్రశ్న కూడ వస్తూంటుంది. వేద పండితలకు దానమివ్వటానికి రాజులుపయోగించే యుక్తిలో దోషమేమీ లేదు. సరే కాని ఆ మధ్యవర్తి మాట యేమిటి? అతనికి ఏ దొసగూ అంటదు. దానంగా లభించినది న్యాయంగా అతని సొత్తే అవుతుంది. ఆ పత్రం అతని పేరనే యుంటుంది. కాని అది తనదే అంటూ ఉంచుకోక ఇతరులకు దానమిచ్చేయటం వల్ల అతనికే పాపమూ అంటదు. తన ఆస్తిని తాను దానం చేస్తే ఏ పాపమూ లేదు కదా!
నేను పైన ఉదాహరించిన రాగిరేకులో ఒక బ్రాహ్మణుడు దానాన్ని పొంది 108 బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ నూటెనమండుగురి పేర్లూ, వారు ఎంతవరకూ వేదాన్ని పఠించారో ఒక్కొక్కరికి ఏ మాత్రం భూమి ఇవ్వబడిందో - అన్నీ ఆ రాగి రేకుపై లిఖింపబడ్డాయి. ఆ దానాన్ని పొందిన వాళ్లల్లో పాముపిల్ల పుట్టిన వంశజుడు ఒకడున్నాడు. మిగిలిన కుటుంబాల గురించి అంతగా తెలియదు. ఆ రాగి రేకు కొన్ని తరాలబట్టి భద్రపరుపబడింది. ఆ రాగిరేకులో లిఖింపబడిన పేరు ''నాగేశ్వర''. ఆ రేకును నా దగ్గరకు తెచ్చిన వారి పేరు కూడా అదే. ఆ వంశంలో ప్రతి తరంలోనూ నాగేశ్వర అని ఒకరి పేరైనా పెట్టుకుంటారట. దీని బట్టి ఆ పేరుకీ ఆ పాముపిల్లకీ సంబంధముందని గ్రహింపగలిగాము. (సంస్కృతంలో 'నాగ' అంటే పాము). అంతే కాకుండా, ఈ కథకు మద్దతుగా అచ్యుత దేవరాయల కాలంలో కూడా ఈ యింటి పేరు కల వంశమున్నట్టు తెలిసింది.
నాకు మొదట్లో కలిగిన సంశయానికి ఇది సమాధానం. అంతే కాదు, 1958లో ఒక స్త్రీ పాముని ప్రసవించిందన్న వార్తను చదివిన తరువాత నా సంశయం పూర్తిగా నివృత్తి అవటమే కాక దాని స్థానంలో విశ్వాసం చోటు చేసుకుంది.
పురాణాలలో మీకు పూర్తి విశ్వాసం లేకపోవటాన్ని తప్పుగా ఎంచకూడదేమో! నాకు కూడా వార్తా పత్రికలో వచ్చిన కథ పట్ల విశ్వాసం కలగటమే కాక, అంతకు పూర్వం నేను విన్న కథ గురించిన సంశయాలు కూడ ఈ వార్తతో పోయాయి. మనమీ స్థితికి వచ్చాము. పేపర్లో వచ్చిన వార్త ఎంత అసంభావ్యమైనా నమ్మటానికి సిద్ధపడుతాం. కాని పురాణాలు పేరు చెప్పగానే మూతి విరుచుకుంటాం! ''వాళ్లకేం, బోలెడంత తీరుబాటు ఉండేది. తాటి ఆకులూ, గంటమూ ఉండేవి. పిచ్చి కథల సంఘటాలను తయారు చేసేశారు. అందులో కొంత గడుసు తనముంది నిజమే. కాని చాలా భాగం శుద్ధ చెత్త'' - ఇదీ మన వరస!
భావనాత్మకమే అయినా సందేశాత్మకమే :
పురాణాలలో అక్కడక్కడ కల్పనలున్నాయేమో. అవి కూడ కాలక్రమేణా వాటిలో చొచ్చుకున్న చేర్పులూ, మార్పులే. కాని వాటిలో ఏది కల్పనో, ఏది చేర్పో, ఏది వాస్తవమో ఎవరు చెప్పగలరు? ఎవరికి తోచిన దానిని వారు చేర్పుగా విసర్జించుకు పోతే చివరికి మిగిలే కథలేమిటి? మూల కథ కూడా మిగులక పోవచ్చు. ఎన్ని లోపాలున్నా, మనకి లభించిన రీతిలో, పురాణాలను కాపాడు కోవటం మన విధి.
కొన్ని కట్టు కథలుంటే యేమి? ఎంత కాదన్నా పురాణాలు మనల్ని దైవానికి దగ్గరగా చేర్చి, మనశ్శాంతి నిస్తాయి కదా? మనం దుకాణానికి వెళ్ళి మంచి పంచదారను కొనుక్కుంటాం. అది దొరికిందని సంతోషిస్తామా లేక అంగడిలో సరుకులను సరిగ్గా అమర్చలేదనో, ఆ కొట్టువాడికి చెవుడనో బాధ పడుతామా? భూగోళ విషయంలో గాని, ఖగోళ శాస్త్ర విషయంలో గాని, కాలాన్ని మన్వంతరాలుగా విభజించటంలో గాని, అక్కడక్కడ లోపాలుంటే ఉండనీయండి. అటువంటి దోషాలను పరిహరించటానికి ఆధునిక శాస్త్రాలు - భూగోళ, ఖగోళ, చరిత్రలు - ఉండనే ఉన్నాయి. కాని ఈ శాస్త్రాలూ, చరిత్రా సాధించలేని ప్రయోజన మొకటి ఉంది పురాణాలకు - అది పరమాత్మ తత్త్వం, భక్తి, ధర్మం - గురించి మనకి అధ్యయనం కల్పించటం.
''కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో రాముడు జీవించి యుండట మసంభవం. ఆ రోజులలో రామాయణం చెప్పే సంస్కృతీ నాగరికతా ఉండట మసంభవం'' - ఇట్లాంటి విమర్శలు మనకి వినబడుతూంటాయి. మాటవరసకి రాముడు త్రేతాయుగంలో లేడనే అనుకుందాం. అట్లాగే కృతయుగంలో జరిగాయని చెప్పబడేవి కూడ జరుగ లేదనే అనుకుందాం. ఇవన్నీ గత ఏడు, ఎనిమిది వేల సంవత్సరాల లోపునే జరిగాయనుకుందాం. అంతమాత్రాన రాముని కథకిగల గొప్పదనం ఏమైనా తరిగిపోతుందా? అ కథనుండి మనం నేర్చుకునే గుణపాఠా లేమన్నా తగ్గిపోతాయా? పురాణాల కాలం గురించి నిశ్చితంగా చెప్పటం కష్టమనినట్లు గానే వాటి ఔచిత్యం శంకించటం కూడ తప్పేనన్న అభిప్రాయం కూడా ఉంది.
అయిదు వేల సంవత్సరాల క్రితం, కలియుగారంభ##మైనప్పుడు వ్యాసుడు పురాణాలను మనకు అనుగ్రమించాడని శాస్త్రాలు చెప్తాయి. ఆయన కంటే ముందు పురాణాలుండేవి!
చాందోగ్యోపనిషత్తులో నారదుడు తాను అభ్యసించిన విద్యలనన్నిటినీ పేర్కొంటాడు. ఆ విద్యలలో పురాణాలొకటి. దీని బట్టి ఒక విషయం తెలుస్తుంది : వేదాలు, ఉపనిషత్తుల నాటికే పురాణాలుండేవని. భావితరాల వారు వేదాల నన్నింటినీ కంఠస్థం చేయలేరేమోనని వ్యాసుడు వేదాలను శాఖలుగా విభజించినట్లే, ఆయన పురాణాలను కూడా క్లుప్తంగా వ్రాసి యుంటాడు.
అయినా, పాశ్చాత్య విద్వాంసులు పురాణాలు అంత ప్రాచీనమైనవి కావంటూంటారు. అంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. ''పరిశోధన'' అనబడే దాని వల్ల, ఆధునిక మూఢనమ్మకాలు చాలా వచ్చాయి. ఈ ''పరిశోధనా'' ఫలితాలన్నీ సరియైనవి కావు. కాలంగడచిన కొద్దీ అవి తప్పని ఋజువువౌతూంటుంది. పరిశోధనలన్నీ నిర్దుష్టాలే, పురాణాలన్నీ కాల్పనికాలే అనుకున్నా పురాణాలు నొక్కి చెప్పేదేమిటి? ధర్మాచరణపరాయణులు సంతోషంగా ఉంటారనీ, అధర్మ వర్తనులు దుఃఖిస్తారనీ - అటువంటి వారికి కూడా భగవంతుని క్షమాభిక్షా, అనుగ్రహమూ లభిస్తాయనీను. ఈ భావాలు చదివేవారి మనస్సులో గాఢమైన ముద్రవేయటం వల్ల పురాణాల లక్ష్యం తీరినట్టేకదా?
వ్యాసుని ప్రసాదం :
ప్రజలు తేలికగా అర్థం చేసుకోవటానికి వేదాలనన్నిటినీ వేదశాఖలుగా అమర్చిన వ్యాసుడే, మనకి పద్దెనిమిది పురాణాలను ప్రసాదించాడు. పాత్రికేయులలో ప్రధముడనీ, ప్రముఖుడనీ వ్యాసుని గురించి అభిప్రాయముంది నాకు. ఉపాఖ్యానాలు, చరిత్ర, భూగోళశాస్త్రం, తత్త్వం - వీటన్నిటి గురించీ అమూల్యమైన ఉద్గ్రంథాలను పండితునకూ పామరునకూ తేలికగా అర్థమయే శైలిలో ఆసక్తి జనకంగా రచించాడు. పాత్రికేయులు చేసే పనికూడ యిదే కదా? కాని వీళ్లు కేవలం మనష్యులకి ఆసక్తి కలిగించేవి, కొంత ఉత్తేజపరచేవి మాత్రమే రచించి ఆపివేస్తారు. కాని మానవులు ధర్మోన్ముఖులవాలన్నదే వ్యాసుని ఆశయం. దానికి సాధనగా ఆసక్తిదాయకమైన పద్ధతినవలంభించాడు. మనుష్యులకు ఆసక్తి కలిగించటమే పాత్రికేయుల ధ్వేయమైతే అవినీతి మయమూ, అధర్మమూనైన విషయానికి కూడ ప్రచారం లభిస్తుంది. వ్యాసుడ్ని ఆదర్శంగా పెట్టుకుంటే పత్రికలు పరిశుభ్రమవుతాయి. దీనికి ప్రజలపై ప్రభావముంటుంది.
పద్దెనిమిది పురాణాలలో నాలుగు లక్షల ''గ్రంథాలు''న్నాయి ముఫై#్ఫ రెండు అక్షరాలు గల శ్లోకాన్ని ''గ్రంథ''మంటారు. వీటిలో దాదాపు లక్షశ్లోకాలు స్కాందపురాణంలోనే ఉన్నాయి. అంతకంటె పెద్ద పుస్తకం ప్రపంచంలోనే లేదేమో. మిగిలిన పదిహేడు పురాణాలలో, మూడు లక్షల గ్రంథాలున్నాయి. ఇవికాక లక్షశ్లోకాలున్న మహాభారతాన్ని కూడ వ్యాసుడు వ్రాశాడు.
ఒక్కొక్క పురాణం ఒక్కొక్క దేవతకి ప్రాధాన్యమిస్తుంది. పురాణాలని మూడు విభాగాలుగా చేయవచ్చు (1) వైష్ణవ ధర్మానికి సంబంధించినవి (2) శైవధర్మానికి సంబంధించినవి (3) శాక్తేయ ధర్మానికి సంబంధించినవి. ఈ విధంగా ఎందరో విభిన్న దేవతల గురించి తెల్పుతాయి పురాణాలు.
