Acharyavaani - Vedamulu Chapters Last Page
7. చతుర్వేదములు
''అనన్తావై వేదాః'' (వేదాలు అనంతం) - కాని ఆ అనంతమైన వేదాల నుండి కొన్ని మంత్రాలనే ఋషులు గ్రహించ గలిగారు. ఇహపర సౌఖ్యానికీ, ముక్తికీ, లోకకళ్యాణానికీ ఇవి చాలు. వేదాలు నాలుగంటూ మనమనుకొన్నా ఈ నాలుగింటికే భిన్నమైన పాఠాలూ, భిన్నరీతులలో పఠించే పద్ధతులూ ఉన్నాయి. వీటిని పాఠాంతరాలంటారు.
ఒక్కొక్క పఠనాపద్ధతినీ, పరిష్కృతపాఠాన్ని ''శాఖ'' అంటారు. వేదమనే వృక్షానికి శాఖలన్నమాట యివి. వేదం శాఖక్షపశాఖలు గల మహా వట వృక్షం వంటిది. అసంఖ్యాకమైన శాఖలున్నా వాటిలో కొన్నింటిని మాత్రం కలిపి నాలుగు శాఖలుగా వర్గీకరించారు. ఇవి ఋక్, యజుః, సామ, అధర్వ - వీటినే ఋగ్వేదము, యజుర్వేదమూ ఇత్యాది అంటారు. ఇవి ఆయా సమూహాల ప్రాముఖ్యతను సూచిస్తాయి.
ఆధునిక పరిశోధకుల ఉద్దేశంలో, ఋగ్వేదం, యజుర్వేదం కంటె ప్రాచీనం. కాని మన శాస్త్రాల ప్రకారం, మన విశ్వాసానుసారం, వేటికీ కాలమానంలో ఆది అంటూ ఏమీ లేదు. సృష్ట్యాదికే వేదాలు లభ్యాలు కావటం వల్ల! ''ఈ వేదం ముందు, ఆ వేదం తరువాత'' అంటూ చెప్పే పరిశోధకుల మాటలు విశ్వసనీయాలు కావు -
అట్లాగే, వేదభాగాలైన సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యకాలు ఏ క్రమంలో వచ్చాయో చెప్పే ''పరిశోధకులూ'' పొరబడ్డారు. ఋషులు కాలాతీతులై, త్రికాలజ్ఞులైన తరువాతనే వేదాలని గ్రహించి మనకివ్వ గలిగారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టు కొంటే, కాలమానంలో వేదాల గురించీ, వాటి క్రమం గురించీ వేసే అంచనాలు అనుచితమని తెలుస్తుంది. ఆయా ఋషులు అలౌకిక చేతనా స్థితిని బట్టి వారికి కలిగిన వేదమంత్రాల గ్రహింపు మారియుండవచ్చు అంతే. అసలు, ఋగ్వేదంలోనే యజుర్వేదానికీ, సామవేదానికీ సంబంధించిన ప్రస్తావనలున్నాయి. ఇతర వేదాల ప్రస్తావన గల పురుషసూక్తం, ఋగ్వేదం తొంభైయవ ఋక్ సమూహం పదవమండలులో ఉంది. దీనిబట్టే తెలుస్తుంది, కొన్ని వేదాలు ముందూ, మరి కొన్ని వెనుకా కావని.
ప్రతి శాఖలోనూ మూడు భాగాలుంటాయి. ఇవి సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము. ఇది కూడ ఒక విధమైన వర్గీకరణమే. ''వేద అధ్యయనం'' అని మనమన్నప్పుడు సాధారణంగా సూచింపబడేది ''సంహిత'' భాగ పఠనమే. ''సంహిత'' వేదశాఖకి మూలమూ, జీవమూ అవటమే దీనికి కారణం.
'సంహిత' అంటే సంకలింపబడి, ఒక క్రమంలో ఏర్పచబడినది అని అర్థం. ఏ సంహితైనా, ఆ వేదంయొక్క అంతరార్థాన్ని మంత్రాల ద్వారా తెల్పుతుంది.
ఋగ్వేదము :
ఋగ్వేదసంహిత అంతా పద్యరూపం. వీటిని ప్రథమంలో ఋక్కులనే వారు. తరువాతి కాలంలో శ్లోకమనటం ప్రారంభించారు. వివిధ దేవతలను స్తుతిస్తాయివి. ఒక్కొక్క ఋక్కూ ఒక్కొక్క మంత్రం. కొన్ని ఋక్కుల సమూహాన్ని సూక్తమంటారు.
