Acharyavaani - Vedamulu Chapters Last Page
9. బ్రహ్మసూత్రములు
ప్రతి తాత్త్విక సిద్ధాంతానికీ సూత్రము, భాష్యము, వార్తికమూ ఉంటాయన్నాను. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీకంఠుడు (శైవసిద్ధాంత ఆచార్యుడు) మొదలైన వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలను సామూహికంగా ''వేదాంతమత''మంటారు. ప్రతి ఆచార్యులూ తన సిద్ధాంతమే ఉపనిషత్తులలో ఉన్నదంటారు. ప్రధానమైన పది ఉపనిషత్తుల మీదా ఆ ఆచార్యులు భాష్యాలు వ్రాశారు. కాబట్టి వేదాంతమతానికి ఉపనిషత్తులు సూత్రాలవంటివి.
నిజానికి ఉపనిషత్తులు సూత్రాలు కావు, సూత్రాలవలె ఉండవు.
సూత్రమెట్లా ఉండాలి? ఒక భావాన్ని సాధ్యమైనంత సంక్షిప్తంగా వ్యక్తీకరించగలది సూత్రం. ఈ నిర్వచనం ప్రకారం ఉపనిషత్తులు సూత్రాలు కానేరవు. కాని ఉపనిషత్తుల ప్రతిపాదనలన్నిటినీ సూత్ర రూపంలో దొరికే ఒక పాఠముంది. ఇవి బాదరాయణుడు కూర్చిన ''బ్రహ్మసూత్రాలు''. బాదరాయణుడంటే వేదవ్యాసుడు. కొంతకాలం బదరీవృక్షాచ్ఛాయని నివసించటం వల్ల ఆయనకి బాదరాయణుడన్న పేరు వచ్చింది. బ్రహ్మసూత్రాలపై చాలా భాష్యాలున్నాయి, ఆయా భాష్యకారుల దృక్పథాన్ని బట్టి. జీవుడంటే ఏమిటి? జీవుడుండే జగత్తు అంటే ఏమిటి? దీనికంతటికీ మూలమైన తత్త్వమేమిటి? ఈ మూడు విషయాల గురించీ బ్రహ్మసూత్రాలలో ఉంటుంది. వేదాంత సిద్ధాంతాలకి సంబంధించిన ప్రాథమిక పాఠమదే.
ఇదైనా వ్యాసులవారి వ్యాఖ్యానం కాదు. అప్పటికే ఉన్న ఉపనిషత్ జ్ఞానం ప్రకారమే ఆయన వ్రాశాడు. ఉపనిషత్తులు వేదాలకి ఉత్తరార్థంలోవి కావటంవల్ల వాటిని ''ఉత్తరమీమాంస'' అంటారు. బ్రహ్మసూత్రాలు కూడ ఉత్తరమీమాంసలో భాగాలే.
ఈ గ్రంథంలో నాలుగు అధ్యాయాలున్నాయి. 555 సూత్రాలున్నాయి. ప్రతి అధ్యాయంలోనూ నాలుగు భాగాలున్నాయి. మొత్తం 192 అధికరణలు (విభాగాలు) ఉన్నాయి.
సన్న్యాసుల జీవితలక్ష్యం గురించే బ్రహ్మసూత్రాలు చెప్తాయి కనుక వాటిని ''భిక్షుసూత్ర''మని కూడ అంటారు. శరీరంలోని ఆత్మ గురించిన చింతన కనుక 'శారీరక మీమాంస' అని కూడా అంటారు.
''సూత్ర''మంటే దారమని కూడా అర్థముంది. స్త్రీలు ధరించే ''మంగళసూత్రం'' అన్న మాటకూడ దానిలోని ''దారం'' నుండే వచ్చింది. ఈ భావాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆదిశంకరుడు, ''వేదాంత వాక్యకుసుమ గ్రథనత్వాత్'' అన్నాడు. వేదాంతమనే వృక్షం రాల్చిన వేదాంతకుసుమాలని సూత్రబద్ధం చేయకపోతే, ధరించేదెట్లా? అందువలనే ''బ్రహ్మసూత్రం'' వాటిని బంధించే దారం వంటిది. హిందూ ధర్మమని చెప్పుకొనే సంప్రదాయాలకీ, సిద్ధాంతాలకీ ప్రమాణం బ్రహ్మసూత్రమైతే, ఆ బ్రహ్మసూత్రానికి పూర్వరంగంలో ఉన్న ప్రమాణాలు ఉపనిషత్తులు.
అందువల్ల వైదికమత శాఖలన్నిటినీ ఔపనిషద ధర్మమంటారు. అంటే ఉపనిషత్తుల మతమని. వేదాలలో ఉపనిషత్తులు అతిముఖ్యమైన భాగాలవటం వల్ల వాటిని ''శృతిశిఖరా''లంటారు. శరీరానికి శిరస్సు ముఖ్యమైన భాగం కదా!
* * *