Hindumatamu    Chapters    Last Page

అధ్యాయము .

స్త్రీధర్మము

స్వాతంత్ర్యము

హిందూమతము స్త్రీపురుషుల కొకేధర్మమును నియమింపదనునది యసందిగ్ధమైన విషయము. ధర్మములో స్త్రీకి స్వాతంత్ర్యము లేదు.

''అస్వతంత్రా ధర్మేస్త్రీ'' (గౌ. ధ. 18-1)

అని గౌతమధర్మసూత్రము చెప్పుచున్నది.

పురుషులకుకూడ భార్యలేనిదే యాగాది కర్మలను చేయుట కధికారము లేనిమాట వాస్తవమే.

''అయజ్ఞోవా ఏషః యోపత్నీకః''

అని తైత్తిరీయబ్రాహ్మణములో చెప్పబడినది. (2-2-2-6)

కాని భేదమేమన: పురుషుడొకధర్మకార్యమును చేయదలచినపుడు భార్య యాతనికి తోడ్పడి తీరవలయు నను విధిగలదు. స్త్రీయన్ననో, భర్త యనుమతి లేనిదే యేధర్మము చేయుటకును వీలులేదు. ఉపవాసము, వ్రతము మున్నగునవి కూడ భర్త యనుమతితోనే జరుగవలయును. భర్తయనుజ్ఞ లేకుండ చేయబడు వ్రతములు రాక్షసులకు చేరునని స్మృతులు చెప్పుచున్నవి.

అవృష్ట్వాచైవ భర్తారం యానారీకురుతే వ్రతం,

సర్వంతద్రాక్షసాన్‌ గచ్ఛేదిత్యేవం మనురబ్రవీత్‌. (పరాశర 2-16)

దీని యుద్దేశము స్త్రీకి ధర్మములేదనికాదు, స్త్రీకిగల ధర్మములన్నింటిలోను భర్తృవాక్యపరిపాలనము, పతిభక్తి అత్యుత్తమములు అని దీనియర్థము.

''స్త్రీభిర్భర్తృవచః కార్యమేషధర్మః పరఃస్త్రీయః''

(స్త్రీకి భర్త్రాజ్ఞను పాలించుట యన్నిటికంటెను గొప్పధర్మము అని మనువు చెప్పుచున్నాడు.

స్త్రీకి ధర్మవిషయముననే స్వాతంత్ర్యము లేనప్పుడు, లౌకిక విషయములమాట వేరుగ జెప్పనక్కరలేదు. అన్ని విషయములలోను స్త్రీలు అస్వతంత్రలని మనువు చెప్పుచున్నాడు. స్త్రీని బాల్యమున తండ్రియు, ¸°వనమున భర్తయు, వార్థకమున భర్త వానప్రస్థుడైనచో పుత్రుడును రక్షింపవలెనని మను వీక్రిందిశ్లోకములో చెప్పినాడు.

''పితారక్షతి కౌమారే భర్తారక్షతి ¸°వనే

రక్ష న్తివార్ధ కేపుత్రానస్త్రీ స్వాతంత్ర్యమర్హతి'' (9-3)

స్త్రీలు తమ యధీనమున నున్నారుకదాయను భావమున వారి కేవిధమైన సుఖమును కలుగనీయక, యనవసరముగ నిర్బంధములలో నుంచు పురుషులు తమ యధికారమును దుర్వినియోగము చేసికొనువారగుచున్నారు. ఆకర్మఫలమును వారనుభవింతురు. అంతేయేకాక, యట్టి పురుషుల వలన ధర్మమునకు హానిగల్గును. అట్టి దుష్టపురుషుల చర్య వలన బాధలను పడలేక స్త్రీలు చివఱకు బఱితెగించుటయు సంఘములో స్త్రీస్వాతంత్ర్యము కావలయునను నాందోళనము బయలుదేరుటయుగూడ జరుగును. కావున, ధర్మము లోకములో నిలువవలయుననిన నెవరిహద్దులలో వారుండవలయును. స్త్రీలకు స్వాతంత్ర్యము లేకుండుట వారికి బాధను గల్గించుటకుగాదని గుర్తించుట యవసరము.

