Maa Swami
Chapters
8.అఖిలభారత యాత్ర (1919-1939) శ్రీవారి భారతయాత్ర 1919 మార్చిలో ప్రారంభ##మైనది. ఆ యాత్రలో భారతదేశంలోని వివిధ రాష్ట్రములలోవున్న ఆస్తికులకు స్వాములవారి దర్శనాభాగ్యం లభించినది. స్వామి పాదచారి. ఎప్పుడైనా పల్లకీ నెక్కేవారు. రైలు ప్రయాణాలు బస్సులూ వారెరుగని విషయం.వారితోబాటు పరిచారకులు, పండితులు, వేద విద్వాంసులు, గోపూజకూ గజపూజకు కావలసిన పశుసంతతి వెంబడించేవి. అనుష్ఠానం, పూజాక్రమం- ఈ సమయాలకు తప్పించి తక్కిన సమయాలలో, భక్తులతో సంభాషించేవారు. ఇరువదినాలుగు గంటలలో వారు విశ్రాంతి తీసుకొనేది ఏ రెండు మూడుగంటలో. యానిశాసర్వ భూతానాంతస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సానిశాపశ్యతేమునేః సమస్త ప్రాణులూ దేనిని రేయి అనుకొంటాయో అది సంయమికి పగలు. ఏది ప్రాణిలోకం పగలని అనుకొంటుందో, సంయమికి అది రేయి. సంయమి అంటే చక్కగా అణచినవాడని అర్ధం. స్వాములవారిని గుడాకేశులని చెప్పవచ్చును. గుడాకేశుడు అంటే నిద్ర జయించినవాడని అర్ధం. ఈ కాలంలో మొదటి మూడుసంవత్సరాలూ కుంభకోణం,తంజావూరు జిల్లాలలో మారుమూల గ్రామాలలో వుండే పుణ్యస్థలాలన్నీ దర్శించినారు. 1919లో చాతుర్మాస్యవ్రతం వేపత్తూరు అనే గ్రామంలో జరిగినది. చాతుర్మాస్యం ఆషాఢ పౌర్ణమినాడు ఆరంభమవుతుంది. ఆ పూర్ణిమనాడు బ్రహ్మసూత్రకర్త అయిన వ్యాసమహర్షికి పూజచేస్తారు. చాతుర్మాస్యంలో ప్రయాణాలుమాని యతులు ఏకదేశంలో వుండాలనేదొక నియమం. ఈ రోజు అద్వైత సంప్రదాయాన్ని పాటించే యతులు బ్రహ్మవిద్యా గురువులను ఈక్రింది విధముగా పూజిస్తారు. మొదటి- కృష్ణ పంచకము. మధ్య జగద్గురువు కృష్ణుడు. అతనిచుట్టూ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుల చతుర్వ్యూహం. రెండవది- సనకాది పంచకము. మధ్య సనకుడు- ఆయన చుట్టూ సనందన, సనత్సుజాత, సనాతన, సనత్కుమారుడు. మూడవది- వ్యాసపంచకము. మధ్య వేదవ్యాసులు- చుట్టూ సుమంత,జైమిని, వైశంపాయన, పైలు-లు. నాలుగవది- శంకరాచార్య పంచకము. మధ్య ఆదిశంకరులు. చుట్టూ పద్మపాద, హస్తామలక, తోటకాచార్య సురేశ్వరులు. ఐదవది- ద్రావిడాచార్య పంచకము. మధ్య ద్రావిడాచార్యులు. చుట్టూ గౌడపాదులు, గోవింద భాగవత్పాదులు, సంక్షేప శారీరకాచార్యులు, వివరణాచార్యులు. ఆరవది- గురు పంచకము- మధ్య గురువు. చుట్టూ పరమగురు, పరమేష్ఠిగురు, పరాపరగురు, తక్కిన బ్రహ్మవిద్యాచార్యులు, సంప్రదాయకర్తలు. అంతేకాక శుకులు, నారదులు, దుర్గ, గణపతి, దేవ పాలకులు, సరస్వతి, దివ్యాలకులు వీనినికూడ పూజిస్తారు. సాలి గ్రామములో శుద్ధచైతన్యమును ఆవాహనచేసి కడపటి సమిష్టిపూడ కావించబడును. శ్రీవారు పీఠమును అధిరోహించినప్పటినుండి చాతుర్మాస్యవ్రత పరిపాలనచేసిన ప్రదేశములను అనుబంధమున ఇవ్వబడినవి. 1920లో మహోదయపుణ్యకాలము. వేదారణ్యంలో శ్రీచరణులు సముద్రస్నానం చేశారు. ఆ సంవత్సరం వ్యాసపూజ చాతుర్మాస్యం మాయవరంలో జరిగినది. వేదారణ్యంలో వున్నపుడు శ్రీవారిని ఒక ముస్లిము వృద్ధుడు చూచాడు. శ్రీవారి అనుజ్ఞపై అతడు ఇస్లాములోని మౌళిక సత్యములను వివరించాడు. అతడు వెళ్ళుతూ శ్రీవారిలో దైవసాన్నిధ్యమున్నట్లు తనకొక అనుభూతి కలిగినదని చెప్పాడు. 1921లో మహాముఖం కుంభకోణంలో జరిగింది. పరిసరాలలో పర్యటిస్తున్న స్వాములు కుంభకోణం వెళ్లారు కానీ మఠం మాత్రం వెళ్ళలేదు. విజయయాత్ర పూర్తిఅయిన పిదపనే మఠంవెళ్ళ సంకల్పించుకొన్నారు. ఈ ఉత్సవం జయప్రదంగా జరగడానికి కాంగ్రెసు వాలంటీర్లు చాలవరకు తోడ్పడినారు. వీనిలో ఖిలాఫట్కు చేరినవారుకూడ ఉన్నారు. అందరూ పట్టేశ్వరం వెళ్ళి స్వామిని దర్శించారు. జాతీయవాదులలో ఒకరైన శ్రీ సుబ్రహ్మణ్యశివం అనేవారూ స్వామిని దర్శించారు. వారినందరినీ శ్రీచరణులు ఆశీర్వదించి అభినందించారు. గ్రామం గ్రామం వెడుతున్న శ్రీవారిని సుమారు వందమంది హరిజనులు సుస్నాతులై శుభ్రవస్త్రధారులై, విభూదిని నుదుట ధరించి దర్శించారు. వారి యోగక్షేమాలు శ్రీచరణులు విచారించుటయేకాక వారికి నూతన వస్త్రములు బహూకరించినారు. బీదవారంటే స్వాములవారికి చాలదయ. అనురాగం. సంపన్న గృహస్థులు బీదవారికి దానధర్మాలు చేయాలని ఆదేశిస్తుంటారు. రామేశ్వరం వెళ్ళి సికతా స్వీకరణం చేశారు. ఆ ఇసుకను కాశీకి వెళ్ళినపుడు గంగలో కలవటం అనుచానంగా వస్తున్న ఒక ఆచారం. భారతదేశపు భౌతిక, ఆధ్మాత్మిక ఏకత్వానికి ఇదొక చిహ్నం. రామనాధపురం, మధుర, తిరునల్వేలి జిల్లాలను పర్యటించి శ్రీవారు జంబుకేశ్వరానికి వచ్చారు. 1908లో తాటక ప్రతిష్ట జరిగినది. ఇచట ఒక వేదపాఠశాలును నెలకొల్పారు. ఇక్కడ యధావిధిగా వేదాధ్యయనము జరుగుతున్నది. జంబుకేశ్వరంలో ఉన్న కంచి కామకోటి మఠంలోనే దేశప్రఖ్యాతి వహించిన భారతరత్న- మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి ఉపనయనం జరిగినదట! తాటక ప్రతిష్ట జరిగిన పిదప శ్రీవారు వెళ్ళిన చోటులలో నెరూరు ఒకటి. ఇచట సదాశివ బ్రహ్మేంద్రుల అధిష్ఠానమున్నది. పరమేశ్వరాంశసంభూతులూ, పరావరతత్త్వజ్ఞులూ దిగంత విశ్రాంతయశులూ, రాజయోగ నిష్ఠాతులలో నగ్రగణ్యులూ ఐన సదాశివులచరిత్ర విస్మయజనకము. పరమపావనము. చోళమండలంలో తిరువిశనల్లూరు గ్రామంలో వారి జననం, విద్యావ్యాసంగం. వారు బ్రహ్మసూత్రములకు బ్రహ్మతత్త్వప్రకాశిక అనే వివృతి నొకటి వ్రాశారు. సిద్ధాంతకల్పవల్లి, ఆత్మవిద్యావిలాసము, పతంజలియోగసూత్రముల వివరణ-యోగసుధాకరము-ఇత్యాది గ్రంధకర్త. వారు జీవన్ముక్తులై అవధూతలై కావేరి పులినములలో సంచరించేవారు. వారి విద్యాగరువు పరమశివేంద్రసరస్వతి. వారిని దర్శించడానికి వచ్చిన పండితులపై ఈయన ప్రశ్న శిరపరంపర కురిపించేసరికి వారికి వ్యామోహము త్రపా కలిగేవి. వారు పరమశివేంద్రులవారి వద్దకు వెళ్ళి- అయ్యా! ఈయన అడిగే ప్రశ్నలకు మాకు సమాధానం చెప్పడానికీ తెలియలేదు. ఈ పరిభవమునూ మేము భరింపలేకున్నాము అని విన్నవించారట. 