Hindumatamu    Chapters    Last Page

హిందూమతము

అధ్యాయము .

ప్రమాణములు

వేదము

వేదమే హిందూమతమునకు పరమప్రమాణము. సమస్త వేదము ధర్మమునకు మూలమని మనుస్మృతి చెప్పుచున్నది.

వేదోఖిలో ధర్మమూలమ్‌ (మను, 2-6)

హిందూమత గ్రంథములన్నియు నిట్లే చెప్పుచున్నవి.

వేదము లీశ్వరునివలన వెలువడిన వగుటచేతను, ఆది లేని వగుటచేతను వానికీఘనత గల్గినది.

'యోవై వేదాంశ్చప్రహిణోతితసై#్మ' (శ్వేతాశ్వతరోపనిషత్తు 6-18) మున్నగు వాక్యముల వలన వేదము లీశ్వరునివలన వచ్చినవని తెలియగలదు.

'అనాదినిధనానిత్యావాగుత్సృష్టాస్వయంభువా' మొదలైన పురాణవచనములలో వేదముల యనాదిత్వము నిరూపింపబడినది.

కావున, పరమేశ్వరుని విశ్వసింపనివానివలెనే, వేదములను విశ్వసింపని వాడును నాస్తికుడనబడును. మనువు నాస్తిక శబ్దమునకు 'వేదనిందకుడు' అను నిర్వచనము నిచ్చినాడు.

నాస్తికో వేదనిందకః (మను 2-11)

ఈనాస్తికతను హృదయములో నాటు బోధలు నేడు మన బాలురకు ప్రారంభమునుండియు పాఠశాలలో చేయబడుచున్నవి. నేటి పాఠశాలలలో బోధింపబడు ఏ చరిత్ర పాఠ్యగ్రంథమును (హిస్టరీ టెక్ట్సుబుక్‌) తీసికొనినను, అందు వేదములనుగురించి యిట్లుండును. ''వేదములను ఆర్యులను వారు క్రీ||పూ| 1500 సంవత్సరముల ప్రాంతమున రచించిరి. అది నాగరికతకు ప్రారంభదశ; తరువాత క్రమముగ నాగరకత పెరిగినది.'' ఈవాక్యములనే వేదముగ నమ్మిన మన బాలురకు మూడాభిప్రాయములు దృఢముగ నేర్పడినవి. ''(1) వేదములను మానవులే రచించిరి. (2) ఆ రచించిన వారు మనయంత నాగరికులు బుద్ధిమంతులుకారు (3) అవి వ్రాసి నాలుగువేల సంవత్సరముల లోపుగనే యైనది.'' ఈ యంశములకు మకుటముగ బోధింపబడు మరొక యంశ##మేమన : ''ఆర్యు లీగ్రంధములను వ్రాయుటకు పూర్వము హిందూదేశములో లేనేలేరు. వారు పైనుండి వచ్చిరి.'' చరిత్రగ్రంధములను వ్రాయువారీయంశములను తాము చూచి వచ్చినట్లు వ్రాయుచున్నారు. కాని యిందేమాత్రమును సత్యములేదు. ఈసిద్ధాంతము లెట్లు బయలుదేరినవో, యెట్లు వ్యాపించినవో, యెట్లు పండితులచే ఖండింపబడియుగూడ నంధపరంపరగ పాఠ్యగ్రంధములను వ్రాయువారిచే గ్రహింపబడుచున్నవో చూతుమేని వీని బండారము బయటబడును. 19వ శతాబ్దిచివరలో సర్‌ విలియంజోన్సు అనునాయన యీ సిద్ధాన్తములను లేవదీసియుండెను. ఈ సిద్ధాన్తముల కాయన తగినంత రుజువునిచ్చి యుండలేదు. అయినను ఆయన గొప్ప పండితుడగుటచే నితరపాశ్చాత్య విమర్శకులు గూడ నావిషయమై తాము ప్రత్యేకవిమర్శకు గడంగక యా యంశములనే యంగీకరించినారు. వానిని శంకించువా రెవ్వరును లేకపోయిరి. ఇంత ముఖ్యమైన చారిత్రక సిద్ధాన్తములను లేవనెత్తుటకు తగినంత రుజువున్నదా యని తర్కించువారుకూడ లేకుండిరి. మొట్టమొదట నీసిద్ధాన్తములు తప్పని నుడివినవారిలో శ్రీవివేకానందస్వాముల వారొకరు. ఈ సిద్ధాన్తములను ఖండించుచు నొక గ్రంధమును వ్రాయవలయునను కోరిక గూడ తమకున్నట్లు శ్రీవివేకానందులు వ్రాసియుండిరి. (చూ. East and West) కాని వారి యకాలనిర్యాణము దాని కంతరాయమైనది.