దాంపత్య మవిచ్ఛిన్నముగ నుండవలెనన్నచో, భార్యభర్తలలో నొకరికి స్వాతంత్ర్యము లేకుండుట తప్పదు. ఇరువురకును స్వాతంత్ర్య ముండుట యనగా, నిత్యమును కలహమున కవకాశమగుటయే. ఒకేవిషయమున నిరువురిలో నొకరి కొకవిధముగా దోచవచ్చును. మరియొకరికి మరియొకవిధముగా దోచవచ్చును. అందువలన నొకరి విధానమునకు మరియొకరి విధానముతో సంఘర్షణము కలుగును. అట్టి పరిస్థితిలో నెవరో యొకరు రెండవవారు చెప్పినట్లు వినవలయునను నియమము లేనిచో, గృహములో శాంతి, సామరస్యము పోవును. దంపతులలో నెవరోయొకరు తమ వ్యక్తిత్వమును రెండవవారిలో లీనము చేసికొనుట యత్యవసరము. ఇట్లెవరు తమ వ్యక్తిత్వమును వదలుకొనవలెననిన స్త్రీయే యనుట కనేక హేతువులు గలవు. భిన్నదేశములలోని నాగరికతా చరిత్రలు, వివిధమతముల యాదేశములు, మానవ మనస్తత్త్వశాస్త్రము, స్త్రీపురుషులకుగల శారీరక శక్తులు మున్నగునవన్నియు స్త్రీ పురుషునిలో తనవ్యక్తిత్వమును లీనముచేసికొనుట కనుకూలించును; గాని, పురుషుడు స్త్రీయందు తన వ్యక్తిత్వమును లీనముచేసికొనుట కనుకూలింపవు.

గృహిణి.

గృహ్యకృత్యములలో స్త్రీకి పూర్ణమైన స్వాతంత్ర్యము కలదు. గృహములోని ద్రవ్యమున కామెయే స్వామినియని వేదము చెప్పుచున్నది.

''పత్నీ పారీణహ్యస్యేశే.'' (తై నం. 6-2-1-1)

గృహమే స్త్రీయొక్క స్థానమనుటకు శ్రుతిస్మృతులలో ననేకాధారములు కలవు. ''జాయేదస్తం'' (భార్యయే గృహము) అని ఋగ్వేదములో (3-53-4) చెప్పబడినది. మనుస్మృతిలో పురుషునకు గురుకులవాస మెట్టిదో స్త్రీ గృహకృత్యము లట్టివని చెప్పబడినది.

దాంపత్యమచ్ఛేద్యము.

పైని తెల్పినట్లు దంపతులలో నొకరు మరొకరి యధీన మందుండి తీరవలయునను నియమమే లేనిచో, సంఘమున వివాహవిచ్ఛేదము లాచరణములోనికి వచ్చును. పాశ్చాత్య దేశములలో నట్లేయున్నది. అభ్యాసవశమున క్రమముగా భార్యభర్తలో నైక్యమొందుటకు వీలున్నను, వ్యక్తిస్వాతంత్ర్యముపేర పాశ్చాత్యు లావీలు నుపయోగించుకొనకున్నారు. మన ప్రాచీనులు సంప్రదాయబలముచేతను ఇతిహాసపురాణ దృష్టసతీమణుల యుదాహరణములచేతను స్త్రీలలో భర్తృతన్మయత్వము గల్గు మార్గములను చూపి యున్నారు.

దంపతులకు మానసికైక్యము గల్గించుటకై మంత్రములు వేదములలో కొన్నియున్నది. గృహ్యసూత్రములలో నట్టి యైక్యమును గల్గించు విధానములు సూచింప బడినవి. బోధాయన గృహ్యసూత్రములో చూపబడిన ప్రక్రియ యిట్లు కలదు.

'అధాస్యా ఉపోత్థాయ, దక్షిణన, హస్తేన, దక్షిణమం

సంప్రతి, బాహుమస్వహృత్య, హృదయదేశమభిమృశతి.

'మమహృదయే హృదయంతేఅస్తు మమచిత్తే చిత్తమస్తు,

మమవాచ మేక మనాశ్శ్రణు, మామేవా నువ్రతా

సహచర్యామయాభవ'' ఇతి, అథాసై#్య దక్షిణక ర్ణేజపతి,

'మాం తేమనఃప్రవిశతు, మాంచక్షుర్మాముపేతుభగః,

మయిసర్వాణిభూతాని, మయిప్రజ్ఞానమస్తుతే.'

