Maa Swami
Chapters
14. దశోపనిషత్తులు ఓంపూర్ణ మదః పూర్ణమిదం పూర్ణా త్పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవావశిష్యతే శంకరభగవత్పాదులు, పది ఉపనిషత్తుల నెన్నుకొని, వానిపై భాష్యములు వ్రాశారు. వారికి పిదప వచ్చిన రామానుజాచార్యులు, మధ్వాచార్యులవారును, తమతమ సిద్ధాంతాల కనుకూలంగా ఈ ఉపనిషత్తులపై భాష్యాలు వ్రాశారు. ఈ పది ఉపనిషత్తుల పేర్లు సులభంగా జ్ఞాపక ముండుట కొఱకై- ఒక శ్లోకాన్ని చెప్పుట వాడుక. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ ఈ శ్లోకంలో చెప్పబడిన క్రమానుసారమే భగవత్పాదుల భాష్యాలు వ్రాశారు. మొదట పేర్కొన్న 'ఈశ' ము ఈశావాస్యోపనిషత్తు. ఈ ఉపనిషత్తు శుక్లయజుర్వేద సంహిత లోనిది. ఈశావాస్యమిదం సర్వం- అని ప్రారంభమగుటచేత దీనికి ఈశావాస్యమని పేరు. 'కేన' యని ప్రారంభమగు ఉపనిషత్తుకు కేనోపనిషత్తు అని పేరు. ఈ లోకం అంతా ఈశ్వరునిచే వ్యాపింపబడివున్నది. సర్వ కర్మలను వానికే అర్పించి పరమాత్మ తత్త్వమును తెలుసుకోవాలి- అని ఈశావాస్యోపనిషత్తు బోధిస్తోంది. కఱ్ఱతో చేసిన ఏనుగు బొమ్మను చూచినపుడు- కఱ్ఱగా దర్శిస్తే ఏనుగు కనపడదు. ఏనుగుగా దర్శిస్తే కఱ్ఱకనపడదు. చిన్నపిల్లలు దానిని ఏనుగనియే భావిస్తారు. పెద్దలకు అది కఱ్ఱతోచేసిన బొమ్మ, ఏనుగుకాదు అన్న జ్ఞానముంటుంది. దంతిని దారువికారే దారు తిరోభవతి సో z పి తత్రైవ జగతి తథా పరమాత్మా పరమాత్మన్యపి జగ త్తిరోధత్తే జగత్తుకు మూలమైన పంచభూతాలు, పరమాత్మ అనే కొయ్యతో చేయబడినవి. పంచభూతాలను చూచినపుడు పరమాత్మ మరగి పోతున్నాడు. పరమాత్మను దర్శించినపుడు పంచభూతములు మరగిపోతవి. సమస్తము ఈశావాస్యముగ భావించవలెనని ఈశావాస్యం చెప్పుతోంది. కేనోపనిషత్తు సామవేదీయ జైమినిశాఖలో తలవకార బ్రాహ్మణమందున్నందున దానిని తలవకారోపనిషత్తు అనికూడ వ్యవహరిస్తారు. దేవాసురయుద్ధంలో జయించిన దేవతలు, అహంభావపూరితులై జయము తమదే యని విఱ్ఱవీగినపుడు, పరమేశ్వరియే, దేవతలకు జ్ఞానోపదేశం చేసినట్లు ఈ ఉపనిషత్తు తెలుపుతోంది. శంకర భగత్పాదులు ఈ భాష్యమునకు ప్రతిపదార్ధ వివరణ (పదభాష్యము) తో పాటు వాక్యములకు కూడ ప్రత్యేకంగా వివరణం (వాక్యభాష్యము) వ్రాయుట యొక విశేషము- శ్రుతీనాం మూర్ధానో దధతి తవ ¸° శేఖరతయా మయా ప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ మయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ యయో ర్లాక్షాలక్ష్మీ రరుణ హరిచూడామణి రుచిః ఇది శ్రీ శంకరులు రచించిన సౌందర్యలహరిలోని శ్లోకం. వేదాంతములకు అమ్మవారి పాదములు శిరోధార్యములుగా నున్నవని వ్రాసినపుడు వారు కేనోపనిషత్తునే ముఖ్యంగా భావించి వుంటారు. లలితా సహస్రనామములలో-'సామగానప్రియా' యనున దొకటి. తదనుగుణంగా, సామవేదీయ కేనోపనిషత్తు, అమ్మవారు జ్ఞానాంబికగా దేవతల ననుగ్రహించినట్లు ఉద్ఘాటిస్తోంది. ఒక వస్తువును మనము చూస్తున్నామంటే చూచుచున్న వ్యక్తి, చూడబడువస్తువు- అని రెండు విషయము లేర్పడుచున్నది. వీనిని ఆంగ్లములో- సబ్జెక్ట్, ఆబ్జెక్ట్- అని వ్యవహరిస్తారు. నా దేహము- అని చెప్పునపుడు, నేను వేరు, నా దేహం వేరు అనేభావన కలుగుతోంది. నా దేహము, అని చెప్పుచున్న నేను- Subject గాను, నా దేహము అనేది Object గాను లోకంలో వ్యవహారం. అందుచే నిజమైన నేను (అంటే దేహాదులకంటే విలక్షణమైన నేను ఆత్మ) Subject. తక్కిన వన్నియు Objects 'ఆత్మ' ఎప్పుడూ Subject గానే ఉండాలి. 'ఆత్మను తెలిసికొంటిని' అని వ్యవహారంవుంది. అపుడు ఆత్మ (నేను) Object అవుతుందిగదా! కాదు. తెలిసికొనే వస్తువుకంటే తెలియబడే వస్తువు వేఱుగా ఉండాలి. కాబట్టి ఆత్మను తెలిసికొనే మఱొక ఆత్మను అంగీకరించాలి. అంగీకరించినా ఆ ఆత్మ (నేను) ను తెలిసికొనే మఱొక ఆత్మను అంగీకరించాలి. ఇట్లా అనవస్థ ఏర్పడుతుంది. అందుచేత ఆత్మజ్ఞానం, ఆత్మ నెఱగుట- అనే వాక్యాలకు అర్ధం తన్నుతాను తెలిసికొనుట అనే చెప్పాలి. దానినే ఆత్మానుభవం స్వస్వరూపానుభవం అని అంటారు. నాహం మన్యే నువేదేతి నో న వేదేతి వేద చ యో న స్త ద్వేద త ద్వేద నో న వేదేతి వేద చ -కేనోపనిషత్తు. ఎవడు 'ఆత్మను ఎఱుగుదును' అని అంటున్నాడో అతడు ఆత్మను ఎఱుగుటలేదు- ఎవడు 'ఆత్మను ఎఱుగను' అన్న స్థితిలో ఉన్నాడో అతడే ఆత్మను ఎఱిగిన వాడవుతున్నాడు. 'తెలుసు ననువానికి తెలియదు. తెలియదు అనువారికి తెలుసును'- అని కేనోపనిషత్తు చెప్పుతోంది. కఠ మనగా కఠోపనిషత్తు. ఇది కృష్ణయజుర్వేదం లోనిది. మరణించిన పిదప జీవుడేమవుతున్నాడను విషయాన్ని నచికేతుడనే బ్రహ్మచారికి యముడు బోధిస్తాడు. కథవలె ప్రారంభ##మై ఈ ఉపనిషత్తు తత్త్వబోధతో ముగుస్తుంది. కృష్ణపరమాత్మ భగవద్గీతలో ముఖ్యంగా కఠోపనిషత్తు వాక్యాలను గ్రహించి తత్త్వబోధ చేశాడు. ముందు నేను చెప్పిన- Subject, Object విషయం, ఈ ఉపనిషత్తు చివర వివరంగా ఉపదేశింపబడింది. అంగుష్ఠమాత్రః పురుషోం z తరాత్మా సదా జనానాం మృదయే సన్నివిష్టః తం స్వాచ్ఛరీరా త్ప్రవృహే న్ముంజా దివేషీకాం ధైర్యేణ తం విద్యా చ్ఛుక్ర మమృతం- తం విద్యా చ్ఛుక్ర మమృత మితి. 6.17 ధాన్యపు కంకినుండి ధాన్యాన్ని, ఒక రెమ్మనుండి ఆకులను వేఱుచేసే విధంగా శరీరంనుండి ఆత్మను వేఱుచేసి గ్రహించాలని పై మంత్రం చెప్పుతోంది. కామము, క్రోధము, ద్వేషము, భయము మనస్సుకు సంబంధించినవే కాని ఆత్మకు సంబంధించినవికావు. అట్లాగే దాహము ఆకలి మొదలగునవికూడా దేహమునకు సంబంధించినవే కాని ఆత్మకు సంబంధించినవి కావు. ఇట్లా ఆత్మకు సంబంధములేని విషయాలను అనాత్మ వస్తువులుగా గ్రహించి వానిని Objectify చేసి- అనాత్మ వస్తు నిరాకరణము మనము చేయటానికి అనవరతము ప్రయత్నించాలి. ఈ విధంగా అనుసంధానం చేస్తూవుంటే 'దేహమే నేను' అనే అభిమానము కొంచెము కొంచెముగా సడలిపోతుంది. దేహానికి, మనస్సుకు సంబంధించిన మలముతొలగి, మనము ఆత్మస్వరూపంలో ఉండగలము. 