పద్దెనిమిది పురాణాలు ఇవి : (1) బ్రహ్మపురాణం (2) పద్మపురాణం (3) విష్ణు పురాణం (4) శివపురాణం (5) శ్రీ మద్భాగవతం (6) నారద పురాణం (7) మార్కండేయ పురాణం (8) అగ్ని పురాణం (9) భవిష్యద్పురాణం (10) బ్రహ్మవైవర్త పురాణం (11) లింగ పురాణం (12) వరాహ పురాణం (13) స్కాంద మహా పురాణం (14) వామన పురాణం (15) కూర్మ పురాణం (16) మత్స్య పురాణం (17) గరుడ పురాణం (18) బ్రహ్మాండ పురాణం.
ఈ పద్దెనిమిదింటిలో పది శైవ ధర్మానికి సంబంధించినవి. ఇప్పుడు మనం చెప్పుకునే కథలు చాలా మట్టుకు వీటిలో ఉంటాయి. చరిత్ర, ఉపాఖ్యానం, తత్త్వం, అన్నీ ఉన్నాయి వీటిలో.
విష్ణుసహస్రనామంపై తాను వ్రాసిన వ్యాఖ్యలో ఆదిశంకరుడు విష్ణుపురాణం నుండి ఎన్నో ఉదాహరణలిచ్చాడు. ఆ పురాణాన్ని రచించినది పరాశర మహర్షి - ఆయన వ్యాసమహర్షి తండ్రి. శ్రీ రామానుజుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతంలో విష్ణు పురాణానికి ప్రమాణగ్రంథంగా చాలా ప్రముఖమైన స్థానముంది.
రామానుజుల వారికి పూర్వం విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రముఖ ప్రవక్తలలో ఒకరు ఆళవందార్. వారిని రామానుజుల వారు కలిసి కొనేలోగానే కాలం చేశారు. మూడు ముఖ్యమైన పనులను రామానుజులకి అప్పగించాలని ఆళవందార్ అనుకొన్నారు - మూడు చేతివేళ్లు మడిచి యున్నట్లు ఆయన పోయిన తరువాత కనుగొన్నారు. ఆ మూడూ ఏమయియుంటాయో గ్రహించి ఒక్కొక్కదాని గురించీ రామానుజులు చెప్పినప్పుడు ఆ మూడు వేళ్లూ ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయట!
ఆ మూడు మౌన ఆదేశాలలో ఒకటి. విశిష్టాద్వైత సిద్ధాంతానుసారం బ్రహ్మసూత్రాలపై భాష్యం వ్రాయమని. రెండవది : తమిళంలో ఆళ్వారుల సూక్తులు (తిరువాయ్‌మొళి) పై భాష్యం వ్రాయించమని. మూడవది పరాశరవ్యాసుల ప్రశస్తిని దృఢపరచి వ్యాపింప చేయమని. విష్ణు పురాణకర్త కావటం వల్ల పరాశరునికి ఇంత ప్రాముఖ్య మిచ్చారు. దీనిని మనస్సులో ఉంచుకునే రామానుజుల వారు తమ ముఖ్య శిష్యుడైన ''కూరాత్తాళ్వార్'' యొక్క ఇద్దరు కుమారులకూ పరాశర భట్టారకుడనీ, వ్యాసభట్టారకుడనీ పేర్లు పెట్టారు. ఉత్తరోత్రా పరాశరభట్టారకుడు వైష్ణవ ఆచార్యులలో ఒకడైనాడు.
పరాశర మహర్షి విష్ణు పురాణాన్ని వ్రాసినా, ఇప్పుడు మనకి లభ్యమయే పద్దెనిమిది పురాణాలు వ్యాసుడు సంస్కరించినవే. వేదాలని కూడ ఆయన విభాగం చేశారు. వేదోక్తమైన విధులు మన మనస్సులలో బాగా నాటుకు పోవటానికి వీలుగా ఆయన పురాణాలను రచించాడు. పురాణాలను ఆయన రచించటానికి ఇంకొక కారణం కూడా ఉంది. వేదాలని అందరూ అధ్యయనం చేయరాదు. సామాన్యులకి వేదార్థం. తత్త్వం తెలియాలన్న ఉద్దేశంతోనే పురాణాలను ఆయన రచించాడంటారు.
వ్యాసుని తండ్రీ, పరాశరుడు విష్ణు పురాణాన్ని మొదట్లో వ్రాశాడు. వ్యాసుని తనయుడు శుకాచార్యుడు పరీక్షిన్మహారాజుకి శ్రీ మద్భాగవతాన్ని వినిపించాడు.
భాగవతం గురించి మాట్లాడేటప్పుడు భిన్నాభిప్రాయాలకు తావుంది. శ్రీ కృష్ణుని కథనుమాత్రమే కాక ఇతర విష్ణుఅవతారాలను గురించి కూడా చెప్పే పురాణమా లేక 'అంబ' యొక్క లీలలను వర్ణించే దేవీభాగవతమా అని. రెండు ఆదరణీయాలే. రెండూ మహోదాత్తమైన రచనలే. చైతన్యుడు, నింబార్కుడు, వల్లభాచార్యుడు విష్ణుభాగవతానికి వేదాలతో సమానమైన స్థానాన్ని యిచ్చి తమ సిద్ధాంతాన్ని బలపరచుతారు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరింపక పోయినా అద్వైతులు కూడ విష్ణుభాగవతాన్ని ఆకాశమంత ఎత్తుకి కొనిపోయి కొనియాడుతారు.
శివపురాణానికీ స్కాందపురాణానికీ భేదముంది. స్కాందపురాణంలో చాలా భాగం శివునికీ, శివలీలకీ ప్రాధాన్యముంది నాల్గవవంతు మాత్రమే స్కందుని గురించి యుంటుంది. అయినా స్కందునికి సంబంధించిన వివరాలన్నీ యుండటం వల్ల ఆ గ్రంథాన్ని స్కాందపురాణ మంటారు.
దుర్గ యొక్క కథ, 'దుర్గాసప్తశతి' - మార్కండేయ పురాణంలో ఉంటుంది.
