Acharyavaani - Vedamulu Chapters Last Page
5. వేదములు అనంతములు
సృష్టీ, సృష్టికి పూర్వమూ, సృష్టికి అతీతము - కేవలం ప్రకంపనల మయమైతే అవెంత వ్యాప్తి చెందినవో ఊహించలేము. అయితే, విశ్వంలోని వివిధ వ్యాపకాలన్నీ వేద మంత్రాలలో ఎట్లా నిక్షిప్తమయినాయన్న ప్రశ్న వస్తుంది.
వేదాలు ఎంతో విస్తృతమైనవి. మనకి లభ్యమైన వేదాలు పరిమితం. ''అనంతావై వేదాః'' (వేదాలు అనంతం) అని వేదాలలోనే ఉంది. వేదాలు పరిపూర్ణంగా ఋషులకు విశదమయ్యాయని చెప్పలేం. అనంతమైన వేదాలలో కొద్ది భాగమే వారికి విశదమయింది. నాలుగు వేదాలు - సహస్రాధికమైన వేదశాఖలు కల భాగమే వారికి విశదమయింది.
పరమాత్ముని నిశ్వాసమే బ్రహ్మసృష్టికి స్ఫూర్తి - ఆ నిశ్వాసం అంతరిక్షంలో ఇప్పుడూ ఉంది - ఎన్ని ప్రళయాలు సంభవించినా, ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్లినా దీనికి లయమూ, అంతమూ లేవు. ప్రతి ప్రళయం వెనుకా వచ్చే ప్రతి బ్రహ్మా ఆదిమ శబ్దతరంగాలైన వేదమంత్రాల సహాయంతోనే సృష్టి కార్యం కొనసాగిస్తాడు.
వాటికి మూలం ప్రకంపన. ఈ ప్రకంపననే బ్రహ్మవేదాలుగా గ్రహించి, ఉచ్ఛరిస్తే సృష్టి సంభవిస్తుంది.
కొన్ని శబ్ద తరంగాలను మొక్కల దగ్గర విడిస్తే మొక్కలు త్వరగా ఎదుగుతాయనీ, కాపు బాగుంటుదనే అంటారు. మరికొన్ని రకాల శబ్దాలు పెరుగుదలకు హాని కలిగిస్తాయి. అంటే శబ్ద తరంగాల వల్ల సృష్టిస్థితిలయములు కలుగుతాయని మామూలు మొక్కల విషయంలోనే ఋజువైంది.
వేదమంత్రాలను తన తపస్సుతో ధ్యానగరిమతో ఉపయోగించి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు.
మనం నిత్యం పఠించే పంచాక్షరీ మంత్రాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే జపించి పుణ్యాత్ములు రోగాలని ఎట్లా నయం చేయగలగుతున్నారు? వాళ్లకి ఏకాగ్రత ఎక్కువవటం వల్లా సరియైన పద్ధతిలో ఆ మంత్ర ప్రకంపనలని ప్రేరేపించే శక్తి కలగటం వల్లనే కదా. అంతేకాక మంత్రాన్ని స్వచ్ఛంగా, ఏ స్వరభేదమూ లేకుండా జపించాలి. అప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి. పరమాత్మ నుండే బ్రహ్మ ఉద్భవించటం వల్ల వేదాలపైన ఆయన అధికారం సంపూర్ణం.
ఆకాశం నుండి లభించిన విద్యుచ్ఛక్తితో ఎన్నిటినో చేస్తున్నారిప్పుడు. అదే విధంగా నిర్గుణుడు, చైతన్యమూర్తీ అయిన బ్రహ్మ నుండే విశ్వసృష్టి జరుగుతుంది. ప్రళయవేళల ఆ చైతన్యం నిశ్చలమవుతుంది. మల్లయోధుడు నిద్రించేప్పుడు అతని బలం మనకు తెలియదు. మల్లయుద్ధం చేసేప్పుడో, మరియే ఇతర పని చేసేప్పుడో అతని బలం మనకి కనబడుతుంది. ఆ విధంగానే సృష్టివేళ విశ్వంలోని శక్తి ఎన్నో కార్యాలని నిర్వహిస్తుంది. ఆ నిశ్చలమైన దాని నుండి ఈ శక్తి బయల్వెడలు తుంది. బ్రహ్మ అటువంటి శక్తినుండి వచ్చిన వాడే. తపస్సు రూపంలో జనించిన వాడవటం వల్ల, వేదాలనన్నిటినీ వాటి పటుత్వంతో ఆయన గ్రహించగలిగాడు. వేదాలు అనంతం - సృష్టికూడ బహుముఖమే, వైవిధ్యంతో కూడినదే.