(బో. గృ. సూ. 1-4)

(వరుడు కుడిచేతితో వథువుయొక్క దక్షిణాంశమును గూర్చి బాహువునెత్తి, హృదయమును స్పృశించి యిట్లు చెప్పుచున్నాడు: 'నాహృదయమందు నీహృదయముండుగాక, నాచిత్తమందు నీచిత్తముండుగాక, నావాక్కు నేకమనస్కవై వినుము. నన్ననుసరించియే వ్రతముకలదానవగుము. నాతో సహచర్యవగుము.' ఆమె కుడిచెవిలోనిట్లు జపించుచున్నాడు. నీమనస్సు నన్ను ప్రవేశించుగాక. నీనేత్రము, భగము నన్ను ప్రవేశించుగాక. నీకు నాయందే సర్వభూతములు గన్పట్టుగాక! నాయందే నీకు ప్రజ్ఞాన ముండుగాక.)

శారీరకముగ రెండు వ్యక్తులైన స్త్రీపురుషులు మానసికముగ నొకేవ్యక్తి యగుటయే హిందూదాంపత్య లక్షణము. జీవితకాలములోనేకాక, మరణానంతరమునగూడ నిట్టి యైక్యముతో నుండుటయే ఆర్యదాంపత్యవిశేషము. మరణానంతరమునగూడ దాంపత్యము వీడరాదను నుత్తమాదర్శము వేదములలో ననేకస్థలములలో గన్పట్టుచున్నది.

''దివిజ్యోతి రజరమారభేతా.''

(పతిపత్నులు ద్యులోకముందున్న జరారహితమైన ఆదిత్యాత్మకమైన జ్యోతిని పొందుదురుగాక.)

అని వేదములో చెప్పబడినది. 'నేను నాభర్తకుపత్నినై పరలోకములలోకూడ నాతని కలసికొందు'నని యొక స్త్రీ చెప్పుచున్నట్లు.

''సంపత్నీపత్యాహం సంగచ్ఛే.''

తైతిర్తీయబ్రాహ్మణములో (1-10-2) కన్పట్టుచున్నది. అన్ని వేదములలోనుగూడ నిట్టి వనేకములు గలవు.

దంపతుల యీ యైక్యమునకు కారణమైన పాతివ్రత్యము ఋగ్వేదములలో గూడ స్తుతింపబడినది.

తైత్తిరీయారణ్యకములో పతివ్రతాశబ్దము కూడ కన్పట్టుచున్నది. (తై. ఆ. 1-27) పతిద్వేషిణులైన స్త్రీలు ఋగ్వేదములో (4-55) మహాపాపాత్మురాండ్రుగ చెప్పబడినారు.

భర్త యెంత దుర్మార్గుడైనను స్త్రీకి పాతివ్రత్యధర్మము వీడదగినదికాదు.

విశీలః కామవృత్తోవా గుణౖర్వా పరివర్జితః

ఉపచర్యః స్త్రీయా సాధ్వ్యా సతతం దేవవత్పతిః. (మను. 5-154)

(భర్త యెంత శీలరహితుడైనను, కామప్రవృత్తిగల వాడైనను, ఏసద్గుణము లేనివాడైనను, భార్య యతనిని దైవముగా పూజింపవలయును.)

ఈహేతువుచే నేపురుషుడైనను భార్యపట్ల క్రూరముగా ప్రవర్తించునో వాడు తనకును, సంఘమునకును మహాపకారము చేసినవా డగుచున్నాడు.

ప్రతిపురుషుడును స్త్రీకికూడ కష్టసుఖములు కలవని గుర్తించి ''దయా సర్వభూతేషు'' అను ప్రధమాత్మగుణమును స్త్రీపట్ల ముందుగ నాచరణమందుంచుట యత్యవసరము. భార్యను క్రూరముగ చూచుచు లోకమంతను దయతో చూచినను భగవంతుడు హర్షింపడు. మీదు మిక్కిలి భార్యను ప్రేమతో చూచువానిని దేవత లాశీర్వదింతురని మన శాస్త్రములు చెప్పుచున్నవి.

దేవదత్తా ప్రియాం భార్యాం విందతే నేచ్ఛయాత్మనః

తాంసాధ్వీంబిభృయాన్నిత్యం దేవానాంప్రియ - చరన్‌ (మను. 9-95)

(దేవతలచే నీయబడిన ప్రియురాలైనభార్య నెవ్వడును తన యిచ్ఛచే వివాహమాడుటలేదు. పురుషుడు దేవతలకు ప్రియమాచరించుచున్నవాడై యట్టి సాధ్విని ఎల్లప్పుడును భరింపవలయును.)