శాంతి హోమం, శతచండి, సహస్ర చండి - ఈ క్రతువులను నిర్వహించేప్పుడు ఆ పురాణంలోని 700 మంత్రాలను ఉపయోగిస్తారు. ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క శ్లోకంలో ఉంటుంది. ఒక్కొక్క శ్లోకాన్నీ పఠిస్తూ ఒక్కొక్క హోమాన్నీ (నివేదననీ) అర్పిస్తారు.
''భవిష్య'' అంటే భావి కాలం, భవిష్యత్ పురాణంలో చాలా విషయాలున్నాయి. ఈ కలియుగంలో మనం చూచే అకార్యాల గురించి కూడా! ఈ పురాణంలో ఎప్పటి వారో అయిన మౌర్య వంశీయుల గురించే కాక ఇటీవల వచ్చిన పాశ్చాత్యుల గురించి కూడా చెప్పబడింది. కాని ఆధునికులు ఈ పురాణాన్ని కలియుగారంభంలో వ్యాసుడు వ్రాయనే లేదు - ఆయన పేరు మీరుగా ఇటీవల ఎవరో వ్రాశారని త్రోసి పారేస్తారు. అందులో కొన్ని చేర్పులున్నాయేమో - కాని మొత్తమంతా ఈ మధ్యదే అని త్రోసి పారేయరాదు. అతీంద్రియ శక్తులు కలవారు భవిష్యత్తుని గమనించగలరు. భూమిపై ఎక్కడో జరిగే వాటిని కూడ చూడగలరు. ఎవరు పడితేవారు వ్రాసి, ఆ కర్తృత్వం ఏ మహనీయునికో ఆపాదించి, ఆమోదయోగ్యం చేసుకోవటం అంత సులభం కాదు.
గరుడ పురాణం పితృలోకాల గురించీ, మనిషి గతించిన తరువాత ఆత్మ సంతృప్తికై జరుపవలసిన శ్రాద్ధకర్మాదుల గురించీ చెప్తుంది. ఆ కారణం చేతనే శ్రాద్ధ కర్మల తర్వాత, పితృకార్యాల తరువాత, గరుడపురాణాన్ని చదవటం పరిపాటి.
లలితో పాఖ్యానం (లలితాదేవి కథ), లలితా సహస్రనామం - బ్రహ్మాండ పురాణంలో ఉన్నాయి. దేవిని ఆరాధించేవారు, మిగిలిన పురాణాలన్నీ చదివిన తరువాత ఆఖరిగా చదువ వలసినదంటారు. ఇందులో రాజరాజేశ్వరి పట్టాభిషేకం వర్ణించబడి యుంది. ''అష్టోత్తరనామం'' ''సహస్రనామం'' ''కవచం'' అంటూ ప్రతి దేవత గురించీ పఠిస్తూంటాం - ఇవన్నీ పురాణాల లోనివే. కాని విష్ణు సహస్రనామం, శివసహస్రనామం మహాభారతంలోనివి.
ఎన్నో స్తోత్రాలు కీర్తనలూ పురాణాలలోనివే. 'ఆదిత్య హృదయం' మంత్రం శ్రీ మద్రామాయణం లోనిది. ప్రదోషస్తోత్రం స్కాంద పురాణం లోనిది. ఇట్లాగే అన్నీను.
ఉపపురాణాలూ, చిన్న చిన్న పురాణాలు :
పద్దెనిమిది పురాణాలకి తోడు పద్దెనిమిది ఉపపురాణాలున్నాయి. వీటిలోనివే వినాయకపురాణం, కల్కిపురాణమూను. పద్దెనిమిదే ఉన్నాయని అన్నా, నిజానికి అంతకంటె ఎక్కువే ఉన్నాయి. తులాపురాణం (ప్రతి మాసం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పేది), నాగపురాణం, వైశాఖపురాణం. పద్దెనిమిది పురాణాలలోనూ, ఉపపురాణాలలోనూ ఉన్నాయి. ప్రతి తీర్థస్థలానికీ ''స్థలపురాణ''మని ఒకటి ఉంటుంది ఇవి కూడా పైన చెప్పిన పురాణాలలోనివే కాని ఇవి వేర్వేరు గ్రంథాలుగా ఉంటాయి.
ఇతిహాసానికి పురాణానికీ భేదం :
విద్యావంతులకీ విద్యాహీనులకీ నేత్రాల వలె వారికి ధర్మ మార్గాన్ని చూపుతూ అనాదిగా వస్తున్నవి రామాయణ మహాభారతాలు. వీటిని పురాణాలలో చేర్చకుండా ఇంకా గౌరవప్రదమైన ''ఇతిహాస''మనే పదంతో సూచిస్తారు.
''పుర'' అంటే ప్రాచీనమైన అని అర్థం. ఆ ప్రాచీనమైన వాటి గురించి చెప్పేవి పురాణాలు. కొన్ని భవిష్యత్తు గురించి కూడా చెప్తాయనుకోండి!
పురాణాలన్న పదానికి పురాతనమైన వృత్తాంతాలను చెప్పేవే అనికాక, వాటి మూలంకూడ పురాతనమే నన్న అర్థం కూడ చెప్పుకోవచ్చు. ఆ రోజులలో సాహిత్య మంతా కవిత్వానికీ నాటకానికీ పరిమితమై యుండేది. వచనరూపంలో కథని చెప్పటం తరువాత ప్రారంభ##మైంది. నవ్యమైనది కావటం వల్ల దానిని 'నవల' (novel) అంటారు. దానిలో ప్రాచీన గ్రంథాలలో ఉండే కవిత్వమూ, నాటకమూ లేకపోవటం వల్లనే అది నవ్యం అయింది.
పురాణానికి అయిదు లక్షణాలు (పంచలక్షణ) ఉండాలి. ఇవి (1) సర్గ - సృష్ట్యాది అన్నమాట. (2) ప్రతిసర్గ - సృష్టి జరిగిన తరువాత కాలక్రమేణ ప్రపంచంలో వచ్చిన వికాసం (3) వంశ, అంటే, ఆ వంశ చరిత్ర - ఒక తరం నుండి వేరొక తరానికి రావటం (4) మన్వంతరం - మనవాళి అంతటికీ ఆద్యులైన మనువులు, వెయ్యి యుగక్రమాలు (ఒక్కొక్క యుగక్రమంలో నాలుగు యుగాలుంటాయి) వీటి చరిత్రా (5) వంశాను చరిత్ర - దేశపాలకుల వంశ చరిత్రలు అంటే సూర్య వంశము. చంద్రవంశము వంటి వివరాలు. ఇవి కాక అంతరిక్షం యొక్క వర్ణనా ఉండాలి. అంటే పురాణం చరిత్రగానే కాక భూగోళశాస్త్రంగా కూడా వ్యవహరిస్తుందన మాట.