ఋక్ సంహితలో 10, 170 ఋక్కులున్నాయి. నాలుగు వేదాల సంహితలలోనూ 20,500 మంత్రాలున్నాయి. ఋగ్వేదంలో 1028 సూక్తాలున్నాయి (ఋక్కుల సమూహాలు) వీటిని పది మండలాలూ, ఎనిమిది అష్టకాలుగా వర్గీకరించారు. అగ్నిపై సూక్తంతో ప్రారంభించి దానితోనే ఆఖరవుతుంది. వేదాలన్నిటిలోనూ ఋగ్వేదంలోనే దేవతాస్తోత్రాలధికంగా ఉంటాయి. ఆరంభంలోనూ (ఉపక్రమంలోను) అంతంలోను (ఉపసంహారంలోను) అగ్ని దేవుని స్తుతి ఉండటం వల్ల ఆ వేదం యొక్క ఉద్దేశం అగ్నిని పూజించటమే అనుకొంటారు కొందరు. కాని 'అగ్ని' అంటే ఆత్మ చైతన్యం, ఆత్మ మేల్కొనేప్పుడు కలిగే తేజస్సు అని భావించటం మంచిది.
ఋగ్వేదంలోని ఆఖరి సూక్తం అగ్నికి సంబంధించినదే అయినా, అందరి శ్రేయస్సునూ కోరే శ్లోకాలున్నాయి అందులో. ''అందరూ కలిసి ఏకమానసులై ఆలోచింతురు గాక. అందరి హృదయాలూ ప్రేమతో బంధింపబడుగాక. అందరికీ ఒకే లక్ష్యముండుగాక. అందరూ ఏకొన్ముఖులై సంతుష్టులగుదురు గాక'' - ఈ వాక్యాలతో ఋగ్వేదము సమాప్తమవుతుంది.
సకల దేవతాస్తోత్రాలు కలిగి యుండటమే ఋగ్వేదపు విశిష్టత. సామాజిక వర్తనమెట్లా ఉండాలో మిగిలిన వాటన్నిటి కంటె ఉత్తమంగా చెప్తుంది : అందువల్లనే విజ్ఞులు దానిని ఆరాధిస్తారు. ఉదాహరణకి : పెళ్ళికి సంబంధించిన కర్మలు సూర్యుని కుమార్తె యొక్క వివాహముననుసరించి నిర్దేశింపబడ్డాయి. ఊర్వశీపురూరవుల సంభాషణల వంటి విశేష సన్నివేశాలు కూడ ఋగ్వేదంలో ఉన్నాయి. తరువాతి కాలంలో కాళిదాసు వంటి మహాకవులు వీటినే విస్తరించారు.
ఋగ్వేదంలో, ఉషస్సునుద్దేశించిన భాగాలను రసజ్ఞులు మహోన్నతమైన పద్యకావ్యాలుగా శ్లాఘిస్తారు. వేదాలన్నిటిలోనూ అగ్రస్థానం ఋగ్వేదానికి కలగటానికి ఏదో కారణముండి ఉండాలి. ఋగ్వేదంలో ఋక్కులు నాద భరితమయిన సామవేద మంత్రములకు మాతృకలవంటివి. ''ఋచ్యధ్యూఢం సామ''
యజుర్వేదం :
''యజుస్'' అన్న పదం ''యజ్'' అన్నధాతువు నుంచి వచ్చింది. ''యజ్'' అంటే పూజించుట లేక ఆరాధించుట. 'యజ్ఞ' మనే పదం కూడ ఈ ధాతువు నుంచే వచ్చింది.
''ఋక్'' అంటే స్తోత్ర మయినట్లుగానే, ''యజుస్'' అన్న పదం యజ్ఞానికి కావలసిన కర్మకాండని సూచిస్తుంది. ఋగ్వేదంలో స్తోత్ర రూపంలో ఉన్న మంత్రాలకి, యజ్ఞం చేయటానికి వీలయిన రూపాన్ని యజుర్వేదం కల్పిస్తుంది. అంతేకాక, రకరకాల యజ్ఞాలని కొనసాగించే పద్ధతులని కూడ వచన రూపంలో యజుర్వేదం సూచిస్తుంది.