సాధ్వియైనభార్యను పరిత్యజించినవానికి ఘోరమైన ప్రాయశ్చిత్తములు విధింపబడినవి. ఆపస్తంబధర్మసూత్రములలో నిట్లు చెప్పబడినది. దారవ్యతిక్రమీఖరాజినం బహిర్లోమపరిధాయ దార

వ్యతిక్ర మిణభిక్షామితి సప్తాగారాణిచరేత్‌

సావృత్తిష్షణ్మాసా& (1-28-18)

(భార్యను వదలినవాడు గాడిదచర్మమును వెంట్రుకలు పైకి వచ్చునట్లు కప్పుకొని ''భార్యను వదలిన నాకు బిక్షవేయుడు'' అని చెప్పుచు నాఱుమాసములు, దినమున కేడిండ్ల చొప్పున బిక్ష నెత్తుకొనవలయును.)

నే డిట్టి దుష్టపురుషు లైచ్ఛికముగ నట్టి ప్రాయశ్చిత్తములను చేసికొనకపోయినను సంఘ మట్టివారిని బహిష్కరింపవలసిన యావశ్యకత గలదు.

హిందూమతములో దాంపత్య మచ్ఛేద్యమనుటకు మఱొక యంశమును చెప్పవలసియున్నది. భర్త భార్యను వదలినను, మఱొక స్త్రీని వివాహమాడినను వారి దాంపత్యము వదలినట్లు శాస్త్రములు పరిగణింపవు. (మను. 1-46)

భార్య భర్తపట్లను, భర్త భార్యపట్లను సంతోషపడుట దాంపత్యమునకు ప్రధానముగ నుండవలసిన లక్షణము. అది లేనియిల్లు గృహముకాదు. స్వభార్యయం దానందముపొందుట యుత్తమపురుషలక్షణముగ మనశాస్త్రకర్తలచేత చెప్పబడినది. నికృష్టపురుషులకు స్వభార్య యన్న రోతము పరస్త్రీలన్న వ్యామోహము నుండును. ఏ దంపతులకైన నట్టి ప్రేమానుబంధము లేనిచో వా రది కల్గుటకై నిత్యము పరమేశ్వరుని ప్రార్థించుకొనవలయును.

సంతుష్టో భార్యయా భర్తా భర్త్రాభార్యాతధైవచ,

యస్మిన్మేవకు లేనిత్యం కల్యాణం తత్రనైధ్రువం. (మను 3-60)

(ఏగృహములో భార్యతో భర్తయు, భర్తతో భార్యయు నిత్యము సంతుష్టులైయుందురో, యాగృహమున నిత్యమాంగళ్యముండుట నిశ్చయము.)

వితంతు వివాహము

స్త్రీకి భర్త జీవితకాలములోగాని, భర్తమరణానంతరమునగాని మఱొక వివాహము చేసికొను నధికారము వేదములో కాని, స్మృతులలోగాని యంగీకరింపబడలేదు. స్పష్టముగా పునర్వివాహమును నిషేధించు వచనము లనేకములు కలవు.

వితంతువిహహము శ్రుతిస్మృతి సమ్మతనూ తద్విరుద్ధమాయను విషయమును విచారించునపు డీక్రింది యంశములు ముఖ్యముగ గమనింపదగినవి.

(1) అన్ని ధర్మశాస్త్రములును పూర్వ మితరునిచే వివాహము చేసికొనబడని స్త్రీని వివాహ మాడవలయునని పురుషున కాదేశించుచున్నవి.

''సవర్ణాపూర్వశాస్త్రవిహితాయాం''

(ఆ. ధ. సూ. 2-11-1)

''అనన్యపూర్వికాంకాంతాం'' (యాజ్ఞ. 1-53)

మున్నగు వచనములను పరికింపదగును.

(2) ఏధర్మశాస్త్రముకాని, శ్రుతికాని స్త్రీకి పునర్వివాహమును విధించుటలేదు.

(3) స్త్రీ భర్తపోయినపిమ్మట మరొకని వివాహ మాడరాదని స్పష్టముగా స్మృతులలో చెప్పబడినది.

