Acharyavaani - Vedamulu     Chapters   Last Page

విజ్ఞప్తి

''అటమటమయ్యె నా భజనమంతయు భూవర! చూడుమా

యిటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్‌

బటుతర దేహ లోభమున ప్రాణములున్నవి వెంటబోక, నే

గట గట! పూర్వజన్మమున కర్మము లెట్టివి జేసినాడనో''

(శ్రీమదాంధ్ర భాగవతము 1-371)

రమారమి ఈ శతాబ్దమంతయూ ఆధ్యాత్మికాకాశమున జాజ్జ్వల్య మానముగ ప్రకాశించి, మనలకు వెలుగు ప్రసాదించిన జ్ఞాన భాస్కరులు అస్తమించినారు. ఆవ్యాజకరుణామూర్తి. అమ్మ కన్నను మిన్నగ మనలనాదరించిన మన స్వామి దేహత్యాగము జేసినారు. అయినను మన దేహ లోభ##మెంత పటుతరమయినది? వారు లేని జీవితము ఊహింపనైన ఊహింప జాలని మనము వారి వెంట బోలేదు సరికదా! అన్ని లౌకిక వ్యవహారములను యధావిధి నిర్వర్తించుకొనుచున్నాము.

కొందరు పెద్దలు, పండితులు, జ్ఞానులు స్వామి ఎచ్చటకును పోలేదనియూ, నిష్క్రియులై, నిర్గుణులై మనయందే ఆత్మారాములుగ వసించు చున్నారనియు ఊరడి పల్కుచున్నారు. అది వారి అనుభవము అయివుండవచ్చును. వారు చెప్పినది సత్యమనుటకు శాస్త్ర ప్రమాణమునూ యున్నది.

అయిననూ ఆ కరచరణముఖతామరసమునూ, చిరు మందహాసమునూ దగ్గరగ అనుభవించిన అస్మదాదుల మనసు ''రక్తాంత స్పహణీయ దీర్ఘనయనం, స్వాకుంచిత భ్రూలతం, హాసస్మేర ముదార ఫాలఫలకం, స్పూర్జత్కపోలారుణం, శ్రీ కర్ణం సునసం సుచారు రదనం పూర్ణేందు బింబాననం'' అని మా కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులవారు వర్ణించిన స్వామి అతిసుందర దివ్యమంగళ రూపముపైననే లగ్నమగును. మన దీక్షితులు గారే గురుకృపాలహరిలో మరొక చోట ''సుందర తవ సుందర పద సందర్శన వందనానుసంధానస్రక్‌, చందన ధారణలేపన సౌందర్యానంద సారసారం యాచే'' అనిన విధముగా మన చేతము ఆ సౌఖ్యము మీదనే మరులు కొనియున్నది.

శ్రీ మధుసూదనానంద సరస్వతీ స్వామి వారి గీతావివరణలో ఒక మంగళశ్లోకము:

''ధ్యానాభ్యాస వశీకృతేన మనసా తన్నిర్గుణం నిష్క్రియం

జ్యోతిః కించన యోగినో యదిపరం పశ్యంతి పశ్యంతుతే

అస్మాకంతు తదేవ లోచన చమత్కారాయ భూయాచ్చిరం

కాళిన్దీ పుళినోదరే కిమపి యన్నీలం మహోధావతి!''

''ధ్యానాభ్యాసము చేత వశం వదనయిన మనసు వలన కొందరు మహాయోగులు నిర్గుణమైన, నిష్క్రియమైన ఆత్మజ్యోతిని దర్శించగలిగిన యెడ దర్శించెదరుగాక! మాకు మాత్రము ఆ బ్రహ్మమే యమునానదీ పుళిన తీరములందు పరుగులిడుచు తిరుగాడుచున్న వర్ణణాతీతమయిన చిక్కటి నలుపుగ (కృష్ణునిగ) నిరంతరము కన్నుల పండుగ జేయుచుండుగాక!''

స్వామి విషయమున మా ప్రార్థన కూడ అదే విధముగా యుండెడిది. ఇప్పుడు స్థితి నాశ్రయించుటయా? లేదు! రెండవస్థితినే భావన ద్వారా సిద్ధపరచుకొనుటకు ప్రయత్నించుచున్నాము. అయినను, స్వామి కడపటి రెండు వర్షములు నిష్క్రియాత్మక స్థితిలో యుండి మనలకు జీవన్ముక్తస్థితి యన్న ఎటులుండునో చూపుటయేగాక, వారి మంజుల వాగ్విలాసమునకు, చిఱునగవుతోనిండిన ప్రేమామృత దృక్కులకు మనలను దూరముగ యుంచి వారి మహాప్రస్థానమునకు సమాయత్తబరచినారు.

