Maa Swami
Chapters
1.వేదములు 'ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా- వేదో ఖిలో ధర్మమూలమ్'. వేదములు పరమేశ్వరుని నిశ్వాసరూపములని యనాదిసిద్ధ భారతీయ సంప్రదాయము. మన ప్రాచీనులగు మహర్షులే గాక తరువాత క్రమముగ వెలసిన శ్రీ శంకరభగత్పాదాది మహాపురుషులును, కాళిదాసాది మహాకవులు, తులసీదాసు, ఆళ్వారులు, నాయన్మారులు, త్యాగరాజు మున్నగు మహాభక్తులెందఱో వేదములు పరమేశ్వరుని నిఃశ్వాసరూపములని దృఢముగ నమ్మి సహేతుకముగ నిరూపించియున్నారు. పరమేశ్వరుడీ జగత్తును సృష్టించి రక్షించి లయ మొందించుచున్నాడు. ప్రళయమునందీ జగత్తు అదృశ్యమగుచుండును. సృష్టింపబడిన తరువాత నీ జగత్తెంత కాలముండునో ప్రళయకాలము గూడ నంతియే. సృష్టి లయములు రెండును నొకదాని వెనుక నొకటి నిరంతరము నియతగతిని చక్రమువోలె తిరుగుచుండును. సృజింపబడిన తరువాత నీ విశ్వమంతయు పదునాలుగు భువనములతో నొప్పుచు నొకానొక సార్వభౌముని యాజ్ఞచే బరిపాలింపబడుచున్నట్లు నియమబద్ధమై ప్రవరిల్లుచున్నది. ఆ సార్వభౌముడే పరమేశ్వరుడు. స్థావర జంగమాత్మకములగు ప్రాణులే యాయన పరిపాలనకు లోబడి ప్రవర్తిల్లుచుండెడి ప్రజలు. అందుచే నాయనకు ప్రజాపతియను పేరు. ఆ చక్రవర్తియు, ఆయనచే బాలింపబడు జీవులు నందఱు ననాది స్వరూపులు కాని, సృష్టి జరిగినపుడెల్ల ప్రాణులు మాత్రము భిన్నభిన్న శరీరములతో తిరిగి యవతరించుచుందురు. ఈ ప్రాణులను (పరిపాలిత ప్రజలను) ఉద్దరించి పోషించుటకొక చట్టమవసరము. ఆ చట్టమే వేదము. ప్రజలను సార్వభౌముడును అనాది స్వరూపులగుచో నీ చట్టముగూడ ననాదియే కావలయును.సృష్టి యుండునంతదాక పరమేశ్వరుడును, ప్రజలును, వేదమును (చట్టమును) శాశ్వతములు. ప్రళయకాలమున నీ వేదములు పరమేశ్వరుని యందు విలీనములై యుండును. వేదములు మంత్రాత్మకములు గాన నవి శబ్దరూపమున నాకాశమున నెపుడును వ్యాపించియుండును. ప్రళయానంతర మీ వేదములు ఋషులచే దర్శింపబడుచున్నవి. పిదప గురువుల నుండి శిష్యులకు సంక్రమించుచు 'శ్రుతులు' అను అన్వర్ధనామమున బరగుచు సంరక్షింపబడుచున్నవి. అట్టి గురుశిష్య పరంపరయే నాటినుండి నేటివఱకు వేద సంరక్షణమునను గావించుచున్నది. వేదసంరక్షణాపరాయణులగు నీ గురుశిష్యులు క్రమశిక్షణముతో గూడిన నియమబద్ధ జీవితమును గడుపవలసియుండను. అట్టి జీవితమును గడుపుచు వేద సంరక్షణమును జేయువారు దివ్యశక్తి సంపన్నులగుదురు. అంతియేకాదు. నిరంత మంత్రోచ్ఛారణ సేయుచు నా మంత్రాక్షరాది దేవతాస్వరూప ధ్యానముచే దామును తరించుచు లోకశాన్తి కళ్యాణములకు గూడ దోహద మొనర్చుచున్నారు. తమిళమున వేదములకు 'ఎజ్షుదాకిళవి' (Unwritten Words) అనియు, 'మరై (గుహ్యమైన), ఓదు (గానము లేక ఉచ్ఛారణ)' అనియు వ్యవహారము. ఇవి పౌరుషేయములు (పురుష ప్రణీతములు) గావు. ఇతర గ్రంథములవలె వేదములు స్వయముగ చదువుకొనదగినవికావు. అధ్యయనముద్వారా మాత్రమే గురువునుండి శిష్యునకు సంక్రమించునవి. వేదాజ్గములలో మొదటిదియగు శిక్ష వేదములను స్వయముగ చదువుకొనుట నిషేధించినది. ''గీతీ శీఘ్రీ శిరఃకంపీ తథా లిఖితపాఠకః అనర్థజ్ఞో ల్పకంఠ శ్చ షడేతే పాఠకాధమాః'' ---పా.శి. 32 పింగళము చూడామణి మున్నగు తమిళకోశములు గూడ పరమేశ్వరుడు దివ్య యోగశక్తిచే బాహ్యాభ్యన్తర ప్రపంచముల సామరస్యమును సాధింపజాలిన యాధికారిక పురుషులను నియోగించుచుండును. అటఇ మహనాయులు తమ దివ్య యోగశక్తులచే నీ దివ్యస్తోత్రములను (వేదములను) సాక్షాత్కరింపజేసికొందురు. అనగా తమ దివ్యశ్రవణశక్తిచే విశ్వమునందు వ్యాపించియున్న యనాది వేదశబ్ద తరంగములను దర్శింతురు. బ్రహ్మకు గూడ పరమేశ్వరానుగ్రహముచేత వేదములు స్వయముగ భాసించును. అట్టి యాధికారిక పురుషులే లేక మంత్రద్రష్టులే మొట్టమొదట వేదములను పదిలపరచిన దివ్యమూర్తులు. ''అనాది ధన్యా నిత్యా వా గుత్సష్టా స్వయంభువా అదౌ వేదమయీ దివ్యా యత స్పర్వాః ప్రవృత్తయః'' - మను. ''యుగాంతేం తర్హితాన్ వేదాన్‌సేతిహాసాన్ మహర్షయః, లేభిరే తపసా పూర్వ మనుజ్ఞాతాః స్వయంభువా'' - వ్యాసః ''తేనే బ్రహ్మ హృదా య అదికవయే'' - భాగవతమ్. వేదాధ్యయన మన మంత్రయోగము, వేద మంత్రాక్షరము నుచ్చరించి నపుడెల్ల తదనుగుణముగ దేహమునందలి నాడియందు (నాడీ కేంద్రమునందు) ఒక విధమగు సంచలనము కలుగును. సామాన్యముగ నాడీసంచలనుముయొక్క ప్రభావము మనస్సుపైబడి యది క్రామ క్రోధ శోకాది రూపమున ముఖభంగిమల ద్వారా యభివ్యక్త మగుచుండును. ముఖము మనోభావ దర్పణము (Face is the index of the mind) అను నానుడియొక్క తాత్పర్య మిదియే. మంత్రాక్షరములను నియమబద్ధముగ నుచ్చరించి తగువిధముగ నాడీసంచలనము కలిగించినచో నుత్తమభావములే యుదయించునట్లు చేసికొనవచ్చును. ప్రాణాయామముచే నాడీనియమనము గావించుట