Maa Swami
Chapters
14.స్పెయిన్ రాజమాతతో గోష్ఠి స్వాములవారు కాళహస్తిలో ఉన్నపుడు- డిసెంబరు 1966 స్పెయిన్దేశపు రాజమాత వ్రెడరికా, రాచకుమార్తె ఐరీడ్ స్వాములవారిని దర్శించారు. డాక్టర్ టి.యంపి. మహాదేవన్ సాయముతో స్వాములవారితో సంభాషించారు. వారిగోష్ఠి ఈ క్రిందివిధంగా సాగినది. ప్రశ్న: జాగృతిలో నేను కొంతవఱకు ధ్యానం చేయగలుగుతున్నాను. కానీ స్వప్నావస్థలో ఈ ధ్యాననిరతి ఉండటంలేదు. స్వప్నంలోను ఈ ధ్యానానుభూతి వుండటానికి ఏమిచేయాలి? ఉత్తరం: మనకువచ్చే స్వప్నముల విషయంగా మనం అంతగా విచారించనక్కరలేదు. జాగ్రదావస్థలోని ధ్యానానుభూతి స్వప్నంలో లేకపోవచ్చు. ఆనాధ్యాత్మిక విషయాలు మన స్వప్నంలో రావచ్చు. అట్టి స్వప్నాలు సాధనకు ప్రతిబంధకములని సాధకుడు అనుకోరాదు. అట్లు మానసికంగా బాధపడటం ఒక ప్రతిబంధకంగా తయారౌతుంది. జాగ్రదావస్థ గూర్చియే సాధకుడు జాగరూకతతో ఉండవలసినది. ఎంత ఎక్కువకాలం వీలవుతుందో అంతసేపు ఆధ్యాత్మ విషయంగా వినియోగించాలి. జాగ్రదావస్థలో అతని ప్రయత్నములు ఆధ్యాత్మిక విషయాభిముఖములైతే, స్వప్నములూ క్రమముగా ఆధ్యాత్మమునే ప్రతిబింబిస్తుంది. జాగ్రదావస్థపై స్వప్నముల పలుకబడిలేదు. కాని స్వప్నావస్థపై మన జాగృతదశయొక్క ప్రభావం ఉంటుంది. మేలుకొన్నపుడు ఒకనికి గౌరవర్ణ ఉందనుకొందాం. కలలోనూ గౌరవర్ణంగా ఉన్నట్లు తనకు అతడు కనబడుతాడు. అతనిది నల్లరంగు అయితే, స్వప్నంలోనూ తాను నల్లగా ఉన్నట్లు చూస్తాడు. సాధకుడు జాగ్రద్దశలో హెచ్చరికగా ఉండి ఆత్మాన్వేషణ తత్పరుడైతే, కలలోనూ అలాటి భావమే అతనికి ఉంటుంది. జాగ్రదావస్థలో సాధకుడు తనకోరికలపై స్వాధీనం కలిగినవాడైతే వాని కలలూ ప్రశాంతికరములుగా ఉంటవి. ప్రశ్న: ధ్యానానికీ, మనోసామ్యత అలవరచుకోడానికీ, స్వాములవారు ఏదైనా ఒక విధానాన్ని ఉపదేశిస్తారా? ఉత్తరం: సాధారణంగా మనం కుడిముక్కుతోనో, ఎడమముక్కుతోనో శ్వాసిస్తుంటాము. కుడిముక్కుతో శ్వాసిస్తుంటే, దానిని ఎడమవైపు తిప్పవలెనంటే దేహంలో కుడివైపు భారంవేయాలి. కుడిచేతిని నేలపైవుంచి ఆ చేతిపై దేహభారాన్ని వేయాలి. కుడినుంచి ఈమార్పు కలిగే సమయంలో ఒక రెండుక్షణాలు రెండు నాసికాద్వారములలో ఊపిరితీస్తాము. ఇట్లు పీల్చడమే శ్వాససామ్యము. ఇట్లు సమానంగా ఉచ్ఛ్వాసనిశ్వాసాలు జరిగేది గమనించామంటే, కొంతకాలానికి ఉచ్ఛ్వాసనిశ్వాసాలు నిదానంగా జరుగుతుంది. ఇట్లాచేస్తూ వచ్చినామంటే, ఈశ్వాసక్రియ వాడుకై సమత్వానికి, అలజడిలేమికీ దారితీస్తుంది. ప్రశ్న: మన పరిసరాలు ఆధ్యాత్మికతకు అనుకూలంగా లేనపుడు, మనచుట్టూ వున్నవారు మనజీవిత విధానానికి విరుద్ధంగా ఉన్నపుడు, ఎటుచూచినా అక్రమాలూ అన్యాయాలూ జరుగుతున్నపుడు మన కర్తవ్యం ఏమిటి? ఉత్తరం: మన జీవిత విధానానికి ప్రతికూలురుగా మనచుట్టూ ఉండవచ్చును. కానీ వారిపై మనం ద్వేషం కానీ అసహనాన్నికానీ చూపకూడదు. పైపెచ్చు వారియందు దయా, సానుభూతీ కలిగివుండాలి. ఎవరూ స్వాభావికంగా దుష్టులుగా ఉండరు. వారి పరిపస్థితులు, పెంపకం వారిని అట్లా చేస్తుంది. అందుచేత వారిని ద్వేషించి ప్రయోజనంలేదు. పైగా సాధకుడు- అద్వేష్టా సర్వభూతానాం- ఎవరినీ ద్వేషించరాదు. వారిపై జాలి వహించాలి. ''నాకు ప్రేమపాత్రులు, ఈవిధంగా వుంటే నేనేమిచేస్తాను? ప్రేమతో వారి సంస్కరణకై పాటుపడతాను. వీరి విషయంలోనూ నేను అలాగే చేయాలి. నేనే ఈ విధంగా ఉంటే నాగతేమయ్యేది? ఈ దుష్టునిలోనూ నా ఆత్మనే నేను చూడాలి. నేనాతనిని ద్వేషించరాదు-'' అనే మనోభావం అలవరచుకోవాలి. ప్రశ్న: సవికల్ప, నిర్వికల్ప సమాధులంటే ఏమి? వానిలో భేదమేమి? సహజసమాధి అనగా ఏమి? ఉత్తరం: సవికల్ప, నిర్వికల్పములు ధ్యానధారణలలో కొన్ని స్థితులు.