Acharyavaani - Vedamulu Chapters Last Page
25. ఉపాంగములు : ధర్మశాస్త్రము
పురాణాల లక్ష్యాన్ని చేరుకోవటానికి మార్గం :
పురాణాలలోని వ్యక్తులు మనకి ఆదర్శప్రాయులనీ, మార్గదర్శకులనీ గ్రహించాం. వారి కథలను విన్న తరువాత వారి గొప్ప లక్షణాలనే అలవర్చుకొని అనుసరించాలని మనకీ అనిపిస్తుంది. అటువంటి కోర్కె కలిగినా, ఆ విధంగా అన్ని పరిస్థితులలోనూ నడుచుకోవటం కష్టమనిపిస్తుంది. ఏదో ఒకటి ఎప్పుడూ చేస్తూండటం మనిషి లక్షణం. మనస్సుని ఒక్క క్షణమైనా నిశ్చలంగా ఉంచటమసంభవం.
''నహికశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్'' ''ప్రపంచమున ఎవడునూ ఒక్క క్షణకాలమైనను కర్మ (ఏదోకపని) చేయక నిశ్చలముగ యుండలేడు.'' కనుక ఏ పనినైనా సవ్యంగా ఎట్లా చేయాలో నేర్చుకోవాలి. ఆ విధంగా మనసుని పరిశుద్ధ పరచుకొని, మంచి శీలాన్ని, నడవడినీ అలవర్చుకొని, త్రిగుణాలనీ అతిక్రమించి జ్ఞానియై బ్రహ్మంలో ఐక్యమవాలి.
మన ధర్మాన్ని తు.చ. తప్పకుండా పాటించి, మన పాపాలను పోగొట్టుకుని, చిత్తాన్ని శుభ్రపరచుకొని, పునర్జన్మ అంటూ లేని మోక్షాన్ని పొందాలంటే మనమేమి చెయ్యాలి? అసలు మన పుట్టుకే పాపం వల్ల - దీనిని క్షాళనం చేసుకోవాలి. కొత్తగా పాపాలు చేయకూడదు. మనస్సునీ త్రిగుణాలనీ ఉదాత్తం చేసుకోవాలి, పాపాన్ని చేయకుండా ఉండటానికి. మతానికి గల ప్రయోజనమిదే. మన మతం ప్రకారం మనమేమి చేయాలి?
ప్రస్తుతం అందరికీ సాధారణంగా రామాయణ, భాగవతాలు, కొన్ని పురాణాలు తెలుసు. ఆయా కాలాలలో స్థలాలలో వ్యక్తులు ఎటువంటి ధర్మనియమాలకి కట్టుబడేవారో వీటి నుండి తెలుస్తుంది. ఈ నియమాలన్నీ ఒక చోట క్రోడీకరింపబడి లేవు. అవి అక్కడా, ఇక్కడా ఉన్నాయి. పురాణాలలోగాని, ఇతిహాసాలలో గాని ఈ నియమాలను పాటించే విధమేమిటో చెప్పబడలేదు. ఆ నియమాలను తెలిసి ఉన్నంత మాత్రాన మనం వాటిని ఆచరించలేం.
పురాణాలకూ, ఇతిహాసాలకూ ''భక్తి'' మూలం. అయితే రోజంతా పూజతోనో, ధ్యానంతోనో, స్తోత్రంతోనో గడపగలమా? ఇది కుదరదు. కుటుంబంపట్ల మన ధర్మాన్ని నిర్వర్తించాలి. మనం తినాలి, స్నానమాడాలి, ఇంకా ఇతర వ్యక్తిగత, భౌతిక అవసరాలను తీర్చుకోవాలి. మిగిలిన కాలాన్ని పూజకై వినియోగించటం కూడా సాధ్యం కాదు. విసుగు జనిస్తుంది. కాబట్టి, సత్కార్యాలను చేయటానికి మనకి వేరే నిర్దేశాలూ, సూచనలూ కావాలి. ఇవి ఎక్కడ లభ్యమవుతాయి? ధర్మశాస్త్రాల నుండే. పధ్నాలుగు విద్యలలోనూ ఆఖరిది - పురాణాల తరువాతది - ధర్మశాస్త్రం.
పురాణపురుషులు మనకి గమ్యాన్ని సూచిస్తారు. ఆ గమ్యాన్ని చేరటానికి కర్మానుష్ఠానంతో ప్రారంభించాలి. మన నిత్యజీవితమెట్లా గడపాలో ధర్మశాస్త్రాలు ఉపదేశిస్తాయి. ఎన్నో చోట్ల మన విధులను వేదాలు వివరించాయి - వాటి నన్నిటినీ ఒక క్రమంలో పెట్టి, వాటికి వివరణ యిచ్చేవి, ఉపాంగాలు. ఇంటి పనులు, స్వంతపనులు, స్నానమాడటం, ఆహారం తీసుకోవటం - ఇవన్నీ శాస్త్రాలు చెప్పినట్టు చెయ్యాలి.