హఠయోగము. సామాన్యముగ నేశబ్దము నుచ్చరించినను నా యుచ్చారణము జిహ్వ, పెదవులు, దౌడలు, వక్షఃస్థలము- వీనియందంతట వ్యాపించి యుండెడి నిఃశ్వాసరూపమగు ప్రాణవాయువుచే ననుగతమగుచుండును. మంత్రోచ్చారణ సమయమున ప్రాణవాయువును దేహమందలి యేదియేని నాడీకేంద్రమున నిలిపి యున్నపుడే యొక విధమగు ప్రేరణ కలిగి యందుండి శబ్దతరంగములు వెలువడుచుండును. దేహమునుండి వెడలెడి యట్టి శబ్దతరంగముల ప్రభావము ప్రపంచమున గలుగు సుఖ దుఃఖాదులకు గారణ మగుచుండును. ఇహలోకము నందేకాక పరలోకమునందుగూడ శాన్తిసౌభాగ్యముల గలిగింప జాలెడి శబ్దతరంముల నుదయింపజేయు శక్తి వేదమంత్రాక్షరములకు గలదు. అట్టి వేదముల సంరక్షించుకొనుచు లోకశాన్తికై వేదమంత్ర పురశ్చరణము గావించుచుండుట బ్రాహ్మణుని విధ్యుక్తధర్మము. ''బ్రాహ్మణననిష్కారణః షడజ్గో వేదో ధ్యేతవ్యో జ్ఞేయ శ్చ''. తమిళ##దేశస్థుడు మహాభక్తుడు నగు తిరుమూలార్ మహాశయుడు ''ఆకారాది క్షకారాస్త రూపములగు నేబది వర్ణములతో (మాతృకలతో) విలసిల్లెడి వేదము లనంతములు, అగాథములు'' నని కీర్తించెను. యజుర్వేదము నందలి కాఠకము 3వ ప్రశ్నయందు వేదముల యనంతత్వము నిరూపించెడి భరద్వాజుని గూర్చిన గాథ యొకటి గలదు. భరద్వాజమహర్షి బ్రహ్మచారియై వేదాధ్యయనము చేయుచు జీవితమునంతయు గడిపెను. జీవితాంతమున (నూఱు వత్సరముల తరువాత) మఱియొక పూర్ణాయుర్దాయము (నూఱు సం.)ను ఇంద్రుని యనుగ్రహముచే బొందెను. తరువాత వేదాధ్యయనమునకై మఱియొక పూర్ణాయర్దాయమును గూడ నిమ్మని గోర నింద్రుడనుగ్రహించెను. అప్పటి కాతని భౌతికశరీరీము మిక్కిలి జీర్ణమయ్యెను. అయిన నికను వేదాధ్యయనము జేయగోరి యింకొక పూర్ణాయుర్దాయ మిమ్మని యింద్రుని కోరెను. ఇచ్చినచో నీవేమి సేతువని యింద్రు డడిగెను. వేదాధ్యయనమును బూర్తి జేతునని భరద్వాజుడనెను. ఇంద్రుడు వెంటనే భరద్వాజుని యెదుట మూడుపర్వతముల జూపించి యా మూడింటినుండి మూడు గుప్పిళ్ళ దుమ్ము తీసి యాతనికి జూపి ''మూడువందల యేండ్ల జీవితకాలములో నీవు గ్రహించిన వేదభాగమింతియే. ఇంకను గ్రహింపవలసిన దింత గల'' దని యా పర్వతముల జూపెను. వ్యాసభగవానుడు అయిదువేల వత్సరములకు బూర్వమొక రాశిగానున్న వేదమును ఋక్, యజుస్, సామ, అథద్వరూపమున నాల్గుభాగములుగ విభజించెను. అపుడు మొత్తము 1131 వేదశాఖలు గలవు. అందు ఋగ్వేదమునకు 21, యజుర్వేదమునకు 101, సామవేదమునకు 1000, అథర్వ వేదమునకు 9 - శాఖలు గలవు. అట్టి యీ శాఖలు ఋషి పరంపరగా నధ్యయనము జేయబడుచు వచ్చినవి. కాని కాలక్రమమున వేదాధ్యయనముకంటె నన్యవిద్యల నభ్యసించిననే ఐహిక జీవితము సుఖముగ గడచిపోవునను భావములు ప్రబలి, గురుశిష్య పరంపరారూపమున క్రమప్రాప్తమైన వేదాధ్యయనము నం దనాదర మేర్పడుటచే వేదశాఖలన్నియు నిపు డుపలభ్యము లగుటతేదు. ప్రస్తుతము ఋగ్వేదమునకు శాకల- లేక ఐతరేయ లేక పౌరి&ుయమ్ (Pouzhiom) అని వేఱ్వఱు నామములతో బిలువబడెడి శాఖయొకటియే గలదని తెలియుచున్నది. అట్లే యజుర్వేదమునకు తైత్తిరీయ, మైత్రాయణీయ, కాణ్వ, మాధ్యందిన శాఖలు నాలుగు లభ్యములగుచున్నవి. సామవేదమునకు ఛందోగ లేక కౌథుమ శాఖయు, తలపకార లేక జైమినిశాఖయు, రాణాయనీయ శాఖయు మాత్రమే లభ్యములగుచున్నవి. అథర్వవేదమునకు శైనక, పిప్పలాద శాఖలు రెండుమాత్రమే గన్పట్టుచున్నవి. అథర్వవేదాధ్యయనము జేసినవారు నేడు వ్రేళ్ళమీద మాత్రమే లెక్కింపదగి యున్నారు. అథర్వ వేదీయ శైనకశాఖాధ్యయనము జేసినవారొకరు మాత్రమే నేడున్నట్లు తెలియుచున్నది. పిప్పలాద శాఖ నేటికిని తాళపత్రములందే నిలిచియున్నది. తమిళ##దేశమునకు జెందిన మహాభక్తులగు ఆళ్వారులయొక్కయు, నాయన్మారులయొక్కయు భక్తిరసపూర్ణగేయములలో తలవకార సామశాఖను గూర్చిన ప్రశంసలు గలవు. ఆ మహాభక్తులలో నొకరగు సోమా,సి మారమాయన్మారు తలవకార సామశాఖకు జెందినవాడు. ఆయన చోళరాజుల కలమున నివసించినట్లు తెలియుచున్నది. మన పవిత్ర భారతభూమియందలి ప్రజలయొక్క జీవితమునందు వేదములయొక్క ప్రభావ మెంతేని గలదను విషయము భారతీయ వివిధ భాషాగత వర్ణపదోచ్చారణను పరిశీలించిన దెలియగలదు. ఆయా ప్రాంతీయభాషలు ఆయా వేదశాఖలయొక్క ప్రాతిశాఖ్యలయందలి నిబంధనల ననుసరించి యుచ్చరింపబడుచున్నట్లు తెలియగలదు. ఋగ్వేదమున నుచ్చరింపబడు 'క' యను నక్షరము యజుర్వేదమునందును, కైథుమ సామశాఖయందును 'ద' యనియు, జైమినీయసామశాఖయందు 'జ్ష' (Zh) యనియు నుచ్చరింపబడును. 