వేదములు క్రీ||పూ| 1500 ప్రాంతమున రచింపబడినవను సిద్ధాన్తమును శ్రీలోకమాన్య బాలగంగాధరతిలకుగారు పటాపంచలుచేసి క్రీ|| పూ|| 4500 సంవత్సరముల ప్రాంతముననే కొన్ని వేదఋక్కులుండినట్లు జ్యౌతిష శాస్త్రాధారముచే సిద్ధాన్తము చేసిరి. (చూ. 'Orion') శ్రీఅవినాశ చంద్రదాసుగారు భూగర్భశాస్త్రముయొక్క (Geology) యాధారముచే వేదకాలమును నిర్ణయింపబూని తిలకుగారికంటెను 20 వేల వత్సరముల వెనుకకు ఋగ్వేదమును కొనిపోయిరి. (చూ. Rig Vedic India) మన యాంధ్రులలో కీ||శే. శ్రీ నడింపల్లి జగన్నాధరావుగారు ఆర్యులు పైనుండివచ్చినారను సిద్ధాంతమును సయుక్తికముగ ఖండించి వేదముల యతి ప్రాచీనతను స్థాపించిరి. (చూ. ఆంధ్రమహాసామ్రాజ్యము.)

వేదములనుగూర్చి యింతవరకు జరిగిన పరిశోధనలను బట్టిచూడ తుదకు వేదముల యాదిని కనుగొనుట తమ కసాధ్యమనియే పండితులందరు నంగీకరింతురను నభిప్రాయము కలుగక మానదు. అట్లే వేదముల కర్తృత్వమును గూర్చికూడ నెవ్వరును నిర్ధారణ చేయలేకపోయినారు. వేదకర్తను తెలిసికొనుటకు మనచారిత్రకు లెంతప్రయత్నించినను చివరికి తేలునది దాని యపౌరుషేయత్వమే యనుటకు సందియములేదు. (వేదకాల విషయకచర్చను నాభారతీయ వైభవములో కొంతచేసినాను.)

వేదముల ననాగరకులగు మానవులు రచించిరనియు మనకున్నంతవిజ్ఞానము వారికి లేదనియు నిదివరలో చెప్పబడుచుండిన నిరాధారవాక్కు లిపుడిపుడు సన్నగిల్లుచున్నవి. శ్రీ దయానందసరస్వతులును వారిశిష్యులును వేదములలో నాధునిక శాస్త్రము (Sciences) రహస్యము లెన్నియో నున్నవనుటకు కొన్ని యుదాహరణముల నిచ్చియున్నారు.

అట్లేకొందరు వేదములలోనున్న వైద్యశాస్త్రమునకు నేటి పాశ్చాత్యవైద్యశాస్త్రము సాటికాదని చూపియున్నారు. ఆవిధముగనే కొందరు వేదములలో నత్యద్భుతజ్యౌతిషరహస్యములు కలవని వ్యక్తము చేసియున్నారు. అట్లే కొందరు తర్వాత బయలుదేరిన యితిహాసములను, పురాణములను నేటి దేశ చరిత్రలనుగూడ వేదము బీజరూపమున సూచించు చున్నదని చెప్పుచున్నారు.

వేదమంత్రమును సస్వరముగ నుచ్చరించుచో నామంత్రములో నేదేవత యుద్దేశింపబడినదో యా దేవత సూక్ష్మ రూపముతో నాస్థలమున ప్రత్యక్షమగునని దివ్యజ్ఞాన సమాజమువారు పరిశోధనలచే కనిపెట్టిరి. (చూ. Bharat Samaj Puja Journal.)

శ్రీ అరవిందఘోషుగారు వేదములలో (ఉపనిషత్తులలోనేకాక మంత్రభాగములలోగూడ) పరమ వేదాంత సత్యములున్నవని స్ఫుటికరించి యున్నారు. (చూ. Arya సం.)

వేదము సమస్తజ్ఞానవిజ్ఞానములకును నిధియనునంనశ##మే క్రమక్రమముగ లోకమునకు వెల్లడియగుచున్నది. ఇంకను ప్రాతకాలపు మాటలనే పట్టుకొని వేదము లనాగరికులచే రచింపబడినవనియు, మనమంతకంటె నాగరికులమనియు తలచువారికి ప్రాచీన వైదికజ్ఞానమును, నవీనపరిశోధనజ్ఞానమును గూడ శూన్యములని చెప్పదగును.

వేదముల మహత్త్వమును మనపూర్వులు బాగుగ నెఱిగియుండిరి. కావుననే యంత్రశ్రద్ధతో వాని నింతకాలము కాపాడియుండిరి. ఏ ధర్మశాస్త్రమును తీసినను, ఇతిహాస పురాణములను తీసినను వేదముపట్ల మహాభక్తిని వెల్లడించు వాక్యము లసంఖ్యాకములుగ దొరకును.

వేదములయొక్క ప్రాశస్త్యము నెన్నివిధముల వర్ణించినను, అది యసంపూర్ణమే యగును. అట్టి వేదములను ప్రమాణముగ నంగీకరింపనివాడు హిందువుడనిపించుకొనడు. సమస్త ధర్మములకును జ్ఞానవిజ్ఞానములకును వేదము పెన్నిధానము. హిందూమతసౌధము వేదమను పునాదిపైనే నిర్మింపబడినది.

ఇట్లు ప్రమాణభూతములైన వేదములు నాలుగు : ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, ఇందొక్కొక్క వేదములో నాల్గేసి భాగములు కలవు; మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.

స్మృతులు.

సమస్తవేదము ధర్మమునకు మూలమని పైన జెప్పబడినదికదా. వేదములు అనంతములని తైత్తిరీయబ్రాహ్మణము చెప్పుచున్నది.

