Maa Swami
Chapters
మా స్వామి కామకోటి సరస్వతి జీవితచరిత్ర రచన విశాఖ పబ్లిషర్స్ భువనవిజయం పబ్లికేషన్స్ ''సౌందర్యలహరి'' కస్పావారి వీధి, గవర్నరుపేట విజయవాడ-520 002. ఆంధ్రప్రదేశ్. ప్రధమముద్రణ: ప్రజోత్పత్తి వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి మూల్యం : Rs. 150/- ప్రతులకు: జి.వి. హరనాథ్ బి.కాం కస్పావారి స్ట్రీట్ గవర్నరుపేట విజయవాడ-520 002 ఆంధ్రప్రదేశ్. టైప్ సెట్టింగ్ : యమ్. మల్లేశ్వరరావు సిద్దార్ధ లేసర్ టైప్ సెట్టింగ్ మ్యూజియంరోడ్డు, విజయవాడ-2 ప్రింటెడ్ : ఆంధ్రపత్రిక ప్రింటర్స్ గాంధీనగర్, విజయవాడ-3 ఓం నమశ్శివాయ నా మనవి ''మానుషరూపేణ చరద్ధైవమ్'' అన్నారు పరమాచార్యులవారిని శ్రీ యామిజాలవారు వొకమారు. మొన్నటి షిర్దిసాయినాధులు, నిన్నటి అరుణాచల శ్రీ రమణులు, నేటి కాంచీపుర కామకోటి శ్రీ చంద్రశేఖర యతీంద్రులు మానవరూపంలో నడయాడే దైవాలు అనటం నిర్వివాదాంశము. నిజజీవితములో ఎత్తుపల్లాలతో సతమతమయ్యే ఈ మానవకోటికి సుఖశాంతులను ప్రసాదించే దివ్యమూర్తులు, తాపత్రయాభీల దావాగ్నులనార్పి ముముక్షుసాధనకు బాటను చూపగల తపోనిష్ఠాగరిష్ఠులు. స్వామివారితో 1987 మార్చిలో ఒక విచిత్ర పరిస్థితిలో నాకు పరిచయమేర్పడి నా జీవిత గమనాన్నే మార్చివేసింది. ఆనాడు వారితో ముచ్చటించిన మూడుగంటల నా అనుభూతి అనిర్వచనీయం. వారి దర్శనప్రాప్తిని నాకు కలుగజేసిన నాదేశిక సార్వభౌములు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ జనార్దన సరస్వతీస్వామి (వీరు పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ కుప్పా లక్ష్మావధానులు) గారికి నేనొంతో ఋణపడి వుంటాను. 1990వ సంవత్సరం శ్రీజయేంద్ర సరస్వతీస్వామి విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానము సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్‌కు వచ్చినప్పుడు శ్రీ జనార్దన సరస్వతీస్వామివారు కూడా విజయవాడ విచ్చేశారు. అప్పుడు వారు నా ప్రచురణల నన్నిటినీ చూచి స్వామివారి జీవితచరిత్ర వేయాలనే నా అభిప్రాయానికి వారు ఆశీస్సులు అందించి నన్ను కాంచీపురం రమ్మనమని ఆదేశించినారు. నా ఈ అభిప్రాయాన్ని నా మిత్రులు, ప్రముఖ పారాశ్రామికవేత్తలు, రాజకీయ ధీరోధాత్తులు అయిన శ్రీ రాయపాటి సాంబశివరావుగారితో చెప్పినాను. అందుకువారు సంతోషముతో అంగీకరించి నాతోపాటు కాంచీపురం వస్తానన్నారు. తరువాత మేము ఇద్దరము కలసి పరమాచార్యులవారిని దర్శనంచేసి