'జ్ష' యను నక్షరము తమిళభాషయందే గాననగును. ఆ యక్షరము వేదశాఖలలో నొకటియగు జౌమినీయ సామశాఖయందు గన్పట్టుచుండును. సంస్కృతవ్యాకరణము జిహ్వమూలీయము ( క) ఉపధ్మానీయము ( ప) అను రెండక్షరముల స్వరూపమును నిర్దేశించినది. జిహ్వయొక్క మూలమున నిద్భవించుటచే దానికి జిహ్వమూలీయమని పేరు. తమిళభాషలో దీనిని ఐథమ్ (Aitham) అని వ్యవహరింతురు. వేదాంగములగు శిక్ష, వ్యాకరణ, శాస్త్ర సంప్రదాయముల ననుసరించి విసర్గపూర్వక కకారరూపమున ( క) నీ జిహ్వమూలీయము వ్యవహరింపబడుచున్నది. ఐరోపా అరబ్బీభాషల యందు గన్పట్టు 'F' (యఫ్) అను నక్షరము వ్యాకరణశాస్త్రమున ఉపధ్మానీయమను నామముతో విసర్లపూర్వక వకారరూపమున ( ప) తెలియ నగుచున్నది. తొల్ కాప్పియమ్ అని పిలువబడు తమిళభాషా వ్యాకరణమునకు గూడ మూలము ఐంద్రవ్యాకరణము. శిక్షావ్యాకరణములన్ని వేదశాఖలకును సమానములు. ఇవికాక యొక్కొక్క వేదశాఖకు సబంధించి ప్రత్యేకముగ వ్యాకరణములు గలవు. వానికి ప్రాతిశాఖ్యములని పేరు. ఉత్తరభారతము నందలి రాష్ట్రములలో ప్రచారములో నున్న వ- జ- క్ష- యను అక్షరములు దాక్షిణత్య రాష్ట్రములలో గ్రమముగ బ- య- క- యని యుచ్చరింప బడుచుండును. ఉత్తరభారతమున తైత్తిరీయ కాణ్వశాఖలు ప్రచారములో లేక మాధ్యందినశాఖ విస్తరించుటయే యీ వర్ణోచ్చారణభేదమునకు గారణముగా మూహింపవచ్చును. ఏలయన మాధ్యందిన తైత్తిరీయశాఖలకు సంబంధించిన ప్రాతిశాఖ్యలందీ వర్ణోచ్చారణ భేదమును గూర్చిన నిబంధనలు గలవు. క్రైస్తవ మతవ్యాప్తి గాంచిన దేశములందును 'య' కారమునకు బదులు 'జ' కారము వ్యవహారములో గన్పట్టుచున్నవి. Jews - యూదర్ (తమిళము)-యూదులు (తెలుగు). Joseph జోసెఫ్-యూసఫ్. ఇట్టి వర్ణోచ్చారణ భేదము ననుసరించి యా దేశములలో మాధ్యందినశాఖ వ్యాప్తమై యుండియుండునని యూహింపనగును. ఆంధ్రప్రదేశమున నూటికి తొంబదిమంది యజుర్వేదశాఖకు జెందినవారు. సంభాషణలయందును ఆయా ప్రదేశముల నామముల యందును 'డ' కారము నెక్కువగ నుపయోగించుట యాంధ్రదేశమున తైత్తిరీయ శాఖయొక్క విశాలవ్యాప్తిని సూచించును. తైత్తిరీయ శాఖయందలి 'డ' కారము సామశాఖయందలి జ్ష (Zh) కారమునకు ఋగ్వేదమునందలి 'ళ' కారమునకు సమానము. మహారాష్ట్రులలో నూటికి ఎనుబదిబంది ఋగ్వేదీయశాఖలకు జెందినవారు. తమిళ##దేశమున జ్ష (Zh) కారమును, ఆంధ్రదేశమున డకారము నుపయోగించు పట్టులయందు మహారాష్ట్రులు తమ దైనిందిన సంభాషణాది వ్యవహారములందు గూడ 'ళ' కారము నుపయోగింతురు. ఋగ్వేదీయ ప్రాతిశాఖ్యయం దట్టి తాపులందు 'ళ' కార ముపయోగింపడవలె ననెడి నిబంధన లుండుటయే యీ వ్యవహారమునకు గారణము గావచ్చును. అందుచేతనే యజుర్వేదము నందలి 'డ' కారము ఋగ్వేదమున 'ళ' కారముగ నుచ్చరింపబడుచున్నది. యజుర్వేదశాఖలయందు గన్పట్టు 'డ' కారము ఋగ్వేదమున నరుదు. ఛందోగ సామశాఖ యందలి 'డ' కారము జైమినీయసామశాఖయందు జ్ష (Zh) కారముగ నుచ్చరింపబడుచుండును. వేదశాఖల యందలి యిట్టి వర్ణోచ్చారణ భేదమే వ్యావహారిక భాషయందును తలజూపినదని చెప్పవచ్చును. మృగశీర్షా నక్షత్రయుక్త పూర్ణిమకు 'మార్గశీర్ష' యని వ్యవహరింపబడును. మార్గశీర్ష మాసమును తమిళ##దేశమున మహాభక్తురాలగు ఆండాళ్ళు 'మార్గజ్షి తింగళ్ (Margazahi Thingal) అని పేర్కొనినది. నియమబద్ధముగ జేయబడు వేదమంత్రాక్షరోచ్చారణము లోకకళ్యాణప్రదము గాన మంత్రములు పుష్టిహేతువు లగుచు పోష్టికములు' ని చెప్పబడుచున్నవి. సంస్కృతమునందలి 'పోష్టిక' మనుపదము తమిళమున 'పౌడికమ్' అనియు, మళయాళమున 'పౌజ్షియమ్' (PowZhizm) అనియు నుచ్చరింపబడును. తెలుగులోని 'డ' కారము తమిళమునందు 'జ్ష' కారముగను కన్నడమున 'ళ' కారముగ నుచ్చరింపబడు ననుటకు గొన్ని యుదాహరణములు. తెలుగు »R½„sVÎÏÁª«sVV NRPƒ«sõ²R…ª«sVV
పొగడుట Puhazhlthal #9; పుహజ్షుదల్ Hokaluvathau హోగళువడు
పగడాలు Pavazhlam పవజ్షమ్ Havalu
పాడు Pazh Halu హాలు
కూడు Koozh కూజ్షు Koolu కూలు
ఆయా భాషలలో నిట్టి వర్ణోచ్చారణ భేదమునకు నాయా ప్రాంతములందు ప్రచారములోనున్న ప్రాతిశాఖ్యములే కారణము. ప్రతి వేదశాఖ యందును కర్మకాండ యనియు జ్ఞానకాండ యనియు రెండు భాగములు గలవు. సదాచారనుష్ఠానములతో యజ్ఞయాగాదులను గూర్చి కర్మకాండ వివరించుచున్నది. కర్మఫలమును సర్వమును పరమేశ్వరార్పణ జేయుచు లోకశాన్తి కొఱకై పరమేశ్వరుని ప్రార్థించుట వలన చిత్తశుద్ధి కలుగును. ఇట్లు నిష్కామ కర్మానుష్ఠానము చేతను, భగవద్ధ్యానము చేతను గలిగిన చిత్తశుద్ధి పరమేశ్వర స్వరూపానుసంధానమునకు గారణము కాగలదని జ్ఞానకాండ యుపదేశించుచున్నది.
ఈ ప్రపంచము సృష్టింపబడిన తరువాత నొకానొక సమయమున నీ ప్రపంచమంతయు వైదిక మత వ్యాప్తమై యున్నట్లు శ్రీ మద్భాగవతాది గ్రంథములవలన దెలియుచున్నది. ప్రాచీనకాలమున ఉత్తరధ్రువమునుండి దక్షిణధ్రువము వరకు నీ భూగోళము సప్తద్వీపములతోను, ఆ ద్వీపముల మధ్య సప్తసముద్రములతోను వ్యాప్తమై యవి ఉత్తరనుండి దక్షిణము వరకునూ భూగోళమును ఉంగరము వలె చుట్టుకొని యున్నట్లు దెలియుచున్నది. అందు ప్రతి ద్వీపమునందును, వైదికకర్మానుష్ఠానము, వేదమార్గానుగతమైన యర్చనాదికము గలవు.