జీవన్ముక్తులు లోకమున మూడు విధములుగ ప్రవర్తకులగుచున్నారు. జటభరతుడు, రమణులు వంటి సాక్షీమాత్రులును, నిష్క్రియాత్మకులును అయిన మహాపురుషులు కొందరు. వీరు బ్రహ్మానందానుభవ మగ్నులై వారి సంస్థితి వలననే లోకమునకు శ్రేయస్సు గూర్చెదరు. మరికొందరు శ్రీ శంకరులవంటి ఉపదేశ ప్రధానులు. వీరు జీవన్ముక్తులయి యుండియూ శిష్యులకు, లోకమునకు తమ ఉపదేశముల ద్వారా కూడ హితము గూర్చెదరు. జనకుల వంటి ఇంకొందరు వ్యవహార ప్రధానులు. నిస్సంగ, నిర్మోహ లక్షణములు కలిగిన వారి వలన లోక వ్యవహారములు ధర్మబద్ధముగ నడుచును. తద్వారా లోక శ్రేయస్సు గలుగును.

మహాస్వామి వారు ఈ మూడు విధములయిన లక్షణములను పుణికి పుచ్చుకొనిన జీవన్ముక్తులు. సంవత్సరముల తరబడి సమాధి నిష్ఠులయి కాష్ఠమౌనాది నియమములతో కేవలము సాక్షీమాత్రముగ యున్నారు. ప్రతిదినము తమ యొద్దకు వచ్చు శిష్యకోటినీ యావజ్జాతికినీ ఉపదేశ ఉపన్యాసమూలముగ వారివారి అధికార భేదముననుసరించి శాస్త్రవిహిత మయిన మోక్షోపాయములను ఉపదేశించినారు. డెబ్బదిఏండ్ల వీరి క్రియాశీలక పీఠాధిపత్యకాలమున వీరి కార్యనిర్వాహణా దక్షత అత్యాశ్చర్యకరమయినది. దేశము వివిధ క్లిష్టసమయముల నెదుర్కొను నపుడు స్వామి వారి నిర్వాహణ దక్షణతో కూడిన సలహాలు, కార్యములు అందరు ఎఱిగినవే.

జీవన్ముక్తులకు విధినిషేధములులేవు. ''నిసై#్త్రగుణ్యపథివిచరతాం కోవిధిః కోనిషేధః''. అయినను, స్వామి వేదవిహిత ధర్మములను, ఆచారమును నియమముతో అనుష్ఠించి, వేదవిహిత ధర్మములను నూటికి నూరుపాళ్లు ఆచరింపవచ్చునని మనకి చూపినారు. నియమపాలనలో శరీరమును అంత కష్టపెట్టుకొనుటకు కారణము మానవాళిపై వారికి అవ్యాజమయిన కరుణయే.

స్వామివారి సునిశిత పరిశీలనా దృష్టి అనన్యతోలభ్యము. వారి లౌకిక విషయ పరిజ్ఞానము, అలౌకిక ప్రతిభ అనన్యసాధారణము. శ్రీవారు చేసిన ఉపన్యాసములు వారి సర్వజ్ఞత్వమును ప్రకాశింప జేసెడివి. ఆత్యంతికమయిన శాస్త్రవిషయములను అతిసులభముగా విడమరచి చిన్నపిల్లలకు సహితము విశదమగునట్లు వివరించుట స్వామి లక్షణము. ''శాస్త్రేచ కవితాః, కావ్యేచ శాస్త్రం'' అనినాడు ఖండన ఖండ ఖాద్యకారుడు శ్రీహర్షుడు, శాస్త్రీయ మయిన అత్యంత క్లిష్ట విషయము రసస్ఫోరకముగ, కవితారూపముగ చెప్పగలననియూ, కవితలను క్లిష్టతరమైన శాస్త్రముగ చెప్పగలననియూ చెప్పుచున్నారు. అందు మొదటి లక్షణము పెద్ద శ్రీవారి యందు పుష్కలముగ యున్నది. అయిననూ కించిద్‌జ్ఞుడయిన నేను మహాస్వామి ప్రతిభ గూర్చి మాట్లాడుటకు అనర్హుడను. నాయీపసివాని అసంబద్దప్రలాపన వోలు పలుకులతో స్వామిని స్తోత్రము చేయుటయే నా అభిమతము.

