Hindumatamu    Chapters    Last Page

అధ్యాయము .

శీలము

ఆత్మగుణములు.

హిందూమతమున కర్మకాండ కెంత యావశ్యకతయున్నను, శీలమున కంతకంటెను హెచ్చు ప్రాముఖ్యము గలదు. సంస్కారములన్నియు నున్నను, శీలములేనిచో మానవుడు తరింపజాలడు.

ఎనిమిది గుణములు మానవుని కవశ్యముగ నుండవలయునని గౌతముడు చెప్పుచున్నాడు. అవి యెవ్వియన : (1) సర్వభూతములయందును దయ, (2) క్షాంతి, (3) అనసూయ, (4) శౌచము, (5) అనాయాసము, (6) మంగళము, (7) అకార్పణ్‌యము, (8) అస్పృహ.

'దయా సర్వభూతేషు, క్షాంతి, రనసూయా,

శౌచ, మనాయాసో, మంగళ, మకార్పణ్య మస్పృహేతి'

(గౌ. ధ. 1-8-24)

ఈ గుణముల కాత్మగుణములని పేరు.

దయః

పిపీలికాది సమస్తప్రాణులపట్లను దయ గల్గియుండుట యీ యాత్మగుణములలో మొదటిది. ఇది లేనిమానవుడెన్ని యుత్తమగుణములు గల్గియున్నను, పశుప్రాయుడేయని చెప్పవచ్చును. భగవద్గీతకూడ నీదయాగుణమును నొక్కి చెప్పుచున్నది.

''అద్వైష్టాసర్వభూతానాంమైత్రఃకరుణఏవచ'' (12-13)

మున్నగు ననేకస్థలములలో నీదయ బోధింపబడినది. మన కష్టసుఖములవంటివే యితరుల కష్టసుఖములు గూడ ననుభావ ముండవలెను. దీనినే గీత

'ఆత్మౌపమ్యే న సర్వత్ర సమంపశ్యతి యోర్జున,

సుఖంవాయదివా దుఃఖంసయోగీపరమోమతః (12-13)

అని చెప్పినది. ఉపనిషత్తులుకూడ 'ఆత్మవత్సర్వభూతాని' యని యాదేశించినవి. పరుల కపకారము చేయకుండుట దయయొక్క ప్రాథమికావస్థ; పరుల కుపకారము చేయుట రెండవయవస్థ. ఈ దయాగుణముయొక్క ప్రాశస్త్యమును తెల్పుటకు వ్యాసమహర్షి యిట్లు చెప్పినాడు.

''పాదద్వయేన వక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః,

పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం''

కోట్లకొలది గ్రంథములచే చెప్పబడిన విషయమును రెండుపాదములలో చెప్పుచున్నాను. పరుల కుపకారము చేయుట పుణ్యము; అపకారముచేయుట పాపము.

ఏభూతమును హింసీంపరాదని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. ''మాహిం స్యాత్సరాణిభూతాని''

మన గ్రంధములు ''దయ సర్వభూతములయందు'', ననియే చెప్పినవికాని యొక్క మానవులయందే యని చెప్పలేదు. కనుకనే పశుపక్ష్యాదులను చంపుటయు, వానిమాంసమును భక్షించుటయు మహాపాపముగ చెప్పబడినది. మను ధర్మశాస్త్రములో నిట్లు కలదు.

నాకృత్వాప్రాణినాం హింసాం మాంస ముత్పద్యతేక్వచిత్‌,

నచప్రాణివధ స్సర్గ్యస్తస్మాన్శాంసం వివర్జయేత్‌. (మను.5-48)

(ప్రాణులకు హింసచేయకుండ నెచ్చటను మాంసము లభింపదు. ప్రాణులను చంపుట స్వర్గహేతువుకాక, నరకహేతు వగుచున్నది. కావున మాంసమును విడచిపెట్టవలయును.)

''ఈలోకములో నే నేజంతువుయొక్క మాంసమును తినుచున్నానో, ఆజంతువు పరలోకములో నన్ను తినును. కావున మాంసమున కాపేరు వచ్చిన''దని (అనగా మాం=నన్ను, సః=అది తినును అని) గురైరుగవలెనని మనువు చెప్పుచున్నాడు.

మాంస భక్షయితా ముత్రయస్యమాంసమిహాద్మ్యహం

ఏతన్మాంసస్య మాంసత్వం ప్రవదన్తి మనీషిణః. (మను. 5-55)

భూతదయలో ప్రధానాంగమైన యహింస సామాన్య ధర్మము కాదు.