'అనంతావై వేదాః' (తై. బ్రా. 3-10-11)

ఇపుడు మనకు గోచరించుచున్న వేదము పరిమితము. ఇది వేదములోని యేక దేశముమాత్రమే; కాని పూర్ణ వేదము కాదు. కావున కొంతవేద మిపుడు లుప్తమైనదని చెప్పవలయును. లభ్యమైన వేదమెట్లు ప్రమాణమో, లుప్తమైన వేదముకూడ నట్లే ప్రమాణము. ధర్మమనంతము. అదియంతయు ప్రస్తుతము నిలచియున్న వేదములో మనకు కన్పట్టక పోవుట సహజమే. నిలచియున్న వేదములోని ధర్మములను తెలిసికొన్నచో చాలదు. లుప్తమైన శ్రుతిలోని ధర్మములను గూడ తెలిసికొనవలయును. అప్రత్యక్ష్యమైన వేదములోని ధర్మములను మనకు తెల్పునవే స్మృతులు. వానిని మహర్షులు రచించిరి. ఆయా వేదభాగములు పఠనపాఠవముల నుండి తప్పిపోవుచుండిన కాలములో, దూరదృష్టిగల మహర్షులు మానవులయందు తమకుగల యవ్యాజకరుణచే నావేదభాగములలోని ముఖ్యవిషయములను తీసి తమ సొంతమాటలలో వానిని తేట తెల్లముగను, సంగ్రహముగను రచించి వానిని తమ శిష్యులకు బోధించి వైదికధర్మములను లోకములో నిలబెట్టిరి.

ఈ మహర్షులు కేవలము లుప్తవేదములోని ధర్మములనే చెప్పలేదు. ప్రచారములోనున్న వేదభాగములలోని ముఖ్యధర్మములనుగూడ తమ గ్రంధములలో వ్రాసియున్నారు. కొందరు వేదము నధ్యయనము చేయలేక పోవచ్చుననియు, నధ్యయనము చేసియు నందలి ధర్మరహస్యముల నెరుగలేక పోవచ్చుననియు వారిట్లుచేసిరి. అంతియేకాదు. ఒకేవేదములోని యొకశాఖకు చెందినవారికి మరొకశాఖలోని ధర్మములు తెలియుటకుకూడ ఋషులీధర్మగ్రంధములను రచించిరి. వేదములకు వ్యతిరిక్తముగ మాత్రము వీరు తమ గ్రంధములలో నేమియు చెప్పదలంపలేదు. వారేమాట చెప్పినను వేదమును దృష్టిలో నిడికొనియే చెప్పిరి. ఇట్లు వేదమును స్మరించుచు చెప్పిన గ్రంధములు కనుకనే వీనికి 'స్మృతులు' అని పేరు వచ్చినది.

''శ్రుతిం పశ్యన్తి మునయః

స్మరన్తిచ తథా స్మృతిం''

(మునులు వేదమును చూతురు, దానిని చూచినట్లే స్మరించుచు స్మృతిని పల్కుచున్నారు.)

అని స్మృతికారులే చెప్పిరి. నేటికిని నీగ్రంధములకు నిలచియున్న స్మృతియను నామమే యీసత్యమును మనకు తెల్పుచున్నది.

కావున నొకధర్మము స్మృతిలో గన్పట్టుచున్నచో, దానికి ప్రస్తుత వేదములో నాధారము కన్పట్టకపోయినను, లుప్తమైన వేదభాగములో దాని కాధారముండునని మన మూహించుకొనవలయును. శ్రుతియొక్క యడుగుజాడలలోనే స్మృతి నడచుచుండును. ఈయంశమునే కాళిదాసు రఘువంశములో నుపమానముగ తీసికొని సుదక్షిణాదేవి నందినీధేనువు యొక్క యడుగుజాడలలో పోవుచు దానిని శ్రుత్యర్థము స్మృతి యనుసరించు నట్లనుసరించెనని వ్రాసినాడు.

''మార్గం మనుష్యేశ్వర ధర్మపత్నీ

శ్రుతే రివార్థం స్మృతి రన్వగచ్ఛత్‌''

ఈవిధముగా బయలుదేరిన ధర్మగ్రంథములే గౌతమ ధర్మసూత్రములు, వసిష్ఠధర్మసూత్రములు, ఆపస్తంబ ధర్మసూత్రములు, మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, పరాశరస్మృతి మున్నగునవి. ఈస్మృతులు వేదమునకు పిమ్మట వేదమంత ప్రమాణగ్రంథములు. తత్కర్తలు వేదవిదులై పూర్ణముగా వేదోక్తమైన జీవితమును నడపుకొనుచు బ్రహ్మసాక్షాత్కారము నొందినవారనునదియే ముఖ్యవిషయము. బుద్ధిచేతను, ఆచరణముచేతను వేదము నెఱిగినవారగుటచేత వీరిగ్రంథములు వేదమునకు పిమ్మట ప్రమాణములుగా చెప్పబడినవి. వీరి మాటలేకాక వీరి చేష్టలుకూడ మన కనుసరణీయములే. ఈయర్థమును గౌతమధర్మసూత్రము

తద్విదాంచ స్మృతిశీలే (1-2)