''తం శుశ్రూషేత జీవన్తం సంస్థితంచ నలంఘయేత్‌''

(భర్త బ్రతికియుండగా నాతనిని సేవింపవలయును. అతడు చనిపోయినను నాతని నతిక్రమింపరాదు.)

అని మనుస్మృతి (3-151) చెప్పుచున్నది.

మరణానంతరమున భర్తయేలోకమున కేగిననాలోకమున కేగదలచినదై భార్య భర్త బ్రతికియుండగా గాని, పిమ్మట గాని యాతని కప్రియ మెన్నడును చేయరాదని యీ క్రింది శ్లోకములో చెప్పబడినది.

''పాణిగ్రాహస్యసాధ్వీ స్త్రీ జీవతోవామృతస్యవా,

పతితలోకమభీప్సంతీ నాచ రేత్కించి దప్రియం.'' (మను 5-156)

భర్త మరణించినపిమ్మట మరియొకని పేరైనను నెత్తకూడదని మనువు చెప్పుచున్నాడు.

''నతునామాపి గృహ్ణీయాత్పత్యౌప్రేతే పరస్యతు (5-157)

ఇంకను నిట్టివచనము లెన్నియో కలవు. ఇంత విస్పష్టముగా స్మృతులలో చెప్పబడిన యంశమును కొందరు వివాదములోనికి దింపుటయే యాశ్చర్యము.

(4) ఇంత విపులమైన సంస్కృత వాఙ్మయములో- పురాణతి ఇతిహాసములలోగాని, తుదకు కావ్యనాటకాదులలోగాని, యెచ్చటను నొక్క వితంతువివాహమైనను కన్పట్టకుండుట ముఖ్యముగ గమనింపదగిన యంశము. దీనివలన భరతఖండములో నెన్నడును స్త్రీపునర్వివాహాపద్ధతి లేదని స్పష్టము కాగలదు. వితంతు వివాహములు జరుగుచుండిన ఇంగ్లండు మున్నగు దేశములలో బయలుదేరిన సాహిత్యములలో వితంతువివాహము లేదోసందర్భములో కన్పట్టుచున్నవి.

(5) సంస్కరణవాదులు స్త్రీ పునర్వివాహమును సమర్థించుదానినిగ నుదాహరించు ''ఉదీర్ష్వనారి'' అను ఋక్కు (ఋ. వే. 10-19-8, అధ. వే. 18-3-2, తైత్తి. ఆ. 6-1) యొక్క వాస్తవికార్థము ప్రస్తుత గ్రంథకర్తచే రచింపబడిన ''వేదకాలపు స్త్రీలు'' అనుగ్రంథములో (పుట 41-50) విపులముగా ప్రదర్శింపబడినది. అట్లే ''నష్టేమృతే'' అను పరాసరస్మృతిశ్లోకము (4-30) యొక్క అర్థము ''స్మృతికాలపు స్త్రీలు'' అను గ్రంధములో (పుట 64-47) నీగ్రంథకర్తచే వివరింపబడినది.

ఆ ఋక్కును, శ్లోకమునుగూడ వితంతువివాహము నెంతమాత్రము సమర్థింపవని యా యర్థములను పరికించిన వారికి స్పష్టమగును.

వివాహవయస్సు.

స్త్రీల వివాహవయస్సునుగూర్చి యొకింత చెప్పవలసియున్నది.

స్మృతులలో స్త్రీకి రజస్వలకాకుండగనే వివాహము కావలయునని స్పష్టముగానే చెప్పబడినది. ఏస్మృతినైనను దీసికొనవచ్చును.

''ప్రదానం ప్రాగృతోః. ఆప్రయచ్ఛన్‌దోషీ.''

(గౌ. ధ. సూ. 18-21, 22)

రజస్వలకాకుండగనే కన్యాదానము చేయవలయును. అట్లు దానము చేయనివాడు దోషవంతుడు.)

''తస్మాద్వివాహయే త్కన్యాం యావదృతుమతీభ##వేత్‌.''

అందువలన కన్యకు ఋతుమతి యగులోపుననే వివాహము చేయవలయును.)

అని సంవర్తస్మృతి చెప్పుచున్నది.

రజస్వలావివాహమును నిషేధించు వాక్యము లింకను నెన్నియో స్మృతులలో గన్పట్టుచున్నవి. (ప-స్మృ. 8-6, 7, 8 యాజ్ఞ స్మృ. 1-65, వ. స్మృ. 17-69 మున్నగునవెన్నియోగలవు.) మంత్రలింగములనుబట్టి రజస్వలా వివాహమూ హ్యమనువాదము ప్రత్యక్షవిరుద్ధస్మృతివలన ప్రతిహతమగును.