'అహింసా పరమోధర్మః' (మ. భా. ఆ. 11-13)

అని వ్యాసుడు దీనిని కీర్తించినాడు. భగవద్గీతలో బహుస్థలములలో

''అహింసాసత్యమక్రోధః'' ''అహింసాసమతాతుష్టిః''

మున్నగు వాక్యములచే నహింసాధర్మము విధింపబడి, ప్రశంసింపబడినది. పూర్ణమైన యహింసను పాటించువానియెదుట మానవులేకాక క్రూరజంతువులుకూడ తమ హింసాస్వభావమును వీడును. అహింసయొక్క యీప్రత్యక్షఫలము పురాణగాధలవలన తెలియుటయేకాక పతంజలిమహర్షిచే రచింపబడిన యోగసూత్రములలో కూడ చెప్పబడినది.

'తత్సన్నిధౌ వైరత్యాగః' (యోగ. సూ. 2-36)

క్షాంతి

రెండవ యాత్మగుణము క్షాంతి. ఎట్టిబాధలనైనను సహించుటయే శాంతి. ఆబాధలు శీతవాతాతపాదులనుండిగాని, మానవులనుండికాని రావచ్చును. వానిని భరించునపుడు విచారమును పొందరాదు. వానిని కల్గించిన మానవుని ద్వేషింపరాదు. ఈశాంతికే తితిక్షయనియు పేరు.

ఈతితిక్ష కుత్తమోదాహరణము భారతములో ధర్మరాజు చెప్పినది, ఒకచేయి చందనములోను; ఒకచేయి యగ్నిలోను నుంచినను తన మనస్సోకేవిధముగ నుండునని యుథిష్ఠిరుడు చెప్పినాడు. ఈవిధముగ కష్టములను సహించుట మన మేలుకొఱకే కాని యితరుల కుపకారముకొఱకు కాదు. కష్టములను సహించుట యలవడుచో, మనము కష్టమును జయించినవార మగుచున్నాము. దయ యితరుల కుపకరించును గాని క్షాంతి మనకే యుపకరించును. క్రమాభ్యాసము వలన శీతోష్ణాదిబాధలు, అవమానాదుల వలన వచ్చు బాధలు అన్నియు సులువుగా భరింప వీలుగల్గును. దీనివలన దుఃఖము దూరమగును. ఏతదభ్యాసవశముచేత, మరణానంతరమున సూక్ష్మశరీరము ప్రయాణముచేయు వివిధలోకములలో గల్గు బాధలుకూడ సులువుగ భరించుటకు వీలుకల్గును. జీవితకాలములో సర్వవిధముల మనకు కష్టసహిష్ణత కలుగనిచో, నకస్మాత్తుగా మరణానన్తరమున నదిరాదు. కనుక నీజన్మలోను, అనంతరమునుగూడ మనశ్శాన్తి కలుగవలెనన్నచో, నీతితిక్షాగుణము నలవరచు కొనవలెను. ఈ సందర్భమున నీక్రింది గీతాశ్లోకమును జ్ఞప్తియందుంచుకొనవలెను.

శక్నోతీహైవయస్సోఢుం ప్రాక్ఛరీరవిమోక్షణాత్‌,

కామక్రోధోద్భువం వేగం సంయుక్తస్ససుఖీనరః (5-23)

(ఎవడీ లోకములోనే, శరీరమును విడచుటకు పూర్వమే కామక్రోధముల వేగములను సహించుటకు సమర్థుడగునో, వాడే యోగి; వాడే సుఖవంతుడు)

తితిక్ష యలవరచుకొనుటకు ముఖ్యసాథనము, ''బాధ యింద్రియధర్మము కాని, యాత్మధర్మము కా''దని మననము చేయుటయే.

''మాత్రాస్పర్శాన్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః

ఆగమాపాయినోనిత్యాస్తాం స్తితిక్షస్వభారత'' (గీత 2-14)

''పంచతన్మాత్రలతోడి స్పర్శలు శీతోష్ణసుఖదుఃఖముల నిచ్చును; అవి వచ్చుచు పోవుచుండును. ఓయర్జునా! వానిని సహింపుము.'' అను మాటలను జ్ఞప్తియందుంచుకొని మననము చేయుచుందుమేని, యనుభవింపబడుచున్న దుఃఖము సగము తగ్గునని యనుభవజ్ఞులు నుడువుదురు.

అనసూయ

మూడవయాత్మగుణము అనసూయ. ఇతరున కేవిధమైన యభివృద్ధి కలిగినను నందులకు బాధపడకుండుటయు, వానిని ద్వేషింపకుండుటయు, అనసూయ యనబడును.

అసూయ హృదయములో చిచ్చువలె కాల్చుటయేకాక, యొకప్పు డితరులకు హానినిగూడ గల్గించునట్లు పరిణమింపవచ్చును. కావున అసూయ రెండువిధములుగ ననర్థహేతువు. దానిని తప్పక వీడవలయును.

శౌచము

నాల్గవ యాత్మగుణము శౌచము. శరీరమును, మనకు సంబంధించిన వస్తువులను, వాక్కును, మనస్సునుగూడ పరిశుద్ధముగ నుంచుకొనుటయే శౌచము.

