Maa Swami
Chapters
13. శంకరమండప నిర్మాణాలు, ఆగమశిల్ప సదస్సులు స్వాములవారి జీవితంలో ప్రతిక్షణమూ భగవత్పాదుల కైంకర్యంలోనే వినియోగమౌతున్నది. సమగ్రమూ ఆత్మోద్ధారకమూ అగు వారి ప్రబోధవ్యాప్తిలోనే ఆయన జీవితం గడపుతున్నారు. శంకరులస్మృతి ప్రజలలో ఉండవలెనని ఆయన శంకరస్మారక మండపనిర్మాణం తలబెట్టారు. మొదటి మండపం రామేశ్వరంలో కట్టారు. శంకరజయంతి 28 ఏప్రిలు 1963. ఆరోజు ప్రతిష్ఠచేసి శ్రీ జయేంద్రసరస్వతి కుంభాభిషేకం చేశారు. హనుమంతుడు, ద్వాదశజ్యోతిర్లింగములు, దక్షిణామూర్తి యంత్రము, ఆదిశంకరుల వారి నలుగురు శిష్యులు- వీరి సన్నిధులు ఏర్పాటుచేశారు. మంటపము వెనుక సరస్వతి మందిరములో సరస్వతిని స్థాపించారు. ఈ మంటపం భారతసంస్కృతికి చూపరుల స్మృతిపథఃలోనికి తెస్తుంది. అగ్నితీర్ధంలో స్నానం చేసిరాగానే కనపడేది ఈ మండపం- ఇందులోని మూర్తులు. ఆరోజు రాత్రి ఒక సదస్సు జరిగింది. స్వాములవారు సదస్సులో ఇలా అన్నారు; ''శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా- ఒకచోట నిలువక తిరిగిన ఆచార్యులను మేము రామేశ్వరంలో స్థిరంగా కూర్చుండబెట్టినాము. భారతదేశ ధామాలలో దక్షిణధామమైన- దక్షిణామ్నాయక్షేత్రంలో ప్రతిష్ఠ చేశాము. దేశంలో నాలుగు దిశలలోనూ ఆయన మతప్రచారం చేశారు. ఈరోజు నుండీ భారతదేశం నాలుగు మూలలనుండీ వచ్చే యాత్రికులు భగవత్పాదుల పాదుకలను స్పృశించి వారి ఉపదేశాలతో ఉత్తేజితులౌతారు. కాంచీక్షేత్రానికి 26-2-64 వచ్చారు. కంచిమఠంలో పదహారుకాళ్ళ మంటపంనిర్మించి అక్కడా నలుగురు శిష్యులతో కూడిన శంకరులను, వారి పాదుకలనూ ప్రతిష్ఠ చేశారు. మార్చి 1967 స్వాములు శ్రీశైలం విజయం చేశారు. స్వాములు, జయేంద్రసరస్వతులు- ఇరువురూ పాతాళగంగలో స్నానంచేసి మల్లిఖార్జున మహాలింగమునూ, భ్రమరాంబనూ దర్శించినారు. 9 మార్చి శివరాత్రి ఏకాదశరుద్రహోమం చేశారు. 22 మార్చి శంకరమంటపమునకు కుంభాభిషేకం చేశారు. ఋషీకేశలో గంగ హిమాలయాలనుంచి దిగివస్తుంది. లక్ష్మణఝాల అనేచోట శంకరమంటపం నిర్మింపబడినది. శంకరజయంతినాడు- 14మే 1967 ప్రతిష్ఠ జరిగినది. కురుక్షేత్రంలోనూ, శంకరుల గీతోపదేశం- వీని శిల్పవిన్యాసం జరిగినది. త్రయంబకం- ప్రయాగ, బదరీక్షేత్రాలలో ఇదే విధంగా ప్రతిష్ఠలు జరిగాయి. స్వాములవారు 1932, 1939 సంవత్సరములలో కాళహస్తికి వెళ్ళి వుండినారు. అపుడు పంచముఖలింగేశ్వరుని దర్శించేవారు. ఆ లింగమెక్కడ యుండినదీ ఆ ఊరి జనులకు తెలియదు. కొందరు