భూమి రోజున కొకసారి తన చుట్టును, సంవత్సరమున కొకసారి సూర్యనిచుట్టును తిరిగి వచ్చునపుడేర్పడు కక్ష్యలు లేక క్రాంతవృత్తములు (Orbits) రెండును ఒకే సమతలమున (Ecliptic plane) నుండును. భూమ్యక్ష మీ సమతలమునకు 66 1/2 డిగ్రీలకోణమున వర్తిల్లుచు నిరంతరము ధర్వతారవైపు జూచుచుండును. జ్యోతిశ్శాస్త్రము ననుసరించి యిట్లు భూమి సూర్యునిచుట్టి పరిభ్రమించునపుడు సంవత్సరమునకు రెండుసార్లు అనగా మేషమాసమునందును తులామాసమునందును విషువములు (Vernal and Atumnal Equinoxes) యేర్పడును. మేషమాసమున మొదటి దినము మేషవిషువము, తులామాసమున మొదటిదినము తులావిషువము. విషువ దినములయందు రాత్రింబవళ్ళు సమానదైర్ఘ్యము గలిగియుండను. అమర కోశమునందును వ్యాకరణమునందును 'విషు' పదమున కిట్లే యర్ధము వివరింపబడి యున్నది.
''సమరాత్రిందివే కాలే విషువ ద్విషువం చ తత్''
కాలక్రమమున నీ భభ్రమణ (Orbit) కక్ష్యయందు విషువము లేర్పడు స్థానములు (Equinoctial points) వెనుకకు జరుగుచుండును. అందుచే బైన దెలిపిన మేష, తులా, విషువత్పుణ్యకాలములందలి రాత్రింబవళ్ళయొక్క కాలపరిమితి గూడ సమానముగ నుండక మాఱ జొచ్చినది.ప్రస్తుత మూష తులాసంక్రాంతి పుణ్యకాలమలకు 22 దినములకు బూర్వమే సమ రాత్రిం దివకాలము వచ్చుచున్నది. ఖగోళ భూగోళ శాస్త్రములు భూభ్రమణ కక్ష్య [Orbits] లందు సంభవించెడి యిట్టి మార్పు (Precession) వలననే ద్వీపములయొక్కయు, సముద్రములయొక్కయు ఉనికియందు గూడ పెక్కు మార్పులు సంభవించుచుండునని చెప్పుచున్నవి. యుగభేదము ననుసరించి ద్వీపముల యొక్కయు సముద్రములయొక్కయు స్థితిగతులు మాఱినవని చెప్పవచ్చును. కృతయుగమునందును, త్రేతాయుగమునందును ఉచ్చస్థితిలో నున్న వైదికకర్మానుష్ఠానము క్రమముగ ద్వాపరయుగములో గొలదిగ మార్పుచెంది కలియుగములో గొన్ని యెడల మాత్రమే బీజప్రాయముగ నిలిచియున్నది.
క్రీ.పూ. 3500 సం. నాటి ఈజిప్టు శాసనములలో రామ్‌సెస్ II (Ramesses) అను తెగకు జెందిన ప్రభువు హిట్టైబ్సు అను తెగయొక్క ప్రభువుతో సంధి జేసికొని యందుకు సాక్షులుగు నా సంధిపత్రమున మిత్రావరుణ దేవతల నుదహరించినట్లు H.R Hall వ్రాసిన Ancient History of the Near East అను గ్రంథమున (364 పుటలో) గలదు. క్రీ.పూ. 5000 సం. నాటి మఱియొక ఈజిప్టు శాసనమునగూడ నట్లే వైదిక 'మిత్ర' దేవత సాక్షిగా గ్రహింపబడినట్లు గలదు. ఇంతేకాక హిట్టైట్సు ప్రభువు ఉత్తర మొసపిటోమియోలోని మిటానీ దేశప్రభువుతో సంధి జేసికొని వ్రాసికొనిన సంధిపత్రములందు మిత్ర-వరుణ-ఇంద్ర-నాసత్య దేవతలు సాక్షులుగ గ్రహింపబడినట్లును (Vedic Chronology and Vedanga Jyotisha. B.G.Tilak పుట 129) గలదు. వేదములయందు మిత్ర దేవతను వర్షియా యందలి ఇరేనియనులు గూడ నదే నామముతో కొలుతురు. లిడియా, రోమొ దేశీయులకు గూడ మిత్రదేవత సుపరిచితము.ఈజిప్టు శాసనములందు గన్పట్టు ఒక తెగకు నామమైన Ramesses అను పదమునకు విఘంటువునం దిట్లు అర్ధము గలదు. 'Ramesses (3 Syl) The title of an ancient Egyptian Dynaty; it means offspring of the Sun. Dictionary of Phrase and Fable By E.Coob. ham Brewer, L.L.D. కాన పైతెగవారు సూర్యవంశపు రాజులైయుందురు.
అవినాశ్ చంద్రదాస్ అను సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు Rigvedic India అను గ్రంథమున 94వ పుటలో నిట్లు చెప్పినాడు. ''వేదకాలపు ఆర్యులు గొలిచెడి మిత్రదేవతయు, ఇరేనియనులు ఆరాధించెడి మిత్రదేవతయు, లిడియనులు పూడించెడి మిడ్యూస్ (Medeus) దేవతయు సమానమే. రోమన్ సామ్రాజ్యమున నాల్గవ శతాబ్దపర్యన్తము మిత్రదేవతారాధన కొనసాగినది. జొరాష్ట్రియానిజమ్ ప్రభావము వలననే పశ్చిమ ఐరోపా ఖండమున మిత్ర (సూర్య) దేవాతారాధనము వర్ధిల్లెను. ఇది క్రీస్తుకు బూర్వము మొదటి శతాబ్దముననే రోమ్ నగరమున ప్రారంభ##మై క్రీ.శ. మొదటి శతాబ్ది పూర్తియగుసరికి సైనికులు, బానిసలు, వర్తకులు మున్నగు వారిద్వారా రోమ్ సామ్రాజ్యము నందంతటను విరివిగ విస్తరించెను. క్రీ.శ. మూడవ శతాబ్ది నాటికి అంతర్జాతీయ మతముగ విలసిల్లెను. 4వ శతాబ్ద ప్రారంభమున రోమన్ చక్రవర్తులు చాలమంది మిత్ర దేవతారాధకులే కాని క్రీ.శ. 326లో రోమన్ సామ్రాజ్యమును జయించి స్వాధీన మొనర్చుకొనిన కాన్‌స్టాటిన్ అను ప్రభువు క్రైస్తవ మతమును అధికారమతముగ జేయుటవలన మిత్రదేవతారాధనము క్రీ.శ. 4వ శతాబ్దాంతమున సన్నగిల్లి క్రమముగ రోమునగరమునం దదృశ్య మయ్యెను''.
