Maa Swami
Chapters
4. రాజా ధర్మస్య కారణమ్ శ్రీ కామకోటి పీఠాధిపతులు క్రీ.శ. 1958 లో మద్రాసు-త్యాగరాయనగరులో విజయంచేసి ఉన్నప్పుడు 'బ్రిటను'కు చెందిన- 'సర్ పాల్ డ్యూక్' 'ఫ్రాన్సు' దేశానికి చెందిన- 'ఫిలిప్ లెవాస్టిను' - అనే ఇరువురు స్వామివారిని కలుసుకోవాలని చాల ఉత్సాహపడ్డారు. ఆ ఇరువురిని పిలచుకొని శ్రీ టి.యం.పి మహాదేవన్‌గారు రాత్రి గం.8.30 లకు స్వామివారి విడిదిచేసినచోటుకు వచ్చిచేరారు. సమావేశం ఆరుబయట ఏర్పాటైంది. చుట్టూ పొడవుగా పెరిగిన కొబ్బరిచెట్లు- మధ్యలో గడ్డివాము- దానినానుకొని స్వాములవారు కూర్చుండుటకు వీలుగా ఒకపీట ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశమునకు ఏర్పాటైన కాలము, రంగస్థలము చాలా 'రొమాంటిక్'గా ఉన్నదని, స్వామి దర్శనానుభూతికి అమరిక చక్కగా కుదిరినదని 'సర్ పాల్ డ్యూక్' అన్నారు. తపోనిధులే కాక, మేధాసంపన్నులైన స్వాములవారిని చూడబోతున్నాముకదా అని 'లెవాస్టిను' ఉబలాటపడ్డారు. తొమ్మిదికొట్టి నాలుగైదు నిముషములై ఉంటుంది. ఒకమూలనుండి ఎవరో 'టార్చిలైటు' వేస్తూ దారిచూపుతూ ఉంటే స్వాములవారు మెల్లిమెల్లిగా అడుగులు వేసుకొంటూ వచ్చి పీటమీద ఆసీనులయ్యారు. స్వామివారు- 'కూర్చుండుడు' అని సంజ్ఞ చేసినమీదట స్వామికి కొద్దిదూరంలో క్రింద పాశ్చాత్యులిద్దరు చతికలపడ్డారు. సర్ పాల్ డ్యూక్ రచయిత. ఆయన ''అంతం లేని అన్వేషం'' ''పాశ్చాత్యులకు యోగం'' అన్న పుస్తకాలు వ్రాశారు. అప్పుడు స్వామికి వారికి ఈ విధమైన సంభాషణ జరిగింది. స్వామి:- మీ పుస్తకానికి 'అంతంలేని అన్వేషం' అని పేరు పెట్టుటలో మీ ఉద్దేశం ఏమిటి? సర్ పాల్ డ్యూక్:- నావరకు నా అన్వేషణ పూర్తికాలేదు. అందుకే ఆపేరు పెట్టాను. కాని సగటు పాశ్చాత్యునకు ఏదో ఒక చర్చిలో చేరితే అన్వేషణ పూర్తి అవుతుంది. కాని నామతం అదికాదు. స్వామి:- అన్వేషణ బాహ్యమైనదైతే దానికి అంతంలేదు. అది దిగంచలాలను అందుకొనుటయే. అది మిథ్య అలాకాక అన్వేషణ ఆంతర్యమైనదైతే ఆత్మోపలబ్దితో అది అంతమవుతుంది. ఒకవిధంగా ఈ అంతరన్వేషణకూడ నిరంతరమే అనాలి. ఎందుకంటే అన్వేషించే వస్తువు నిరవధికం కనుక! ఫ్రెంచి లెవాస్టినుకు మన పురాణములు, ఆలయములు వీనిని గురించి పరిశోధన చేయుటలో ఆసక్తి ఎక్కువ. 'రాజు - రాచరికము' అనే విషయమును గురించి ఆయన పరశోధన చేస్తున్నారు. ఆయన ఇలా అన్నారు. ''పూర్వం రాచరికంలో ఐహికానికి ఆముష్మికానికి ఇప్పుడున్న విభాగం లేదు. ఆనాడు ఐహికా ముష్మికాలు విడదీయరానివిగా కలిసి ఉండేవి. ఆ కాలంలో రాజు పాలకుడే కాదు. ఆనాడు రాజు- 'ధర్మగోప్త-ధర్మశాస్త్ర' - అయివుండేవాడు.