స్తోత్రంతో ఆరాధించటం నేర్పుతుంది ఋగ్వేదం. ఈ మంత్రాలనే, ఈ స్తోత్రాలనే యజ్ఞం చేయటానికి ఎట్లా ఉపయోగించుకోవాలో యజుర్వేదం నేర్పుతుంది.
మిగిలిన వేదాలకు వలెనే, యజుర్వేదానికి కూడా ఎన్నో శాఖలున్నాయి కాని వీటిలో ముఖ్యమైనవి రెండే. వీటికి ఎన్నో పాఠాంతరాలున్నాయి.
ఈ రెండు శాఖలను - శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదము అంటారు. 'శుక్ల' అంటే తెల్లని, 'కృష్ణ' అంటే నల్లని, శుక్ల యజుర్వేద సంహితని ''వాజసనేయ సంహిత'' అంటారు. 'వాజసని' అంటే సూర్యుడు. సూర్య భగవానుని వద్ద నేర్చుకొని యాజ్ఞవల్క్యముని లోకానికి ఈ సంహితను ఎరుక పరచాడంటారు. అందువల్లనే దీనిని 'వాజసనేయ సంహిత' అంటారు.
సూర్యుని వద్ద యాజ్ఞవల్క్యుడు వాజసనేయ సంహితను నేర్చుకోవటం గురించి ఒక కథ ఉంది. వ్యాసుడు వేదాలనన్నిటినీ నాలుగుగా విభజించినప్పుడు యజుర్వేదానికి ఒక శాఖేఉండేది. దీనిని వ్యాసమహర్షి వైశంపాయనునకు భద్రపరచమనీ, తన శిష్యుల ద్వారా ప్రచారం చేయమనీ యిచ్చాడట. యాజ్ఞవల్క్యుడు వైశంపాయనుని వద్ద దీనిని అధ్యయనం చేశాడు. గురుశిష్యుల నడుమ ఒక భేదాభిప్రాయం రావటంతో, వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుని తాను నేర్పిన సంహితను తిరిగి యిచ్చేయమని కోరాడు. ఇది న్యాయమేనని గ్రహించి యాజ్ఞవల్క్యుడు ఆ విధంగా చేశాడు. ఆ తరువాత సూర్య భగవానుడిని తనను శిష్యునిగా స్వీకరింపుమని కోరాడు. సూర్య భగవానుడు అంగీకరించి, యజుర్వేదమనీ పేరు వచ్చింది. దీనికీ పేరు రావటం వల్ల, అంతకు పూర్వం వైశంపాయనుడు నేర్పిన దానిని కృష్ణయజుర్వేదమన్నారు.
కృష్ణ యజుర్వేదములో సంహిత బ్రాహ్మణ భాగాలు స్పష్టముగా విభజింప బడిలేవు.
యజుర్వేదం యొక్క ఘనత అంతా వైదిక కర్మలను, కర్మకాండను విశదీకరించటంలోనే ఉన్నది. దర్శపూర్ణమాసం, సోమయాగం, వాజపేయం, రాజసూయం, అశ్వమేధం - వంటి యాగాల నిర్వహణాక్రమాన్ని వివరంగా కృష్ణయజుర్వేదంలోని తైత్తిరీయ సంహిత తెల్పుతుంది. అంతేకాక, ఋగ్వేదంలో కానరాని కొన్ని స్తోత్రాలు కూడ యజుర్వేదంలో ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న శ్రీ రుద్రం యజుర్వేదం లోనిది. ఋగ్వేదంలో అయిదు సూక్తాలు ''పంచరుద్రం''గా ఉన్నాయి, నిజమే. కాని యజుర్వేదంలో ఉన్న దానినే శ్రీ రుద్రమంటారు. అందువల్లనే అప్పయ్య దీక్షితులవారు అనబడే శివభక్తుడు, తాను యజుర్వేదంలో జన్మించి యుంటే పరమ శివుడ్ని యజుర్వేదం ద్వారానే ఆరాధించగలిగే వాణ్ణి కదా అని వాపోయారు. ఆయన సామవేదాన్ని అనుసరించే కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం అత్యధికులు యజుర్వేదాన్నే అనుసరిస్తున్నారు. ఉత్తర భారతంలో శుక్ల యజుర్వేదాన్ని ఎక్కువగా ఉన్నది. దక్షిణ భారతంలో కృష్ణ యజుర్వేదాన్ని, ఋగ్వేదంలోని పురుషసూక్తం కొద్ది మార్పులతో యజుర్వేదంలో కూడ ఉంటుంది. కాని ''పురుషసూక్త'' మన్నప్పుడు యజుర్వేదంలోని పురుషసూక్తమనే అర్థం చేసుకోవాలి.