'తం స్వా చ్ఛరీరా త్ప్రవృహే న్ముంజా దివేషీకాం ధైర్యేణ'- అంటే ముంజధర్భ మధ్యలో ఉండే సన్నని యీనెను వేఱుచేసి గ్రహించేవిధంగా వివేకంతో శరీరంనుండి ఆత్మను వేఱుచేసి గ్రహించాలి- అని అర్ధము. ఇక్కడ కట్టియున్న అరటిస్తంభము వేరు, మనము వేరు- మనము Subject, అది Object. అది వాడిపోతే మనము వాడిపోతామా? అరటిచెట్టు ఎట్లు Subject కాదో అదే విధముగా, దేహేంద్రియములు, మనస్సు- Object లే గాని Subject లు కావు. ఆత్మయే Subject. దేహమును Object గాను, ఆత్మను Subject గాను ఎఱిగి శాంతిగా ఉండుటకు అలవరచుకోవాలి. ఈ లోకములో వున్నపుడే, శరీరధారణ చేస్తున్న సమయములోనే 'ఈ శరీరము నేను కాదు', అన్న మనోభావ మేర్పడాలి. ఇట్టి మనోభావం స్థిరంగా వుంటే ఎప్పుడో శరీరం పతనమైన పిదప, మోక్షం పొందుతామన్నమాట లేకుండా ఈ జీవితంలోనే ఇప్పుడే మోక్షం మనకు సిద్ధిస్తుంది. మోక్షమంటే ఏ దుఃఖభరమూ లేకుండా సదా ఆనందంగా నుండుటమే. ఇట్లు ఈ లోకంలోనే శరీరధ్యానం లేక ఆత్మారాముడై ఉండటమే జీవన్ముక్తుని లక్షణము. అట్టి జీవన్ముక్తి దశోపలబ్ధియే. వేద వేదాంతముల పరమ తాత్పర్యము. గీతలో భగవానుడు, 'ప్రాక్ శరీర విమోక్షణాత్' శరీరమును వదలి పెట్టుటకు ముందే కోరికల వలనను, క్రోధము వలనను కలుగు వేగమును ఎవడు ఓర్చుకొన గలుగుతాడో అతడే యుక్తుడు, సుఖియని బోధిస్తున్నాడు. ఆత్మజ్ఞానము లభించి ఆత్మనిరతిలో ఉంటే మనము శరీరము కాము (శరీరమని చెప్పునపుడు మనస్సుకూడ అందులో కలసియున్నది) అన్న భావన ఏర్పడి శరీరముఉన్నా, పోయినా లేక్కలేక, మరణమంటే భయంలేక అమృతత్వాన్ని అందుకొన గలుగుతాము. కర్మకాండకు చేరిన పురుషసూక్తంలో కూడ ఈ విషయమే చెప్పబడింది. త మేవం విద్వా నమృత ఇహ భవతి నా z న్యః పంధా విద్యతే యనాయః ఆత్మస్వరూప మెరిగినవాడు ఈ జన్మలోనే అమృత తత్వాన్ని పొందుతాడు- (ఇహభవతి) అని అర్ధము. ఉపనిషత్తు లన్నిటిలోనూ ఈ విషయమే విశేషంగా చర్వితచర్వణం చేయబడుతుంది. మనకు దుఃఖహేతువు శరీరము- మనస్సుకు దుఃఖానుభవం లేకుండా సదా ఆనందస్వరూపులమై ఉండటమే మోక్షమని అన్ని మతాలు బోధిస్తున్నవి. 'ఆ మోక్షము ఏదో పరలోకాలకు పోయినగాని రాదు'- అని ఇతర మతాలు చెప్పుతవి. అద్వైతసిద్ధాంతం మాత్రం 'మోక్షం కోసం పరలోకాలకు పోనక్కరలేదు. అక్కడలభించే ఆనందంకంటే సహస్రగుణంగా ఈ లోకంలోనే ఆనందాన్ని అనుభవించవచ్చు. శరీరాభిమానం సమూలంగా తొలగి స్వరూపస్థితిలో నిలిస్తే అదే మోక్షము' అని బోధిస్తున్నది. 'తదేతత్ అశరీరాఖ్యం మోక్షం' ఈ శరీరము లేకపోవుటయే మోక్షము- అని సూత్రభాష్యంలో శంకర భగవత్పాదులవారు స్థాపించారు. ''నేను శరీరము'' అనే ప్రజ్ఞ పోవుటయే అశరీరత్వరూపమోక్షం. ఆశలను క్రమముగా తగ్గించుకొని, తృష్ణా రహితులమైతే శరీరాభిమానము పూర్తిగాపోయి అశరీరత్వ మేర్పడి మోక్షము సిద్ధిస్తుంది. అప్పుడు ఆత్మ ఒక్కడే ప్రకాశిస్తాడు. దీనికై ఇతర లోకాలకు పోనక్కరలేదు. వేద వేదాంగములు, ఇహైవ- అనుటలోని తాత్పర్యం ఇదే. ఈ అమృతస్థితి మనకు అందుబాటులో లేకుండుటకు కారణము కామము, క్రోధము- అని గీత చెప్పుతోంది. గీత స్మృతి. స్మృతికి ఆధారమైనది శ్రుతి. ఛాందోగ్యంలో ప్రియం, అప్రియం అన్న పదప్రయోగాలున్నవి. ప్రియము కామానికి అప్రియము క్రోధానికి దారితీయగలవు. 'సశరీరుడు'- అంటే శరీరమున్నవాడు. ప్రియాప్రియములచేత స్పృశింపబడేవాడు. అతడు అశరీరి అయితే- శరీరానికి సంబంధించిన ప్రియాప్రియములు స్పృశింపవు. నీవు ప్రియాప్రియముల నుండి బయటపడ వలెనంటే- ప్రాణమున్నపుడే- సశరీరిగా నున్నపుడే- అశరీరత్వాన్ని 'నేను దేహము కాను' అన్న భావనాదార్ధ్యాన్ని సాధించాలి- అని ఛాందోగ్యం బోధిస్తోంది. ఒకే జీవాత్మను అహంకార మమకారములను అనుసరించి గౌణాత్మ, మిథ్యాత్మ, ముఖ్యాత్మ అని విభాగించుట వాడుక. ఈ విభాగాన్ని గూర్చి భగవత్పాదులు- బ్రహ్మసూత్ర భాష్యములో- గౌణ మిథ్యాత్మనో z సత్వే పుత్ర దేహాది బంధనాత్ సద్ బ్రహ్మాత్మాహ మిత్యేవం బోధే కార్యం కథం భ##వేత్ అని వ్రాశారు. పుత్రమిత్రాదులను మనమే అనుకొని వారితో సంబంధము కల్పించుకొని వారి సుఖదుఃఖాలను మనవి అని అభిమానించేది గౌణాత్మ. గౌణ మనగా అప్రధానం. ఔపచారికం. పుత్రమిత్రాదులు వేరు మనము వేరు- అని తెలియుండినా మనం మనం అని అభిమానించడమే గౌణం. 'శరీరమే నేను' అని అభిమానించేదే మిథ్యాత్మ. సద్బ్రహ్మమే నేను- అనేది ముఖ్యాత్మ. మొదటి రెంటినీ- అనగా గౌణ మిథ్యాత్మలను మనము నిరాకరిస్తే, పుత్ర మిత్రాదుల సంబంధము, 'శరీరేంద్రియములే నేను', అన్న భావనయు తొలగి, సత్యమైన బ్రహ్మ స్వరూపమే నేను అన్న జ్ఞానోదయము కలుగుతుంది. 'బ్రహ్మము కంటెను, ఆత్మ కంటెను వేరుకాని వాడనునేను' అన్న బోధకలుగగా, పుత్ర దేహాది బంధనములు తొలగిపోయి పిదప చేయదగిన కార్యమేది ఉండదు- అని పై శ్లోకముయొక్క తాత్పర్యము. రామకృష్ణమిషన్ స్థాపించిన వివేకానందులు- Arise, Awake, Stop not till the Goal is reached అని అందఱకు ప్రబోధంచేశారు- ఈ ప్రబోధము కఠోపనిషత్తులోనిది. 'ఉత్తిష్టత, జాగ్రత, ప్రావ్య వరా న్నిబోధత' అను మంత్రమే వివేకానందులు గ్రహించిన లక్ష్యానికి మూలము. ఉదాహరణములుగా గ్రహించు పెక్కు శ్రుతి వాక్యాలు, కఠోపనిషత్తు లోనివే. నాయ మాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన- య మేవైష వృణుతే తేన లభ్య స్తసై#్యషా ఆత్మా వివృణుతే తనూం స్వామ్ ఈ ఆత్మను నిరంతర వేదాభ్యాసము చేతగానీ మేధాశక్తి (చదివినదానిని మరువకుండునట్లు చేసే శక్తి) చేతగానీ, విస్తారముగా శ్రుతులను శ్రవణము చేయుట చేతగానీ పొందలేము. సాధకుడు దేనిని ప్రార్థించుచున్నాడో దానిచేత- స్వాత్మచేతనే తెలియబడుతున్నాడు. అనగా పరమాత్మను మన ఆత్మచేతనే తెలిసికొనగలము- స్వాత్మయొక్క యధార్ధ స్వరూపాన్ని పరమాత్మ ప్రకాశింపజేస్తున్నాడు. ఆత్మానాం రథినం విధ్ధి శరీరం రధ మేవ తు బుద్ధిస్తు సారధిం విధ్ధి మనః ప్రగ్రహ మేవ చ ఆత్మను రథికునిగాను (రథమునకు యజమాని) శరీరాన్ని రథముగాను, బుద్ధిని సారథిగాను, మనస్సును కళ్ళెముగాను మనము గ్రహించాలి. ఇంద్రియాది హాయా నాహుః విషయాన్ తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే త్యాహు ర్మనీషిణః ఇంద్రియాలు ఆ రథాన్నిలాగే గుఱ్ఱాలు- విషయములు అవి పోవు మార్గములు. శరీరము, ఇంద్రియములు మనస్సు అను వానితో తాదాత్మ్యం చెందియున్న ఆత్మ భోక్తం అని విద్వాంసులంటారు. అంగుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి ఈశానో భూతభవ్యస్య సతతో విజుగుప్సతే ఏత ద్వైతత్ బొటనవ్రేలి యంత పరిమాణంగలిగి పురుషుడు శరీరములో ఉన్నాడు. జరిగినదానికి జరగబోయే దానికి అధిపతి ఈ పురుషుడు. దీనిని తెలిసినవాడు దానిని గర్హించడు. దానియెడల సంకోచమొందడు. ఇదే ఆ ఆత్మ. ''అంగుష్ఠమాత్రః