Maa Swami
Chapters
8. విద్వత్సభ (డానియల్ స్మిత్) ఇలయాత్తంగుడిలో 1962 సంవత్సరంలో జరిగిన విద్వత్సభ సందర్భంలో కామకోటి స్వాముల వారిని నేను దర్శించడం జరిగింది. శ్రీవారు సభలో నన్నుకూడ పాల్గొనమన్నారు. ఇలయాత్తం గుడికి రాగానే శ్రీవారు పూజకుపోయే మార్గంలో నిలుచుంటే ఆయనను సులభంగా దర్శించవచ్చునని అక్కడివారు అన్నారు. నేను శ్రీవారిని కలసినపుడు ఏమేమి చేయాలో ఒక పథకం వేసుకొని వచ్చినాను. తీరా వారిని కలుసుకొన్నపుడు నాపథకం గాలి కెగిరిపోయింది. ఆయనను చూడగానే అన్నీ మరచిపోయి తబ్బిబ్బులైంది. అది వారు గమనించి చేతితో సైగచేస్తూ కంగారు పడవద్దని ఊరడించినారు. అంతటితో శాంతించాను. నేను అనుకొన్నది వేరు. జరిగినది వేరు. శ్రీవారిది ఇంత చిన్న పుట్టుక అని అనుకోలేదు నేను. ఆయన చిక్కిపోయిన చిన్నదేహాన్ని చూచి ఆశ్చర్యపోయాను. కాని ఆయన బలం అంతా ఆయన కండ్లలోనేవుంది. తలచుకొంటే ఈనాటికీ ఆ కన్నులు అట్లాగే గోచరిస్తాయి. ఆ కనులు ఎంత దీప్తివంతములని? మనస్సులోకి అవి చొచ్చుకొని పోతాయి. కానీ ఆ కన్నులు స్నేహార్ద్రంగా వుంటవి. జరిగిన సంభాషణ కూడ చాలవరకూ మౌనమే. ఆగమశాస్త్రాలలో వేనిని చూస్తున్నావన్నారు. నేను పాంచరాత్రంలో చేస్తున్న పరిశోధనగూర్చి చెప్పాను. ఐతే నీవరకూ ఈ పరిశోధన ప్రేమ కలాపమన్నమాట అన్నారు శ్రీవారు! ఆయన అనుగ్రహం మరొక విధంగా కూడ చూశాను. 1962 సెప్టెంబరు 15వ తేది నేను విద్వత్సభలో పాల్గొనాలి. విద్వాంసులందరూ పాల్గొంటున్న ఆ సభలో నేను మాట్లాడటానికి జంకినది వాస్తవమే. అంతేకాక గ్రహణితో బాధపడుతున్నా. ఈ రెండూ చేరి మానసికంగానూ, నన్ను బలహీన పరచింది. రాత్రి సుమారు 11 గంటలకు, స్వామివారు పంపారని ఆయన శిష్యులలో ఒకరు వచ్చారు. స్వాములవారు ఒక చీనీ పండును ఆయనతో పంపి, దానిని తీసుకోమన్నారట. ఒళ్ళు బాగాలేదని ఎవరో చెప్పారు. నేను మందువెనుకలాడినాను. ఈ బాధలో ఈపండు తింటే- ఎమన్నా వికారం చేస్తుందేమోనని ఆ పండును తర్వాత తీసుకొంటానన్నా. కాని తీసుకొన్నంతవరకూ ఆ వచ్చిన మనిషి కదలలేదు. మరుసటి దినం తెల్లవారి విచిత్రంగా నా గ్రహణి మాయమైంది. దేహమూ, మనస్సూ రెండు అపూర్వముగా ఉత్సాహకరంగా మారేయి స్వామి అనుగ్రహబలంతో. డానియల్ స్మిత్ (అసిస్టెంట్ ప్రొఫెసరు సైరాక్యూజ్ యూనివర్సటీ సైరాక్యూజ్ న్యూయార్క్. యూ.ఎస్.ఏ.)