అద్వైత సిద్ధాంతావలంబులకు యజుర్వేదం అత్యంత ప్రధానం. ఏ సిద్ధాంతానికైనా ఒక సూత్ర ముండాలి - దానికొక భాష్యముండాలి - దానికొక వార్తికముండాలి (అంటే విపులమైన వ్యాఖ్యానం)
సిద్ధాంతాన్ని క్లుప్తంగా చెప్పేది సూత్రం. ఆ సూత్రానికి వివరణ ఇచ్చేది భాష్యం. భాష్యానికి ఇంకా వివరమైన వ్యాఖ్యానమిచ్చేది వార్తికం. అద్వైత సిద్ధాంతంలో వార్తిక కర్త (అంటే, వార్తికం వ్రాసినవాడు) ఆది శంకరుల శిష్యుడు సురేశ్వరులే - ఈ పదం ఇంకెవ్వరికీ వర్తించదు. ఆయన ఏ భాష్యానికి వార్తికం వ్రాశాడు? ఉపనిషత్తులని సూత్రాలన్నామంటే ఆదిశంకరులు వాటికి భాష్యం వ్రాశారు. ఆయన వేదవ్యాసులు (బాదరాయణుడు) రచించిన బ్రహ్మ సూత్రాలకి కూడ భాష్యం వ్రాశారు.
ఆచార్యుల వారి ప్రత్యక్ష శిష్యులు సురేశ్వరులు. ఉపనిషత్ భాష్యంపై వార్తికం రచించారు. ఆయన తన వ్యాఖ్యానాన్ని ప్రధానమైన పది ఉపనిషత్తులమీదా కాక రెండింటిమీదే వ్రాశారు. అవి తైత్తిరీయ, బృహదారణ్యక ఉపనిషత్తులు. ఈ రెండూ క్రమంగా కృష్ణయజుర్వేదానికీ శుక్లయజుర్వేదానికీ సంబంధించినవి. రెండూ యజుర్వేదానికీ సంబంధించినవి కావున అద్వైత సిద్ధాంతావలంబులకు యజుర్వేదమెంతో ముఖ్యం.
సామవేదం :
''సామ'' అంటే మనస్సుకి శాంతినివ్వటం. అంటే, శాంతంతో మనస్సు సౌఖ్యం పొందేట్టు చేయటం. శత్రువుని జయించటానికి ఉపయోగించే ఉపాయాలు నాలుగు విధాలు. అవి సామ, దాన, భేద, దండోపాయాలు. వీటిలో మొదటిది ''సామ'', శత్రువుని ప్రేమతో, అనునయంతో లొంగదీసుకోవటం. ఋగ్వేదంలోని ఋక్కులకు సామవేదంలో మనోహరమైన సంగీతం కూర్చబడింది. ఋగ్వేద మంత్రాలను ఉదాత్త, అనుదాత్త స్వరాలతో పఠిస్తారు. కాని సామవేదంలో దీర్ఘ స్వరాలతో గానం చేస్తారు భారతీయ సంగీత సంప్రదాయంలోని సప్తస్వరాలకి ఆధారమూ, మూలమూ సామగానమే అనవచ్చు. సామగానం వల్ల (అంటే సామవేదంలో నిర్దేశింప బడినట్లు) స్తోత్రాలను గానం చేయటం వల్ల సకల దేవతలనూ తృప్తి పరచవచ్చు. యజ్ఞాలను నిర్వహించేటప్పుడు మనం సమర్పించే ఉపహారాలతోనే కాక, ఉద్గాత అనబడే ఋత్విక్కు చేత చేయబడే సామగానం చేతకూడ దేవతలు మనలను అనుగ్రహిస్తారు.