పురుషో జ్యోతి రివాధూమకః'' బొటనవ్రేలి పరిమాణముగల పురుషుడు పొగలేని జ్యోతివంటి వాడు. దీపారాధన సమయములో మనము చెప్పు మంత్రము- న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాన్తి కుతో z య మగ్నిః త మేన భాన్త మనుభాతి సర్వం తస్య భాసా సర్వ మిదం విభాతి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, విద్యుత్తులు- ఏవియు అక్కడ ప్రకాశింపవు,. ఇక ఈ అగ్ని సంగతి (సూర్యచంద్రాదులే ప్రకాశింపనపుడు ఈ అగ్ని యక్కడ ప్రకాశించ దని) వేరే చెప్పవలయునా? సమస్తము దానిని (ఆత్మను) అనుసరించియే ప్రకాశిస్తోంది. దాని ప్రకాశము చేతనే ఇదంతా భాసిస్తోంది- (అంటే పరమాత్మ చేతనే సర్వము భాసిస్తోంది కనుక ఆ మహాబుద్ధిని మన అల్పబుద్ధిచేత ఎరుగలేము, అని భావం.) గీతలో భాగవానుడు చెప్పే- ఊర్ద్వమూలం అథశ్శాఖమ్- అను శ్లోకానికి ఆధారమైన శ్లోకము ఈ క్రిందిది. ఊర్ధ్వమూలో అవాక్‌శాఖ ఏషో శ్వత్థ స్సనాతనః తదేవో శుక్రం త ద్బ్రహ్మ తదేవామృత ముచ్యతే- తస్మిన్ లోకా శ్శ్రితా స్సర్వే తదు నాత్యేతి కశ్చన, ఏత ద్వైతత్. పైకి వ్రేళ్ళు, క్రిందకు కొమ్మలు వ్యాపించిన పురాతనమైన అశ్వత్థవృక్షమది. ఇదే శుద్ధము, బ్రహ్మ, అమృతము అని పిలువబడుతున్నది. దీనియందు లోకములన్నియు ఆధారపడివున్నవి. ఏదియు దీనిని అతిక్రమింపలేదు. ఇదే ఆ ఆత్మ. యదా సర్వే ప్రముచ్యన్తే కామాయే స్య హృది శ్రితాః అథ మర్త్యో మృతో భవ త్యత్ర బ్రహ్మ సమశ్నుతే హృదయమునగల కోరికలన్నీ నశింపగా మర్త్యుడు అమర్త్యుడై ఇచ్చటనే- ఇహైవ- బ్రహ్మత్వమును పొందుతున్నాడు. అనునవి కఠోపనిషత్తు లోనివి. కఠోపనిషత్తునకు పిదప ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు- ఇవి అధర్వవేదానికి సంబంధించినవి. ప్రశ్నోపనిషత్తులో- ప్రజలు దేనినుండి పుట్టుచున్నారు? వారిని రక్షించుదేవత లెవరు? ప్రాణము ఏవిధంగా శరీరంలో ప్రవేశిస్తోంది? జాగ్రత్స్వప్న సుషుప్తుల యథార్ధమేమి? ప్రణవోపాసనయొక్క ప్రయోజన మేమి? పరమాత్మకు జీవాత్మకుగల సంబంధమేమి? అను ఆరు ప్రశ్నలకు ప్రతివచనము లిందులో ఉండటంచేత దీనికి ప్రశ్నోపనిషత్తు అని పేరు. ముండక మనగా తల బోడి అగుట. పరమ పక్వస్థితినొందిన వైరాగ్యశీలురు అభ్యసింపదగిన అధికారముగల ఉపనిషత్తుకు, మండకోపనిషత్తు అని పేరు. ఇది అక్షర పరబ్రహ్మనుగూర్చి వివరిస్తుంది. నాశనములేనిది ఏదో అది అక్షరము. అక్షరమునకు అక్కరము అన్న అర్ధము ఉంది. పంచాక్షరి అష్టాక్షరి అనే పేర్లతో మంత్రాలను వ్యవహరిస్తున్నాము. వీనికంతయు మూలమైన అక్షరము ప్రణవము-ఓంకారము అక్షరబ్రహ్మ మనే లక్ష్యాన్ని చేరటానికి అక్షరమైన ప్రణవము విశేషసాధనము. ప్రణవో ధను శ్శరో హ్యాత్మా బ్రహ్మ త ల్లక్ష్య ముచ్యతే- అప్రమత్తేవ వేద్ధవ్యం శరవ త్తన్మయో భ##వేత్ ప్రణవము ధనుస్సు, బాణము ఆత్మ; లక్ష్యము బ్రహ్మ. అప్రమత్తంతో, ఏకాగ్రచిత్తముతో లక్ష్యభూతమైన బ్రహ్మమును వేధింపవలెను. బాణము లక్ష్యమయము (లక్ష్యైకాత్మకము) అగునట్లే ఆత్మకూడా పరమాత్మమయము (అక్షర పరబ్రహ్మైకాత్మము) అవుతుంది. మరొక సుప్రసిద్ధమైన మంత్రము- ద్వా సువర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయో రన్యః పిప్పలం స్వాద్వత్తి అవశ్నన్ అన్యో అభిచాకశీతి రెండు పక్షులు మంచి గమనము కలవి. ఒకదాని నొకటి ఎడబాసి యుండదు. (జీవాత్మ పరమాత్మ అను పేరు గలవి). రెండును సమాన ఖ్యాతిగలవి. శరీరమనే ఒకే వృక్షాన్ని ఆశ్రయించుకొని యుంటవి. వానిలో ఒకటి (జీవుడు) (పుణ్యపాప) ఫలమును ప్రీతితో తింటాడు (అనుభవిస్తాడు). వేఱొకటి దేనినీ భుజింపదు. ఊరక చూస్తూ ఉంటుంది. అనగా జీవాత్మ అనే పక్షి కర్మఫలాన్ని తిననట్లును, పరమాత్మ అనే పక్షి కేవలము సాక్షివలె నుండునట్లును చెప్పబడింది. వీరికే బైబిలులో Adam (ఆత్మ) Apple (పిప్పలము) Eve (జీవుడు) అని వ్యవహారము. ఆడం ఆప్పిల్ తినలేదనీ Eve మాత్రము దానిని తినినట్లుకూడ కథ ఉన్నది. ప్రస్తుతము భారత ప్రభుత్వము వారికి లక్ష్యవాచకముగావున్న- 'సత్యమేవ జయతే' అనే వాక్యంకూడా ఈ ఉపనిషత్తులోనిదే. సత్య మేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయాన అను మంత్రమునుండి ఇది గ్రహింపబడినది. పూర్ణకుంభ మిచ్చునపుడు చెప్పే మంత్రములలో ఒకటి ఈ ఉపనిషత్తులో వస్తుంది- ఇదీ ఆ మంత్రము. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్ధాః సన్యాసయోగాద్ యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యన్తి సర్వే- వేదాంత విజ్ఞానముచేత ఆత్మను నిశ్చయంగా తెలిసికొన్నవారు, సర్వకర్మ సన్యాసయోగంచేత విశుద్ధమైన జ్ఞానం కలవారు అందరూ దేహాన్ని పరిత్యజించే కాలంలో (దేహము నేను- అనే భావన లేక అశరీరులై) బ్రహ్మాత్మైక భావము జెంది విముక్తులవుతారు- అని శ్లోకముయొక్క తాత్పర్యము. వేర్వేరు వేళ్ళతో ప్రవహించే నదులు నామరూపములు కోల్పోయి సముద్రంలో ఎట్లా ప్రవహిస్తున్నవో, అట్లే జ్ఞానులు నామరూప విముక్తులై పరాత్పరుడైన పరమపురుషునితో ఐక్యమగుచున్నారని చెప్పే ఈ క్రింది శ్లోకము కూడా ఈ ఉపనిషత్తులోనిదే. యథా నద్యః స్యందమానా స్సముద్రే అస్తం గచ్ఛన్తి నామరూపే విహాయ తథా విద్యా న్నామరూపా ద్విముక్తః పరాత్పరం పురుష ముపైతి దివ్యమ్ తరువాత మాండూక్యోపనిషత్తు. మాండూక్య మనగా కప్ప. ఒక ఉపనిషత్తుకు 'కప్ప ఉపనిషత్తు' అని ఏల పేరు? కప్ప ఇతర జంతువులవలె అడుగులువేసి సంచారము చేయదు. మొదటి మెట్టునుండి నాలుగవ మెట్టునకు ఒక్క గెంతులో దాటిపోతుంది. ఈ ఉపనిషత్తు జాగృతి, స్వప్నము, సుషుప్తీ- అను మూడు అవస్థలను దాటి నాలుగవ అవస్థయైన తురీయానికిచేరే మార్గాన్ని చెప్పుతున్నది. ఓంకారోపాసనచేత ఒక్క గెంతున తురీయావస్థ చేరు మార్గము తెలుపుతోంది. కాబట్టి దీనికి మాండూక్యోపనిషత్తు అని పేరు వచ్చిందేమో అని తోస్తుంది. ఆదిమవాసులు, ఒక్కొక్క సంఘమును ఒక్కొక్క ప్రాణివర్గము పేరిట అభిజ్ఞాన ముంచుకొని వేర్వేరు వర్గములుగా నుండిరనీ, వీరిలో కప్పను చిహ్నంగా నుంచుకొన్న మాండూక్యులు అధ్యయనం చేసిన ఉపనిషత్తు కాబట్టి మాండ్యూక్యమనీ పరిశోధకులు చెప్పుతున్నారు. ఈ ఉపనిషత్తుకు ఋషి మాండూక్యరూపియైన వరుణభగవానుడని చెప్పబడుతోంది. ఉపనిషత్తులలోకెల్ల చాలచిన్నది ఇది ఒకటే. మొత్తము పండ్రెండు మంత్రాలు. కాని ఈ ఉపనిషత్తు చాల