Acharyavaani - Vedamulu Chapters Last Page
ముందుమాట
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు కాంచీపుర శంకరమఠాధిపతిగా మాత్రమే కాక, ఒక మహామునిగా మనందరి హృదయాలలో అత్యంత గౌరవస్థానమందున్నారు. వారు అనుగ్రహించిన భాషణలు ''వేదములు'' అనే పేరుతో ఉన్న విషయాన్ని ఆంగ్లం నుంచి తెలుగు భాషలోనికి శ్రీ పింగళి సూర్యసుందరంగారు అనువదించారు. ఇది ఇరువదియైదు వ్యాసముల సంపుటిగా గ్రథితమైంది. వేదములను గురించి సామాన్యులే కాక, పండితులు కూడ గ్రహించి పొందవలసిన విషయములు శ్రీవారి భాషణలో ఎన్నో యున్నవి.
వేదములను అధ్యయన మొనర్చి షట్ఛాస్త్రములను చదివి, వేదార్థమును తెలిసిన పండితులను గూర్చి ''వారు సాంగోపాంగముగ వేదమును అధ్యయనము చేసినార''ని మనమందుము. అనగానేమి? సాంగవేదాధ్యయనము యొక్క స్వరూప, ప్రయోజనము లెట్టివి? వాటి వివరములు, విశిష్టత ఎట్టిది? ఈ విషయములు సామాన్యులకు తెలియవు. పండితుల వద్దకు పోయి అడిగినచో వారు శాస్త్ర బోధ చేయింపగలరు కాని, మృదువైన భాషలో సామాన్యునికి అర్థమగునట్లు బోధించుట వారికి కష్టము. సముద్రము వంటి ఆర్యధర్మమును ఆపోశనపట్టి, జీర్ణించుకొని, సామాన్యుని అల్పజ్ఞతను కూడ వాత్సల్యముతో గ్రహించగలిగిన దయామూర్తికి మాత్రమే ఇట్టి బోధ సాధ్యము కాగలదు. ఇందు వేదస్వరూపము, దాని అపౌరుషేయత్వము, దాని స్వయం ప్రామాణికత, వేద మంత్రమందలి నిగూఢమైన శక్తి, అట్టి శక్తికి హేతుభూతమైన శబ్ద, స్వర లక్షణములు వివరించుటలో శ్రీవారు ఈ కాలపు ప్రజలను జ్ఞానామృత వర్షముతో తడిపినారు. ప్రధాన విషయమేమన, మనకు పండితులు లేకపోలేదు. ఈ విషయమునంతను వారు కూడ వివరించి యుండవచ్చును. కాని వేదార్థములు, రచింపబడినవి, కొంత వైవిధ్యము కలవిగానున్నవి. అదెట్లు? వేదకర్మల విషయమై అవి వేదాంత దృక్పథగామికి అనావశ్యములనియు, వాటిని గురించిన విజ్ఞానము శూన్యమే అయినను, తమ తాత్త్విక చింతనకు వాటి జ్ఞానము నిరుపయోగ మగుటయే కాక, అది తమ మార్గమునకు అవరోధమగునని అనేకులు భావించు కాలమిది. అట్లే కేవల వేదాధ్యయనము, శ్రౌత యజ్ఞములు - వీనితోనే జన్మ చరితార్థమగునని భావించువారు ఎచ్చటనైనను వుండవచ్చును. ఆర్యధర్మసమగ్రస్వరూప మిట్టిదని ఆకళింపు చేసుకొనిన వారు మాత్రమే ఇట్టి యపప్రధలను తొలగింప సమర్థులు. శ్రీవారట్టివారు.
వేదములు మహర్షుల తపస్సులందు మాత్రమే భూలోకమున అవతరించినవి. వాటి స్వరూపస్వభావములు మరల తపోధ్యానములందు కాక మరి ఎట్లు కేవల శాస్త్ర జ్ఞానముచే గాని, పదునైన బుద్ధితో గాని పూర్తిగా అవగతముకాగలదు? శ్రీవారి శాస్త్రజ్ఞానమునకు వెనుక వారి తపోధనమున్నది. అందువలన వారి మాటలకు ఒక ప్రామాణికత కలదు. వారి మాటలు సందేహ నివృత్తి చేయగలిగిన తుది నిర్ణయములుగా మనము స్వీకరింపవచ్చును.
వారి నవీన శాస్త్ర విషయపరిజ్ఞానము కూడా సమగ్రమనుట అతిశయోక్తి కాదు. అట్టి విషయములందు వారి వేద విజ్ఞాన తులనాత్మకత మరియు విశేషము. వారి మాటలిట్లున్నవి:
''భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది.... ఉదయించి..... అస్తమిస్తున్నట్లు కనిపిస్తుంది.... ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. అందులో సూర్యోదయంగాని, సూర్యాస్తమయంగాని లేవని ఉంది''.
''ఉత్తర ధృవానికి ఇంకా ఉత్తరంగా ఏ ప్రదేశ##మైనా ఉంటే అక్కడే మేరువుంది. అక్కడే స్వర్గముంది''.
''వేదాలలో జ్ఞానకాండ, అంటే ఉపనిషత్తులు, అద్వైతం గురించి చెబుతుంది. కాని ద్వైతం గురించి చెప్పే కర్మకాండ తరువాతనే ఉంటుంది''.
''కర్మల నాచరించటం వల్ల కలిగే చిత్తశుద్ధి లభించిన తర్వాతనే ఆత్మవిచారాన్ని ఆరంభించాలన్నాడు. ఆదిలో మీమాంసానుసారం కర్మల నాచరించాలి. వాటిని విడనాడమని బౌద్ధులు చెప్పే స్థితికి చివరకు చేరాలి.''
''ఆచార్యుల వారు మీమాంస, సాంఖ్య, న్యాయ సిద్ధాంతాలను కొంత వరకే అంగీకరించారు...... అన్నిటినీ సమన్వయ పరిచారు.''
''స్మృతులలో ఆయా రచయితల వ్యక్తిగత అభిప్రాయాలుండవు. వేదాలలో ఉన్నవాటినే తీసుకొని సంకలనాలని తయారు చేశారు. వేదాలలోని విధులను ఎట్టి పరిస్థితులలోనూ మార్చలేము. కాబట్టి ధర్మశాస్త్రాలలోని నియమాలను మార్చే ప్రసక్తే లేదు.''
ఇవన్నీనేటి యాధునికుల విమర్శలకు వారి చివరి సమాధానం. అనగా, ఆర్యవిజ్ఞానము యొక్క సమాధానము.
ఇట్టి యపురూప విషయములను శ్రీ సుందరంగారు భాషాంతరీకరణము చేయుటలో పడిన శ్రమ, అవగాహన, శ్రద్ధ, వారు సాధించిన భాషాసౌలభ్యము మన తెలుగువారికి మహోపకృతి, భాగ్యము. ఇది ఇంతకన్న సులభము చేయుట అసాధ్యమని భావింతును.
శ్రీవారి భాషణములపై ముందుమాట ఎవరు వ్రాయగలరు? నా అవగాహన, ఆనందము మాత్రమే చెప్పుకొంటిని.
శుభంభూయాత్
కందుకూరి శివానందమూర్తి