Acharyavaani - Vedamulu Chapters Last Page
8. ఉపనిషత్తులు
ఆరణ్యకాల చివర ఉపనిషత్తులుంటాయి. 'సంహిత'ని ఒక వృక్షంతో పోలిస్తే బ్రాహ్మణాలు దాని పుష్పాలు, ఆరణ్యకాలు పక్వంచెందని కాయలు, ఉపనిషత్తులు పక్వం చెందిన ఫలాలు. పరమాత్మకీ జీవాత్మకీ భేదం లేదన్న సత్యాన్ని జ్ఞానమార్గం ద్వారా తెలుసుకోవట మెట్లాగో ఉపనిషత్తులు తెల్పుతాయి. ఉపనిషత్తులలో కూడా వివిధ విద్యలకీ, యజ్ఞాలకీ, దేవతారాధనలకీ సంబంధించిన ప్రస్తావనలున్నా ప్రధానంగా వాటిలోని విషయం తత్త్వవిచారం, బంధ విమోచనం కలిగిన మానసిక స్థితీని.
వేదాలకి రెండు భాగాలున్నాయంటారు. మొదటిది కర్మకాండ - అంటే క్రతువుల నిర్వహణకి సంబంధించినది. రెండవది - జ్ఞానకాండ అంటే జ్ఞానానికి సంబంధించినది. వీటినే పూర్వ మీమాంస అనీ, ఉత్తరమీమాంస అనీ అంటారు.
కర్మకాండని విశ్లేషించిన తరువాత జైమిని మహర్షి అది వేదతత్త్వానికి అంతిమ ఫలమన్నాడు. ఆ విశ్లేషణ శాస్త్రమును పూర్వ మీమాంస అంటారు. జ్ఞానకాండను విశ్లేషించిన వేదవ్యాసుడు దానినే వేదాల సారమన్నాడు. ఈయన రచన బ్రహ్మసూత్రాలు - ఇవి సూక్తుల వలె ఉంటాయి. కర్మకాండతో పోలిస్తే జ్ఞాన కాండలోని ఉపనిషద్భాగం చాలా సంక్షిప్తం, క్లుప్తమూను. జైమిని పూర్వమీమాంసలో వెయ్యి అధికరణాలున్నాయి, బ్రహ్మ సూత్రాలలో కేవలం నూటతొంభైరెండు మాత్రమున్నాయి. ఏ వృక్షానికైనా ఎన్నో ఆకులూ, కొద్దిగా పూలూ, ఫలాలూ ఉన్నట్టే వేదమనే వృక్షానికి కర్మకాండ రూపంలో అనేకమైన ఆకులు, ఉపనిషత్తుల రూపంలో కొద్దిపాటి పళ్లూ ఉన్నాయి. కేవలం మేధతోనే పరిశీలించిన పాశ్చాత్యతత్త్వజ్ఞులు పరమసత్యపుటంచులను గ్రహించటానికి అవసరమైన ప్రగాఢమైన కృషిని చేయలేదు. మేధ వల్ల కలిగిన నిశ్చితాభిప్రాయాలకు అనుభవ సిద్ధమైన ప్రమాణాలు కావాలి. ఇతర తాత్త్వికరచనలకు లేని విశేషమైన లక్షణం ఉపనిషత్తులకుంది. తాత్త్విక భావాలను మంత్రాలలో ఇమిడ్చాయి. ఆ మంత్రాల పఠనం వల్ల ఏర్పడే ప్రకంపనలు ఆ తాత్త్విక భావాలను అనుభవనీయం చేస్తాయి.
ఇతర తత్త్వాలు కేవలం బుద్ధి ప్రేరకాలైన పరిశోధనల వలె ఉండగా, ''కర్మకాండ'' వేదాల తత్త్వాన్ని గ్రహించేందుకు వీలైన జీవనవిధానాన్ని నిర్దేశిస్తుంది. వాటి ననుసరించి జీవిస్తే మనస్సు శుద్ధమవుతుంది. ప్రాపంచక వ్యవహారాల నుంచి అప్పుడు మనస్సుని ఉపసంహరించ వచ్చుకూడా. ఆ తరుణంలో నిష్టతో ఉపనిషత్తులని అధ్యయనం చేస్తే అది కేవలం బుద్ధి సూక్ష్మతని పెంచే వ్యాసంగం కాక, ఒక జీవన విధానంగా - జీవితానుభవంలో ఒక అంశంగా నిలిచిపోతుంది.