మన అదృష్టవశమున స్వామి మదరాసు సంస్కృత కళాశాలలో చేసిన ప్రసంగములన్నియూ, టేపులద్వారా భద్రపరచబడినవి. అవి తమిళ భాషలోయున్నవి. ఆంధ్రపర్యటనమున శ్రీవారు తెనుగన జేసిన ఉపన్యాసములు, ఒకటి రెండు మినహాయించి, భద్రపరచిన దాఖలాలు లేవు. తమిళ ఉపన్యాసములన్నియూ శ్రీరా||గణపతిగారు విషయముల వారీగా విభజించి తిరిగి వ్రాసినారు. ఇవి (దైవవాక్కు) ''దైవత్తిన్‌కురల్‌'' అనుపేర సహస్రాధికమైన పుటలున్న సంపుటములుగ ప్రకాశింపబడినవి. అందుకొన్ని అంశములు 'Guru Tradition', 'Hindu Dharma' అనే పేర ఆంగ్లమున తర్జుమా జేయబడి ''భావన్స్‌'' వారి ద్వారా ప్రచురింపబడినవి. ఇంకను తమిళములోను, ఆంగ్లేయమునను అనేక చిన్నచిన్న సంపుటములుగా స్వామి ఉపన్యాసములు ప్రచురింపబడినవి.

శ్రీవారి వాణిని తెనుగున కనువదించి తెనుగులకు మహోపకృతి కావించిన వారిలో ఆద్యులు శ్రీ యం.వి.బి.యస్‌. శర్మగారు. వీరనువదించిన ఉపన్యాసము ఆంధ్ర ప్రభలో ముద్రింపబడి తరువాత పది సంపుటములుగ తెనాలి ''సాధన గ్రంథమండలి'' వారిచే వెలువరింప బడినవి. శ్రీ శర్మగారు శ్రీశంకర విజయేంద్రస్వామివారు పనుపున నేకోరినంతనే ''దైవత్తిన్‌ కురల్‌''లోని కొన్ని అంశములను ఆంధ్రీకరించి ఇచ్చినారు. ఇది ఆచార్యవాణి ప్రధమ సంపుటముగ అచ్చొత్తింపబడినది. దీనిలో 'అద్వైతము' 'వైదికమతము' 'గురుసంప్రదాయము'లపై స్వామి వారి భాషణలు తెనుగు జేయబడినవి. శ్రీ శర్మగారి తెనుగు సుందరమైనది. సరళమయినది. చిన్న చిన్న వాక్యములలో పెద్ద పెద్ద విషయములు సూటిగా తెల్పుటలో శ్రీవారి శైలి వారి అనుగ్రహమున వీరికబ్బినది.

'Vedas' అను ఆంగ్లగ్రంథము శ్రీ పింగళి సూర్యసుందరము గారి చేత తెనుగున తర్జుమా జేయబడి ''ఆచార్యవాణి'' ద్వితీయ సంపుటముగ వెలువరింపబడుచున్నది. శ్రీ సుందరంగారు ప్రముఖ ఆంధ్రపండితులు, పరిశోధకులు, బహుగ్రంధకర్తలు, అయిన ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి కుమారులు. వీరు ఉద్యోగ విరమణ తరువాత ప్రస్తుతము హైదరాబాదులో స్థిరబడినారు. శ్రీరమణులకు సంబంధించిన గ్రంథములను, ఇతరములను ఆంగ్లమునుండి తెనుగునకు అనువాదము చేసి తెలుగులకు ఉపకారమొనర్చినారు. మహాస్వామి మహాప్రస్థానాంతరము నిస్తేజమయి, గ్రంథవిషయమున అశ్రద్ధ చూపిన నన్ను ప్రోత్సహించి, మందలించి ప్రస్తుత మీస్థితికి ఈ గ్రంథమును తెచ్చుటకు కారణము వీరే. వీరి తెనుగు అతిసరళమయినది. ఆంధ్రవాక్యనిర్మాణశైలి ఆంగ్లేయ వాక్యనిర్మాణము పోలియుండును. అనువాద విషయమున వీరి కృషి కృతజ్ఞతాపూర్వక శ్లాఘయోగ్యము.