'సదాశివ! దుర్నిరోధమైన వాచః సంయమనం నీవెపుడు నేర్చుకొంటావు' అని ఆయన అన్నారట. తన అపరాధం తెలుసుకొనిన సదాశివేంద్రులు తమ గురువు ప్రణామంచేసి క్షమాపణ వేడుకొని, గురువనుజ్ఞతో ఆక్షణంనుంచి మౌనం దాల్చారు. అటుపై వారి జీవితం- కరతలభిక్షా, తరుతలవాసం; ఉన్మత్తునివలె సంచారం. వారికి సర్వం బ్రహ్మమయం. నెరూరు వెళ్ళినపుడు శ్రీవారు సదాశివుని అధిష్ఠానంలో ధ్యానమగ్నులై గంటలకొద్ది ఉండేవారట. నెరూరునుండి తిరుచి దాపున ఉన్న కులుమణికి శ్రీవారు వచ్చారు. తిరుచిలోని యఫ్.జి. నటేశయ్యరు అనే పెద్దమనిషి- 20 ఏళ్ళు క్రైస్తవ మతానునేయులై వుండిరట- ఒక కేరళీయునితో శ్రీవారి దర్శనమునకు వచ్చారు. ఆ కేరళీయ యువకుడు క్రైస్తవమతాన్ని పుచ్చుకోవాలని అనుకొన్నాడు. శ్రీవారు ఆ యువకునికి హిందూధర్మవిశిష్ఠతను వివరించి, ఇతర మతములలోని ధర్మాలు సారభూతంగా మన మతంలో ఉన్నదని నచ్చచెప్పారు. అంతటితో అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. చెట్టినాడు పుదుక్కోట ప్రాంతములలో శ్రీవారు దాదాపు ఒక్క సంవత్సరము పర్యటించినారు. శ్రీవారిని ఈకాలంలో దర్శించిన వారిలో ప్రముఖులైన పండితులూ, రాజకీయ నాయకులూ, దేశనాయకులూ గలరు. 1925లో ద్రావిడభాషలో ప్రపంచ విఖ్యాతిగాంచిన డాక్టరు యూ.వీ. స్వామినాధయ్యరుకు దక్షిణాత్య కళనిధియన్న బిరుదు ఇవ్వబడినది. పరిసరాలలో అయ్యరుగారు ఉండే, మఠంలోని పూజను చూడటానికి ఆయన తప్పక వెళ్ళేవారు. 'పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో శ్రీ మహాదేవేంద్ర సరస్వతి చేసిన శివపూజను నేను చూచాను. శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతులు చేసే పూజను చూచినపుడు నాకు అదే ఆనందానుభవం కలిగింది' అని వారన్నారట. దక్షిణదేశంలో అప్పరు, జ్ఞానసంబంధర్ అనే వారు గొప్ప శివభక్తులు. జ్ఞానసంబంధర్ బ్రాహ్మణుడు. అప్పరు వెళ్ళాళజాతికి చేరినవాడు. ఆయన చిన్నతనంలో జైనులలో కలిసిపోయాడు. తన సోదరి తిలకవతి గొప్ప శివభక్తురాలు. ఆమె ప్రార్ధనచేత, శివుడు అప్పరుయొక్క దైహికరుజను పోగొట్టి తన భక్తునిగ చేసుకుంటాడు. అప్పరున్న చోటికి జ్ఞానసంబంధర్ వచ్చారట. ఆయనకు అప్పరు దర్శనం చేసుకోవాలనే ఉత్కంఠ. అప్పరు జ్ఞానసంబంధరు మీది భక్తిచేత ఆయన పల్లకీమోసే బోయవారితో కలసి పల్లకి మోస్తున్నాడు. 'అప్పరు ఎక్కడ?' అని జ్ఞానసంబంధులు అడుగగా పల్లకీ మోస్తున్న అప్పరు- 'అప్పరు ఇక్కడ' అని పల్లకి క్రిందనుండి బదులు చెప్పారట! చెట్టినాడులో వైనాగరం రామనాధచెట్టియార్ గొప్ప శివభక్తుడు. స్వాములవారంటే చాల శ్రద్ధాభక్తులు కలవాడు. కడియాపట్టిలో స్వాములవారికి పెద్ద వీడ్కోలు ఏర్పాటుచేశారు. ఆ జనసమ్మర్ధంలో స్వాములవారు చెట్టియార్కోసం చూచినారు. కాని ఆయన కనపడలేదు. ఊరేగింపు పూర్తిఅయిన పిదప చెట్టియారెక్కడ అని విచారించారు. దూరంగా ఉన్న చెట్టియారు ఇక్కడ ఉన్నాను అని బదులు చెప్పారట. ఇంతసేపూ ఎక్కడ ఉన్నావు? అని స్వాములవారు అడిగారు. మీ పల్లకి మోస్తూ ఉంటిని అని చెట్టియారు అప్పరువలె బదులుచెప్పారట! ఈకాలంలో స్వాములవారిని కలుసుకొన్న ప్రముఖులు సి.ఆర్. దాస్, యస్. సత్యమూర్తి, ఎ. రంగసామి అయ్యంగారు, జమ్నాలాల్ బజాజ్. వీరితో సి.రాజగోపాలచారి కలియలేదు. స్వాములవారు ఆయనకోసం చెప్పిపంపారు. ఆయన స్నానం చేయనందువల్ల శ్రీవారి సముఖమునకు రావడానికి జంకినారు. జాతీయ కార్యక్రమంలో చిక్కుకున్న వారికి సకలవిధులు పాటించడానికి వీలులేక పోవచ్చుననీ, దేశ##సేవకు జీవితాన్ని అంకితంచేసిన ఆయన ఏకాల దేశాలలోనైనా తన్ను నిరభ్యంతరంగా చూడవచ్చు అనీ రాజగోపాలచారితో శ్రీవారు చెప్పారు. సన్యాసి కనుక రాజకీయాలతో తనకు ఏ విధమైన పొత్తులేదు కాని ప్రజల యోగక్షేమాభి వృద్ధులకు భగవద్విశ్వాసము పెంపొందించుటకు వారు పాటుపడవలెనని చెప్పుటకుమాత్రం తమకు స్వాతంత్ర్యం కలదని శ్రీవారు ఆయనతో చెప్పారు. 1926లో పుదుక్కోటకు వెడుతున్న సమయంలో కొందరు ముస్లిములు శ్రీవారి దర్శనం చేశారు. అందులో ఒకరు సంస్కృతంలో కవనం చేయగలడు. అతడు శ్రీవారిపై శ్లోకాలువ్రాసి ఫలపుష్పాదులతో సమర్పించారు. శ్రీవారి ఆదేశంపై వాని అర్ధవివరణకూడ చేశారు. ''నా దృష్టకి శ్రీవారు అల్లా స్వరూసంగా కనపడుతున్నారు. భవబంధ విముక్తికి స్వాములవారి దర్శనం ఒకటి చాలు'' అని ఆయన సంతోషంగా అన్నాడు. తిరుప్పాడిరిపులియూరు అనేచోట స్వాములవారు మకాం చేస్తున్నపుడు ఒక వృద్ధవనిత దర్శనార్ధం వచ్చినది. ఆమె మహాత్మాగాంధీ జీవిత చరిత్రను పద్యాలలో వ్రాసింది. శ్రీవారిని వారి బాల్యదశలో ఆమె బాగుగా ఎరుగును. శ్రీవారి తండ్రివద్ద ఆమె చదువుకొంది. తన గురుపుత్రుడు ఇపుడు జగద్గురువుగా దర్శనమిస్తున్నందున ఆమె చాల సంతసించింది. కామకోటి పీఠాచార్యులలో 58వ ఆచార్యులు ఆత్మబోధేంద్రసరస్వతి. వడవాంబలం అనే గ్రామంలో ఆయన సమాధి జీర్ణించి, ఉన్నచోటుకూడ తెలియని స్థితిలో ఉండగా స్వాములవారు సమాధిచోటును కనుగొని అక్కడ ఒక బృందావనంనిర్మించి నిత్య పూజావిధులకు వలసిన ఏర్పాటు చేశారు. ఈ గ్రామం దక్షిణ పినాకినికి ఉత్తరతీరమున ఉన్నది. సన్యాసుల సమాధులపై తులసి చెట్లను నాటితే వానిని బృందావనమనీ, శివలింగమును ప్రతిష్ఠిస్తే అధిష్ఠానమనీ అంటారు. పాండిచేరిలో ఫ్రెంచి గవర్నమెంటు తరపున స్వాములవారికి ఘనసన్మానం జరిగినది. ఆ సమయంలోనే తిరువారూలో రథం కాలిపోయినది. సుబ్బరాయవాద్యార్ అనే పురోహితుడు రథపునర్నిర్మాణం తలపెట్టాడు. శ్రీవారి ఆశీస్సులతో ఈ కార్యం అచిరకాలంలోనే పూర్తి అయినది. కాలానంతరం సుబ్బరాయవార్మార్ శ్రీనారాయణ బ్రహ్మనందులనే పేర సన్యసించారు. సన్యాసి అయిన పిదపకూడ ఆయన ఆలయం కుంభాభిషేకములు, జీర్ణోద్ధారణ- విషయాలలో చాలా పాటుపడేవారు. మార్చి 1927 ఈరోడులో ఒక ముస్లిమ్ స్వామిని సంధించి చిన్నగళ్ళతో ఒక శివలింగాకృతిలో-స్వాములపై సంస్కృత శ్లోకములు వ్రాసి సమర్పించాడు. కవనం చేయకల్గిన కౌశీల్యం నీకు ఎట్లా కలిగినదని స్వాములవారు అడుగగా తన తాతముత్తాతలు సంస్కృత విద్వాంసులనీ, తానుకూడ తన తండ్రివద్దనే సంస్కృతము నేర్చుకొన్నాననీ చెప్పాడు. స్వాములు అతని కవిత్వాన్ని ప్రశంసించి సంస్కృతంలో ఇతోధికంగా కృషిచేయవలసినదని ఆదేశించారు. శ్రీవారు పాల్ఘాటులోఉండగా కొందరు కేరళీయులు దర్శించి మలయాళంలో వారికున్నవ్యుత్పత్తికి నివ్వెరపోయిరట. కేరళం ఆదిశంకరుల జన్మస్థలం. ఇచ్చటనే శ్రీ.టి.యం కృష్ణస్వామయ్యరు తన తిరుప్పుగళ్ బృందంతో భజనలు చేసి తిరుప్పుగళ్మణి అనే బిరుదం సంపాదించారు. అయ్యరు మద్రాసులో న్యాయవాదిగ వుండి పిదప తిరువాన్కూరులో ప్రధాన న్యాయమూర్తిగ పనిచేసిరి. 1927 సంవత్పరం చివర మహాత్మాగాంధి దక్షిణదేశంలో పర్యటిస్తున్నారు. ఆయన స్వాములవారిని గూర్చి విని కలసికోవాలని యున్నారు. పాల్ఘాటులోని నల్లచేరిలో ఒక గోశాలలో శ్రీవారిని సంధించారు. ఆదిశంకరుల పరంపరలో వస్తున్న శ్రీచరణులు ఖద్దరు కాషాయాలంకృతులై నేలపై కూరుచునివున్నారు. సాధారణుడైన కృషీవలునివలె గాంధీగారు తమ జీవితవిధాన్ని నడుపుకొంటున్నారు. వారిమధ్య సంభాషణ సంస్కృతంలో జరిగినది. గాంధిగారు హిందీలో బదులిచ్చారు. చాల సౌహృదమైన ఇష్టాగోష్టి అది. ఈ అపూర్వ సమావేశం తనకు చాల ప్రయోజనకారిగా వున్నదని తర్వాత గాంధీగారన్నారు. అపుడు సాయంసమయము 5.30 గంటలు. ఆరుగంటలు దాటితే గాంధిగారు ఏవిధమైన ఆహారమూ తీసికొనరు. రాజగోపాలచారి ఆయన భోజనసమయం మించిపోతుందని జ్ఞప్తిచేయగా గాంధీగారు; 'శ్రీవారితో నేనుచేసిన సంభాషణ ఈనాటి నా ఆహారం' అని బదులుచెప్పారు. తిరువాస్కూరు, కొచ్చిన్ సంస్థానాల వారు మహత్తరమైన సత్కారాలు చేశారు. కేప్కామరెన్లో రెండుసముద్రములూ కలిసేచోట స్నానంచేసి కన్యకుమారి దర్శనంచేసి, కేరళయాత్ర పూర్తిచేసి శ్రీవారు ఉత్తరయాత్రోన్ముఖులయ్యారు. శ్రీ తేజ్‌బహదూర్ సప్రూ అలహాబాద్ వాస్తవ్యుడు. మధురలో శ్రీవారిని దర్శించి అఖిలభారత సర్వపక్ష సమావేశానికి శ్రీవారి ఆశీస్సులను అర్ధించారు. ప్రజాక్షేమాన్ని ఉద్దేశించి శాంతికరంగా చేసే ఏ ఉద్యమమునకైనా తన ఆశీస్సులు, ఆమోదమూ ఎప్పుడూ ఉంటవని వారితో శ్రీవారన్నారు. 1929 ఫిబ్రవరిలో దక్షిణ ఆర్కాటులో పర్యటనం చేసినారు. ఒక నెలరోజులు వదలకుండా స్వాములవారికి జ్వరం కాచినది. జ్వరగ్రస్తులైనా వారి త్రికాల నిత్యానుష్ఠానా లేవీ వదలలేదు. జ్వరం ఉపశమింపగానే అందరి ఆందోళనా నిమ్మళించింది. తండలం గ్రామంలో ఒక పసులకాపరి తనకున్న కొద్దిభూమినీ అమ్మి ఆ డబ్బును మఠానికి ఇవ్వవలెనని సంకల్పించినాడు. వద్దని ఎంత చెప్పినా అతడు వినక, నేలను అమ్మి ఆ డబ్బును స్వామి పాదాలవద్ద సమర్పించాడు. స్వమూలవిఘాతమైన ఈ దానం శ్రీవారి మనస్సును కదిలించినది. స్థానిక తహసీల్దారుకు చాలినంత పోరంబోకు భూమిని అతనికి ఇవ్వవలసినదని చెప్పి అతని పోషణకు వలసిన ఏర్పాటు శ్రీవారు చేశారు. 1929 డిసెంబరుకు దీపోత్సవానికి శ్రీవారు తిరువణ్ణామలై వెళ్ళారు. ఇచ్చట అరుణగిరియే శివలింగరూపమున అర్చింపబడుచున్నది. బ్రహ్మ విష్ణువులకు శివుడు ఆపాతాళనభస్థలాంతముగ తేజోరూపమున ఆవిర్భవించి దర్శనమివ్వగా, ఆయన ఆద్యంతములు వారు కనిపెట్టలేకపోయారు. శివుడు పార్వతికి తన దేహములో అర్ధభాగమునిచ్చి అర్థ నారీశ్వరుడైనదీ ఈచోటనే. తిరుప్పుగళ్ అనే భక్తి గీతములు గానముచేసిన అరుణగిరినాథుని అనుగ్రహించినదీ ఈ స్థలముననే. శ్రీ శేషాద్రి స్వాములవారు భగవాన్ రమణ మహర్షులు ఈ చోటునే నివసించి సిద్ధి పొందారు. సంవత్సరానికొకమారు కార్తికపౌర్ణమినాడు సూర్యస్తమయ మయినపిదప తేజీలింగమునకు ప్రతీకగా అరుణాచల శిఖరాగ్రంలో ఒక పెద్ద దీపమును వెలిగిస్తారు. దీనినే దీపోత్సవమని అంటారు. అరుణాచలంలో స్వామి దాదాపు ఒక నెలరోజులు 1929లొ ఉన్నారు. గిరి ప్రదక్షిణాలు చాలమార్లు చేశారు. రమణులకూ, శ్రీవారికి పరస్పర ప్రేమాదరములుండేవి.