ఇతిహాసం - ''ఇతి-హా-ఆసం'' అంటే ''ఈ విధంగా జరిగింది'' అని అర్థం. మధ్యలో ఉన్న ''హా'' అంటే నిజంగానే, నిస్సంశయంగానే అని అర్థం. ఇతిహాసంలో యదార్థ వృత్తాంతమే ఉంటుంది గాని ఊహాగానానికి తావు లేదు.
ఆ వృత్తాంతం జరిగిన కాలంలో వ్రాయించబడినదన్న మాట. రాముడు బ్రతికి యున్న రోజులలోనే వాల్మీకి రామాయణాన్ని రచించాడు. వ్యాసుడు పంచపాండవులతో బాటు మహాభారతంలో చెప్పబడిన సంఘటనలను స్వయంగా చూచాడు. పురాణం కాబట్టి ప్రాచీన విషయాల గురించి వ్రాసినా ఆయన తన దివ్యశక్తితో ఆయా వృత్తాంతాలను స్మరణకు తెచ్చికొని యుంటారు. అయినా ఆ కథనంలో వృత్తాంతాల యదార్థతని ఆయన సమకాలీనులు గ్రహింపలేక పోయి ఉండవచ్చు. కాని రామాయణ మహాభారతాలు ఆ కోవకి చెందవు. వాటిని ప్రచురించినప్పుడే అప్పటి వారికి వాటిలోని వ్యక్తులూ, వృత్తాంతాలూ తెలుసు. మన సందేహాలన్నీ నివృత్తి చేయటానికీ వాటిని ఇతిహాసాలన్నారు - 'హా' అన్న అక్షరం సత్యాన్ని స్థాపిస్తుంది.
ఇతిహాసాల వైభవం :
పురాణాలని వేదాలకి ఉపాంగాలంటారు. ఇతిహాసాలని వేదాలకి సమానమైన ఘనత కలవంటారు. మహాభారతాన్ని పంచమ వేద మంటారు (అయిదో వేదం) ఇక రామాయణమో వేదాల వల్లనే విదితమయే పురుషుడు దాశరధిగా జన్మమెత్తి నప్పుడు, వాదాలుకూడ వాల్మీకి బిడ్డవలె రామాయణ రూపంలో బయటపడ్డా యంటారు.
రామాయణ మహాభారత కథలు మన రక్తనాళాలలో ప్రవహిస్తున్నాయనవచ్చు.
ప్రతి పురాణంలోనూ పెద్దవీ, చిన్నవీ అనేక ఉపాఖ్యానాలుంటాయి. ప్రతి కథా ధర్మానికి సంబంధించిన ఒక అంశానికి ప్రాధాన్యమిస్తుంది. ఇతిహాసం ఆరంభం నుంచి చివరి వరకూ ఒకే కథ. మధ్య మధ్య వేరే కథలున్నా వాటికి కూడ మూల కథతో ఏదో సంబంధముంటుంది. పురాణాలలో ఒక్కొక్క ధర్మం గురించి ఒక్కొక్క కథ ఉంటే ఇతిహాసంలో మొత్తం ధర్మమంతా మూల కథలోనే నిక్షిప్తమయి యుంటుంది. ఉదాహరణకి - సత్యవ్రతాన్ని పాటించటమనే ధర్మాన్ని హరిశ్చంద్ర పురాణంలో ఒక ప్రత్యేకమైన కథ ద్వారా చెప్పబడి యుంది. దమయంతి వృత్తాంతం ద్వారా పాతివ్రత్యం యొక్క మహత్యం, రంతి దేవుని కథ ద్వారా త్యాగము, కరుణల ఉదాత్తతా చెప్పబడ్డాయి. రాముని జీవితానికీ, పంచపాండవుల జీవితానికీ సంబంధించిన ఇతిహాసాలు ఆ మహనీయులు ఎటువంటి క్లిష్ట సమయాలలో ధర్మవర్తనులైనారో, ధర్మాన్ని ఎట్లా వీడలేదో, పరిరక్షించారో చెప్తాయి.
దేవతలలో విభేదాలెందుకు ?
ఒక్కొక్క పురాణం ఒక్కొక్క దేవతని స్తుతిస్తుందన్నప్పుడు ఒక సందేహం కలుగ వచ్చు. శైవ పురాణాలలో శివుడే పరమాత్మతత్వమని ఉంటుంది. అంటే ఆయనే పరమాత్ముడని. సృష్టిస్థితిలయకారుడన్నమాట. విష్ణువు ఆయన ఆజ్ఞాను వర్తి అవుతాడు. విష్ణువు భోగి, మాయలో పడిపోయినవాడు. శివుడొక్కడే యోగి. ఆయన జ్ఞానస్వరూపుడు. శివునికి విధేయుడు విష్ణువు. ఆయనని ఆరాధిస్తాడు కూడా. కొన్ని సందర్భాలలో ఆయన శివుడ్ని ధిక్కరించి, చివరికి ఓడి, లొండి పోయాడని చెప్పే వృత్తాంతాలు కూడా ఉన్నాయి. వైష్ణవపురాణాలని చదివితే దీనికి విరుద్ధంగా ఉంటుంది. శివుడే విష్ణునికి విధేయుడు అనీ విష్ణునిచే పరాజితుడనీ చెప్పే వృత్తాంతాలుంటాయి. వైష్ణవులు ''భూతాలతో గణాలతో సంచరిస్తూ శ్మశానంలో ఉండే శివుడు పరమాత్ముడెట్లా అవుతాడు - ఆయన రాజాధిరాజైన వైకుంఠవాసికే దాసుడు'' అంటారు.