అను సూత్రముచే నుడువుచున్నది

దీనివలన నొక సందేహము గల్గును. వేదవిదులైన వారేమిచేసినను మనకు ప్రమాణమే యగునా? యనునది. శ్రుతిస్మృతులకు విరుద్ధముగా వీరు సాధారణముగా నేమియు చేయనిమాట వాస్తవమే కాని, యొకవేళ వారట్లు శ్రుతి స్మృత్యుక్తధర్మమునకు వ్యతిరేకముగ సంచరించుచో మన మావిషయమున వారి ననుకరింపరాదని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. మహానుభావులకుగూడ ధర్మవ్యతిక్రమము, తొందరపాటు నుండవచ్చునని మనము గురైఱుగవలయును. అట్టిపట్ల మనము వారి ననుసరింపరాదు.

''దృష్టో ధర్మవ్యతిక్రమస్సాహసంచ మహతాం.

నతుదృష్టార్థేవరదౌర్బల్యాత్‌'' (గౌ.ధ. 1-3)

ఈస్మృతికర్త లెంత మహాజ్ఞానులైనను, వారి వాక్యము సాక్షాదీశ్వరవాక్యమైన వేదముతో సమప్రమాణము కాజాలదు. అనగా, స్మృతివాక్యమేదియైన వేదమునకు విరుద్ధముగ గన్పట్టుచో నది ప్రమాణము కాజాలదు. ఈ యంశమును స్మృతికర్తలే మనకు చెప్పియున్నారు. వీరహంకారరహితులైన మహాజ్ఞానులు; కావుననే యీవిధముగ తమ న్యూనతను వేదఘనతను చెప్పుకొనినారు.

అంతియేకాదు; ఒక ఋషి చెప్పినయంశమునకు మరొక ఋషి చెప్పినది భిన్నముగనున్నచో నట్టిపట్ల తనమాటనే నమ్మవలయునని యేఋషియు నుడువుట లేదు. అట్లు భిన్నము లైనవానిలో దేనినైనను నాచరింపవచ్చుననియే స్మృతులలో చెప్పబడినది. ''ఇద్దరు ఋషులు చెప్పినది భిన్నముగ నున్నది, గావున నేనిందెవ్వరిని ననుసరింపను'' అని చెప్పుట తప్పనియే స్మృతులు కంఠోక్తిగ చెప్పుచున్నవి. మహర్షులు తుల్యబలముగలవారు. ఒకే స్మృతిలో రెండుమార్గములు సూచింపబడుచో నెట్లు రెంటిలో నేదోయొకటి యనుసరణీయమో యట్లే రెండు భిన్నస్మృతులలో రెండుమార్గములు నూచింపబడునో నందేదైనను ననుసరింపదగినదే.

దీనినే ఋషులు

''తుల్యబలవిరోధే వికల్పః'' (గౌ. ధ. సూ. 1-4)

అని స్పష్టపరచియున్నారు. అట్టి వికల్పములుగల స్థలములలోగూడ మనము కేవలము స్వాతంత్ర్యము వహింప నక్కరలేదనియు, నం దేపక్షము మన కులగోత్రములలో మన పెద్దలచే నాచరింపబడుచున్నదో దానినే మన మనుసరింపవలయుననియు సంప్రదాయజ్ఞులు నుడువుదురు. ఒకస్మృతి యొకవిధముగను నొకస్మృతి మరొకవిధముగను చెప్పుచుండుటచే స్మృతుల కన్నిటికిని సున్న చుట్టవలయునను నాధునిక వాదము సర్వస్మృతి గర్హితము.

స్మృతులన్నియు ప్రమాణములేయైనను మనుస్మృతి లోకముచేతను. స్మృతికర్తలచేతను, పురాణతిహాసప్రణతలచేతను విశేషగౌరవమును పొందినది. ఇందులకు రెండు కారణములు గలవు. (1) ఇంత సమగ్రముగ ధర్మమును వివరించుస్మృతి మరొకటిలేదు (2) వేదార్థము నింతచక్కగా వివరించినస్మృతి మరొకటిలేదు. ఈరెండవకారణముచేతనే మనుస్మృతికి ప్రాధాన్యమని బృహస్పతిస్మృతి నుడువుచున్నది.

వేదార్థోప నిబంధృత్వాత్‌

ప్రాధాన్యంతు మనోః స్మృతౌ.

సామాన్యముగా మనుస్మృతియే సర్వోత్తమమైనను, కలియుగములోని విశేషధర్మములను చెప్పునది పరాశరస్మృతి యగుటచే, దానికి కలియుగములో నావిధమైన ప్రాముఖ్యము వచ్చినది. కలియుగప్రత్యేక ధర్మములలో తప్ప మిగిలిన విషయములలో మనుస్మృతి కగ్రస్థానము నిలచియే యున్నది. కృతత్రేతా ద్వాపర కలియుగములలోని ప్రత్యేకధర్మములను తెల్పుటలో నెన్నదగినవి క్రమముగ మను, గౌతమ, శంఖలిఖిత, పరాశర ధర్మశాస్త్రములని పరాశరస్మృతి చెప్పుచున్నది.

