Acharyavaani - Vedamulu     Chapters   Last Page

4. నిర్దుష్టంగా వల్లించే పద్ధతులు

వేదములలో ఏ చిన్న పొరపాటూ రాకుండా ఉండటానికి మన పూర్వీకులు ఎన్నో పద్ధతులను అవలంబించారు - ఇవేవీ లిఖితరూపంలో కూడా లేవు. వేదమంత్రాల వల్ల పరిపూర్ణమైన లాభం పొందాలంటే ఆ మంత్రోచ్చారణలో ఏ పొరపాటూ రాకుండా ఉండాలి - అంటే మంత్రాలని వల్లించేప్పుడు ఏ పదమూ మారకూడదు. నియమానికి వ్యతిరేకంగా ఏ స్వరమూ మారకూడదు. అందు వల్లనే అనేక కట్టుబాట్లున్నాయి.

ఒక్కొక్క పదాన్ని ఎంత కాలంలో పలుకాలో తెలిసేట్టు ''మాత్రలు'' కల్పించారు (మాత్ర అంటే ఒక్కొక్క హ్రస్వ అచ్చును పలికే కాలం) శరీరంలో ఏ భాగంలో ప్రకంపన కలగాలో, ఏ విధంగా శుద్ధమైన శబ్దం వస్తుందో తెలుపటానికి శ్వాసకి సంబంధించిన నియమాలను 'శిక్ష' అనే వేదాంగంలో చెప్పారు. తైత్తిరీయ ఉపనిషత్తు ఈ 'శిక్ష'తో ప్రారంభమవుతుంది.

''శీక్షాం వ్యాఖ్యాస్యామః | వర్ణ స్వరః | మాత్రాబలం | సామసన్తానః |''

(శీక్ష, వర్ణము, స్వరము, మాత్ర, బలమూ, సామమూ, సన్తానములతో సంబంధము కలది)

ఒక్కొక్క మంత్రాన్ని వివిధ రీతులలో, వివిధ గతులలో వల్లించటం నిర్దుష్టతకి దోహదం కలిగిస్తుంది. ఇవి వాక్య, పద, క్రమ, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన వంటివి. కొందరి పండితులని ''ఘనపాఠి'' అంటాం. అంటే వాళ్లు వాదాల్ని ఘనమనే పద్ధతిలో వల్లించగల నిష్ణాతులు అని అర్థం. ఘనపాఠి ఎవరైనా ''ఘన'' పద్ధతిలో వేదాన్ని వల్లిస్తూంటే ఆయన పదాలని రకరకాలుగా ముందుకీ వెనుకకీ మారుస్తున్నట్లు కనిపెట్టవచ్చు. ఇది వినటానికి సొంపుగా ఉండటమే కాక, మనస్సుకి ఆహ్లాదాన్ని కూడ కలిగిస్తుంది. వేదమంత్రాలకి సహజంగానే గల శోభ ఇంకా పెంపొందినట్టు అనిపిస్తుంది. క్రమం, జట, శిఖ, మాల పద్ధతులలో వేదాన్ని వల్లించినా అట్లాగే అనిపిస్తుంది. వీటి ముఖ్య ఉద్దేశమిది: ఆది నుండీ వస్తున్న పదాల అర్థంగాని, ఉచ్ఛారణగాని మారకుండా పొరపడకుండా ఉండటమే.