ప్రధానమైనదిగా ప్రసిద్ధి పొందింది. ప్రణవముయొక్క నాలుగు పాదములను వివరించి జీవాత్మ పరమాత్మ రెండూ ఒక్కటేయని ఈ ఉపనిషత్తు నిర్ధారిస్తోంది. కడపట ప్రపంచమంతయు లయించినపుడు కలిగే తురీయానుభవాన్ని శివం ఆద్వైతం- అని ఈ ఉపనిషత్తు పేర్కొంటోంది. శ్రీ శంకరభగవత్పాదుల గురువు గోవిందభగవత్పాదులు- వారి గురువు గౌడపాదాచార్యులు. వీరు మాండూక్యోపనిషత్కారిక- అని ఈ ఉపనిషత్తుపై తత్త్వ వివరణ వ్రాశారు. దానిపై భగవత్పాదులవారు భాష్యమొకటి వ్రాశారు. మాండూక్యమునకు తరువాతది తైత్తిరీయము. వైశంపాయనులకు వారి శిష్యుడైన యాజ్ఞవల్క్యులకు మనోభేద మేర్పడింది. నేను నీకు చెప్పిన వేదముల సన్నిటినీ కక్కివేయ వలసిందని ఆయన శిష్యుని కోరాడు. ఆయన అట్లే తాను నేర్చిన వేదములను వమనముచేసి, సూర్యభగవానుని ఆశ్రయించి, ఇదివరకు లోకములోలేని శుక్లయజుర్వేదాన్ని ఉపదేశము పొందారు. వారు కక్కివేసిన వేదములు మంత్రశక్తిచే అన్నరూపమున ఉండగా వైశం పాయనుల ఇతర శిష్యులు తిత్తిరి పక్షుల రూపంలో వమనంచేయబడిన వేదాలను గ్రహించినందున- ఆ వేదభాగమునకు కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ శాఖయని పేరు. తైత్తిరీయ శాఖలో నున్న సంహిత, బ్రాహ్మణము ఆరణ్యకము- అన్నిటికీ తైత్తిరీయమనే పేరు. తైత్తిరీయోపనిషత్తు తైత్తిరీయ ఆరణ్యకములోనిది. అన్ని ఉపనిషత్తులకంటే విస్తారముగా అధ్యయనము చేయబడే ఉపనిషత్తు తైత్తిరీయమే. కర్మానుష్ఠానములో ప్రచారమందున్న మంత్రప్రయోగాలు దీనినుండి గ్రహింపబడినవే. శీక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి- అని ఈ ఉపనిషత్తులో మూడు భాగములున్నవి. శీక్షావల్లిలో శిక్షనుగూర్చి- విద్యాభ్యాసమును గూర్చి చాల విషయములున్నవి. బ్రహ్మచర్యాశ్రమ నియమాలు దాని మహిమ, వేదాధ్యయన క్రమం, ప్రణవోపాసన మొదలైనవి ఈ భాగం ఉపదేశిస్తుంది. బ్రహ్మచారులు నిరభ్యంతరంగా తనవద్దకువచ్చి వేదాలను స్వీకరించవలయునని చేసే 'ఆవహంతీహోమ' ప్రస్తావన ఇందులోనిదే. ప్రస్తుత రాజకీయ రీతిలో మనము చెప్పు సామ్రాజ్యాన్ని మించిన, శాశ్వతమైన ఆత్మసామ్రాజ్యాన్ని గూర్చి దీనిలో చెప్పబడింది. సత్యంవద, ధర్మంచర అనే ఉపదేశములు శీక్షావల్లి లోనివే. వేదాధ్యయనాన్ని, స్వధర్మాన్ని ఏనాటికీ వదలరాదనీ, ఈ సంస్థ శాశ్వతంగా లోకంలో నుండాలనీ, పెళ్ళి చేసుకొని ప్రజావృద్ధికై ప్రయత్నపడుమనీ ఆచార్యుడు శిష్యునకు ఉపదేశిస్తున్నాడు. సత్య వద, ధర్మం చర, స్వాధ్యాయా న్మా ప్రమదః, ఆచార్యాయ ప్రియం ధన మాహృత్య ప్రజా తంతుం మా వ్యవచ్ఛేత్సీః, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలా న్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, దేవ పితృ కార్యాభ్యాం న ప్రమది తవ్యం మాతృదేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దోవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని, నో ఇతరాణి, యా న్యస్మత్‌గ్ నుచరితాని, తాని త్వయోపాస్యాని, నో ఇతరాణి, యే కే చాస్మ చ్ఛ్రేయాగ్‌సో బ్రాహ్మణాః, తేషాం త్వయా సనేన ప్రశ్వసితవ్యమ్, శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయమ్, శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్ అథ యది తే కర్మ విచికిత్సా వా, వృత్త విచికిత్సా వాస్యాత్, యే తత్ర బ్రాహ్మణా స్సమ్మర్శినః, యుక్తా ఆయుక్తాః, అలూక్షా ధర్మకామా స్స్యుః, యథా తే తత్ర వర్తేరన్, తథా తత్ర వర్తేథాః, అథా భ్యాఖ్యేతేషు, యే తత్ర బ్రాహ్మణా స్సమర్శినః, యుక్తా ఆయుక్తాః, అలూక్షా ధర్మకామా స్స్యుః యథా తే తేషు వర్తేరన్, తధా తేషు వర్తేథాః, ఏష ఆదేశః, ఏష ఉపదేశః, ఏషా వేదోపనిషత్- ఏత దనుశాసనమ్, ఏవ ముపాసితవ్యమ్, ఏవ ము చైత దుపాస్యమ్, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, తాని త్వయోపాస్యాని, విచికిత్సా వా స్యా త్తేషు వర్తేరన్ సప్తచ- అనునది శీక్షావల్లిలోని ఏకాదశానువాకం లోని ఉపదేశము. తరువాత ఆనందవల్లి, ¸°వనము, సాధుత్వము, వేదాధ్యయనము, పరిజనము, శరీరదార్ధ్యము, ధైర్యము, బలము- ఈ భూమి నేలునట్టి శక్తి, సంపూర్ణధనము- ఇవి గల ఒక మనుష్యుని ఆనందము మనుష్యానంద మని చెప్పబడుతుంది- అట్టి ఆనందమ్మునకు నూరింతలు మనుష్య గంథర్వానందము. దానికి నూరింతలు దేవ గంధర్వానందము. దేవ గంధర్వానందము కంటె నూరింతలు పితృదేవతల ఆనందము. వారి ఆనందము కంటె నూరురెట్లు దేవతల ఆనందము. దేవతల ఆనందము కంటె నూరు మడుగులు, దేవతల కథిపతియైన ఇంద్రుని ఆనందము. ఇంద్రుని ఆనందముకంటె నూరురెట్లు బృహస్పతియొక్క ఆనందము. బృహస్పతి ఆనందానికి నూరురెట్లు ప్రజాపతి ఆనందము. ప్రజాపతి ఆనందానికి నూరురెట్లు బ్రహ్మయొక్క ఆనందము. అన్నంతో వృద్ధిచెందేది అన్నమయ కోశము. దానిలో శ్వాసించుచున్నది ప్రాణమయకోశము. ఆలోచనల నుత్పాదించేది మనోమయకోశము. వానిలో మంచి చెడ్డలను గ్రహించేది విజ్ఞానమయకోశము. వీనికి ఆధారముగా నుండేది- ఐదవకోశము ఆనందమయకోశము. ఆనందమయ కోశములో స్వచ్ఛముగా విరాజిల్లేదే ఆత్మ. ఒక్కొక్క కోశమును పక్షితోపోల్చి, ఆ పక్షికి తల, ఇది వామ భాగము, ఇది దక్షిణభాగము (ఉత్తర పక్షము, దక్షిణ పక్షము) ఇది మధ్యభాగము, ఇది పృచ్ఛము అని తాత్త్వికంగా ఇందు వివరింపబడింది. 'యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందః బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచన' అనే మంత్రం కూడా ఆనందవల్లి లోనిదే. భృగువల్లి తైత్తిరీయంలో మూడవది. దీనిని వరుణ భాగవానుడు తన పుత్రుడైన భృగువునకు ఉపదేశించాడు. భృగు ర్వై వారుణిః. వరుణం పితర ముపససార. అధీహి భగవో బ్రహ్మేతి, తస్మాత్ ఏత త్ప్రోవాచ- అన్నం ప్రాణం చక్షు శ్శ్రోత్రం మనో వాచ మితి తాగ్‌ం హోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి, య త్ప్రయ స్త్యభి సంవిశంతి, త ద్విజ్ఞాసస్వ- త ద్బ్రహ్మేతి, స తపో తప్యత- స తప స్తప్త్వా- అని భృగువల్లిలో ప్రథమానువాకం ప్రారంభ మవుతుంది. భృగువు తండ్రియైన వరుణుని చూచి 'బ్రహ్మను గూర్చి నాకు చెప్పవలసినది' అని కోరాడు. శరీరము, ప్రాణము, చక్షుస్సు, శ్రోత్రము, మనస్సు, వాక్కు మొదలగునవి బ్రహ్మను తెలిసికోటానికి మార్గాలు. బ్రహ్మాది స్తంబ (తృణము) పర్యంతముగల భూతములు దేనియందుండి ఉద్భవించినవో, పుట్టి దేనిచే జీవించుచున్నవో, నశించినపుడు దేనియందు లయమగునో, అదియే బ్రహ్మ. అట్టి బ్రహ్మను ఎఱుగుటకు ప్రయత్నించు- అని తండ్రి చెప్పాడు. భృగువు సమాహిత చిత్తంతో ఆలోచింప పూనుకొన్నాడు. 