ఈ గొప్పల గురించిన వాదనలు శివకేశవులకే పరిమితం కాదు. ప్రతి పురాణమూ ఒక్కొక్క దేవత యొక్క గొప్ప దనాన్ని చాటుతుంది. ఆ దేవతే పరమాత్మ అనీ మిగిలిన దేవతలందరూ విధేయులనీ చాటుతుంది. మిగిలిన దేవతలంతా ఆ దేవతని ఆరాధిస్తారనీ. ధిక్కరించిన వారు అణచి వేయ బడ్డారని చెప్తుంది ప్రతి పురాణమూను.
ఈ పరస్పర విరుద్ధాలైన కథలని వింటే అయోమయ స్థితిలో పడవచ్చు ఎవరైనా. ఇందులో ఏది సత్యం? ఏది అసత్యం? అన్నీ నిజాలు కాలేవు కదా! శివుడు కేశవుని ఆరాధిస్తాడంటే. కేశవుడు శివుని ఆరాధిస్తాడనటం అసందర్భం కదా? అసత్యమే కదా? అంబ త్రిమూర్తుల కంటె గొప్ప దన్నప్పుడు ఆమెను శివుని అర్థాంగిగా చెప్పి, విధేయురాలై పతిని అనుసరించే దేవత అని చెప్పటం. అపరాధం కదా? కాబట్టి అన్ని పురాణాలూ నిజాలు కావు, సాధికారకం కావు. అయితే ఏది సరియైనది? లేకపోతే అన్నీ అబద్ధాలేనా? ఇటువంటి సందేహాలు మనని వేధిస్తాయి. తార్కికంగా చూస్తే ఈ స్పర్థలన్నీ నిజంకాకపోయినా, వాస్తవమదే. ఒక సారి పరాజితుడైన దేవత మరొక సారి విజేతగా కనబడుతాడు. ఒక సారి ఆరాధింపబడే దేవత మరొకసారి ఆరాధన చేస్తాడు.
ఇదంతా ఎందుకిట్లా ఉండాలి?
సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మ ఒక్కడే ఉన్నాడు - ఆయనే అన్ని రూపాలలోనూ దర్శనమిస్తాడు. ఎందుచేత? సామాన్య జీవితం ఆసక్తి దాయకమూ సార్థకమూ చేయటానికి! అందరూ ఒకే మూసలో ఉండేట్టు సృష్టించక భగవంతుడు మానవులకి విభిన్నమైన సమర్థలనీ, దృక్పథాలనీ కల్పించాడు ఆయా మానసిక ప్రవృత్తులను బట్టి ఆరాధించుకోవటానికి వీలుగా భగవంతుడు తగిన రూపాలని ధరిస్తాడు. ఎందరో దేవతలుగా పరమాత్ముడు దర్శన మీయటానికి కారణమిదే.
ప్రతి వారికీ తమ ఇష్టదైవంపై అచంచలమైన విశ్వాసముండాలి. ఆ దేవతే పరదేవత అనీ, దైవమనీ నమ్మాలి. అందువల్లే ప్రతి రూపంలోనూ భగవంతుడు మిగిలిన వారి కంటె అధికుడుగా దర్శనమిస్తాడు. మిగిలిన దేవతలు ఆ దేవతని ఆరాధిస్తూ, ఆ దేవతకి దాసుల వలె గోచరిస్తారు.
ఒకోసారి ఒకో దేవత అన్యులని పూజిస్తూ, మరొక సారి అన్యులచే పూచింపబడుతూ. ఒకోసారి యితరులను పరాజితులను చేస్తూ, మరొకసారి ఇతరులచే పరాజితుడవుతూ కనబడే పొంతన లేని ఈ వ్యవహారానికి ఇది సమాధానం కదా?
శైవపురాణాలన్నీ శివుని ఆధిక్యతను చూపే కథల సంకలనాలే. విష్ణుపురాణాలన్నీ విష్ణుని పొగడే వృత్తాంతాల సంకలనాలే. ఇతర పురాణాలూ ఇట్లాంటివే.
ఏ దేవతనీ కించె పరచటం లక్ష్యం కాదు. ఎవరికిష్టమైన దేవతని వారికి ఉన్నతునిగా చూపించి భక్తునికి ఆ పరమాత్మ స్వరూపంపై భక్తిని అధికం చేయటమే ఉద్దేశం. దీనినే అనన్య భక్తి అంటారు. ఆ దేవతని గొప్పవానిగా చూపించటమే లక్ష్యంగాని, ఇతరులని తక్కువ చేయటం కాదు. దీనినే ''నహి నిందా న్యాయ'' మంటారు.
జగత్తంతా పరమాత్ముని విభిన్నరూపములే అని భావించే వారికి 'అనన్యభక్తి' అవసరం లేదు. ఒక దేవత నుండి మరొక దేవత వైపు మళ్లటమనేది, ఒక దేవత మరొకనికి భిన్నుడన్న తలంపున్నప్పుడే సాధ్యం. అందరూ ఒకే పరమాత్ముని రూపాలని గ్రహిస్తే పురాణాలన్నీ విభిన్న రూపధారియైన ఆ పరమాత్ముని లీలలే అని తెలుస్తుంది. ఎవరి ప్రకృతికి తగినట్లు వారికి సంతృప్తిని కలిగించటమే ఈ విభిన్నమూర్తుల లక్ష్యమని అర్థం చేసుకుంటే, పైకి కనబడే ఆ పరస్పర వైరుధ్యాలను ఆస్వాదించటమే కాక భక్తిని కూడ పెంపొందించుకోవటం సాధ్యం.