మంత్రాలని ఒక వాక్యం వలె వల్లెవేయటాన్ని ''వాక్యపాఠమ''నో ''సంహిత పాఠమ''నో అంటారు. ఒక వాక్యరూపంలో మంత్రాలను వల్లించేప్పుడు కొన్ని కొన్ని పదాలను కలపవలసి వస్తుంది. మంత్రాలలోని ప్రతి పదాన్నీ దేనికదిగా, విడిగా వల్లించటాన్ని ''పదపాఠమం''టారు. సంహిత పాఠం తరువాతనే పదపాఠం వస్తుంది. పదపాఠంలో వాక్యాలకి పదవిభజన జరుగుతుంది. దీని వల్ల వేదాధ్యయనం చేసేవారికి ప్రతి పదమూ తెలుస్తుంది. దీని తరువాతిది ''క్రమ పాఠం''. ఈ పద్ధతిలో మొదటి పదాన్ని రెండవ దానికీ, రెండవ పదాన్ని మూడవదానికీ, మూడవ పదాన్ని నాల్గవ దానికీ చేర్చుకొంటూ వాక్యం పూర్తయ్యే వరకూ వల్లిస్తారు. ఈ పద్ధతి వల్ల విద్యార్థికి ప్రతి పదమూ అర్థమవటమే కాక, రెండేసి పదాలను కలిపి ఏ విధంగా వల్లించాలో, ఆ కలపటంలో వచ్చే మార్పు లేమిటో కూడా తెలుస్తాయి.

కొన్ని ప్రాచీన శాసనాలలో, ముఖ్యంగా దానాలకి సంబంధించిన వాటిలో, ఆ సంబంధిత వ్యక్తుల పేర్ల చివర ''క్రమవిత్‌'' అన్న పదముంటుంది. ''వేదవిత్‌'' వలెనే ''క్రమవిత్‌'' అంటే ఆ వ్యక్తికి క్రమ పద్ధతిలో వల్లించటం వచ్చని అర్థం. ఇటువంటి శిలాశాసనాలు దక్షిణ భారతంలో కోకొల్లలు.

దీని తరువాతిది 'జటాపాఠం'. ఈ పద్ధతిలో మొదటి పదాన్నీ రెండవ పదాన్నీ కలిపి వల్లిస్తారు. ఆ తరువాత ఆ రెండు పదాలని తిరగవేసి వల్లెవేస్తారు. తరువాత మళ్లీ మామూలు వరుసలో చెప్తారు. 'క్రమపాఠం'లో పదాల క్రమం ఇట్లా ఉంటుంది : 1-2, 2-3, 3-4, 4-5 ఇత్యాది. కాని జటాపాఠంలో వరుస ఇట్లా ఉంటుంది 1-2-2-1-1-2 ఈ క్రమాన్నే ముందుకీ వెనుకకీ వల్లె వేస్తారు. శిఖాపాఠంలో మూడేసి పదాలని ఈ విధంగా కలుపుతారు.

''ఘన'' పాఠం వీటి కంటె కష్టం. ఇవికాక ఇంకొక అయిదు పద్ధతులు కూడా ఉన్నాయి. పదాల వరుసను మారుస్తూ రకరకాల జోడింపులు చేస్తూ వల్లె వేస్తారు *

'ప్రాణాలను కాపాడే మందుని ప్రయోగశాలలో ఎంత జాగ్రత్తగా భద్ర పరుస్తారో' విశ్వకళ్యాణానికి ఉపయుక్తమయే వేదాలకు ఏ విధమైన మార్పూ, క్షీణింపూ కలుగకుండా, లిఖిత పూర్వకంగా కూడా కాకుండా, కేవలం వల్లె వేయించే పద్ధతులలో మన పూర్వులు భద్రపరచారు. పదాలను ముందుకూ వెనుకకూ వల్లె వేసేప్పుడు విద్యార్ధి స్వరాలకేమాత్రమూ భంగం రానీయకూడదు. పదాల సమ్మేళనం స్వరాలనే విధంగా ప్రభావితం చేస్తుందో కూడా విద్యార్థి నేర్చుకోవాలి.

మంత్రంలోని పదాలు సహజమైన వరుసలో వస్తాయి కనుక సంహితపాఠాన్ని పదపాఠాన్నీ - ప్రకృతి పాఠమంటారు. మిగిలిన వాటిని వికృతి (అంటే, అసహజం) పాఠమంటారు. క్రమపాఠంలో పదాలు వరుసగా ఒకటి, రెండు, మూడు వలె రావు. కాని రెండు తరువాత ఒకటి, మూడు వెనుక రెండు వలె తిరగవేసి వల్లించక్కరలేదు. అందువల్ల దానిని వికృతి (అసహజం లేక కృత్రిమం) అనలేము. వికృతులు ఎనిమిది రకాలు.