ప్రధానంగా, ఋగ్వేదంలోని మంత్రాలే అయినా ఆధ్యాత్మిక ఉన్నతికీ, దేవతల అనుగ్రహానికి పాత్రులవటానికీ ఎంతో అనుకూంలగా స్వరపరుప బడ్డాయవి. సామవేదం యొక్క ప్రత్యేకత యిదే. అందువల్లనే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ''వేదాలలో సామవేదం నేను'' అంటాడు. లలితాసహస్రనామసోత్రంలో లలితా దేవికి గల నామాలలో ''సామగాన ప్రియ'' అన్న దొకటి. అంటే, సామవేదాన్ని గానం చేస్తే ప్రసన్నమవుతుందని భావం.
అధర్వవేదం :
''అధర్వణుడు'' అంటే పురోహితుడు, ఆచార్యుడు. 'అధర్వణుడు' అనే పేరుతో ఒక ఋషి ఉండేవాడు. అధర్వవేదంలోని మంత్రాలు ఆ ఋషి వల్లనే లోకానికి తెలిసినవి. కష్టాలని పారద్రోలటానికీ, ఈ వేదంలో శత్రువులని సంహరించటానికీ ఉపయోగపడే మంత్రాలెన్నో ఉన్నాయి. అవి వచన రూపంలోనూ, పద్యరూపంలోనూ ఉన్నాయి. ఇతర వేదాలలో పేర్కొనబడని దేవతలకి సంబంధించిన మంత్రాలు అధర్వవేదంలో ఉంటాయి.
అధర్వవేదంలో సృష్టికి సంబంధించిన మంత్రాలు కూడ చాలా ఉన్నాయి. సృష్టి ఎంత అద్భుతమైనదో వర్ణించే గీతం ''పృథ్వీ సూక్తం''. ఇది అధర్వవేదంలోనిది.
యజ్ఞాల నిర్వహణను పర్యవేక్షించే బ్రహ్మ అధర్వవేదానికి ప్రతినిధి. ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తులు ఈ వేదంలోనివి.
సత్యాన్వేషకుడైన ముముక్షువునకు మాండూక్యోపనిషత్తు మోక్షాన్ని స్తుందన్న నానుడి ఒకటుంది. దీనిబట్టి ఈ వేదం యొక్క ప్రాముఖ్యం గ్రహించవచ్చు.
సర్వశ్రేష్ఠమైన గాయత్రి మంత్రం ఋక్, యజః, సామవేదాల సారమంటారు. అంటే, అధర్వ వేదానికి వేరే మంత్ర ముందన్న మాట - అందువల్ల, అధర్వ వేదాన్ని అధ్యయనం చేసేముందు వేరొక ఉపనయనం చేసుకొని బ్రహ్మోపదేశం పొందుతారు.
ఉపనయనంలో బాలురకు ఉపదేశింపబడే గాయత్రిని ''త్రిపదాగాయత్రి'' అంటారు. అంటే, ''మూడు పాదాలు కలది'' అని అర్థం. ఒక్కొక్క పాదమూ ఒక్కొక్క వేదసారం. కాని అధర్వవేదానికి వేరే గాయత్రి ఉంది. అందువల్లే అధర్వవేదాన్ని పఠించే ముందు, అధర్వ గాయత్రి ఉపదేశం పొందాలి. ఋక్, యజుః, సామవేదాలకు ఒకే గాయత్రి ఉండటం వల్ల ఆ మూడింటిలో ఒక వేదాన్ని అధ్యయనం చేసినవాడు మిగిలిన రెండింటినీ అధ్యయనం చేయాలంటే మళ్లీ ఉపనయనం చేసికొనక్కర్లేదు.
ఒకప్పుడు అధర్వవేదం ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఆ వేదశాఖలని ఎరిగిన వారు మాత్రమిప్పుడు బహుకొద్ది మందే ఉన్నారు. దక్షిణ భారతంలో అసలు లేనే లేరు. ఆ కారణం వల్ల ఈ వేదశాఖ పారాయణం చాలా దయనీయమైన స్థితిలో ఉన్నదిప్పుడు. ఒరిస్సా బ్రాహ్మణులలో పద్దెనిమిది శాఖలున్నాయి. అందులో ఒకటి ''అధర్వనిక'' అంటే, అధర్వ వేదానికి చెందిన వారని అర్థం. ఇప్పటికీ ఆధర్వ వేదాన్ని అనుసరించే వారు కొద్దిగా గుజరాత్, సౌరాష్ట్ర, నేపాలులో ఉన్నారు.