ఆత్మోన్నతికీ, ఆత్మసాక్షాత్కారానికీ దోహదమయ్యే రీతిలో మన వ్యాపకాలనన్నిటినీ నిర్దేశించింది వేద ధర్మం. మన నిత్యకృత్యాలనన్నిటినీ మతంతో ముడి పెట్టింది. ఒక విధంగా పడుకుంటే మూర్తిమత్వమినుమడిస్తుంది. ఒక విధంగా బట్టలు వేసుకుంటే మంచి జీవితం గడపటానికి ఉపకరిస్తుంది. ఒక విధంగా యింటి నిర్మాణముంటే వైదిక కర్మలను నెరవేర్చటానికి ఉపయోగిస్తుంది. లౌకిక జీవితం వేరు, ధార్మిక జీవితం వేరు అంటూ ధర్మశాస్త్రాలు విడదీయలేదు. ఏపని చేసినా అది ధర్మబద్ధమే, ఆత్మోన్నతికి దోహదకారే. లౌకిక నియమాలు, ధార్మిక నియమాలూ వ్యక్తి తన కోసం, తన ఉన్నతికోసం ఎట్లా అవిభక్తంగా ఆచరించాలో అభిన్నంగా చూపబడ్డాయి.
పురాణాలలో ఉన్న భ##క్తే వేదాలలో కూడ ఉంది. కాని దానితో బాటు ఎన్నో కర్మలు కూడ ఉన్నాయి. భక్తి కార్యరూపం దాల్చేప్పుడు పూజ జరుపుతాం - ఆ పూజవిధానానికి సంబంధించిన నియమాలెన్నో ఉన్నాయి పూజతో బాటు యజ్ఞాలు, శ్రాద్ధం, తర్పణం - ఇవన్నీ వైదిక ధర్మంలోని భాగాలే. ఇవన్నీ వేదాలలో ఉన్నాయి నిజమే. కాని అన్నీ ఒకచోట క్రోడీకరింపబడి లేవు. అంతేకాదు, ప్రతికర్మనూ ఎట్లా నిర్వహించాలో వివరణలు కూడలేవు.
''వేదో `ò ఖిలో ధర్మమూల''మంటాడు మనువు. అంటే, ధర్మాలకి మూలం వేదమని అర్థం.
వ్యక్తియొక్క ముక్తికే కాక లోకకల్యాణానికి కూడ ఉపకరించేట్టే వేదాలు విధులను ఏర్పర్చినా, ఈ రెండు ప్రయోజనాలూ సాధించేది ధర్మమే. అయినా ఎక్కడా నిర్దుష్టమైన, వివరణాత్మకమైన ఆచరణ క్రమం చెప్పబడలేదు. అంతేకాదు, వేదభాష సులభంగా అర్థం కాదు కూడా.
అటువంటి వేదాల నుండి ''కల్ప''మనే వేదాంగం, కర్మల పట్టికని సూత్ర రూపంలో తయారు చేసింది. ఇవి ఎంతో క్లుప్తంగా ఉంటాయి. వివరాలతో కూడిన మార్గ దర్శకాలు కావు. వీటికి పూర్తిగా వివరణలనిచ్చి, ఏ సందేహమూ మిగులకుండా చేసేవి ధర్మశాస్త్రాలే!
ధర్మసూత్రాలు (ఆపస్తంభునివి, గౌతమునివి, ఇతరులవి) సూత్ర నియమమనుసరించి అతిక్లుప్తంగా ఉంటాయి. సూత్రమంటే అట్లాగే ఉండాలి. ధర్మశాస్త్రాలు - మనువు, యాజ్ఞవల్య్కుడు, పరాశరుడు - రచించిన స్మృతులు శ్లోకాల రూపంలో ఉంటాయి.
కాని వీటన్నిటికీ ఒకే ప్రమాణముంది - అవి వేదాలు. మన మేమి చేయాలో, ఎట్లా చేయాలో వేదాలలో ఉంది. మనం వాటిని నిస్సంకోచంగా పాటించాలి. కల్పంలో కొంత క్రోడీకరింపబడిన వేద విహితమైన విధులను విశ్లేషించి చెప్పటం ధర్మశాస్త్రాల ప్రయోజనం. కల్పంలో యజ్ఞభూమి, యింటి నిర్మాణం వంటి విషయాల గురించి ఎక్కువగా చెప్పబడితే, ధర్మ శాస్త్రంలో మనిషి వర్తనానికి సంబంధించిన అన్ని విషయాల గురించీ చెప్పబడింది.
''నేనీ పనిని చేయదల్చుకొన్నాను. కాని ఈ పని మంచిదో కాదో తెలుసుకోవాలంటే వేదాలలో ఎక్కడ వెతకాలో నాకు తెలియదు. వేదాలు అనంతంగా ఉన్నాయి. అందువల్లనే ఎక్కడ చూడాలో ఈ పనినెట్లా చెయ్యాలో తెలియటం లేదు: అన్ని వేదాలను క్షుణ్ణంగా ఎరిగిన వారెవ్వరూ నాకు కనబడటం లేదు'' ఇవి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు.