సవికల్ప సమాధిలో మనస్సు ఏ అలజడీలేక ధ్యేయవస్తువులో పూర్తిగా నిమగ్నమగుట. నిర్వికల్పసమాధి- యోగలక్ష్యము. అందులో మనస్సు పనిచేయదు. అదృశ్యమౌతుంది. ఆత్మ ఒక్కటే ప్రతిభాసిస్తుంది. అద్వైతంలోనూ ధ్యానమున్నది. అద్వైతంలో ధ్యేయం- నిర్గుణబ్రహ్మము. విచారమార్గముద్వారా పొందే అనుభూతియే సహజసమాధి. అది ఆత్మానుభవ సహజస్థితి; నశ్వరమైన ప్రాపంచిక విషయములయెడ పరమవైరాగ్యము. ప్రశ్న: అనూచానంగా వస్తున్న ఆచార వ్యవహారాల వాడుకల విషయంలో ఒక నాయకుడు ఏం చేయాలి? అవి పెద్దగా వానికి లాభకారులు కాకపోయినా వాటిని అతడు పాటించాలా? ఉత్తరం: ఒక సమూహానికో, ఒక సమాజానికో, ఒక రాష్ట్రానికో నాయకుడైనవాడు తన మత ఆచారాల విషయంలో అశ్రద్ధ వహించరాదు. చర్చకి వెళ్ళడమో, ఆలయానికి వెళ్ళడమో, వ్యక్తిగతంగా అతనికి అవసరము లేకపోవచ్చును. వాని సాధనాభివృద్ధికి అవి అవసరంకాకపోవచ్చును. కానీ అతడు వీనిని నిరాకరిస్తే, ఇతరులూ అతనిని అనుకరించవచ్చును. కాని వారికి ఈ ఆచారములు లాభకరములుగా ఉండవచ్చును. అపుడు మనము ఒక చెడ్డ నమూనాగా తయారౌతాం. గీతలోనూ ఇదే చెప్పబడింది. జ్ఞాని కర్మనిష్ఠులైన అజ్ఞానులను వారినిష్ఠనుండి తప్పింపరాదు. పైగా తాను ఆ కర్మలను శ్రద్ధతోనూ నిష్ఠతోనూ చేసి వారిని ప్రోత్సహించాలి. అందుచేత కర్మానుష్ఠానం నాయకుని విధి. కర్మ సన్యాసంకాదు. ఆ రాజ కుటుంబం వారన్నారు. ''ఏదో ఆశ్చర్యకరమైన విధి మమ్ములను స్వామి దాపునకు తీసుకొని వచ్చింది. మేము వారితో ఉన్న రెండురోజులు మరువలేము. మాకు ఇపుడు అడగటానికి ప్రశ్నలులేవు. ఆత్మనిష్ఠ స్థిరమౌతుందన్న విశ్వాసం ధృఢంగా నెలకొనింది. సకాలంలో విధి మనకు ఏది రావలెనో దానిని తెచ్చి పెడుతుంది. ఆ విధి మాకు తెచ్చిన మహాభాగ్యం పూర్ణస్వరూపులైన స్వామివారి పరిచయం, వారి ఆశీస్సులు. దీనిని తలచినపుడెల్లా హృదయం స్పందిస్తున్నది. 'అంతరంగంలో సాధకుడు దేనిని అనుభూతి పొందుతున్నాడో బాహిరంగా ఆకాశగాములు (ఆష్ట్రోనాటులు) అనుభవిస్తున్నారు' అని ఆయన అన్నారు. మాకు అంతరంగంలోనూ బహిరంగంగానూ, ఈ ఆత్మానుభూతి వారి సమక్షంలో లభించింది. భౌతిక ఆధ్యాత్మికముల మధ్య ఆయన ఒక లంకెగా ఉన్నారు. ఏ ఊర్ధ్వలోకాలనుంచో తత్త్వం శల్యపంజరంవలె ఉన్న స్వాములవారి దేహం ప్రవేశించింది. కానీ మనంచూస్తున్న ఆయన దేహంకూడ- రసోవైసః- అని అనిపిస్తుంది. పర్వతమూ ప్రపంచమూ పారమార్ధికంలో ఒక్కటే. ఆయన దృష్టి ప్రసారం అస్మితాశృంఖలాలను విదళనం చేశాయి. ఆత్మయొక్క అవనికను అవతలకు నెట్టింది. ఆయన ఆశీస్సులచే అమృత ఝరులు మమ్ములను ఉక్కిరిబిక్కిరి చేసి హృదయదఘ్నమై, మా కనుల చివరలలో ఆనందాశ్రువులుగా మారిపోయింది. ఒక్కక్షణం మా మేనులను మరచి, దేనికి ఆచార్యులు ప్రతీకులో, ఆ సత్యంలో లీనమైపోయాము''.