బ్రహ్మం రూపందాల్చినప్పుడు ఆయన అంతరంగంలో వేద శబ్దాలన్నీ జనించాయి. సృష్టి ఎట్లా చేయాలో ఆయనకి చూపాయి. సహజస్ఫురణతో విదితమయాయి.
వేదాలు అనంతమనటానికి ఒక కథ ఉంది. భరద్వాజ మహర్షి మూడు జన్మలలో వేదాలను అధ్యయనం చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ''నీకింకొక జన్మనిస్తాను. ఏమి చేస్తావు దానితో'' అని అడిగితే, భరద్వాజుడు ఆ ''అదనంగా లభించే జన్మని కూడ వేదాధ్యయనానికే వినియోగిస్తాన''న్నాడు - అన్ని వేదాలనూ, ఎన్ని జన్మలనెత్తినా పూర్తిగా అధ్యయనం చేయట మసంభవమని, ఋషి పట్ల జాలితో అతను ఎదుర్కొంటున్న సమస్య ఎంత జటిలమైనదో తెలియ జేయటానికై పరమేశ్వరుడు మూడు పెద్ద పర్వతాలని సృష్టించి వాటి నుండి గుప్పెడు మట్టిని తీసుకొని, ''నీవిప్పుడు అధ్యయనం చేసిందంతా ఈ పిడికెడు మట్టితో సమానం. నీ వింకా అధ్యయనం చేయవలసినది ఈ పర్వతాలంత మేర ఉన్నది'' అన్నాడట. భరద్వాజునికి సంబంధించిన ఈ గాధ వేములలో కాఠక భాగంలో ఉంది.
వీటివల్ల వేదాలు అనంతమని విశదమవుతుంది. వేదాలను నాలుగు భాగాలుగాను, శాఖలను వెయ్యికిపైగానూ క్రోడీకరించటం తరువాత ఎప్పుడో జరిగింది.
మంత్రాలు తపస్సంపన్నులైన ఋషులకు అభివ్యక్త మైనవే. అందువల్ల ఆయా మంత్రాలు ఆయా ఋషులకు చెందినవైనాయి. ఆ మంత్రాలను ఆలకించటానికి వారికి దివ్యమైన చెవులున్నాయి. యోగశాస్త్రం ప్రకారం మనస్సులోని మౌనాన్ని విశ్వాంతరాళంతో సంధానపరుస్తే, అంతరిక్షంలో తేలుతున్న శబ్దాలన్నీ వినబడుతాయి. విశ్వమంతటితో తాదాత్మ్యం చెందగలవారికే ఇది సాధ్యం. అందువల్లనే, ఋషులు లోక శ్రేయస్సుకై ఆ మంత్రాలను బయట పెట్టారే గాని వాటిని సృష్టించలేదు. ఈ మహోపకారాన్ని చేసి మానవాళికి అజ్ఞానంగా సంస్థితమైన వాటిని తెలియజేశారు. గంగను రప్పించిన వానికి ప్రణమిల్లుతాం. గంగను అతను సృష్టించాడా? అతడు, గంగను తీసుకు వచ్చాడంతే. అయినా, ఎంతో దూరంనుంచి తీసుకువచ్చాడని కృతజ్ఞత తెల్పుతాం. మనకందు బాటులో లేని మంత్రాలను మనకు అనుగ్రహించిన ఋషులను ఎంతగా కొనియాడాలో!
మంత్ర యోగము :
పదునాలుగు భువనాలూ ఒక సామ్రాజ్యం - దీనికి అధినేత ఒక సార్వభౌముడు - జగత్తులోని సమస్త వస్తుజాలమూ ఆయన ప్రజలు. సార్వభౌమునికి గాని భృత్యులకు గాని కాలమానంలో ఆది అంటూ ఏదీ లేదు. ఒక రాజ్యమూ, ఒక రాజూ ఉన్నప్పుడు కొన్ని శాసనాలుంటాయి. ఈ మూడింటికీ 'మొదలు' అంటూ లేదు కాబట్టి, ఈ శాసనాలకూ ఆది లేదు.