శరీరమునకును మనస్సునకునుగల సంబంధమును మన ప్రాచీనులును, ఆధునికులునుగూడ నంగీకరించినారు. శారీర శౌచము లేనివారికి మనశ్శుద్ధియుండుట యరుదు. వాచిక శౌచము వలన రెండు ప్రయోజనములు కలవు. (1) సత్యభాషణము ప్రియహిత భాషణము మున్నగునవి వాచక శౌచము- ఇవి పుణ్యకర్మలు- వీనివలన జన్మాన్తరమందును లోకాన్తరమందును నుత్తమగతి గల్గును. అసత్యము వాక్పారుష్యము మున్నగునవి వాచికాశౌచము లోనివి. వీనివలన వ్యతిరిక్తఫలము గల్గును. (2) వాక్ఛుద్ధివలన మనశ్శుద్ధిగూడ గల్గును. మనశ్శుద్ధివలనగల్గు ఫలము లేవన : 1. మనశ్శుద్ధి సత్వలక్షణము, సత్త్వము జ్ఞానద్వారము; కావున మానవునకు మనశ్శుద్ధితరణసాధనము. 2. మనశ్శుద్ధివలన ధర్మాసక్తి నిష్కామ కర్మాసక్తి కల్గును; వీనివలన జ్ఞానము ప్రాప్తించును.

ఇట్లీ మూడువిధములైన శౌచమును గల్గియుండుట దైవసంపత్తులోనిది; ఈ శౌచము లేకుండుట యాసురప్రకృతిలోనిది. భగవానుడు గీతలో ఆసురప్రకృతి గలవారిని వర్ణించుచు వారికి శౌచము లేదనినాడు.

'నశౌచం నాపిచాచారోనసత్యం తేషు విద్యతే'. (16-7)

నిత్యము స్నానమాచరించి ధౌతవస్త్రములను ధరించుట శరీర శౌచవిధులలో నొకటి. ముఖ్యమైన శరీరశౌచమును గాపాడుకొనుటకు భగవద్గీతలలో చెప్పబడిన యీక్రింది శారీరక తపస్సు నాచరించుచుండవలయును.

దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్జవం,

బ్రహ్మచర్యమహింసాచశారీరంతప ఉచ్యతే, గీత. 17-14

(దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, పరిశుద్ధముగానుండుట, ఋజుప్రవర్తతతో నుండుట, స్వభార్యేతర స్థలముల బ్రహ్మచర్య మవలంబించుట ఎవరికిని హింసచేయకుండుట-ఇవి శారీరతపస్సుగా చెప్పబడును) బ్రహ్మచర్యమువలన విశేష ప్రత్యక్షఫలము కూడ గల్గును. బ్రహ్మచర్యమువలన శారీరకమానసికాధ్యాత్మిక శక్తులపారముగ వృద్ధిపొందును. ఈ శక్తులు బ్రహ్మచర్యము వలన వృద్ధిపొందునట్లాహారాదులవలన వృద్ధిపొందవు.

'బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్యలాభః' అని పతంజలి మహర్షి చెప్పినాడు.

(యో. సూ. 2-38)

వాచిక శౌచ మలవడుటకై యీక్రింది వాచిక తపస్సును చేయవలయును.

అను ద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌.

స్వాధ్యాయాభ్యసనంచైవ వాఙ్మయం తప ఉచ్యతే. (గీత. 17-15)

(ఎవ్వరికిని భయమును గల్గింపని మాటలాడుట, సత్యమునేపల్కుట, ఇంపుగ నుండునట్టియు, నెదుటివానికి మేలును చేయునట్టియు వాక్యమును పల్కుట, వేదాభ్యాసము-ఇవి వాచికతపస్సుగా చెప్పబడును.)

మానసిక శౌచమలవడుటకై యీక్రింది మానసిక తపస్సు చేయవలయును.

మనఃప్రసా దస్సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః,

భావసంశుద్ధిరిత్యేతత్తపోమా నస ముచ్యతే. (గీత. 18-16)

(మనస్సు ప్రశాంతముగా నుండుట, దుష్టభావములను వీడి సద్భావములను కల్గియుండుట, మౌనము వహించుట, ఇంద్రియనిగ్రహము, భావశుద్ధి గల్గియుండుట- ఇవి మానసిక తపస్సు)

అనాయాసము

అయిదవ యాత్మగుణము అనాయాసము. దీనిస్వరూపము ప్రమాణాధ్యాయమున, 'ఆత్మతుష్టిని' వివరించుపట్ల చెప్పబడియున్నది. తనశక్తికిమించిన ధర్మములను చేయబూని కాని, తనకు ఆశ్రేయస్సులు గలిగించు పరహింస మున్నగు అధర్మములలోగాని శారీరక మానసికాయాసములను పొందువాడు తమోలక్షణోపేతుడును ఆసురప్రకృతిలోనివాడునని గీత చెప్పుచున్నది. ఇందు మొదటిదాని కిదివరలో ప్రమాణము చూపబడినది. రెండవదానికి గీతలలోని యీ క్రిందివాక్యమును తీసికొనవచ్చును.