దీనికింకొక కారణం కూడా ఉంది. అది ప్రజలకు ఆదర్శమేర్పర్చటం. ప్రపంచంలో పవిత్రత ఉండాలి. ఆ కారణం చేతనే అంబ తన వర్తన వల్ల ఆదర్శ ప్రాయమవాలి. ఆమె పరాశ##క్తే అయినా, భర్తకి విధేయురాలై యుండాలి. ప్రపంచంలో భక్తి ఉండాలి - దానికి భగవంతుడే ఆదర్శప్రాయుడవాలి. అందువల్లనే కొన్ని కథలలో విష్ణువు శివునికి భక్తుడవుతాడు. మరికొన్ని సందర్భాలలో శివుడు విష్ణువుని ఆరాధిస్తాడు. ఒకోసారి ఒక దేవతని పొగుడుతూ మరొకసారి మరొక దేవతని పొగుడుతూ కనబడే పౌరాణిక గాధలు ఆయా దేవతల పట్ల మన భక్తిని అధికం చేయటానికే ఉద్దేశింపబడ్డాయి. ఏ దేవతనైనా తక్కువగా చూడటం ఆ దేవతని అవమాన పరచటం గాని, విమర్శించటం గాని కానే కాదు. మరొక దేవతపై కేంద్రీకరించి భక్తులకి ఆ రూపంపై భక్తిని పెంచటమే లక్ష్యం.
అనేక రూపాలలో ఒకడు :
ఒకే ఒక పరమాత్మ విభిన్న దేవతలుగా కనబడుతాడు. ఒక్కొక్క భక్తుడు భగవంతుని ఒక్కొక్క రూపానికి అంకిత మవుతాడు. భక్తుని భక్తిని అధికం చేయటానికి పరమాత్ముడు ఆ దేవత యొక్క లక్షణాన్నే ఎక్కువ చేసి, ఇతర లక్షణాలను అణచి ఉంచుతాడు. పూర్వం వీధులలో లాంతర్లుండేవి. దీపం చుట్టూ నాలుగు గాజు పలకలుండేవి. కొన్నింటికి మూడే పలకలుండేవి. దీపపు కాంతి మూడు వైపులా విరజిమ్మేది. ఒక్కొక్కసారి ఆ మూడు పలకలకూ మూడు రంగులు వేసేవారు అలంకారానికై. తత్ఫలితంగా ఒక్కొక్కగాజు పలక ద్వారా వచ్చే కాంతి ఒక్కొక్క రంగులో ఉండేది. ఒకే పరమాత్మ సృష్టి స్థితిలయాలకు కారణం. చైతన్యమే (శుద్ధజ్ఞానమే) అన్నిటికీ మూలం. ఆ చైతన్యమే మూడు పార్శ్వాలు కల లాంతరులో ఉన్నదనుకోండి. మూడు రంగులలో ఒకటి ఎరుపు. అదే సృష్టి. స్పెక్ట్రాస్కోప్‌లో (Spectroscope) ఎరుపు రంగుని మాత్రమే మొత్తం కాంతి నుంచి విడతీస్తే మిగిలినవి కూడ విరిగిపోతాయి. సృష్టి అనేక మవటమంటే యిదే. ఆ కారణం చేతనే సృష్టి కర్త అయిన బ్రహ్మది ఎరుపు వర్ణమంటారు. లాంతరులో ఇంకొక రంగు ఊదా. స్పెక్ట్రమ్ (రూపం)లో ఇది ఆఖరి రంగు. మొదటిది ఎరుపు, చివరిది నీలం. సృష్టింపబడిన జగత్తుని సంస్థితం చేసేటప్పుడు విష్ణువు జ్ఞానంతో ఇట్లా చెప్తున్నట్లుంటుంది. ''ఈ జగత్తు మిథ్య, దీనిని పరమాత్మతో సమానమనుకోకూడదు. ఇదంతా పరమాత్ముని లీల''. ఆ జ్ఞానజ్యోతిలో దృశ్యమానమైన జగత్తంతా దగ్ధమైపోతుంది - కాలిన బొగ్గువలె అయిపోతుంది. వస్తువు తగలబడిపోయినా రూపమాత్రావశిష్టమై ఉండే దశ అది - అదే, వస్తువు ఇంకా ఉన్నట్లు భ్రమ కల్పిస్తుంది. రూపమైతే ఉండవచ్చు, కాని రంగు పోతుంది! జగత్తు ఉండవచ్చు కాని అది సత్యమన్న భ్రమపోతుంది. (కాలిన బొగ్గు వలె నల్లగా అయిపోతుంది) ''సర్వం విష్ణుమయం జగత్'' అంతా నీలి రంగు గల విష్ణువే (శ్యామలం) నీలమేఘశ్యామల - నీలం, నలుపు, ఊదా - అన్నీ మూడు పలకలు గల లాంతరు వలె రూపాన్ని ధరిస్తాడు. నీలిరంగు అద్దం నుండి బయటకు వచ్చే కాంతిని ''విష్ణు'' వంటాము.
మూడవ పలకకి ఏ రంగూ లేదు : అంతా జ్ఞానమనే జ్వాలలో దగ్ధమైతే - మొదట బొగ్గు వలె నల్లగా అవుతుంది. ఇంకా అగ్నికి గురియైతే అది బూడిద అవుతుంది. అస్తికగా మారుతుంది. ఇది కూడ దగ్ధమై, అసలు రూపాన్నే కోల్పోతుంది. మొదట్లో ఉన్న నల్లరంగు పోయి అంతా తెలుపవుతుంది.
తెలుపు కూడ స్వచ్ఛమైన కాంతే. పరమాత్ముని నుండి వచ్చిన అన్ని రంగులూ అస్తిత్వాన్ని కోల్పోయి మళ్లీ పరమాత్మే అవుతాయి. ప్రత్యేకపుటునికి, భ్రమకొల్పే ఉనికి, పోతుంది. ఇదే మహాభస్మం. ఇదే పరమేశ్వరుడు. పైకి చాలా కౄరమైన కార్యంగా తోస్తుంది సంహారం. కాని దీనితోనే ఆగడు శివుడు. ఆపని జగత్తుకి తన మూలంతో సంధానం కలిగించే కరుణామయ కార్యమే. తన లీలలో దృశ్యమానమైన జగత్తుకి జ్ఞానం కలిగించినప్పుడు ''జగత్సర్వం'' ప్రేక్షకునికి బొగ్గువలె కనబడింది. అందువల్లే ''సర్వం విష్ణుమయం జగత్'' అన్న వర్ణన వచ్చింది. లీలముగిసిన తరువాత, పరమజ్ఞానం వల్ల సంహారమైనప్పుడు 'జగత్సర్వం' లేదు. అందు వల్లే అంతా 'శివమయ'మంటాం.