వయోధికులను స్వాములవారు అడుగగా బ్రహ్మగుడియని వ్యవహరించే గుట్టపైన ఉన్న ఆలయములో ఒక శివలింగమున్నట్లూ,కానీ ఆగుడికి పోయేమార్గము కంటకావృత్తమై అరణ్యప్రాయంగా ఉన్నట్లు చెప్పారు. స్వాములవారి ఆజ్ఞపై త్రోవను శుభ్రంచేసి, ముండ్లచెట్లను కొట్టి, గుడికి జనంపోయేటట్లు పిదప వీలుచేశారు. గర్భగుడికి ఒక మండపము ద్వారా వెళ్ళవలెను. స్వాములవారు ఊహించినట్లు పంచముఖలింగేశ్వరుని ఆలయమే అది. ఈశ్వరుని పంచముఖములకు ఐదు వేళ్ళున్నవి. అవి సర్యోజాత, వామదేవ, అఘోర,తత్పురుష, ఈశాన్యములు. నాలుగు ముఖములు నాలుగు దిక్కులను చూచుచు చాల అందముగా నున్నవి. ఐదవముఖము ఊర్ధ్వముఖము. నాలుగు ముఖములనుండి నాలుగు వేదములు, ఋగ్యజుస్సామాధర్వణములు వెలువడినవి. తత్పురుషుడు తూర్పు ముఖముగాను, సద్యోజాతుడు పడమర దిశను, వామదేవుడు ఉత్తరదిశను, అఘోరశివుడు దక్షిణ దిశను, ఈశాన్యుడు ఊర్ధ్వ దిశను చూచుచుందురు. ఇటువంటి పంచముఖలింగములు, తిరువానైక్కావల్ రాజరాజేశ్వరాలయమునందును, స్వాములవారే కనిపెట్టి దినపూజ జరుగునట్లు ఏర్పాటు చేయించారు. నేపాలములో ఉన్న పశుపతేశ్వరుడున్నూ పంచముఖేశ్వరుడే. కాళహస్తిలోని పంచముఖేశ్వరుని ఆలయమునకు సమీపమున ఒక మండపము కానవచ్చినది. దాని చుట్టూ చెట్లు ముండ్లకంపలు మొలచినవి. వానిని శుభ్రముచేసిన పిదప మండపమునకు వెనుక గోడవలె ఉన్న ఒక శిలపై నర్తన గణపతి, నటరాజు, పార్వతీ పరమేశ్వరులు, భిక్షాటనామూర్తి, శిల్పములు సుందరముగ చెక్కబడినవి. వాని కాలనిర్ణయము కష్టమైన పని. ఈ మండపము పూర్వము నాట్యరంగముగా యుండియుండవలెనని స్వాములవారు అభిప్రాయ పడిరి. ఈ చోటనే ఆగమశిల్పసదస్సు ఆ ఊరివారి సహకారంతో నిర్వహింపబడినది. ఈ సదస్సు ఆంధ్రప్రభుత్వ మంత్రి పి.వి. నరసింహరావు సంస్కృతములోను, తెలుగులోను స్వాగతవచనములు పలికారు. ముందు జరిగిన శిల్పసదస్సువలెనే ఈ సదస్సులోనూ శివాచార్యులు పాంచరాత్ర, వై ఖానస అర్చకులు, శిల్పులు, పంచాంగ గణిత శాస్త్రజ్ఞులు సదస్సులో పాల్గొన్నారు. యక్షగానము, బుర్రకథ, బొమ్మలాట, కూచిపూడి, ఇతర గ్రామీణనృత్యములు, సౌరాష్ట్రదేశమునుండి వచ్చినవారి నృత్యములు- వంగదేశ నృత్యములు ఈ సదస్సులో ప్రదర్శింపబడినవి. ముఖ్యముగా జయదేవుని అష్టపదులు గానము చేశారు. కాశ్మీర గాయకుడు పాడిన జానపద గీతములను సభికులు చాల రసించారు. కంబోడియా దేశమునకు చెందిన బౌద్ధభిక్షువు మహాదేవ ధర్మపరులనే ఆయన కంబోడియానుండి కాళహస్తికి వచ్చి పాల్గొనుట చెప్పదగిన విశేషము.