కర్శయన్తశ్శరీరస్థంభూత గ్రామముచేతసః,

మాంచైవాన్తశ్శరీరస్థం తా& విద్ధ్యాసుర నిశ్చయాన్‌. (గీత. 17-6)

(బుద్ధిహీనులు అహంకారయుక్తులై, ఘోరతపస్సు చేయుచు తమశరీరములోనున్న పంచభూతములను, నందేయున్న నన్ను గూడ కృశింపచేయుచున్నారు. అట్టివారాసుర నిశ్చయము కలవారు.)

కావున భగవంతునకు నివాసమైన మన పవిత్రశరీరమును వ్యర్థముగాగాని, యహంకార యుక్తకార్యములకొఱకుగాని, బాధపెట్టుటయన నందలి పరమేశ్వరుని హింసపెట్టుటయే యని గ్రహింపవలయును.

ఎల్లపుడును సంతోషముతోనుండుట యుత్తమపురుష లక్షణముగ శాస్త్రములలో చెప్పబడినది. 'సంతుష్టస్సతతంయోగీ' 'అహింసా సమాతాతుష్టిః' మున్నగు గీతావచనములు సంతుష్టిని ఉత్తమలక్షణముగ చెప్పినవి. ఎట్టి ప్రబలబాహ్య హేతువులున్నను. ఆంతరంగికముగ మనస్సు కలతనొందనీయకుండుటకు 'మనఃప్రసాద' మనిపేరు. ఇట్టి మనస్సౌఖ్యమును నిరంతరము ననుభవించుట యనాయాసమునకు పరమావధి.

మంగళము

మంగళమనునది యాఱవయాత్మగుణము. నిరంతరము శుభమునే తలచుచుండవలయును; శుభమునే వినుచుండవలయును; చూచుచుండవలయును. అశుభవిషయములను దరిచేరనీయరాదు అశుభకార్యములను పూనరాదు.

''భద్రం కర్ణేభిఃశ్రుణు యామదేవాః

భద్రంపశ్యేమాక్ష భిర్యజత్రాః'' (తై. ఆ. 1-1)

మున్నగు శ్రుతివాక్యములలో తెల్పబడినట్టు నిరంతరము మాంగళ్యమునే వినుటకును, చూచుటకును కోరుచుండవలయును. ఇట్లు మనస్సహితములైన యింద్రియములను మాంగళ్యమువైపునకే త్రిప్పుదుమేని అమంగళము ప్రతిహతమై నిత్యము శుభము చేకూరును. ఇది మనస్సు యొక్కశక్తి ఒక యమంగళభావము మన చుట్టుపట్ల నొకనికున్నచో, అది అదృశ్యరూపమున మనలోకూడ ప్రవేశించి మనమనస్సును కూడ నొకింత మలిన పరచునని యోగులు చెప్పుదురు. కావుననే అమంగళపదమును నోటితో నుచ్చరించుట గూడ తగదని మహర్షులు చెప్పిరి. అమంగళమును తప్పని సరిగా తెల్పవలసినపుడు సంకేతముగా మంగళపదమునే వాడవలయునని స్మృతికర్తలు చెప్పిరి.

''అభద్రం భద్రమితిబ్రూయాత్‌' (గౌ. ధ. సూ. 9-21)

వట్టిపోయిన ఆవును తెల్పుటకు శ్రేష్ఠ ధేనువాచకమైన 'ధేనుభవ్యా' అను శబ్దమును వాడవలయును.

ఇట్లు సర్వప్రయత్నములచేతను మానవుడు జీవితమును శుభోపేతము గావించుకొనవలయును.

అకార్పణ్యము

అకార్పణ్య మనునది యేడవ యాత్మగుణము. అకార్పణ్యమనగా నెన్నడును దైన్యము పొందకుండుట.

ఒక బాధ కల్గినపుడు దానిని తప్పించుకొనుటకుకాని, యొక లాభమును పొందుటకుగాని ఆత్మగౌరవమును విడచి యెదుటివానినుండి యుపకారము కోరి, దానికొఱకై వానికి దాసుడుగ వ్యవహరించుట దైన్యము. కావున నిట్టి దైన్యపరుడు భగవంతునియందు విశ్వాసము లేనివాడగుచున్నాడు. దుఃఖములయందు భయము, సుఖములయందు కోరిక లేకుండ వలెనని గీతోపదేశము.