గౌరవము

ఇక స్త్రీలగౌరవమునుగూర్చి యొక యంశము చెప్పవలసియున్నది.

స్త్రీకి స్వాతంత్ర్యములేదన, గౌరవములేదని యర్థముగాదు. లోకములో నందరికంటెను, తల్లియే యెక్కుడు పూజ్యురాలని శ్రుతిస్మృతులు చెప్పుచున్నవి.

''ఉపాధ్యాయాన్‌ దశాచార్య ఆచార్యాణాంశతంపితా,

సహస్రంతు పితౄన్‌ మాతాగౌరవే ణాతిరిచ్యతే.'' (మను. 2-145)

(పదిమంది ఉపాధ్యాయులకంటె నొక యాచార్యుడు హెచ్చు గౌరవార్హుడు, నూరుమంది యాచార్యులకంటె తండ్రి హెచ్చు పూజ్యుడు. తండ్రికంటె తల్లి వేయిరెట్లు హెచ్చు పూజ్యురాలు.)

పతితుడైన తండ్రిని విసర్జింపవచ్చుననియు, పతితురాలైనను తల్లిని పరిత్యజింపరాదనియు స్మృతులు చెప్పుచున్నవి.

'పతితఃపితా పరిత్యాజ్యోమాతాతు పుత్రే నపతతి.'' (వసిష్ఠ 13-15)

పుత్రునిదృష్టిలో తల్లి యెన్నటికిని పతితురాలు కాజాలదు. భార్యకూడ తల్లివలెనే పూజ్యురాలనుటకుగూడ నాధారము కలదు. తల్లి తనకు జన్మనిచ్చుచున్నట్లే, భార్య కూడ జన్మనిచ్చుచున్నదని ఐతరేయబ్రాహ్మణము చెప్పుచున్నది.

'పతిర్జాయాంసంప్రవిశతి గర్భోభూత్వేహమాతరం,

తస్యాంపునర్నవోభూత్వానవమే మాసిజాయతె.

తజ్జాయా జాయాభవతియ దస్యాంజాయతే పునః.

(ఐ. బ్రా. 7-3-13)

(భర్త భార్యలో ప్రవేశించుచున్నాడు. భార్యనేతల్లినిగ జేసికొనుచున్నాడు. తొమ్మిది మాసములు నిండుసరి కామెయందు క్రొత్తగ పుట్టుచున్నాడు. భర్త భార్యయందు జన్మించుచున్నాడు గావుననే భార్యకు జాయ యనిపేరు.)

దీనినిబట్టి భార్యకూడ తల్లివలెనే పూజ్యురాలని తెలియగలదు.

భార్యను సంతసింపజేయుటకు భర్త సర్వవిధముల ప్రయత్నము చేయవలయును. ఆమెపై నధికారమును నిర్వహించుటయే యాతని పనికాదు. తాను కోరి స్వయముగ నామెకు తనపై కొంత యధికారము నీయవలెను. వివాహ మంత్రములలో భర్త భార్యతో ''నానెత్తిక్కుము'' అని చెప్పుమాట నిక్కడ జ్ఞప్తియం దుంచుకొనవలయును.

''మూర్ధానం పత్యురారోహ''

స్త్రీలను పూజించిన యిల్లు శోభించును. దేవతలచ్చట క్రీడింతురు. మను విట్లు చెప్పుచున్నాడు.

''యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః,

యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః'' (3-56)

(స్త్రీ లేగృహములో పూజింపబడుచున్నారో, యచట దేవతలు క్రీడించుచున్నారు. స్త్రీ లేగృహమందు పూజింపబడుట లేదో యాగృహమున చేయబడు సత్కర్మలన్నియు నిష్ఫలములు.)

స్త్రీ లనగా గృహమును ప్రకాశింపజేయు దీపములనియు, వారు సాక్షాత్తుగా లక్ష్మిదేవులేయనియుకూడ మనుస్మృతి చెప్పుచున్నది (9-26)

కావున హిందూమతములో స్త్రీలకు గొప్ప గౌరవస్థానము గలదని చెప్పవలసియున్నది.

Hindumatamu    Chapters    Last Page