నామజపం
పరమాత్మ స్వరూపం సత్య-శివసుందర మైనదని అద్వైత వేదాంతం వివరిస్తూ ఉన్నది. అద్వైతులైన ఆచార్యులవారు తమ ప్రకరణగ్రంథములలో ఈశ్వరానుభూతికి భక్తి-జ్ఞాన మార్గములు సోపానముల వంటివని ఉద్ఘాటించిన చోట్లు పరశ్శతాలు. రామానుజులు. ఉపాసనా విధులన్నిటిలోనూ శరణాగతినే ప్రధానముగా గ్రహించి ప్రపత్తి యొక్క మహిమను బోధించి యున్నారు. మరి కొందరు భక్తులు సహజ వినయముతో 'నీవే నాప్రాపు' అని విన్నవించుకొనదగ్గ జ్ఞానం కూడ మనకు ఉన్నదా ఏమి? అని- 'నామజనం ఒక్కటే చాలు, అదే మనలను రక్షిస్తుంది'- అని నామజప పరాయణు లయ్యారు. పలుకుటకు నాలుక ఉన్నది. జపించుటకు 'రామ, శివ' ఇత్యాదిగా రెండక్షరముల నామములున్నవి- అని వీరు చెప్పకయే చెప్పుచున్నట్లు తోస్తుంది.
భజనమార్గమును ప్రచారములోనికి తెచ్చినవారిలో ఆదిపురుషుడు వంగదేశములోని జయదేవ మహాకవి. జయదేవులు కృష్ణభక్తులు. ఆయన కవియేకాదు. గాయకుడు కూడ. ఆయన భక్తితో తన్మయుడై రాధాకృష్ణుల విలాసములను కావ్యవస్తువుగా గ్రహించి గీతికలను అల్లి పాడుతూ ఉంటే ఆయన సతి పద్మావతి నృత్యం చేసెడిదట-నృత్యసమయంలో చిన్ని కృష్ణుడు పద్మావతీచరణ విన్యాసంలో లయ తప్పకుండ జాగ్రత్త పడేవాడు! అందులకే జయదేవులు కృష్ణ భగవానులను- 'పద్మావతీ చరణ చారణ చక్రవర్తీ'- అని గీతాగోవిందంలో సంబోధించినారు. జయదేవులు ప్రారంభించిన ఈభజనమార్గమును కృష్ణచైతన్యులు, తుకారాం, మీరాబాయి ఉత్తర హిందూస్తానంలో ఇంకా మరికొందరు భక్తులూ అవలంబించి తమ జీవితాలను ధన్యం చేసుకొన్నారు.
దక్షిణ హిందూదేశంలో పురందరదాసు, బోధేంద్ర స్వామి, సద్గురుస్వామి మొదలగువారు భజన మార్గము నవలంబించారు. పురందరదాసు-'నిన్న నామ ఒందు ఇద్దరె సాకు' నీనామం ఒకటి ఉంటే చాలు'- అన్నారు. బోధేంద్రులు కూడ నామజప ప్రాశస్త్యం ఉగ్గడిస్తూ ఎన్నో పుస్తకాలు వ్రాశారు. ఈనాటికీ భజన ప్రారంభం చేస్తూ బోధేంద్రులను, సద్గురుస్వాములను స్మరించే వాడుక ఒకటి ఉన్నది. ఇక పంచాక్షరీపరాయణులైన శైవశిఖామణులకు దక్షిణంలో కొదువలేదు.
'అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః'- అన్నది కృష్ణభగవానులు అర్జునుని మిషతో అందరకు ప్రసాదించిన అభయవాక్కు. పాపంనుండి విముక్తులమైతే ఏవిధమైన విచారము అవసరం ఉండదు. అప్పుడు దుఃఖము, కష్టము ఏదీ మనలను బాధించదు. అందుకే రామనామమును తారకమంత్రమన్నారు. పాపాలనుండి తరింపజేసేదే తారకం. నామజప ప్రియులు తమశీలమును నిర్దుష్టముగా నుంచుకొని, నామజప పరాయణులై పోవాలి. అంతేకాని నామ జపమే ఉత్కృష్టమైనది, భక్తికాని, జ్ఞానముకాని నిరర్థకములు అని తలచుట లేక తత్సంబంధమైన చర్చలలో దిగుట కూడదు. వీరు భక్తి జ్ఞానయోగములు తమకు వీలు కానందున నామజపంలో దిగినామన్న విషయం వినయంతో స్మృతిలో నుంచుకొనాలి. ఈ భక్తులు నామజపం మరింత ఉత్సాహంగా చేసుకొనుటకు సులువుగా జంత్రవాద్యాలను తోడు చేసుకొన్నారు. ప్రస్తుతపు భజనల విధానం ఇలా క్రమక్రమంగా రూపొందింది. ఏకాగ్రభక్తితో నామజపం చేస్తే జీవితంలో పారమార్థిక ప్రయోజనం నిస్సందేహంగా కలుగుతుంది.
6-5)
|