స్పెన్‌సర్, గిల్లియన్, మాక్మిలన్ అనువారు 1899లో ప్రకటించిన ''The Nature of Tribes of Centrsl Asia'' అను గ్రంథమున 621 పుటలో CIF-128, 129 చిత్రములలో చూపబడిన ఆస్ట్రేలియా యందలి జానపద శివతాండవ దృశ్యభంగిమలలో శివునకు తృతీయనేత్రము గలదు. నేటికిని భారతదేశమునకు రెండువేల మైళ్ళ దూరమున బాలీ ద్వీపములో మనదేశము నందు వలెనే యచటనున్న శివాలయమునందు వేదమంత్రములతోనే పూజాదికము నిర్వర్తింపబడుచున్నది. అన్య మతస్థులు గూడ తమ తమ మతములకు గొప్పతనము సమకూరుటకై తమ గ్రంథములను ''వేదములు'' - అని పేర్కొనుట వేదముల యొక్కయు, వైదిక సంప్రదాయము యొక్కయు, ప్రాచీనతకు, పవిత్రతకు దార్కాణము. వేదవేద్యుడైన పరమేశ్వరుడు శ్రీరాముడుగ నవతరించినపుడు వేదము రామాయణరూపమున నవతరించెనని చెప్పబడుచున్నది.
''వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షా ద్రామాయణాత్మనా'' #9;
మహాభారతము పంచమవేదముగా గీర్తింపబడినది. విష్ణుభక్తుడగు నమ్మాళ్వారు వేదములను ''ద్రావిడ ప్రబంధ'' రూపమున ననువదించినట్లు చెప్పుదురు. ''తిరువళ్ళువ మాల'' యను గ్రంధమున బ్రహ్మయే వళ్ళువార్ రూపమున నవతరించి వేదతాత్పర్యమును ''తిరుక్కురళ్'' అను గ్రంథమున సంగ్రహించి చెప్పెనని వర్ణింపబడినది.మహమ్మదీయులును క్రైస్తవులును తమ మత గ్రంథములను (ఖురాను-బైబిలు) వేదములు అనుపేరుతో కీర్తించుకొనుచుందురు. బైబిలులోని ''జ్ఞానవృక్షము'' (Tree of Knowledge), నిషిద్ధ ఫలము (Forbidden Fruit), ''స్త్రీ సృష్టి'' - వీనిని గూర్చిన ప్రస్తావన ఐతరేయ బృహదారణ్యకోపనిషత్తుల యందలి శాస్త్రీయ దృక్పథమును బోలియున్నవి.
పాశ్చాత్య విద్వాంసులు కొందఱు దేహవర్ణమునుబట్టి జాతవిభాగమును జేయవచ్చు నను సిద్ధాన్తమును నమ్మినవారై యా సిద్ధాన్తమును బురస్కరించుకొని ప్రపంచములోని ప్రజలను కాకేషియనులు లేక ఆర్యులు, సెమిటిక్కులు, మంగోలియనులు, నీగ్రోలు రెడ్ ఇండియనులు అని విభజించిరి. మఱియు ''అందు వేదములు ఆర్యులకు సంబంధించినవి. వారు ఒక ప్రాంతమునుండి మరియొక ప్రాంతమునకు వలస పోవుచు తమ వేదములను గూడ వెంటగొనిపోయి వివిధ ప్రాంతములందు వానిని వ్యాపింపజేసిరి'' అనియు చెప్పుచున్నారు. స్వామి వివేకానందులు వారి వాదమునిట్లు ఖండించిరి. ''ఆర్యులనువారు ఎచటినుండియో విదేశముల నుండి యకస్మాత్తుగ నిటకువచ్చి మీదపడి యిచటి యాదిమవాసులను తరిమివేసి, నిర్మూలించి వారిభూముల నాక్రమించుకొని భారతదేశమున స్థిరపడిరి- యని చెప్పెడి మీ ఐరోపా విద్వాంసుల వాదము నిరాధారము; కేవల మసత్యము; అవివేకి ప్రలాపము. మన భారతీయ విద్వాంసులుగూడ వారి వాదములకే జోహారు లర్పించుచు నిట్టి యభూతకల్పనలతో నిండిన ఈ పచ్చి యబద్ధములనే మన బాలురకు గూడ బోధించుట విచిత్రము''.
ప్రపంచమంతయు వైదికసంస్కృతి లేక వైదిక నాగరికతచే వ్యాప్తమైనట్లు భారతీయుల విశ్వాసము. మఱియు చైనీయులు, ద్రావిడులు, తార్తారులు, పారశీకులు- అందఱును క్షత్రియులే యని ధర్మశాస్త్రము చెప్పుచున్నది.
''శనకై స్తు క్రియాలోపా దిమాః క్షత్రియజాతయః
వృషలత్వం గతా లోకే బ్రాహ్మణాదర్శనేన చ
పౌండ్రకా శ్చౌఢ్ర ద్రవిడాః కాంభోజా యవనా శ్శకాః
పారదా వల్హవా శ్చీనాః కిరాతా దరదాః ఖశౌః
- మను . 10-43. 44.
చరిత్రకారులగు పాశ్చాత్యా భారతీయ విద్వాంసులు వేఱు వేఱు సిద్ధాంతముల నాదారముగ గొని వేదములకు కాలము నిర్ణయింప బూనుకొనిరి. ఎవరి సిద్ధాన్తము వారిది. ఒకరి నిర్ణయముతో మఱియొకరి నిర్ణయము పొసగుట లేదు. కాని ''వేదములు అతి ప్రాచీనములు; వాని కాలమును ఇదమిద్ధమని నిర్ణయించుట శక్యముకాదు''- అని మాత్ర మందఱు నంగీకరించిన విషయము.హరప్పా, మహెంజోదారో నగరముల యందలి నాగరికత వైదిక సంస్కృతికి జెందినది గాదని కొందఱి అభిప్రాయము. కాని యది సరిగాదు. హరప్పా యందలి యొక శిల్పములో ఛేదింపబడిన అశ్వత్థ వృక్షశాఖ యొకటి, మేకను పట్టుకొనియున్న పురుషుడు, శాఖ ప్రక్కన నొక స్త్రీ, వరుసగ నిలబడిన కొందఱు పురుషులు గలరు. ''వేదకాలమును మొదట స్థూలముగ నిర్ణయించుకొని, దానికి ముందుగనే ఈ హరప్పాశిల్ప ముండియుండవలెనని తలచుటచే చరిత్రకారులకీ శిల్పమును గూర్చిన సమన్యయమూ కుదరలేదు. ఈ శిల్పచిహ్నమును యాగసంబంధిగా దెలిసికొనక గ్రామదేవతకు బలియిచ్చునట్లు భావించి యున్నందున
అశ్వత్థవృక్షశాఖ గూర్చిన వివరము గూడ వారికి లభించుట లేదు''- అని Director general of Archaeology యొక్క యభిప్రాయము.
''యజ్ఞము కొఱకు మాత్రమే యశ్వత్థవృక్షమును ఛేదింపనగును; ఇతర సమయములందు ఛేదించుట పాపము''- అని యనాదిసిద్ధ భారతీయ సంప్రదాయము. ఈ శిల్పము యాగయజమానుడు, తని ధర్మపత్ని, ఋత్విగ్గణము, యాగపశువు, అశ్వత్థశాఖలతో గూడిన నొక యాగశాలయని తెలియనగును. ఇట్లు శిల్పముల నన్నిటిని సూక్ష్మముగ బరిశీలించిన వేదములు- వైదికసంస్కృతి యొక్క యతి ప్రాచీనతయు, వైదిక సంస్కృతియొక్క వ్యాప్తియు స్పష్టముగ గాంచబడును.