వేదాలనబడే మహాసముద్రంలో మనకి కావలసిన వాటిని వెతుక్కోవటం అసాధ్యమే.
''ఈ కార్యమెట్లా చెయ్యాలో వేదాలు చెప్తే - తప్పకుండా ఆ విధంగా చేస్తాను. కాని అది లేనప్పుడు ఏం చెయ్యాలి?''
వీటికి మనువు సమాధానమిది. ''సరే నేను చెప్తాను వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన గురువులు స్మృతులను రచించారు. వారేమి రచించారో తెలుసుకో. స్మృతి ధర్మశాస్త్రమే''.
'స్మృతి' అంటే జ్ఞాపకం, 'విస్మృతి' అంటే జ్ఞాపకం లేకపోవటం. స్మృతులు వేదాలను జ్ఞాపకముంచు కోవటానికి సాధనాలు. వేదాలను క్షుణ్ణంగా ఎరిగిన మహర్షులు ఆదేశాలను (ధర్మాన్ని) కర్మలను (వాటిని ఆచరించే విధానాలను) కూర్చి ఒక క్రమంలో అమర్చారు. అందరికీ తేలికగా అర్థమయ్యే భాషలో స్మృతులను రచించారు. వాటిని చూస్తే - ఏమి చేయతగునో, ఏమి చేయకూడదో, ఏ విధంగా చేయాలో తెలుస్తుంది - అంటాడు మనువు.
ఆరవ వేదాంగమైన ''కల్ప'' వేదంలోని ఆదేశాలను ఎట్లా పాటించాలో చెప్తుంది. గృహ్యసూత్రాలు గృహంలో చేయవలసిన కర్మలను వర్ణిస్తాయి. శ్రౌతసూత్రాలు - అశ్వమేధం వంటి యాగాల నిర్వహణను చర్చిస్తాయి. ధర్మ సూత్రాలు - వ్యక్తిగత, సామాజిక విధులను ఆయా వర్ణాల వారు, జీవితంలో వారివారి దశలను బట్టి అనుసరించవలసిన వాటిని చెప్తాయి.
జీవుడు తల్లి గర్భంలో ప్రవేశంచినప్పటినుండీ - పుట్టుక, పెంపు, వివాహం, గార్హస్థ్యం ఆఖరికి దహనం - వరకూ ఏమేమి చెయ్యాలో వివరంగా చెప్తాయి స్మృతులు. అంతేకాక, నిద్దుర మేల్కొన్నప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి ఏమేమి చెయ్యాలో కూడ చెప్తాయి. ఆయా విషయాలకి సంబంధించి 16 ముఖ్యమైన సంస్కారాలున్నాయి.
స్మృతులూ వాటి అనుబంధ గ్రంథాలు :
మనువు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు, గౌతముడు, హరితుడు, యముడు, విష్ణువు, శంకుడు, లిఖితుడు, బృహస్పతి, దక్షుడు, అంగీరసుడు, ప్రచేతసుడు, సంవర్తుడు, అసనసుడు, అత్రి, ఆపస్తంభుడు, శతపుడు - ఈ పద్దెనిమిది మహర్షులు తమ అలౌకిక శక్తితో అన్ని వేదాలలోని విషయాన్నీ గ్రహించి ధర్మశాస్త్ర రూపంలో వాటి సంకలనాలని మనకి యిచ్చారు. వీటినే మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి - ఇత్యాదిగా ఆయా ఋషుల పేర్ల మీద సూచిస్తారు. వాటిని చదివితే చాలు - అన్ని అనుష్ఠానాలూ, ధర్మాలూ తెలుస్తాయి. పద్దెనిమిది స్మృతులకు తోడు పద్దెనిమిది అనుబంధ ఉపస్మృతులు కూడ ఉన్నాయి.
శ్రీ మద్భగవద్గీతని కూడ స్మృతిగా పరిగణించటం పరిపాటి. వేదాలలోని పదాలు అందులో ఉల్లేఖింపబడక పోయినా, మన ధర్మానికి ప్రమాణమైన గ్రంథమవటం వల్ల స్మృతిగా స్థానముంది.
ఎన్నో స్మృతులుండటం వల్ల ఒక దానిలో ఉన్నది వేరొక దానిలో ఉండక పోవచ్చు. కొన్ని సందర్భాలలో వాటిలో కొన్ని మార్పులు కూడా ఉండవచ్చు. అందువల్ల కొంత సందేహమూ కలుగవచ్చు. అటువంటి సందేహాలని నివృత్తి చేయటానికి ధర్మశాస్త్ర నిబంధనలున్నాయి.