ఈ తాత్త్వికానుభూతి శిఖరాన జీవాత్మ - పరమాత్మల అద్వైత స్థితి అవగాహన అవుతుంది. ఆ స్థితిని చేరటానికి కర్మానుష్ఠానానికి అలవాటు పడిన వ్యక్తి అన్ని వ్యాపకాలనూ విడచి సన్న్యాసి కావాలి. ఆ దశలో అతనికి మహావాక్యప్రబోధం జరుగుతుంది. ప్రతి వేదంలోనూ కొన్ని మహావాక్యాలున్నాయి. ఇవి మహనీయమైన సూక్తులు. కాని ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్కటి చొప్పున నాలుగు మహావాక్యాలు బాగా ఆలోచింప చేసేవి. శక్తి మంతమైనవీను. జీవునికీ బ్రహ్మానికీ భేదం లేదని ఇవి చూపుతాయి. వీటిని జపిస్తూ దీర్ఘంగా చింతిస్తే ఆ అద్వైత స్థితి అనుభవసిద్ధమవుతుంది. ఈ నాలుగు మహా వాక్యాలూ ఉపనిషత్తులలోనే ఉన్నాయి. ఎన్నో క్రతువులూ. కర్మలూ, రకరకాల ఆరాధనా పద్ధతులూ, సంహితలోను, బ్రాహ్మణాలలోనూ విశదీకరింప బడ్డా జీవనయాత్ర చరమ దశలో అంతిమ లక్ష్యాన్ని చేరుకోవటానికి సాధనాలు ఉపనిషత్తులే.
ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తులో ఒక మహావాక్యముంది. ''ప్రజ్ఞానమ్ బ్రహ్మ - ఆనందానుభూతే బ్రహ్మం. శుక్లయజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్తులోని మహావాక్యం ''అహం బ్రహ్మాస్మి'' (నేనే బ్రహ్మము) - తైత్తిరీయ ఉపనిషత్తు. నాల్గవ అధ్యాయంలో, కొద్ది మార్పు గల మరొక మహావాక్యముంది. ''అహమస్మి బ్రహ్మాహమస్మి'', సామవేదంలో చాందోగ్యోపనిషత్తులో గురువు శిష్యునకు బోధిస్తున్నట్టు ఒక మహావాక్యముంది : ''తత్త్వమసి'' (అదే నీవు) అధర్వవేదంలోని మాండూక్య ఉపనిషత్తులోని మహావాక్యం ''అయమాత్మా బ్రహ్మ'' (ఆత్మే బ్రహ్మం).
ఆధ్యాత్మిక ప్రగతిని కోరే వారనుసరించ వలసిన విధానాన్ని ఆదిశంకరుల వారు ''సోపాన పంచక''మన్న పేర అయిదు శ్లోకాలలో చెప్పారు ''వేదాలను అధ్యయనం చేసి, వాటిలో నిర్దేశింపబడిన కర్మలను ఆచరించ''మని ప్రారంభించి ''మహావాక్యాలననుసరించు, వాటిని నిరంతరం ధ్యానం చేసి, బ్రహ్మీస్థితిని పొందు'' మంటారు చివరికి. వేదాల ముఖ్యోద్దేశమూ, పరమార్థమూ ఉపనిషత్తులే. అందువల్లనే వాటిని వేదాంతమన్నారు. ''అంత''మంటే 'చివర' అని భావం. వేదాలకు ఉపనిషత్తులు రెండు విధాల 'అంతం' అని చెప్పవచ్చు. ఒక్కొక్క (వేదాన్ని) అంటే శాఖని పరీక్షిస్తే మొదటి సంహిత, తరువాత బ్రాహ్మణ, ఆ తరువాత ఆరణ్యక భాగాలు వస్తాయి, చివరలో ఉపనిషత్తుంటుంది. రెండవ అర్థమిది - వేదాల లక్ష్యం, పరమార్థం ఉపనిషత్తులలోనే ఉన్నది. పాఠ్యప్రణాళికా పరంగానూ, లక్ష్యసాధనగానూ కూడా ఉపనిషత్తులు వేదాలకు అంతమే.
ఊరిలో గుడీ, గుడిగోపురమూ. గోపురశిఖరమూ - ఒకదాని కంటె ఒకటి ఎత్తుగా ఉంటాయి. ఆ విధంగానే వేదాలకు ఉపనిషత్తలు శిఖరం వంటివి.
''ఉప-ని-షద్'' అంటే ''ప్రక్కన కూర్చుండటం'' ''శిష్యుణ్ణి ప్రక్కగా కూర్చుండ బెట్టుకొని బోధించినది'' అని అర్థం. ఇంకో అర్థం : ''బ్రహ్మానికి చేరువగా తీసుకుపోయేది'', 'ఉపనయన'మన్న మాటకీ రెండర్థాలున్నాయి ''గురువు దగ్గరకు తీసుకుపోయేది'', ''పరమాత్ముని వద్దకు తీసుకుపోయేది''. ఆ విధంగానే 'ఉపనిషత్తు' అన్న మాటకీ రెండర్థాలు చెప్పుకోవచ్చు.
ఉపనిషత్తు సూక్ష్మాతిసూక్ష్మమైన సత్యాలను వివరిస్తూ ''ఇది ఉపనిషత్తు'' ''ఇది ఉపనిషత్తు'' అంటూంటుంది. వేదాలలో నిక్షిప్తమైన దానిని ''రహస్య''మంటారు. యోగ్యులైన వారికి గోప్యంగా వ్యక్తిగతంగా ఇవ్వవలసిన ఉపదేశాలు ఉపనిషత్తులు.