జైనులుగూడ తమ గ్రంథములలో గొన్నిటియందు వేదములు నిత్యములని చెప్పిరి. (చూ. త్రిషష్టి స్థలక పురుష చరిత్ర I-IV-244, 948, 256 బాలగంగాదరతిలక్, డాక్టరు జుకోబీ మహాశయలిరువురు ఖగోళ- భూగర్భశాస్త్ర పరిశోధన ఫలితముల నాధారముగ గైకొని వేదముల కాలము క్రీ.పూ. 6000 సం. అని నిర్ణయింప బూనిరి. (చూ. The Orion and Arctic Home in the Vedas) అవినాశచంద్రదాస్ ధీరేంద్రనాథ్ మహాశయు లిరువురు భూగర్భ నైసర్గిక పరిణామ స్థితిగతుల ననునసరించి కాలనిర్ణయమునకు గడంగిరి. మాక్సుముల్లరు వింటర్‌నిడ్జ్ (Winternitz) మొదలగు పాశ్చాత్య విద్వాంసులు ఐరోపా యందపాలిభాషలు కాలగతి ననుసరించి పొందియున్న వివిధ వర్ణలోప వ్యత్యయాది పరిణామముల బరిశీలించి భాషాశాస్త్ర సిద్ధాన్తముల గొన్నిటిని రూపొందించి, తదుదనుగుణముగ వేదకాలమును స్థూలముగ నిర్ణయింప బాటపడిరి. వేదకర్తలగు ఋషులు ఒకచో స్థిరనివాసము లేక యొక ప్రాంతమునుండి మఱియొక ప్రాంతమునకు వలసపోవుచు వేదముల వ్రాసి యుందురని యా విద్వాంసు లభిప్రాయపడిరి. వారి వాదము ననుసరించి యార్యులకు స్థిరనివాసమే లేనిచో నా కాలమున స్థిరనివాస యోగ్యములగు గ్రామనగరాదులుగాని, సుస్థిరమగు ఆర్ధిక సాంఘిక వ్యవస్థగాని యున్నవని చెప్పుటకు వలనుపడదు. కాని యా విద్వాంసులు సింధునదీలోయ ప్రాంతమును, హరప్పా మహెంజోదారోలలోని శిల్పములను. పురాతన శిల్పవస్తు శాస్త్ర సిద్ధాంతములరీత్యా పరిశిలించి వేదరచనా కాలమునకు 5000 సం. పూర్వమే మహానగరము లుండియున్నట్లును, దానికి తార్కాణము హరప్పా మహెంజోదారో నగరము లనియు జెప్పుచున్నారు. హరప్పా యందలి శిల్పములు వైదిక సంస్కృతి ప్రతిరూపములుగా గాంచనగునని పూర్వము జెప్పితిమి. కాన వేదకర్తలగు ఋషులు నిలువ నీడ లేక తెగలు తెగలుగా వలసపోవుచు జీవించుచుండెడివారని చెప్పెడి వారి వాదము నిరాధారము. అట్లుగాక యొకవేళ వేదరచనాకాలమునకు బర్వమే యా మహానగరము లుండియుండు ననెడి వారి వాదము నంగీకరించినను అట్లు మహానగరములా కాలముననే విలసిల్లి యుండ వేదకర్తలైన ఋషులు అట్టి నగరములను వీడి నిలువనీడలేక వలస పోవుటలో గారణము గన్పట్టదు. కాన ఆర్యులు వేదకర్తలు. వారు తెగలు తెగలుగ (Nomads) వలస బోవుచు వేదముల రచించి యుందురని చెప్పెడివారి వాదములు నిరాధారములు.
ఇక భాషాశాస్త్ర (Phylology) సిద్ధాంతముల దృష్ట్యా వివిధ, భాషా పరిణామముల బరిశీలించి చేయబడిన వేదకాల నిర్ణయమును యుక్తముగాదు. ఎట్లన: ఇది దైనందిన మింటియం దుపయోగింపబడెడి పాత్రలయొక్కయు, అప్పుడప్పుడరుదుగ నేదేని యొక నిమిత్తమునకై యుపయోగింపబడు పాత్రయొక్కయు మన్నికను దృష్టాంతముగ గైగొని పరిశీలింపదగినది. ఐరోపాభాషలు నిరంతరము దైనందిన వ్యవహారములలో కోట్లకొలది ప్రజలచే భాషింపబడుచు, వ్రాయబడుచు, ప్రచారము గావింపబడుచు అనేకులచే ననేకవిధముల నుపయోగించబడుచు వచ్చినవి. వేదమంత్రములట్లుగావు. ఇవి యే కొలదిమందిచేతనో కంఠస్థములు జేయబడుచు, గురువుచే శిష్యున కనుగ్రహింపబడుచు, యజ్ఞాది పవిరఉ కర్మాచరణమునందు మాత్రమే నియమపూర్వకముగ వినియోగింప బడుచుండును. విద్యార్ధి ఉపనయనమైన తరువాత వేదముల గ్రహించుటకు క్రమశిక్షణతోపాటు తగిన యోగ్యతసంపాదించి పండ్రెండు వత్సరములు గురుశుశ్రూష జేయుచు నధ్యయనము జేయవలసి యున్నాడు. ఆ వేదమంత్రోచ్చారణము గూడ శిక్ష, వ్యాకరణము, ఛందస్సు- అనెడు మూడు శాస్త్రములచే నియమితమైనది. ఆడుపులి తన శిశువును కోఱలతో బట్టుకొని యొక ప్రదేశమునుండి మఱియొక ప్రదేశమునకు దుముకుచు బొవునపుడు తన శిశువున కెట్టి హానియు గలుగ కుండుటకై యెంతటి జాగరూకత వహించునో వేదమంత్రోచ్చారణనందు గూడ నంతటి జాగరూకత యావశ్యకమని శిక్షాది గ్రంథములు హెచ్చరించుచున్నవి.
''యథా వ్యాఘ్రీ హరే త్పుత్రాన్ దంష్ట్రాభిః న చ పీడయేత్
భీతా పతన ఛేదాభ్యాం తద్వ ద్వర్ణా న్ప్రయోజయేత్
ఏవం వర్ణాః ప్రయోక్తవ్యా నావ్యక్తా న చ పీడితాః''
-నారదీయశిక్షా- 2 ప్రపాఠక; 30-81.
సృష్టికాలమునుండి ప్రళయకాలము వరకు నొకే విధముగ నెట్టి మార్పులు లేకుండ నుండవలెననెడి యభిప్రాయముతోనే యిన్ని నియమములతో వేదమంత్రములు రక్షింపబడుచు వచ్చుచున్నవి. ఇట్లు వేద మంత్రోచ్చారణ సంరక్షణమునకై యేర్పడినవే పద-క్రమ-జటా-ఘనాది వికృతులు.
వేద మంత్రముల వీర్యత్వము,శక్తిమత్త్వము గూడ లక్షణగ్రంథములందు బ్రతిపాదింపబడిన వర్ణక్రమమనెడి యొక విశిష్టసంప్రదాయముచే సురక్షితముగ జేయబడినది. ఆ సంప్రదాయము ననుసరించి వేదమునందలి ప్రతి యక్షరమును గూడ ధ్వని-స్థాన-కరణ-ప్రయత్న-మంత్ర-స్వర-దేవతా-జాతులనెడి యెనిమిది లక్షణముల మనస్సు నందుంచుకొని యెంతయో మెలకువతో నుచ్చరింప వలసియున్నది.