కొన్ని స్మృతులు కొంత వరకే చెప్పి ఊరకుంటాయి. పూర్తిగా నియమాలను చెప్పవు. కొన్నింటిలో ''సంధ్యావందన'' ప్రసక్తే ఉండదు. విధిగా చేసే దీని గురించి వేరే చెప్పటమనవసరమనో, ఒక తరం వేరొక తరానికి సాంప్రదాయకంగా వస్తూనే ఉన్నదన్న భావం వల్లనో! శ్రాద్ధానికి సంబంధించిన ఆదేశాలు కొన్నింటిలో ఉండవు, కొన్నింట శౌచానికి సంబంధించినవి ఉండవు. ''ఈ విధంగా భుజించు. ఈ విధంగా ఊపిరి పీల్చు'' - ఇవన్నీ లిఖితపూర్వకమైన ఆదేశాలుగా ఉండనక్కరలేదు.
స్మృతులను రచించినవారు ఈ విషయాలని ఆ విధంగా ఉపేక్షించి యుంటారు.
'తెలిసిందే కదా' అంటూ ఏ విషయాన్నీ విడువకుండా 'నిబంధన గ్రంథం' అన్ని విషయాలనీ ప్రస్తావిస్తుంది. స్మృతులలో కొద్దిపాటి తేడాలుంటే వాటిని సమన్వయపరచి సరియైన దేదో నిర్దుష్టంగా ఈ గ్రంథం చెప్పుతుంది. ఈ నిబంధనలను రచించిన మహనీయులు స్మృతులనన్నిటినీ అధ్యయనం చేసి వాటిలోని తేడాలని గమనించి, సందేహాలకు తావు లేకుండా నిశ్చితాభిప్రాయాలని వెలిబుచ్చారు.
మన దేశంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క నిబంధన గ్రంథాన్ని అనుసరిస్తుంది. మహారాష్ట్రులు కాశీనాధ ఉపాధ్యాయ రచించిన ''ధర్మసింధు''వనే నిబంధన గ్రంథాన్ని అనుసరిస్తారు.
యాజ్ఞవల్క్య స్మృతిపై భాష్యం ''మితాక్షరం''. హిందూ న్యాయశాస్త్రం విషయంలో సందేహాలు వస్తే న్యాయస్థానాలలో దీనినే ప్రమాణంగా తీసుకుంటారు. దీనికి కూడ చట్టం వంటి పరపతే ఉన్నదని కోర్టులు అంగీకరిస్తాయి. దాక్షిణాత్యులు వైద్యనాథ దీక్షితులు రచించిన ''వైద్యనాథ దీక్షిత'' మన్న గ్రంథాన్ని అనుసరిస్తారు. గృహస్థులకు ఇది ఎంతో ముఖ్యం. సన్న్యాసుల విధులను గురించి ''విశ్వేశ్వర సంహిత'' నుండి తెలుసు కుంటారు. తమిళనాడులో ధర్మశాస్త్రమంటే వైద్యనాథ దీక్షితమే. కొద్దిపాటి భాషాజ్ఞానమున్నా ధర్మశాస్త్రాన్ని చదివి అర్థం చేసుకోవచ్చు. అధ్యయనం చేసినా అర్థం పూర్తిగా అవగాహన కాని వేదం వలె కాదు. వైద్యనాథ దీక్షితానికి మంచి అనువాదం కూడా ఉంది.
శృతులైన వేదాలనీ వాటిపై వ్యాఖ్యానాలైన సూత్రాలనీ (అంటే కల్పసూత్రం, ధర్మసూత్రం, శ్రౌతగృహ్య సూత్రాలూ) స్మృతులనీ ఆ తరువాత వచ్చిన నిబంధనగ్రంథాలనీ అందరిచే అంగీకరింపజేయటం తేలికకాదు. దీక్షితీయానికి ప్రామాణిక గ్రంథమన్న స్థానం కలగటానికి కారణం దీక్షితులవారు నిష్పక్షపాతంగా, విశాలమైన దృక్పథంతో మీమాంసలో చెప్పిన పద్ధతి ప్రకారం పదాల అర్థాలను నిర్ణయించారు. అన్ని శాస్త్రాలూ పోగు చేసి, విభేదాలను సమన్వయ పరచారు. స్మృతులలోనే తేడాలుంటే ఎంతో ఉదారవైఖరితో ''వారి వారి ప్రాంతాలలో అనుసరించే దానినే అవలంబించ వచ్చు, ప్రతి కుటుంబంలోనూ ఆ కుటుంబ పెద్దలు చేసినట్టు చేయవచ్చు'' అంటే శిష్ఠాచారంగా.