జటా మాలా శిఖా రేఖా ధ్వజో దండో రథో ఘనః

ఇత్యష్టౌ వికృతయః ప్రోక్తా క్రమ పూర్వా మహర్షిభ్కిః

________________

* ఘన పద్ధతిలో పదాల క్రమం ఈ విధంగా ఉంటుంది : 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-4 ఇత్యాది.

పదాన్నీ, శబ్దాన్నీ ఉచ్చారణనీ, స్థాయినీ, వాటి వాటి సమ్మేళనాలని వేదాలలో స్వచ్ఛంగా పరిరక్షించటం కోసమే వల్లె వేయించటంలో ఈ క్లిష్టమైన పద్ధతులు వచ్చాయి. రకరకాలుగా పదాలను పునశ్చరణ చేస్తూండటం వల్ల వాటి సంఖ్యనుకూడా కాపాడుకొన్నారు - తద్వారా వాటి నిర్మలతను కూడా. ఎంత క్లిష్టమైన పద్ధతులలో వల్లె వేస్తే అంత పుణ్యమని కూడా నిర్దేశించి, విద్యార్థులు వాటిని నేర్చుకొనేట్టు చేశారు.

మన పూర్వీకులు వేదమంత్రాల స్వచ్ఛతను నిలపటానికి అన్ని పద్ధతులనూ అవలంబించారు. అందువల్ల కాలక్రమేణా వేదమంత్రాల ఉచ్ఛారణలో మార్పులు వచ్చాయి - అవి ఎంత కాలంలో వచ్చాయి అంటూ ఆధునికులు పరిశోధనలు జరుపటం సమర్థనీయం కాదు. వీటి వల్ల సత్యం ఏ మాత్రమూ అర్థం కాదు.

భగవద్వాణి :

వేదాలు ఆవిర్భావం చెందాయని ఒప్పుకోవాలి. మన దేశంలోనే కాదు, అన్యమతస్థులు కూడా వాళ్ల పవిత్రగ్రంథాలు ఆవిర్భవించాయనే అంటారు. జీసస్‌ తన ప్రవచనాలు తనవి కావనీ అవి భగవంతుని మాటలే అనీ తాను ప్రచారకుడను మాత్రమేననీ అన్నాడు. అట్లాగే మహమ్మదేయులు కూడా. అల్లా పల్కులనే మహమ్మదు ప్రచారం చేశాడంటారు.

'ఆవిర్భావం' గురించి మన అభిప్రాయాలనే వాళ్లు కూడ చెప్తూంటారు. వాళ్ళవి కూడ ''ఆవిర్భవించిన పాఠాలే'' అంటారు. భగవంతుని పలుకులు యోగుల వల్ల మనకి అందాయి. ప్రతిమతంలోనూ భగవంతుని పలుకులు యోగులకూ, మహర్షులకూ ప్రవక్తలకూ విశదమయాయి - వాటినే మానవాళి పురోగతికై వాళ్లు అనుగ్రహించారు.

ఏ విషయాన్నైనా ఎంతో నిశితంగా, ఏకాగ్రతతో గమనిస్తే దాని నిజస్వరూపం బయట పడుతుంది. దీనినే సహజ స్ఫురణ అనో, ప్రత్యక్షజ్ఞానమనో, అంటాం. ఐన్‌స్టైన్‌కి సాపేక్ష సిద్ధాంతం విపులమైన విశ్లేషణా ఆలోచన వల్ల కాక సహజస్ఫురణ వల్ల తట్టిందంటారు. మనమీ విషయాన్ని నిజమేనని ఒప్పుకుంటే, మానసికంగా ఉన్నతులు, వినీతులు, ఆధ్యాత్మికంగా ఉన్నతులూ అయిన ఋషులు అంతరాంతరాలలో మంత్రాలను గ్రహించారని అంగీకరించక తప్పదు!

* * *

Acharyavaani - Vedamulu     Chapters   Last Page