కాని వారు ఒకరినొకరు చూచుకొనినది లేదు. రమణ భగవానులను భక్తులు అడిగారట. కామకోటి స్వాములు మిమ్ములను చూడలేదా అని, భగవానులు బదులు ఇలా చెప్పారు; ''మేము ఒకరినొకరు విడచివుంటేకదా కలుసుకొనే ప్రసక్తి ఏర్పడుతుంది?'' భగవానుల అద్వైతనిష్ట అటువంటిది. తిరువణ్ణామలైనుండి స్వామి అడయపాళెం వెళ్ళారు. ఇది ఆరణి దగ్గర ఉన్నది. మూడువందల సంవత్సరముల పూర్వము అప్పయ దీక్షితులు వాసం చేసినచోటు. దీక్షితులు అద్వైతి. గొప్ప శివభక్తుడు. మహేశ్వరోవా జగతామధీశ్వరే జనార్ధనేవా జగదంతరాత్మని నవస్తుభేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణందుశేఖరే. ఈ జగత్తుకు ఈశ్వరుడు- పరిపాలకుడు మహేశ్వరుడు. జనార్ధనుడైన నారాయణుడు, వాసుదేవుడు అంతర్యామి. ఈ ఇరువురి మధ్య భేద ప్రతిపత్తి నాకులేదు. ఐనప్పటికి భక్తి మాత్రము బాలచంద్రశేఖరుడైన శివునిమీదనే. ఇది అప్పయ దీక్షితులు వ్రాసిన శ్లోకం. ఆయన పరమ భక్తుడేకాదు. బహుగ్రంధకర్త. వివిధ మత గ్రంధాలను వీరు వ్రాశారు. ఇట్లు వ్రాయవచ్చునా అని ప్రశ్నిస్తే తామే ఇట్లు బదులుచెప్పారు. ''అద్వైతస్థితికి ఈశ్వరానుగ్రహం అవసరం- అన్ని సిద్ధాంతములూ, ఈశ్వర భక్తిప్రతి పాదకములే. ఏ మార్గంలో పోయినా అద్వైతస్థితిని అందుకోగలం. వేదాంతము, భారతాదిస్మృతులు, పురాణములు, శారీరిక మీమాంసా సూత్రములు, తుదకు శంకర భగవత్పాదులు- అన్నీ అందరూ జీవ జగద్భ్రాంతిని పోగొట్టే అద్వైతంలోనే పరిసమాప్తం అవటం చూస్తున్నాము కదా!'' అప్పయదీక్షితులు చేసిన సేవను విస్మరించరాదనీ, ఆయన జయంతిని ప్రతి సంవత్సరము జరుపవలెననీ, వారి గ్రంధ ప్రచురణ, వ్యాప్తీ విశేషంగా జరగాలనీ, అడయపాలెం వాసులకు స్వాములవారు ఆదేశించారు. డిసెంబరు 1930. అఖిలభారత సాధుసంఘం తరపున పక్షితీర్ధంలో ఒక స్వాగతపత్రిక చదివారు. ఆదిశంకరుల అడుగుజాడలలో హిందూధర్మ ప్రచారము సామాజికసేవ గూర్చి స్వాములవారు చేస్తున్న అధీతి ఆచరణరూపక కృషిని అతివేలంగావారు ప్రశంసించారు. చాలకాలంగా చెంగల్పట్టు గ్రాస్థులు స్వాములవారి రాకకై నిరీక్షిస్తున్నారు. 1931 జనవరి స్వామి చెంగల్పట్టు వచ్చి చేరారు. 'ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా' రచయిత పాల్ బ్రంటను, స్వాములను చెంగల్పట్టులోనే కలుసుకొన్నారు. అనుబంధంలోని 'బ్రంటన్ కథలో' ఆ వివరాలు చూడవచ్చును. చెంగల్ పట్టునుంచి సరాసరి స్వామి కంచికి వెళ్ళారు. పీఠారోహణం చేసిన తర్వాత కంచిరావడం ఇదే ప్రధమం. కంచి ప్రవేశించినది 25 జనవరి 1931 ఆదివారం. నగరవాసులు భక్త్యుత్సాహములతో స్వాములకు స్వాగతం చెప్పారు. కంచి ఆలయాలకు ప్రసిద్ధి. శ్రీకామాక్షీ అలయంలో శంకరాచార్యులు శ్రీచక్రప్రతిష్ఠ చేశారు. లోపలి ప్రాకారంలో ఆదిశంకరుల విగ్రహము ప్రతిష్టింపబడియున్నది. సర్వజ్ఞపీఠారోహణ చేసి శంకరులు కంచిలోనే సిద్ధిపొందారని వారిచరిత్ర చెబుతున్నది. శంకరుల విగ్రహములు ఏకామ్రేశ్వరుని ఆలయంలోను వరదరాజస్వామి ఆలయములోను కలవు. కొన్ని శతాబ్దములుగ కామాక్షీ దేవాలయ పర్యవేక్షణ కామకోటిపీఠము ఆధీనమున ఉన్నది. 1840లో కామకోటి పీఠాధీశులు, అరువది నాలుగవ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి కుంభాభిషేకం కావించారు. మరుసటి సంవత్పరము బ్రిటిషు ప్రభుత్వము దేవాలయ నిర్వహణ కామకోటి మఠానికే అప్పచెప్పినది. 1931లో స్వాములవారు కంచిలో ఉన్నపుడు ఆలయోద్ధారణచేసి అనుదినపూజాక్రమము విధ్యుక్తముగా జరుగుటకు వలసిన ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 1931లో కంచినుండి బయలుదేరి ఉత్తర మేరూర్ గ్రామానికి వచ్చారు. ఇది చారిత్రక ప్రసిద్ధిచెందిన స్థలము. ప్రాచీన ప్రజాస్వామ్య సంబంధముకల పురాశాసనములు ఈచోట ఉన్నవి. శ్రీవారు వెళ్ళి మరొక ప్రదేశములో శ్రీ పెరుంబుదూరు. రామానుజాచార్యులవారి జన్మస్థలము. ఆదికేశవుల ఆలయంలో శ్రీవారు పుష్పదంతవిరచిత శివమహిమ్నస్తోత్రంపై ఉపన్యాసమిచ్చారు. ''భిన్న భిన్న మతములు వైదిక సాంఖ్యపాశుపతయోగ, వైష్ణములన్నీ సముద్రములె కలసేనదులవంటివి. రుచులను బట్టి మతములు. ఏకంసత్ విప్రా బహుధావదంతి. యధానద్యా స్యందమానా సముద్రే..... బాల్యకౌమార ¸°వన వార్ధక్యములలో హర్ష శోకములనుభవించి క్రమంగా అనహంకారుడై జీవుడు భగవత్పాదములనే కృపాసింధువులో నామరూపము దొరగి కలసిపోతాడు''. 1931లో చాతుర్మాస్య చిత్తూరులో జరిగినది. ఆరణిలో ఉన్నపుడు రెండువందల కాంగ్రెస్ వాలంటీర్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వాతంత్ర్య సమరం తీవ్రంగా జరుగుతున్న రోజులలో వలంటీర్లకు ఆతిధ్యమిచ్చిన వారిని ప్రభుత్వమువారు శంకించేవారు.అందుచేత కాంగ్రెసు వాలంటీర్లను మఠంలోనికి రానిచ్చుటకు మఠంలోనికి అధికారులు ముందువెనుక లాడసాగారు. స్వాములవారికీ విషయం తెలియగానే వాలంటీర్లను మఠంలోనికి ప్రవేశ##పెట్టారు. అందరినీ ప్రత్యేకంగా విచారించి విభూతి ప్రసాదములనిచ్చి పంపారు. 1932 మార్చిలో మహాశివరాత్రికి కాళహస్తి వెళ్ళారు. గిరిప్రదక్షిణకూడ చేశారు. ముపై#్పమైళ్ళ దూరం కంటకావృతమైన బాటపై గిరిప్రదక్షిణ చేయాలి. కాళహస్తి నుండి తిరుమల/తిరుపతి వెళ్ళారు. చక్కని తెలుగులో ఉపన్యాసమిచ్చారు. నగరికి వెళ్ళినపుడు స్వాములవారి తల్లి 14 జూన్ 1932లో స్వర్గస్థురాలైనట్లు తంతీ వచ్చినది. మ్యానేజరు తంతీ చేతబట్టుకొని స్వామిని సమీపించేసరికి- ''ఆ తంతి కుంభకోణంనుంచి వచ్చిందా'' అని ప్రశ్నించారు. మ్యానేజరు ఔననగా స్వామి ఏమీ పలకలేదు. కొంతసేపు మౌనంగా ఉండి, 'ఒక సన్యాసి తనతల్లి చనిపోయినదని తెలిస్తే ఏం చేయాలి?' అని పండితులనడిగారు. ఆచార్యుల తండ్రి శ్రీ సుబ్రహ్మణ్మశాస్త్రి 24 జూలై 1929లో స్వర్గస్థులయ్యారు. ఈ సంగతి విని స్వామి మౌనంగా ఉండిపోయారు. పండితులు దుఃఖితులై బదులు పలుకలేకపోయారు. రెండుమైళ్ళ దూరంలో ఉన్న నీటిబుగ్గకు