ప్రస్తుతం ప్రపంచాన్ని పీడించే సమస్యలన్నీ ఐహికాముష్మికాలు రెండూ విడిపోయి, రాజు-రాచరికము కేవలము ఐహికమునకే చెందిఉన్న- ఈ విభాగమువలననే వచ్చినవని అనుకొంటున్నాను. అందుకొఱకే నేను దక్షిణదేశ ఆలయాల చరిత్రలను తిరుగవేస్తున్నాను.వానిలో ఇహమాత్ర సంబంధం ఏదైనా ఉన్నదేమో అని పరిశీలిస్తున్నాను.'' అంతటితో స్వాములవారు 'రాజా ధర్మస్య కారణమ్' అన్న సూక్తిని మీరు విన్నారా?- అని ప్రశ్నించి ఆ సూక్తియొక్క అర్ధాన్ని వివరించుటకై పూనుకొన్నారు. స్వాములవారు అరవములోనే మాట్లాడుతూ ఉన్నా, వచ్చినవారికి అర్ధం కావాలన్న ఉద్దేశంతోనూ, అనువాదకునకు సులభంగా ఉంటుందనీ ఇంగ్లీషుపదాలను (అధికంగానే) తమ సంభాషణతో వాడుతూ వచ్చారు. ఆ వచ్చినవారికి క్రింద కూర్చుండుట అలవాటులేదు. స్వాములవారు ఏమి చెబుతున్నారో అన్న ఉత్కంఠతో కొన్ని సమయాలలో కాళ్ళుజూపి, కొన్ని సమయాలలో ముడుచుకొంటూ వివిధ భంగిమలలో అవస్థపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారిలో ఒకరు వారిని- 'కాళ్ళు చాచవద్దని'- చెప్పారు. అందులకు స్వాములవారు- 'వారు ఎలా కూర్చున్నా బాధలేదు. ఈ విషయంలో వారు చిన్న పిల్లలతో సమానం. నీవెందుకు వారిని నిర్భందిస్తావు'- అని వారించారు. స్వాములవారు సంభాషిస్తూ ఇలా సెలవిచ్చారు- ప్రతి వ్యక్తికి కొన్ని అవసరాలు ఉన్నాయి. 'ఛాయాతోయం అశనవసనం' ఇవికాక మానవునకు మరికొన్ని కర్తవ్యాలుకూడ ఉన్నాయి. ఆత్మికములైనవి, సామాజికములైనవి, దేశవిషయంలో చేయవలసినవి- ఇలా ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి. ఐతే ఇవన్నీ మనం ఇహలోకంలో సుఖంగా ఉండుటకై చేసేవి. ఈ కర్తవ్యాలను పారమార్ధికానికి దోహదంగా ఉండునట్లుకూడ చేసుకొనవచ్చు. దానినే ధర్మం అని అంటాం. ప్రజ తమ జీవితాలను ధార్మికంగా, ఐహికాముష్మిక సుఖప్రదంగా గడపునట్లు చూచే భారం రాజుది. ప్రజాస్వామికంలో ఈ భారం ప్రభుత్వం వహించక తప్పదు. 'రాజా ధర్మస్య కారణమ్'- అనుటలో ఉన్న పరమార్ధం ఇదే. లెవాస్టిను:- 'నాకు సంస్కృతము స్కూళ్ళలోకాక, మునుపు భారతీయ గురుకులవాసాలలో అనుశ్రుతంగా గురువునుండి శిష్యుడు నేర్చుకొన్నట్లు నేర్చుకొనాలన్న అభిలాష ఉన్నది' అన్నారు. దానికి స్వాములవారు అతని ఆసక్తిని అభినందిస్తూ ఇలా అన్నారు. ఇపుడు ఆ ఆచారం ఈ దేశంలోనే పోయింది. 