ఆది లేని శాసనమే వేదం. సామ్రాజ్యానికి మొదలంటూ లేకపోయినా అప్పుడప్పుడు తాత్కాలికంగా అంత మొంది, సృష్టితో కూడ మళ్లీ జనిస్తూంటుంది. కాని సార్వభౌముడైన పరమాత్మకు గాని, శాసనమైన వేదానికి గాని మొదలూ లేదు, తుదీ లేదు.
మన మెరిగిన దృశ్యమానమైన ప్రపంచం సృష్టింపబడుతుంది - వృద్ధి నొందుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల తరువాత ప్రళయంలో లయమవుతుంది. మళ్లీ సృష్టింపబడుతుంది. ఇట్లాగే ఇది జరుగుతూంటుంది. అయినా, సార్వభౌముడూ శాసనమూ అచలంగా ఉంటాయి. ప్రతి సృష్టికీ ముందు కొందర్ని నియమిస్తాడు సార్వభౌముడు. వారికి తగిన అధికారమిచ్చి వారు తమ విధులను నిర్వహించేందుకు వీలు కల్పిస్తాడు.
పైన చెప్పినట్టు, యోగ శాస్త్రం ప్రకారం మానవుని చెవికి, అంతరిక్షానికీ లంకె ఉంది. ఇది ఏర్పడితే ''దివ్య కర్ణాలు'' సమకూడినట్టే. ఇవి గలవారు పరమాత్ముని అనుగ్రహం వల్ల అనాదిగా విశ్వంలో గల శబ్ద తరంగాలను గ్రహింపగలిగారు. వేదాలనూ మొట్టమొదటిగా ఎరిగిన వారు వారే. ఆ మహర్షుల సొత్తే మంత్రాలు.
మనమెన్నో శబ్దాలను వింటాం, పలుకుతాం. ఒక్కొక్క నాడి ప్రకంపించేప్పుడల్లా, మనస్సులో ఒకోరకమైన భావావేశం కలుగుతుంది. కొన్ని ఉద్రేకాన్ని, మరికొన్ని బద్ధకాన్ని, ఇంకాకొన్ని అసంతుష్టినీ ప్రేరేపిస్తాయి. దీనినే వేరొక విధంగా చెప్పాలంటే - ఉద్రిక్తమై ఉన్నప్పుడు ఒకనాడి ప్రకంపిస్తుంది, అదే విధంగా కోపంగా ఉన్నప్పుడింకొక నాడి ప్రకంపిస్తుంది.
ఈ రీతిగా ప్రతిభావావేశమూ వివిధ నాడుల ప్రకంపనలని కలిగిస్తుంది. ఇది అందరికీ అనుభవసిద్ధమే. మనశ్శాంతి వల్ల నెమ్మదిగా ఉంటుంది. ఇది ముఖంలో కనబడుతుంది. ఉద్రేకమూ, కోపమూ అలాగే ముఖంలో తెలుస్తాయి. నాడి కొట్టుకొనే వేగంవల్లనే ఈ చిహ్నాలు వస్తాయి. మనస్సులో కలిగే ఆవేశం వల్ల నాడి కొట్టుకొనే వేగంలో మార్పు కలిగితే ఆ నాడి యొక్క వేగాన్ని అదుపులో పెట్టటం వల్ల ఆ ఆవేశాన్ని గాని, కోపాన్ని గాని అదుపులో పెట్టవచ్చు. అందువల్లనే ఆత్మసాక్షాత్కారానికి మార్గాలలో ఒకటైన రాజయోగం, మనస్సుని అదుపులో పెట్టటానికి ప్రాణాయామాన్ని ముఖ్యమైన సాధనగా ఉపయోగిస్తుంది. మంత్రయోగం కూడ ఇంకొక మార్గం. ఒక మాటని ఉచ్ఛరించేప్పుడు అది ఊపిరీ, గొంతూ, నాలుకా, పెదవులూ, నోరూ - ద్వారా ప్రసరిస్తుంది. అప్పుడే ఆ పదం శబ్దమై వినబడుతుంది. ఊపిరి వెళ్లే ఆ దారిలో గల నరాలకూడలు కంపిస్తాయి - దాని వల్ల శబ్దోచ్ఛారణ జరుగుతుంది. సరియైన శిక్షణతో, సరియైన విధంగా ఉచ్చరింపబడిన వేద మంత్రాలు మనస్సులో సద్భావాలని కలిగిస్తాయి - వాటి వల్ల ఆ మంత్రాలను పలికే వ్యక్తికీ లోకానికీ శ్రేయస్సు కలుగుతుంది. దానికి తోడు నీచమైన భావాలు దూరమవుతాయి.
దేనినైతే నిత్యం మననం చేయటం వల్ల వ్యక్తి రక్షితుడౌతాడో అదే మంత్రమంటే. (''మననాత్ త్రాయతే ఇతి మంత్రః'') మంత్ర జపం పదే పదే చేయటం బ్రాహ్మణుని కర్తవ్యం. దాని వల్ల ప్రకంపనలూ పదే పదే వ్యాపిస్తాయి. ఆ శ##క్తే వ్యక్తికీ, సమిష్టికీ శ్రేయోదాయకం.
మంత్ర జపం వల్ల పూర్తి సాఫల్యం పొందాలంటే దానికి నిర్ణీతమైన పద్ధతి ఉంది. ఆరు విధాల మంత్రాలని వల్లెవేయటం వర్జనీయమని విజ్ఞులు చెప్పారు.
''గీతీ శీఘ్రీ శిరః కంపీ తథా లిఖిత పాఠకః
అనర్థజ్ఞః అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమాః''
గీతీ అంటే పాటవలే మంత్రాన్ని ఆలపించేవాడు. ఇది సరికాదు. సామవేదాన్ని ఆలపించాలి - కాని ఆ పాడటం కూడ విద్యుక్తంగానే చెయ్యాలిగాని ఎవరికి తోచినట్టు వారు చేయకూడదు. అంతేకాక, శబ్దానికీ, ఆ శబ్దంలోని మార్పులకీ శక్తి ఉండటం వల్ల సరియైన స్వరంలో కాక ఇంకొక విధంగా పఠించటం తప్పే కాకుండా, హానికరం కూడా. అందువల్ల మంత్రాన్ని నిర్ణీతమైన విధంగానే చెప్పాలి. శీఘ్రీ అంటే వేగంగా మంత్రాన్ని చెప్పి హఠాత్తుగా నిలిపేవాడు. ఇది కూడా తప్పే. వేదపదాలను నియమిత కాలానుగుణంగానే ఉచ్చరించాలి లేకపోతే వాటి ఫలితం పూర్తిగా లభింపదు. శిరః కంపీ అంటే మంత్రాన్ని చదువుతూ అనవసరంగా తలని ఆడించేవాడు. మనిషి ఏకాగ్రతతో నిటారుగా కూర్చుని నాడుల ప్రకంపనలకు భంగం కలుగుతుంది. లిఖిత పాఠకః అంటే వ్రాసుకొన్న దానిని చదివే వాడు. ఇది వరకు చెప్పినట్టు మంత్రాన్ని గురువు ఉచ్ఛరిస్తూంటే శ్రద్ధగా ఆలకించి, సరియైన విధంగా జ్ఞాపకముంచుకోవాలి. అనర్థజ్ఞః అంటే మంత్రం యొక్క అర్థం తెలియని వాడు. మంత్రాల సాఫల్యం పరిపూర్ణంగా పొందాలంటే వాటి అర్థాన్ని కూడ ఎరిగి ఉండాలి. అల్పకంఠ అంటే హీనస్వరంతో ఉచ్ఛరించేవాడు. శబ్ద తరంగాలకి సత్ఫలితాలుండాలంటే ఏదో గొణుగు తున్నట్టు కాక, స్పష్టంగా వినబడాలి.
శబ్దమూ, పదార్థమూ - వాటి ప్రయోజనం :
ఒక విషయాన్ని కొంచెం హాస్యధోరణిలో చెప్తాను. సంస్కృతంలో ఒక పదానికి ''తరం'' అని చేరిస్తే మరొకదాని కన్నా శ్రేష్ఠమని అర్థం వస్తుంది. ''వీర్యవత్'' అంటే శక్తి మంతమని అర్థం. 'వీర్యవత్తరం' అంటే అసాధారణమైన శక్తిమంతుడని అర్థం. చాందోగ్యోపనిషత్తులో (1.1.10) ఓం కారాన్ని అర్థం తెలుసుకొని జపిస్తే ఉత్కృష్ట ఫలితాలు పొందవచ్చని ఉంది. ''వీర్యవత్తరం'' అన్న పదం ఇక్కడ వాడబడింది. ఈ పదం వాడటం వల్ల స్ఫురించేది ఇదిః ''అర్థం తెలుసుకోకుండా జపిస్తే తక్కువ ఫలితాలు వస్తాయ''ని : తన భాష్యంలో ఆది శంకరులవారు అర్థం తెలుసుకొని జపం చేసేవారికి లభించిన ఫలితాలు లభించకపోయినా ఇతరులకి కూడ కొంతైనా సత్ఫలితం వస్తుందని అన్నారు.