'దుఃఖేష్వనుద్విగ్నమానాస్సుఖేషు విగతస్సృహః' (2-56)

ఇది యలవఱచుకొని భగవంతుడు కల్పించిన దానితోనే తృప్తిపడుచుండవలయునని (యదృచ్ఛా లాభసంతుష్టః) గీత చెప్పుచున్నది. భగవంతుడు సర్వజ్ఞుడు. కావున, మన కేదికావలయునో యాతనికే తెలియునను దృఢవిశ్వాసముతో ఆయనను సేవించువారి యోగక్షేమములను ఆయనయే వహించును.

'ఆనన్యాశ్చిన్తయన్తోమాం యే జనాః పర్యుపాసతే,

తేషాంనిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామహ్యం.

(ఇతరుల నాశ్రయింపనివారై నన్నే తలంచుచున్న వారై యేప్రజలు నన్ను సేవింతురో, నిత్యయుక్తులైన యట్టి వారి యోగక్షేమములను నేను వహించుచున్నాను.)

అని భగవానుడు చెప్పియున్నాడుకదా. కావున దైన్యమును పొందుట యన భగవంతునియందు నమ్మకము లేకపోవుటను ప్రకటించుటయే! అంతియేకాక, దైన్యావస్థలో మానవు డెదుటివానిని సంతోషవఱచుట కెట్టిపాపకార్యములనైనను చేయవలసివచ్చును. మనము చేయు కార్యములు భగవత్ర్పీత్యర్థ ముండవలయును కాని, కేవలము మానవప్రీత్యర్థ ముండరాదు. కావున దైన్యము తప్పక విడువదగినది.

అస్పృహ

ఎనిమిదవ యాత్మగుణము అస్పృహ- అనగా కోరికలు లేకుండుట.

మానవుని ఘనతను నిర్ణయించుటలో కామవిషయము కొలతబద్ద. మానవునకు కోరిక లెంత హెచ్చుగానున్న వాడంత నికృష్టుడు: కోరిక లెంత తక్కువగానున్ననంత యుత్తముడు. ఏమియు కోర్కెలు లేనివాడు సర్వోత్తముడు. అట్టిస్థితికి వచ్చి యాత్మపదార్థముతోనే క్రీడించువా డుత్తీర్ణుడైనట్లు గ్రహింపవలయునని గీత చెప్పుచున్నది.

ప్రజహాతి యదా కామాన్‌ సర్వాన్పార్థ మనోగతాన్‌

ఆత్మన్యే వాత్మ నాతుష్టస్థ్సితప్రజ్ఞ స్తదోచ్యతే. (3-55)

మనుస్మృతియు జీవితవిధానము కామగ్రస్తము కాకూడదని చెప్పుచున్నది.

''కామత్మతాన ప్రశస్తా.'' (2-2)

ఇతరులు తమంత తామేదియైన దాన మొసగినను గ్రహింపకుండుట అస్పృహయొక్క పరమావధి. ఇట్టి గుణమునకు అపరిగ్రహమని పేరు. పరిగ్రహమువలన దాతయొక్క పాపము ప్రతిగ్రహితకు సంక్రమించునని వేదము (తై. ఆ. 2-15) చెప్పుచున్నది. పూర్ణముగా అపరిగ్రహము పాటించువాని మనస్సు అకలుషమై పూర్వజన్మలోని వృత్తాన్తమును గూడ తెలిసికొనుటకు సమర్థమగును. దీనివలన జన్మహేతువు స్పష్టమై జన్మరాహిత్యమార్గము గోచరించును. దీనినే-

'అపరిగ్రహస్థ్యె ర్యేజన్యకథంతా సంబోధః'

అనిపాతంజలయోగ సూత్రము (2-39) చెప్పుచున్నది. సస్పృహతయొక్క నికృష్ట పరిణామము చౌర్యము (స్తేయము). మనస్సులోకూడ పరులసొత్తుల కాశింపనివానికి ప్రకృతి దేవతయే సమస్తసంపత్తులు క్రమముగ చేకూర్చునని యోగశాస్త్రము చెప్పుచున్నది.

'అస్తేయ ప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానం' (2-37)

ధర్మమునందును, భక్తియందును, మోక్షమునందును కోరిక లేనిచో మానవుడు తరింపలేడు. కావున నీకోరికలు వదలదగినవి కావు. ఇతర కామములు బంధహేతువులు.

సత్యము.

పైని తెలుపబడిన యాత్మగుణములలో శౌచమునందంతర్భూతమైనది సత్యము.

''సత్యాన్నాస్తిపరోధర్మః'' అని మహర్షులు బోధించిరి.

అహింసగూడ నిట్టిదిగనుకనే, సత్యాహింసలు జోడింపబడి గీతాదిగ్రంథములలో చెప్పబడినవి.