ప్రస్తుత గ్రంథమున శ్రీవారు చతుర్ధశ విద్యలపై సువిశదమైన వివరణనిచ్చినారు. వేద పరిరక్షణమునకై అనేక సంస్థలు, ప్రణాళికల ఏర్పాటుద్వారా కృషి సలిపిన మహాస్వామికి అత్యంత ఆసక్తి కరమయినది ఈ గ్రంథమందలి విషయము. శ్రీచరణులు సాధారణముగ మతాచార్యులు, మహర్షులవంటి వారలను బహువచనముతో మిక్కిలి భక్తి ప్రపత్తులతో పేర్కొందురు. ఈ గ్రంథమున అక్కడక్కడ వ్యావహారికమున ఏకవచనము దొర్లియుండవచ్చును. పాఠకులు సవరించుకొనగలరని ప్రార్థించుచున్నాము. విశ్వనాధవారు ఒకప్పటి తమజంటకవి, కొడాలి వారిని సంస్మరించుచూ ''అతడు తోడు గల్గినను అచ్చముగా కలకండ అచ్చులన్‌ పోతలు పోసియుండెదము'' అనినారు. ముందు మేము అచ్చొత్తించిన మహాస్వామి, ఆచార్యవాణి పుస్తకముల ముద్రణా వ్యవహారమంతయు మా సోదరుడు చి|| సురేష్‌ చూచెడివాడు. ఉద్యోగపరమయిన మార్పు వలన అతడు హైదరాబాదు పోవుటచే ఈ ముద్రణ వ్యవహారము కుంటుపడినది. విజయవాడలో DTP కి ఇచ్చి, మూడవ ప్రూఫ్‌ వరకు దిద్ది, మొత్తము డబ్బు ఇచ్చిన తరువాత మాకు తుదిప్రతి ఈయక మునుపు ముద్రణాలయ యజమాని అంతర్ధానమొందినాడు. తిరిగి మా సోదరుని నిర్వహణలో G.V. గ్రాఫిక్స్‌ వారు అత్యంతరమణీయముగ DTP చేసి ఇచ్చినారు. ప్రూఫులు చూచు బాధ్యతను గూడ శ్రీ సూర్యసుందరం గారు స్వీకరించినారు.

ఈ గ్రంథమున శాస్త్రీయ విషయములన్నిటినీ విని సవరించిన వారు విద్యారణ్య వేత్తలు, ఘనపాఠి, వేదాంత మీమాంసా శిరోమణులు శ్రీ దెందుకూరి మల్లికార్జున సోమయాజి గారు. వీరు శ్రీవారి పాదపద్మములందు ఆత్యంతికమయిన భక్తి భావముగలవారు. నిరంతర మగ్నిహోత్రము చేసి కొనుచు విద్యార్థులకు ప్రవచనమొనర్చుచు ప్రస్తుతము మదరాసులో యున్నారు.

ముద్రణా వ్యయములో దాదాపు సగము వరకు తమ మండలికాశ్రమము తెనాలి ద్వారా ఇచ్చిన వారు మద్రాస్‌ వాస్తవ్యులు, ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ శ్రీ చావలి శ్రీరాం గారు. శ్రీరాం గారు మదరాసులో బహు ప్రసిద్ధులైన కీ||శే|| చావలి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి తృతీయ పుత్రులు. శ్రీ శాస్త్రిగారు స్వామివారి ఆంతరంగిక భక్తులు. అమిత ఐశ్వర్యవంతులు. మహాదాత. శ్రీరాంగారు వీరి పుణ్యలక్షణములు పుణికి పుచ్చుకొనినారు. శ్రీవారి ఆదేశమున అనేక పుణ్యకార్యములు చేయుటయేకాక, స్వామివారి పనుపున తెనాలి తమ గృహములో శ్రీమాండలీక వెంకటశాస్త్రిగారి పేర నారంభింపబడిన మాండలీకాశ్రమములో ప్రతిప్రాతః కాలమున, ప్రతి ప్రదోషమున ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహించుచున్నారు. ఇంకనూ స్వామివారి ఆదేశాను సారము తిరువామియూర్‌ మరుందీశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ, గోపురనిర్మాణము, కుంభాభిషేకము, వారి తండ్రిగారు ఆరంభించిన మద్రాస్‌లోని కామాక్షీ దేవాలయ నిర్మాణము పూర్తిగావించుట, సోదరుల సహాయముతో నిత్యపూజలు అత్యంత వైభవముగా నిర్వహించుట, వీరు చేసిన, చేయుచున్న పుణ్యకార్యములలో కొన్ని.