'బ్రహ్మనుగూర్చి ఉపదేశింపుము'- అని తండ్రిని కుమారుడు కోరగా, గురువైన తండ్రి, అన్నిటిని- డిక్టేట్ Dictate చేయకుండా, కుమారుని స్వయముగా తపస్సుచేత (తన ఆలోచనే-) ఆలోచించి విచారించి క్రమక్రమముగా (stage by Stage) Experiment చేసి (పరిశోధన) స్వానుభవము చేత (Experience) తెలిసికొనునట్లు ప్రోత్సహిస్తాడు. భృగువు తపస్సుచేత మొదట బ్రహ్మ, అన్నమయ కోశ మనియు పిదప ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములను క్రమ క్రమముగా గడచి, కడపట ఆనంద స్వరూపుడైన ఆత్మనే పరమసత్యమని అనుభవం (తపస్సు) ద్వారా తెలిసికొన్నాడు. ఇట్లు చెప్పుచున్నందున, అన్నమయశరీరంతోనే నిలిచిపోయే అనుభవసిద్ధమైన (ఇహ) లోకజీవితాన్ని ఈ ఉపనిషత్తు నిరాకరిస్తున్నదని కాదు అర్ధము. ఈ లోకములో ఉంటూనే ఉత్తమ సత్యాన్ని మనము తెలిసికోవాలి- అని ఈ ఉపనిషత్తుయొక్క బోధ. దానిపై ఇహలోక జీవితాన్ని ధర్మమయము గావించుకొని తత్త్వాన్వేషణ కొఱకై పాటుపడాలి. నాలుగు కోశాలుదాటి ఆనందమయ కోశానికి చేరిన పిదప కూడా అన్నముయొక్క ప్రాధాన్యాన్ని, ఉపనిషత్తు- ఇట్లా వర్ణించింది. అన్నం న నింద్యాత్ త ద్వ్రతమ్- ప్రాణోవా అన్నమ్, శరీర మన్నాదమ్, ప్రాణ శరీరం ప్రతిష్ఠితమ్, శరీరే ప్రాణః ప్రతిష్ఠితః ఏత దేత దన్న మన్నే ప్రతిష్ఠి తమ్, స య ఏత దన్న మన్నే ప్రతిష్ఠితం. వేద ప్రతి తిష్ఠతి, అన్నవా నన్నాదో భవతి. మహా న్భవతి ప్రజయా పశుభి ర్బ్రహ్మవర్చసేన మహాన్కీర్త్యా. 'అన్నమును నిందింపరాదు. అది వ్రతము అని ఉపనిషత్తు ఉపదేశం చేస్తోంది. శరీరంలో ప్రాణం ప్రతిష్ఠితమై వున్నది కాబట్టి ప్రాణమే అన్నము. శరీరము అన్నాదము. అట్లే ప్రాణంమీద శరీరం ప్రతిష్ఠితమై (ఆధారపడి) వున్నది కాబట్టి శరీరం అన్నం. ప్రాణం అన్నాదము. ఇట్టి ప్రాణము శరీరమందును, శరీరము ప్రాణమునందును ప్రతిష్ఠితములై యున్నవి. ఒకదాని కొకటి ఆధారముగా నున్నవి. కాబట్టి అన్నము అన్నమునందు ప్రతిష్ఠితమై యున్నది. ఇట్లా వివేచన తెలిసికొన్నవాడు ప్రజలు పశువులు కీర్తి మొదలైన సంపదలు కలవాడగుచున్నాడు' అని యీ ఉపనిషత్తు ఉపదేశము చేస్తోంది. 'అన్నం న పరీక్షీత'- 'అన్నం బహు కుర్వీత' అను మంత్రములు అన్నముయొక్క ప్రాధాన్యాన్ని మరిమరి ఉద్ఘాటిస్తున్నవి. ప్రభుత్వంవారు కూడ Grow more food Compaign ద్వారా ఈ మంత్రములను మరింత ప్రచారం గావిస్తున్నారు! జ్ఞానియైన పిదప, ఈ క్రింది విధంగా గానంచేస్తాడు. ''అహ మన్న మహ మన్న మన్నమ్, అహ మన్నాదో హ మన్నాదః అహగ్గ్ శ్లోకకృ దహగ్గ్ శ్లోక, కృ దహగ్గ్ శ్లోకకృత్, అహ మస్మి ప్రధమజా ఋతా స్య, పూర్వం దేవేభ్యో అమృతస్య నా భాఇ, యో మా దదాతి స ఇ దేవ మా 3 వాః, అహ మన్న మన్న మదంత మా 3 ద్మి, అహం విశ్వం భువన మభ్యభవా 3 మ్, సువర్ణ జ్యోతీః య ఏవం వేద, ఇత్యుపనిషత్''- అని ఉపనిషత్తు ఉపసంహారం చేస్తోంది. ఐతరేయ కాండలోనిది. తరువాత ఐతరేయ- ఉపనిషత్తు. ఇది ఋగ్వేదము ఐతరేయ ఋషిమూలమున ఇది ప్రచారానికి వచ్చినందున దీనికి ఐతరేయోపనిషత్తు అని పేరు. జీవుడు ఎట్లా మాతృగర్భంలోపడి జన్మించి పుణ్యపాపకర్మలచేత మరల మరల జన్మిస్తూ నిర్వేదం చెంది, సంసార విచ్ఛేదకరమైన జ్ఞానంమూలంగా ఆత్మోపలబ్ధిని పొందుతాడో ఆ విషయాన్ని ఈ ఉపనిషత్తు వివరిస్తుంది- దీనికి వామదేవుడు ఋషి- 'నేను గర్బమందున్నపుడే సకల జన్మలను గూర్చి తెలిసికొన్నాను. దృఢములైన ఇనుప కోటలన్నీ దాటి ఆకాశంలో ఎగిరిపోయే గ్రద్దవలె తత్త్వజ్ఞానంవల్ల సంసారబంధాన్ని త్రెంచుకొని గర్భంనుండి వెలువడుతున్నాను' అని వామదేవుడు చెప్పినట్లు ఈ ఉపనిషత్తులో కలదు- దీనియందు ఆత్మను గూర్చిన అపరోక్షజ్ఞానానికి ప్రజ్ఞానమని పేరు. దాన్ని గూర్చి విశేషంగా ఇక్కడ చెప్పబడింది. ఆ జ్ఞానంచేత బ్రహ్మ పొందబడుచున్నాడు అని చెప్పుట సరికాదు. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్పుతూ ఐతరేయం ఉపసంహారం చేస్తుంది. ఈ ఋగ్వేదీయ మహావాక్యం- 'ప్రజ్ఞానం బ్రహ్మ'. దశోపనిషత్తులలో కడపటి రెండు ఉపనిషత్తులు ఛాందోగ్య బృహదారణ్యకములు. ఇవి పెద్దవి. మిగత ఎనిమిది ఉపనిషత్తులు కలిపినను వానికంటె ఈ రెండు ఉపనిషత్తులు పెద్దవి. ఛాందోగ్య 'ఉపనిషత్తు' సామవేదంలో ఛాందోగ్య బ్రాహ్మణంలోనిది. 'ఛందోగ' అనగా సామగానం చేసేవాడు. ఛందోగ అవస్థ- అనునదే- జెండావస్థా- Zend Avesths గా మారినది. ఇది పారశీకుల మతగ్రంథం. భగవద్గీతలో ఎట్లు కఠోపనిషత్తులోని మంత్రాలు విరివిగా ఉపయోగింపబడినవో అట్లే బ్రహ్మ సూత్రాలలో ఛాందోగ్య మంత్రాలు ఎక్కువగా వుదహరింపబడినవని చెప్పటంకద్దు. ఛాందోగ్య బృహదారణ్యకములందు ఋషి ప్రోక్తములైన అనేక- ఉపదేశాలున్నవి. ఛాందోగ్య ప్రథమప్రపాఠకం ఉద్గీధోపాసనంతో ప్రారంభమవుతుంది. ఉద్గీధమనగా ప్రణవము, ఓంకారము- పిదప అక్షివిద్య, ఆకాశవిద్య, మధువిద్య, శాండిల్యవిద్య, ప్రాణవిద్య, పంచాగ్నివిద్య, మొదలగు విద్యలను ఛాందోగ్యం వివరిస్తుంది. ఇవన్నీ పరమాత్మ తత్త్వాన్ని వివిధ మార్గాలలో తెలిసి కొనుటకు వుపయోగపడేవే. పరమాకాశరూపంగా విరాజిల్లే పరమాత్మకు మన హృదయాకాశాలలో దర్శించటమే దహరవిద్య. చిన్న చిన్న కథల రూపమున మహత్తరమైన తత్వోపదేశాలను చేయటం ఈ ఉపనిషత్తులోని విశేషం. బాహ్యదృష్టికి విచిత్రంగా కనపడే బ్రహ్మజ్ఞానియొక్క లక్షణం రైక్యుని కథ తెలుపుతుంది. తన గోత్రమేదో తెలియదని చెప్పిన జాబాలుడను వటువుయొక్క సత్యసంధతను మెచ్చుకొని, గౌతముడు 'నీవు బ్రాహ్మణుడవే' యని శిష్యునిగా స్వీకరించిన సత్యకామ జాబాలుని కథ ఛాందోగ్యం లోనిదే. సత్యకామునికి తత్త్వోపదేశం చేయుటకుముందు, గురువు గౌతముడు అతనిని తీవ్ర పరిశోధనలకు గురి చేస్తాడు. సత్యకాముని పక్షమున, గురుపత్నియే జాలివహించి మాట్లాడుతుంది. ప్రాచీన గురుకులవాస దృశ్యం మన కళ్ళముందు కనపడునట్లు ఈ కథలు చిత్రించును. సత్యకాముడెంత వినమ్రుడో అతనికి చుక్కెదురు విద్యాగర్వ భూయిష్ఠుడైన శ్వేతకేతు. తండియైన వుద్దాలక అరుణి, అతనికి వినయాన్ని ఉపదేశించి, జీవ బ్రహ్మైకాన్ని గూర్చి చెప్పు సామవేదీయం- 'తత్త్వ మసి' అనే మహాకావ్యాన్ని బోధిస్తాడు. ఈ కథకూడా ఛాందోగ్యంలోనిదే. శ్వేతకేతువువలె కాక సకలవిద్యలు నేర్చి కూడా ఆత్మజ్ఞానం తనకు లభించలేదే అని పరితపిస్తున్న నారద మహర్షికి సనత్కుమారు లుపదేశించిన సన్నివేశమూ ఈ ఉపనిషత్తులోనిదే. తైత్తిరీయము అన్న మయకోశ విచారము మొదలుకొని ఆనందమయకోశం వరకు విచారణచేసి తత్త్వోపదేశం చేసిన విధంగా, ఛాందోగ్యం ఆహారశుద్ధితో ప్రారంభించి అంతఃకరణశుద్ధి వరకు బోధించి అంతఃకరణశుద్ధి ద్వారా ఆత్మానందం కలుగుతుందని బోధిస్తుంది. 