కృతేతు మానవాః ప్రోక్తాః

త్రేతాయాం గౌతమాః స్మృతాః

ద్వాపరే శంఖలిఖితౌ

కలౌ పారాశరీస్మృతిః (1-24)

ఒక్క విషయమును జ్ఞప్తియం దుంచుకొనవలయును. పరాశరుడు కలియుగమునకై ధర్మశాస్త్రమును రచించినాడన నాతడు వైదికధర్మమును మార్చినాడని యర్థముకాదు. పూర్వధర్మములనే ప్రజ లాచరించు విధమును చూపుటకై కొన్ని కట్టుబాట్లు చేసినాడు. ఏ స్మృతికర్తయు కూడ ధర్మమును మార్చుటకు పూనలేదు. అట్లు పూనువానికి స్మృతిచేయు నధికారమే పోవును. బుద్ధిచేతను, ఆచరణముచేతను వేదధర్మమును తెలిసికొనినవాడే స్మృతికర్తయగుట కర్హుడని పైని చూచితిమిగదా! మరియు మన్వాది స్మృతులు గూడ వేదార్థబోధకములే యనికూడ చూచియుంటిమి కదా! కావున వేదములు మనుస్మృతి, పరాశరస్మృతి, గౌతమసూత్రములు మున్నగు సమస్త ధర్మగ్రంధములను పూర్తిగ ననుసరించుచున్నవాడు మాత్రమే స్మృతికర్త కాగలడు. పరాశరాదులందరు నట్టి శ్రుతిస్మృత్యుక్తజీవితము గడపినవారే కాని, తద్విరుద్ధముగ నడచుచు తమకు తోచిన ధర్మములను చెప్పినవారుకారు.

పారంపర్యముగ ప్రమాణములుగ భావింపబడుచున్న ముఖ్యస్మృతుల నామము లీక్రింద నీయబడినవి. (1) మనుస్మృతి (2) పరాశరస్మృతి (3) గౌతమధర్మసూత్రములు (4) వసిష్ఠధర్మసూత్రములు (5) శంఖస్మృతి (6) లిఖితస్మృతి (7) ఆపస్తంబధర్మసూత్రము (8) అత్రిస్మృతి (9) విష్ణుస్మృతి (10) హారీతస్మృతి (11) యమస్మృతి (12) అంగిరఃస్మృతి (13) బోధాయనధర్మసూత్రము (14) ఉశనఃస్మృతి (15) సమర్తస్మృతి (16) బృహస్పతిస్మృతి (17) కాత్యాయనస్మృతి (18) దక్షస్మృతి (19) వ్యాసస్మృతి (20) యాజ్ఞవల్క్యస్మృతి (21) శాతాతపస్మృతి

స్మృతి సమములు.

అతీంద్రియు విషయద్రష్టలైన మహర్షులు, పైని తెల్పబడిన ధర్మశాస్త్ర గ్రంధములనేకాక, యితరములను గూడ రచించియున్నారు. సాధారణముగ స్మృతిశబ్దము ధర్మశాస్త్రములకే చెల్లుచున్నను, మహర్షులు వ్రాసిన గ్రంధముల నన్నిటినిగూడ స్మృతులని వ్యవహరించుట కలదు. ఋషులచే రచింపబడిన యీయితరగ్రంథము లెవ్వియన:- శ్రౌతసూత్రములు, గృహ్యసూత్రములు, మంత్రతంత్రశాస్త్ర గ్రంధములు, ఆగమములు ఇతిహాసములు, పురాణములు మున్నగునవి. శ్రుతి స్మృతులలో సూచింపబడిన సోమయాగాదిక్రుతువులు, దర్శపూర్ణమాసేష్టులు మున్నగువాని విధానములను తెల్పునని శ్రౌతగ్రంధములు. శ్రుతిస్మృతి సూచితములైన జీతకర్మ నామకరణాన్నప్రాశన చౌలోపనయన వివాహాదికర్మకాండ విధానమును తెల్పునవి గృహ్య సూత్రములు. సులభ##మైన మార్గములో దేవతలను మెప్పించి వారివలన నైహికాముష్మికలాభములను మోక్షమునుగూడ నందుటకుగల విథానమును వివరించునవి మంత్రతంత్రగ్రంధములు. దేవాలయనిర్మాణవిధానాదులను తెల్పునవి యాగమములు. సృష్టిక్రమమును, ఈశ్వరమహిమను ప్రధానముగ దెల్పునవి పురాణములు. స్మృతులలో నాదేశింపబడిన ధర్మములు మానవుని జీవితములో నెట్లనుసరింపబడవలయినో భిన్నధర్మములకు సంఘర్షణ కలిగినపుడు మానవు డెట్లు ప్రవర్తింపవలయునో, యనునంశములను విపులముగ దెల్పుచు ధర్మమునం దాసక్తియు, నధర్మమునందు ద్వేషమును పాఠకులకు గల్గించు విధమున రచింపబడినవి యితిహాస పురాణములు.

ఇతిహాసపురాణములు.