మా అభిప్రాయాన్ని వారికి మనవిచేసాం. అందులకు వారు అంగీకరించి పూర్వాశ్రమంలో వారి సోదరులైన కీర్తిశేషులు శ్రీ సాంబశివశాస్త్రిగారు అరవంలో రచించిన వారి జీవితచరిత్రను మాకిచ్చి దీనిని తెనుగులో అనువదించి వేయమన్నారు. దీని అనువాదకులెవరా అని ఆలోచించుతూ ఉంటే స్వామివారితో సంప్రదించి శ్రీ జనార్దన సరస్వతీస్వామివారు లోగడ జగద్గురు బోధలు అనే గ్రంథాన్ని మనకందించిన శ్రీ విశాఖగారి పేరు ప్రతిపాదించినారు. వీరి అసలు పేరు మెట్టపాలయం ఓరుగంటి బాలసుబ్రహ్మణ్యశర్మగారు. (ఎమ్.వి.బి.ఎస్.శర్మ) వారు ప్రస్తుతం బొంబాయిలో ఉన్నారని తెలుసుకొని వారివద్దకు వెళ్ళి దీనిని తెనుగుచేసి మాకిమ్మని అడిగినాము. వారు సంతోషముతో దీనిని తెనిగించి మాకిచ్చినారు. అందులకు మా కృతజ్ఞతలు. నా పురాకృత శుభాధిక్యమువలన నాకు ఈ గ్రంథాన్ని ముద్రించే అవకాశం కలిగినదని నేను సంతృప్తుడనగుచున్నాను. ఈ పుస్తక నిర్మాణంలో నాకు సహకరించిన మిత్రులు నేషనల్ లితోప్రింటర్స్ అధినేత శ్రీ సూరెడ్డి వెంకటేశ్వరరావుగారికి, బెజవాడ మోటార్‌స్టోర్స్ అధినేత శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారికి, కె.సి.పి.లిమిటెడ్ ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధరావుగారికి, స్వధర్మస్వారాజసంఘం డైరక్టర్ శ్రీ బి.వి.యస్.యస్. మణిగారికి, అసిస్టెంట్ ఇన్‌కాంటాక్స్ కమీషనర్ శ్రీ కొఠారి శ్రీ కృష్ణమూర్తిగారికి, ఆడిటర్ శ్రీ బి. రాధాకృష్ణమూర్తిగారికి, చార్టర్డ్ ఎకౌంటెంట్ శ్రీ చావలి శ్రీరామ్‌గారికి నా కృతజ్ఞతలు. టైప్‌సెట్టింగ్ చేసిన శ్రీ మోటూరు మల్లేశ్వరరావుగారికి (సిద్ధార్ధ లేసర్‌ప్రింటర్స్), బ్లాక్‌మేకర్ శ్రీ హరికుమార్ లతా ప్రొసెస్‌వారికి, ముద్రణాభారము వహించిన ఆంధ్రపత్రిక ప్రింటర్స్‌వారికి, బ్లాక్‌ప్రింట్ చేసిన విజయకృష్ణా ఆర్ట్‌ప్రింటర్స్ శ్రీ జగ్గారావుగారికి నా అభినందనలు. ముద్రారాక్షస గణాన్ని పరిహరించటంలో సహకరించిన బ్రహ్మశ్రీ ఉపద్రష్ఠ వెంకటకృష్ణయ్యగారికి, మిత్రుడు శ్రీ గంధం వెంకాస్వామిశర్మగారికి డాక్టర్ నోరిలక్ష్మీకాంతశాస్త్రి గార్లకు నా కృతజ్ఞతలు. తొంభైఏడు వసంతాలు నిండిన శ్రీ పరమాచార్యులవారికి రెండవ షష్ఠిపూర్తి జరగాలని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తూ, ఈ గ్రంథాన్ని పఠించిన వారందరూ శ్రీ స్వామివారి కరుణకు పాత్రులగుదురని నేను ఆశిస్తున్నాను. ఇట్లు పండిత విధేయుడు, గానుగపాటి వేంకట హరనాథ్.