సత్యము చెప్పుచో కొన్నిపట్ల నితరులకు గష్టము కలుగవచ్చును. అయినను సత్యమును వీడరాదు. కాని యితరులకు కష్టమును గలిగించు సత్యమును వ్యర్థముగా పలుకరాదు. ఒక దరిద్రుని జూచి 'నీవు దరిద్రుడ' వనుట వ్యర్థముగా పలుకబడిన సత్యమగును. ఇట్టి సత్యములను పలుకరాదు. ఒకనికి ప్రియము కలుగును కదాయని అసత్యము నెన్నడును పలుకరాదు. ఇది సనాతన ధర్మమని మనుస్మృతి చెప్పుచున్నది.

'సత్యంబ్రూయత్ర్పియం బ్రూయాన్న బ్రూయాత్సత్య మప్రియం

ప్రియంచ నావృతం బ్రూయాదేషధర్మస్సనాతనః. (మను 4-138)

సర్వస్వమును పరిత్యజించియైనను, సత్యము గాపాడుకొన్నవారు కలరు. తన్ను బ్రహ్మర్షి యవనందులకు విశ్వామిత్రుడు వసిష్ఠుని బహువిధముల బాధించెను. తాను నమ్మని విషయమును చెప్పి యసత్యదోషమును కట్టుకొనుట కువసిష్ఠు డంగీకరింపలేదు. తుదకు విశ్వామిత్రుని రజోగుణము పూర్తిగా నణగినపిమ్మట నాతని బ్రహ్మర్షియనెను. ''ముందుగనే యని యుండినచో నీకీబాధలు తప్పియుండెడివిగదా'' యని విశ్వామిత్రుడు పల్కెను. అందులకు వసిష్ఠుడు ''అప్పటికి నీకింకను బ్రహ్మత్వము రాలేదు. బాధలను తొలగించుకొనుట కసత్యమాడదగునా?'' అని సమాధానము చెప్పెను.

వేదములో గూడ సత్యము ప్రథమధర్మముగనే చెప్పబడినది. విద్యను ముగించుకొని గురుకులమును వీడిపోవుచున్న శిష్యునకు గురువుచేయు నుపదేశములో మొట్టమొదట ''సత్యం పద'' అనియే కలదు. (తై. ఉ. 1-11) కావున హిందూమతములో సత్యముయొక్క స్థానము అద్వితీయము.

ఎన్నడు నసత్యము పలుకనివానినోటినుండి యేవాక్కు వెడలినను నది యధార్థమగును. అట్టివానికి కార్యసిద్ధి కితర సాధనము లక రలేదు. అతని వాక్కే గొప్ప క్రియాసాధనము. ఈ యంశము నీక్రింది పాతంజలసూత్రము తెల్పుచున్నది.

'సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వం.'

(యో. సూ. 2-36)

ఇతర గుణములు

పైని తెల్పబడిన ఆత్మగుణములకు పిమ్మట పేర్కొనిదగిన యుత్తమలక్షణము లనేకములు గలవు. శ్రుతిస్మృతీతి హాసపురాణములచేత నవి యనేకవిధముల ప్రతిపాదింపబడి యున్నవి. పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, అతిథిపూజ, సత్పురుష సహవాసము వినయము మున్నగున వెన్నియో గలవు.

తల్లిదండ్రుల ఋణము నూరుజన్మలలోనైనను తీరదని మనుస్మృతి చెప్పుచున్నది.

''యంమాతాపితరౌక్లేశం సహేతేసంభ##వే నృణాం

నతస్యనిష్కృతిశ్శ కర్తుంవర్ష శ##తైరపి'' (మను. 2-27)

కావున తల్లిదండ్రులను దైవములుగ భావింపవలెను. తైత్తిరీయోపనిషతత్తిట్లు చెప్పుచున్నది.

''మాతృదేవోభవ, పితృదేవోభవ,

ఆచార్యదేవోభవ, అతిథిదేమోభవ'' (11-2)

(తల్లియే దైవముగా కలవాడవగుము. తండ్రియే దైవముగా కలవాడవగుము, ఆచార్యుడే దైవముగా కలవాడ వగుము, అతిథియే దైవముగా కలవాడవగుము.)

దానముగూడ నిట్టి యుత్తమగుణములలో నొకటి. ఐశ్వర్యమునుబట్టి దానము చేయవలయుననియు, ఔద్ధతయముచేగాక యింతమాత్రమే దానము చేయుచున్నానను సిగ్గుచే దానము చేయవలయుననియు, దానము పుచ్చుకొనువానికి కష్టము కలుగునేమో యను భయముతో దానము చేయవలయు ననియు, పాత్రత నెఱింగి పరమేశ్వరార్పణ బుద్ధితో దానము చేయవలయుననియు తైత్తిరీయోపనిషత్తు చెప్పుచున్నది.

ఉత్కృష్టులైన బ్రాహ్మణోత్తములను చేరబిలిచియు, చెంతజేరియు, వారిని గౌరవించియు, వారి సహవాసమున మాలిన్యము పోగొట్టుకొనవలెననిగూడ నీఘట్టముననే చెప్పబడినది. పైని దెల్పబడిన సద్గుణముల కన్నిటికిని సహకారము జేయునదియే యీ సత్సహవాసము.