స్వేచ్ఛా, అదుపూ :
ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఏ విషయాన్నైనా ఎంత క్షుణ్ణంగా విచ్ఛేదం చేసినా, ఎంత వివరంగా విశ్లేషించినా జీవితంలో మనిషి ఎదుర్కొనే అసంఖ్యాకమైన పరిస్థితుల కన్నిటికీ సమాధానాలని చెప్పటం కష్టం. గ్రంథాలలోని నీతి వాక్యాలను క్రోడీకరించబడిన శాసనాలవలె ఆచరించటం కష్టం. క్రమ శిక్షణకై నిబంధనలు అవసరమే, ఇవన్నీ మన శాస్త్రాలలో పుష్కలంగా ఉన్నాయి కూడా కాని నిత్య జీవితంలో ''స్వేచ్చ'' ''ప్రజాస్వామ్యం'' వంటి పెద్ద పెద్ద మాటలు ఎవరికి తోచినట్టు వారు వ్యవహరించటంలోనో, బలాఢ్యులైన అధిక సంఖ్యాకులు బలహీనులైన అల్పసంఖ్యాకులను కష్టపెట్టటమో జరుగుతోంది. నిబంధనలను చెయ్యటంలో కల కట్టుబాట్లను, అట్టి కట్టుబాట్లకి పరిమితులను పెట్టుకోవలసి వస్తుంది, మరీ ఎక్కువ అదుపు నిబంధనలను ఉల్లంఘించటంగా మారుతుంది.
ఆ కారణం వల్లనే అన్ని విషయాలలోను మార్గదర్శక సూత్రాలను చెప్పిన మన శాస్త్రాలు, అనుల్లంఘనీయమైన శాసనాలు కాలేదు. పెద్దలననుసరించి నడుచుకునేట్టు వ్యక్తికి స్వేచ్ఛని కల్పించాయి. వ్యక్తిగత ప్రవర్తనకి కొంత స్వేచ్ఛ నివ్వాలి - అంటే పెద్దల నడవడి ప్రకారమూ, ఆచార ప్రకారమూ, సంప్రదాయం ప్రకారమూ నడుచుకొనేట్టు విడిస్తే మరి కొన్ని విషయాలలో లిఖిత పూర్వకమైన నియమావళిని అనుసరించటానికి వీలవుతుంది. తన ప్రవర్తన ద్వారా ఇతరులు కూడా నీతులను పాటించేట్టు చేయటమే అన్నిటి కంటె ఉత్తమమైన మార్గం. తరువాతిది, బలవంతం చేయకుండా నోటితో అనునయించటం. చివరి పద్ధతి శాసనాలను ఏర్పర్చి వాటికి కట్టుబడేట్టు చేయటం. ''సహస్రం వద ఏకం మాలిఖ'' అనేది పాత నానుడి. అంటే, మనిషిని ఒప్పించటానికి వెయ్యి మాటలనుపయోగించు కాని ఒక్క దానిని కూడా లిఖించి, ఆచరించమని బలవంత పెట్టకుమని అర్థం. ఇప్పటి వైఖరి ఏమిటంటే ప్రతి విషయం మీదా లిఖిత పూర్వకమైన చట్టాలు జారీ చెయ్యటం అంతే కాదు, ఏ అభిప్రాయం పడితే అది ప్రచురింపబడటం.
వ్యక్తికి స్వేచ్ఛ నివ్వకుండా వేలకొద్దీ నిబంధనలను ధర్మశాస్త్రాలు విధించాయని ఆరోపిస్తారు. నిజానికి, ఆ స్వేచ్ఛని దృష్టిలో పెట్టుకునే ఎన్నిటి గురించో శాస్త్రాలు ఏ ప్రస్తావనా చేయలేదు. ధర్మశాస్త్ర కర్తల దృష్టిలో వ్యక్తి తననీ తనతో బాటు సమాజాన్నీ నాశనం చేయకుండా ఉండాలంటే మార్గదర్శక సూత్రాలు, నియంత్రణా అవసరం. కాని వీటినే ''శాసనాలు''గా వ్రాస్తే అందరూ బందీలయినట్టు భావించుకుంటారు. ఈ కారణం వల్లనే కొన్ని నియమాలనే లిఖిత పూర్వకంగా పెట్టి మిగిలిన వాటిని సంప్రదాయానుసారం పాటించటానికి విడిచిపెట్టారు.
శాస్త్రాలు పెట్టిన నిబంధనలనే ఏ పెద్దవారో, ఏ సంప్రదాయానుసారమో ఆచరించినప్పుడు అవి నిబంధనలుగా తోచవు. ప్రాంతీయ సంప్రదాయాలను కుటుంబ సంప్రదాయాలను పాటించేప్పుడు వైయక్తిమైన భక్తి భావం కూడ ఉంటుంది! ఆఖరి ధర్మశాస్త్ర మయిన వైద్యనాథ దీక్షితీయ మొక్కటే ఈ ఉదారవైఖరిని అవలంబించలేదు. అంతకు పూర్వపు గ్రంథాలూ ఇంతే. బహుజన సమ్మతమైన ఆపస్తంభ సూత్రాలను రచించిన ఆపస్తంభుడు ఇట్లా అన్నాడు : ''ఈ శాస్త్రంలో అన్ని ధర్మాలనూ నేను స్పృశింపలేదు. ఇంకా ఎన్నో మిగిలి పోయాయి. స్త్రీల నుండి, నాల్గవ వర్గం వారి నుండీ నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. వారి నుండి వాటిని తీసుకోండి.''