'ఆహార శుద్ధౌ సత్వశుద్ధి స్సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిః- స్మృతిలంభే సర్వగ్రంధీనాం విమోక్షః తసై#్మ మృదితకషాయాయ తమసః పారం దర్శయతి'- అని సనత్కుమారుడు నారదునకు వుపదేశిస్తాడు. ఉపదేశమొక్కటే. ఐనా, శిష్యులు, వారివారి బుద్ధిపక్వతల ననుసరించి ప్రయోజనం పొందుతారన్న విషయన్ని మరొకకథ చెప్పుతున్నది. దేవతలకు ప్రభువైన ఇంద్రునికి, అసురులకు ప్రభువైన విరోచనునకు, 'నేత్రంలో ఏ పురుషుడు కనపడుతున్నాడో అతడే ఆత్మ అదియే అమృతవస్తువు; అభయవస్తువు బ్రహ్మ' అని ప్రజాపతి వుపదేశిస్తాడు. ఇంద్రియాలకు జ్ఞానమునకు- పిదప వానికి ఆధారముగా నున్న ఆత్మను, పరోక్షంగా ప్రజాపతి ఉపదేశిస్తాడు. కాని దానిని వారు సరిగా గ్రహించలేదు. జలములో నఖకేశ పర్యంతం సర్వావయములతో ప్రతిఫలించిన తమ దేహముయొక్క ప్రతిబింబాన్ని చూచి ఆ దేహమే ఆత్మ యనుకొని వారు వెళ్ళిపోయారు. శరీరమే ఆత్మయని విరోచనుడు తీర్మానించుకొన్నాడు. విరోచనుని సిద్ధాంతము నుండి నాస్తికమతం లోకాయతము (Materialism) ప్రారంభ##మైనది. ఇది అసురుల లక్షణం- ఇంద్రుడున్నూ మొదట ఇట్లే తప్పు అభిప్రాయంతో ఉన్నా, వివేకంతో విచారించి క్రమక్రమంగా, స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి తురీయమే ఆత్మ యని తెలుసుకొంటాడు. బృహత్ అనగా పెద్దది. బృహదారణ్యకము అన్నిటికంటే పెద్దది. సాధారణంగా ఉపనిషత్తు, ఆరణ్యకమునకు చివర ఉంటుంది. దీనికి విరుద్ధంగా శుక్లయజుస్ సంహితలోనే చివరవున్నది ఈశావా స్యోపనిషత్తు. ఆ శుక్లయజస్సులోనే- పూర్తిగ ఒక ఆరణ్యకమే- (ఆరణ్యకాంతమున గాక పూర్తిగా ఆరణ్యకమే) ఉపనిషద్భాగముగా వున్నది కాబట్టి బృహదారణ్యక మని పేరు- బృహదారణ్యకంలో రెండు పాఠాలున్నవి. ఒకటి మాధ్యందిన శాఖకు చేరినది. రెండవది కాణ్వశాఖకు సంబంధించినది. భగవత్పాదులు కాణ్వశాఖకు చెందిన పాఠమునకే భాష్యం వ్రాశారు. దీనిలో మొత్తం ఆరు అధ్యాయాలున్నవి. మొదటి రెండు అధ్యాయాలకు మధుకాండ మని పేరు- పిదప రెండు అధ్యాయములకు యాజ్ఞవల్క్యుల పేరట మునికాండమని పేరు. కడపటి రెండు అధ్యాయములకు ఖలకాండమని పేరు. మధువంటే ఆనందరసము అని అర్థం చేసుకోవచ్చు. 'సమస్తము పరమాత్మ స్వరూపము' అని తెలుసుకొన్నవారికి, లోకమంతా మథుమయంగా భాసిస్తుంది. జీవిలున్నూ లోకదృష్టిలో మధుస్వరూపులుగానే వుండిపోతారు. ఆత్మ అన్నిటికినీ మధువు. ఈ విషయాన్ని మధుకాండ చెప్పుతోంది. తరువాత ఈ ఉపనిషత్తులోనే మనకు తెలిసిన దేదియు ఆత్మకాదు- నేతి నేతి- (న ఇతి- ఇది కాదు)- దానిని ఫలానా అని చెప్పలేము- ప్రపంచము, శరీరము, మనస్సు అన్నిటిని నిరాకరించి వర్ణనాతీతమైన ఆత్మానుభూతిని పొందిన వారికి వ్యవహారకాలంలో కనుపించే లొకము జీవులు- అంతా మధుమయమై ఆత్మకంటె అభిన్నంగా అనుభవగోచరమగునని చెప్పబడింది. అసతో మా సద్గమయ- తమసో మా జ్యోతి ర్గమయ మృత్యో న్మా అమృతం గమయ- అనే మంత్రం బృహదారణ్యకం లోనిదే. అజాతశత్రువు వను క్షత్రియునొద్ద గార్గి యనే (బాలకి) వుపదేశం పొందిన విషయమీ ఉపనిషత్తులో చెప్పబడింది. అజాతశత్రువు, జనకుడు మొదలైన రాజులు బ్రహ్మజ్ఞానులై విలసిల్లినట్లు ఈ ఉపనిషత్తు ద్వారా తెలుస్తోంది. ఇదేవిధంగా స్త్రీలున్నూ రాజసదస్సులో ఋషులతో సమానంగా ప్రశ్నలడిగి వాదప్రతివాదాలలో పాల్గొనినట్లుగూడా మనకు ఈ ఉపనిషత్తు మూలంగా తెలుస్తుంది. అట్టి బ్రహ్మవిచారం సలిపిన స్త్రీలకు బ్రహ్మవాదినులని పేరు. ఇట్టి బ్రహ్మవాదినులలో ఒకతె గార్గి. ఆమె జనకుని విద్వత్సభలో పాల్గొన్నది. యాజ్ఞవల్క్యునికి ఇరువురు భార్యలు. కాత్యాయని సాధారణ స్త్రీ. మైత్రేయ బ్రహ్మవాదిని. యాజ్ఞవల్క్యుడు సన్యాసాశ్రమం స్వీకరించుటకు నిశ్చయించి తనకున్న ధనాన్ని ఇరువురికి సమానంగా పంచి ఇస్తానని అంటాడు. అపుడు 'అమృతత్వమునకు సాధనము కాని ధనము నాకేల? దేనిచే అమృతత్వసిద్ధి కలుగునో దానినిండు' అని మైత్రేయి యాజ్ఞవల్క్యుని అడుగుతుంది. మైత్రేయికి యాజ్ఞవల్క్యుడు చేసిన బొధ మధుకాండలోనూ, మునికాండంలోనూ కొంచెం కొంచెం వ్యత్యాసంతో కనపడుతుంది. ఈ కథ ఎంతో రమణీయంగా చిత్రించబడింది. యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఇట్లా చెప్పుతాడు. న వా అరే పత్యుః కామాయ పతిః ప్రియో భవ త్యాత్మన స్తు కామాయ పతిః ప్రియో భవతి; న వా అరే జాయాయై కామయ జాయా ప్రియా భవ త్యాత్మన స్తు కామాయ జాయా ప్రియా భవతి; న వా అరే పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియా భవన్త్యాత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి. న వా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవ త్యాత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. నవా అరే పశునాం కామాయ పశవః ప్రియా భవ న్త్యా త్మనస్తు కామాయ పశవః ప్రియా భవన్తి. నవా అరే బ్రహ్మణః కామాయ బ్రహ్మ ప్రియం భవ త్యాత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. నవా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవ త్యాత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి. నవా అరే లోకానాం కామాయ లోకాః ప్రియా భవ న్త్యాత్మనస్తు కామాయ లోకాః ప్రియా భవంతి. నవా అరే దేహానాం కామాయ దేవాః ప్రియా భవ న్త్యాత్మనస్తు కామాయ దేవాః ప్రియా భవంతి. నవా అరే వేదానాం కామాయ వేదాః ప్రియా భవ న్త్యాత్మనస్తు కామాయ వేదాః ప్రియా భవన్తి. నవా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంతి ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవన్తి. నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవ త్యాత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మన్తవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రే య్యాత్మని ఖలు అరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాత ఇదగ్‌ం సర్వం విదితమ్ || మైత్రేయీ! నీవు ఎప్పుడూ నాకు ప్రియమైన దానివే. ఇప్పుడు ఇట్టి ప్రశ్న అడిగినందువల్ల మరింత ప్రియాధికవైనావు. పతి యందు పత్నికున్న ప్రీతి, పతికి పత్నియందున్న ప్రీతి ఇట్లే, పుత్రులు, ధనము, బ్రహ్మణులు, క్షత్రియులు, లోకులు, దేవతలు, భూతములు- సమస్త విషయములందు మనకున్న ప్రీతి అంతా, సర్వము ఆత్మప్రీతి కొఱకే గాని వేరుకాదు. ఆత్మకు సంతోషం కలిగించే వస్తువులమీద ప్రేమ ఏర్పడుతోంది కాని ఇతర వస్తువులమీద ఏర్పడుట లేదు కదా! అందుచే ఆత్మయే ప్రేమస్వరూపంగా, ఆనంద స్వరూపంగానూ ఉన్నదనే విషయం రూఢి యవుతోంది. అట్టి ఆత్మను తెలుసుకోటానికేకదా ప్రియమైన వస్తువుల నన్నిటినీ త్యాగంచేసి ఒక వ్యక్తి సన్యసిస్తున్నాడు? ఆత్మానుభూతియే కలిగితే, ఆత్మకంటె భిన్నమైనది ఏదియులేదని తెలిసిపోతుంది. సమస్తము మనకు ప్రియమే అవుతుంది. మొదట కొన్ని కొన్ని వస్తువులపై ప్రీతి జనించటంచేత ఇతరములపై అనిచ్ఛయో ద్వేషమో కలుగుతోంది. అన్నిటినీ ఆత్మగనే మనము భావించి తెలిసికొంటే దేనిపైననూ ద్వేషము లేక అన్నియూ ప్రియము కూర్చేవే అవుతవి. 'యత్ర హి ద్వైత మివ భవతి తదితర ఇతరం వశ్యతి. తదితర ఇతరం జిఘ్రతి, తదితర ఇతరగ్‌ం రసయతే, తదితర ఇతర మభివదతి తదితర ఇతరగ్‌ం శృణోతి. తదితర ఇతరం మనుతే తదితర ఇతరం స్పృశతి. తదితర ఇతరం నిజానీతి యత్ర త్వస్య సర్వ మాత్మైవా భూత్తత్కేన కం పశ్యేత్ కేన కం జిఘే త్తత్కేన కం రసయేత్తత్కేనకమభివదేత్ కేన కం శృణుయాత్ తత్ కేన కం మన్వీత త త్కేన కం స్పృశేత్ త త్కేన కం విజానీయాత్, యే నేదగ్ సర్వం విజానాతి తం కేన విజానీయాత్ - - - - విజ్ఞాతార మరే కేన విజానీయా దితి' అని యాజ్ఞవల్క్యులు మైత్రేయికి ఉపదేశం చేశారు. యాజ్ఞ వల్క్యులు సన్యాసం తీసుకోటానికి ముందు జనకుని సభలో పరమాత్మ తత్త్వాన్ని గూర్చి కహోళుడు, ఉద్దాలక అరుణి, గార్గి మొదలైన వారితో చేసిన వాదములను, తర్వాత జనకునికి చేసిన ఉపదేశములును మునికాండలోనున్నవి. విశిష్ఠాద్వైతమతంలో విశేషముగా చెప్పబడు అంతర్యామి విషయమునకు ఆధారము. ఉద్దాలక అరుణికి యాజ్ఞవల్క్యులు చేసిన ఉపదేశంలో వున్నది. లోకమంతా మాయ (బ్రహ్మ సత్యం; జగ న్మిథ్యా) అని అద్వైతం చెప్పగా, విశిష్టాద్వైతము- లోకము, శరీరము అన్నిటికీ ప్రాణముగా పరమాత్మలోపల అంతర్యామిగా నున్నాడని చెప్పుతుంది- ఒకచోట దీనిని యాజ్ఞవల్క్యులు ఒప్పుకొని మాట్లాడినా, మిగతా సమయాలలో పూర్ణముగా అద్వైత పరంగానే వాదించారు. మైత్రేయికి ఉపదేశించు సమయంలో కడపట- 'యత్ర హి ద్వైత మివ భవతి తదితర ఇతరం పశ్యతి'- అని చెప్పుతాడు. ఎచ్చట ద్వైతంగా కనబడుచున్నదో, భేదం భాసించే ఆ సమయంలోనే ఇతరుడు, ఇతర వస్తువును చూస్తున్నాడు, వింటున్నాడు, మూర్కొంటున్నాడు, మాట్లాడుచున్నాడు, తలచుచున్నాడు, తెలిసికొనుచున్నాడు- అని ఈ విధంగా వ్యవహారం ఏర్పడుచున్నది. కాని తాను 'ఆత్మ' అని అనుభవంలో తెలిసికొన్నపుడు ఇవి ఏవి వుండవు. అద్వైతజ్ఞానం కలిగి సర్వం ఆత్మస్వరూపంగా భాసించే సమయంలో ఎవడు దేనిచే దేనిని చూస్తాడు? వింటాడు, మూర్కొంటాడు, మాటలాడుతాడు, తలుస్తాడు, తెలిసికొంటాడు? అపుడు చూచేవాడు, చూడబడేవస్తువు ఏదియులేదు. సర్వమూ ఏకమైపోతుంది- అని చెప్పువాడు. మఱియు- ''సలిల ఏకో ద్రష్టా ద్వైతో భవ త్యేష బ్రహ్మ లోక సమ్రా డితి హైన మనుశశాస యాజ్ఞవల్క్య ఏషా స్య పరమా గతి రేషాన్య పరమా సంప దేషో స్య పరమో లోక ఏషో స్య పరమ ఆనంద ఏతసై#్య వానంద స్యాన్యాని భూతాని మాత్రా ముపజీవంతి- (4-3-32) అవిద్య నశించి జలమువలె స్వచ్ఛమై ద్రష్టమై అద్వైతియై (ద్వైతభావంలేనివాడై) జీవుడు స్వయంజ్యోతి స్వభావుడైన పరమాత్మతో కలసి ఏకమై ఉన్నాడు. అదే జీవునికి ఉత్తమగతి. అదే పరమ సంపద. పరమానందము. ఈ ఆనందమునందొక ఆంశమును మాత్రం ఆధారంగా చేసి కొన్ని అన్ని భూతములు జీవించుచున్నవి. త దేష శ్లోకో భవతి, త దేవసక్త స్సహ కర్మణౖతి, ఆజ్గం మనో యత్ర నిషక్త మన్య ప్రాప్యాస్తం కర్మణ స్తన్య యత్కించ కరో త్యయమ్, తస్మా ల్లోకా త్పున రేత్యసై#్మ లోకాయ కర్మణ ఇతి సుకమయ మానో థాకమయమానో యో కామో నిష్కామ ఆప్తకామ ఆప్తకామః న తస్య ప్రాణా ఉత్కామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మప్యేతి. (4-4-6) జీవుడు ఆశ##చేత కట్టుపడి, ఆ కర్మలతో గూడిన లక్షణములు కలవాడగుచున్నాడు. దేనియందు కోరిక కలదో ఆ మనోలక్షణము కలవాడగుచున్నాడు. కామము లేనివానికి జన్మములేదు. క్రియలేదు. వాడు మోక్ష మందుచున్నాడు. వాడు అకాముడు- నిష్కాముడు- ఆప్తకాముడు- (సమస్త కామములను బొందినవాడు). ఆత్మకాముడు (ఆత్మకంటే వేరు కామములు లేనివాడు)- అట్టి వాని ప్రాణములు ఊర్ధ్వముగా పోవుటలేదు; ఇచ్చటనే బ్రహ్మస్వరూపుడై బ్రహ్మను పొందుచున్నాడు- అని యాజ్ఞవల్క్యులు జనకునికి ఉపదేశము గావించారు. ఈ ఉపనిషత్తుయొక్క కడపటి భాగము ఖలకాండము. ఒక వస్తువు శిథిలమై పోయినచో దానిని ఖలమని అంటారు. శిథిలము గాక పూర్ణముగా ఉండేది-అఖిలము. శిథిలములై వికీర్ణములైన పలు ఉపదేశములు ఒకచోట చేరి నందున ఈ భాగమునకు ఖిలకాండ మనిపేరు. సాధకుల తారతమ్యముల ననుసరించి ఒకే ఉపదేశాన్ని మూడు విధములుగా గ్రహించే కథ ఖిలకాండలో వున్నది. ప్రజాపతి పుత్రులు మూడు తెగలు; దేవతలు మనుష్యులు రాక్షసులు. వీరు మువ్వురు తండ్రిని గురువుగా వరించి ఉపదేశింపుడని వేడుకొన్నారు. ప్రజాపతి 'ద' అను ఏకాక్షరమొకటి ఉపదేశించాడు. దీని అర్థమేమో తెలియునా? అని ప్రజాపతి దేవతల నడిగాడు. స్వభావముచే మేము అదాంతులము ( ఇంద్రియా నిగ్రహము లేనివారు) కనుక- 'దామ్యత' - దాంతులై ఉండుడు అని మీరు ఉపదేశించారు అని దేవతలన్నారు. పిదప ప్రజాపతి 'ద' అనగా మీరేమి గ్రహించారు? అని మనుష్యులను అడిగాడు. ''స్వభావ ముచేత మేము లుబ్ధులము. ఆశ గలిగిన వారము, కూడబెట్టుకొను వారము. అందుచే 'దత్త'- దానము చేయుడు అని మీరు ఉపదేశించారు'' అని మనుష్యులు ప్రజాపతితో చెప్పారు. కడపట ప్రజాపతి 'ద' అను అక్షరమునుండి మీరేమి గ్రహించితిరి అని అసురులను అడిగాడు. 