కర్మకాండ - శీలము

ఈ యధ్యాయమున దెల్పబడిన సత్ర్పవర్తనము అత్యంతము ప్రధానమైనది. నడవడిక సరిలేనివాడెంత విద్యాసంపన్నుడైనను లాభములేదు. మరణానంతరమున వానికి విద్యలుపకరింపవు. ఈ క్రింది వసిష్ఠశ్లోకము గమనింపదగినది.

''ఆచార హినం నపునన్తివేదా

యద్య ప్యధీతా స్సహషడ్భిరంగైః

ఛందాంస్యేనం మృత్యుకాలేత్యజన్తి

నీడం శకున్తా ఇవజాతపక్షాః''

(వేదములు షడంగములతోడను అధ్యయనము జేయబడినను మంచినడవడిక లేని వానిని పవిత్రునిగాచేయవు. రెక్కలువచ్చిన పక్షులు గూటిని వదలిపెట్టి పోవునట్లు వేదములుగూడ మరణకాలమున నాతని విడచిపోవును.)

హిందూమతములో సంస్కారరూపమైన కర్మకు చాల గొప్పస్థానమే కలదు కాని యంతకంటె గొప్పస్థానము పైని తెల్పబడిన యాత్మగుణములకు కలదు. కేవలము కర్మగాని, కేవలము ఆత్మగుణములుగాని రక్షింపజాలవు. కావి, యేమయిన కొంచెములోటున్నచో, నది సంస్కారములలో నుండవచ్చునుగాని, ఆత్మగుణములలో నుండకూడదు, సంస్కారములకును, ఆత్మగుణములకును గల తారతమ్యము యొక్క సమీక్ష గౌతమధర్మసూత్రములలో చేయబడినది. బ్రహ్మసాయుజ్య సాలోక్యములను పొందవలెనన్నచో, కర్మకాండాధ్యాయమున దెల్పబడిన నలుబది సంస్కారములను, ఎనిమిది యాత్మగుణములను గూడ గలిగి యుండవలెనని గౌతముని యభిప్రాయము. సంస్కారములు పూర్తిగానున్నను, ఆత్మగుణములులేనిచో వానికి బ్రహ్మసాయుజ్య సాలోక్యములు కలుగవని గౌతమ ధర్మసూత్రములలో స్పష్టముగా జెప్పబడినది.

యసై#్యతే చత్వారింశత్సంస్కారా నచాష్టావాత్మగుణాః

నసబ్రహ్మణః సాయుజ్యంసాలోక్యంచగచ్ఛతి. (గౌ. ధ. 8-23)

సంస్కారములలో కొన్నియున్నను, ఆత్మగుణము లన్నియు నున్నచో సాలోక్యము గల్గునని యీక్రింది సూత్రము చెప్పుచున్నది.

''యస్యఖలు సంస్కారాణా మేక దేశోప్యష్టా వాత్మగుణా

అథ సబ్రహ్మణః సాయుజ్యంసాలోక్యంచ గచ్ఛతిగచ్ఛతి'' (గౌ. ధ. 8-24)

ఇచ్చట వ్యాఖ్యాతలు సంస్కారములును, ఆత్మగుణములును పూర్తిగానున్నచో సాయుజ్యము గల్గుననియు సంస్కారములు గొన్నియు, నాత్మగుణములన్నియు నున్నచో సాలోక్యము గల్గుననియు వివరణము చేసినారు.

కర్మకాండయు నియమములును ముఖ్యములు. ఆత్మ గుణము లంతకంటెను ముఖ్యములు.

ఈ యాత్మగుణములు - శీలము - సర్వవర్ణములకును విధింపబడుట గుర్తింపదగిన యంశము. (మూడవ అధ్యాయమున) దయాసత్యశౌచాదులతోగూడిన సత్ర్పవర్తనము సర్వవర్ణ సామాన్యధర్మమని చెప్పబడినదాని నిదికూడ బలపరచును. మను విట్లు చెప్పుచున్నాడు.

''అహింసాసత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహః,

ఏతం సామాసికం ధర్మంచాతుర్వర్ణ్యేబ్రవీన్మనుః'' (10-63)

(అహింస, సత్యము పరధనము హరింపకుండుట, శౌచము, ఇంద్రియనిగ్రహము- సంగ్రహముగా నీధర్మములను మనువు నాల్గు వర్ణములకును విధించెను.)

ప్రకరణమునుబట్టి యీధర్మములు నాల్గువర్ణములకే కాక సంకరవర్ణములకు కూడ విహితము లేయని కుల్లూకభట్టు వ్యాఖ్యానములో వ్రాసినాడు. కావున పైని వివరింపబడిన సత్ర్పవర్తనము. ఆత్మగుణములు, సర్వహిందువులును అనుసరింపవలయునని తెలియదగును.