''ధ్వని స్థానం చ కరణం ప్రయత్నః కాలతా స్వరః
దేవతా జాతి రేతై శ్చ వర్ణో జ్ఞేయో విచక్షణౖః''
వేదమందలి ప్రతి యక్షరముయొక్క మాత్రల సంఖ్యయు, వర్ణోత్పత్తిస్థానము, అందలి ముఖ్యాముఖ్య విభాగములు, వర్ణోత్పత్తికై చేయు వివిధయత్నములు, వివిధస్వరములు, ఆ స్వరముల నుచ్చరించునపుడు ఉచ్ఛ్యాస నిఃశ్వాసముల నియమించు విధానము, వేదముల యందలి సప్తస్వరములకును సంగీతశాస్త్రము నందలి సప్తస్వరములకును గల పరస్పర సంబంధము వేదముల యందలి స్వరములకును మయూర-వృషభ-గాంధార (కందహారుకు జెందిన గొఱ్ఱ)- క్రౌంచ-కోకిల-అశ్వ-గజాది పశుపక్ష్యాదుల సహజ ధ్వనులతో గల సామ్యము, ఏకత్వము- వీని నన్నిటిని ఈ లక్షణ గ్రంథములు చక్కగ వివరించియున్నవి. అంతియేకాదు. మంత్రము స్వరహీనమై చక్కగ నుచ్చరింపబడకపోయినను, వర్ణవ్యత్యయము గలిగినను కలుగవలసిన ఫలము కలుగకపోగా తద్విపరీత (అనిష్ట) ఫలము సంప్రాప్తించును.
''మంత్రో హీనః స్వరతో వర్ణతో వా
మిథ్యాప్రయుక్తో న త మర్ధ మహ
న వా గ్వజ్రో యజమానం హినస్తి
యథేంద్రశత్రుః స్వరతో పరాధాత్''
కనుక వేదమంత్రములుగూడ వ్యావహారిక భాషల వలెనే (సృష్ట్యాది నుండి ప్రళయము వరకును) కొన్ని పరిణామముల జెందియుండ నగునవి నిశ్చయించి భాషాశాస్త్ర (Phylology) సిద్ధాన్తముల ననుసరించి వేదకాలమును నిర్ణయింప బూనుట యుక్తిసహముగాదు. పైగా నీ వాదములు అనవస్థకును అవ్యవస్థకును గారణములై నిలువక పోవుచున్నవి.
బాలశాస్త్రి హరదాసపండితుడును తన ''Glimpses of the Vedic Nation'' అను గ్రంథమున అన్యభాషలవలె వేదమంత్రములు వ్యావహారిక భాషాకల్పితములు గావు. అనగా ఆర్యులనెడివారు నాడు తాము వ్యవహరించుకొనుచుండెడి భాషలోనే వేదమంత్రముల రచించిరి- అని చెప్పుట యుక్తిసహము గాదని సప్రమాణముగ నిరూపించెను.మఱియు తన వాదమున కుపష్టంభముగ సంస్కృతవ్యాకరణ కర్తలలో బ్రధానుడగు పాణిని తన సూత్రముల ద్వారా యీ యభిప్రాయమును సూచించినట్లు ఇట్లు నిరూపించినాడు.
''The Vedic Language was called by him 'Chhanda' and the Common Sanskrit Language as 'Bhasha''(p.p. 164)
పాణినిమహర్షి వేదములను ''ఛందః'' అనియు, సాధారణభాషను ''భాష'' యనియు వ్యవహరించినాడు. (చూ. 'బహుళం ఛందసి'ఇత్యాది)
పై విషయములనుబట్టి ''వేదములు వ్యావహారిక భాషలకంటె విలక్షణ మైనది; లౌకిక వ్యవహార భాషారూపములు గా''వని పాణిని స్పష్టముగ బేర్కొనుట తెలియనగును.
ఈజిప్టుయందు దొఱకిన శాసనములలోని మిత్రావరణుల గూర్చిన ప్రసక్తి మధ్యధరాసముద్ర ప్రాంతదేశమునందలి వైదిక విజ్ఞాన వ్యాప్తిని సూచించుచున్నది. మహేంజోదారోయందు లభించిన పురాతనశిల్పములలో నొక వృక్షముమీద రెండు పక్షులుండి యందొకటి పిప్పలఫలమును దినుచుండ రెండవది యుదాసీనముగ జూచుచున్నట్లు (చూ. 1950 సం.లో ప్రకటింపబడిన కళ్యాణ్ పత్రిక సంవత్సరాదిసంచిక, 137వ పుట) గలదు. కొందఱు పురావస్తు శిల్పశాస్త్రజ్ఞుల ననుసరించి ఈ పక్షులజంట ఋగ్వేదము (1-164-20) నందు నిరూపింపబడిన జీవాత్మ పరమాత్మలు బైబిలు పాతనిబంధన (Old Testament)లో సృష్ట్యారంభమునకు నిమిత్తమును వివరించుచు నిట్లు చెప్పబడినది. మొదట 'ఆదమ్' అను పురుషుడు, 'ఈవ్' అను స్త్రీయు సృజింపబడిరి. వారిరువురు నొక చెట్టు క్రింద నుండిరి. కాని యా చెట్టుయొక్క ఫలమును తినుట మాత్రము నిషేధింపబడెను. ఇట పేర్కొనబడిన చెట్టు జ్ఞానవృక్షము లేక బోధివృక్షముగా దెలియనగును. వారిలో ఈవ్ (స్త్రీ) నిషేధము నుల్లంగించి యా ఫలమును దినుటకై మనసుపడెను. ఉపనిషత్తులు ''వృక్షమున నున్న యా రెండు పక్షులలో నొకటి ఆత్మ; రెండవది జీవుడు; జీవుడు కర్మఫలభోక్త; ఆత్మ స్వయంజ్యోతీరూపుడు, కర్తృత్వభోక్తృత్వాది రహితుడు, ఉదాసీనుడు'' (సాక్షి) అని వివరించినది. బైబిలులో పేర్కొనబడిన ఆదమ్ శబ్దము యొక్కయు, ఉపనిషత్తులలో పేర్కొనబడిన ఆత్మశబ్దము యొక్కయు రూపనిష్పత్తికి మూలమైన ధాతువుయొక్క అర్ధము సమానము.కావున, ఉపషత్ప్రతిపాదితాంశములే పెక్కు వైకల్యములనొంది Old Testamentలో వర్ణింపబడిన వని చెప్పవచ్చును. ధాత్వర్ధము ననుసరించి 'ఈవ్' పదమునకు 'జీవించుట' యని అర్ధము. పిప్పలమనగా బోధిద్రుమము.
''బోధిద్రుమ శ్చలదలః పిప్పలః కుంజరాశనః''-- అమరకోశ. అదియే, జ్ఞానవృక్షము, ఈ బోధిద్రుమము క్రిందనే శాక్యమని యగు సిద్ధార్ధుడు జ్ఞానము నొంది బుద్ధుడయ్యెను. ధర్మశాస్త్రములు బోధిద్రుమముయొక్క ఫలభక్షణమును నిషేధించినవి.
''తథా వట ప్లక్షాశ్వత్థ దధిత్థ నీప మాతులుంగ ఫలాని
వర్ణయేత్'' - వైద్యనాథదీక్షిత, - స్మృతిముక్తాఫలము-అహ్నికకాండ.