హిందూమత మింతవరకు నీవిధముగ నిలువగల్గుటకును నికముందుగూడ నిది నశింపదని యాశించుటకును కారణములైనవి యితిహాసపురాణములు, వైదికధర్మముపట్ల మానవుని బుద్ధిని బలాత్కారముగ త్రిప్పి దానియందు మానవుడు ప్రవర్తించునట్లు వానిని నడపునట్టి గ్రంథములు ఇతిహాస పురాణములు. ప్రపంచములోని క్రైస్తవ మహమ్మదీయాది మతములన్నియు సత్కర్మల నాదేశించుచున్నవి. మతములన్నియు సత్యము పల్కవలెననియు, భగవంతుని సేవింపవలెననియు, వ్యభిచారము కూడదనియు నుడువుచున్నవి. అట్లయినను సత్యసంధత, భక్తి, పాతివ్రత్యము మున్నగు నుత్కృష్టధర్మములు హిందూదేశములో నున్నంత హెచ్చుగ ప్రపంచములో మరెక్కడను లేవు. నేటికి 1500 సంవత్సరముల క్రిందట మనదేశమునకు వచ్చిన ఫాహియన్‌ అను నొక చైనాదేశీయు డిట్లు వ్రాసియున్నాడు. ''హిందువులెల్లరు సత్యసంధులగుటచే వారిగృహముల కెన్నడును తాళము లక్కరలేదు! ఋణాదికములకు పత్రములు కూడ వారి కక్కరలేదు.'' అరియను అను నొకగ్రీసుదేశస్థుడు ''హిందువు డెన్నడును నసత్యమాడినట్లు లేదు'' అని వ్రాసియున్నాడు. మనదేశపు వర్తకులతో వ్యవహారము చేసిన ప్రాచీన విదేశవర్తకులు ''హిందూదేశములో వర్తకులుగూడ నసత్యమాడ''రని యాశ్చర్యముగ నుడివినారు. ఈవాక్యములలో కొంత యతిశయోక్తి యుండవచ్చును. కాని జాతి మొత్తముపైని భారతీయు లెంత సత్యసంధులో దీనివలన తేలగలదు. మతములన్నియు సత్యసంధతనే బోధించుచున్నను నొక హిందుమతస్థులే హెచ్చుగ సత్యసంధులగుటకు కారణము మన మతములో ఇతిహాసపురాణము లుండటయు వారికి లేకుండుటయే. మానవు నసత్యమునుండి మరలించుటకు హరిశ్చంద్రుని కథ యొక్కటియే చాలును.

ప్రహ్లాద చరిత్రను చదివినపిమ్మట మహాభక్తులుగ మారినవారు మనలో నెందరులేరు? మానవుని చిత్తవృత్తిని మార్చుటలో గారడివానివలె పనిచేయగలది ప్రహ్లాదచరిత్ర. నేటికిని మనదేశములో నితరదేశములలో కంటె హెచ్చు మంది మహాభక్తులు, విరాగులు, సాధువులు, సన్యాసులు గన్పట్టుటకు కారణ మిట్టి పురాణగాధలే యనుటలో నతిశయోక్తిలేదు.

నేటి భారతీయస్త్రీలకుగల పాతివ్రత్యము ప్రపంచములో నేజాతిస్త్రీలకును లేదని యెల్లరు నంగీకరించుచున్నారు. పాతివ్రత్యమను నీయుత్కృష్టధర్మమును లోకములో నింత దృఢముగ నిలబెట్టినవి యితిహాసపురాణములే. సీత, సావిత్రి, దమయంతి మున్నగు సతీమతల్లుల పవిత్ర నామములను స్మరించి వారిచత్రలను నిత్యము పురాణరూపమునను, పాటలరూపమునను, కథాదిరూపమునను వినుచుండుటచేతనే మన సతీమతల్లులు తమశీలమును లోకమున కంతటికి నాదర్శప్రాయమగు విధమున నడుపుకొనుచున్నారు. ప్రతిహిందూస్త్రీయొక్క హృదయసీమయందును రాజ్యముచేయుచు నామె చిత్తవృత్తులను నడపించునది సీత; ప్రతిస్త్రీకిని కష్టాంధకారములో నాశాజ్యోతిని కన్పరచువారు సావిత్రి, చంద్రమతి మున్నగు పావన నారీమణులు.

హిందూధర్మరక్షణవిషయమున నితిహాసపురాణముల ప్రభావ మింతింతయని చెప్పజాలము. విధినిషేధరూపమున నెన్నిధర్మములు స్మృతులలో బోధింపబడగలవు? కొన్ని ప్రత్యేక క్లిష్టపరిస్థితులలో, ధర్మసూక్ష్మ సందేహములు పొడచూపుచుండును ఆ ధర్మసూక్ష్మములు మానవుని జీవితము నుదాహరణముగ తీసికొని కథారూపమున ప్రదర్శించినపుడే బోధపడగలవు. అట్టి ధర్మసందేహములను ప్రదర్శించుటకును, తీర్చుటకును ఇతిహాసపురాణములే తగినవి.

నాల్గు వేదములలోని ముఖ్యధర్మములను ఇతిహాస పురాణములలో బాగుగా వివరింపబడినవని యీక్రిందిపురాణ వాక్యమువలన తెలియగలదు.

'ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌'.