జన్మాంతరము

తృతీయాధ్యాయము మొదలుకొని యింతవఱకు తెలుపబడిన కర్మకాండ నాచరించుచు, ఆత్మగుణముల నలవరచుకొనుచు స్వవర్ణాశ్రమధర్మపరులైనవారు మరణానంతరమున పుణ్యలోకములలో సుఖముల ననుభవించుటయేకాక, తిరిగి యీలోకమున జన్మించునపుడు పూర్వజన్మలోకంకంటె నుత్కృష్ట వర్ణములోను ఉత్కృష్టకులములోను జనింతురు; వెనుకటి కంటె ఉత్కృష్టరూపసంపత్తితోను, అధికాయువుతోను, గొప్పవిద్యతోను, ప్రవర్తనతోను, ధనముతోను, సుఖముతోను, బుద్ధితోను నొప్పదురు. గౌతమధర్మసూత్ర మీ యంశము నీక్రిందివిధముగ చెప్పినది.

వర్ణా ఆశ్రమాశ్చ స్వకర్మనిష్ఠాః

ప్రేత్యకర్మ ఫలమనుభూయ తతశ్శేషేణ

విశిష్టదేశజాతి కులరూపాయుశ్శ్రుత

వృత్త విత్తసుఖమేధసో జన్మప్రతిపద్యన్తే. (11-29)

కర్మకును, పునర్జన్మకును సన్నిహితసంబంధము కలదు. కర్మనుబట్టియే పునర్జన్మముండును. ఈయర్థమున ఆత్మగుణములుకూడ కర్మలోనికే చేరును.

పునర్జన్మ సిద్ధాన్తము హిందూమతమునకు ప్రత్యేక లక్షణము. హిందూమతముపై తిరుగుబాటుగా బయలుదేరిన బౌద్ధ జైనమతములుగూడ నీ పునర్జన్మ సిద్ధాన్తము నంగీకరించినవి.

మానవు డీజన్మలో చేసికొనిన కర్మనుబట్టి యాతని తరువాతిజన్మను భగవానుడు నిశ్చయించునని కొంతవఱకు వర్ణవ్యవస్థాధ్యాయమున చెప్పబడినది. రమణీయమైన యాచరణముగలవారు బ్రాహ్మణ, క్షత్రియాది యోనులయందు జనింతురనియు, దుష్టమైన యాచరణముగలవారు సూకర చండాలాది యోనులయందు జనింతురనియు ఛాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది.

తద్య ఇహ రమణీయచరణా అభ్యాశో

హయత్తె రమణీయాం యోనిమాపద్యేరన్‌

బ్రాహ్మణయోనిం వా క్షత్రియ యోనిం వా వైశ్య

యోనిం వాథయ ఇహ కపూయచరణా ఆభ్యాశో

హయత్తే కపూయాం యోని మాపద్యేవర& శ్వయోనిం

వాసూరక యోనిం వా చండాల యోనిం వా. (ఛాం. ఉ. 5-10)

ఈ పునర్జన్మ సిద్ధాన్తమును శ్రీ భగవానుడు 'గీతలో యోగభ్రష్టు నుదాహరణముగా తీసికొని యత్యంతము రమ్యముగా చెప్పియున్నాడు. (గీత 6-40 నుండి 45 వఱకు).

కల్యాణసంకల్పమును, కల్యాణకర్మారంభమును గల వానిని జన్మ జన్మాంతరములయందును, లోకాంతరములయందును గూడ దాను వీడక, వానిని క్రమముగ నుత్తమస్థితిలోనికి తెచ్చెదనని భగవానుడు ప్రతిజ్ఞ చేసియున్నాడు.

పూర్ణమైన భగవదనుగ్రహము గల్గినపుడు జ్ఞానోదయమై మోక్షము సిద్ధించును. జనన మరణ రూపసంసారము తప్పి, నిత్యనిరతిసయానందము ప్రాప్తించుట మోక్షము యొక్క స్వరూపము. మోక్షమే పరమ గమ్యస్థానము. కామ్య కర్మలవలన స్వర్గాదిలోకములలోను ఈజన్మలలోను, జన్మాంతరములోను సుఖము గలుగవచ్చును; కాని యీ సుఖములు శాశ్వతములుగావు. భక్తులును, జ్ఞానులును నీవిధమైన సుఖము నేవగించుకొందురు. నిత్యనిరతిశయ సుఖమే వారి లక్ష్యము. ఎల్లరును దీనినే దృష్టిలో నిడుకొని స్వవర్ణాశ్రమధర్మములను వీలైనంతవఱకు నిష్కామముగా నీశ్వరార్పణ బుద్ధితో నాచరించుచు ఆత్మగుణముల నలవఱచు కొనవలయును.

Hindumatamu    Chapters    Last Page