భగవన్నామంచేసుకుంటూ స్వామి నడవగా పండితులూ అనుగమించారు. అందరూ స్నానంచేసి వెనుకకు వచ్చారు. స్వాములవారి మాతృనిర్యాణం అందరినీ కలచివేసినది. నగరి సమీపములో కాశీ విశ్వనాధ, ప్రయాగ మాధవుల ఆలయములున్నవి. ఇక్కడ ఉండినపుడు స్వాములవారు 17 జూలై 1932 నుండి చాతుర్మస్యవ్రతం చేశారు. ఆలయోద్ధరణచేసి కుంభాభిషేకం కావించారు. మద్రాసునుంచి ప్రముఖులు వెళ్ళి మద్రాసుకు స్వాములవారు రావలసినరని ఆహ్వానించారు. మద్రాసు వెళ్ళుతూ మార్గమధ్యంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయమున్న తిరుత్తనికి విజయం చేశారు. ఈ సందర్భములో చెప్పదగిన శ్వాస వృత్తాంతమొకటి ఉన్నది. మఠసిబ్దందులను వెంటనంటి 1927 నుంచీ ఒక కుక్క ఉండేది. ఆదొక విచిత్రమైన జంతువు. చాల తెలివికలది. దానికి శౌచ మెక్కువ. మఠంలో వండిన ఆహారంతప్ప వేరేమి తీసుకొనని నిష్ఠకలది. స్వామి ప్రతిరోజూ సాయంత్రం ఈరోజు కుక్కకు అన్నంపెట్టారా అని అడిగేవారు. గ్రామ గ్రామములకు మఠం పర్యటించేటపుడు ఆ కుక్క స్వాములవారి పల్లకీ క్రింద అనుగమించేది. ఏ గ్రామంలోనైనా ఆగినపుడు అదీ ఆగి, మఠాన్ని మళ్ళా వెంబడించేది. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు దానిని రాయితీసుకొని కొట్టినాడు. ఆ బాలుని ఆ కుక్క కరవబోయింది. మఠం సిబ్బంది భయపడి దానిని పట్టుకొని గంతలుకట్టి 25 మైళ్ళదూరంలో విడచినారు. దానిని తీసుకొనిపోయిన సేవకుడు తిరిగివచ్చేంతలో ఆకుక్క మఠం వచ్చిచేరింది. ఆ రోజునుంచి స్వామిదర్శనం చేస్తేకానీ ఆహారం ముట్టుకోదు. దాని జీవితమున్నంతవరకు ఆ సాత్వికశ్వాసం మఠంలోనే వుండినది. రమణ భగవానులకూ జీవకారుణ్యమెక్కువ. జింతువుల విషయంలో వారు అనేవారట. ''పై తొడుగును చూడవద్దండయ్యా! లోపలి వస్తువును చూడండి''. పై తొడుగు పాంచభౌతికం. లోన వున్నది- సర్వగత చైతన్యము. అందులకే భగవత్పాదులవారన్నారు: ''యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ, సైవాహం- నచదృశ్యవస్తు'', చీమలోనూ బ్రహ్మలోనూ ఉన్నది సాక్షిభూతమైన చైతన్యం- అది దృశ్యవస్తువు కాదు. ఆ చైతన్యం దర్శనం చేసేవాడు పండితుడు-సమదర్శి. ఎదురుచూస్తున్న మదరాసు నగరజనులకు 28 సెప్టెంబరు 1932లో స్వామివారి దర్శనభాగ్యము లభించినది. స్వాములు 4 నెలలపాటు అక్కడ వాసంచేశారు. ప్రజలలో నిర్ణిద్రమైయున్న ఆధ్యాత్మిక చైతన్యం జాగరించింది. దర్శనమునకు తండోపతండములుగా జనం రాసాగినారు. ఆయన ఉపన్యాసాలు వినసాగారు. అవి హృదయసంచలనం చేయడానికి ప్రారంభించింది. మద్రాసులో సంస్కృతపు కాలేజీలో స్వామి విడిది. ఉపన్యాసములను ఇచ్చేదానికి అనుకూలంగా వుండేటట్లు ఒక పెద్ద మందిరమును కట్టారు. దానికి స్వాములవారు భాష్యవిజయమంటపమని నామకరణం చేశారు. మద్రాసు పురపాలకసంఘం తరుపున స్వాగతపత్రిక స్వాములకు సమర్పించాలని తీర్మానించారు. అపుడు మేయరు ఎ. రామస్వామి మొదలియార్. ఒక మతాచార్యునికి కార్పొరేషన్ ఇదివరకు స్వాగతపత్రిక సమర్పించలేదనియూ, ఇదే మొదలనియూ, స్వాములవారికి అన్ని మతాలవాళ్ళూ గౌరవాదరణలు చూపుతున్నందున తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన కోరగా, అట్లే పురపాలకసంఘం ఆమోదించింది. శ్రీవారితో ఈ విషయం చెప్పగా, మతసంబంధంలేని కార్పొరేషన్‌వారు ఏర్పాటుచేసే సభలో తాను పాల్గొనటం ఉచితంకాదని ఆయన అంగీకరించలేదు. సంస్కృత కళాశాలలో 1932 శరన్నవరాత్రులు నడిపారు. ఈ పూజాసమయంలో స్వాములు మౌనంగా ఉంటారు. ఉపవాసవ్రతం. సువాసినీ, కుమారీ పూజలు మఠంలో జరుగుతవి. వేదపారాయణం, దేవీభాగవతం, గీత, రామాయణ పారాయణాదులు, చండీపారాయణ జరుగుతుంది. ఈ ఉత్సవంలో వేలకొలది ఆస్తికులు పాల్టొన్నారు. నవరాత్రులయిన పిదప పూజానంతరం సాయంత్రం ప్రతిదినమూ అనుగ్రహభాషణలు చేయసాగారు. వేలకొలది జనం ఈ ఉపన్యాసాలను విన్నారు. స్వాములవారు వేదికపై ఆసీనులై మౌనముద్రాంకితులై కొంతసేపు ఉండేవారు. తరువాత నెమ్మదిగా మాట్లాడడానికి ప్రారంభించేవారు. ఆ మాటలు ఎంతో హృదయపూర్వకంగా ఉండేవి. పరిశుభ్రత, స్వార్థరహిత నిరాడంబరత జీవనమూ, ఆధ్యాత్మికనిరతీ ఆయన శ్రోతలకు బోధించేవారు. ఈశ్వర ప్రణిధానము, మతానుష్ఠానములు, అద్వైత ప్రాశస్త్యము, ఆయన ఉపన్యాసములలోని ముఖ్య అంశములు. దినపత్రికలైన హిందూ, దినేశమిత్రన్ వీనిని ప్రచురించేవారు. ఇవి పుస్తక రూపంలోనూ వచ్చాయి. రామకృష్ణమిషన్ నడుపుతున్న విద్యాసంస్థకున్నూ శ్రీవారు వెళ్ళారు. ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు, అధ్యాపన అధ్యయన పవిత్రవిధినీ, శ్రద్ధనూ గూర్చి బోధించారు. మదరాసు సమీపంలో తిరువట్రియూరు అన్న క్షేత్రంలో ప్రాచీనమైన త్రిపురసుందరీ, త్యాగేశుల ఆలయం ఒకటి ఉన్నది. శంకరులు ఇచట శ్రీచక్రప్రతిష్ఠ చేశారు. ఇచట పూజారులు నంబూద్రి బ్రాహ్మణులు. ఆలయ ప్రాకారంలో ఆదిశంకరుల విగ్రహం ఉన్నది. కామకోటి మఠాధిపులు ఈ చోటుకు వచ్చి కొంతకాలమైనా ఉండేవారట. ఇక్కడ ఆచార్యులలో ఇరువురి సమాధులు ఉన్నవి. శ్రీవారు ఇక్కడకువచ్చి ఈ స్థలాన్ని మరింత తీర్థస్థలం చేశారు. 