నియమాలను పాటించటంలోనూ, పఠనాపద్ధతిలోనూ నాలుగు వేదాలూ పైకి వేరువేరుగా కనబడినా అన్నిటికీ ఒకే లక్ష్యం : అది విశ్వశ్రేయస్సు, ప్రతి యొక్కరి ఆధ్యాత్మిక ప్రగతీను.
''ఇదే మార్గం'' ''ఇదే దైవం'' అంటూ ఏ వేదమూ పేర్కొనదు - ఇదే వేదాల ప్రత్యేకత. ఏ మార్గాన్ని విశ్వాసంతో, చిత్తశుద్ధితో అవలంబించినా ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించినా ఒకే గమ్యాన్ని చేరుస్తాయంటాయి వేదాలు. పైగా, విభిన్న మార్గాలను అనుసరించవచ్చంటూ ప్రపంచంలో మరే యితర పవిత్ర గ్రంథమూ సూచించదు. ప్రతి మతమూ తన మార్గమే కైవల్యాన్నిస్తుందంటుంది. సత్యాన్వేషణకి ఏ మార్గానన్నా అనుసరించవచ్చన్న విశాల దృక్పథం వేదాలకే ఉన్నది. వేదాల గొప్ప తనమంతా యిదే.
బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు :
వేదాల గురించి ముచ్చటించేప్పుడు మన మింత వరకూ 'సంహిత''ల గురించే చెప్పుకొన్నాం. వేదంలో ముఖ్యమయిన భాగం ''సంహిత'' విభాగమే. అదికాక, ప్రతి వేదానికి బ్రాహ్మణ, ఆరణ్యక భాగాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణాలు వైదిక కర్మలను, వాటిని ఆచరించవలసిన పద్ధతులను చెప్పుతాయి.
సంహితలోని మంత్రాలను యజ్ఞంలో ఉపయోగించటానికి బ్రాహ్మణాలు మార్గ దర్శకపు సూచనలనిస్తాయి. అంటే, ప్రతి మాటకూ అర్థం చెప్పి మంత్రాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ఉపకరిస్తాయి.
'ఆరణ్యక' అన్న పదం 'అరణ్య'మన్న మాటనుండి వచ్చింది. సంహిత విభాగంగాని, బ్రాహ్మణ విభాగంగాని పట్టణాన్ని విడిచి అడవులలో వ్యక్తి ఏకాంతాన్ని వెతుక్కోవాలని ఎక్కడా చెప్పవు. యజ్ఞాలూ ఇతర క్రతువులూ గృహస్థుల కోసం నిర్దేశింపబడినవే. కాని వైదిక కర్మలు కేవలం భౌతికమైన సంపదనే కాక, దీక్షాదుల వల్ల చిత్తశుద్ధి కూడ కలిగించటానికి ఉద్దేశింపబడ్డాయి. ఈ చిత్తశుద్ధి కలిగిన తరువాత ఏకాగ్రతకీ, ధ్యానానికీ దోహదకారి యైన ఏకాంతాన్ని అరణ్యాలలో కల్పించుకోవాలి. వేదపారాయణమూ, యజ్ఞ నిర్వహణమూ, నియమపాలనమూ ఇవన్నీ నిజతత్త్వాన్ని తెలుసుకోవటానికి కావలసిన ధ్యానానికి సమాయత్త పరచే ప్రాథమిక దశలు.
సంహితలోని మంత్రాలకీ, బ్రాహ్మణాలలోని కర్మలకీ వెనుక గల అంతరార్థాన్ని, సిద్ధాంతాన్నీ వివరించటమే ఆరణ్యకాల ఉద్దేశ్యం. వేదాలలో నిక్షిప్తమైన నిగూఢ భావాలను విశద పరచటమే ఆరణ్యకాల ప్రయోజనం. ఆరణ్యకాల ప్రకారం - యజ్ఞ నిర్వహణకంటే యజ్ఞాలు ఎందుకు జరపాలో తెలుసుకోవటం ముఖ్యం. అరణ్యాలలో ఒంటరిగా ధ్యానం చేసుకొనే ఋషుల కృషియే ఆరణ్యకాలని ఆధునిక పరిశోధకులంటారు. ఆరణ్యకానికీ, ఉపనిషత్తుకీ సమ్మేళనమైన బృహదారణ్యకోపనిషత్తు అశ్వమేధ యజ్ఞాన్ని గురించిన విశ్లేషణతో ప్రారంభిస్తుంది!
* * *