ఒకే లాంతరు - బ్రహ్మ చైతన్యం - ఎరుపుగాజులోంచి చూచినప్పుడు బ్రహ్మగా (సృష్టికర్తగా) నీలపు గాజు ద్వారా చూచినప్పుడు విష్ణువుగా, ఏ రంగూలేని గాజుపలక ద్వారా చూచినప్పుడు శివునిగా కనబడుతుంది.
''ఒకే మూర్తి త్రిమూర్తులుగా కనబడే'' వానిగా పరమాత్ముని ఋషులు కొనియాడారు. ఏ సిద్ధాంతానికీ కట్టుబడకుండా విశాలదృక్పధాన్ని అలవరచుకొన్న కవులందరూ పరమాత్మని త్రిమూర్త్యాత్మకంగానే వర్ణించారు.
ఇంగ్లీషు వాళ్లు కూడ జెహోవా, జవ్, ప్రభువుగా పేర్కొనటం ఈ సామరస్యధోరణిలోనే. జెహోవా - బైబిలు వచ్చేముందు ఇజ్రయిల్‌లో ఉండే జాతులకు దేవుడు. గ్రీసు ప్రాంతాల వారి దైవం జవ్. ''ప్రభువు'' అన్నది భగవంతుని సూచించే సాధారణ నామవాచకం. క్రైస్తవమతావలంబులైన ''ప్రభుసేవకులు'' కూడ ఎన్ని పేర్లతో పిలిచినా ఉన్నది ఒకే దేవుడనే.
వినయంతో, గౌరవంతో, సత్ఫలాపేక్షతో పురాణాలని చదివితే ఏ విధమైన అయోమయమూ కలగదు. మన మేలు కొరకే అవి ఉన్నాయన్న జ్ఞానం మనకి కలుగుగాక! పరమసత్యానికి కొంచెం భిన్నంగా ఏదన్నా ఉన్నా, అది కూడ మన మేలు కోరే అని మనం గ్రహించాలి.
కావ్యం - కవిత్వం :
ఒక మంచి పని చేయటానికి మూడు మార్గాలున్నాయి - ఒకటి ప్రభువు వలె శాసనం చెయ్యటం దీనిని ''ప్రభుసమ్మితి'' అంటారు. అంటే, సేవకుడ్ని యజమాని ఆదేశించటం. తనకి యిష్టమున్నా లేకపోయినా సేవకుడు ఆదేశాన్ని పాటించాలి లేకపోతే, శిక్షింపబడ్తాడు. అధికారయుతంగా కాక ఒక పనిని చేయమని స్నేహపురస్సరంగా మనని ఎవరైనా అడిగితే ఆ పనిని వెంటనే చేసేస్తాం. ఇక్కడ, శిక్షింపబడుతామన్న, భయంలేదు. సుహృద్భావమూ, ఆపేక్షా ఉన్నాయి. స్నేహితుడుగా అతడు మనకి మంచే చేస్తాడన్న భావంతో చేస్తాం. స్నేహపూర్వకంగా ఒక పనిని చేయమనటం. ''సుహృత్ - సమ్మితి'' అవుతుంది. ఈ రెంటికన్నా ఫలితాన్ని ఇంకా తేలికగా యిచ్చేది ప్రేమాస్పదుని, (అంటే భార్యవంటి వ్యక్తి) వినతి. ప్రభువు యొక్క ఆదేశం కష్టమైతే, అదే స్నేహితుని వద్దనుండి వచ్చినది తేలిక అవుతుంది. ప్రియతముని వద్ద నుండి వచ్చినది ఇంకా తేలిక అవుతుంది. అది కాంతాసమ్మితి (కాంత అంటే భార్య).
వేదాలు ప్రభు సమ్మితాలు, పురాణాలు సుహృత్ సమ్మితాలు, కావ్యాలు కాంతాసమ్మితాలు - ఇదీ గాధ.
''ఇట్లా చేయి, అట్లా చెయ్యి'' అని మాత్రమే వేదాలంటాయి. ఎందువల్లనో చెప్పవు. పురాణాలు, ఇట్లా చేస్తే ఈ విధంగా మేలుకలుగుతుంది. అట్లా చేస్తే హాని కలుగుతుంది'' అని చెప్తాయి. ఏ పనినైనా ఒక విధంగా ఎందుకు చెయ్యాలో కథల ద్వారా చెప్తాయి. కేవలం కారణాలని చెప్పటమే పురాణాల లక్షణం కాదు. ఆసక్తి దాయకమైన కథల రూపంలో సందేశాన్ని అందజేయటమే పురాణాల ధ్యేయం.
కావ్యమేమి చేస్తుంది? కవి ఏమి చేస్తాడు? యదార్థ కథలకు తన సృజనాశక్తిని జోడిస్తాడు. తన భావనతో కథలను కల్పిస్తాడు. కొన్ని విషయాలను పదే పదే చెప్తాడు. ఇది కవికి గల స్వేచ్ఛ. అతి చిన్న విషయానికి అలంకారం చేసి అందరికీ ఆకర్షణీయంగా, ఆమోదయోగ్యంగా చేస్తాడు. ఉన్న విషయాన్ని స్నేహితుని వలె సూటిగా చెప్పి ఊరుకోకుండా, కవి ప్రీతి పాత్రురాలైన భార్య వలె ప్రవర్తిస్తాడు. మొండిగా ఉన్న భర్తని తన వైపు త్రిప్పుకొని తన మాటని నెగ్గించుకోవటానికి భార్య బ్రతిమాలు తుంది, బుజ్జగిస్తుంది, ప్రాధేయపడుతుంది. కావ్యం భార్యవలె, వేదం యజమాని వలె, నడచుకుంటే నడుమ పురాణాలు స్నేహితుని వలె వ్యవహరిస్తాయి. మన మనస్సులలో ధర్మాన్ని ప్రతిష్ఠించటమే వాటి లక్ష్యం.
* * *