స్త్రీలను పురుషులు అణచివేశారనీ, బ్రాహ్మణులు బ్రాహ్మణతరులకు తక్కువ స్థానమిచ్చారనీ చెప్పే మాటలు ఎంత నిరాధారమైనవో దీనిబట్టి తెలుస్తుంది. ధర్మశాస్త్రానికి ప్రమాణగ్రంథంలో స్త్రీల, బ్రాహ్మణతరుల విజ్ఞతకి ఎంతో ప్రాధాన్యమివ్వబడింతో ధర్మం విషయంలో వారు ప్రమాణంగా ఎట్లా పరిగణింపబడ్డారో తెలుస్తుంది.
ఆశ్వలాయనుడు వంటి సూత్రకారులు వివాహసందర్భాలలో హారతిని ఎప్పుడు ఇవ్వాలో, పెళ్లికూతురుని ఎప్పుడు చెయ్యాలో వంటి విషయాలలో స్త్రీల నిర్ణయాలనే పాటించాలన్నారు. వివాహమంటపానికి శంఖుస్థాపన చేసేప్పుడు ఒక మంత్రం పఠించాలి - కాని అప్పుడు కూడా బాగా అనుభవమున్న పనివాళ్లు సంప్రదాయానుసారం చెప్పేదాన్ని గమనించాలి.
శాస్త్రాలు వ్యక్తిని బందీ చేయక, ప్రజాసామ్య విధానం వలె కొంత స్వేచ్ఛని కూడా ఇచ్చాయి.
నాల్గవ వర్గంవారు పాటించవలసిన కర్మలను క్రతువులను కూడ ధర్మశాస్త్రాలు చెప్పాయి. వాళ్లని ఏమీ నిర్లక్ష్యం చేయలేదు. దీక్షితీయంలో - వర్ణాశ్రమ కాండలో ఆహ్నికకాండలో, శ్రాద్ధకాండలో ఈ వివరాలున్నాయి. సాధారణంగా ధర్మశాస్త్రాలను రెండు కాండలుగా విభజిస్తారు. ఆచారకాండ, వ్యవహార కాండ. వ్యక్తిగత ప్రవర్తన - ఆచారం. నియమాన్ని చెప్పేది వ్యవహారం.
చిహ్నం :
మన మొక మతాన్ని అవలంబిస్తే దానికి సంబంధించిన చిహ్నాలు కొన్ని యుంటాయి.
స్కౌట్స్ (బాల భటులు)లకు ఒక యూనిఫామ్ ఉంటుంది. అట్లాగే సైనికదళానికి, నావికాదళానికి చెందిన వారికి, వాళ్లను గుర్తు పట్టేందుకు వీలుగా కొన్ని గుర్తులుంటాయి. పోలీసు శాఖలో, ఉపశాఖలలో కూడా అంతే. వాళ్లు తమ యూనిఫామ్‌లని మార్చుకున్నా, బాడ్జీలను మార్చుకున్నా వారు చేసే పని ఏ విధంగానూ ప్రభావితం కాదు. అయినా వారు అట్లా మార్చుకోకూడదంటూ కొన్ని నిబంధనలున్నాయి. నావికుడు పోలీసు వాని దుస్తులను ధరింపరాదు. ప్రతి వృత్తిలోనూ ఒక క్రమమూ, క్రమ శిక్షణా ఉండాలి. మతానికి కూడ అటువంటి క్రమ శిక్షణ అవసరం లేదా? అందువల్లనే గుర్తు తెలియటానికి కొన్ని చిహ్నాలను వివిధవర్గాలవారికీ, వివిధ ఆశ్రమాలలో ఉన్న వారికీ విధులను నిర్ణయించారు. ప్రాంతీయ సంప్రదాయం ప్రకారం ధోవతిని కట్టుకునే తీరూ, చీరెని ధరించే తీరూ ఉంటాయి - అట్లాగే నుదిటిపై పెట్టుకునే బొట్టు వంటివి కూడా.
ఇవన్నీ కేవలం సామాజిక క్రమశిక్షణ కోసమే ఏర్పడినవి కావు. వీటన్నిటికీ సూక్ష్మమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనిషిని పరిశుద్ధ పరచి, ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తాయి.
ఆఫీసులలో బంట్రోతులే యూనిఫామ్‌లని వేసుకుంటారు. అధికారులు కాదు. దీనికి మనమభ్యంతరం చెప్పం కాని శాస్త్రాలు ఒక్కొక్క వృత్తికీ, ఒక్కొక్క ఆశ్రమానికీ వేరు వేరు లక్షణాలను ఏర్పరిస్తే సమానత్వమూ, స్వేచ్ఛా అంటూ ఆక్షేపిస్తాం. అనాదిగా వస్తున్న వర్ణాశ్రమ ధర్మాలు, లోక కల్యాణానికై ఎవరు ఆచరించవలసిన ఆచారాలనీ, అనుష్ఠానాలనీ వారి బాగుకే నిర్ణయించాయి.
