Maa Swami
Chapters
6. చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వైయమః ''శ్రీ బులుసు సూర్యప్రకాశం'' ఉన్నట్టుండి ఊళ్ళో అలజడి బయలుదేరింది. స్వాములవారు వస్తున్నారని వారిరాకతో ఈపల్లె కూడ పావన మౌతుందనీ, స్వాములవారి దివ్యత్వ, మహత్వ, జగద్గురుత్వాదుల ప్రశంస పెద్దల నోళ్ళలో చిలువలు పలువలు పెంచుకొంటోంది. కాని షోడశవర్గీయులైన బాలబృందానికి ఇది ఏమీ పట్టలేదు. వారి ఉత్సాహకారణం వేరు. ఏనుగులు వస్తాయని, గుర్రాలు వస్తాయని, దంతపుపల్లకీ, కపిలగోపూ వస్తున్నదనీ, అన్నిటినీమించి, అన్నపానాలను కూడ మరపింప చేస్తున్నది ఏనుగు ఒక్కటే. అమ్మమ్మతో వెళ్ళి స్వాములవారినీ, ఏనుగునూ పొరుగూరిలో చూచివచ్చినా డొకడు. వాడు గజరాజ కథకధనవేళలో గద్దె ఎక్కి కూచుంటున్నాడు.గజాన్ని గూర్చిన జ్ఞానంలో వాడొక్కడే విజ్ఞుడు. తక్కిన వారందరూ అజ్ఞులే. ఏనుగు ఆకారాన్నీ కరిమింగిన వెలగపండునూ వాడు చెప్పుతుంటే బాలమండలి శ్రవణపర్వంగా వింటోంది. కాలం గడిచేకొద్దీ ఆతురత పెరుగుతున్నది. ఆతురతతో బాటు కబుర్లు. అమలాపురం వంతెన మీద ఏనుగు కాలువేసి ఊపిందట. వంతెన ఊగిపోతే కాలువలోదిగి ఏనుగు వెళ్ళిందట. ఇంకేం స్వాములవారు వస్తున్నారు. అంతటితో బాలబృందం తూము దగ్గరకు పరుగెత్తి అక్కడ నిరీక్షించసాగారు. ఒకరోజు అదృష్టం పండింది. నిజంగానే స్వాములవారు వేంచేశారు. వారి రాక రాత్రి ఎప్పుడో జరిగింది. ఉదయం బాలబృందం విన్నది. ఊరంతా స్వామి దర్శనంకోసం పరుగిడితే, బాలబృందం ఏనుగును దర్శించడానికి వెంకన్నగారి తోటలోని వెలగచెట్టుక్రింద చేరింది. చూడటం చూడటంతో బ్రహ్మానుభావమే కల్గింది వారికి- స్వామి సహచర్యంతో, ఏనుగుకూడ బ్రహ్మానందం పంచిపెట్టడంలో శ్రీవారికి తీసిపోనట్లు నిరూపించుకొంది. మా గ్రామం పల్లెటూరు. కోమానుపల్లె- వయా మామిడివరం- అమలాపురం తాలూకా, 1935 సం. మట్టిరోడ్లూ, తాటాకుల ఇళ్ళు, కొబ్బరితోటలు, చెరువు నీళ్ళు, వేదాధ్యయనం, శాస్త్రచర్చ, పురాణపఠనం, అతిధిసత్కారం, ఆచారనిష్ఠ- ఇవి తప్ప అన్యలోకం ఆ ఊరు ఎరుగదు. స్వామిరాక ఆ ఊరికి ప్రాచీగర్భంలో సూర్యోదయమే అయింది. స్వామివారి పరిచారక వర్గానికి ఊరివారి వీధి అరుగులు విడుదలయినాయి. సంపన్నులు స్వామికి భిక్షావందంనం చేసి కృతకృత్యులైనారు. ఊరికి రెండుమైళ్ళలో ఉన్న ఉత్తరవాహినిలో స్వామి అరుణోదయానికి పూర్వమే స్నానంచేసి ఊళ్ళోకి విజయం చేసినది ఈనాటికీ యథాతథంగా గుర్తున్నది. వేదవేత్తలు పల్లకిముందు పాదచారులై స్వస్తిచెప్పగా, పల్లకిలో కాషాయానికి కూడ అరుణ్యాన్ని ప్రసాదించే దేహకాంతితో, సుందర దరహాసంతో, పక్షాంచలాలలో పరమకారుణికతను వెలయింప చేస్తూ మూర్తీభవించిన బ్రహ్మవర్చస్సు వలె స్వామి వచ్చినారు. ఊరంతా రెండుపాయలై వారి దివ్యదర్శనంకోసం ముకుళిత కరకమలమై నిలిచింది. పిమ్మట, భిక్షకై ఆహ్వానించిన గేస్తు ఇంటిలో స్వాములవారు దేవీపూజ చేసేవారు. పూజకు ఊరంతా వచ్చేది. గోపూజ, గజపూజ కూడ స్వాములవారు చేసేవారు. నాటికి నాకు ఆరేళ్ళు, చాల సంతానంపోయి, నేను దక్కినాను. నా జాతకంలోనూ, బాలారిష్టాలకు కొదవలేదు. ఈ కారణంగా స్వామి అనుగ్రహం అర్ధించాలని మా తల్లీ మేనమామ తలచినారు. కాని వారి సన్నిధికి వెళ్ళి అర్ధించడం ఎలా? ప్రణతుడైన ప్రతిఒక్కనికీ, శ్రీవారి ఆశీస్సు లభిస్తుంది. తలవని తలంపుగా వారికోరిక నెరవేరింది. మా ఇంటి కెదురుగా తణికెళ్ళవారి ఇల్లు. వారి వీథి అరుగుపై శతాధికవృద్ధులు, శ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వతీ స్వాముల శిష్యులు, శ్రీ సుబ్రహ్మణ్యంద్ర భారతీస్వాములు-- (పేరు గుర్తు చాలదు) మకాం చేసేవారు.ఆయన వార్ధక్యం, శ్రీవారి ¸°వనమూ, 'వృద్ధాశిష్యా గురుర్యువా' అని అనిపించేది. వయోధర్మంవల్ల శరీరపాటవం తగ్గి ఆయన శౌచాదికాలకు కూడా బయటకి వెళ్ళలేక పోయేవారు. అందుచేత తనికెళ్ళవారికి ఇబ్బందికాగా మా మేనమామ గమనించి, వారిని మా వీధి అరుగునకు తరలించినారు. వారి దేవతార్చన, వారి ఇతరవస్తువులూ మా వీధి అరుగును చేరింది. ఈ స్వామి జానకీకాంతునిచే ఆకార్ణాంతం లాగబడిన పరమశివుని కోదండంవలె శరీరయష్టి కలిగి భస్మదిగ్ధులై కౌపీనవంతులై యుండేవారు. వారు మొదటిరోజు మా ఇంట్లో భిక్ష చేసినారు. రెండవరోజు చేయమన్నారు. ఒకే గృహస్థుని ఇంట్లో పదేపదే భిక్ష చేయరాదు. మరొక ఇంటికి వెళ్ళటానికి బలంలేదు. అందుచేత నాచేత మధుకరం చేయించి ఆయనకు పెట్టేదానికి ఏర్పటు అయినది. ఆయనవద్ద తాటాకుపెట్టెలో రుద్రాక్షమాలలు చిన్నవీ, పెద్దవీ చాల ఉండేవి. ఆయన రోజూ వానిని ధరించేవారు. అప్పుడు ఆయన రూపం 'కేయూరీకృత కంకణీకృత జటాజూటా వతంసీకృతజ్యావల్లీకృత కుండలీకృత కటీసూత్రీకృతాహీశ్వరః' అన్నట్టు ఉండేది. వారికి సర్వాంగ అలంకారం రుద్రాక్షలే. ఆ స్వామితో మా మేనమామ నన్ను గూర్చి చెప్పినాడు. ఒకరోజు అగ్రహారంలో మామిడిపల్లి చిట్టెన్నగారి ఇంట్లో జగద్గురువులకు భిక్ష జరిగింది. ఆ సంతర్పణకు నేనూ వెళ్ళివస్తున్నా. మా మేనమామ సుబ్రహ్మణ్యంద్ర భారతిని ఎద్దుబండిలో కూచోబెట్టి పసులకాపరిచేత లాగిస్తూ చిట్టెన్నగారి ఇంటికి తీసుకొని వెడుతూ, నన్నుకూడ ఆయనతో బాటు బండిలో కూచోమన్నాడు. అక్కడ శ్రీచంద్రశేఖర యతీంద్రులు భిక్ష పూర్తియై చిట్టెన్నగారి వీధి గదిలో కూచుని ఉన్నారు. దర్శనార్ధులు, దూరంనుంచే నమస్కరించేవారు. అరుగుపై సాష్టాంగం చేసేవారుగా