అర్థం తెలిసి చేసినా తెలియక చేసినా విజ్ఞులైన పెద్దలు చెప్పారన్న విశ్వాసంతో ఏ పనిచేసినా సత్ఫలితాలే వస్తాయి. వేదజపంలో సరియైన ఉచ్ఛారణ వల్ల ఉత్పన్నమయే తరంగాలే సత్ఫలితాలని ఇస్తాయి. శబ్దం కలిగించే ఫలితాలే ప్రధానం. అర్థం తెలియటం వల్ల కలిగే ఫలితాలు అప్రధానం.
అందువల్ల నాకిట్లా అనిపిస్తుంది. అర్థం తెలియటం వల్ల 'వీర్యవత్' ఫలితాలు, అర్థం తెలియక పోవటం వల్ల 'వీర్యవత్తర' ఫలితాలు లభిస్తాయని! అర్థం తెలియకుండా ఉంటేనే ఉత్కృష్టమైన ఫలితాలు వస్తాయనటంలో అర్థమేమిటి?
ఒక కలెక్టర్ ఉంటాడు. ఆయనకి ఒక పంటకాపు వినతి పత్రాన్ని సమర్పించాలి. దానిని లాయరుతో వ్రాయించుకొంటాడు. కాని, తానే స్వయంగా కలెక్టర్‌కి సమర్పించుకొంటాడు. నిరక్షరాస్యుడైనా పత్రాన్ని సమర్పించేప్పుడు అనుకూలమైన ఉత్తరువు ఇవ్వమని విన్నవించు కొంటాడు. ఆ పేదవానికి విషయం తెలియక పోయినా, తన న్యాయబుద్ధిపై విశ్వాసముందని కలెక్టర్ గ్రహిస్తాడు. అనుకూలమైన ఉత్తరువుని జారీచేస్తాడు. మంత్రాల విషయమూ అంతే. వాటి భావం సంపూర్ణంగా భగవంతునికే తెలుస్తుంది. కాని మనం వాటిని సమీపించేప్పుడు గడుసుతనం చూపకూడదు. లాయరు వాదనలో తప్పుంటే కలెక్టరుకి కోపం వస్తుంది. కాని ఆ వాదనలోని తప్పు పంటకాపుకి కూడా తెలిసే ఉంటుందని కలెక్టరుకి కోపం మరీ ఎక్కవౌతుంది. అతనికి తెలియక పోవచ్చు ననుకొంటే పంటకాపు పట్ల కలెక్టరు సుముఖంగానే ఉంటాడు. అందువల్ల, ''నాకెలాగూ అర్థం తెలియదు వల్లె వేయటమెందుకు?'' అనకూడదు. అమాయకత్వముంటే వల్లె వేయటం అధికఫలమిస్తుంది. ఈ మాటలని తమాషాకి అన్నాను. ఈ రోజులలో తెలివితేటలు ఎక్కువై పోయాయి. విద్యావంతులు కాని వారి వినయాన్ని కించెపరుస్తున్నప్పుడు, నా కనిపిస్తుంది : వివేకంలేని విశ్వాసమే, విశ్వాసంలేని వివేకం కంటే నయమని.
కాని నిజానికి వినయంతో కూడిన వివేకముండాలి. మంత్రాల విషయంలో వాటి అర్థంకంటె సరియైన ఉచ్ఛారణ ప్రధానమైనా, మంత్రాలు మన ధర్మశాస్త్రాలు కావటం వల్ల వాటి అర్థమెరిగి ఉంటేనే వాటి ప్రకారం నడచుకోగలుగుతాం. కాబట్టి మంత్రాల పఠనానికి ఇంకా పటుత్వం కలిగించటానికి వాటి భావాన్ని కూడా తెలుసు కోవటానికి ప్రయత్నించాలి.
వేదాలని గంభీరతతో ఉచ్ఛరించాలి. అప్పుడే ఆ శబ్దాలు స్పష్టంగా వినబడుతాయి. వేదమంత్రాలు, ఆ పఠించే వాని నాడులలో మంచి ప్రకంపలనే కాక, వినే వారిలో కూడ అటువంటి వాటినే కలిగిస్తాయి. అవి వాతావరణంలో విస్తరిస్తాయి. కాబట్టి ఎల్ల వేళలా శ్రేయోదాయకాలే. మంత్రాలు అంతటా వ్యాపించటానికి వీలుగా వాటిని బిగ్గరగా వల్లె వేయాలి.