శ్రుతిస్మృతులలోనున్న సమస్త ముఖ్య ధర్మములును ఇతిహాసపురాణములలో లభింపగలవనుటలో నతిశయోక్తిలేదు. అందునను సమస్త ధర్మరత్నములకును మహాభారతము సముద్రము. వేదములను చదువుట కర్హతలేని స్త్రీలు, శూద్రులు, సంస్కారరహితులైన ద్విజకులోత్పన్నులు వేదములోని ధర్మములను తెలిసికొనగల్గుటకై వ్యాసమహాముని యీగ్రంథమును రచించినట్లు భాగవతములోని యీ క్రింది శ్లోకములో చెప్పబడుచున్నది.

''స్త్రీశూద్రద్విజబంధూనాం, త్రయీ నశ్రుతిగోచరా

ఇతి భారత మాఖ్యానం, కృపయా మునినా కృతం''

కావున హిందూజన సామాన్యములో ధర్మమును, దైవభక్తిని నేటికిని నిలబెట్టుచున్న రామాయణ భారతములును, ఈక్రింద పేర్కొనబడిన అష్టాదశ పురాణములును, అష్టాదశోప పురాణములును ప్రజలలో నింకను హెచ్చు వ్యాప్తిలోనికితెచ్చు బాధ్యత హిందూధర్మాభిమానులపై కలదు.

పురాణములు : 1 భాగవత, 2 పద్మ, 3 విష్ణు 4 నారద, 5 వరాహ, 6 గరుడ, 7 బ్రహ్మాండ, 8 బ్రహ్మ, 9 బ్రహ్మవైవర్త, 10 మార్కండేయ, 11 భవిష్య, 12 లింగ, 13 వామన, 14 శివ, 15 స్కాంద, 16 అగ్ని, 17 మత్స్య, 18 కూర్మ-సంజ్ఞలు గలవి.

ఉపపురాణములు : 1 సవత్కుమార, 2 నరసింహ, 3 బృహన్నారదీయ, 4 శివరహస్య, 5 దూర్వాస, 6 కపిల, 7 వామన, 8 భార్గవ, 9 వారుణ, 10 కలికి, 11 సాంబ, 12 నంది, 13 సూర్య, 14 పరాశర, 15 వసిష్ఠ, 16 దేవీ భాగవత, 17 గణశ, 18 హంస-సంజ్ఞలు కలవి.

సదాచారము.

ధర్మ మపారము. మనకిపుడు లభించు శ్రుతిస్మృతీతి హాసపురాణవాజ్మయము పరిమితము. కావున శ్రుతిస్మృత్యాదులవలన కొన్ని ధర్మములను తెలిసికొనుటకు వీలులేకుండుట సహజము. మహర్షులు వ్రాసియుండిన ధర్మగ్రంధములు కొన్ని లోపించియుండును. మరియు మహర్షులు కొన్ని ధర్మములను గ్రంధస్థముచేయక స్వీయాచరణపూర్వకముగ పుత్రశిష్యాదుల కందచేసి యుండిరి. ఆధర్మములే నేటికిని శిష్టాచారరూపమున లోకములో గన్పట్టుచున్నవి. ఇవియు ప్రమాణములే. వేదశాస్త్రోక్తజీవితమును గడుపుచు నిష్కాములై సంచరించు మహాపురుషులనుండి యీసదాచారము గ్రాహ్యము.

మఱియు శ్రుతిస్మృతులలో భిన్నములుగ గన్పట్టు ధర్మములపట్ల వికల్పము నవలంబింపవచ్చునని పైని తెల్పబడినదికదా! మన మావికల్పమును వినియోగించుకొనుటలో శిష్టాచార మేపక్షమున నున్నదో, దానినే యనుసరింపవలయును, 'మహాజనో యేన గతస్సపంథాః' యనుదానికిదియే యర్థము. ''ఆచారః ప్రధమోథర్మః శ్రుత్యుక్తః స్మార్తఏవచ'' (శ్రుతిస్మృత్యుక్తమైన శిష్టాచారమే మొదటి ధర్మము) అని మనుస్మృతి కూడ చెప్పుచున్నది.

వేదమునకు విరుద్ధముకాని స్మృతినిబట్టి దాని కాధారమగు శ్రుతి యుండవలయునని యెట్లూహింతుమో యట్లే శ్రుతి స్మృతులకు విరుద్ధముకాని సదాచారమునుబట్టి దానికాధారమగు శ్రుతి యుండవలయునని యనుమానింతుము. కాని శ్రుతిస్మృతులకు విరుద్ధముగనున్న యాచారమునుబట్టి దానికి శ్రుతియుండవలయునని యూహించుటకు వీలులేదు. ఈయంశము నీక్రింది ఆపస్తంబ ధర్మనూత్రము తెల్పుచున్నది.

శ్రుతిర్హి బలీయస్యానుమాని కాదాచారాత్‌,

[ఆ. ధ. సూ. 1-4-8]

కొన్ని దేశములలోను, కొన్నిజాతులలోను, కొన్ని కులములలోను కొన్ని యాచారము లుండును. ఆ యాచారములు శ్రుతిస్మృతులకు విరుద్ధములుకానిచో నవియు నాదేశ జాతి కులములవారికి ప్రమాణములే యని గ్రహింపనగును.

దేశజాతి కులధర్మాశ్చామ్నా

యైరవిరుద్ధాః ప్రమాణం. [గౌ. ధ. సూ. 11-20]

ఆత్మతుష్టి.