ఇదంతా మరచిపోయి, ఎక్కడా లేని ''ఉన్నతజాతు''లను, ''తక్కువజాతు''లను కల్పించి ద్వేషాన్నీ, తిరుగుబాటునీ తీసుకువచ్చారు. చివరికి ఎవరికీ ఏ విధమైన చిహ్నమూ లేని స్థితికి వచ్చాం.
సామాజిక చిహ్నాలను ఎన్నింటినో ధరించటానికి ఏ సిగ్గూ అడ్డురాదు. కాని మతపరమైన చిహ్నాలను, ఆత్మోన్నతిని కలిగించే వాటిని, ధరించటానికి మాత్రం ఎంతో సిగ్గుపడతాం. అదంతా మూఢ నమ్మకమనేస్తాం. సంస్కరణ పేర దానిని విడిచేస్తాం. కాని మనం సంస్కర్తలమని తెలుపుకోవటానికి ఏదో ఒక రకమైన టోపినో, ఒక రంగుకల చొక్కానో, తుండు గుడ్డనో ధరిస్తాం. భగవంతునికి కన్నా వీటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాం!
స్మృతులు స్వేచ్ఛగా కల్పింపబడినవి కావు :
స్మృతులు ధర్మశాస్త్రాలే - వాటి పట్ల గౌరవమున్న వాళ్లకి కూడ ఒక తప్పుడు అవగాహన ఉంది వాటి గురించి. స్మృతులను రచించిన వారు తమంతట తామే, స్వచ్ఛందంగా ఆ నీతులను రచించారనుకుంటారు. వాళ్లని శాసకులనుకుంటారు. వాళ్లకి ఇష్టం వచ్చినట్టు శాసనాన్ని రచించారు. అంటే, రాజ్యపాలన సూత్రాలను చెప్పే భారతీయ రాజ్యాంగాన్ని కొందరు న్యాయశాస్త్ర వేత్తల మండలి తయారు చేసినట్టు! స్మృతులు కూడ అట్లాగే ఆ రచయిత స్వంత అభిప్రాయాలనుకుంటారు.
దీనికి తోడు ఇంకొకటి ఉంది. రాజ్యాంగంలో మన మవలంబించటానికి కష్టమైన అంశ##మేమైనా ఉంటే దానిని సమవరించుకుంటాం, ఆ విధంగానే ధర్మశాస్త్రాలని ఆధునిక సరిస్థితులకునుగుణంగా ఎందుకు మార్చుకోకూడదని అడుగుతారు. ప్రభుత్వం నిబంధనలను సవరిస్తున్నట్లుగా ఈ కాలానికి సరిపోయేట్టు ధర్మశాస్త్రాలని అక్కడా ఎందుకు మార్పులు చేయరాదు?
ధర్మశాస్త్రాలకంటే ఎంతో గౌరవంకల వారికి కూడ తెలియని విషయమిది: ''స్మృతులలో ఆయా రచయితల వ్యక్తిగత అభిప్రాయలుండవు. వేదాలలో ఉన్న వాటినే తీసుకొని సంకలనాలని తయారు చేశారు. వేదాలలోని విధులను ఎట్టి పరిస్థితులలోనూ మార్చలేం కాబట్టి ధర్మశాస్త్రంలోని నియమాలను మార్చే ప్రసక్తేరాదు.''
స్మృతులు కేవలం ఋషుల కల్పనలే అయితే వాటిని యథాతథంగా మనం పాటించవలసిన నిర్బంధమేమీ లేదు. మనకిష్టం లేకపోతే వాటిని తిరస్కరించవచ్చు. వేదాలలోలేని విషయాలు వాటిలో జొప్పించినా - ఆ రచయితలు మానవాళికేది మంచో, చెడో అని తమ వివేకానికి తోచిన విషయాలను వ్రాసినా - వాటిని తిరస్కరించవచ్చు. అట్లా తమకి తోచిన వాటిని వ్రాసిన వారూ ఉన్నారు, మనం కూడ మనకి తోచినట్టు నియమాలు ఏర్పర్చుకోవచ్చు.
నిజానికి, స్మృతులు వేదంలో చెప్పిన ధర్మాలనే క్రోడీకరించి చెప్పాయి. అందువల్లే అవి మనకి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రమాణాలు.
వేదాల నాధారంగా చేసుకునే స్మృతులు రచించారనటానికి ఋజువేమిటి? అన్న ప్రశ్న వస్తుంది.
స్మృతులకు మూలం వేదాలే :
అన్నిటికన్నా పెద్ద ఋజువు మన మహాకవుల వాక్యాలే! మన మతాలస్థాపకులైన శంకరులు, రామానుజులు, మథ్వులు ధర్మశాస్త్రాలు వేదాలపై ఆధారపడినవే అన్నారు.