ముద్రణావ్యయమున మిగిలిన భాగము మా నాయనగారు, కీ.శే. చల్లా శేషాచల శర్మ గారి స్మృతి కొరకై మా కుటుంబ సభ్యులు పూరించినారు. మా నాన్నగారికి చిఱుతప్రాయము నుండి ధార్మిక విషయములందు ఆసక్తి మెండు. వారు బ్రహ్మశ్రీ చివుకుల వెంకటరమణ సిద్ధాంతి గారి వద్ద భాష్యత్రయ శాంతి చేసినారు. వారు లౌకిక జీవితమును కూడ అతి సమర్థవంతముగా నిర్వహించుకొనినారు. 1961లో శ్రీ మహాస్వామి వారి దర్శనము చేసిన దాదిగా వారి పాదపద్మములందే అనన్య భక్తి. గత పది సంవత్సరములుగా మా నాయనగారు చేసిన దాన ధర్మాధికములు, ఇష్టాపూర్తములు, మహత్కార్యములు చెప్పుటకు స్వోత్కర్ష అగునేమోనని సందేహించు చున్నాను.

వారు స్వామి వారి పాదుకల సమక్షమున వారిచే ప్రసాదించబడిన యోగమును నిరంతరము అభ్యాసము చేసికొనుచు గడిపినారు. శ్రీ విద్యా సంప్రదాయములో పూర్ణ దీక్షాపరులు అయిన మా నాన్నగారు నిరంతరము స్వామి పాదములే తమ శిరస్సున భావించు కొనుచుండెడివారు. స్వామివారి జన్మదినోత్సవమే మా యింట పండుగలకెల్లను పెద్ద పండుగ. శ్రీ చందోలు శాస్త్రులు గారి వంటి బ్రహ్మణ్యుల సమక్షములో ఆయుష్య, ఆవహంతి, రుద్ర హోమాదులు, సంచికావిష్కరణములు, ఉపన్యాసాదులతో జన్మ దినోత్సవములు అతి రమ్యముగా నిర్వహింపబడు చుండెడివి. శ్రీ స్వామి వారి విదేహ ముక్తి అనంతరము స్వామివారి ఆరాధనలను 1995, 1996 సం|| లలో తాము స్వయముగా శాస్త్రోక్తరీతిని చేసినారు. మా నాయనగారు 1996 డిసెంబరు 15వ తేదీన, తమ 73వ ఏట కపాల మోక్షము జరిగి స్వామి పాదపద్మముల యందు ఐక్యమైనారు.

శ్రీ కందుకూరి శివానంద మూర్తిగారు ''గురువుగారు'' భీమునిపట్టణములో ఆనందవనమను ఆశ్రమమున ఆత్మనిష్ఠులుగా యుండి వందలాది శిష్యులకు ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదించుచున్నారు. ఆధునిక భారతమునగల అతి కొద్దిమంది యోగనిష్ఠులలో వీరు ముఖ్యులు. మహాస్వామి ప్రసంగములకు ఈ మహాపురుషుని పీఠిక తగియున్నది. వారికి మాకృతజ్ఞతాపూర్వక నమస్కారములు.

ఎంతో శ్రమకు ప్రయాసకు ఓర్చి, ప్రతిఫలాపేక్ష ఏమియులేక - ఆధ్యాత్మిక ప్రవృత్తియే కారణముగ తెనుగించుటయే కాక, అది ముద్రణ నొందువరకు ప్రూఫులు దిద్దుట వంటి బాధ్యతలన్నియూ స్వీకరించిన శ్రీ పింగళి సూర్యసుందరంగారికి, ద్రవ్యసహాయమొనర్చిన శ్రీచావలి శ్రీరాంగారికి తెనుగు ప్రజ కృతజ్ఞతతో యుండగలదు.

ఆంధ్రీకరించుకొని ముద్రించు కొనుటకు అనుమతి నొసగిన ఆంగ్లసంపుటి కాపీరైటు దారులు శ్రీ కామాక్షీసేవాసమితి, బొంబాయి వారికి మా కృతజ్ఞతలు.

ఈ ప్రయత్నమంతయూ కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారల ఆదేశముచే జరిగినది. వారి ఆశీరనుగ్రహ విశేషము చేత తెనుగు ఆస్తికజనులు ఈ ప్రయత్న ఫలము ననుభవింపగలరు గాక యని అంతర్యామి అయిన మహాస్వామిని ప్రార్థించు చున్నాను. నవ్యశ్రీ చరణులయొక్కయూ, బాలస్వామివారి యొక్క పాదపద్మములకు మ్రొక్కి విన్నపము చేయుచున్నాను.

'గురుకృప' చల్లా విశ్వనాధ శాస్త్రీ

అజీజ్‌ నగర్‌ రెండవ వీధి, ఈశ్వరనామ సంవత్సర చైత్ర కృష్ణ

కోడంబాక్కం, పంచమీ సోమవారమ్‌.

మదరాసు - 600 024.

Acharyavaani - Vedamulu     Chapters   Last Page