వేదముల శక్తి :
ఇంతకు పూర్వం చెప్పినట్టు వేదాల లక్షణాలు ఇవి (1) అవి అనాది (2) అవి అపౌరుషేయాలు (3) అవి సృష్టికి మూలం. అంతే కాదు. వాటిని పఠించేప్పుడు వచ్చే శబ్దం మన నాడులను ప్రకంపింప చేస్తుంది. వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యక్తికీ సమిష్టికీ మేలు కలిగిస్తుంది. ఇక్కడ ''సమిష్టి'' అంటే కేవలం మానవులనే అర్థం కాదు.
వేదాల వలె జంతువుల క్షేమానికీ, వృక్షాలక్షేమానికీ ఏ యితర మత గ్రంథాలూ ప్రాధాన్యమియ్యవు. రెండుకాళ్లవే కాక, నాలుగు కాళ్లవి కూడ వర్థిల్లాలి. (''శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే''.) ఇంతేకాదు - పొదలూ, వృక్షాలూ, పర్వతాలూ, నదులూ - ఒకటేమిటి - సృష్టి అంతా వర్థిల్లాలంటాయి.
వేదాలకి ఎంతో అర్థగాంభీర్యముంది. మహనీయమైన కవిత్వమే కాక వాటిలో సమాజం సక్రమంగా ఉండటానికి నియమాలూ, ఆధ్యాత్మిక సత్యాలూ ఆఖరికి వైజ్ఞానిక సూత్రాలు కూడా ఉన్నాయి.
శబ్ద ప్రధానాలైన వేదమంత్రాలకి - మనకి అలవాటైన రీతిలో అర్థాలుండవలసిన అవసరం లేదు.
మనం రాగాలాపన వింటూంటాం. ఇందులో రాగంలోని స్వరాలనే విస్తరిస్తూ ఆలపిస్తారు. సాహిత్యముండదు. అయినా, ఆలాపన వింటూన్నప్పుడు మనకి భావావేశం కలుగుతుంది. వాద్య సంగీతం వినిపించటం వల్ల చెట్లు ఎక్కువగా ఫలవంతమవుతాయని ప్రయోగాల వల్ల నిరూపించారు. అంటే, శబ్దానికి సృజనాత్మకత ఉన్నదన్న మాటే కదా? ఇక్కడ గమనించవలసిన విషయమిది : వాద్య సంగీతంలో మాటలు ఉండవు, వాటి అర్థమూ ఉండదు. కేవలం ఆ నాదానికి ఫలితం ఉంటుందన్న మాట.
వేదాల విషయంలో విలక్షణమైన విషయమిది : వేదమంత్రములలోని పదములకు అర్థ గాంభీర్యమున్నది. అదే సమయములో శబ్దమునకు కూడ అనంతమయిన విలువ యున్నది. ఇదే వేదముల విషయములో విశేషము.
ఆ కారణం వల్ల వేదమంత్రాలు శబ్దార్థ సమన్వితాలు. ముందు చేదుగా ఉండవచ్చు కాని ఆరోగ్యానికి అవసరం, పిండివంట తీయగా ఉండవచ్చు కాని ఆరోగ్యానికి హానికరం. రుచిగా ఉంటూ ఆరోగ్యాన్ని మెరుగు పరచేదేదైనా ఉంటే ఎంత బాగుణ్ణు! వేద మంత్రాలకి ఈ రెండు ప్రయోజనాలూ ఉన్నాయి.
ఇహపరాలలో సుఖపడటానికి అవసరమైన ఉద్భోదలు వేదాలలో ఉన్నాయి. మనిషి పుట్టినప్పటి నుండీ, ఆఖరి శ్వాస విడిచే వరకూ, ఆ పిమ్మట ముక్తి నొందటానికి కూడా, అతని నడవడికి మార్గదర్శక మవుతుంది. అంతేకాదు - అది వ్యక్తి ముక్తితో ఆగిపోదు. సమాజమెట్లా ఉండాలి, సామాన్యుని విధులేమిటి, బ్రాహ్మణుని నడత ఎట్లా ఉండాలి, రాజ్యాన్ని ప్రభువు ఎట్లా పాలించాలి, స్త్రీల నడవడి ఎట్లా ఉండాలి - ఈ విషయాలన్నీ వేదాలలో క్రోడీకరింపబడి ఉన్నాయి.
* * *