తిలక్ మహాశయుడు 'The Arctic Home in the Vedas' అను గ్రంథమున వేదకాలము క్రీస్తు పూర్వము 6000 సం. అని నిర్ణయించెను. ఆ విషయమున జూపబడిన కారణము లివి; ''వసంత ఋతు ప్రారంభమునను,శరదృతు ప్రారంభమునను సంవత్సరమునకు రెండుమారులు విషువములు (Vernal and Autumual equinoxes) వచ్చుచుండును. ఆ సమయములందు రాత్రింబవళ్ళ దైర్ఘ్యము సమముగ నుండుటచే విషువములు అనివానికి సార్ధకనామము. కాని ఆ విషువములు సంభవించుటలో క్రాన్తివృత్తము (Ecliptic) నందు విషువస్థానములు కాలక్రమమున కొలదిగ వెనుకకు జరుగుచుండును. సూర్యుడొకపుడు కృత్తికల యందును. మరి యొకపుడు మృగశిరయందును, ఇంకొకపుడు పునర్వసు నక్షత్రమునందును ఉన్నపుడు విషివత్పుణ్యకాలములు (Vernal Ecquinoxes) ప్రాప్తించినట్లు వేదములందు సూచనలు కలవు. విషువత్పుణ్యకాలము ఒక నక్షత్రము నుండి ఇంకొక నక్షత్రమునకు వెనుకకు జరుగుచు తిరిగి మొదటి నక్షత్రమునకు వచ్చుసరికి 25868 సంవత్సరములు పట్టును అనగా ఒక నక్షత్రమునుండి మరియొక నక్షత్రమునకు జరుగుటకు 958 సం. కాలము పట్టును. కావున విషువత్పుణ్యకాలము పునర్వసు నక్షత్రమునందు ప్రాప్తించినట్లుగా సూచించెడి యా వేదములు (6x958=5748 లేక సుమారు 6000 వత్సరములకు పూర్వము రచింపబడి యుండవలెను.
పై వాదమువలన వేదములు రచింపబడినట్లును, మఱియు నందానాటి ఖగోళ సంఘటన విషువము వంటిది యొకటి వేద రచయితలు తమ రచనలలో బేర్కొనినట్లును దెలియుచున్నది. ఇది యుక్తము కాదు. కాలము అన్‌తము. దృష్యమగు నీ జగత్తు మన శాస్త్రముల ననుసరించి 195,58,85,000 వత్సరములకు పూర్వ ముత్పన్నమైనది. అంతటి దీర్ఘకాలములో పైన పేర్కొన్న బడినట్టి విషువము లెన్నియో ప్రాప్తించియుండును. అందుచే వేదములందు సూచింపబడినట్లుగా జెప్పబడుచున్న విషువములను బురస్కరించుకొనుచు వేదకాల నిర్ణయమునకు బూనుకొనుట యుక్తిసహముగాదు.
పాశ్చాత్యచరిత్రకారులు ప్రపంచము పుట్టి 6000 సం.లు గడచినవని చెప్పుదురు.కాని, భూగర్భ శాస్త్రజ్ఞులు, భూగోళము చల్లారుట యను సంశముపై నాధారపడి కాలనిర్ణయము గావించిరి. ఈ శాస్త్రజ్ఞుల నిర్ణయము మన శాస్త్రములో జెప్పబడిన కాలమునకు స్థూలముగ సరిపోవుచున్నది. తిలక్ మహాశయుడు వేదములయందలి సూర్యోదయ సూర్యాస్తమయముల వర్ణనము, ఉషస్సు- అరుణోదయముల వర్ణనము. ఉత్తరధ్రువ ప్రాంతమందలి స్థితిగతులను సూచించుచున్న వనియు, ఆ యుత్తరధ్రువప్రాంతము భూగోళశాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారము సుమారు 8000 సం. ప్రాంత మునుండి మానవనివాసయోగ్యము గాకపొయినదనియు, వేదకర్తలగు ఋషులు నా ప్రాంతములందపుడు వసించుచు నా వర్ణనముల జేసియుందు రనియు, అదియే వేదకాల మనియు నిర్ణయించెను.
వంగదేశీయులగు ధీరేంద్రనాథ ఉపాధ్యాయ, అవినాషచంద్రదాసు అను పండితు లిరువురు వేదములందలి హిమవత్పర్వతప్రాంత వర్ణనల నాధారముగ జేసికొని భూగోళశాస్త్ర సిద్ధాంతసాహాయ్యముతో వేదకాలము 25వేల సం.లకు బూర్వమని నిర్ణయించిరి. ఏలయన, ''పూర్వము సముద్రములుగ వర్ణింపబడిన ప్రాంతము లిపుడు పర్వతమయములుగను, నాటి యడవు లిపుడు సముద్రములుగను పరిణమించి యున్నవి. కాన భూగోళశాస్త్ర సిద్ధాంతముల ననుసరించి వేదకాలము 25,000 సం. పూర్వమే యయి యుండవలెను.''
పై వాదములు సరికావు. భూమి సముద్రముగను, సముద్రము భూమిగను పరిణమించుటగాని శీతోష్ణస్థితిలో మార్పులు సంభవించుట గాని ప్రకృతియందలి నైసర్గికస్థితులపై నాధారపడియుండును గాన, భూగోళశాస్త్రము నాధారము జేసికొని కల్పితములైన యీ వాదములందు బలము లేదు.
''వేదములు శబ్దతరంగ రూపములు, పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిఃశ్వాసరూపములు, ధ్వని యెంత ప్రాచీనమో శబ్దతరంగరూపమగు నీ వేదరాశియు నంత ప్రాచీనము.''- అనెడి సంప్రదాయానుగతమైన మన శాస్త్రీయ దృక్పథమే మిక్కిలి యుచితముగ గన్పట్టుచున్నది.
పూర్వసంప్రదాయాభిరతులైన పండితులు వేదములు శబ్దతరంగ రూపములై మనచుట్టు నెల్లపుడు నాకాశములో నుండియే యున్నవని చెప్పుదురు. ''శబ్దతరంగము లొకపరి పుట్టుచో నవి యంతటితో నంతమొందక యితర శబ్దతరంగములలో లీనముగాక తపశ్చర్యాదులచే నింద్రియములు వీర్యవత్తరములై దైవీసంపత్సముల్లసితము లగుచో నాకాశమునందు విలీనములై యుండెడి యా యతిసూక్ష్మములైన శబ్దములను గూడ స్ఫుటముగ వినుట శక్యమగును.'' (Vide P.E.N. Books, Indian Literature, No
12. Sanskrit Litarature by Sri K. Chandrasekharam, V.H. Subrahmanya Sastry. PP. 19.)
ప్రాచీనులును మంత్రద్రష్టలును నగు మహర్షులు కొందఱు నిరతిశయ తపశ్చర్యాదులచే నట్టి దైవీశక్తిని పెంపొందించుకొనినవారై తమ దివ్యతపస్సమాధిలో నీ వేదమంత్రరాశిని దర్శించిరి. అట్లు దర్శించి శబ్దస్వరీపవిషయకమైన తమ యనుభూతిని (The Theory of the Origin of Sound) లోకానుగ్రహబుద్ధితో తొలుదొలుత శాస్త్రీయముగ లోకమున వెలయుంపజేసిరి. కనుక, ''వేదములు నిత్యములు; సృష్టి యెంత ప్రాచీనమో వేదము లంత ప్రాచీనములు'' అనెడి సంప్రదాయానుగతమైన యీ వాదమును కాదనుట కేమాత్రమును వీలులేదు.