1933లో మరోమారు మహామాఖ మొచ్చింది. అపుడు స్వాములవారు తిరువత మరుదూరులో మకాం చేశారు. దీనినే మధ్యార్జునక్షేత్రమనీ అంటారు. ఇచట ఆదిశంకరులకు, శివుడు, శివలింగమునుండి అద్వైతమే సత్యమని ముమ్మూరులు ఘోషించాడట. ఆ సంవత్సరం శంకరజయంతి ఇక్కడే జరిగినది. రెండువందల సంవత్సరములుగా చిదంబర క్షేత్రానికి కామకోటి ఆచార్యులు ఎవరూ వెళ్ళలేదు. ఆలయంలోని అర్చకులు పీఠాధిపతులుకూడ తమ చేతనుండియే భస్మగ్రాహణం చేయాలని పట్టుబట్టేవారట. శ్రీవారు 18-5-1933న చిదంబరంకు విజయం చేశారు. స్వాములవారి విషయంలో అర్చకులు ఏవిధంగా నడుచుకుంటారో అని కొందరు ఆందోళనపడ్డారు. ఉషఃకాలంలో ఒక పరిచారకునితోబాటు స్వాములు ఆలయానికివెళ్ళి స్నానంచేసి అనుష్ఠానం పూర్తిచేసుకొని, ఆలయద్వారం తెరవగానే నటరాజస్వామికెదుట ధ్యానమగ్నులై నిలుచున్నారు. అర్చకుడికి ఆశ్చర్యమైంది. అతడు ఇతర అర్చకులకు కబురు పంపినాడు. అందరూవచ్చి సమావేశమయ్యారు. తామే శ్రీవారికి విశేషమర్యాదలతో స్వాగతం చెప్పాలని వుంటిమని చెప్పి వారు వచ్చినపుడు తాము లేకుండుటకు బాధపడ్డారు. శ్రీవారు వారిని తగినవిధంగా అనునయించారు. అటుపిదప చాలమారులు ఏ విధమైన ఆటంకమూలేక నటరాజస్వామి దర్శనం చేసుకున్నారు. సహస్రస్థంభ మంటపంలో చంద్రమౌళీశ్వరుని పూజకూడ చేశారు. శంకరులు తెచ్చిన 5 లింగములలో ఒకటి- కామకోటి పీఠంలో పూజింపబడుతున్నది. అది యోగలింగం. మరొకటి చిదంబరంక్షేత్రంలో ఉన్నది. అది మోక్షలింగం. రెంటినీ ఒకే సమయంలో దర్శించుకొనే భాగ్యం ఆ వూరి వారికి కలిగింది. 1933 నవరాత్రి పూజలు తంజావూరిలో నడిచింది. శ్రీవారి ఉత్తరభారతయాత్రకు వలసిన ఏర్పాట్లు ఈ కాలంలోనే జరిగినవి. శ్రీవారు అనంతకృష్ణశర్మ అనే యువకుని కాశీయాత్రచేసి రావలెనని పంపారు. అతనికి విధించిన నియమములు ఇవి. యాత్ర కాలినడకతో చేయాలి. కాఫీ టీలు త్రాగకూడదు. విధిగా స్వయంపాకం చేసుకోవాలి. కట్టుబట్టలు వంటసామాగ్రి తప్ప వేరే ఏవీ తీసుకొని పోరాదు. త్రోవలో డబ్బుకోసం ఎవరినీ యాచించరాదు. స్వయంపాకానికి కావలసిన బియ్యమో, గోధుమపిండియో- మాత్రము గ్రహించవచ్చును. గ్రామంలో ఒక్కరోజుకు మించి ఉండరాదు. ప్రయాణ విశేషాలు ఎప్పటికప్పుడు మఠానికి తెలుపుతూ ఉండాలి. యాత్ర చేస్తున్నపుడు ఒకరోజు సాయం సమయమైనది. తాను చేరుకోవలసిన గ్రామం ఇంకా దూరంలో ఉంది. అరణ్యప్రదేశం. రాత్రి అక్కడనే గడపవలసి వచ్చింది.ఆచోట పులులు తిరుగుతున్నాయి. కృష్ణశర్మ గురుధ్యానంతోనూ, శివనామోచ్ఛరణతోను ఆరాత్రి గడిపి మరుసటిరోజు తాను పోవలసిన గ్రామం వచ్చి చేరాడు. ఈ విషయం పూసగుచ్చినట్లు మఠానికి వ్రాసాడు. స్వాములవారి కాశీయాత్ర ప్రారంభం సెప్టెంబరు రెండవవారం, 1933. రోజుకు ఉత్తరాభిముఖులై ఇరవైమైళ్ళు నడిచేవారు. కర్నులులో మకాం చేసినపుడు శ్రీశైలానికి వెళ్లాలని సంకల్పించారు. 'శ్రీశైలశిఖరం దృష్ట్యా పునర్జన్మనవిద్యతే'. శ్రీశైలం దక్షిణకైలాసమని ప్రతీతి. శివుడు మల్లికార్జునుడు. దేవి భ్రమరాంబ. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి. స్థలవృక్షం. అర్జునవృక్షం. శ్రీశైలాన్ని మల్లిఖార్జునమనీ అంటారు. ఇదికాక తిరువడమరుదూరులో వున్న క్షేత్రాన్ని మధ్యార్జునమనీ, (తంజావూరుజిల్లా) తిరుప్పుడై మరుదూర్ అన్నచోటు పుటార్జనమనీ (తిరునల్వేలి జిల్లా) అంటారు. శ్రీశైలంలో ఉన్న తీర్ధం పాతాళగంగ, దీనికి సమాంతరంగా తిరుమలెలో ఆకాశగంగ ఉన్నది. ఆదిశంకరులు శివానందలహరిలో మల్లిఖార్జునస్రోత్తం చేస్తూ- 'సేవేశ్రీగిరి మల్లిఖార్జున మహాలింగం శివాలింగితం'- శివ- అనగా పార్వతిచేత అలిగింపబడిన మల్లిఖార్జున మహాలింగమును సేవించెదను- అని వ్రాసారు. తమతోబాటు అనుచరులను కొంతమందిని మాత్రం తీసుకుని పెద్దచెరువు వరకు పడవలోవెళ్ళి, అచ్చటనుండి 11మైళ్ళు కాలిదారిలో పయనంచేసి 29 జనవరి 1934న శ్రీశైలం చేరుకున్నారు. ఆలయంలో శివానందలహరి, సౌందర్యలహరిలోని శ్లోకములను భక్తితో పఠించి, కొన్నిరోజులు ఆచోట ఉండి కర్నూలుకు శ్రీచరణులు తిరిగి వచ్చారు. మార్గమధ్యంలో శ్రీశైలంలోనున్న గిరిజనులు ఎంతో సహకరించిరట. తుంగభద్రదాటి హైదరాబాదు సంస్థానం శ్రీవారు ప్రవేశించారు. 12 ఫిబ్రవరి 1934న హైదరాబాదు చేరుకున్నారు. ప్రభుత్వాధికారులు, ముఖ్యమంత్రి జగద్గురువుకు తమ భక్తిప్రపత్తులను చూపుకొన్నారు. నైజాం ఆజ్ఞపై ఒకరోజు మఠంఖర్చులు స్థానిక ప్రభుత్వం భరించింది. స్వాములవారు నగరంలో ఉన్నపుడు సనాతనధర్మసభ ఒకటి జరిగినది. సదాచారము, ధర్మపరిపాలన, విద్వాంసుల మాన్యత- గూర్చి ఆచార్యులు ప్రసంగించి తమ ఆదేశాలను తెలిపారు. హైదరాబాదు స్వాములను వీడ్కొనినంతనే, మధ్యపరగణాలవైపు స్వాములు పర్యటించారు. శంకరజయంతి బెందల్వాడలో జరిగింది. జూన్‌మాసం నాగపూరులో వుండి, వింధ్యారణ్యములను దాటి 3 జూలై 1934న జబ్బల్పూరు చేరుకున్నారు. నర్మదలో స్నానంచేశారు. అటుపై 23 జూలై 1934న ప్రయాగ (అలహాబాదు) చేరుకున్నారు. ఊరు పొలిమేరలో మహామహోపాధ్యాయ గంగాధర్జా స్వాములవారిని జయజయనినాదములతో ప్రయాగకు ఆహ్వానించారు. 25 జూలై, రామేశ్వరంనుంచీ తెచ్చిన ఇసుకను త్రివేణీ సంగమంలో స్వాములవారు కలిపారు. త్రివేణీనుంచి సంగ్రహించిన జలమును దక్షిణదేశంలోని వివిధ యాత్రాప్రదేశములకు పంపారు. 26 జూలై 1934 చాతుర్మాస్య ప్రయాగలో ప్రారంభ##మైనది. వ్యాసపూజలో చాలమంది పాల్గొన్నారు. ఈ చాతుర్మాస్య కాలంలో ఒక పెద్ద పండిత సమావేశం శ్రీవారి సముఖంలో జరిగినది. వారందరు స్వాములవారి ఆశీస్సులను పొందారు. ప్రయాగనుంచీ కాశీకి 80 మైళ్ళు. కాలినడకనే వెళ్ళారు. అక్టోబరు 6, 1934 కాశీప్రవేశం చేశారు. స్వాగతంచేసిన వారిలో ప్రముఖులు కాశీ మహారాజా, మదనమోహన మాలవ్యా. ఆరోజు ఊరేగింపులో సుమారు లక్షమంది పాల్గొన్నారు. 