'వ్రాయుట- చదువుట' వేరు, విజ్ఞానం వేరు. హిందువులు ఈ రెండింటికి ఏనాడూ లంకె పెట్టలేదు. అప్పుడు సమావేశమయిన వారిలో ఒకరు- వ్రాతకోతలు ఎరుగకపోయిన ఆధ్యాత్మికంగా అవధులను చూచిన వంగీయ రామకృష్ణ పరమహంసను ఉదాహరించారు. అందులకు స్వాములవారు- నేను మహాత్ముల నొక్కరిని గూర్చి మాత్రమే చెప్పుటలేదు. సామాన్యజనులలో కూడ ఇట్టివారనేకులున్నారు. మునుపు కణక్కరులు అనే జాతి ఉండేది. వ్రాతకోతలు వారి వృత్తి. మిగిలినవారికి సాధారణంగా వ్రాత తెలియదు. గొప్ప గొప్ప గణితశాస్త్రజ్ఞులు, ఖగోళశాస్త్రజ్ఞలు భిషగ్వరులు, వైదికపండితులు- వీరిలోకూడ చాలమందికి వ్రాయుట తెలియదు.చదువంతా నోటితోచెప్పుట,దానిని విని నేర్చుకొనుటతో ముగిసేది.ఈ విధానం కొంతవరకు ఈ కాలంలోకూడ పునరుద్ధరించవచ్చు. పాల్ డ్యూక్:- అయితే పురాతనాచారము, విధానములు అన్నీ పునరుద్ధరించవలెనని మీ ఉద్దేశమా? స్వామి:- నేను అలా చెప్పలేదు. దేనినుండైనా మంచిని మనం గ్రహించగలగాలి. ఒక విషయం పురాతనమైనదన్నమాత్రాన మంచిదని ఎవరూ అనరు. 'పురాణ మిత్యేవ నసాధుసర్వం.' ఐతే ఈ విషయానికి ప్రచారం అవసరం. ఏకొందరో ధైర్యంచేసి తమకు నచ్చిన ప్రాతవాడుకలలో కొన్ని ఆచరణలో పెట్టినారంటే లోకం దానిలోని మంచిని గ్రహిస్తుంది. అంతటితో ఆ విధానం ప్రాచ్యం నుండి పశ్చిమ దేశాలకు కూడ ప్రాకవచ్చు. పాశ్చాత్యులే ఈ దేశపు పద్ధతులను అవలంభిస్తున్నారని తెలుసుకొంటే ఇక్కడివారూ మేల్కొని- ''అరెరే! ప్రాతదని త్రోసివేశాం! ప్రాతకూడ మంచిదే కాబోలు''- అని తమ సంస్కృతిని గుర్తిస్తారు. పాల్ డ్యూక్:- పాశ్చాత్యదేశాలకు మీరివ్వగల సందేశ##మేమి? ఈ ప్రశ్నకు స్వాములవారు చాలసేపు కన్నులు మూసుకొని మౌనం వహించి ధ్యానంలో మునిగి నారు. కొంతసేపైన పిదప అర్ధనిమీలితనేత్రులై మెల్లగా ఇలా అన్నారు. మీరు చేసేపని ఏదైనాసరే! దానికి ప్రేమ ఒక్కటే ముఖ్యకారణంగా ఉండాలి. కార్యం అంటూ ఎప్పుడు ఆరంభం అవుతుందో- ఆ కార్యానికి కర్త, కర్తకు భిన్నులైన ఇతరులు ఉండనే ఉంటారు. కార్యం ఏదైనాసరే! దాని ఉద్దేశము, ప్రయోజనము, కారణము ప్రేమతప్ప అన్యము కారాదు.ఇచ్చట నేను గాంధీగారు అవలంభించిన అహింసావ్రతాన్ని గురించి చెప్పటంలేదు. ఒక్కొక్కప్పుడు మనం హింసా పూర్వకమైన కార్యాలు కూడ చేయవలసివస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో నేరములకు తగిన శిక్షనుకూడ విధించవలసి వస్తుంది. యుద్ధాలు చేయవలసిన అవసరంకూడ కలుగుతుంది. కాని ఏ కార్యం చేసినాసరే! కర్తయొక్క ముఖ్యోద్దేశము ప్రేమయే అయివుండాలి. ఇచ్ఛాద్వేషాలకు క్రోధమాత్సర్యాలకు అందులో తావుండరాదు. మనంచేసే ప్రతి ఒక్క పనిలోను ఈ ప్రేమ అనేది ఓతప్రోతమై ఉంటే ప్రపంచంలో ఎట్టి గడ్డు సమస్యలనైనాసరే, మనం అవలీలగా సాధించగలం. భారతదేశపు ఋషులు, మహాత్ములు పాశ్చాత్యదేశాలకు ఇచ్చే సందేశం ఇదే.