ఇట్లు హిందూమతమునకు వేదము ప్రమాణము; వేదమునకు పిమ్మట స్మృతులు ప్రమాణము; పిమ్మట స్మృతి సమములైనశ్రౌత్రసూత్ర గృహ్యసూత్రాదులు, ఇతిహాసపురాణములు ప్రమాణము; పిమ్మట సదాచారము ప్రమాణము. పైయంశములను జూడ మానవున కేమియు ధర్మనిర్ణయ స్వాతంత్ర్యము లేదని తెలియగలదు. శ్రుతిస్మృతి సదాచారము లేవిషయమై యేమియు చెప్పుటలేదో, యావిషయములో మాత్రమే మానవుడు తన యిచ్చవచ్చినట్లు సంచరింపదగును. అట్టిపట్ల తనకు మనస్తుష్టి కల్గువిధమున ప్రవర్తింపక వ్యర్థముగ శ్రమకల్గునట్లు ప్రవర్తించుచో నది యధర్మమే యగును. వృధాక్లేశము తమోలక్షణమని భగవద్గీతాది గ్రంధములు చెప్పుచున్నవి. తన శక్తినిబట్టియే, యేకర్మనైనను, చేయుటకు మానవుడు పూనవలయును. కాని శక్తికి మించిన పనిపూని తన్ను తాను హింసించుకొనరాదని

'అనుబంధం క్షయం హింసామనపేక్ష్యచ పౌరుషం

మోహాదారభ్యతే కర్మ తత్తామసముదాహృదం'

(18-25)

అను గీతాశ్లోకమువలన తెలియుచున్నది. ఇట్లు శరీరమును క్లేశ##పెట్టుకొనకుండుట, అనాయాసమను ఉత్తమగుణమని గౌతమధర్మసూత్రము (8-22) చెప్పుచున్నది.

శ్రుతిస్మృతి సదాచారములు వికల్పమును వదలిన పట్లకూడ, మానవుడు తన కేపక్షము సుఖముగా నాచరించుటకు వీలుగా నుండునో యాపక్షమునే తీసికొనవలెను. లేనిచో నది తమోగుణ మగును. కనుక ఆత్మతుష్టియు ధర్మలక్షణముగ చెప్పబడినది.

ప్రమాణముల యీక్రమము మనుస్మృతిలో సంగ్రహముగ నిట్లు చెప్పబడినది.

వేదఃస్మృతి స్సదాచారః స్వస్యచ ప్రియమాత్మనః

ఏతచ్చతుర్విధం ప్రాహుః, సాక్షాద్ధర్మస్య లక్షణం

(మను 2-13)

ఉపసంహారము

పండితులందరు నొకపరిషత్తుగ నేర్పడి నేటికాలమున కవసరమగు మార్పులను ధర్మములో గావింపవలెననియు అట్టి పరిషత్తులు పూర్వముకూడ నుండినట్లు మన్వాది స్మృతుల వలననే తెలియుచున్నదనియు నేటివారు కొందరు చెప్పుచున్నారు. ఇది భ్రాంతిమూలకము. మనువు శిష్టపరిషత్తులను పేర్కొనినమాట వాస్తవమే కాని యాశిష్టపరిషత్తునకు ధర్మములో మార్పుచేయుట కదికారములేదని యాతడే చెప్పుచున్నాడు. మనువు ధర్మములను చెప్పి, గ్రంథాంతమందు తాను చెప్పినవికాక యింకను ధర్మములుగలవనియు తాను పూర్ణముగ నన్నిధర్మములను చెప్పినట్లు భావించి, యెవ్వరును మనుస్మృతిలో చెప్పబడనిపట్ల స్వేచ్ఛగ ప్రవర్తింపవచ్చునని తలంపరాదనియు, నితరధర్మములను వేదశాస్త్రవిదులై నిష్కాములైన పండితుల నడిగి తెలిసికొనవలెననియు చెప్పినాడు. అట్టి చెప్పబడని ధర్మములను తెలిసికొనుటకే శిష్టపరీషత్తు లుపకరించును. శ్రుతిస్మృతిసదాచారములపైగల్గు ధర్మవిషయక సందేహములను తీర్చుటకుకూడ నట్టి పరిషత్తులు సాయపడునని వేరుగ చెప్పనక్కరలేదు. అంతియేకాని యవి ధర్మమును మార్చుటకు సమర్థములు కావు.

అనామ్నా తేషు ధర్మేషు కథంస్యాదితిచేద్భవేత్‌

యంశిష్టాబ్రాహ్మణాబ్రూయు, స్సధర్మస్స్యాదశంకితః

(మను 12-08)

ఇచట ''అనామ్నాతేషు ధర్మేషు'' అను పదములకు ''చెప్పబడని ధర్మములలో'' అని యర్థము. వేదశాస్త్రములలో చెప్పబడిన ధర్మములను మార్చుట కెవ్వరికి నధికారములేదు. ఇదియే ధర్మముయొక్క కట్టుబాటు. ఇట్టి నియమము లేని విశృంఖలవృత్తి యధర్మమని సమస్త హిందూధర్మగ్రంథ సాగరమును మధింపగ దేలిన సారామృతము.

Hindumatamu    Chapters    Last Page