8వ తేది అక్టోబరు పండిత్ అనే హిందీపత్రిక- ఈ ఉత్సవ విశేషాలను సమగ్రంగా ప్రకటించింది. అంతటి ఘనమైన సత్కారం కాశీనగర చరిత్రలో జరగలేదని వివరించింది. కాశీక్షేత్రం మోక్షదాయకములైన ఏడు పట్టణములలో ఒకటి. విశాలాక్షి, విశ్వనాధుడు విరాజిల్లే నగరం. ఇచ్చట గంగ ఉత్తరవాహినిగ ప్రవహిస్తుంది. అర్ధచంద్రాకృతిలో వుంటుంది. వారణ- అసి అను రెండునదులు ఇచట కలిసినందువల్ల దీనికి వారణాసి అనిపేరు. మణికరణికాఘట్ట సమీపంలో భగవత్పాదులు వారి భాష్యగ్రంధరచన చేశారు. వారిని జగద్గురువులని ఈ కాశీక్షేత్రమే చాటినది. దిగ్విజయయాత్ర ఇచటనుండే వారు ప్రారంభంచేశారు. శ్రీవారు అన్నపూర్ణా విశ్వేశ్వరుల దర్శనం చేసుకున్నారు. మణికర్ణకాఘట్టములోని ఈశ్వరాలయంలో చంద్రమౌళీశ్వర పూజ చేశారు. అక్టోబరు 9 నుండి నవరాత్రులు. విజయదశమినాడు గంగకు అద్దరినున్న దక్షిణామూర్తి మఠం వెళ్ళారు. పండిత మదనమోహనమాలవ్యా ప్రార్ధనపై హిందూ విశ్వవిద్యాలయం వెళ్ళి చూశారు. విద్యార్ధులను సంస్కృతములో సంబోధించారు. 'విద్యావ్యాసంగమునకు చివరిలక్ష్యం మనశ్శాంతి' అని చెప్పారు. జ్ఞానం లభించగానే జీవుడు అమృతత్త్వాన్ని పొందుతాడు. మదనమోహనమాలవ్యా ఆదిశంకరుల కాశీవాసం, భాష్యరచన కథలలో విన్నామేకానీ ప్రస్తుతం కామకోటి ఆచార్యులలో శంకరులను ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. 9 మార్చి 1935 నగర మందిరంలో కాశీపౌరులు ఒక సమావేశం స్వాములవారి తమ భక్తి ప్రపత్తులను తెలుపడానికి ఏర్పాటుచేశారు. వారి ఆగమనానికి ఆమోదప్రమోదాలు తెలుపుతూ భగవత్పాదుల ఆదేశంమేరకు వారి అడుగుజాడలలో ఈ యాత్రను చేయడానికి తలపెట్టామనీ, కాశీపౌరుల ఉత్సాహం చాల సంతోషం కలిగించినదనీ, కాశీవిశాలాక్షీ అన్నపూర్ణా విశ్వేశ్వరుల అనుగ్రహం కావాలనీ తాము ప్రార్ధిస్తున్నట్లు శ్రీచరణులు ఆ సభలో పలికారు. 18-3-1935న కాశీనుండి బయలుదేరి ఏప్రిల్ 24వ తేదికి పాట్నా చేరుకున్నారు. శంకరజయంతిని అక్కడ జరిపి అచటి ప్రజల నాశీర్వదించారు. 20-5-35 గయవెళ్ళి ఫల్గునీనదిలో స్నానంచేసి విష్ణుపాదదర్శనం చేసుకున్నారు. మే 35వ తేదివ తేది బుద్ధగయలో, బుద్ధునికి ఏ చెట్టుక్రింద జ్ఞానోదయమైనదో ఆ బోధివృక్షాన్ని చూచినారు. అచట బుద్ధాలయములో బుద్ధుని విగ్రహమునకు ముందు ఒకచిన్న శివలింగమున్నది. దానిని భగవత్పాదుల వారు ప్రతిష్ఠించినట్లు ఒక ప్రతీతియున్నది. అచ్చటనుండి ధియోగల్ వెళ్ళి గిరిజాదేవి, స్వయంభూలింగమూర్తుల ముందు చాలసేపు ధ్యాన నిష్ఠలో వుండి మరలినారు. 13 జూలై 1935 కలకత్తా చేరుకున్నారు.ఈ ప్రసిద్ధికెక్కిన నగరం వారికి ఘనస్వాగతమిచ్చినది. జూలై 17వ తారీఖు మొదలుకొని చాతుర్మాస్యదీక్ష. కాళికాలయసంఘ పక్షములో స్వాగతపత్రమొసగబడినది. బెంగాల్ బ్రాహ్మణ మహాసభకూడ స్వాగతపత్రము సమర్పించినది. నవరాత్రి ఉత్సవము కలకత్తాలో జరిపినారు. నవరాత్రిళ్ళు వంగదేశీయులకు చాల ప్రధానమైన ఉత్సవదినములు. కలకత్తా నుండి 27-10-1935 తేదీకి మిర్నవూరు చేరుకున్నారు. ఆ ఊరు జాతీయవిప్లవ ఉద్యమమునకు కేంద్రస్థలము. చాలమంది విద్యార్ధులను అరెస్టుచేసి జైళ్ళలో ప్రభుత్వముంచినది. కొందరు డిటెస్యూలు స్వాములవారిని దర్శించగోరారు. సాయంత్రం 6 గంటలలోపల తిరిగి రావలసినదని ఉత్తరువు జారీచేస్తూ బంధితులను జైలు అధికారులు వదలిపెట్టారు. స్వాములవారు విశ్రాంతి తీసుకొంటూ ఉన్నందున కొంతసేపు వేచి వారు వెనుదిరిగారు. స్వామికి ఇది తెలిసినంతనే వారిని మరల పిలిపించి వారిని ఆశీర్వదించారు. భారతదేశమునకు అచిరకాలముననే స్వాతంత్ర్యము లభించవలెనని, సర్వులు సుఖులుగా ఉండవలెననీ స్వాములవారి ఆశీర్వచనములను తాముకోరుతున్నట్లు విన్నవించారు. ఖరగ్పూరులో రైల్వేకర్మాగారము, టాటానగరులో స్టీలు కర్మాగారము- రెంటినీ స్వీములవారు చూచారు. తర్వాత బీహారులో పర్యటనము. కియోంజర్‌లో ధారిణీదేవిని దర్శించుకున్నారు. ఆ విగ్రహమును కంచినుండి గోవింద భంజదేవులు తీసుకొని వచ్చారట. మయూర్భంజ్ రాష్ట్రములో- వారణశ్వరాలయములో మహాలింగమును దర్శించారు. రాజ్నీలగిరి సంస్థానంలో సుజనాగడ్లో చండీదేవిని దర్శించారు. ఇచట అమ్మవారు సింహవాహనకాదు. ఆమె వాహనము వరాహము. ఒక్కడ నాలుగురోజులుండినారు. ఒరిస్సాలో కటక్జిల్లాలో ఉన్న జాజ్పూరునకు 4 ఏప్రిల్ 1936న స్వాములవారు వచ్చారు. మహాభారతము ఈ స్థలమును అష్టాదశశక్తి పీఠములో ఒకటైన విరజాపీఠమని పెర్కొనినది. ఇచ్చట వైతరణీనది ఉత్తరదిశగా ప్రవహిస్తున్నది. ఒకపుడు నూరు సోమయాజులు ఉండినందున జాజ్పూరు (యాజిపురము) అని ప్రసిద్ధి చెందినది. ఇచట 5 రోజులుండి కటక్ వెళ్ళారు. ఆ సంవత్సనం శంకరజయంతి కటక్‌లో జరిగినది. 3వ తేది, మే ఆచార్యులు సాక్షిగోపాల్ని సందర్శించారు. ఇదొక అందమైన కథ. ఇద్దరు బ్రాహ్మణులు కంచినుంచి ఒకపుడు కాశికి వెళ్ళారు. అందులో ఒకరు వృద్ధుడు, రెండవవాడు యువకుడు. కంచికిరాగానే తనకుమార్తెనిచ్చి పెళ్ళిచేస్తానని వృద్ధుడు యువకునికి మాట ఇచ్చాడు. ఈ వాగ్దానం మధురలో గోపాలుని ఆలయంలో జరిగింది- కాని అతడు మాట నిలబెట్టుకోలేదు. యువకుడు రాజువద్ద ఫిర్యాదుచేశాడు. ఈ అన్యాయాన్నిగూర్చి నీకు సాక్ష్యమెవరైనా ఉన్నారా అని రాజు ప్రశ్నించాడు. యువకుడు గోపాలుడే నాకు సాక్షి అని అన్నాడు. 