ఉన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యంద్రభారతి మా మామయ్య సాయంతో బండిదిగి గదిలోనికి వెళ్ళి శ్రీవారికి వందనం చేశారు. మా మామయ్యకూడ వందనంచేసి. నాచేత వందనం చేయించి శ్రీవారి ఎదుట కూర్చోబెట్టినాడు. వారిమధ్య జరిగిన సంభాషణ తెలియదు. నన్ను పోతన భాగవతంలో సప్తమ స్కంధంలోనుంచి పద్యాలు చదవమన్నాడు మామయ్య. సీ. ''కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రిగాక, వైకుంఠ బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమ ఢమ ధ్వనితోడ ఢక్కగాక, హరి పూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక, కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక, ఆ.గీ. చక్రిచింత లేని జన్మంబు జన్మమే? తరళ సలిల బుద్భదంబు గాక, విష్ణుభక్తి లేని విబుధుందు విబుధుడే? పాదయుగముతోడి పశువు గాక.'' చనిపోతానన్న భయంతో నాకు 'చంద్రశేకరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః' అనే మకుటంతో చంద్రశేకరాష్టకం మాతల్లి నేర్పింది. ప్రహ్లాదచరిత్ర, కృష్ణశతకం, దాశరధిశతకం, నృసింహశతకం- ఇవికూడ నాకు కంఠస్థం. మరల నింకొకటి చదువమన్నారు శ్రీవారు. ''చంద్రశేకర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్ చంద్రశేకర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.'' ''రత్నసాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం శింజనీకృత పన్నగేశ్వర మచ్చుతానన (నల) సాయకమ్, క్షిప్రదగ్ధ పురుత్రయం త్రిదిశాలయై రభివందితం చంద్రశేఖర! మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః.'' ఆ పద్యాలు చదువసాగినాను. ఒక పద్యం పూర్తికాగానే సుబ్రహ్మణ్యంద్ర భారతి నాతలను జగద్గురువుల చరణసరోజాలపై పడవేయడం, జగద్గురువులు నాకు ఒక సపోటాపండును ఇవ్వటం జరిగింది. శ్రీవారు ఈ పద్యాలకు సరియైన భాగవతశ్లోకాలు వివరించేవారు. కొన్ని పద్యాలు రెండు మూడుమార్లు చదివించి విన్నారు. ఇట్లు రెండుగంటల కాలం గడిచింది. పండ్లతో ఒడినిండింది. ఆశీస్సులతో భవిష్యత్తు పండినది. సుబ్రహ్మణ్యంద్రభారతి కూడ ఒక రుద్రాక్షపూసను నామెడలో కట్టమని మాతల్లికి ఇచ్చారు. శ్రీవారి ఆశీర్వచన ప్రభావంతో ఎన్నోగండాలు గట్టెక్కినాను. దైవమొక్కటే రక్షింపగల పరిస్థితులు అవి. ఒకప్పుడు ఈనినపంది తరుముకొనివచ్చి, పినుగను నక్క త్రిప్పినట్లు త్రిప్పింది. నదులలో, చెరువులలో మునిగిపోయాను. చుట్ట చుట్టుకొన్న త్రాచుపై ఆదమరిచి కూరుచున్నా. కాని అన్నిటిలో శ్రీవారి ఆశీర్వచనమే శ్రీరామరక్ష అయింది. ''చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః?''