'స్వభావము చేతనే మీరు క్రూరులై యున్నారు. కాన ప్రాణులయెడ దయ కలిగియుండుడు- 'దయధ్వం'- అని మీరు బోధ చేశారు' అని అసురులన్నారు. మేఘము- ఈ దైవీవాక్కునే- ద ద ద యని ఘోషిస్తున్నది. త దేత దేవైషా దైవీ వా గనువదతి స్తనయిత్ను ర్దదద ఇతి దామత్య దత్త దయధ్వం- ఇతి త దేత త్త్రయగ్‌ం శిక్షే ద్దమం దానం దయా మితి. దేవతలకు దమము, మనుష్యులకు దానము, అసురులకు దయ చెప్పబడినను, మనుష్యులు ఈ మూటిని అనుష్ఠించాలి- అని శ్రుతి తాత్పర్యము. మైత్రీం భజత అఖిలహృ జ్జేత్రీం ఆత్మవ దేవ పరా నపి వశ్యత్ యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమ మాక్రమణం జననీ పృథివీ కామదుఘా స్తే జనకో దేవః సకల దయాళుః దామ్యత దత్త దయధ్వం జనతాః శ్రేయో భూయత్ సకల జనానామ్ బృహదారణ్యకమునందు కడపటవచ్చు మంత్రమొకటి నాకు చాల ప్రియమైనది. 'ఏత ద్వై పరమం తపో య ద్వ్యాహిత స్తప్యతే పరమగ్‌ం హైవ లోకం జయతి య ఏవం వేదైత ద్వై పరమం తపో యం ప్రేత మరణ్యగ్‌ం హర్తని పరమగ్‌ం హైవ లోకం జయతి య ఏవం వేదైత ద్వై పరమం తపో యం ప్రేత మగ్నా వభ్యాదధతి పరమగ్‌ం హైవ లోకం జయతి య ఏవం వేద' వ్యాథిగ్రస్తుడొకడు జ్వరతాపంతో తపన చెందుటకూడ ఒక పెద్ద తపస్సుగా భావనచేయాలి. ఇట్లు ఎవడు జ్వరాది దుఃఖములను సహించుకొని తాను ఆచరించవలసిన తపస్సుగా భావించి యుండునో అట్టివాని జ్ఞానముచేత అతని పాపములన్నియు నశించి వానిని ఉత్తమలోకాన్ని పొందునట్లు చేయుచున్నది- తాను గతించిన పిదప ప్రేతమును శ్మశానమునకు తీసికొనిపోయి అగ్నిసంస్కారం చేయుదురని గ్రహించి మరణవిషయమై వ్యసనం చెందక యుండునో వాడు ఉత్తమలోకాన్ని పొందుతాడు. తపస్సు వ్రతములు మొదలగు వానిని ఆచరించుటవల్ల శరీరాభిమానం తొలగుటయే కాక మన పూర్వ పాపములన్నీ నశించుచున్నవి. పర్వార్జిత పాపఫలములకు ప్రాయశ్చిత్తమే తపస్సు. దేహంచేత మనం పాపం చేసినందువల్ల ఆ దేహ శోషణరూపంగా చేసే తపస్సు దానికి ప్రాయశ్చిత్తమవుతుంది. అందుచేతనే మహాత్ములు కూడ తపమాచరించినట్లు పురాణములందు చెప్పబడింది. సాక్షాత్ జగన్మాతయైన అంబికయే పరమేశ్వరుని ఆజ్ఞోల్లంఘన కారణంగా (దక్ష ప్రజాపతి చేయు యజ్ఞమునకు ఈశ్వరుడు పోవలదని చెప్పినను ఆయన ఆజ్ఞమీరి సతీదేవి పోయినందున) యోగాగ్నిలో శరీరత్యాగం చేసి, మరుసటి పుట్టుకలో హిమవంతునికి హైమవతిగ పుట్టి ఈశ్వరునే వరించి పతిలాభమునకై కఠోరవ్రతమాచరించినట్లు కాళిదాసు కుమారసంభవమున మనోహరంగా వర్ణించియున్నాడు. ''శుచౌ చతుర్ణాం జ్వలతాం హవిర్భుజాం శుచిస్మితా మధ్యగతా సుమధ్యమా విజిత్య నేత్రప్రతిఘాతినీం ప్రభామనస్య దృష్టి స్సవితాం మైక్షత'' నికామ తప్తా వివిధేన వహ్నానా నభశ్చరే ణస్థన సంభృతేన సా తాపాత్యయే వారిఛి రుక్షితా నవై ర్భువా సహోష్మాణ మముంచ దూర్ధ్వగమ్ శిలాశయాం తా మనికేతవాసినీం నిరంతరా స్వస్తర వాత వృష్టిషు వ్యలోకయ న్నున్మిషితై స్తటిన్మయై ర్మహ తపస్సాక్ష్య ఇవ స్థితాః క్షపాః మృణాళికా పేలవ మేవ మాగిభి ర్వ్రతైః స్వ మంగం గ్లపయ న్త్యహర్నిశమ్ తపశ్శరీరైః కరిణౖ రుపార్జితం తపస్వినాం దూర మధ శ్చ కార సా విశదమందహాసయు, సుమధ్యయు అగు పార్వతి ఎండకాలమున నాలుగు దిక్కులయందు అగ్నుల నుంచుకొని ఐదవ అగ్నిగా విలసిల్లు సూర్యుని నిష్చలదృష్టితో చూచుచు సూర్యతేజమును ఓర్చి పంచాగ్ని మథ్యమున తపస్సొనరించెను. పంచాగ్నుల మధ్య తపము చేసిన ఆ దేవి దేహమునుండియు తపింపబడిన భూమినుండియు తొలకరివానచే ఆవిరి పైకి లేచెను. (తపస్సుచేత దేవి దేహము తపింతినది; గ్రీష్మాదిత్యుని చేత భూమి క్రాగినది.) తెరపిలేని గాలివానలయందు బట్టబయట బండమీద పార్వతి పండుకొని యుండగా రాత్రులు మెఱపులనే చూపులతో ఆమె తపస్సునకు సాక్షులై చూచుచుండెను. తామరతూడువలె సుకుమార దేహముకల పార్వతియొక్క తపస్సు కఠినదేహముకల మునుల తపస్సును మించెను. ఇట్లు కఠినమైన తపస్సును మహాత్ములనేకులు చేసినట్లు పురాణములవల్ల మనకు తెలుస్తున్నది. ప్రస్తుతం మన విషయం చూద్దాం. మనము చేసే తప్పులకు, పరాధములకు, అపచారములకు లెక్కలేదు. కానీ పూర్వకాలపు మహాత్ములు చేసిన తపస్సులో కోటిభాగమైనను మనము చేయకలుగుచున్నామా? అట్లు చేయవలెనని మనకు మనస్సేకాదు శక్తియూ లేదు. మరి మన పాపములు తొలగుట ఎట్లు? ఇట్లు చింతించునపుడు బృహదారణ్యకములోని పై మంత్రము మనకు ఊరట కల్గించుచు, పరమ ఆశ్వాసకరముగ నున్నది. మన జీవితములు సక్రమముగా లేనందును ఆధివ్యాధులెప్పుడూ సహచరులై మన వెంటనే తిరుగుచున్నవి. ఈ వ్యాధులూ, బాధలూ, విచారములే మనకు తపస్సు అని దృఢభావన ఉంటే తపస్సుచేత కలుగు పాపక్షాళనమూ దానివలన కలుగు మోక్షప్రాప్తియు లభించునని ఉపదేశిస్తూ పై మంత్రం ప్రోత్సాహకరంగా నున్నది. మంత్రార్ధము నేను చెప్పినంత విశదహంగా (Plain) లేకున్ననూ దాని తాత్పర్యమదియే. జ్వరము వచ్చినపుడు మన దేహోష్ణత 100 మొదలు 105 లేదా 106 డిగ్రీల దాకా వెళ్ళుచున్నది. తపన, తాపము- అను శబ్దములన్నీ 'తప' అను ధాతువు నుండి వచ్చినవే. సూర్యుడు ఉష్ణకిరణుడు. వానికి తపసుడని పేరు. అందుచేత శాస్త్రములందు కన్పించు పంచాగ్నిమధ్య తపస్సు చేయకపోయినా జ్వరములో కలుగు తాపమును ఓర్చుకొనుట అనెడు తపస్సును మనముచేయవచ్చు. మన పాపక్షాళన కోసమే జ్వరమును ఈశ్వరుడు ప్రసాదించినాడు అని భావించుకోవాలి. మలేరియా జ్వరములో ఎన్ని కంబళములు కప్పుకొన్నను, చలి ఉపశమించదు. అనగా అంతటి శైత్య మన్నమాట. శీతకాలమున నీటిలో నిలబడి చేసిన మహాత్ముల తపస్సును భావించుకొని ఈ మలేరియా ఆ తపస్సును బోలినది అని మన మనుకోవాలి. ఇట్లు మనకు వచ్చు వ్యాధులు, విపత్తులు, ప్రమాదములు అన్నీ భగవత్ప్రసాదములనీ, మనము చేయవలసిన తపశ్చర్యకు ప్రతీకములనీ భావించుకోవాలి. మనము స్వయంగా తపస్సు చేయకపోయినా, భగవంతుడు ఈ రూపంగా మనచేత తపస్సు చేయిస్తున్నాడు అని అనుకోవాలి. కాలక్రమమున ఈ మనోభావం రూఢ మవుతుంది. దీనిచేత మనకు సహనశక్తి వృద్ధి యవుతుంది. తితిక్ష అలవడుతుంది. అప్పుడు ఏ చిన్నవ్యాధి వచ్చినా డాక్టరువద్దకు పరుగిడు అలవాటు తగ్గుతుంది. దీనివల్ల డబ్బు మిగులుట, తపశ్చర్య రెండూ ఒక్కపట్టున మనకు సిద్ధించగలవు. దీని నంతటినీ ఉపనిషన్మంత్రము సూక్ష్మంగా- సంక్షేమంగా- చెప్పివేసింది. దశోపనిషత్తులను ముగించు సమయమున- బృహదారణ్యకమునందు కడపటి అధ్యాయమున కర్మ కాండకు వేదాంతమునకు విరోధమే లేదను విధముగా నొక్కి చెప్పునట్లు- పంచాగ్నివిద్యయు, సుప్రజాకాములైన గృహస్థు లనుష్ఠించవలసిన కర్మలనూ ఉపనిషత్తు వివరించింది. ఓమ్‌పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మే వావశిష్యతే.