'అయితే గోపాలుణ్ణ పిలుచుకునిరా' అని రాజు హుకుం ఇచ్చాడు. యువకుడు మధురవెళ్ళి గోపాలుణ్ణి సాక్ష్యానికి రమ్మన్నాడు. ఆ టక్కరి గోపాలుడు ఒక షరతు పెట్టాడు. ''నేను నీవెంట వస్తాను. కాని నీవు తిరిగి చూడకూడదు. అట్లా చూచావంటే, ఆచోటులోనే నిలిచిపోతాను.'' యువకుడు సరే అన్నాడు. కంచి పరిసరాలకు వచ్చేసరికి గోపాలుడు వస్తున్నారా లేదా అని తన ఉత్సుకతను ఆపుకొలేక వెనుదిరిగి చూచాడు. గోపాలుడు గప్చిప్మని ఆచోటనే స్థిరపడిపోయాడు. అతడే సాక్షిగోపాలుడు. పూరీ జగన్నాధంలో గోవర్థనమఠం శ్రీవారిని ఆహ్వానించింది. ఇతర అద్వైతమఠములు- శంకరానంద మఠము, శివతీర్ధమఠము, గోపాలతీర్ధమఠము ఈ ఆహ్వానోత్సవంలో పాల్గొని సహకరించారు. ''జగన్నాధస్వామీ నయనవధగామీ భవతుమే''- అని ఆదిశంకరులు ఈ పుణ్యక్షేత్రస్వామిని కీర్తించారు. పండితుల కోరికపై ముక్తి మంటపంలో శ్రీవారు ఆసీనులై సంస్కృతంలో ఉపన్యసించారు. తనకు జరుగుతున్న గౌరవము ఆదిశంకరులకే చెందుతుందనీ, వారు దేశమునుండి కులమత నిరాసనం చేశారనీ, వారి పాదములను అందరూ పూజిస్తున్నారనీ చెప్పారు. ఆరవతేది మే 1936 పూరీలో మహోదధిలో సముద్రస్నానం చేశారు. ఆరోజు పౌర్ణమి. 9వ తేది పండితసభకు ప్రారంభోత్సవం చేశారు. పండితులు పూరీకి అరువది నాలుగవ ఆచార్యులైన శ్రీ మహాదేవేంద్రసరస్వతి విజయం చేశారనియూ, ఇపుడు అరువదెనిదవ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి వారి అడుగు జాడలలో రావటం వారి మహాభాగ్యమనియూ విద్వాంసులు ఉద్ఘోషించారు. పదవతేది బయలుదేరి, ఖుర్దామీదుగా, చిల్కాసరస్సు తీరంపై పయనిస్తూ మే 17వ తేది ఛత్రపూరుచేరి అచ్చటనుండే బరంపూరు చేరుకున్నారు. రోజుకు 25మైళ్ళ లెక్కలో పయనించేవారు. ఆ సంవత్సరం వ్యాసపూజ బరంపూరులో జరిగింది. భాద్రపదమాసంలో అధికమాసం రావటంచేత చాతుర్మాస్య ఒకనెల పొడుగించింది. 28 సెప్టెంబరు 1932లో సనాతనధర్మసభ జరిగింది. ప్రారంభోపన్యాసం స్వాములు తెలుగులో చేశారు. బరంపూరునుండీ శ్రీకూర్మం మీదుగా విజయనగరం వచ్చారు. నవరాత్రి ఉత్సవములు విజయనగరంలో వైభవంగా జరిగింది. 31వ తేది అక్టోబరు అద్వైతమునుగూర్చి ప్రసంగిస్తూ హరిహరులకు భేదంలేదనీ, సమర్ధరామదాసు మొదలగు మహాత్ములు హరిహరాద్వైతమును భజించి ముక్తిపొందారనీ. జ్ఞానమార్గానునేయులు జీవబ్రహ్మాద్వైతస్థితిని పొందెదరనీ, జ్ఞానానికి గాని. ఉపాసనకుగాని గమ్యమేమో ఒక్కటేననీ శ్రీచరణులు బోధించారు. ఆంధ్రప్రదేశ్‌లో సింహాచలం పురాతన పుణ్యక్షేత్రం. కొండపై వరాహనరసింహాలయమున్నది. 4 నవంబరు 1936 ఆచార్యులు ఈ ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు.దాపుననే ఉన్న గంగధారజలపాతంవద్ద ధ్యాననిష్ఠలో కొంతసేపు గడిపారు. తర్వాత విశాఖపట్టణం చేరుకొని గోదావరీతీర భూములలో పర్యటిస్తూ పాలకొల్లులో 1937లో చాతుర్మాస్యం చేశారు. తర్వాత రాజమండ్రి. 31 జనవరి 1938 కాకినాడలో మహోదయంనాడు సముద్రస్నానం. తర్వాత విజయవాడ వచ్చి కృష్ణలో స్నానం చేశారు. 1938 చాతుర్మాస్యం గుంటూరులో జరిగింది. వ్యాకరణ పండితులు పుల్య ఉమామహేశ్వరశాస్త్రి శ్రీగురుసార్వభౌమరతోపహారం అనే సంస్కృతకావ్యం ఒకటి వ్రాసి శ్రీవారికి సమర్పించారు. శ్రీ కల్లూరి సుబ్రహ్మణ్మ దీక్షితులు శ్రీవారిని దర్శించి వారి అనుగ్రహం పొందారు. ''తెలుగు కవిత్వం ఆబాల్య సిద్ధం- ఇది ఒక వ్యసనమా? ఇదే పరమార్ధం అని అనుకొంటున్నాను''- అని వారు అంటే, శ్రీవారు- ''నీకు కృతార్ధత కవిత్వంమూలంగానే- అనాయతప్రాణ మనంయతాక్షం అబ్రహ్మచర్యా నశనాదిఖేదమ్ చిత్తం మహీశే నిభృతంనిధాతుం సిద్ధః కవీనాం కనీతైన యోగః ప్రాణాయామాలతోకానీ, నిమిలిత నేత్రాలతో కానీ, బ్రహ్మచర్య, అనశనారి (ఉపవాసం) దుష్కరమైన తపశ్చర్యలు కానీ అవసరంలేదు. ఈశ్వరునిపై మనస్సులగ్నం కావటానికి అతి సులభోపాయమున్నది. అదే కవిత్వం. కవిత్వమును మించిన సిద్ధయోగం వేరొకటిలేదు'' అని ఉపదేశించారు. స్వాములవారి ఆశీస్సుల బలంచేత దీక్షితులు, నారాయణీయం, మూకపంచశతి, ఆర్యాద్విశతి గ్రంధాలను జాను తెనుగులో అనువదించడమేకాక, గురుకృపాలహరి అనే సంస్కృతకావ్యం కూడ స్వాములవారిపై వ్రాసారు. దీక్షితులవారి ధారకొక ఉదాహరణ. సాధో! త్వత్కరుణాకటాక్షలహరీ చంద్రాతపోజ్జృంభితః స్ఫోట స్సంస్కృత వాజ్మయాంబుధి రసాఛందోమయాన్మౌక్తికాన్ మౌనిన్! మన్ముఖ శుక్తితః క్షిపతి యత్త్వ త్పాదపూజావిధా వేష్వంతః ప్రవిభా త్యతీంద్రియ మహాజ్యోతి ర్మమావ్యద్భుతమ్. నవంబరు 1938 నుంచీ జనవరి 1939 వఱకు స్వాములవారు నెల్లూరిలో ఉండినారు. వెకటగిరి పైగా కాళహస్తి తిరుపతి వెళ్ళారు. ఏప్రిల్ 1939లో మరొకమారు శంకరజయంతి బుగ్గలో జరిగినది. తిరుత్తనిలో సుబ్రహ్మణ్యశ్వరుని దర్శించుకొని 2 మే 1939న కాంచీపురం చేరుకున్నారు. కంచినుంచి బయలుదేరి చిదంబరం మీదుగా రామేశ్వరం వెళ్ళారు. 25 జూలై 1934లో త్రివేణీలో సంగ్రహించిన గంగాజలంతో రామనాధుని అభిషేకంతో యాత్ర పూర్తి ఔతుంది. పదవతేదీ జూన్ 1938లో అగ్నితీర్థంలో స్నానంచేసి ఆచార్యులు రామనాధునికి తెచ్చిన గంగాజలంతో అభిషేకం పూర్తి చేశారు. మరుసటిరోజునుంచి ఆరుమాసాలు మౌనవ్రతదీక్ష ప్రారంభించారు.తక్కిన మఠ కార్యక్రమాలూ, పర్యటనా యధావిధిగానే జరిగినది. రామనాధపురము, పుదుక్కోట, తిరుచినాపల్లి, తంజావూరు మొదలగు ప్రదేశాలకు వెళ్ళి 29 జూన్ 1939 కుంభకోణం వచ్చారు. శ్రీవారి విజయయాత్ర కాలము ఇరవైఒక్క సంవత్పరములు. కుంభకోణములోని ప్రజల ఆనందం సముద్రంవలె పొంగినది.