వాళ్లకి కూడ తమ తమ సిద్ధాంతాల పట్ల భక్తి ఉండటం వల్ల వాళ్లు కూడా తపై#్ప ఉండవచ్చునని అభ్యంతరం చెప్తారేమో! వారు ఆర్షసంప్రదాయాన్ని పరిరక్షించటానికై బద్ధకంకణులు - కావున సంప్రదాయ విరుద్ధమైన దానిని వారు ప్రచారం చెయ్యరు. కాని అటువంటి ఆంక్షలు కవులకు లేవు. ఏ సిద్ధాంతానికీ వారు అంకితులు కారు. కవి, మత విచక్షణ లేకుండా, తనకి గోచరమైన సత్యాన్ని పలుకుతాడు.
మహాకవులలో అగ్రేసరుడు కాళిదాసు. తన రఘువంశంలో శృతులను గురించి ఈ విధంగా పలికాడు ''శృతేరివార్థం స్మృతిరన్వగచ్ఛత్''. శృతిభావాన్ని అనుసరించి స్మృతి నడిచినట్లు, సుదక్షిణ గోవు అడవుల వెంట వెళ్లింది''.
దిలీపుడు గోవును మేతకై తీసుకొని వెళ్ళినప్పుడు సుదక్షిణ దాని వెంట వెళ్లినట్లు చెప్తూ, కాళిదాసు ఋషులు స్మృతుల నెట్లా కూర్చారో వివరిస్తున్నాడు. ఋషులు స్మృతుల నెట్లా కూర్చారో వివరిస్తున్నాడు. ఋషులేమి చేశారో, స్మృతులెట్లా తయారైనాయో చెప్పటం ఆయన ఉద్దేశం కాదు.
ఉపమాలంకారలో ఉపమానము సాధారణంగా ఉపమేయం కంటె గొప్పదిగా ఉండటం పరిపాటి. ఉదాహరణకి, ముఖాన్ని చంద్రుడితోనో, పద్మంతోనో పోల్చి చెప్పినపుడు ఆ చంద్రుడో, పద్మమో ఆ ముఖంకన్నా అందంగా ఉంటుంది. ఇక్కడ పతివ్రత అయిన సుదక్షిణ భర్తయైన దిలీపుని వెంట వెళ్లటాన్ని వర్ణించాడు కవి. దీని అర్థమేమంటే, స్మృతులు శృతులను అంతకంటే సన్నిహితంగా అనుసరిస్తాయని. అందువల్లనే ఉపమాలంకార ప్రయోగంలో నిష్ణాతుడు కాళిదాసు ఈ ఉపమానాన్ని ఇక్కడ వాడాడు. స్మృతులు శృతులను అనుసరించాయనటానికి ఇంతకన్నా పెద్ద ఋజువు అవసరం లేదు.
వేదాలలో స్పష్టంగా చెప్పబడని అనుష్ఠానాలు కొన్ని స్మృతులలో ఉన్నాయి. వీటిని స్మార్తకర్మ అంటారు. వేదాలలో స్పష్టంగా చెప్పబడిన వాటిని శ్రౌత కర్మలంటారు. ఇంత మాత్రాన స్మార్త కర్మ, శ్రౌతకర్మ కంటె తక్కువదని భావింపరాదు.
గృహస్థుని ముఖ్యమైన ఉపాసన, గృహ్యకర్మలు (ఇంట్లో చేయవలసిన కర్మలు), వైదిక కర్మలలో ముఖ్యమైనది పితృశ్రాద్ధం, పంచయజ్ఞాలూ - ఇవన్నీ స్మార్తకర్మలే. వీటిని చేసేప్పుడు వేదమంత్రాలనే చెప్తారు. స్మృతులను రచించినవారు శృతుల భావాన్ని అర్థం చేసుకునే ఈ విధులను ఏర్పర్చారు. అందువల్ల - శృతులకంటె స్మృతులు తక్కువనీ, స్మృతుల కంటె పురాణాలు తక్కువనీ అనుకోకుండా ఈ మూడింటినీ సమగ్రంగా అర్థం చేసుకోవాలి.
వైదిక కర్మలను కథలుగా చెప్తాయి పురాణాలు. వైదిక ధర్మాలను కర్మలను కథలవలె గాక సూచనలుగా, విధులుగా చెప్తాయి స్మృతులు. ఆ కర్మలను ఆచరించే విధానాన్ని కూడ సూచిస్తాయి. వేదాలు ఋషులకి సద్యస్ఫూర్తితో అవగాహన అయాయి. ఆ పిదప ఋషులు తమకు కలిగిన అవగాహనని జ్ఞాపకం తెచ్చుకున్నారు - అవే స్మృతులు. పురాణాలు వేదాలలోని సత్యాలను కథల రూపంలో చెప్తాయి. అన్నీ ప్రామాణికాలే.
శృతి, స్మృతి, పురాణం - అన్నీ ధర్మానికి సంబంధించినవే. మన ఆచార్యులు - ఆది శంకరాచార్యులు - ఈ శృతి స్మృతి పురాణాలలో గల ధర్మాల నిధి. అందుచేతనే మనం వినమ్రులమై ఆయనని ఈ విధంగా స్తుతిస్తాం -
''శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోక శంకరం''.
* * *